చంఢీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధిక సీట్లు గెలుచుకొని అధికారం చేపడుతుందని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ నివేదికలు వెల్లడించాయి.ఈ నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీపై జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ చౌతాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హర్యానాలో నయాబ్ సింగ్ సైనీకి బీజేపీ.. చచ్చిన పాము స్థితిలో ఉన్న పార్టీని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సైనీ.. నియంత్రించలేకపోయారని అన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి కారణం ఇదే అవుతుందని అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
‘‘హర్యానాలో బీజేపీ అధికారం కోల్పోయి..రాష్ట్రం బయటకు వెళ్లిపోయే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను మొదటి రోజు నుంచీ ఇదే విషయాన్ని చెబుతున్నా. బీజేపీ నేతలు ఏమి జరిగిందో కూడా అర్థం చేసుకోలేకపోయారు.
..హర్యానా ముఖ్యమంత్రికి బీజేపీ ‘చచ్చిన పాము’ స్థితిలో ఉన్న పార్టీని అప్పగించారు. ఇప్పటికే చాలా నష్టం కాంగ్రెస్ వల్లే జరిగిపోయింది. నయాబ్ సింగ్ సైనీ మంచి వ్యక్తి. కానీ, నష్టాన్ని నియంత్రించలేకపోయారు. ఒక మంచి వ్యక్తి మెడలో చనిపోయిన పామును బీజేపీ ఉంచింది.
..ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 20 సీట్లు వస్తాయని చెబుతున్నాయి. కానీ, వాటిని నమ్మటం లేదు. బీజేపీకి 15 లేదా 16 సీట్లు మాత్రమే వస్తాయని నమ్ముతున్నా. కాంగ్రెస్ కూడా జేజేపీ లేదా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మేం ఏమీ చెప్పలేం. ఫలితాలు వెలువడ్డ తర్వాతే చెబుతాం. కాంగ్రెస్‌కు కూడా మా పార్టీ మద్దతు అవసరమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment