కాంగ్రెస్, బీజేపీలకు అటూ ఇటుగా సమానంగా సీట్లిచ్చిన పలు సంస్థలు
కొన్ని ఎగ్జిట్‌పోల్స్ బీజేపీ వైపు మొగ్గు
దేశవ్యాప్తంగా మోదీ హవా ప్రభావం తెలంగాణలోనూ
కాంగ్రెస్ పట్టు నిలుపుకొంటుందని చెప్పిన మరికొన్ని సంస్థలు
తెలంగాణ లోక్‌సభ ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వెలువడుతున్న వివిధ సర్వే సంస్థల ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు భిన్నంగా, జాతీయపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య తెలంగాణలో పోటాపోటీ వాతావరణం ఏర్పడేట్టు కనిపిస్తోంది.
ఈ రెండుపార్టీలు నువ్వా, నేనా అన్నంత స్థాయిలో పోటీపడినట్టుగా ఆయా సంస్థల ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను.. బీజేపీ అధిక ఎంపీ సీట్లలో గెలుస్తుందని కొన్ని సంస్థలు అంచనా వేస్తే.. అదేస్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందంటూ మరికొన్ని సంస్థలు లెక్క వేశాయి.
బీజేపీ, కాంగ్రెస్‌లు ఎన్నేసి గెలుస్తాయంటే..
ఇండియాటుడే– యాక్సిస్ మై ఇండియా ఏకంగా బీజేపీ 11–12 సీట్లలో, జన్‌కీబాత్ 9–12 సీట్లలో బీజేపీ గెలుపొందుతుందనిఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. బీజేపీ అధిక సీట్లు సాధిస్తుందని ఆరా(08–09), ఇండియాటీవీ–సీఎన్‌ఎక్స్ (08–10), న్యూస్ 18 సంస్థ (07–10) అంచనా వేశాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అవకాశాలపై చాణక్య స్ట్రాటజీ సంస్థ 09–10,, ఏబీసీ–సీ ఓటర్ 07–09, పీపుల్స్ పల్స్ 07–09, ఆరా 07–08 స్థానాలు లెక్కన సర్వే ఫలితాలు వెల్లడించాయి.
మొత్తంగా వివిధ సంస్థల అంచనాల్లో...కొంచెం అటూ ఇటుగా బీజేపీ, కాంగ్రెస్‌లకు దాదాపు సగం సీట్ల మేర గెలుచుకోవచ్చనే విధంగా ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ఇమేజీ ప్రభావంతో బీజేపీకి మంచి ఫలితాలు సాధిస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. ఇక అన్ని సంస్థల ఎగ్జిట్‌పోల్స్ బీఆర్‌ఎస్‌కు నిరాశాజనక ఫలితాలే రాబోతున్నట్టుగా అంచనా వేస్తున్నాయి. దాదాపుగా అన్ని మెజారిటీ సర్వే సంస్థలు హైదరాబాద్ ఎంపీ సీటును ఎంఐఎం నిలుపుకుంటుందని పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment