అధికారుల నిర్లక్ష్యంతోనే అంటూ డీఎస్సీ బాధితుడి ఆవేదన
సకాలంలో ఆర్‌సీఐ సర్టిఫికెట్ అందించలేదన్నజిల్లా విద్యాశాఖాధికారి
ఖానాపురం: పేద కుటుంబం.. కష్టపడి చదువుకున్నాడు. పరీక్షలు రాసి పదో ర్యాంకు సాధించాడు. ఇక ఉద్యోగం వచ్చినట్లేనని సంతోషపడ్డాడు. కానీ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొలువుకు దూరమయ్యాడు. జిల్లా ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేసినా కనికరించడం లేదు. తనకు ఉద్యోగం ఇప్పించండని వేడుకున్నా ఫలితం లేదు. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు. వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పాలకుర్తి మహేందర్ డీఎస్సీ–2024 ఫలితాల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ సెంకడరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) విభాగంలో 10వ ర్యాంకు సాధించాడు.
దీంతో అక్టోబర్ 29న సర్టీఫికెట్ల పరిశీలన కూడా ముగిసింది. గతేడాది నవంబర్ 2న విడుదల చేసిన 1:1 జాబితాలో పేరు లేదు. తనకు అన్యాయం జరిగిందని విద్యాశాఖ అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యంతోపాటు సాంకేతిక సమస్య కారణంగా ఉద్యోగం రాలేదని మహేందర్‌తోపాటు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీ విభాగంలో తనకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. ఇప్పటికైనా తనకు ఉద్యోగం ఇవ్వాలని మహేందర్‌తోపాటు ఆయన కుమారులు కోరుతున్నారు.
సకాలంలో ఆర్‌సీఐ సర్టీఫికెట్ ఇవ్వలేదు
ఆర్‌సీఐ (రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) రిజిస్ట్రేషన్ సర్టీఫికెట్‌ను సరైన సమయంలో కార్యాలయంలో అందించలేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫైల్‌ను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు పంపించాం. ఇతర జిల్లాలతో సంబంధం లేకుండా సంబంధిత ఫైల్‌ను తిరస్కరించి తిరిగి పంపించారు. దీంతో ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు మహేందర్‌కు ఉద్యోగాన్ని ఇవ్వలేదు. – మామిడి జ్ఞానేశ్వర్, జిల్లా విద్యాశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment