Peoples Pulse Exit Polls 2024: జమ్ము కశ్మీర్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. గెలుపు ఎవరిదంటే? | Peoples Pulse Survey Exit Polls On Jammu Kashmir Assembly Elections | Sakshi
Sakshi News home page

Peoples Pulse Exit Polls 2024: జమ్ము కశ్మీర్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. గెలుపు ఎవరిదంటే?

Published Sat, Oct 5 2024 6:34 PM | Last Updated on Sat, Oct 5 2024 7:08 PM

Peoples Pulse Survey Exit Polls On Jammu Kashmir Assembly Elections

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హొదా తొలగింపు తర్వాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మూడు విడతలలో ముగిసిన ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ సర్వే నిర్వహించింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన సంస్థ బృందం ఎన్నికల ఫలితాలపైనే కాకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై కూడా రాష్ట్ర ప్రజల అభిప్రాయాలని సేకరించింది.

సర్వే అంచనాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలు పొందే అవకాశాలు లేవు. అయితే జమ్ము కశ్మీర్‌లో కలిసి పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ పార్టీలకు వచ్చే సీట్లతో ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమి 46-50 స్థానాలు, బీజేపీ 23-27 స్థానాలు, జేకేపీడీపీ 7-11 స్థానాలు, ఏఐపీ 0-1, ఇతరులు 4-5 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది. జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమిలో జేకేఎన్ఎస్ 33-35, కాంగ్రెస్ 13-15 స్థానాలు గెలవవచ్చు. జేకేఎన్సీ 29 శాతం, కాంగ్రెస్ 14 శాతం, బీజేపీ 24 శాతం, జేకేపీడీపీ 16 శాతం, ఏఐపీ 5 శాతం, ఇతరులు 12 శాతం ఓట్లు పొందవచ్చని సర్వేలో తేలింది. కలిసి పోటీ చేసిన జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమికి 43 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ప్లస్ ఆర్ మైనస్ మార్జిన్ ఉండే అవకాశాలున్నాయి. 


    
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తారని సర్వేలో కోరగా జేకేఎన్సీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు సుమారు 28 శాతం మంది మద్దతిచ్చారు. ఆయన అనుభవం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందనే అభిప్రాయాన్ని ఓటర్లు వెలిబుచ్చారు. ఒమర్ అబ్దుల్లా తండ్రి, రాష్ట్ర సీనియర్ నేత, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు సుమారు 2 శాతం మందే మద్దతిచ్చారు. జేకేపీడీపీ అధినేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి, ఏఐపీ అధినేత లోక్‌సభ సభ్యులు ఇంజినీర్ రషీద్‌కు చెరో 8 శాతం మద్దతు సర్వేలో కనిపించింది.

కాంగ్రెస్-జేకేఎన్సీ మధ్య పొత్తు ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేసింది. దాదాపు 46 శాతం మంది కాంగ్రెస్-జేకేఎన్సీ కూటమి తమ ప్రయోజనాలకు ఉత్తమంగా ఉపయోగపడుతుందని విశ్వసించారు. హిందువుల ఏకీకరణతో ప్రయోజనం పొందాలని చూసిన బీజేపీకి జమ్మూ ప్రాంతంలో లబ్ది చేకూరింది. జమ్మూలో కాంగ్రెస్ పేవలమైన ప్రచారం కూడా బీజేపీకి కలిసివచ్చింది. అధిక ప్రచారంతో నిత్యం వార్తల్లో ఉన్న అవామీ ఇత్తేహాద్ పార్టీ (ఏఐపీ) ఒక్క సీటుకే పరిమితం కావచ్చు. పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్నీ పార్టీ వంటి చిన్న పార్టీలను కలుపుకొని మొత్తం మీద ఇతరులకు దాదాపు 4 నుండి 5 సీట్లు రావచ్చని సర్వేలో తేలింది.  

అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందని సర్వేలో వెల్లడైంది. ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి పరంగా ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న సవాళ్లను ఓటర్లు ఎత్తి చూపారు. నిత్యవసర వస్తువుల ధరలతో పాటు విద్యుత్ చార్జీల పెరుగుదల, ఆశించిన అభివృద్ధి లేకపోవడం ఎన్నికల్లో కీలకాంశాలుగా మారాయి.  అభివృద్ధిలో కొంత మెరుగ్గా ఉందని 30 శాతం మంది అభిప్రాయపడినా, 40 శాతం కంటే ఎక్కువ మంది గత 5-6 సంవత్సరాలలో అభివృద్ధికి సంబంధించి ఎటువంటి మార్పు కనిపించలేదని చెప్పారు. 22 శాతం మంది అభివృద్ధి మరింత దిగజారిందన్నారు. ఇటీవల శాంతిభద్రతలు గణనీయంగా మెరుగుపడ్డాయని 30 శాతం మంది చెప్పగా, మిగతావారు పెదవి విరిచారు. జమ్ము కశ్మీర్ పురోగతిపై కేంద్ర ప్రభుత్వం పలు హామీలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో భద్రతకు సంబంధించి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపించింది. మౌలిక సదుపాయల కల్పన, ఆరోగ్య పరిరక్షణ, విద్యాపరంగా అభివృద్ధిపై ప్రజల్లో ఆందోళన కనిపించింది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019 ఆగస్టులో జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడం, రాష్ట్ర హోదాను తొలగించి లడఖ్‌ను వేరు చేస్తూ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడంపై అత్యధిక ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్టు సర్వేలో స్పష్టమైంది. రాష్ట్ర హోదాను తిరిగి కల్పించాలని 67 శాతం మంది గట్టిగా కోరారు.  
     
జమ్ము కశ్మీర్‌లో 2014 తర్వాత దాదాపు దశాబ్ద కాలం అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయంగా అనేక ఆసక్తికరమైన అంశాలున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో బీజేపీ, జేకేపీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అనేక రాజకీయ పరిణామాల మధ్య ఈ సంకీర్ణ ప్రభుత్వం 2018లో రద్దయ్యింది. 2022లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం అసెంబ్లీ స్థానాల సంఖ్య 83 నుండి 90 పెరగడంతో రాజకీయంగా ఇది కీలకంగా మారింది. బీజేపీ ఆశలు పెట్టుకున్న జమ్మూ ప్రాంతంలో సీట్లు 37 నుండి 43కు పెరగగా, కశ్మీర్ లోయలో సీట్లు 46 నుండి 47కు పెరిగాయి. 
    
పీపుల్స్ పల్స్, డిజిటల్ వార్త సంస్థ సౌత్ ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా జమ్ము కశ్మీర్ ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు పీపీఎస్ విధానంలో 25 నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని సర్వే నిర్వహించాయి. శాస్త్రీయమైన పద్దతిలో ప్రతి అసెంబ్లీ సెగ్మంట్ నుండి నాలుగు పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేసుకున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎలక్ట్రోల్ రోల్స్ నుండి అన్ని ప్రాంతాల్లో  కులం, మతం, వయస్సు, పురుషులు, మహిళలు సరిసమాన నిష్పత్తిలో ఉండేలా ఎంపిక చేసుకొని మొత్తం 2016 శాంపిల్స్‌ సర్వే కోసం సేకరించడం జరిగింది.

సర్వే కోసం తయారు చేసిన నిర్మాణాత్మకమైన ప్రశ్నాపత్రంతో సంస్థ తరఫున రీసెర్చ్ స్కాలర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు క్షేత్రస్థాయిలో ఓటర్లను ముఖాముఖిగా కలుసుకొని వారి అభిప్రాయాలను సేకరించింది. జమ్ము కశ్మీర్ ఎన్నికల సర్వే నివేదికను పీపుల్స్ పల్స్ డైరెక్టర్ ఆర్. దిలీప్ రెడ్డి నేతృత్వంలో పీపుల్స్ పల్స్ సీనియర్ పరిశోధకులు జి. మురళీకృష్ణ, ఐ.వి. మురళీకృష్ణశర్మ రూపొందించారు.
-ఆర్.దిలీప్ రెడ్డి,
డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement