ఎమ్మెల్యే... ఓ ఎమ్మెల్యే! | Vardhelli Murali Article On Exit polls | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే... ఓ ఎమ్మెల్యే!

Published Sun, Dec 3 2023 7:45 AM | Last Updated on Sun, Dec 3 2023 12:44 PM

Vardhelli Murali Article On Exit polls - Sakshi

అధికారికంగా ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే ఫలితాలపై కామెంట్‌ చేయడం న్యాయం కాకపోవచ్చు. కాకపోతే దేశంలో ఎగ్జిట్‌ పోల్‌ అనే ప్రక్రియ క్రమంగా శాస్త్రీయతను సంతరించు కుంటున్నది. చిన్నాచితకా ఔత్సాహిక సంస్థలను, రాజకీయ ప్రయోజనం కోసం చేయించుకునే సర్వేలను మినహాయిస్తే, దేశంలో ప్రముఖ సంస్థలు చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఎక్కువ సంద ర్భాల్లో నిజమయ్యాయి. అలా నిజమైన సందర్భాల్లో కూడా ట్రెండ్‌ను మాత్రమే సూచించగలుగుతున్నాయి కానీ సీట్ల సంఖ్యను కచ్చితంగా అంచనా వేయడంలో ఇంకా పరిపూర్ణత రాలేదు.

మెజారిటీ స్థానిక ఏజెన్సీలతో పాటు ప్రముఖ జాతీయ ఏజెన్సీలు కూడా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ విజ యాన్ని సంశయాతీతంగా ప్రకటిస్తున్నాయి. ఏబీపీ – సీ వోటర్, జన్‌ కీ బాత్‌లు 60 స్థానాలకు పైగా కాంగ్రెస్‌ గెలుస్తుందని అంచనా వేస్తే, ఇండియాటుడే – మై యాక్సిస్, టైమ్స్‌ నౌ– ఈటీజీ, ఇండియా టీవీ – సీఎన్‌ఎన్, టుడేస్‌ చాణక్య తదితర సంస్థలు ఈ సంఖ్య 70 దాకా వెళ్లొచ్చని ఊహిస్తున్నాయి. సమా జంలో గొంతు విప్పే స్వభావం వున్న ప్రభావ వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత గత కొంతకాలం నుంచి స్పష్టంగానే కనిపిస్తూ వచ్చింది. అయితే ఈ వ్యతిరేకత పాటక వర్గాల్లో, కింది సెక్షన్లలో ఉండకపోవచ్చనే అభిప్రాయం ఉండేది. రైతుబంధు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందుకు కారణం కావచ్చు.

ఎగ్జిట్‌ పోల్స్‌ ఇస్తున్న సంకేతాల ప్రకారం ప్రభావ వర్గాలు, పాటక వర్గాలు అనే తేడా లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత అంతటా ఆవరించినట్టు అర్థం చేసుకోవాలి. మెజారిటీ ఓటర్లు మార్పు కోరుకున్నట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వానికి అనుకూలంగా నలభై శాతం కంటే తక్కువ మంది, వ్యతిరేకంగా అరవై శాతం కంటే ఎక్కువ మంది ఓటేసినట్టు అంచనాలు వెలువ డ్డాయి. ఈ అంచనాలు ఎంతమేరకు వాస్తవమో ఆదివారం మధ్యాహ్నం కల్లా తేలిపోతుంది. గడిచిన కొంతకాలంగా ప్రభావ వర్గాల్లో బహిరంగంగా వ్యక్తమవుతున్న అసమ్మతికి, పాటక వర్గాల్లో మౌనంగా గూడుకట్టుకుంటున్న అసంతృప్తికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి.

సామాన్య జనం సంగతి దేవుడెరుగు, ప్రజాప్రతినిధులకు కూడా ముఖ్యమంత్రి దర్శనం దుర్లభమన్న ప్రచారం బాగా వ్యాపించింది. ప్రజాస్వామ్య ప్రియులెవరికీ ఇది రుచించలేదు. రాష్ట్రంలో పరిపాలనంతా ఒక్క కుటుంబం చేతిలోనే కేంద్రీకృతమైందన్న ఆరోపణలను జనం బాగా నమ్ముతున్నారు. తెలంగాణ ఏర్పడితే విద్యాధికులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకు తాయని బలహీన వర్గాలకు చెందిన వారు బాగా ఆశలు పెట్టు కున్నారు. వారి ఆంకాంక్షల మేరకు ప్రభుత్వం కొలువుల్ని భర్తీ చేయలేదనే అసంతృప్తి చాలా కాలంగా వ్యక్తమవుతున్నది. ధరణి పోర్టల్‌ వలన క్షేత్రస్థాయిలో ఏర్పడిన ఇబ్బందులను, సమస్య లను గుర్తించడంలో రాష్ట్ర యంత్రాంగం విఫలమైనట్టు కనిపిస్తున్నది.

ఇటువంటి సమస్యలు ఒక ఎత్తయితే, క్షేత్రస్థాయిలో అవి నీతి, ఎమ్మెల్యేల ‘విశ్వరూపం’ మరో ఎత్తు. ముప్పయ్‌ మందికి పైగా ఎమ్మెల్యేలపై (వారిలో కొందరు మంత్రులు) ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదనే సమాచారాన్ని విస్మరించి వారందరికీ టిక్కెట్లను కేటాయించడం వల్ల పాలక పార్టీకి భారీ నష్టం జరిగి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీరంతా వరసగా రెండోసారి ఎన్నికయ్యారు. తొలివిడత పదవీకాలంలో ఇంత తీవ్రస్థాయి ఆరోపణలు రాలేదు. రెండోసారి ఎన్నికైన తర్వాత వారు జూలు విదిల్చారు. మండలస్థాయి ఉద్యోగులు, అధికా రుల పోస్టింగులు, బదిలీలు అన్నీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే! కొందరు ఘనాపాఠీలు జిల్లాస్థాయి పోస్టింగుల్లోనూ చక్రాలు, బొంగరాలు తిప్పగలిగారు. ఈ పోస్టింగులకు ఒక రేట్ల పట్టిక కూడా ఉంటుందనేది బహిరంగ రహస్యంగా మారింది. పైగా సదరు అధికారులందరూ ఎమ్మెల్యేల ఆదేశాల మేరకే పని చేయాల్సి ఉంటుంది. వారి పైన ఉండే శాఖాసంబంధిత ఉన్నతాధికారులందరూ నిమిత్తమాత్రులుగా మిగిలారు.

అధికారులు జేబుల్లో ఉండటంతో ఈ ప్రజా ప్రతినిధులు భూ వివాదాల్లో తలదూర్చారు. కారుచౌకగా కాజేసి బినామీ పేర్లతో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు కూడా వేశారు. మంజీరా నుంచి మూసీ దాకా దేన్నీ వదలకుండా వందల కోట్ల విలువైన ‘తైలాన్ని’ పిండుకున్నారని ఆరోపణలు వచ్చాయి. మైనింగ్‌ దందాలు, రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ దందాలు, కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యాన్ని భోంచేయడం వగైరా వ్యాపకాలను కొందరు ఎమ్మెల్యేలు చేపట్టారు. చివరికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేప ట్టిన ‘దళిత బంధు’ పథకంలోనూ బహిరంగంగానే కమీషన్లు కొట్టేసిన ప్రబుద్ధులున్నారు.

కొందరు ఎమ్మెల్యేలు ధరణిలోని లోటుపాట్లను ఆసరా చేసుకొని నిషేధిత జాబితాలోని భూములు, అసైన్డు భూము లను భారీగా కొనుగోలు చేశారు. చెరువుశిఖం భూములు, కాందిశీకుల భూములను కూడా కొల్లగొట్టి కళ్లముందే కోట్లకు పడగెత్తారు. దేశంలో అతి కొద్దిమంది శ్రీమంతుల దగ్గర ఉండే విలాసవంతమైన వాహనాలను కొందరు ప్రజాప్రతినిధుల లగ్జరీ విల్లాల్లో మనం చూడవచ్చు. కొండలను అక్రమంగా పిండి చేసుకున్న అమాత్యుడొకరు, బండలను అక్రమంగా తరలించు కున్న అమాత్యుడొకరు, భూదందాలకు సహకరించని ఇద్దరు కలెక్టర్లనే శంకరగిరి మాన్యాలు పట్టించిన అమాత్యులు, కొత్త జిల్లాలకు కార్యాలయాల పేరుతో భూ దందాలు చేసిన అమా త్యులు... వీరికి ఏమాత్రం తీసిపోని ఇంకో పాతికమందికి పైగా ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రతిష్ఠను  దెబ్బతీసినట్టు వినిపిస్తున్నది.

తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే లందరికీ మళ్లీ టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయించడం కేసీఆర్‌ చేసిన అతి పెద్ద పొరపాటుగా పరిశీలకులు భావిస్తున్నారు. కనీసం 30 స్థానాల్లో కొత్తవారినీ, యువతరాన్నీ, క్లీన్‌ ఇమేజ్‌ గలవారినీ పరిచయం చేసి ఉన్నట్లయితే కచ్చితంగా మెరుగైన ఫలితాలను అధికార పార్టీ సాధించి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రెండుసార్లు గెలిస్తేనే తరాలకు సరిపోయేంత పోగేసిన వాళ్లను మూడోసారి ఎన్నుకోవడం పట్ల ప్రజలు విముఖత చూపినట్టు ట్రెండ్‌ను బట్టి అర్థమవుతున్నది. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఇది వ్యక్తమైంది.

అసలు ఎమ్మెల్యేలకున్న అధికారాలేమిటి? విధులేమిటి అన్న అంశంపై విస్తృతమైన చర్చ జరగవలసిన అవసరం ఏర్ప డింది. రాజ్యాంగం ప్రకారం కేంద్రానికీ, రాష్ట్రాలకూ చట్టాలు చేసే అంశాలపై రెండు ప్రత్యేక జాబితాలున్నాయి. ఒక ఉమ్మడి జాబితా ఉన్నది. రాష్ట్ర జాబితాలోని అంశాలు, లేదా ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసన సభలు చట్టాలు చేస్తాయి. ఈ క్రమంలో సదరు అంశంపై క్షుణ్ణమైన  అధ్యయనం చేసి ఎమ్మె ల్యేలు చర్చలో పాల్గొనాలి. మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేలు తమలో ఒకరిని నాయకునిగా ఎన్నుకొంటే ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రపతి ఎన్నికలో కూడా ఎమ్మెల్యే వోటర్‌గా ఉంటారు. రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేకు ఇంతకు మించిన అధికారాల్లేవు. 

తన నియోజకవర్గంలోని ప్రజా సమస్య లను శాసనసభ ద్వారా మంత్రివర్గం దృష్టికి తీసుకొని వెళ్లవచ్చు. అధికార యంత్రాంగం ద్వారా ఆ సమస్య పరిష్కారం కావాలి. ఒక వంతెనగానీ, రోడ్డును గానీ ప్రభుత్వం మంజూరు చేస్తే ప్రభుత్వం తన శాఖల ద్వారా దానిని నిర్మించే ఏర్పాటు చేయడం విధాయకం. కానీ ప్రస్తుతం మన ఎమ్మెల్యేలు పనిని శాంక్షన్‌ చేయించుకోవడం దగ్గర్నుంచి కాంట్రాక్టర్‌ను నియమించి కమీషన్‌ వసూలు చేసుకునే వరకు దూసుకొని పోతు న్నారు. సంతకాలు చేయడం వరకే అధికారుల పని! కళ్ల ముందు రాజకీయ అవినీతి కనిపిస్తున్నప్పుడు అధికారుల సంతకాలు ఊరికే రావు కదా! ఆ సంతకాలకూ ఓ లెక్కుంటుంది!!

ఎమ్మెల్యే నియోజక వర్గాలకు సమాంతరంగా ఉన్న పంచా యితీ సమితుల స్థానంలో ఐదారు చిన్న చిన్న మండలాలు రావడం కూడా ఎమ్మెల్యేలకు కలిసొచ్చింది. నియోజక వర్గంలో ఓ మినీ ముఖ్యమంత్రిగా అవతరించాడు. తన పరిధిలో ఒక పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ను బదిలీ చేయాలన్నా, పోస్టింగ్‌ ఇవ్వాలన్నా ఆ శాఖ అత్యున్నత అధికారి డీజీపీ మాట కంటే ఎమ్మెల్యేమాటే చెల్లుబాటు అవుతున్నది. ఇది ఆరోగ్యకరమైన సంప్రదాయ మేనా? వ్యవస్థలు నిర్వీర్యం కావా? ధర్మోరక్షతి రక్షితః అంటారు. ఎమ్మెల్యేలనైనా, ఇంకెవరినైనా వారి చట్టబద్ధమైన అధికారాలకు, విధులకు పరిమితం చేస్తేనే వ్యవస్థలు ప్రజలకు నిష్పాక్షిక సేవలు అందించగలుగుతారు. రాజకీయ పార్టీలు వాటి రాజకీయ అవసరాల కోసం ఎమ్మెల్యేలను శక్తిమంతులుగా మార్చి ఉండవచ్చు. 

సర్వాధికారాల అండతో ఆ వ్యక్తి చెలరేగిపోయి పదవిని తన వంశపారంపర్య హక్కుగా భావిస్తున్నారు. దాన్ని నిలుపు కోవడం కోసం కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు 70 నుంచి 80 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిబద్ధత కలిగిన ప్రజాసేవకులు రాజకీయాల్లో నిలబడగలరా? కోట్లు వెదజల్లినవాడు ప్రజాకంటకునిగా మార కుండా ఉంటాడా? అలాంటి వారికి మూడోసారి నాలుగోసారి టిక్కెట్‌ ఇస్తే సదరు పార్టీకి గుదిబండగా మారడమే కాదు, ప్రజాస్వామ్యానికీ ప్రమాదకరంగా తయారవుతారు. అప్రతిష్ఠ మూటగట్టుకున్న ఎమ్మెల్యేలు ఈసారి అధికార పార్టీని ముంచు తారో, గట్టెక్కిస్తారో ఆదివారం మధ్యాహ్నానికి తేలిపోతుంది.

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement