
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు మరీ పరుషంగా ఉన్నాయి. అంత అర్థవంతంగానూ కనిపించడం లేదు అవి. కేసీఆర్‌ను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని అనుకుంటున్నారా? లేక ఇంకేదైనా కారణం ఉందా?. ప్రస్తుతానికి కేసీఆర్ కూడా బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో మాట్లాడుతూ.. రేవంత్‌కు అనుభవం, జ్ఞానం లేదని, కామన్ సెన్స్ వాడరు అంటూ వ్యాఖ్యానించి సరిపెట్టుకున్నారు. అంతకుమించి రేవంత్ వ్యాఖ్యలకు నేరుగా స్పందించ లేదు. అయితే..
ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్‌రావులు మాత్రం రేవంత్ వ్యాఖ్యలకు ధీటుగానే జవాబిస్తున్నారు. అయితే తెలంగాణలో మూడు పార్టీల రాజకీయం కొంత గందరగోళంగానే ఉందని చెప్పాలి. ఎవరు ఎవరికి రహస్యంగా మద్దతు ఇస్తున్నారో ప్రజలకు అర్థం కాని రీతిలో రాజకీయం సాగుతోంది. ‘‘కేసీఆర్‌ను కొట్టింది నేనే.. గద్దె దింపింది నేనే’’ అంటూ మరీ రేవంత్ రెడ్డి(Revanth Reddy) కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాకపోవచ్చు. రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయి. అంతమాత్రాన వ్యక్తుల గౌరవాలను తగ్గించుకునేలా మాట్లాడుకుంటే రాజకీయాల విలువ కూడా తగ్గుతుంది.
👉ఎల్లకాలం ఎవరూ ఒకరే ముఖ్యమంత్రిగా ఉండరన్న వాస్తవాన్ని అంతా గుర్తుంచుకోవాలి. పార్లమెంటు ఎన్నికలలో గుండు సున్నా ఇచ్చింది తానేనని రేవంత్ అన్నారు. ఆ ఎన్నికలలో కారణం ఏమైనా బీఆర్ఎస్ ఓటమి అనేది వాస్తవం. కాంగ్రెస్‌తోపాటు బీజేపీకి కూడా ఎనిమిది లోక్ సభ స్థానాలు వచ్చాయి. అది కాంగ్రెస్‌కు లాభమా? నష్టమా? అనేది ఆలోచించుకోవాలి. అప్పట్లో కాంగ్రెస్ ఓటమి లక్ష్యంగా బీఆర్‌ఎస్ పనిచేయడం వల్ల బీజేపీకి కొంత ఉపయోగం జరిగిందన్న భావన కూడా లేకపోలేదు. ఒకవేళ భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే అది కాంగ్రెస్‌కు ఇబ్బంది కావొచ్చు. కాని ఆ పరిణామం జరుగుతుందని ఇప్పటికైతే ఎవరూ చెప్పలేరు.

రేవంత్ నిజంగానే తాను బాగా బలపడ్డాడనని భావిస్తుంటే.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి సవాల్ విసిరి గెలిస్తే ఆయన ప్రతిష్ట పెరుగుతుంది. కాని కేసీఆర్(KCR)ను విమర్శిస్తూ, ఆయన చేసిన తప్పులే రేవంత్ చేయడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుంది?. తనది ముఖ్యమంత్రి స్థాయి అని, కేసీఆర్‌ది మాజీ ముఖ్యమంత్రి స్థాయి అని రేవంత్ అంటున్నారు. కాని కేసీఆర్ ప్రధాన కేసీఆర్ వయసు రీత్యా, అనుభవం రీత్యా తనకన్నా బాగా చిన్నవాడైన రేవంత్‌తో పోటీ పడడానికి చిన్నతనంగా భావిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది కూడా కరెక్టు కాదు.
👉రాజకీయాలలో సీనియర్, జూనియర్ అని ఉండదు. ఎవరు అధికారంలోకి వస్తే వారిదే పవర్. కేసీఆర్‌ను ఉద్దేశించి ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగితే స్థాయి వస్తుందా? అనడం అంత మంచి సంప్రదాయం కాదు. ఎవరిని లక్ష్యంగా అన్నారో కాని, డ్రగ్స్ పెట్టుకుని పార్టీ చేసుకుంటే స్థాయి వస్తుందా? అనడంలో అంతర్యం ఏమిటో తెలియదు. తెలంగాణ సమాజాన్ని విలువల వైపు నడపవలసిన నేతలు ఇంత తక్కువ స్థాయిలో మాట్లాడుకోవడం జనానికి రుచించదనే చెప్పాలి.
కేసీఆర్ స్థాయి కాంగ్రెస్‌లో ఎవరికీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడంపైనే రేవంత్ స్పందించి ఉండవచ్చు. కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టడం తప్పుకాదు. ఆ సందర్భంలో వాడే భాష విషయంలో జాగ్రత్తగా లేకపోతే రేవంత్‌కే నష్టం.
👉బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే తెలంగాణలో ఈ పరిస్థితి ఉందని రేవంత్ అంటున్నారు. అదే టైమ్‌లో కేటీఆర్, హరీష్ రావులు అప్పులపై సీఎం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తూ కొన్ని ఆధారాలు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో గెలవడానికి చేసిన హామీలకు అయ్యే వ్యయం ఎంత? ఏ మేరకు హామీలు అమలు చేశారు? మొదలైన విషయాలు చెప్పగలిగితే అధికార పార్టీపై ప్రజలలో విశ్వాసం ఏర్పడుతుంది. రేవంత్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రుణమాఫీ, రైతు బంధు, గ్యాస్ బండలు, గృహజ్యోతి వంటి స్కీముల అమలుకు కొంత ప్రయత్నం చేస్తున్న మాట నిజం. కానీ అమలు కానివి చాలానే ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్, బీజేపీలు సహజంగానే వాటిని ఎత్తిచూపే ప్రయత్నం చేస్తాయి. ఆ విషయాలను డైవర్ట్ చేయడానికి రేవంత్, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే కేసీఆర్‌పై వ్యక్తిగత స్థాయిలో నిందలకు పాల్పడుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది.
రేవంత్ తరచుగా ఢిల్లీకి వెళ్లడాన్ని బీఆర్‌ఎస్ తప్పు పడుతోంది. దానికి జవాబుగా 39 సార్లు కాదు.. 99 సార్లు వెళతానని రేవంత్ అన్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ నేతలు తరచు ఢిల్లీ వెళ్లడమే పెద్ద అంశంగా.. అప్పుడే కొత్తగా వచ్చిన టీడీపీ మార్చింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ దాన్ని ఆత్మగౌరవ సమస్యగా మార్చి ప్రజలను తనవైపునకు తిప్పుకున్నారన్న సంగతిని రేవంత్ దృష్టిలో పెట్టుకుంటే మేలు.
కేసీఆర్ గతంలో కంచి వెళుతూ తిరుపతి వద్ద అప్పటి మంత్రి రోజా ఇంటిలో విందు తీసుకున్నప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాయలసీమను రతనాల సీమను చేస్తానని చెప్పి రొయ్యల పులుసు తిన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రాంతీయ భావాలు అవసరమా? అంటే రాజకీయంలో ఇవి సాధారణంగానే జరుగుతుంటాయి. దానికి పోటీగా చంద్రబాబు(Chandrababu)కు ప్రజాభవన్‌లో విందు ఇచ్చి, ఆయన వద్ద రేవంత్ సాగిలపడ్డారని హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్‌లో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోవడంపై రేవంత్‌కు అసంతృప్తి ఉండవచ్చు. దానిని రాజకీయంగా విమర్శించవచ్చు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి ఓడించాయని, హరీష్‌రావు డబ్బులు ఇచ్చి మరీ బీజేపీకి ఓట్లు వేయించారని ఆయన అన్నారు, ఈ రోజుల్లో ఎవరి వ్యూహం వారిది అనుకోవాలి.

👉బీఆర్‌ఎస్ తనకు ప్రత్యర్ధి కాంగ్రెస్ అని భావిస్తూ ప్రస్తుతం పరోక్షంగా బీజేపీకి సహకరించి ఉండొచ్చు!. అయితే భవిష్యత్తులో అది బీఆర్‌ఎస్‌కు ఉపయోగపడవచ్చు.. పడకపోవచ్చు!!. మరో వైపు ప్రధాని మోదీని మెచ్చుకునే రీతిలో మాట్లాడి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని రేవంత్ అనడాన్ని బీఆర్‌ఎస్ ప్రచారం చేస్తోంది. ‘‘యూజ్ లెస్ ఫెలో, హౌలే గాడు మాట్లాడే మాటలు పట్టించుకోనవసరం లేదు..’’ అంటూ బీఆర్‌ఎస్‌కు ఘాటైన రీతిలో సమాధానం చెప్పడం.. ఈ క్రమంలో అనుచిత భాష వాడడంలో సహేతుకత కనిపించదు.
ఒకప్పుడు కేసీఆర్ అభ్యంతరక భాష వాడుతున్నారన్న విమర్శలు ఉండేవి.దానికి పోటీగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ తీవ్రమైన విమర్శలే చేసేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేసీఆర్‌ను మించి దూషణల పర్వం వాడడం వల్ల ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ వ్యక్తిత్వానికి, గౌరవానికి అంత హుందా కాకపోవచ్చు.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment