
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్‌ఎస్‌దే విజయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో హైదరాబాద్ బీఆర్‌ఎస్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యధిక స్థానాలు బీఆర్‌ఎస్ గెలుస్తుందన్నారు. 17 నెలల కాలంలో బీఆర్‌ఎస్ గ్రాఫ్ బాగా పెరిగిందన్నారు.
హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికను బాయ్‌కట్ చేస్తున్నామని.. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లను కేటీఆర్ ఆదేశించారు. విప్ ధిక్కరిస్తే పార్టీ నుంచి బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.
హెచ్‌సీయూ భూ కుంభకోణం వెనుక బీజేపీ ఎంపీ ఉన్నాడంటూ కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ఎంపీలు తెలంగాణకు ఒక్క రూపాయైనా తెచ్చారా? అంటూ ప్రశ్నించారు. హెరాల్డ్ కేసుపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే.. రేవంత్ ఒక్కమాట కూడా మాట్లాడటం లేదంటూ మండిపడ్డారు. కేసీఆర్ దీక్ష, పోరాటంతోనే తెలంగాణ వచ్చిందన్న.. కేటీఆర్.. బీఆర్‌ఎస్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందన్నారు.
చేసినవి చెప్పుకోనందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్‌సీయూ, హైడ్రా, మూసీ పేరుతో అరాచకాలు సృష్టిస్తోందని విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎంపీలు కాంగ్రెస్‌ను ఒక్క మాట కూడా అనరని.. హెచ్‌సీయూ భూములపై ప్రధాని మోదీ ఎందుకు విచారణ జరిపించడం లేదంటూ కేటీఆర్ ప్రశ్నించారు.