
జయనగర కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి
జయనగర: బీజేపీని అధికారం నుంచి దూరం పెట్టడంలో సఫలమైన కాంగ్రెస్, జేడీయస్ పార్టీలు తమ పొత్తును జయనగర, రాజరాజేశ్వరినగర నియోజకవర్గ ఎన్నికల్లో కొనసాగించే యత్నాల్లో ఉన్నాయి. రాజరాజేశ్వరినగర నియోజకవర్గ ఎన్నిక పోలింగ్ 28వ తేదీ జరగనుండగా 31వ తేదీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జయనగర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ హోంమంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ జేడీఎస్ అభ్యర్థిగా కాళేగౌడ పోటీ చేస్తున్నారు. ఈయన జయనగర నియోజకవర్గానికి సుపరిచితుడు కాగా ఒక్కలిగ ఓట్లనే నమ్ముకున్నారు. కానీ కాంగ్రెస్– జేడీఎస్ కూటమికి అధికారం దక్కడంతో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది.
జయనగరలో సౌమ్యారెడ్డికి జేడీఎస్ మద్దతునిస్తుందని, ప్రతిగా రాజరాజేశ్వరినగరలో జేడీయస్ అభ్యర్థి రామచంద్రకు కాంగ్రెస్ మద్దతునిచ్చే విధంగా ఇరుపార్టీలు చర్చలు జరిగినట్లు తెలిసింది. జయనగరను కాంగ్రెస్‌కు వదిలిపెట్టి ఆర్‌ఆర్.నగరను తమకు ఇవ్వాలని జేడీఎస్ ఆలోచిస్తోంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో ఒక్కలిగ ఓటర్లు ఉండటంతో హెచ్‌డీ.రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ రాజరాజేశ్వరినగర నుంచి పోటీచేయాలని ప్రయత్నించారు. కానీ కుటుంబ రాజకీయాలు కొనసాగిస్తున్నారనే అపకీర్తి వస్తుందనే కారణంతో ప్రజ్వల్‌కు తాత, దళపతి దేవేగౌడ అవకాశం ఇవ్వలేదు. చివరిక్షణంలో బీజేపీ నుంచి జేడీఎస్ చేరి టికెట్ పొందిన రామచంద్ర ఒక్కలిగ వర్గీయుడే. ఆయనకు మద్దతు ఇవ్వాలని జేడీఎస్ మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు తెలిపింది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.
ఆర్‌ఆర్ నగరలో కాంగ్రెస్ తప్పుకునేనా?
రాజరాజేశ్వరినగరలో కాంగ్రెస్ అభ్యర్థిగా మునిరత్న పోటీ చేస్తుండగా, జేడీయస్ అభ్యర్ధి రామచంద్రకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ మునిరత్న పోటీ నుంచి తప్పుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే నామినేషన్ వెనక్కితీసుకోవడానికి చివరితేదీ ముగిసింది. ఆయన పేరు, పార్టీ చిహ్నం ఈవీఎంపై ముద్రితమౌతుంది. ఈ సాంకేతిక సమస్యతో జేడీయస్ అభ్యర్థికి మద్దతునివ్వాలా వద్దా అనేది కాంగ్రెస్ ఆలోచిస్తోంది. పోటీ నుంచి తప్పుకునేలా ప్రకటన చేయాలని పార్టీ నేతలు మునిరత్నకు నచ్చజెప్పగలరా? అనేది కూడా అనుమానమే.
పొత్తుపై ఇంకా మాట్లాడలేదు: పరమేశ్వర్‌జయనగర, రాజరాజేశ్వరినగరల్లో జేడీయస్‌తో పొత్తులేదని ఇప్పటికే తమ అభ్యర్థి బరిలో ఉన్నారని, ఒకవేళ పొత్తు కుదిరితే రెండు పార్టీల సీనియర్ నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు.
జయనగర బీజేపీ అభ్యర్థిగా ప్రహ్లాద్
జయనగర: జయనగర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే బీఎన్.విజయ్‌కుమార్ సోదరుడు బీఎన్.ప్రహ్లాద్‌బాబుకు బీజేపీ టికెట్ కేటాయించింది. తద్వారా సానుభూతి కలిసివస్తుందని బీజేపీ ఆశిస్తోంది. ఈయన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా సుపరిచితులు. ప్రహ్లాద్‌బాబు ఎంపికపై జయనగర బీజేపీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. జయనగరలో కాంగ్రెస్ నుంచి సౌమ్యారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా రవికృష్ణారెడ్డి పోటీ చే స్తున్నారు. జూన్ 11 న పోలింగ్ నిర్వహించనుండగా 16 న ఓట్ల లెక్కింపు చేపడతారు.
