శ్రీనగర్: ప్రతిపక్షాల‘ఇండియా కూటమి’ ప్రధాని నరేంద్ర మోదీని మానసికంగా ఓడించిందని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఇచ్చిన మెరుగైన ప్రదర్శనతో మోదీ విశ్వాసం కోల్పోయారని అన్నారు. బుధవారం రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్ము కశ్మీర్‌లో ఓ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.
‘‘ప్రధాని మోదీ బహిరంగంగా తనను దేవుడు గొప్ప ఉద్దేశమే కోసం భూమిపైకి పంపించాడని, తాను ఒక దైవాంశ సంభూతుడిగా చెప్పుకున్నారు. మిగతా భారతీయులంతా తనలా కాదని అన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా మాత్రం తాను ప్రజలతో మాట్లాడుతానని, వారి ఇష్టానుసారం నడుచుకుంటానని అన్నారు. గతంలో మోదీ దేశవ్యాప్త కులగణన సాధ్యం కాదన్నారు. కానీ, ప్రతిపక్షాల డిమాండ్‌లో వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్ కూడా తన మాట మార్చుకుంది.
పార్లమెంట్‌లో మోదీ ముందు నేను కూర్చోవటంతో ఆయనలో ఉన్న విశ్వాసం మొత్తం పోయింది. ప్రతిపక్షాల ఇండియా కూటమి బీజేపీ వ్యతిరేకంగా సమిష్టిగా పోరాటం చేసింది. ఇటీవల మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న నిర్ణయాలను ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. దీంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దాని విధానాలను మార్చుకుంది. దేశంలోని ప్రజలను చూసి నరేంద్ర మోదీ భయపడుతున్నారు. మోదీ, బీజేపీని అధికారం నుంచి దింపేందుకు ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. మేము అందరినీ సోదరభావంతో సమానంగా చూస్తాం. అన్ని జాతులు, కులాలు, రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు అందరినీ గౌరవిస్తాం. జమ్ము కశ్మీర్‌లో కూడా అందరూ సమానంగా గౌరవం పొందాలని మేము కోరుకుంటున్నాం’’ అని అన్నారు.
ఇక.. నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 32 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. జమ్ము కశ్మీర్‌లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment