సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రమే అమలైందని.. రేవంత్‌కు పరిపాలన చేతకావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రైతు బంధుకు కొర్రీలు పెడుతున్నారన్న కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డిని కటింగ్ మాస్టర్‌గా అభివర్ణించారు. శనివారం.. సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్టమధు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘రూ.2 లక్షల రుణమాఫీ అయ్యిందా? లేదా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఊరికి పోదామా అంటూ అసెంబ్లీలో అడిగితే సమాధానం లేదు. సర్వశిక్షా అభియాన్ వాళ్ల సమస్యను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామన్నాడు రేవంత్.. ఏమైంది?. కాంగ్రెస్ మాట తప్పిన ప్రభుత్వం. ఎప్పుడైనా నాట్లు పడేటప్పుడు పడాల్సిన రైతుబంధు.. ఓట్లు పడ్డప్పుడు వేసిన ఘనత కాంగ్రెస్‌ది. రైతు ప్రమాణ పత్రం రాయడమేంటి..?’’ అంటూ కేటీఆర్ నిలదీశారు.
ఇదీ చదవండి: పదో ర్యాంకు వచ్చినా.. ఉద్యోగం ఇస్తలేరు..
‘‘లక్షా 20 వేల కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు కేసీఆర్. రైతును బద్నాం చేసే మాట, దొంగగా చిత్రీకరించేలా ఏడు వేల కోట్ల రూపాయలు మళ్లించారని మాట్లాడిండు రేవంత్. రెండో పంట వేయని రైతులను తప్పుగా చిత్రీకరిస్తోంది రేవంత్ ప్రభుత్వం. టీచర్ అయితే రైతుబంధు కట్ అంటుండు రేవంత్. ఇప్పుడు సీఎం అంటే కటింగ్ మాస్టర్’’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
‘‘పర్రె మేడిగడ్డకు పడలే.. రేవంత్ పుర్రెకు పడ్డది. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెసే ఏదో దొంగచాటుగా చేస్తోందనేది నా అనుమానం. స్థానిక సంస్థల ఎన్నికల సంవత్సరం కాబోతోంది ఈ ఏడాది. కాబట్టి ప్రేక్షకపాత్రకు పరిమితం కాకుండి. కేసులైనా భయపడకండి. చిట్టినాయుడు ఏం పీకలేడు. చిల్లర మిల్లర రాతలు రాయించేవారినీ వదిలిపెట్టం. బాక్సింగ్‌లో కిందపడ్డా నిలబడి కొట్లాడేటోడే వీరుడు. కాంగ్రెస్ 8, బీజేపీ 8 ఎంపీలైన్రు కానీ వచ్చింది గుండు సున్నా. కేసీఆర్ ఒక రోజు దేశంలో చక్రం తిప్పే రోజు ముందుంది
..కాంగ్రెస్ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి 369 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పజెప్పితే.. మనం దిగిపోయేనాడు 5 వేల 564 కోట్ల మిగులుతో కాంగ్రెస్‌కు అప్పజెప్పాం. రెవెన్యూ మిగులు విషయంలో ముఖ్యమంత్రిదో మాట, ఉప ముఖ్యమంత్రిదో మాట. పదేళ్లలో 4 లక్షల 17 వేల కోట్లు మనం అప్పు చేస్తే.. కాంగ్రెస్ ఒక ఏడాదిలో 1 లక్షా 37 వేల కోట్ల అప్పుజేసింది. మేం చేసిన అప్పుల వల్ల జరిగిన అభివృద్ధి గురించి మేం చెప్తాం.. మీరు చెప్పగలరా?. హైడ్రా పేరిట పేదల పొట్ట కొట్టడం తప్ప ఏం చేసింది ఈ ప్రభుత్వం?. ఢిల్లీకి పంపుతున్నారు పైసలన్నీ. తెలంగాణా ఢిల్లీకి ఏటీఎం అయిపోయింది.
కొడంగల్ భూములివ్వని కేసులో కూడా నన్ను ఇరికించే యత్నం చేశాడు. ఆరు కేసుల్లో ఎలా ఇరికిద్దామా అనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వానిది. వాళ్లు కేసుల గురించి ఆలోచించని.. మనం రైతుల గురించి ఆలోచిద్దాం. త్వరలో సభ్యత్వ నమోదు ప్రారంభించి బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీలు వేసుకుందాం. రైతుభరోసాపై గ్రామాల్లో నాయకులంతా చర్చ పెట్టాలి. కోటి ఆరు లక్షల మంది నుంచి దరఖాస్తులు తీసుకుని ఏం చేసినట్టు?. మళ్ళీ ప్రమాణపత్రాలెందుకు?’’ అంటూ కేటీఆర్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment