ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేస్తూ.. అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్ గెలుపు సొంతం చేసుకుంది. అయితే.. హర్యానా ఫలితాలపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సెటైర్లు వేశారు. హర్యానాలో బీజేపీ గెలుపును అంగీకరించలేనని అన్నారు. బీజేపీ విజయం అనటం కంటే.. కాంగ్రెస్ ఓటమే అధికమని అన్నారు. అధికార బీజేపీ పార్టీకి 39 శాతం ఓట్ల వస్తే.. 61 శాతం ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయని గుర్తు చేశారు.
‘‘ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ బీజేపీకి వస్తే నేను ఆ పార్టీ విజయాన్ని అంగీకరించేవాడిని. కానీ, అలా జరగలేదు. హర్యానాలో ఓట్లు బీజేపీకి గెలుపు కోసం పడలేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వచ్చాయి. 39 శాతం ఓట్లు బీజేపీకి పడ్డాయి. అదే బీజేపీకి 61 శాతం వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు. ఇది బీజేపీ గెలుపు కాదు.. కాంగ్రెస్ ఓటమి’’ అని అన్నారు.
మరోవైపు.. జమ్ము కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి కాంగ్రెస్ ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగిందని, అందుకే బీజేపీని ఓడించగలిగిందని అన్నారు. ‘‘ జమ్ము కశ్మీర్‌లో ఇండియా కూటమి ఒక యూనిట్‌గా పోరాటం చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి కూటమిగా బరిలో దిగటంతో బీజేపీ ఓడిపోయింది. కానీ, హర్యానాలో దురదృష్టవశాత్తు.. ఇండియా కూటమి పార్టీలు ఒంటరిగా బరిలో దిగటంతో ఫలితం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వచ్చింది’’ అని అన్నారు.
చదవండి: బీజేపీలో చేరిన కేరళ తొలి మహిళా ఐపీఎస్
Comments
Please login to add a commentAdd a comment