నేను చాలా లక్కీ: దిలీప్ | actor dileep interview | Sakshi
Sakshi News home page

నేను చాలా లక్కీ: దిలీప్

Published Thu, Sep 10 2015 11:01 PM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM

నేను చాలా లక్కీ: దిలీప్ - Sakshi

నేను చాలా లక్కీ: దిలీప్

 ఉదయ్‌కిరణ్, నితిన్, నవదీప్,  ప్రిన్స్... ఇలా తేజ పరిచయం చేసిన హీరోల జాబితాలో చేరిన తాజా హీరో దిలీప్. ‘హోరా హోరీ’ ద్వారా సిల్వర్ స్క్రీన్‌పై తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోనున్నాడు. ఫస్ట్ సినిమానే తేజ దర్శకత్వంలో చేయడం తన లక్ అని దిలీప్ అంటున్నాడు. మరిన్ని విశేషాలను ఈ యువహీరో ఈ విధంగా పంచుకున్నాడు.



 హాయ్ దిలీప్... ఈ రోజు సిల్వర్ స్క్రిన్‌పై మిమ్మల్ని మీరు చూసుకోనున్నారు కదా.. ఎలా అనిపిస్తోంది?
డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా. హీరో కావాలనే నా లైఫ్ డ్రీమ్ నెరవేరింది. ఇప్పటికే రషెస్ చూసుకున్నాను. చాలా థ్రిల్ అయ్యాను.

ఫస్ట్ సినిమా కదా.. టెన్షన్‌గా ఉందా?
అస్సలు లేదండి. కూల్‌గా ఉన్నాను. తేజాగారు మాతో ఓ మంచి సినిమా చేయించారు. చాలా కష్టపడి చేశాం. ఆ కష్టం వృథా కాదు.

ఇంతకీ మీదే ఊరు.. ఎంతవరకూ చదువుకున్నారు?
వెస్ట్ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మాది. స్కూలింగ్ అంతా అక్కడే. బీటెక్ మాత్రం హైదరాబాద్‌లో చేశాను. మా నాన్నగారు పాలిటెక్నిక్ కాలేజీలో డిమాన్‌స్ట్రేటర్. అమ్మ హౌస్ వైఫ్. నాకో చెల్లెలు ఉంది. మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ నాకు పూర్తిగా ఉంది.

 పాలకొల్లు నుంచి అల్లు రామలింగయ్య వంటి మహానటులు, దాసరి, కోడి రామృకష్ణ, రవిరాజా పినిశెట్టి వంటి మహా దర్శకులు వచ్చారు. సెంటిమెంట్‌గా ఆలోచిస్తే మీరూ పెద్ద స్టార్ అవుతారన్న మాట?
అది జరగాలనే కోరుకుంటున్నానండి. ఎందుకంటే, హీరో కావాలనే కోరిక నెరవేరింది. సినిమాలు నా ఫుల్ టైమ్ ప్రొఫెషన్ అని ఫిక్స్ అయ్యా. కష్టపడే గుణం నా దగ్గర ఉంది కాబట్టి,  నా కష్టానికి తగ్గ సక్సెస్‌ని ఆ దేవుడు ఇస్తాడని నమ్ముతున్నాను.

 ‘హోరా హోరీ’కి ఎలా అవకాశం వచ్చింది?
 బీటెక్ పూర్తి చేశాక వైజాగ్ సత్యానంద్‌గారి దగ్గర యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. ఆ కోర్స్ పూర్తయ్యాక డ్యాన్స్, ఫైట్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పుడే తేజాగారు ‘హోరా హోరీ’ కోసం ఆర్టిస్టులు కావాలని ప్రకటించారు. అప్లయ్ చేస్తే ఆడిషన్స్‌కి రమ్మన్నారు.

 అప్పుడేమనిపించింది?
 ఆఫీసుకు వెళితే అప్పటికే చాలామంది ఉన్నారు. నా వంతు రాగానే లోపలికి వెళ్లాను. యాక్టింగ్‌లో కొన్ని వేరియేషన్స్ చేసి చూపించమని అడిగారు. చేశాను. అప్పటికప్పుడే సెలక్టెడ్ అన్నారు.

 అంటే.. మీరు లక్కీ అన్నమాట?
 మొదటి సినిమాకే తేజాగారితో చేసే అవకాశం రావడం అంటే లక్కీయే కదా. పైగా ఆర్టిస్ట్‌గా అది నా మొదటి ఆడిషన్స్. మొదటి రోజే ఓకే కావడం చాలా ఆనందం అనిపించింది.

 సెలక్ట్ కాగానే ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరికి చేశారు?
 నాకు మా అమ్మా, నాన్న తర్వాతే ఎవరైనా. ముందు వాళ్లకి ఫోన్ చేసి చెప్పాను. చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఆ తర్వాత కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పాను.

 సరిగ్గా చేయకపోతే ‘తేజ కొడతాడట’ అని ఎవరైనా భయపెట్టారా?
 ఆ మాట అన్నవాళ్లు ఉన్నారు. కానీ, తేజాగారు చెంప చెళ్లుమనిపించినా ఓకే అనుకునే షూటింగ్‌కి వెళ్లాను. స్కూల్, కాలేజ్ డేస్‌లో ఏ సబ్జెక్ట్ టీచర్ స్ట్రిక్ట్‌గా ఉంటే మనం అందులో మంచి మార్కులు తెచ్చుకుంటాం. సో.. గురువులు స్ట్రిక్ట్‌గా ఉంటే మనకే మేలు జరుగుతుంది. నేను తేజాగారి దగ్గరికెళ్లినప్పుడు నటన గురించి నాకు ఐదు, పది శాతం తెలిసి ఉంటుందేమో. కానీ, ఈ సినిమా పూర్తి చేసి బయటికొచ్చేటప్పుడు 70 శాతం తెలిసింది. తేజాగారితో సినిమా చేస్తే, ఇక ఏ దర్శకుడి దగ్గరైనా ఈజీగా చేసేయొచ్చు.

కర్నాటకలోని ఆగుంబే లొకేషన్ చాలా డేంజరస్ కదా.. అక్కడ షూటింగ్ చేసినప్పుడు రిస్క్ అనిపించిందా?
 కళ్లెదుటే పాములు కనిపించేవి. వాటిని దాటుకుంటూ సీన్స్ చేసేవాణ్ణి. అలాగే, పదిహేను అడుగుల ఎత్తు ఉన్న గోడ మీద నుంచి దూకేటప్పుడు కాలు పట్టేసింది. ఓ వారం రోజులు నడవలేకపోయాను. ఎంత రిస్క్ అయినా తేజాగారు చెప్పినట్లుగా చేయడం వల్ల ఈజీ అనిపించేది. అలాగే, డెరైక్షన్ డిపార్ట్‌మెంట్‌లో రామానంద్‌గారని ఉన్నారు. ఆయన సహకారాన్ని మర్చిపోలేను.

 ఈ సినిమా సక్సెస్‌పై మీ నమ్మకం?
 హండ్రెడ్ పర్సంట్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఇప్పటికే పాటలు సక్సెస్ అయ్యాయి. తేజాగారు చాలా బాగా తీశారు. పెద్ద హిట్ అవుతుంది.

 సినిమా రంగం అంటే అంత ఈజీ కాదు.. బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలతో కూడా పోటీ పడాలి. అసలు మీకేమైనా బ్యాగ్రౌండ్ ఉందా?
 నాకెలాంటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేదు. ఇప్పుడు పోటీ గురించి కూడా ఆలోచించడంలేదు. నాకు తెలిసిందల్లా కష్టపడి యాక్ట్ చేయడం. అదే నన్ను పైకి తెస్తుందనే నమ్మకం వంద శాతం ఉంది.

 ఈ సినిమా చేస్తున్నప్పుడు వేరే అవకాశాలేమైనా వచ్చాయా?
 కొంతమంది ఫోన్ చేశారు. కానీ ఈ చిత్రం విడుదలయ్యాక కమిట్ అవ్వాలనుకుంటున్నాను. అది కూడా తేజాగారి గెడైన్స్, నిర్మాత దామోదరప్రసాద్‌గారి సలహాతోనే తదుపరి సినిమాలు సెలక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement