న్యూఢిల్లీ: కాంగ్రెస్, జేడీఎస్ కలసి సుహృద్భావపూర్వకంగానే కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నట్లు జేడీఎస్ నేత కుమారస్వామి స్పష్టం చేశారు. బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న స్వామి.. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్, సోనియా గాంధీలతో సమావేశమయ్యారు. తుగ్లక్ లేన్‌లోని రాహుల్ నివాసంలో 20 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో కన్నడనాట ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలు, మంత్రిత్వ శాఖల పంపకం పైనే ప్రధానంగా చర్చ జరిగింది. కర్ణాటకలో సుస్థిరమైన పాలన అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. కీలకాంశాల్లో రాహుల్ మద్దతు, సలహాలు, సూచనలు కావాలని కుమారస్వామి కోరగా.. రాహుల్ సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పారని సమాచారం. భేటీ అనంతరం కుమార స్వామి మాట్లాడుతూ.. ‘మేం ఇకపై కలసి ముందుకెళ్లాలని నిర్ణయించాం. అందుకే వారి (సోనియా, రాహుల్) సూచనలు తీసుకుందామనే ఇక్కడికి వచ్చాను. మంత్రివర్గ శాఖల పంపకంలో ఎలాంటి బేరసారాల్లేవు. మేం సుహృద్భావపూర్వక వాతావరణంలో చర్చించుకుని నిర్ణయిస్తాం’ అని పేర్కొన్నారు. ప్రమాణస్వీకారానికి సోనియా, రాహుల్ రావాలని ఆయన ఆహ్వానించారు.
బెంగళూరులోనే నిర్ణయం
డిప్యూటీ సీఎం ఎంపికపై స్పందిస్తూ.. ‘దీనికి సంబంధించిన విధివిధానాలను రాహుల్ చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు కేసీ వేణుగోపాల్‌కు దీనిపై చర్చించేందుకు పూర్తి అనుమతులిచ్చారు. కర్ణాటక సీనియర్ నేతలతో మంగళవారం బెంగళూరులో సమావేశమై మంత్రివర్గ కూర్పుపై తుది నిర్ణయం తీసుకుంటాం’ అని కుమారస్వామి వెల్లడించారు. జేడీఎస్–కాంగ్రెస్ కూటమి కర్ణాటకకు సుస్థిరమైన పాలన అందిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రశాంతంగా నడిచేందుకు ఓ సమన్వయ కమిటీని ఏర్పాటుచేసేందుకు ఇరుపార్టీలు అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఆరుగురు సభ్యుల కమిటీలో ఇరుపార్టీల్లోని చెరో ముగ్గురు సీనియర్ నేతలుండాలని నిర్ణయించారు. కూటమిలో పెద్ద పార్టీగా ఉన్నందున స్పీకర్ పోస్టును తమకే ఇవ్వాలని కాంగ్రెస్ ప్రతిపాదించగా.. కుమారస్వామి అంగీకరించినట్లు తెలిసింది. అయితే, కాంగ్రెస్ తరపున ఎవరు ఉపముఖ్యమంత్రిగా ఉండాలనే అంశంపై మంగళవారం జేడీఎస్‌తో చర్చల్లోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉండాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తుండగా.. కుమారస్వామి తిరస్కరించినట్లు తెలుస్తోంది.
పరస్పర ప్రయోజనాలపై చర్చ
ఈ భేటీ జరిగిన కాసేపటికే.. స్వామి ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ‘కుమారస్వామిని కలవటం ఆనందంగా ఉంది. కర్ణాటకలో ఇరువురి పరస్పర ప్రయోజనాల అంశాలను, రాజకీయ పరిస్థితులను చర్చించుకున్నాం. బెంగళూరులో ఆయన ప్రమాణస్వీకారానికి నేను వెళ్తున్నా’ అని రాహుల్ ట్వీట్ చేశారు. సోనియా, రాహుల్‌లను కలవకముందే.. బీఎస్పీ అధినేత్రి మాయావతిని స్వామి కలిశారు. 2019 ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసికట్టుగా ప్రయత్నించాలన్న అంశంపై వీరిద్దరు చర్చించినట్లు తెలిసింది.
రేపు సాయంత్రం 4.30కు
కర్ణాటక సీఎంగా కుమారస్వామి బుధవారం సాయంత్రం 4.30 గంటలకు విధానసౌధలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్ వజూభాయ్ వాలా పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీతోపాటుగా బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్ సహా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరు కానుండగా.. తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు, ఎస్పీ నేత అఖిలేశ్‌యాదవ్. బీఎస్పీ అధినేత్రి మాయావతిలు కూడా ప్రమాణస్వీకారంలో పాల్గొనవచ్చని తెలుస్తోంది. 12 ఏళ్లలో కుమారస్వామి సీఎంగా బాధ్యతలు తీసుకోవటం ఇది రెండోసారి. కాగా, మంత్రి పదవులు ఆశిస్తున్న వారికి కేబినెట్‌లో స్థానం దక్కని పక్షంలో తిరుగుబాటు రావొచ్చన్న ఆందోళనతో.. కుమారస్వామితోపాటు కొందరితోనే మంత్రులుగా ప్రమాణం చేయించాలని సోనియా, రాహుల్ సూచించినట్లు సమాచారం. విశ్వాస పరీక్ష తర్వాత కేబినెట్‌ను విస్తరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సోమవారం ఢిల్లీలో రాహుల్, సోనియాలతో కుమారస్వామి. చిత్రంలో డానిష్ అలీ, కేసీ వేణుగోపాల్
Comments
Please login to add a commentAdd a comment