జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ ఉందని రాజస్థాన్ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ అన్నారు. 200 మంది సభ్యుల అసెంబ్లీలో రెండు పార్టీలకు 90-100 సీట్లు వస్తే స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషిస్తారని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మంత్రి ఖచరియావాస్ తాజాగా ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘ఇరు పార్టీలు 90-100 సీట్లు సాధిస్తే, బీజేపీ, కాంగ్రెస్ రెండూ స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీలను గౌరవించాల్సిందే. అప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వాలో వారు నిర్ణయిస్తారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో నెక్ టు నెక్ ఫైట్ జరుగుతోందని నేను భావిస్తున్నాను’ అన్నారు.
రాజస్థాన్‌లో తమకు 125 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ చేసిన వాదనలను పలు ఎగ్జిట్ పోల్స్ తోసిపుచ్చాయని ప్రతాప్ సింగ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ 100 పైగా సీట్లు సాధిస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓటమిని తాము ఊహించామని, కానీ ఎగ్జిట్ పోల్స్ ఆ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్లు చూపిస్తున్నాయన్నారు.
రాజస్థాన్‌లో గట్టి పోటీ ఉంటుందని చాలా ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మూడు ఎగ్జిట్ పోల్‌లు బీజేపీ స్పష్టమైన విజయాన్ని సాధిస్తుందని అంచనా వేయగా, మరో రెండు రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ముందంజలో ఉందని పేర్కొన్నాయి. డిసెంబరు 3న ఫలితాలు వెలువడినప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో చిన్న పార్టీలు, స్వతంత్రులతో సహా "ఇతరులు" కీలక పాత్ర పోషిస్తారని ఎగ్జిట్ పోల్ అంచనాలు స్పష్టం చేశాయి. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీకి 199 స్థానాలకు నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment