కన్నడ ఎన్నికల ఖర్చు 13 వేల కోట్లు! | Karnataka Election Expenditure 13,000 Crores | Sakshi
Sakshi News home page

కన్నడ ఎన్నికల ఖర్చు 13 వేల కోట్లు!

Published Mon, May 7 2018 2:30 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Karnataka Election Expenditure 13,000 Crores - Sakshi

బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న కర్ణాటక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో డబ్బుల వరద పారుతోంది. ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థులు.. ఎన్నికల సంఘం సూచించిన మొత్తానికి వంద రెట్లు ఎక్కువ ఖర్చుచేస్తున్నారు. దీంతో కన్నడ అసెంబ్లీ ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలవనున్నాయి. ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుతున్న సమయంలో ఏయే పార్టీలు.. ఎక్కడెక్కడ, ఎంతెంత ఖర్చుచేయబోతున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల ఖర్చు ఎంత? అంశాలపై ఓటర్లతోపాటు పరిశీలకుల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ విశ్లేషకుల మధ్య జరుగుతున్న చర్చల ఆధారంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ప్రతిష్టాత్మక పోరు కాబట్టే..
కర్ణాటక ఎన్నికలు జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలిచి 2019 సార్వత్రిక ఎన్నిలకు శక్తిని కూడగట్టుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుండగా.. దక్షిణభారతంలో పార్టీ మనుగడ కోసం బీజేపీ శాయశక్తులా పనిచేస్తోంది. దీంతో ఇరుపార్టీలు ముఖ్యనేతలను రంగంలోకి దించి విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నాయి.కాంగ్రెస్‌ తరపున అధ్యక్షుడు రాహుల్, సీనియర్‌ నేతలు శశిథరూర్, అశోక్‌ చవాన్, ఉమెన్‌ చాందీ, సుశీల్‌ కుమార్‌ షిండే, రఘువీరారెడ్డి సహా మాజీ కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా సహా కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలను బీజేపీ రంగంలోకి దించింది.

సగటున రూ.20 కోట్లు
కన్నడ గడ్డపై 224 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు నియోజకవర్గంలో ఒక్కో పార్టీ అభ్యర్థి రూ.28 లక్షలు ఖర్చు చేయాలి. కానీ బీజేపీ, కాంగ్రెస్‌లు సగటున రూ.20 కోట్ల మేర ఖర్చు చేస్తున్నాయి. రూ.30–50కోట్లు ఖర్చు చేసేవి, రూ.50–70 కోట్లు, వందకోట్లకుపైగా ఖర్చు చేసే నియోజకవర్గాలూ ఉన్నాయి. సగటున రూ.20 కోట్లుగా లెక్కేసినా.. ఒక్కోపార్టీకి 4,480 కోట్లు ఖర్చవుతుంది. కొన్ని కీలక నియోజకవర్గాల ఖర్చు పరిగణనలోకి తీసుకుంటే.. ఆ మొత్తం రూ.5 వేల కోట్ల పైమాటే. జేడీఎస్‌ను కలుపుకుంటే రూ.13 వేలకోట్లుపైనే ఉంటుందని అంచనా.

ఆ మూడు చోట్ల.. 700 కోట్లు
కర్ణాటకలో అత్యంత ఖరీదైన ఎన్నిక విజయనగరలో జరగనుంది. ఇక్కడ కాంగ్రెస్‌ తరపున ఎంపీవీ కిష్టప్ప, బీజేపీ తరపున హెచ్‌ రవీంద్ర బరిలో ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో కిష్టప్ప రూ.1300 కోట్ల ఆస్తులు చూపించారు. ఈ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. గోవిందరాజనగర్‌లో కిష్టప్ప కుమారుడు ప్రియాకృష్ణ కాంగ్రెస్‌పార్టీ నుంచి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ వీ. సోమన్న బీజేపీ నుంచి రంగంలో ఉన్నారు. అలాగే హోస్కొటే నుంచి ఎంపీవీ నాగరాజు (కాంగ్రెస్‌), బీజేపీ తరపున మాజీమంత్రి బచ్చేగౌడ కుమారుడు శరత్‌ బరిలో ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఏ మాత్రం ఖర్చుకు వెనకాడటం లేదు. బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు జేడీఎస్‌ అభ్యర్థుల ఖర్చు మొత్తం రూ.700 కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది.

బాదామీలోనూ బారెడు ఖర్చు
బాదామీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, బీజేపీ ఎంపీ శ్రీరాములు మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇద్దరు నేతలకూ ఈ పోరు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఒక్కో అభ్యర్థి 70 నుంచి 90 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయొచ్చని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. పీసీసీ చీఫ్‌ పరమేశ్వర ప్రాతినిథ్యం వహిస్తున్న తుమకూరు జిల్లా కొరటగేరే, సీఎం కుమారుడు యతీంద్ర ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణతో పాటు పలు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థుల ఖర్చు భారీగానే ఉందని తెలుస్తోంది.  



మోదీ మ్యాజిక్‌ పనిచేయదు
శివాజీనగర: ‘కర్ణాటక ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయాయి.. రాష్ట్రంలో ఇక ప్రధాని మోదీ మ్యాజిక్‌ ఏదీ పనిచేయదు’ అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ఆదివారం బెంగళూరులోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీ ట్‌ ది ప్రెస్‌’లో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వాడుతున్న భాషను ప్రజలు ఛీకొడుతున్నారు. ఒక ప్రధాని నోటి నుంచి ఇలాంటి హీనమైన మాటలను వినాల్సి వస్తుందని వారు ఊహించలేదు’ అని మండిపడ్డారు. ‘2 ప్లస్‌ 1, టెన్‌ పర్సెంట్‌ ప్రభుత్వం, సీధా రూపయ్య’ అంటూ తమపై వ్యాఖ్యానాలు చేయటం ఇలాంటివేనని తెలిపారు. తమపై మోదీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదనీ, సీబీఐ తదితర దర్యాప్తు సంస్థలు ఆయన ఆధీనంలోనే ఉన్నందున విచారణ జరిపించి రుజువు చేయాలని సవాల్‌ విసిరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement