జైపూర్: రాజస్థాన్‌లో శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు తమ ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, మతం కార్డు వాడేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అయితే రాష్ట్ర ప్రజలు వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నారు.
‘ప్రచారంలో వారు ఎలాంటి రెచ్చగొట్టే భాష ఉపయోగించారో అందరూ చూశారు. మతం కార్డు వాడేందుకు ప్రయత్నించారు. కానీ ప్రజలు వారిని తిరస్కరించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీని పొందబోతోంది’ అని గెహ్లాట్ అన్నారు. ‘ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కానీ రాజస్థాన్ ప్రజలు వాటిని పట్టించుకోలేదు’ అన్నారాయన.
రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారని, తమపై ఎటువంటి వ్యతిరేకత లేదని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 199 స్థానాలకు శనివారం పోలింగ్ జరిగింది. ప్రజలు తమ తీర్పును ఓట్ల రూపంలో ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు అనంతరం పార్టీ భవితవ్యం తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment