ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఇక్కడ పాలక కాంగ్రెస్, విపక్ష బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. నెల రోజులకు పైగా రాష్ట్రవ్యాప్తంగా పోటాపోటీ ప్రచారంతో ఇరు పార్టీలూ హోరెత్తించాయి. బీజేపీ ప్రచారానికి స్వయంగా ప్రధాని మోదీయే సారథ్యం వహించి కాలికి బలపం కట్టుకుని సుడిగాలి పర్యటనలు చేశారు.
కాంగ్రెస్ తరఫున ప్రచార భారాన్ని ప్రధానంగా సీఎం అశోక్ గెహ్లోతే మోశారు. మోదీ మేనియాకు ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీ తోడై తాము అందలమెక్కుతామని బీజేపీ నమ్మకం పెట్టుకుంది. గెహ్లోత్ వరుసబెట్టి ప్రకటిస్తూ వచి్చన జనాకర్షక పథకాలు ఆ ఆనవాయితీకి ఈసారి అడ్డుకట్ట వేసి తమను మరోసారి గెలిపిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది.
అయితే పోలింగ్ తేదీ సమీపించినా ఓటరు నాడి మాత్రం ఎవరికీ అందడం లేదు. ఏ పార్టికీ అనుకూలంగా స్పష్టమైన ‘వేవ్’ కనిపించడం లేదు. దాంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టిలూ సర్వశక్తులూ ఒడ్డాయి. కాంగ్రెస్ ప్రధానంగా ఎన్నికల హామీలపై ఆధారపడగా బీజేపీ ఎప్పట్లాగే హిందుత్వ కార్డును వీలైనంతగా ప్రచారంలో పెట్టింది...
పథకాలకు థమ్సప్...
గెహ్లోత్ ప్రభుత్వ పనితీరుపై క్షేత్రస్థాయిలో పెద్దగా వ్యతిరేకత కన్పించకపోవడం విశేషం. సంక్షేమ పథకాలపై ప్రజల్లో బాగా సంతృప్తి ఉంది. సంక్షేమ పథకాలు పేదలను ఎంతగానో ఆదుకున్నాయని బీజేపీ మద్దతుదారులు కూడా అంగీకరిస్తుండటం విశేషం! చిరంజీవి బీమా యోజన లక్షల మంది పేద, మధ్య తరగతి కుటుంబీకులకు ఎంతో ఆదుకుందని సవాయ్ మధోపూర్‌లో పవన్ మీనా అనే పాన్ షాప్ యజమాని చెప్పుకొచ్చారు.
‘‘నేను బీజేపీ మద్దతుదారును. కానీ ఈసారి కాంగ్రెస్ పాలనలో ప్రజలకు జరిగిన మంచి కొట్టొచ్చినట్టు కని్పస్తూనే ఉంది’’ అన్నారాయన. కాకపోతే ఇదంతా ఓట్ల రూపంలో బదిలీ అవుతుందా అన్నది చూడాలంటూ ముక్తాయించారు. 10 లక్షల ఉద్యోగాలతో పాటు తక్షణం కులగణన చేపట్టి, మైనారిటీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కలి్పస్తామని కూడా కాంగ్రెస్ తాజా మేనిఫెస్టోలో చెప్పింది. ఇవన్నీ ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చూడాల్సిందే.
శాంతిభద్రతలపై పెదవి విరుపు...
పథకాల సానుకూలతకు శాంతిభద్రతల విషయంలో జనంలో నెలకొన్న తీవ్ర అసంతృప్తి బాగా గండి కొట్టేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మాత్రం దారుణంగా దిగజారిందని మెజారిటీ ప్రజలు వాపోతుండటం ప్రమాద ఘంటికేనంటున్నారు. ముఖ్యంగా ఇస్లాంను కించపరిచాడంటూ గతేడాది ఉదయ్‌పూర్‌లో ఓ టైలర్ షాప్ యజమానిని పట్టపగలే తల నరికి చంపిన తీరును ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.
దానికి తోడు మహిళలపై అకృత్యాలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిన తీరుపైనా జనం గగ్గోలు పెడుతున్నారు. పథకాల ఫలాలు అందరికీ అందుతున్నా ప్రాణాలకే భద్రత లేకపోతే ఏం లాభమని కోటాలో బట్టల షాపు నడుపుతున్న వినోద్ చేసిన వ్యాఖ్యలు జనాభిప్రాయానికి అద్దం పట్టేవే. ‘‘గెహ్లోత్ ప్రభుత్వం బాగానే పని చేసింది. కానీ మార్పు అవసరం.
బీజేపీ వస్తే బాగుంటుంది’’ అన్నారాయన. బీజేపీకి ఓటేయడం చాలా అవసరమని కోటాకు చెందిన అమృత్ చౌహాన్ అనే ఆటోడ్రైవర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ధోరణినే ప్రతిఫలించాయి. ‘‘శాంతిభద్రతలను చక్కదిద్దాలంటే యూపీ తరహా పాలన కావాల్సిందే. అప్పుడే ప్రధాని మోదీ చెబుతున్న హిందూ రాష్ట్ర స్థాపన సాధ్యం. కాంగ్రెస్ కేవలం ఒక్క సామాజిక వర్గానికే కొమ్ము కాస్తూ వస్తోంది’’ అని చౌహాన్ చెప్పుకొచ్చారు.
ఈసారీ 199 సీట్లలోనే పోలింగ్!
రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రంతో తెర పడనుంది. పోలింగ్ శనివారం జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రాష్ట్రాలతో కలిపి డిసెంబర్ 3న వెల్లడవుతాయి. అయితే రాష్ట్రంలో 200 అసెంబ్లీస్థానాలకు గాను 199 స్థానాల్లో మాత్రమే పోలింగ్ జరగనుంది! కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్‌సింగ్ కున్నర్ మృతితో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా 199 స్థానాల్లోనే పోలింగ్ జరుగుతుండటం రాష్ట్ర చరిత్రలో ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం! బీఎస్పీ అభ్యర్థుల మృతి కారణంగా 2018లో, 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాగే ఒక అసెంబ్లీ స్థానంలో పోలింగ్ నిలిచిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment