hora hori
-
USA Presidential Elections 2024: చెరో 47 శాతం!
అట్లాంటా: అమెరికా అధ్యక్ష రేసు అత్యంత హోరాహోరీగా సాగుతోంది. సీఎన్ఎన్ వార్తా సంస్థ తాజాగా నిర్వహించిన జాతీయ స్థాయి పోల్‌లో ప్రధాన అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ చెరో 47 శాతంతో సమానంగా నిలిచారు. అంతేగాక అక్టోబర్ 20–23 మధ్య న్యూయార్క్‌టైమ్స్/సియెనా కాలేజీ జరిపిన జాతీయ సర్వేలోనూ వారిద్దరికీ చెరో 48 శాతం దక్కడం విశేషం. ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంలో ఎవరు మెరుగనే అంశంపై ఫైనాన్షియల్ టైమ్స్, మిషిగన్ వర్సిటీకి చెందిన రాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సరిపిన సంయుక్త సర్వేలో మాత్రం ట్రంప్‌ది పైచేయి అయింది. ఆయనకు 44 శాతం, హారిస్‌కు 43 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. మొత్తమ్మీద చూస్తే మాత్రం ట్రంప్ కంటే హారిస్‌కు 1.7 శాతం మొగ్గున్నట్టు 538 పోల్ ట్రాకర్ విశ్లేషణలో తేలింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గేందుకు 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో కనీసం 270 ఓట్లు సాధించాలి. -
USA Presidential Elections 2024: ఊరిస్తున్న ఊయల సేవ
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు కురుక్షేత్రాన్ని తలపిస్తూ అత్యంత హోరాహోరీగా సాగుతోంది. రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ ప్రత్యర్థి కమలా హారిస్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు. ఎన్నికలు మొత్తం 50 రాష్ట్రాల్లోనూ జరుగుతున్నా వాటిలో ఏడు రాష్ట్రాలు విజేతను తేల్చడంలో అతి కీలకంగా మారాయి. స్వింగ్ స్టేట్స్‌గా పిలిచే ఆ ఏడింటిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. వాటిలో మెజారిటీ రాష్ట్రాలను నెగ్గిన వారే అధ్యక్షుడు కావడం ఖాయంగా కన్పిస్తోంది. అయితే అన్ని పోల్స్‌లోనూ ఆ ఏడు రాష్ట్రాల్లో కూడా ట్రంప్, హారిస్ దాదాపుగా సమవుజ్జీలుగా నిలుస్తుండటం విశేషం. దాంతో ఈ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారిపోయాయి. స్వింగ్ స్టేట్స్ అంటే...?అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీల్లో ఏదో ఒకదానివైపు స్పష్టంగా మొగ్గేవే ఉంటాయి. వాటిని సేఫ్ స్టేట్స్‌గా పిలుస్తారు. పారీ్టల జెండా రంగుపరంగా వీటిని బ్లూ (డెమొక్రాట్), రెడ్ (రిపబ్లికన్) స్టేట్స్‌గా పేర్కొంటారు. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఒక ఎన్నికలో డెమొక్రాట్లకు జై కొడితే మరో ఎన్నికలో రిపబ్లికన్ అభ్యరి్థని గెలిపిస్తుంటాయి. వీటినే స్వింగ్ స్టేట్స్, బ్యాటిల్‌గ్రౌండ్ స్టేట్స్, పర్పుల్ స్టేట్స్ (డెమొక్రాట్, రిపబ్లికన్ పారీ్టల్లో ఎటైనా మొగ్గవచ్చనే అనే అర్థంలో) అని పిలుస్తుంటారు. అభ్యర్థులు సేఫ్ స్టేట్స్పై పెద్దగా దృష్టి పెట్టరు. ఈ స్వింగ్ స్టేట్స్ను తమవైపు తిప్పుకోవడం, లేదా అవి ప్రత్యరి్థకి జై కొట్టకుండా చూడటంపైనే శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరిస్తారు. దాంతో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ హోరాహోరీ ప్రచారం సాగుతుంటుంది. మీడియాలోనూ, బయటా భారీగా ఎన్నికల ప్రకటనలు ఇతరత్రా హడావుడి కూడా స్వింగ్ స్టేట్స్లోనే ఎక్కువ. ఆ 7 రాష్ట్రాలివే... ఈ ఎన్నికల్లో 7 రాష్ట్రాలు స్వింగ్ స్టేట్లుగా అందరి దృష్టినీ తమవైపు తిప్పుకుంటున్నాయి. అవి... పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా, అరిజోనా, మిషిగన్, నెవడా, విస్కాన్సిన్పెన్సిల్వేనియా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 19 రాష్ట్ర జనాభా 1.3 కోట్లు 2020లో విజేత బైడెన్ (82 వేల ఓట్ల మెజారిటీ) ఏడు స్వింగ్ స్టేట్లలో అత్యధిక ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్న రాష్ట్రం. దాంతో సహజంగానే ఇక్కడ గెలుపు అభ్యర్థులకు అత్యంత కీలకం. ట్రంప్‌పై గత జూలైలో హత్యాయత్నం జరిగింది పెన్సిల్వేనియాలోనే. ఇది బైడెన్ సొంత రాష్ట్రం కూడా. ఆర్థిక పరిస్థితులు ఈసారి ఇక్కడ కీలక ఎన్నికల అంశంగా మారాయి. ధరాభారంతో పెన్సిల్వేనియావాసులు నానా కష్టాలు పడుతున్నారు. అమెరికా అంతటినీ అతలాకుతలం చేస్తున్న జీవన వ్యయం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మరీ ఎక్కువగా పెరిగిందని మార్కెట్ సర్వే సంస్థ డేటాసెంబ్లీ సర్వేలో తేలింది. కనీవిని ఎరగని రీతిలో రాష్ట్రంలో ప్రతి పదిమందిలో ఏకంగా ఎనిమిది మంది ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నట్టు ఆ సర్వే తేలి్చంది! ఇది హారిస్‌కు బాగా ప్రతికూలంగా మారవచ్చంటున్నారు. తాజా పరిస్థితి తాజా పోల్ ఆఫ్ పోల్స్‌లో హారిస్ 0.9 శాతం ఆధిక్యంలో ఉన్నారునార్త్ కరోలినా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 16 రాష్ట్ర జనాభా 10.8 కోట్లు 2020లో విజేత ట్రంప్ (74 వేల ఓట్ల మెజారిటీ) గత ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన ఏకైక స్వింగ్ స్టేట్ ఇదే. ఈసారి కూడా బైడెన్ ప్రత్యరి్థగా ఉన్నన్ని రోజులూ ట్రంప్ హవాయే నడిచింది. ఆయన తప్పుకుని హారిస్ తెరపైకి రావడంతో పరిస్థితి మారుతూ వచి్చంది. దాంతో ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడం ట్రంప్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ విషయాన్ని ఆయన కూడా అంగీకరించారు. అందుకే ఇక్కడ వీలైనన్ని ఎక్కువ ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. తాజా పరిస్థితి ట్రంప్ 0.9 శాతం ఆధిక్యంలో ఉన్నారుమిషిగన్ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 15 రాష్ట్ర జనాభా కోటి 2020లో విజేత బైడెన్ (1.5 లక్షల ఓట్ల మెజారిటీ) గత ఎన్నికల్లో బైడెన్‌కు మంచి మెజారిటీ కట్టబెట్టిన రాష్ట్రమిది. కానీ రాష్ట్రంలో ప్రబల శక్తిగా ఉన్న అరబ్ అమెరికన్లు హారిస్ పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆమె ఇజ్రాయెల్‌కు మద్దతిస్తుండటం బాగా ప్రతికూలంగా మారేలా కని్పస్తోంది. దీన్ని గమనించి కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ విషయంలో హారిస్ కాస్త విమర్శనాత్మక వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు. అది ఇక్కడ అరబ్ ఓటర్ల ఆగ్రహాన్ని ఏ మేరకు చల్లార్చిందన్నది ఫలితాలొస్తే గానీ తేలదు. తాజా పరిస్థితి కమలా హారిస్ 0.8 శాతం ఆధిక్యంలో ఉన్నారుజార్జియా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 16 రాష్ట్ర జనాభా 1.1 కోట్లు 2020లో విజేత బైడెన్ (13 వేల ఓట్ల మెజారిటీ)గత ఎన్నికల్లో అత్యంత వివాదాస్పదంగా నిలిచిన ఫలితం జార్జియాదే. ఇక్కడి ఓటమిని ఒప్పుకునేది లేదంటూ ట్రంప్ భీషి్మంచారు. ఏకంగా ఫలితాలనే మార్చేసేందుకు ప్రయతి్నంచి భంగపాటుకు గురయ్యారు. దీనికి సంబంధించి నాలుగు కేసులను కూడా ఎదుర్కొంటున్నారు. ఒకదాంట్లో ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలగా మూడింట్లో విచారణ కొనసాగుతోంది. జార్జియా జనాభాలో ఏకంగా మూడో వంతు ఆఫ్రికా మూలాలున్నవారే. 2020లో బైడెన్‌ను గెలిపించినా, ఆయన నాలుగేళ్ల పాలనపై వారంతా పెదవి విరుస్తున్నారు. ఇది హారిస్‌కు ప్రతికూలంగా మారేలా కని్పస్తోంది. కానీ ఇక్కడ నిర్వహించిన ముమ్మర ప్రచారం పరిస్థితిని ఆమెకు కాస్త అనుకూలంగా మార్చిందంటున్నారు. తాజా పరిస్థితి ట్రంప్ ఏకంగా దాదాపు 2 శాతం ఆధిక్యం కనబరుస్తున్నారుఅరిజోనా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 11 రాష్ట్ర జనాభా 74 లక్షలు 2020లో విజేత బైడెన్ (10 వేల ఓట్ల మెజారిటీ) 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయంలో ఈ రాష్ట్రానిదే కీలక పాత్ర. ఇక్కడ డెమొక్రాట్ అభ్యర్థి గెలవడం 1990ల తర్వాత అదే తొలిసారి కావడం విశేషం. మెక్సికోతో అరిజోనా వందలాది కిలోమీటర్ల మేరకు సరిహద్దులను పంచుకుంటుంది. దాంతో సహజంగానే వలసలు ఇక్కడ కీలక ఎన్నికల అంశంగా మారాయి. తాను గెలిస్తే ఏకంగా 10 లక్షల మంది అక్రమ వలసదారులను వెనక్కు పంపుతానన్న ట్రంప్ ప్రకటన అరిజోనావాసులను బాగా ఆకట్టుకుంటోంది. వలసలపై హారిస్ విధానాల పట్ల వారు పెదవి విరుస్తున్నారు. అయితే అబార్షన్లపై ట్రంప్ స్పష్టమైన వైఖరంటూ ప్రకటించకపోవడంపై ఆయనకు కాస్త మైనస్‌గా మారే ఆస్కారముంది. మహిళా ఓటర్లలో హారిస్ పట్ల స్పష్టమైన మొగ్గు కనిపిస్తుండటం కూడా డెమొక్రాట్లకు సానుకూలాంశమే. తాజా పరిస్థితి ట్రంప్ ఏకంగా దాదాపు 3 శాతం ఆధిక్యం కనబరుస్తున్నారువిస్కాన్సిన్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 10 రాష్ట్ర జనాభా 59 లక్షలు 2020లో విజేత బైడెన్ (21 వేల ఓట్ల మెజారిటీ) స్వతంత్ర అభ్యరి్థగా తొలుత బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనెడీ మేనల్లుడు రాబర్ట్ ఎఫ్.కెనెడీకి విస్కాన్సిన్లో భారీ జనాదరణ దక్కింది. ఆగస్టు చివర్లో ఆయన బరి నుంచి తప్పుకుని ట్రంప్‌కు మద్దతు పలకడం రిపబ్లికన్లకు బాగా కలిసొచ్చేలా ఉంది. దీనికి తోడు గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టెయిన్ ఇక్కడ డెమొక్రాట్ల అవకాశాలకు మరింత గండి కొట్టేలా కని్పస్తున్నారు. ఆయన్ను ఎలాగైనా బరిలోంచి తప్పించాలని డెమొక్రాట్లు చివరిదాకా ప్రయతి్నంచినా కుదర్లేదు. తాజా పరిస్థితి హారిస్ ఒక్క శాతం కంటే తక్కువ ఆధిక్యంలో ఉన్నారునెవడా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 6 రాష్ట్ర జనాభా 32 లక్షలు 2020లో విజేత బైడెన్ (34 వేల ఓట్ల మెజారిటీ) కొద్ది ఎన్నికలుగా వరుసగా డెమొక్రాట్లకే జై కొడుతూ వస్తున్న రాష్ట్రమిది. కానీ ఈసారి మాత్రం ట్రంప్ ఖాతాలో పడే సూచనలు గట్టిగానే కని్పస్తున్నాయి. పోల్ ట్రాకింగ్ సంస్థ 538 తాజా గణాంకాల ప్రకారం ట్రంప్‌కు ఈ రాష్ట్రంలో ఆదరణ బాగా పెరిగింది. హారిస్ రంగప్రవేశంతో పరిస్థితి కాస్త మారినా ఇప్పటికీ ఇక్కడ ట్రంప్‌దే పై చేయిగా కన్పిస్తోంది. అమెరికాలోకెల్లా నిరుద్యోగం అతి ఎక్కువగా (5.1 శాతం)ఉన్న రాష్ట్రం నెవడానే. ఇక్కడ లాటిన్ అమెరికన్లు చాలా ఎక్కువ. వారంతా చాలీచాలని వేతనాలతో సతమతమవుతున్నారు. వారిలో హోటళ్లలో వెయిటర్లు తదితర పనులు చేసేవాళ్లే ఎక్కువ. టిప్పులపై పన్ను ఎత్తేస్తామన్న ట్రంప్ హామీ వారిని బాగా ఆకట్టుకుంది. దాన్ని గమనించిన హారిస్ తాను కూడా ఈ మేరకు గత ఆగస్టులోనే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రం వారిలో ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. తాజా పరిస్థితి హారిస్ ఒక్క శాతం కంటే తక్కువ ఆధిక్యంలో ఉన్నారు – సాక్షి, నేషనల్ డెస్క్ -
Haryana: ఆ 11 స్థానాల్లో పోటాపోటీ
హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా తారస్థాయికి చేరుతోంది. పాలక బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ బలహీనపడిందన్న (2019లో మొత్తం పది సీట్లనూ బీజేపీ నెగ్గగా.. 2024లో కాంగ్రెస్ సగం స్థానాలను చేజిక్కించుకుంది) విపక్షాల వాదనకు బలం చేకూర్చేందుకు కాంగ్రెస్‌కు, దాన్ని పూర్వపక్షం చేసేందుకు అధికార పారీ్టకి ఈ ఎన్నికల్లో ఘన విజయం అత్యవసరంగా మారింది. ఢిల్లీ , పంజాబ్ వెలుపల ఉనికి చాటుకోజూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఈ ఎన్నికలు అగి్నపరీక్ష వంటివే. కాంగ్రెస్ సమరోత్సాహంతో కనిపిస్తుండగా, పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతతో సతమతమవుతోంది. రైతు ఆందోళనల వంటివి ఆ పారీ్టకి మరింత సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో పలు అసెంబ్లీ స్థానాలు ఈ రెండు పారీ్టలతో పాటు జేజేపీ, ఐఎన్ఎల్డీ వంటి ప్రాంతీయ పార్టీల హోరాహోరీ పోరుకు వేదికగా మారాయి. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఆ హాట్ సీట్లపై ఫోకస్... గర్హీ సంప్లా కిలోయీ హుడా కంచుకోట రాష్ట్ర కాంగ్రెస్ దిగ్గజం, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా కంచుకోట. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇప్పటిదాకా ఓటమే ఎరగని నేత ఆయన. దాంతో ఈ స్థానాన్ని నిలుపుకోవడం కాంగ్రెస్‌కు అత్యవసరం. 25 శాతం జనాభాతో హరియాణాలో ప్రబల శక్తిగా ఉన్న జాట్ల ఓట్లు ఈ స్థానంలో నిర్ణాయకం. వారిలో తమపై తీవ్ర ఆగ్రహం నెలకొని ఉండటం బీజేపీని కలవరపెడుతోంది. హుడాపై గాంగ్స్టర్ రాజేశ్ హుడా భార్య మంజు హుడాను బీజేపీ పోటీకి నిలిపింది. ఆమె తండ్రి మాజీ పోలీసు అధికారి కావడం విశేషం.బద్లీ బీజేపీకి గట్టి పరీక్షబీజేపీ నుంచి రాష్ట్ర పార్టీ మాజీ చీఫ్, జాట్ నేతఓం ప్రకాశ్ ధన్‌ఖడ్ బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేశారు. 2014లో నెగ్గగా 2019లో కాంగ్రెస్ ప్రత్యర్థి కుల్దీప్ వత్స్ చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారీ ఆయనతోనే అమీతుమీ తేల్చుకుంటున్నారు. హోదాల్ బరిలో పీసీసీ చీఫ్ ఈ ఎస్సీ రిజర్వుడు స్థానంలో కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ బరిలో ఉన్నారు. దాంతో బీజేపీ గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన జగదీశ్ నాయర్‌ను పక్కన పెట్టి హరీందర్‌సింగ్ రామ్ రతనన్కు టికెటిచి్చంది.హిస్సార్ బీజేపీకి జిందాల్ సవాల్! అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ కీలకంగా మారే ఈ స్థానం ఈసారి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలోనే ధనిక మహిళ అయిన పారిశ్రామిక దిగ్గజం సావిత్రి జిందాల్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగడమే అందుకు కారణం. ఆమె కుమారుడు నవీన్ జిందాల్ ఇటీవలే బీజేపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి విజయం సాధించడం తెలిసిందే. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కమల్ గుప్తాకే హిస్సార్ టికెట్ దక్కింది. కాంగ్రెస్ నుంచి మళ్లీ రామ్నివాస్ రారా బరిలో ఉన్నారు.తోశాం వారసత్వ పోరుకాంగ్రెస్ నుంచి పూర్వాశ్రమంలో క్రికెట్ అడ్మిని్రస్టేటర్ అయిన అనిరుధ్ చౌదరి బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి శ్రుతి చౌదరితో ఆయన తలపడుతున్నారు. వీరిద్దరూ దివంగత సీఎం బన్సీలాల్ మనవడు, మనవరాలు కావడం విశేషం. దాంతో అన్నాచెల్లెళ్ల పోరు అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారి రాజ్యసభకు ఎన్నికైన కిరణ్ చౌదరి కూతురే శ్రుతి.కైతాల్ బరిలో సుర్జేవాలా జూనియర్ కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా 2019లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి లీలారామ్ గుర్జర్ చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారి గుర్జర్‌పై సుర్జేవాలా కుమారుడు ఆదిత్య బరిలో ఉన్నారు. తండ్రి ఓటమికి ఆయన బదులు తీర్చుకోగలరా అన్నది ఆసక్తికరంగా మారింది. జూలానా హై ప్రొఫైల్ పోరు ఈసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న స్థానం. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ఒలింపియన్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆ పార్టీ తరఫున ఇక్కడి నుంచి ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. బీజేపీ కెపె్టన్ యోగేశ్ బైరాగికి టికెట్ ఇవ్వగా, ఆప్ నుంచి మరో రెజ్లర్ కవితా దేవి బరిలో దిగడం విశేషం. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల వివాదంలో మోడీ సర్కారు వ్యవహార శైలి బీజేపీకి ఇక్కడ బాగా ప్రతికూలంగా మారవచ్చని అంటున్నారు.అంబాలా కంటోన్మెంట్ కాంగ్రెస్‌కు ఇంటి పోరుబీజేపీ దిగ్గజం అనిల్ విజ్ ఇక్కడ ఆరుసార్లు గెలిచారు. మనోహర్‌లాల్ ఖట్టర్ మంత్రివర్గంలో హోంమంత్రిగా చక్రం తిప్పారు. కానీ నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో చేరకుండా దూరం పాటిస్తున్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు వేళ బీజేపీ నేతలేవరూ వెంట లేకపోవడం చర్చకు తావిచ్చింది. కాంగ్రెస్ ఇక్కడ ఇంటి పోరుతో సతమతం అవుతోంది. పరీ్వందర్ సింగ్ పరీని బరిలో దించగా పార్టీ సీనియర్ నేత నిర్మల్‌సింగ్ కుమార్తె చిత్రా శర్వర ఇండిపెండెంట్‌గా పోటీకి దిగారు. గత ఎన్నికల్లో కూడా ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేసి అనిల్ విజ్ చేతిలో 20 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.ఉచానా జేజేపీ అడ్డా! మాజీ డిప్యూటీ సీఎం, జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా సిట్టింగ్ స్థానం. రాష్ట్రంపై జేజేపీ పట్టు సడలుతున్న దృష్ట్యా ఈసారి ఇక్కడ ఘన విజయం ఆయనకు అత్యంత కీలకం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేజేపీ 10 సీట్లు నెగ్గి కింగ్ మేకర్‌గా ఆవిర్భవించడం, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారడం తెలిసిందే. బీజేపీ నుంచి దేవేందర్ అత్రి, కాంగ్రెస్ నుంచి బ్రిజేంద్ర సింగ్ ఆయనకు పోటీ ఇస్తున్నారు. మాజీ ఐఏఎస్ అయిన బ్రిజేంద్ర గత మార్చిలోనే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు.లడ్వా సీఎం సైనీకి పరీక్ష! గత మార్చిలో ఖట్టర్ స్థానంలో సీఎంగా పగ్గాలు చేపట్టిన సైనీ ఇక్కడ బరిలో ఉన్నారు. ఉప ఎన్నికల్లో ఖట్టర్ కంచుకోట అయిన కర్నాల్ నుంచి గెలిచిన ఆయన ఈసారీ అక్కడినుంచే పోటీ చేయాలని భావించారు. కానీ బీజేపీ అధిష్టానం ఆదేశం మేరకు పారీ్టకి అత్యంత సురక్షితమైన ఈ స్థానం నుంచి అయిష్టంగానే బరిలో దిగారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నెగ్గడం విశేషం. సిట్టింగ్ ఎమ్మెల్యే మేవాసింగ్ ఈసారి కూడా బరిలో అన్నారు.ఎలెనాబాద్ ఐఎన్ఎల్డీకి అగి్నపరీక్ష జేజేపీ మాదిరిగానే నానాటికీ ప్రభ తగ్గుతున్న ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ)కు ఇక్కడ విజయం ప్రతిష్టాత్మకంగా మారింది. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి అభయ్ సింగ్ చౌతాలా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి భారత్ సింగ్ బెనివాల్, బీజేపీ నుంచి ఆరెస్సెస్ మూలాలున్న అమర్ చంద్ మెహతా ఆయనకు పోటీ ఇస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్, హారిస్ హోరాహోరీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య పోరు హోరాహోరీగా కొనసాగుతోందని ఆదివారం విడుదలైన న్యూయార్క్ టైమ్స్, సియానా సర్వేలో వెల్లడైంది. ఆస్తులను ఎక్కువ చేసి చూపి రుణాలు పొందడం, పార్లమెంట్‌పైకి తన మద్దతుదారులను ఉసిగొల్పిన ఘటనల్లో నిందితుడిగా ఉన్నాసరే సగం ఓటర్లు ట్రంప్‌కు మద్దతు పలుకుతున్నట్లు సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా చూస్తే దాదాపు 48 శాతం మంది ట్రంప్‌కు మద్దతు పలికారు. కమలా హారిస్ విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఆధిక్యత చూపారు. నెవడా, జార్జియా, నార్త్ కరోలినా, అరిజోనాలో ఇద్దరికీ గట్టి పోటీ ఉంది. మిషిగన్, విస్కాన్సిన్లో హారిస్ ఒక శాతం ఆధిక్యం కనబరిచారని, పెన్సిల్వేనియాలో గట్టి పోటీ నెలకొందని సీబీఎస్ న్యూస్, యూగౌ సర్వేలో తేలింది. బిగ్ డిబేట్‌కు వేళాయే!వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య అధ్యక్ష చర్చ మంగళవారం జరగనుంది. పలు అంశాలపై తమ వైఖరిని తెలుపుతూ అమెరికన్లను మెప్పించడానికి అధ్యక్ష అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఏబీసీ న్యూస్ ఛానెల్లో ఈ బిగ్ డిబేట్ మంగళవారం రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6:30 గంటలకు) జరగనుంది. ఫిలడెలి్ఫయాలోని నేషనల్ కాస్టిట్యూషన్ సెంటర్లో ఏబీసీ న్యూస్ యాంకర్లు డేవిడ్ ముయిర్, లిన్సే డేవిస్ దీన్ని నిర్వహిస్తారు. 90 నిమిషాల పాటు ఈ చర్చ ఉంటుంది. అధ్యక్ష చర్చ నిర్వహించే యాంకర్లు మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. -
Rajasthan Election 2023: హామీలా, హిందుత్వా?
ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఇక్కడ పాలక కాంగ్రెస్, విపక్ష బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. నెల రోజులకు పైగా రాష్ట్రవ్యాప్తంగా పోటాపోటీ ప్రచారంతో ఇరు పార్టీలూ హోరెత్తించాయి. బీజేపీ ప్రచారానికి స్వయంగా ప్రధాని మోదీయే సారథ్యం వహించి కాలికి బలపం కట్టుకుని సుడిగాలి పర్యటనలు చేశారు. కాంగ్రెస్ తరఫున ప్రచార భారాన్ని ప్రధానంగా సీఎం అశోక్ గెహ్లోతే మోశారు. మోదీ మేనియాకు ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీ తోడై తాము అందలమెక్కుతామని బీజేపీ నమ్మకం పెట్టుకుంది. గెహ్లోత్ వరుసబెట్టి ప్రకటిస్తూ వచి్చన జనాకర్షక పథకాలు ఆ ఆనవాయితీకి ఈసారి అడ్డుకట్ట వేసి తమను మరోసారి గెలిపిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే పోలింగ్ తేదీ సమీపించినా ఓటరు నాడి మాత్రం ఎవరికీ అందడం లేదు. ఏ పార్టికీ అనుకూలంగా స్పష్టమైన ‘వేవ్’ కనిపించడం లేదు. దాంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టిలూ సర్వశక్తులూ ఒడ్డాయి. కాంగ్రెస్ ప్రధానంగా ఎన్నికల హామీలపై ఆధారపడగా బీజేపీ ఎప్పట్లాగే హిందుత్వ కార్డును వీలైనంతగా ప్రచారంలో పెట్టింది... పథకాలకు థమ్సప్... గెహ్లోత్ ప్రభుత్వ పనితీరుపై క్షేత్రస్థాయిలో పెద్దగా వ్యతిరేకత కన్పించకపోవడం విశేషం. సంక్షేమ పథకాలపై ప్రజల్లో బాగా సంతృప్తి ఉంది. సంక్షేమ పథకాలు పేదలను ఎంతగానో ఆదుకున్నాయని బీజేపీ మద్దతుదారులు కూడా అంగీకరిస్తుండటం విశేషం! చిరంజీవి బీమా యోజన లక్షల మంది పేద, మధ్య తరగతి కుటుంబీకులకు ఎంతో ఆదుకుందని సవాయ్ మధోపూర్‌లో పవన్ మీనా అనే పాన్ షాప్ యజమాని చెప్పుకొచ్చారు. ‘‘నేను బీజేపీ మద్దతుదారును. కానీ ఈసారి కాంగ్రెస్ పాలనలో ప్రజలకు జరిగిన మంచి కొట్టొచ్చినట్టు కని్పస్తూనే ఉంది’’ అన్నారాయన. కాకపోతే ఇదంతా ఓట్ల రూపంలో బదిలీ అవుతుందా అన్నది చూడాలంటూ ముక్తాయించారు. 10 లక్షల ఉద్యోగాలతో పాటు తక్షణం కులగణన చేపట్టి, మైనారిటీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కలి్పస్తామని కూడా కాంగ్రెస్ తాజా మేనిఫెస్టోలో చెప్పింది. ఇవన్నీ ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చూడాల్సిందే. శాంతిభద్రతలపై పెదవి విరుపు... పథకాల సానుకూలతకు శాంతిభద్రతల విషయంలో జనంలో నెలకొన్న తీవ్ర అసంతృప్తి బాగా గండి కొట్టేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మాత్రం దారుణంగా దిగజారిందని మెజారిటీ ప్రజలు వాపోతుండటం ప్రమాద ఘంటికేనంటున్నారు. ముఖ్యంగా ఇస్లాంను కించపరిచాడంటూ గతేడాది ఉదయ్‌పూర్‌లో ఓ టైలర్ షాప్ యజమానిని పట్టపగలే తల నరికి చంపిన తీరును ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. దానికి తోడు మహిళలపై అకృత్యాలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిన తీరుపైనా జనం గగ్గోలు పెడుతున్నారు. పథకాల ఫలాలు అందరికీ అందుతున్నా ప్రాణాలకే భద్రత లేకపోతే ఏం లాభమని కోటాలో బట్టల షాపు నడుపుతున్న వినోద్ చేసిన వ్యాఖ్యలు జనాభిప్రాయానికి అద్దం పట్టేవే. ‘‘గెహ్లోత్ ప్రభుత్వం బాగానే పని చేసింది. కానీ మార్పు అవసరం. బీజేపీ వస్తే బాగుంటుంది’’ అన్నారాయన. బీజేపీకి ఓటేయడం చాలా అవసరమని కోటాకు చెందిన అమృత్ చౌహాన్ అనే ఆటోడ్రైవర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ధోరణినే ప్రతిఫలించాయి. ‘‘శాంతిభద్రతలను చక్కదిద్దాలంటే యూపీ తరహా పాలన కావాల్సిందే. అప్పుడే ప్రధాని మోదీ చెబుతున్న హిందూ రాష్ట్ర స్థాపన సాధ్యం. కాంగ్రెస్ కేవలం ఒక్క సామాజిక వర్గానికే కొమ్ము కాస్తూ వస్తోంది’’ అని చౌహాన్ చెప్పుకొచ్చారు. ఈసారీ 199 సీట్లలోనే పోలింగ్! రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రంతో తెర పడనుంది. పోలింగ్ శనివారం జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రాష్ట్రాలతో కలిపి డిసెంబర్ 3న వెల్లడవుతాయి. అయితే రాష్ట్రంలో 200 అసెంబ్లీస్థానాలకు గాను 199 స్థానాల్లో మాత్రమే పోలింగ్ జరగనుంది! కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్‌సింగ్ కున్నర్ మృతితో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా 199 స్థానాల్లోనే పోలింగ్ జరుగుతుండటం రాష్ట్ర చరిత్రలో ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం! బీఎస్పీ అభ్యర్థుల మృతి కారణంగా 2018లో, 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాగే ఒక అసెంబ్లీ స్థానంలో పోలింగ్ నిలిచిపోయింది. -
Rajasthan elections 2023: ఏం ‘మాయ’ చేయనుందో...!
రాజస్తాన్‌లో హోరాహోరీ తలపడుతున్న అధికార కాంగ్రెస్, బీజేపీ గెలుపోటములను మాయావతి సారథ్యంలోని బీఎస్పీ మరోసారి ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. దాంతో పోలింగ్ మరో పది రోజుల్లోకి వచ్చిన వేళ రాష్ట్రంలో రాజకీయం రసకందాయంలో పడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 30 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను బీఎస్పీ ప్రభావితం చేసింది. ఏకంగా 6 స్థానాలను దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో ఏకంగా 60 స్థానాలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సాక్షి, న్యూఢిల్లీ కుల సమీకరణలతో... ► రాజస్తాన్ ఓటర్లలో 18 శాతం మంది ఎస్సీలు, 9 శాతం మంది ముస్లింలున్నారు. దాంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో మాదిరిగానే ఇక్కడ కూడా దళిత–ముస్లిం ఫార్ములానే బీఎస్పీ నమ్ముకుంది. ► గత ఎన్నికల్లో ఇదే ఫార్ములాతో బీఎస్పీ 6 అసెంబ్లీ స్థానాలు నెగ్గడమే గాక 4 శాతం ఓట్లు రాబట్టింది. ► బీఎస్పీ ప్రభావం చూపిన మరో 30 స్థానాల్లో బీజేపీ ఏకంగా 17 స్థానాలను అతి తక్కువ మెజారిటీతో కాంగ్రెస్‌కు కోల్పోయింది. ► మరో మూడింట స్వతంత్రులు గెలిచారు. ఈ దెబ్బకు బీజేపీ అధికారాన్నే కోల్పోవాల్సి వచి్చంది. ► ఆ 17 స్థానాల్లో బీజేపీ గెలుచుంటే ఆ పార్టీ బలం 73 నుంచి 90 స్థానాలకు పెరిగేది. ► 100 సీట్లు నెగ్గిన కాంగ్రెస్ 83కు పరిమిత ► మయ్యేది. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు మెరుగ్గా ఉండేవి. ఈసారి కూడా... ► ఈసారి కూడా రాష్ట్రంలో 200 సీట్లకు గాను ఏకంగా 183 చోట్ల బీఎస్పీ బరిలో దిగింది. మిషన్–60 లక్ష్యంతో దూసుకెళ్తోంది. ► ఆ 60 స్థానాల్లో బలమైన సోషల్ ఇంజనీరింగ్ చేసింది. ఈ విషయంలో పార్టీ నిపుణుడైన రామ్‌జీ గౌతమ్ వ్యూహాలను అమలు చేస్తోంది. ► ధోల్పూర్, భరత్పూర్, కరౌలీ, సవాయి మధోపూర్, దౌసా, ఆళ్వార్, సికర్, ఝుంఝును, ఛురు, హనుమాన్‌గఢ్, గంగానగర్, బార్మేర్, జాలోర్, నగౌర్, జైపూర్ రూరల్ జిల్లాల్లోని 60 నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టి ప్రచారం చేస్తోంది. ► ఈ నెల 17 నుంచి 20 వరకు మాయావతి భరత్పూర్, అల్వార్, ఖేత్రి జిల్లాల్లో ఏకంగా 8 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ► దాంతో గాలి తమకు మరింత అనుకూలంగా మారుతుందని బీఎస్పీ అభ్యర్థులు అంటున్నారు. -
Afghanistan- Panjshir: పంజ్‌షీర్‌లో హోరాహోరీ
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తమ స్వాదీనంలో లేని ఒకే ఒక్క ప్రావిన్స్ పంజ్‌షీర్‌ను ఎలాగైనా తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలతో ఆ లోయలో హోరాహోరీ పోరాటం జరుగుతోంది. తాలిబన్లు, వారిని గట్టిగా ప్రతిఘటిస్తున్న నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్తాన్ (ఎన్ఆర్ఎఫ్ఏ) ఎవరికి వారే తమదే పై చేయిగా ఉందని చెప్పుకుంటున్నారు. ఖవాక్ మార్గం వద్ద వందలాది మంది తాలిబన్లతో జరిగిన పోరులో 700 మందికిపైగా తాలిబన్లు మరణించారని, మరో 600 మందిని నిర్బంధించి జైళ్లలో ఉంచామని ఎన్ఆర్ఎఫ్ఏ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. మరోవైపు తాలిబన్లు పంజ్‌షీర్ ప్రావిన్స్ బజారక్‌లోకి ప్రవేశించి గవర్నర్ కార్యాలయాన్ని చుట్టుముట్టినట్టుగా వార్తలు వచ్చినప్పటికీ అదంతా ఉత్తదేనని తేలింది. పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో ఉన్న ఏడు జిల్లాలకు గాను నాలుగు జిల్లాలైన షూతల్, అనాబా, ఖింజ్, ఉనాబాలపై పట్టు సాధించామని తాలిబన్ అధికార ప్రతినిధి బిలాల్ కరిమి వెల్లడించినట్టుగా అస్వాకా న్యూస్ ఏజెన్సీ కథనాన్ని ప్రచురించింది. మానవీయ సంక్షోభాన్ని నివారించండి: యూఎన్‌కు సలేహ్ లేఖ పంజ్‌షీర్ లోయపై తాలిబన్లు భీకరంగా దాడి చేస్తున్నారని, ఈ లోయలో మానవీయ సంక్షోభం ముంచుకొస్తుందని అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్ల దాడుల్ని అడ్డుకొని మానవీయ సంక్షోభం నుంచి లోయని కాపాడాలంటూ ఆయన ఐక్యరాజ్యసమితి(యూఎన్)కి ఒక లేఖ రాశారు. తమ లోయకి తాలిబన్లు కమ్యూనికేషన్లని కట్ చేశారని, ఆర్థికంగా కూడా దిగ్బంధిస్తున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం తాలిబన్ల దాడిని అడ్డుకొని చర్చల ద్వారా ఒక రాజకీయ పరిష్కారానికి కృషి చెయ్యాల్సిన అవసరం ఉందని సలేహ్ ఆ లేఖలో పేర్కొన్నారు. చర్చలకు సిద్ధం: మసూద్ తాలిబన్లు పంజ్‌షీర్, అంద్రాబ్‌ల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటే వారితో చర్చలకు సిద్ధమని ఎన్ఆర్ఎఫ్ఏ నాయకుడు అహ్మద్ మసూద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘శాంతియుతంగా తాలిబన్లతో విభేదాలను పరిష్కరించుకోవడానికి కట్టుబడి ఉన్నాం. వివిధ గ్రూపులు, తెగలతో సమ్మిళిత అధికార వ్యవస్థ నెలకొంటుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు. దేశీయ విమానాలు షురూ... కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం నుంచి పరిమిత సంఖ్యలో దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. జాతీయ విమానసంస్థ అరియానా అఫ్గాన్ ఎయిర్‌లైన్స్‌హెరాత్, కాందహార్, బాల్ఖ్‌లకు విమానాలను నడిపింది. రాడార్ వ్యవస్థ లేనందువల్ల పగటి పూట మాత్రమే విమానాలు నడుస్తున్నాయి. కాబూల్ విమానాశ్రయం పునరుద్ధరణకు ఖతార్, టర్కీ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సేవల పునరుద్ధరణ మానవతా సాయానికి వీలుకలి్పస్తుందని యూఎన్ పేర్కొంది. -
సెనేట్‌లోనూ హోరాహోరీ
వాషింగ్టన్: అమెరికా సెనేట్‌లో 35 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. ఈ సారి సెనేట్‌లో ఎలాగైనా పై చేయి సాధించాలన్న డెమొక్రాట్ల ఆశ నెరవేరుతుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష ఎన్నికలతో పాటుగా అమెరికన్ కాంగ్రెస్‌లో ఉభయ సభలకి ఎన్నికలు జరిగాయి. ఎగువ సభ అయిన సెనేట్‌లో మొత్తం 100 స్థానాలకు గాను 35 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సెనేట్‌లో ప్రస్తుతం రిపబ్లికన్లదే పై చేయిగా ఉంది. 100 స్థానాలకు గాను రిపబ్లికన్ల పార్టీకి 53 సీట్లు ఉంటే, డెమొక్రాట్ల బలం 45గా ఉంది. సభలో ఇద్దరు స్వతంత్రులు కూడా ఉన్నారు. మొత్తం 35 సీట్లకు ఎన్నికలు జరిగితే అందులో 21 స్థానాలను ఆయా పార్టీలు నిలబెట్టుకునే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. మిగిలిన 14 సీట్లు కీలకంగా మారాయి. 35 సీట్లకు ఎన్నికలు జరిగితే అందులో 23 స్థానాలు రిపబ్లికన్లవి కాగా, 12 స్థానాలు డెమొక్రాట్లవి. సెనేట్‌పై ఈ సారి ఎలాగైనా పట్టు సాధించాలని డెమొక్రాట్లు భావిస్తున్నారు. వారి ఆశ నెరవేరాలంటే రిపబ్లికన్ల స్థానాలు కనీసం మూడింటినైనా గెలవాల్సి ఉంది. డెమొక్రాట్ల ఖాతాలో రెండు, రిపబ్లికన్లకి ఒకటి ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం కొలొరాడో, అరిజోనా రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు చెందిన రెండు స్థానాల్లో డెమొక్రాట్లు పాగా వేస్తే, అలబామాలోని డెమొక్రాటిక్ పార్టీకి చెందిన స్థానాన్ని రిపబ్లికన్లు సొంతం చేసుకున్నారు. కొలొరాడోలో రిపబ్లికన్ పార్టీకి చెందిన కోరి గార్డెనర్‌పై డెమొక్రాటిక్ పార్టీ మాజీ గవర్నర్ జాన్ హికెన్‌లూపర్ విజయం సాధించారు. ఇక అరిజోనాలో డెమొక్రాటిక్ అభ్యర్థి మాజీ ఆస్ట్రోనాట్ మార్క్ కెల్లీ విజయం సాధించారు. డెమొక్రాటిక్ ఖాతాలో ఉన్న అలబామాలో రిపబ్లికన్ అభ్యర్థి టామీ ట్యూబర్ విల్లె విజయకేతనం ఎగురవేశారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ సారి మెయిల్ ఇన్ ఓట్లు ఎక్కువగా పోల్ కావడంతో తుది ఫలితలు రావడం మరింత ఆలస్యం కావొచ్చు. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ
వాషింగ్టన్: కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారి పీడ ఎప్పటికి విరగడ అవుతుంది? ఈ ప్ర«శ్నలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మరో ప్రశ్న అందరినీ వేధిస్తోంది. అదే ప్రపంచానికి పెద్దన్న ఎవరు కాబోతున్నారు? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది? రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. దీంతో స్వింగ్ స్టేట్స్ ఎటువైపు మొగ్గు చూపిస్తాయన్నది కీలకంగా మారింది. నవంబర్ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల పైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఎన్నికల ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో స్వింగ్ స్టేట్స్ (ఆఖరి నిమిషం వరకు ఏ పార్టీ వైపు ఉంటారో అంచనా వేయలేని రాష్ట్రాలు) ఎటు వైపు మొగ్గుతాయన్న ఉత్కంఠ రేగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రజాదరణ ఓట్లు సాధించిన వారే పీఠాన్ని దక్కించుకుంటారని చెప్పలేం. గత ఎన్నికల్లో ట్రంప్ కంటే పాపులర్ ఓట్లు 30 లక్షలు అధికంగా హిల్లరీ క్లింటన్ సాధించినప్పటికీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ట్రంప్‌కి ఎక్కువ రావడంతో ఆయన అ«ధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థి పార్టీకి ఓటు వేస్తారు. ఆ ఓటింగ్ రాష్ట్రాల స్థాయిలోనే ఉంటుంది. అక్కడ ఎన్నిౖకైన ప్రతినిధులంతా కలిసి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. దేశం మొత్తమ్మీద 50 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ కొలంబియాలో జనాభా ప్రాతిపదికన ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటాయి. దేశవ్యాప్తంగా 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకిగాను 270 ఓట్లు సాధించిన వారే అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. స్వింగ్ రాష్ట్రాలు ఇవే ఈసారి ఎన్నికల్లో మొత్తం 14 రాష్ట్రాల్లో ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతారో తెలీని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు అమెరికా ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో జనం నాడి తెలియకుండా ఎప్పుడూ లేదు. టెక్సాస్ (38 ఎలక్టోరల్ ఓట్లు), ఫ్లోరిడా (29 ), పెన్సిల్వేనియా (20), ఒహియో (18), మిషిగాన్ (16), జార్జియా (16 ), నార్త్ కరోలినా (15), వర్జీనియా (13), అరిజోనా (11), విస్కాన్సన్ (10), మిన్నెసోటా (10), నెవడా (6), అయోవా (6) న్యూ హ్యాంప్‌షైర్ (4) రాష్ట్రాల్లో ప్రతీ నెల జనం మూడ్ మారిపోతున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. తాజా సర్వేల్లో జార్జియా, అయోవా, టెక్సాస్ రాష్ట్రాల్లో ట్రంప్‌కి మొగ్గు కనిపిస్తూ ఉంటే, మిగిలిన స్వింగ్ స్టేట్స్లో బైడెన్ దూసుకుపోయే అవకాశాలున్నట్టుగా రియల్ క్లియర్ పాలిటిక్స్ సర్వే అంచనా వేస్తోంది. టెక్సాస్, జార్జియా రాష్ట్రాలు ఎప్పుడూ రిపబ్లికన్ల వైపు ఉంటాయి. ఈసారి కూడా ట్రంప్‌వైపే ఉన్నప్పటికీ మొగ్గు చాలా స్వల్పంగా ఉందని అంచనా. అందుకే టెక్సాస్, జార్జియా రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వెయ్యాలని బైడెన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో ప్రచారం కోసం డాలర్ల వరద పారిస్తున్నారు. జాతీయ స్థాయిలో చూసుకుంటే ట్రంప్ కంటే బైడెన్‌కు 10 పాయింట్లు అధికంగా ఉన్నాయి. ఫ్లోరిడా ఫ్యాక్టర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 1964 నుంచి ఫ్లోరిడాలో నెగ్గిన వారికే అధ్యక్ష పదవి దక్కుతూ వస్తోంది. 1992 ఎన్నికలు మాత్రం దీనికి మినహాయింపుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ట్రంప్‌కి 48.6% ఓట్లు వస్తే, హిల్లరీకి 47.4% ఓట్లు వచ్చాయి. అంతకు ముందు ఎన్నికల్లో బరాక్ ఒబామా 51% ఓట్లను సాధించి అవలీలగా అధ్యక్ష పదవిని అందుకున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల ఆలోచనా ధోరణి వినూత్నంగా ఉంటుంది. యువ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఓటర్లు అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగే డిబేట్లను విన్నాక ఓటుపై నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికలకి ముందు మూడు సార్లు సెప్టెంబర్ 29, అక్టోబర్ 7, అక్టోబర్ 15న అధ్యక్ష అభ్యర్థుల మధ్య బిగ్ డిబేట్స్ జరుగుతాయి. ఈ డిబేట్స్‌లో ట్రంప్, బైడెన్ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో వివరిస్తారు. ఆ డిబేట్స్ తర్వాత పరిస్థితులన్నీ మారే అవకాశాలైతే ఉన్నాయి. ఈ డిబేట్స్‌లో ట్రంప్ నెగ్గుతారని 47% మంది అమెరికన్లు భావిస్తూ ఉంటే, బైడెన్ వైపు 41% మంది మాత్రమే ఉన్నారు. కరోనా ఎఫెక్ట్ ఈసారి ఎన్నికల్లో కరోనా వైరస్ నంబర్ గేమ్‌ని మార్చేస్తుందని అంచనాలున్నాయి. కరోనా కట్టడిలో ట్రంప్ వైఫల్యంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అగ్రరాజ్యంలో ఎన్నికల నాటికి వైరస్ కారణంగా 2 లక్షల 60 వేల వరకు మరణాలు నమోదవుతాయని అంచనాలున్నాయి. ట్రంప్ చెబుతున్నట్టుగా అక్టోబర్ సర్ప్రైజ్ సాకారమై పోలింగ్ తేదీలోగా వ్యాక్సిన్ వస్తే ఆయనకి మళ్లీ అనుకూలంగా పరిస్థితులు మారే అవకాశాలున్నాయి. ఆర్థిక మాంద్యం, పెరిగిపోతున్న నిరుద్యోగం, జాతివివక్ష, వలసవిధానం, వాతావరణంలో మార్పులు వంటి అంశాలు కూడా ఎన్నికల్లో ప్రధాన అంశాలు కానున్నాయి. -
కర్ణాటకలో 70 శాతం పోలింగ్
బెంగళూరు/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించడంతో పాటు.. కాంగ్రెస్, బీజేపీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపడ్డ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు దాదాపు 5 కోట్ల మంది ఓటర్లలో 70 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలు దాటినా చాలామంది ఓటర్లు క్యూలైన్లలో వేచివున్న నేపథ్యంలో ఓటింగ్ శాతం మరింత పెరగవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కాగా 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 71.4 శాతం పోలింగ్ నమోదైంది. కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు గాను 222 చోట్ల పోలింగ్ జరగ్గా.. బీజేపీ అభ్యర్థి మృతితో జయనగర స్థానంలో, భారీగా నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు బయటపడటంతో ఆర్ఆర్ నగర్ స్థానంలో ఓటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అన్ని స్థానాల్లో అధికార కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీ పోటీపడగా.. అనేక స్థానాల్లో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ గట్టి పోటీనిచ్చింది. 2,600 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో మొత్తం 2,600 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోగా.. కాంగ్రెస్ నుంచి ప్రస్తుత సీఎం సిద్దరామయ్య, మాజీ సీఎంలు బీఎస్ యడ్యూరప్ప, జగదీష్ షెట్టార్లు బీజేపీ తరఫున, హెచ్డీ కుమార స్వామి జేడీఎస్ నుంచి ఎన్నికల బరిలో తలపడ్డారు. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఈసీ అధికారులు పేర్కొన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంల్లో లోపాలు తలెత్తగా.. పలు చోట్ల కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకు న్నాయి. ‘సాయంత్రం 6 గంటల వరకూ మొత్తం 70 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాలు మినహా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది’ అని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్ సిన్హా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ఓటింగ్ పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ప్రాంత ఓటర్లు అత్యధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మధ్యాహ్నం వరకూ కొంత మందకొడిగా సాగిన ఓటింగ్ ఆ తర్వాత ఊపందుకుంది. ఉదయాన్నే ఓటు వేసిన వారిలో ప్రముఖ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, సినీ నటులు రమేశ్ అరవింద్, రవిచంద్రన్, మైసూరు రాజవంశీకుడు యదువీర్ కృష్ణదత్త వడియార్లు ఉన్నారు. -
ప్రచార ఘట్టం సమాప్తం
బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక సమరం చివరి అంకానికి చేరింది. శనివారం (మే12న) జరగనున్న ఎన్నికల కోసం ప్రధానపార్టీల హోరాహోరీ సుదీర్ఘ ప్రచారానికి గురువారంతో తెరపడింది. చివరి 20రోజులు ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు ఇక పోలింగ్‌పై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ప్రచారఘట్టం ముగిసిన తర్వాత కన్నడనాట రాజకీయ పరిస్థితులు, అధికార కాంగ్రెస్ పాలనపై ప్రజల అభిప్రాయం, నరేంద్రమోదీ రాకతో పరిస్థితుల్లో మార్పు, కులాల ప్రభావం తదితర అంశాలపై రాష్ట్ర పలు ప్రాంతాల్లోని ఓటర్లను ‘సాక్షి’ కలిసింది. వారు వెల్లడించిన, తాజా పరిస్థితులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. యూపీ ఎన్నికలతో పోలిక కర్ణాటక ఎన్నికలను కొందరు గతేడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికలతో పోలుస్తున్నారు. బెంగళూరు నగరంలోని మల్లేశ్వరం నియోజకవర్గానికి చెందిన వీరభద్రయ్య అనే ఉద్యోగి మాట్లాడుతూ.. అఖిలేశ్ సర్కారు బాగా పనిచేసిందని, ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించారని మీడియా బాగా ప్రచారం చేసిందని.. కానీ మొదటి నాలుగేళ్లపాటు ఆ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి దారుణంగా ఉన్న విషయాన్ని కావాలని పక్కన పెట్టిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అలాగే కర్ణాటకలో సిద్దరామయ్య పాలన బాగుందని, ఇందిరా క్యాంటీన్లు ప్రవేశపెట్టారని మీడియా ప్రచారం చేస్తోందని.. కానీ ప్రభుత్వ పథకాల్లో అవినీతి, 3,500 మంది రైతుల ఆత్మహత్యలను అస్సలు పట్టించుకోలేదంటున్నారు. మతఘర్షణలతో యూపీ అట్టుడికిందని.. అదే తరహాలో ఇక్కడ కూడా టిప్పుసుల్తాన్ జయంతి రోజు ఇద్దరు వీహెచ్‌పీ కార్యకర్తల హత్య, పీఎఫ్ఐ తీవ్రవాదాల చేతుల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు చనిపోవటం యూపీ పరిస్థితులతో సరిపోతుందన్నారు. అఖిలేశ్ మళ్లీ గెలుస్తారని సర్వేలు చెప్పినా ఫలితాలు వేరేలా ఉన్నట్లు.. కర్ణాటకలోనూ కాంగ్రెస్ గెలుస్తుందన్న సర్వేల ఫలితాలు వేరేలా ఉంటాయన్నారు. ‘లింగాయత్ మైనార్టీ హోదా’ కీలకం రెండువైపులా పదునున్న కత్తిని చేతిలో పట్టుకున్న సిద్దరామయ్య.. అది తనకే చేటుచేస్తుందని అర్థం చేసుకోలేకపోయారని సదాశివనగర్‌లోని నంజుండప్ప, వీరకేశవ, మధుసూదన్‌లు అభిప్రాయపడ్డారు. టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహించటం, లింగాయత్‌లకు మైనార్టీ హోదా అధికార కాంగ్రెస్‌కే నష్టం చేస్తాయన్నారు. సిద్ధరామయ్య ‘విభజించు–పాలించు’ నినాదంతో సమాజాన్ని కులం, మతం ఆధారంగా విభజించారన్నారు. లింగాయత్‌లకు మైనారిటీ హోదాపై ఈ వర్గంలో మెజారిటీల అసంతృప్తితో పాటు హిందువుల్లోని పలు వర్గాలను కాంగ్రెస్‌కు దూరం చేస్తుందన్న విషయాన్ని సీఎం గుర్తించలేకపోయారన్నారు. ఇది కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం చేస్తుందని అభిప్రాయపడ్డారు. కులంపైనే పార్టీల దృష్టి కన్నడ రాజకీయ పార్టీలు కులసమీకరణలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి. ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లో ఇదే ఫార్ములాను అన్ని పార్టీలూ అమలుచేశాయి. కన్నడలో ‘అహిందా’ (బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలు) ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ బోలెడు ఆశలు పెట్టుకుంది. ఇది తమకు స్థిరమైన ఓటు బ్యాంకుగా భావిస్తోంది. సిద్దరామయ్య కురబ సామాజికవర్గం నేత. రాష్ట్ర జనాభాలో వీరు 7%. ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, ఎస్టీలు, బలహీన వర్గాలను కలుపుకుంటే (అందరూ కలిపి 43%) తమదే విజయమని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. ఇదే క్రమంలో బ్రాహ్మణులు, లింగాయత్, వక్కలిగలకు మేం వ్యతిరేకం కాదని సిద్దరామయ్య ప్రచారంలో పేర్కొన్నారు. అయితే లింగాయత్ ఓటు తమ చేజారదని బీజేపీ భావిస్తోంది. దీనికి తోడు మోదీ ప్రచారమంతా ఈ ‘అహిందా’ వర్గాన్ని ప్రభావితం చేసేలాగే సాగింది. కాంగ్రెస్‌కు దళితులపై ప్రేమ లేదని, ఖర్గేను సీఎం చేయకపోవడమే అందుకు తార్కాణమని మోదీ చెప్పటం కచ్చితంగా ప్రభావం చూపుతుందని బీజేపీ భావిస్తోంది. అటు, కన్నడ ఓటర్లలో 11% వక్కలిగ ఓటర్లు ఉన్నారు. 15–16% ఉన్నట్లు ఆ సామాజికవర్గం 54 నియోజకవర్గాల్లో నిర్ణయాత్మకంగా ఉన్నారు. దీంతో కనీసం 40 సీట్లు తమ పార్టీకి వస్తాయని జేడీఎస్ భావిస్తోంది. పీఠం నీదా – నాదా? కన్నడనాట ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాదని ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. కొందరు ఓటర్లు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో 30కి పైగా సీట్లు గెలిచే జేడీఎస్ కింగ్‌మేకర్ కానుంది. ఒకవేళ బీజేపీ, జేడీఎస్ కలిసి ప్రభు త్వాన్ని ఏర్పాటు చేస్తే తమకే సీఎం పీఠం ఇవ్వాలని కుమారస్వామి పట్టుబట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మెజార్టీ స్థానాలు తాము గెలిచామని, కేబినెట్లో శాఖల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇస్తామని బీజేపీ ప్రతిపాదించినా.. జేడీఎస్ వినకపోవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ ఈ డిమాండ్‌కు బీజేపీ ఒప్పుకోకపోతే, జేడీఎస్ ఓ షరతుతో కాంగ్రెస్‌తో జట్టు కట్టే అవకాశాన్ని కొట్టి పారేయలేమంటున్నారు. సిద్దరామయ్య కాకుండా మిగిలిన వారెవరినైనా సీఎంగా ప్రకటిస్తే మద్దతు ఇవ్వాలని జేడీఎస్ భావిస్తున్నట్లు సమాచారం. -
కన్నడ ఎన్నికల ఖర్చు 13 వేల కోట్లు!
బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న కర్ణాటక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో డబ్బుల వరద పారుతోంది. ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థులు.. ఎన్నికల సంఘం సూచించిన మొత్తానికి వంద రెట్లు ఎక్కువ ఖర్చుచేస్తున్నారు. దీంతో కన్నడ అసెంబ్లీ ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలవనున్నాయి. ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుతున్న సమయంలో ఏయే పార్టీలు.. ఎక్కడెక్కడ, ఎంతెంత ఖర్చుచేయబోతున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల ఖర్చు ఎంత? అంశాలపై ఓటర్లతోపాటు పరిశీలకుల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ విశ్లేషకుల మధ్య జరుగుతున్న చర్చల ఆధారంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రతిష్టాత్మక పోరు కాబట్టే.. కర్ణాటక ఎన్నికలు జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలిచి 2019 సార్వత్రిక ఎన్నిలకు శక్తిని కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. దక్షిణభారతంలో పార్టీ మనుగడ కోసం బీజేపీ శాయశక్తులా పనిచేస్తోంది. దీంతో ఇరుపార్టీలు ముఖ్యనేతలను రంగంలోకి దించి విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నాయి.కాంగ్రెస్ తరపున అధ్యక్షుడు రాహుల్, సీనియర్ నేతలు శశిథరూర్, అశోక్ చవాన్, ఉమెన్ చాందీ, సుశీల్ కుమార్ షిండే, రఘువీరారెడ్డి సహా మాజీ కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, జాతీయాధ్యక్షుడు అమిత్ షా సహా కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలను బీజేపీ రంగంలోకి దించింది. సగటున రూ.20 కోట్లు కన్నడ గడ్డపై 224 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నియోజకవర్గంలో ఒక్కో పార్టీ అభ్యర్థి రూ.28 లక్షలు ఖర్చు చేయాలి. కానీ బీజేపీ, కాంగ్రెస్‌లు సగటున రూ.20 కోట్ల మేర ఖర్చు చేస్తున్నాయి. రూ.30–50కోట్లు ఖర్చు చేసేవి, రూ.50–70 కోట్లు, వందకోట్లకుపైగా ఖర్చు చేసే నియోజకవర్గాలూ ఉన్నాయి. సగటున రూ.20 కోట్లుగా లెక్కేసినా.. ఒక్కోపార్టీకి 4,480 కోట్లు ఖర్చవుతుంది. కొన్ని కీలక నియోజకవర్గాల ఖర్చు పరిగణనలోకి తీసుకుంటే.. ఆ మొత్తం రూ.5 వేల కోట్ల పైమాటే. జేడీఎస్‌ను కలుపుకుంటే రూ.13 వేలకోట్లుపైనే ఉంటుందని అంచనా. ఆ మూడు చోట్ల.. 700 కోట్లు కర్ణాటకలో అత్యంత ఖరీదైన ఎన్నిక విజయనగరలో జరగనుంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున ఎంపీవీ కిష్టప్ప, బీజేపీ తరపున హెచ్ రవీంద్ర బరిలో ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్లో కిష్టప్ప రూ.1300 కోట్ల ఆస్తులు చూపించారు. ఈ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. గోవిందరాజనగర్‌లో కిష్టప్ప కుమారుడు ప్రియాకృష్ణ కాంగ్రెస్‌పార్టీ నుంచి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ వీ. సోమన్న బీజేపీ నుంచి రంగంలో ఉన్నారు. అలాగే హోస్కొటే నుంచి ఎంపీవీ నాగరాజు (కాంగ్రెస్), బీజేపీ తరపున మాజీమంత్రి బచ్చేగౌడ కుమారుడు శరత్ బరిలో ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఏ మాత్రం ఖర్చుకు వెనకాడటం లేదు. బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు జేడీఎస్ అభ్యర్థుల ఖర్చు మొత్తం రూ.700 కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది. బాదామీలోనూ బారెడు ఖర్చు బాదామీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, బీజేపీ ఎంపీ శ్రీరాములు మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇద్దరు నేతలకూ ఈ పోరు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఒక్కో అభ్యర్థి 70 నుంచి 90 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయొచ్చని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. పీసీసీ చీఫ్ పరమేశ్వర ప్రాతినిథ్యం వహిస్తున్న తుమకూరు జిల్లా కొరటగేరే, సీఎం కుమారుడు యతీంద్ర ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణతో పాటు పలు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల ఖర్చు భారీగానే ఉందని తెలుస్తోంది. మోదీ మ్యాజిక్ పనిచేయదు శివాజీనగర: ‘కర్ణాటక ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయాయి.. రాష్ట్రంలో ఇక ప్రధాని మోదీ మ్యాజిక్ ఏదీ పనిచేయదు’ అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ఆదివారం బెంగళూరులోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీ ట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వాడుతున్న భాషను ప్రజలు ఛీకొడుతున్నారు. ఒక ప్రధాని నోటి నుంచి ఇలాంటి హీనమైన మాటలను వినాల్సి వస్తుందని వారు ఊహించలేదు’ అని మండిపడ్డారు. ‘2 ప్లస్ 1, టెన్ పర్సెంట్ ప్రభుత్వం, సీధా రూపయ్య’ అంటూ తమపై వ్యాఖ్యానాలు చేయటం ఇలాంటివేనని తెలిపారు. తమపై మోదీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదనీ, సీబీఐ తదితర దర్యాప్తు సంస్థలు ఆయన ఆధీనంలోనే ఉన్నందున విచారణ జరిపించి రుజువు చేయాలని సవాల్ విసిరారు. -
హీరో అవ్వాలంటే నేనున్నా...
విజయవాడ : కామన్ మ్యానే నా సినిమాలో హీరో. తాత.. తండ్రులు... వారి పిల్లలు ఇలా ఎవరికి వారి కుటుంబాలకు చెందిన వారే హీరోలుగా వస్తే సామాన్యుడికి అవకాశం ఎలా వస్తుంది. అందుకే నేను అంతా కొత్త వారికి అవకాశాలు ఇచ్చి వారితో సినిమాలు చేస్తున్నా.. ఇకపై చేస్తానని సినీ దర్శకుడు తేజ అన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను తేజ దర్శించుక ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తేజకు ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం వీఐపీ ల్యాంజ్లో మీడియాతో ముచ్చటించారు. తేజతో ముచ్చట్లు మీ కోసం.. ప్రశ్న : హోరా హోరీ ఏలా ఉండబోతుంది..? జవాబు : సినిమా అంతా కొత్త వారితో చేశాం. మీ విజయవాడ నుంచి ఓ కొత్త కుర్రాడు చైతన్యను విలన్‌గా ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నా. అంతేకాదు చైతన్య ఈ సినిమా కృష్ణాజిల్లాకు డిస్టిబ్యూటర్ కూడా. ప్రశ్న : తేజ సినిమా వచ్చి చాలా కాలం అయినట్లు ఉందీ..? జ : డబ్బులు కోసం సినిమాలు చేయడం తేజకు ఇష్టం ఉండదు. మూడ్ వచ్చినప్పుడే మంచి సినిమాను చేయాలనే భావన కలుగుతుంది. సంతృప్తిగా ఉంటే సినిమా చేస్తా. ప్రశ్న : సినిమా గురించి...? జ : హోరాహోరీ సినిమా దాదాపు 80 శాతం వర్షంలోనే షూటింగ్ చేసుకుంది. హీరోగా దిలీప్, హీరోయిన్గా దక్షలను పరిచయం చేస్తున్నాం. ఇక ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం ఉన్న కర్ణాటకలోని ఆగుంబే అనే ఊరిలోనే చిత్రీకరించాం. ఇక మ్యూజిక్‌ను కోడూరు కళ్యాణ్ చాలా బాగా చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా వచ్చింది. సినిమా ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని అనుకుంటున్నాం. ప్రశ్న : మీ తదుపరి సినిమా...? జ : అడ్వాన్స్ సైన్స్‌తో భవిష్యత్తు ఎలా ఉంటుందనే దానిపై సినిమా చేస్తున్నాం. మైండ్‌తో మెటల్‌ను ఏ విధంగా కంట్రోల్ చేయవచ్చుననేది ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలోనూ అంతా కొత్త వారే. ప్రశ్న : అంతా కొత్త వారికే ప్రాధాన్యత ఇస్తారెందుకు...? జ : తాత హీరో, మనవడు హీరో.. ఇలా అయితే కామన్ మేన్ ఎప్పుడు హీరో అవుతాడు. హీరో అవ్వాలంటే నేనున్నా. మామూలు మనుషులను కూడా హీరోలను చేస్తా. టాలెంట్ ఉన్న వారికి ఛాన్స్ ఇవ్వాలి. నా ద్వారా ఇప్పటి వరకు వెయ్యి మందిని పరిశ్రమకు పరిచయం చేశా. ప్రస్తుతం ఏ చిత్రం చేసినా నేను పరిచయం చేసిన వారు ఉన్నారు. జబర్దస్త్ వంటి కార్యక్రమాల్లోనూ ఉన్నారు. ప్రశ్న : బాహుబలి వంటి సినిమాను ఎప్పుడు చేస్తారు...? జ : బాహుబలి లాంటి సినిమాలు చేయాలంటే చాలా బడ్జెట్ కావాలి. బడ్జెట్ కావాలంటే 7, 8 హిట్స్ కావాలి. నాకు హిట్లు లేవు కదా.. హిట్ వచ్చాక చేస్తా. బాహుబలి రాజుల కాలం పౌరాణిక తరహా ఉంటే నా రాబోయే సినిమాలో అడ్వాన్స్ కథ ఉంటుంది. 2096వ సంవత్సరానికి వెళ్లి ప్రస్తుత కాలం నాటికి వస్తుంది. ప్రశ్న : రాజధాని ప్రాంతంలో సినిమా పరిశ్రమ..? జ : ప్రభుత్వం ఇచ్చే రాయితీలపై ఉంటుంది. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ నాగేశ్వరరావుతో వచ్చి బాగా నిలదొక్కుకుంది. శివ సినిమాతో అక్కడ నుంచి హైదరాబాద్‌లో సినీ రంగం నిలదొక్కుకుంది. అలాగే విజయవాడలో సినిమా షూటింగ్‌లకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని అధికారులు, ప్రభుత్వం చెబుతుంది. త్వరలోనే ఇక్కడ పరిశ్రమ నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నాయి. -
హిట్ కోసం హోరాహోరీ
కొత్త సినిమా గురూ! తెర వెనుక కబుర్లు * విపరీతంగా వర్షపాతం ఉండే కర్ణాటకలోని ఆగుంబెలో ప్రధాన భాగం చిత్రీకరించారు. ఆ చిత్తడి నేలలో జలగలు, పాములు ఎక్కువ. * అతి తక్కువ మంది యూనిట్‌తో చిత్రీకరణ జరిపారు. లొకేషన్లో 23 మందితో, హీరో నుంచి లైట్‌బాయ్ దాకా అందరికీ ఒకే ఫుడ్, ట్రీట్మెంట్తో పొదుపుగా సినిమా తీశారు. * ‘హోరాహోరీ’లో కృత్రిమంగా సృష్టించే షూటింగ్ వాన కూడా రియల్‌గా అనిపించేలా జాగ్రత్త పడ్డారు. ‘రెయిన్ మిషన్’ తయారు చేశారు. * హీరో, హీరోయిన్, విలన్ - ఈ ముగ్గురికీ షూటింగ్ కన్నా ముందే క్యాస్టింగ్ డెరైక్టర్ రామానంద్ దగ్గర ప్రత్యేక శిక్షణనిప్పించారు. ‘చిత్రం’ టైమ్‌లో ఉదయ్ కిరణ్ నుంచి చాలా మంది కొత్తవాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చింది ఆయనే! * కెమేరామన్ దీపక్ భగవంత్ సినిమాల్లోకి రాక ముందు తంజావూరు బృహదీశ్వరాలయంలో అఫిషియల్ ఫొటోగ్రాఫర్. ఈ కొత్త మిలీనియమ్ ప్రారంభంలో టీనేజ్ లవ్‌స్టోరీ ‘చిత్రం’తో తెలుగు సినిమా సరికొత్త ప్రయాణానికి దిశ చూపించిన దర్శకుడు తేజ. ఆ తరువాత ‘నువ్వు - నేను’, ‘జయం’ లాంటి హిట్సిచ్చిన ఈ మాజీ సినిమాటోగ్రాఫర్‌కు మళ్ళీ అంత పెద్ద విజయాలు దక్కలేదు. వైఫల్యా లను ఎదుర్కొంటున్న ఆయన ఈసారి ‘హోరాహోరీ’ (ఉపశీర్షిక ‘ఫైట్ ఫర్ లవ్’)తో ముందుకొచ్చారు. జయము... జయము... టీనేజ్ లవ్‌స్టోరీకి! టీనేజ్ ప్రేమకథల్లో పెద్ద హిట్టయి, ఒక దశ తరువాత తేజ చేతులకూ, కాళ్ళకూ అడ్డంగా మారిన ‘జయం’ సినిమా తాలూకు ప్రభావం ఈ సినిమా మీదా ఉంది. హైదరాబాద్‌లో అభిరామ్ పోలీసు ఉన్నతాధికారి. చెల్లెలు మైథిలి (దక్ష) పెళ్ళికి ఇవ్వాల్సిన కట్నం కోసం బసవన్న (ఛస్వా) అనే పెద్ద గూండా నుంచి పాతిక లక్షలు తీసుకుంటాడు. నడిరోడ్డు మీద హత్యలు చేసిన సదరు గూండావర్యుడు డబ్బు ఇవ్వడానికి వచ్చి, కాబోయే పెళ్ళికూతురును తొలి చూపులోనే మోహిస్తాడు. ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడా నికి వచ్చిన ప్రతి ఒక్కరినీ చంపించేస్తుంటాడు. దాంతో మానసికంగా కుంగిపోయి, మాట్లాడ కుండా తయారై, పెళ్ళికొడుకుల హత్య గుర్తొచ్చి నప్పుడల్లా హీరోయిన్ హిస్టీరికల్గా మారిపోతుం టుంది. తాతయ్య సహా కుటుంబం ఆమెను మామూలు మనిషిని చేయడానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరం తీసుకువెళుతుంది. అక్కడ నుంచి కథ కర్ణాటకలోని వర్షపాతం ఎక్కువగా ఉండే ఆగుంబెలో నడుస్తుంది. హీరోది ఆ ఊరే. తల్లితండ్రులు ఆత్మహత్య చేసుకోవడంతో కష్టపడి ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ బామ్మ (సీమ) చాటున ఉండే టీనేజ్ కుర్రాడు స్కంద (దిలీప్). వరకట్నం వేధింపులకు గురవుతున్న మేనత్తను కాచుకొనే బాధ్యత కూడా అతనిదే. హీరోయిన్ను మామూలు మనిషిని చేయడానికి ఇంట్లోవాళ్ళు కాలేజీకి పంపుతారు. ఆమె ద్వారా ఇంటర్నెట్ సెంటర్ బిజినెస్‌ను నిలబెట్టుకోవాలని హీరో ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో హీరో యిన్‌ను హీరో మామూలు మని షిని చేస్తాడు. వాళ్ళి ద్దరూ ప్రేమలో పడ తారు. మరోపక్క హీరోయిన్ కోసం గాలిస్తున్న విలన్ ఆ ఊరికి వస్తాడు. విలన్ ప్రేమిస్తు న్నది తన లవర్నే అని తెలియని హీరో, అతనికి ‘లవ్ గురు’ అవుతాడు. తీరా విషయం తెలిశాక హీరో, విలన్ ఏం చేశారన్నది మిగతా సినిమా. కొత్త, పాతల సమ్మేళనం గతంలో ఉదయ్‌కిరణ్, నితిన్, నవదీప్ లాంటి కొత్త హీరోలను పరిచయం చేసిన తేజ ఈసారి దిలీప్ అనే పాలకొల్లు కుర్రాణ్ణి తెరపైకి తెచ్చారు. హీరోయిన్ దక్ష ఆకర్షణీయంగా ఉన్నా, హావభావాలు పలికించడానికి కృషి మొదలు పెట్టాలి. ఏకకాలంలో నాలుగు వేర్వేరు సినిమాలు వేసుకొని చూసే వెరైటీ విలన్‌గా ఛస్వా బాగు న్నాడు. దక్షిణాదిని ఒకప్పుడు ఊపేసిన పేరున్న సీనియర్ మలయాళ నటి సీమ - హీరో బామ్మ పాత్రలో కనిపించడం ఫ్రెష్నెస్సే! రచయిత ఎం.వి.ఎస్. హరనాథరావు హీరోయిన్ తాతగా కనిపిస్తారు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలిచ్చి, దర్శకత్వం కూడా వహించడం ఎవరికైనా టఫ్. తేజ కోరి ఆ ఛాలెంజ్‌ను భుజానికెత్తుకున్నారు. కెమేరా కంటితో... ప్రకృతి అందం చెట్టుచేమల మధ్య వర్షం పడుతుండగా తీసిన ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ ప్రాణం. సినిమాటోగ్రాఫర్ దీపక్ భగవంత్ కెమేరా యాంగిల్స్, లైటింగ్, వర్షంలో సన్నివేశాల చిత్రీకరణ, పల్లె వాతావరణాన్ని చిత్రీకరించిన తీరు బాగున్నాయి. కల్యాణి కోడూరి బాణీల్లో పాటలన్నీ ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తాయి. ఆ బాణీలకు పెద్దాడ మూర్తి రచన తోడై, ఒకటి రెండు పాటలు బాగున్నాయి. టైటిల్ థీవుసాంగ్ కొంతకాలం వెంటాడుతుంది. కథ తెలిసిందే! కథనమే... సినిమా మొదటి పావుగంట ఉత్కంఠగా సాగుతుంది. కథ కర్ణాటకకు షిఫ్టయ్యాక, లవ్‌స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం నిదానిస్తుంది. ఒక దశకు వెళ్ళాక, కథ ఎలా ముందుకు సాగుతుందన్నది సగటు ఆడియన్సకు తెలిసిపోతుంది. ఇక, స్క్రీన్‌ప్లే చమత్కారం కోసమే ఆశగా ఎదురు చూస్తాడు. విలన్ కాసేపు పెద్ద రౌడీగా, మరో సారి డి.జి.పి. సైతం తన వెంట వి.ఐ.పి.గా తీసుకొచ్చే బడాబాబుగా సీన్ అవసరాలకు తగ్గట్లు కనిపిస్తారు. బ్లూటూత్‌లో విలన్ పంపే ఫొటోలను అందుకొని ఫ్లెక్సీ ప్రింట్లు తీయడానికి సిద్ధపడే హీరో ఇంకా ట్రెడిల్ మిషన్‌తో నడిచే ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తుంటాడు. ఇంటర్నెట్ సెంటర్ల మధ్య పోటీ ఒకప్పటి టైప్ ఇన్స్టిట్యూ ట్ల బాణీలో నిమిషానికి ఎన్ని అక్షరాలు టైప్ చేస్తారనే ధోరణిలో సాగుతుంది. ‘అలా మొద లైంది’, ‘అంతకు ముందు - ఆ తరువాత’తో ఆకట్టుకున్న నిర్మాత కె.ఎల్. దామోదర్‌ప్రసాద్ ఈ కథను తెరకెక్కించడానికి బాగా శ్రమించారు. అది తెరపై కనిపిస్తుంది. వెరసి, ఇది బాక్సాఫీస్ వద్ద గత వైభవం కోసం ‘ఫైట్ ఫర్ లవ్’ అంటూ తేజ ‘హోరాహోరీ’గా చేసిన పోరాటం. -
నేను చాలా లక్కీ: దిలీప్
ఉదయ్‌కిరణ్, నితిన్, నవదీప్, ప్రిన్స్... ఇలా తేజ పరిచయం చేసిన హీరోల జాబితాలో చేరిన తాజా హీరో దిలీప్. ‘హోరా హోరీ’ ద్వారా సిల్వర్ స్క్రీన్‌పై తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోనున్నాడు. ఫస్ట్ సినిమానే తేజ దర్శకత్వంలో చేయడం తన లక్ అని దిలీప్ అంటున్నాడు. మరిన్ని విశేషాలను ఈ యువహీరో ఈ విధంగా పంచుకున్నాడు. హాయ్ దిలీప్... ఈ రోజు సిల్వర్ స్క్రిన్‌పై మిమ్మల్ని మీరు చూసుకోనున్నారు కదా.. ఎలా అనిపిస్తోంది? డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా. హీరో కావాలనే నా లైఫ్ డ్రీమ్ నెరవేరింది. ఇప్పటికే రషెస్ చూసుకున్నాను. చాలా థ్రిల్ అయ్యాను. ఫస్ట్ సినిమా కదా.. టెన్షన్‌గా ఉందా? అస్సలు లేదండి. కూల్‌గా ఉన్నాను. తేజాగారు మాతో ఓ మంచి సినిమా చేయించారు. చాలా కష్టపడి చేశాం. ఆ కష్టం వృథా కాదు. ఇంతకీ మీదే ఊరు.. ఎంతవరకూ చదువుకున్నారు? వెస్ట్ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మాది. స్కూలింగ్ అంతా అక్కడే. బీటెక్ మాత్రం హైదరాబాద్‌లో చేశాను. మా నాన్నగారు పాలిటెక్నిక్ కాలేజీలో డిమాన్స్ట్రేటర్. అమ్మ హౌస్ వైఫ్. నాకో చెల్లెలు ఉంది. మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ నాకు పూర్తిగా ఉంది. పాలకొల్లు నుంచి అల్లు రామలింగయ్య వంటి మహానటులు, దాసరి, కోడి రామృకష్ణ, రవిరాజా పినిశెట్టి వంటి మహా దర్శకులు వచ్చారు. సెంటిమెంట్‌గా ఆలోచిస్తే మీరూ పెద్ద స్టార్ అవుతారన్న మాట? అది జరగాలనే కోరుకుంటున్నానండి. ఎందుకంటే, హీరో కావాలనే కోరిక నెరవేరింది. సినిమాలు నా ఫుల్ టైమ్ ప్రొఫెషన్ అని ఫిక్స్ అయ్యా. కష్టపడే గుణం నా దగ్గర ఉంది కాబట్టి, నా కష్టానికి తగ్గ సక్సెస్‌ని ఆ దేవుడు ఇస్తాడని నమ్ముతున్నాను. ‘హోరా హోరీ’కి ఎలా అవకాశం వచ్చింది? బీటెక్ పూర్తి చేశాక వైజాగ్ సత్యానంద్‌గారి దగ్గర యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. ఆ కోర్స్ పూర్తయ్యాక డ్యాన్స్, ఫైట్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పుడే తేజాగారు ‘హోరా హోరీ’ కోసం ఆర్టిస్టులు కావాలని ప్రకటించారు. అప్లయ్ చేస్తే ఆడిషన్స్‌కి రమ్మన్నారు. అప్పుడేమనిపించింది? ఆఫీసుకు వెళితే అప్పటికే చాలామంది ఉన్నారు. నా వంతు రాగానే లోపలికి వెళ్లాను. యాక్టింగ్‌లో కొన్ని వేరియేషన్స్ చేసి చూపించమని అడిగారు. చేశాను. అప్పటికప్పుడే సెలక్టెడ్ అన్నారు. అంటే.. మీరు లక్కీ అన్నమాట? మొదటి సినిమాకే తేజాగారితో చేసే అవకాశం రావడం అంటే లక్కీయే కదా. పైగా ఆర్టిస్ట్‌గా అది నా మొదటి ఆడిషన్స్. మొదటి రోజే ఓకే కావడం చాలా ఆనందం అనిపించింది. సెలక్ట్ కాగానే ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరికి చేశారు? నాకు మా అమ్మా, నాన్న తర్వాతే ఎవరైనా. ముందు వాళ్లకి ఫోన్ చేసి చెప్పాను. చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఆ తర్వాత కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పాను. సరిగ్గా చేయకపోతే ‘తేజ కొడతాడట’ అని ఎవరైనా భయపెట్టారా? ఆ మాట అన్నవాళ్లు ఉన్నారు. కానీ, తేజాగారు చెంప చెళ్లుమనిపించినా ఓకే అనుకునే షూటింగ్‌కి వెళ్లాను. స్కూల్, కాలేజ్ డేస్‌లో ఏ సబ్జెక్ట్ టీచర్ స్ట్రిక్ట్‌గా ఉంటే మనం అందులో మంచి మార్కులు తెచ్చుకుంటాం. సో.. గురువులు స్ట్రిక్ట్‌గా ఉంటే మనకే మేలు జరుగుతుంది. నేను తేజాగారి దగ్గరికెళ్లినప్పుడు నటన గురించి నాకు ఐదు, పది శాతం తెలిసి ఉంటుందేమో. కానీ, ఈ సినిమా పూర్తి చేసి బయటికొచ్చేటప్పుడు 70 శాతం తెలిసింది. తేజాగారితో సినిమా చేస్తే, ఇక ఏ దర్శకుడి దగ్గరైనా ఈజీగా చేసేయొచ్చు. కర్నాటకలోని ఆగుంబే లొకేషన్ చాలా డేంజరస్ కదా.. అక్కడ షూటింగ్ చేసినప్పుడు రిస్క్ అనిపించిందా? కళ్లెదుటే పాములు కనిపించేవి. వాటిని దాటుకుంటూ సీన్స్ చేసేవాణ్ణి. అలాగే, పదిహేను అడుగుల ఎత్తు ఉన్న గోడ మీద నుంచి దూకేటప్పుడు కాలు పట్టేసింది. ఓ వారం రోజులు నడవలేకపోయాను. ఎంత రిస్క్ అయినా తేజాగారు చెప్పినట్లుగా చేయడం వల్ల ఈజీ అనిపించేది. అలాగే, డెరైక్షన్ డిపార్ట్మెంట్లో రామానంద్గారని ఉన్నారు. ఆయన సహకారాన్ని మర్చిపోలేను. ఈ సినిమా సక్సెస్‌పై మీ నమ్మకం? హండ్రెడ్ పర్సంట్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఇప్పటికే పాటలు సక్సెస్ అయ్యాయి. తేజాగారు చాలా బాగా తీశారు. పెద్ద హిట్ అవుతుంది. సినిమా రంగం అంటే అంత ఈజీ కాదు.. బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలతో కూడా పోటీ పడాలి. అసలు మీకేమైనా బ్యాగ్రౌండ్ ఉందా? నాకెలాంటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేదు. ఇప్పుడు పోటీ గురించి కూడా ఆలోచించడంలేదు. నాకు తెలిసిందల్లా కష్టపడి యాక్ట్ చేయడం. అదే నన్ను పైకి తెస్తుందనే నమ్మకం వంద శాతం ఉంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు వేరే అవకాశాలేమైనా వచ్చాయా? కొంతమంది ఫోన్ చేశారు. కానీ ఈ చిత్రం విడుదలయ్యాక కమిట్ అవ్వాలనుకుంటున్నాను. అది కూడా తేజాగారి గెడైన్స్, నిర్మాత దామోదరప్రసాద్గారి సలహాతోనే తదుపరి సినిమాలు సెలక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. -
వాళ్లు రైట్... నేనే రాంగ్!
తేజ అంటేనే ఓ ఫైర్‌బ్రాండ్ డెరైక్టర్. కొత్త ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్లను పరిచయం చేయడంలో ఆయనది సెపరేట్ స్టయిల్. ఆయన ఏదైనా బోల్డ్‌గా మాట్లాడతారు. లేటెస్ట్గా తీసిన ‘హోరా హోరీ’ మీద తేజ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తేజ చాలా విషయాలు ముచ్చటించారు. సక్సెస్ కోసమే ఈ ‘హోరా హోరీ’ అనుకోవచ్చా...? (నవ్వుతూ).. కథ పరంగా చెప్పాలంటే.. ‘ఫైట్ ఫర్ లవ్’. నా పరంగా చెప్పాలంటే ఫైట్ ఫర్ సక్సెస్. రిస్కీ లొకేషన్లో షూటింగ్ చేశారు కదా.. దాని గురించి? కథానుగుణంగా అత్యధిక వర్షపాతం ఉన్న ఆగుంబే (కర్నాటక) ప్రాంతంలో తీశాం. అది కింగ్ కోబ్రాలకు హెడ్ క్వార్టర్స్లాంటి లొకేషన్. పాములు కనిపించేవి. నేను ఆర్టిస్ట్‌లను హింసపెడతానేమో కానీ పాముల్ని, ఇతర మూగజీవాలను హింసించను. నా సినిమా యూనిట్‌ని హింసపెట్టడం నా ఇంటి పెళ్లి కోసం కాదు. సినిమా భవిష్యత్తు కోసం... వాళ్ల భవిష్యత్తు కోసం. మేకింగ్ పరంగా ఏదైనా ప్రత్యేకత ఉందా? ఈ సినిమాని ‘ఫోర్త్ వాల్’ స్టయిల్లో తీశా. నాలుగు గోడలు ఉన్న గదిలో కూర్చుని యూనిట్ సభ్యులం మాట్లాడుతుంటాం. మూడు గోడలు మేమైతే నాలుగో గోడ ప్రేక్షకులు. అంటే.. సినిమా మొదలైన ఐదు నిమిషాలకు ప్రేక్షకులు స్క్రీన్ లోకి వెళ్లిపోయినట్లుగా భావిస్తారు. కళ్ల ముందు జరుగుతున్న నిజంలా భావిస్తారు. ఆస్కార్ అవార్డ్ పొందిన హాలీవుడ్ చిత్రం ‘బర్డ్ మ్యాన్’ ఈ స్టయిల్లో రూపొందినదే. ఇప్పటివరకూ తెలుగులో ఈ స్టయిల్లో ఎవరూ చేయలేదు. కాకపోతే, మా బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకుని ‘బర్డ్ మ్యాన్’ స్థాయిలో తీయలేం కాబట్టి, మాకు తగ్గట్టుగా తీశాం. తక్కువ బడ్జెట్లో ముగించడానికి పొదుపుగా వ్యవహరించారట? మామూలుగా సినిమాకి 24 శాఖలు పని చేస్తాయంటారు కదా. ఈ చిత్రానికి మహా అయితే ఐదారు డిపార్ట్మెంట్స్ చేసి ఉంటాయి. పని చేసింది జస్ట్ 23 మంది మాత్రమే. అలాగే హీరో, డెరైక్టర్, లైట్ బోయ్స్.. ఇలా అందరికీ ఒకే రకం ఫుడ్డే. వడ్డించేవాళ్లను కూడా పెట్టుకోలేదు. బఫే పద్ధతిలో క్యూలో నిలబడి తినేవాళ్లం. నేనూ లైన్లోనే. ఎందుకంటే ఫుడ్, నిద్ర దగ్గర రాజు-పేద అనే తేడా ఉండదు. మా లొకేషన్లో కుర్చీలు ఉండేవి కాదు. నేను కూర్చోను. ఎవర్నీ కూర్చోనిచ్చేవాణ్ణి కాదు. టీలు ఇచ్చేవాళ్లు ఉండేవారు కాదు. తక్కువ సభ్యులతో సినిమా చేయడంలో ఓ వెసులుబాటు ఉంటుంది. 20 మందిని సెలైన్స్ అనడం ఈజీ. 200 మందితో సినిమాలు తీసే డెరైక్టర్స్‌కి మెగాఫోన్ అవసరం ఉంటుంది. ఆ మెగాఫోన్‌లో కూడా మెల్లిగా మాట్లాడరు. అరుస్తూనే ఉంటారు. నేను అరవను. మైల్లిగా చెబుతాను. పైగా.. ఈడు కొడతాడు అనే పేరుంది కదా నాకు. అందుకని సెలైంట్‌గా చేసేస్తారు. మరి.. ఈ సినిమా టైమ్‌లో ఎవరినైనా కొట్టారా? హీరోయిన్ దక్ష ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఓ సీన్లో హీరోని చాచి లెంపకాయ కొట్టాలి. కొట్టిన తర్వాత ఏడుస్తూ డైలాగ్ చెప్పే బదులు నవ్వింది. దాంతో చెంప మీద జస్ట్ అలా అన్నాను. ఏడ్చింది. అంతే. సీన్ ఓకే అయిపోయింది. మీరు ఇబ్బందిపెట్టారని, ఇక మీతో సినిమా చేయనని ఈ చిత్రసంగీత దర్శకుడు కల్యాణి కోడూరి అన్నారు..? (నవ్వుతూ). సినిమాకి ఏం కావాలో అది పోరాడి పోరాడి చేయించుకున్నా. నాకు నా భార్యాపిల్లలు సెకండరీ. సినిమాయే ఫస్ట్. నేనలా ఉంటాను కాబట్టి నా టీమ్ కూడా అలానే ఉండాలనుకుంటాను. నాలా వాళ్లెలా ఉంటారు? అందుకే వాళ్లే రైట్... నేను రాంగ్. నేను పని పిచ్చోణ్ణి. ఒక్కోసారి ‘ఇతనితో పని చేయడం కష్టం’ అని నిర్మాత దామోదర ప్రసాద్‌గారితో కల్యాణి అనేవారు. మర్నాడు నేను ఫోన్ చేసేవాణ్ణి. వచ్చేవారు. వర్క్ మీద లవ్ ఉన్నవాళ్లు అన్నీ మర్చిపోతారు. ఆయన మంచి టెక్నీషియన్. నాతో సినిమాలెందుకు చేయరు.. చేస్తారు. ‘హోరా హోరీ’ ఎలాంటి సినిమా? సినిమాలు రెండు రకాలు. బి. నర్సింగరావుగారు తీసిన ‘దాసి’ ఆర్ట్ సినిమా. కమర్షియల్ సినిమాలు రెండో రకం. మన కమర్షియల్ సినిమాల్లో హీరో భూమ్మీద నిలబడకుండా స్ప్రింగులు కట్టుకుని గాల్లో ఎగరడం, సుమోలు గాల్లో లేవడం లాంటివన్నీ ఉంటాయి. ఇది బ్రేక్ అవ్వాలి. అప్పుడే సినిమా డెవలప్ అవుతుంది. ‘పాత్ బ్రేకింగ్’ మూవీస్ అంటారు. గతంలో ‘సత్య’ వంటి సినిమాతో రామ్‌గోపాల్ వర్మగారు హిందీలో పాత్ బ్రేక్ చేశారు. ఇప్పుడు ‘క్వీన్’ వంటి సినిమాలు పాత్ బ్రేకింగ్. తమిళంలో కూడా ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. అవి ఆర్ట్ ఫిలింలా ఉంటూ కమర్షియల్‌గా ఉంటాయి. కానీ తెలుగులో అలాంటివి రావు. ఈ సినిమా ద్వారా అటు ఆర్ట్, ఇటు కమర్షియల్‌ని కలపడానికి ట్రై చేశాను. రషెస్ చూసినవాళ్లు రియల్ లైఫ్ చూస్తున్నట్లు ఉందన్నారు. ఇది సక్సెస్ అయితే తెలుగు సినిమా డెఫినెట్‌గా మారొచ్చు. అందరూ ఇలాంటి సినిమా చేయాలనుకుంటారు. సినిమాల గురించి ఎవరైనా ఏదైనా కామెంట్ చేసేస్తుంటారు.. అలాంటివి విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఈ మధ్య సినిమా లెంగ్త్ గురించి మాట్లాడేవాళ్లు ఎక్కువైపోయారు. మొన్న ఎవరో సినిమా కొనడానికి వచ్చి ‘ఇంతకన్నా లెంగ్త్ ఉంటే చూడరు’ అన్నారు. ఈ లెంగ్త్ అనే పిచ్చితో ఎడిటర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి ప్లాన్ చేసి, తెలుగు సినిమాని చంపేశారు. అసలు లెంగ్త్కీ, సినిమాకీ సంబంధం ఏంటి? ఏ సినిమా ఎంత లెంగ్త్ ఉండాలో డిసైడ్ చేసేది కథ. హాలీవుడ్ చిత్రాలు ‘టైటానిక్’, ‘అవతార్’, హిందీ ‘లగాన్’ వంటి చిత్రాల లెంగ్త్ దాదాపు మూడు గంటలు పైనే. వాటిని చూడలేదా? రామాయణాన్ని రెండు గంటల్లో, మహాభారతాన్ని నాలుగు గంటల్లో చెప్పగలుగుతామా? దమ్మున్న కథను నాలుగు గంటలైనా చూస్తారు. లెంగ్తీ చిత్రాలను చూసే ఓపిక ప్రేక్షకులకు పోయిందేమో? స్క్రీన్ మీద జరిగేదంతా అబద్ధం అని తెలిసి కూడా ప్రేక్షకుడు టికెట్ కొనుక్కుని ‘ఓకే.. నన్ను ఇడియట్‌ని చెయ్యి’ అని ప్రిపేర్ అయ్యి, సీట్లో కూర్చుంటాడు. అతను తన భార్యను, పిల్లలను బైక్ మీద కూర్చోబెట్టుకుని రద్దీ రోడ్లు దాటి, థియేటర్‌కి తీసుకొచ్చి, కుర్చీలో సెటిల్ అవుతాడు. కూర్చోగానే సినిమా ఒక్క ఊపుతో స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి వేగంగా పరిగెత్తుతుంది. దాంతో ప్రేక్షకులు కామెడీ ట్రాక్స్‌కి కనెక్ట్ అవుతున్నారు కానీ, ఎమోషన్‌తో కనెక్ట్ కావడంలేదు. ఎమోషన్‌తో ఎందుకు కనెక్ట్ కావడంలేదంటే లెంగ్త్ ఇవ్వడంలేదు. ప్రేక్షకులు స్టార్స్‌తో కనెక్ట్ అవ్వరు. కథతో అందులో ఉన్న ఎమోషన్‌తో కనెక్ట్ అవుతారు. ఆర్ట్ ఫార్మ్‌కి రూల్స్ లేవు. విపులంగా చెప్పాల్సిన కథను అలానే చెప్పాలి. ప్రేమకథా చిత్రాలు చేయడం మీకు కంఫర్టబుల్‌గా ఉంటుందా? ఏ సినిమా అయినా కంఫర్టబుల్‌గానే ఉంటుంది. ‘చిత్రం’, ‘ఫ్యామిలీ సర్కస్’, ‘నిజం’, ‘జై’, ‘ఒక విచిత్రం’, ‘వెయ్యి అబద్ధాలు’ లవ్ స్టోరీస్ కాదు. కానీ నా మీద లవ్‌స్టోరీ అనే స్టాంప్ వేసేశారు. నేను అన్ని రకాలూ ట్రై చేశాను. ‘నిజం’లాంటివి తీస్తే ఎందుకు సార్ ‘జయం’ లాంటివి చేయండంటారు. ‘జయం’ చేస్తే మళ్లీ లవ్‌స్టోరీ ఏంటి? అంటారు. వరుసగా యాక్షన్ సినిమాలు తీసే డెరైక్టర్స్ని ‘మళ్లీ మళ్లీ యాక్షన్ సినిమాలు తీస్తున్నారేంటి?’ అని అడగరేం. వాస్తవానికి ‘జయం’ కల్ట్ మూవీ అవుతుందనుకోలేదు. ఎక్కడికెళ్లినా ‘జయం’ డెరైక్టర్ అంటారు. నేను తీసిన సినిమాల్లో అదే గొప్ప అనుకుంటారు. అంత గొప్పదా కాదా అనేది నాకు తెలియదు. నాకైతే ‘జయం’ డెరైక్టర్ అంటే కొంచెం చిరాకుగానే ఉంటుంది. అసలు ‘జయం’ ఎందుకు తీశాన్రా అనిపిస్తుంది. తెలంగాణ వర్కర్స్‌తో ‘హోరా హోరీ’ చేసినందువల్ల ఏవో ప్రాబ్లమ్స్ వచ్చాయట? నేనెప్పుడూ ఎవరు వీక్‌గా ఉంటే వాళ్లని సపోర్ట్ చేస్తాను కదా. దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్ ఇది. తెలంగాణ వర్కర్స్‌తో సినిమా చేశానని వైజాగ్‌లో షూటింగ్ ఆపారు. ఆ తర్వాత అది సాల్వ్ అయ్యింది. వేరే సినిమాల గురించి ఈజీగా కామెంట్ చేసేస్తారెందుకని? చేస్తే తప్పేంటి? రూముల్లో కూర్చుని కామెంట్ చేయకుండా ఓపెన్‌గా మాట్లాడేస్తా. అందుకే నేను కామెంట్ చేస్తున్న విషయం నలుగురికీ తెలుస్తోంది. చాలామంది నాలుగు గోడల మధ్య చేసే కామెంట్స్ బయటికి రావు. మీ నెక్ట్స్ మూవీ? ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్నా. అంటే భారీ బడ్జెట్‌తో ఎక్కువ రోజులు తీస్తారేమో? అప్పుడూ బడ్జెట్ లిమిట్‌లోనే ఉంటుంది. రోజుల తరబడి తీసే ప్రసక్తే లేదు. అలా ప్లాన్ చేసుకుంటా. ఇప్పుడు మనం తీస్తున్నవి ‘అల్లూరి సీతారామరాజు’, ‘దానవీర శూరకర్ణ’ కన్నా గొప్ప సినిమాలా? కృష్ణగారు ‘అల్లూరి సీతారామరాజు’లాంటి చిత్రాన్ని చాలా తక్కువ రోజుల్లో తీశారు. రామారావుగారు, నాగేశ్వరరావుగారు, కృష్ణగారిలాంటి గొప్ప హీరోలు ఉండేవారు. ఇప్పుడు అంత క్యాలిబర్ ఉన్న హీరోలు లేరు. వాళ్లకి ఒకళ్లో ఇద్దరో హెల్పర్స్ ఉండేవాళ్లు. ఇప్పుడేమో హీరో వెనకాల ఐదు నుంచి పది మంది ఉంటున్నారు. అప్పటికన్నా టెక్నాలజీ పెరిగినా ఇప్పుడు మనం ఎక్కువ రోజులు తీసుకుంటున్నాం. కొన్ని సినిమాలకు తప్పదు... ఎక్కువ రోజులు పడుతాయి. కానీ, మామూలు సోషల్ సినిమాలను కూడా ఎక్కువ రోజులు తీస్తున్నాం. పెద్దగా ప్లానింగ్ లేకపోవడం వల్ల, ఇంట్రస్ట్ తగ్గడంవల్ల ఇలా జరుగుతోంది. మీ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని స్టార్స్‌తో తీస్తారా? నాకు హిట్లు లేకపోతే ఏ పెద్ద హీరోలు డేట్స్ ఇవ్వరు. నాకు హిట్లు ఉన్నాయనుకోండి... పెద్ద హీరోతో నాకు పని లేదు (నవ్వుతూ). చూద్దాం.. ఫైనల్లీ... కమల్‌హాసన్‌తో సినిమా గురించి? ముందు నేను స్టడీగా నిలబడి, ఆ తర్వాత పెద్ద హీరో దగ్గరికెళ్లాలి. ఒక సక్సెస్‌తో వెళ్లాలి. కథ-స్క్రీన్‌ప్లే అన్నీ ఆయనవే. ప్రొడక్షన్, డెరైక్షన్ నాది. -
వర్షంలో హోరాహోరీ
తెలుగుతెరపై దర్శకునిగా తేజది ఓ ప్రత్యేకమైన సంతకం. కొత్త ప్రతిభను తెరకు పరిచయం చేయడంలోనూ తేజ ఎప్పుడూ ముందుంటారు. ఆయన పరిచయం చేసిన తారల గురించి చెప్పాలంటే... పెద్ద లిస్టే అవుతుంది. ప్రస్తుతం మరో యంగ్ టాలెంట్‌ని తెరకు పరిచయం చేసే పనుల్లో బిజీగా ఉన్నారు తేజ. ‘హోరా హోరీ’ పేరుతో ఓ చిత్రాన్ని ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దిలీప్ అనే యువ నటుణ్ణి హీరోగా పరిచయం చేయనున్నారు. విశేషం ఏంటంటే.. కథ రీత్యా ఈ చిత్రం ఆసాంతం వర్షంలోనే ఉంటుంది. అందుకే సన్నివేశాలు సహజంగా ఉండటం కోసం వర్షాకాలంలో ఈ సినిమా షూటింగ్ చేయనున్నారు.