sworn in CM
-
ఒక్క రోజూ వేస్ట్ చేయను
ఎస్బీఎస్ నగర్ (పంజాబ్): ‘‘పంజాబ్ అభివృద్ధి కోసం ఈ రోజు నుంచే రంగంలోకి దిగుతాం. ఒక్క రోజు కూడా వృథా చేయం. మనమిప్పటికే 70 ఏళ్లు ఆలస్యమయ్యాం. అవినీతి, నిరుద్యోగాలను రాష్ట్రం నుంచి పారదోలతాం’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్ సింగ్ మాన్ (48) ప్రతిజ్ఞ చేశారు. పంజాబ్ 18వ ముఖ్యమంత్రిగా బుధవారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. భగత్‌సింగ్ స్వగ్రామం కట్కర్‌కలాన్‌లో భారీ జన సందోహం సమక్షంలో గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. భగత్‌సింగ్‌కు అత్యంత ఇష్టమైన రంగ్ దే బసంతి పాట మారుమోగుతుండగా, జనం హర్షధ్వానాల మధ్య కార్యక్రమం జరిగింది. ఆప్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు భగత్‌సింగ్‌కు చిహ్నంగా భావించే పసుపురంగు తలపాగాలు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. జనం కూడా అవే తలపాగాలు ధరించి కన్పించారు. వారినుద్దేశించి మాన్ మాట్లాడారు. ముందుగా ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతా కీ జై, జో బోలే సో నిహాల్ అంటూ నినదించి జనాల్లో జోష్ నింపారు. వాళ్లు కూడా ఆయనతో ఉత్సాహంగా గొంతు కలిపారు. ఆప్‌కు బంపర్ మెజారిటీ కట్టబెట్టి రాష్ట్ర ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని మాన్ కొనియాడారు. ‘‘రాష్ట్రంలో స్కూళ్లు, ఆస్పత్రులను ఢిల్లీ తరహాలో మెరుగుపరుస్తాం. వాటిని చూసేందుకు విదేశాల నుంచి కూడా జనం వచ్చేలా చేస్తాం’’ అని చెప్పారు. అహంకారానికి తావివ్వొద్దని, వినయ విధేయతలతో మసలుకోవాలని ఆప్ ఎమ్మెల్యేలకు సూచించారు. పంజాబ్ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుందని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. అమెరికా నుంచి వచ్చిన మాన్ కూతురు సీరత్ (21), దిల్షాన్ (17) ప్రమాణ స్వీకారంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మాన్ దంపతులు 2015లో విడిపోయారు. అప్పటినుంచీ పిల్లలు తల్లితో పాటు అమెరికాలో ఉంటున్నారు. కమెడియన్ నుంచి సీఎం దాకా... ప్రమాణ స్వీకారం తర్వాత చండీగఢ్‌లోని సీఎం కార్యాలయంలో మాన్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆయనొక్కరే ప్రమాణం చేశారు. ఆయన మంత్రివర్గం శనివారం రాజ్‌భవన్‌లో బాధ్యతలు స్వీకరిస్తుందని ఆప్ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు, ఒడిశా సీఎంలు ఎంకే స్టాలిన్, నవీన్ పట్నాయక్ తదితరులు మాన్‌ను అభినందించారు. పంజాబ్ సంక్షేమానికి, రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కలిసి పని చేద్దామని మాన్‌తో మోదీ చెప్పారు. కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన మాన్ ఆ తర్వాత రాజకీయాల్లోకి దిగి రెండుసార్లు సంగ్రూర్ నుంచి ఎంపీగా గెలిచారు. 2022 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 117 సీట్లకు ఏకంగా 92 స్థానాల్లో ఆప్ ఘనవిజయం సాధించడం తెలిసిందే. -
ఆరి... ‘భగవంతు’డా!
విప్లవ వీరుడు భగత్ సింగ్ గ్రామం ఖత్కర్ కలన్‌లో బుధవారం భారీ జనసందోహం మధ్య సాగిన పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారోత్సవం మారనున్న ఆ రాష్ట్ర ముఖచిత్రానికి సంకేతమా? అవును అంటున్నారు... భగత్ సింగ్ ఫక్కీలోనే పసుపుపచ్చ తలపాగా ధరించి, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదంతో ప్రసంగాన్ని ముగించిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) కొత్త సీఎం భగవంత్ సింగ్ మాన్. భగత్ సింగ్, బాబాసాహెబ్ అంబేడ్కర్ల స్వప్నసాకారం కోసం తనతో పాటు యావత్ 3 కోట్ల పంజాబ్ ప్రజలూ పదవీ ప్రమాణ స్వీకారం చేసినట్టే అన్నది మాన్ మాట. తాజా ఎన్నికలలో పంజాబ్‌లోని 117 సీట్లకు గాను 92 సీట్లు గెలిచి, అఖండ విజయం సాధించిన తమ పార్టీ అవినీతిని సమూలంగా నిర్మూలిస్తుందని ఆయన వాగ్దానం. అయితే, అవినీతి, డ్రగ్స్ మత్తులో మునిగిన ‘ఉఢ్తా పంజాబ్’గా దుష్కీర్తి సంపాదించుకొని, ఆర్థిక వనరుల కోసం అల్లాడుతున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ‘బఢ్తా పంజాబ్’గా మార్చడం భగవంత్ సింగ్ చెప్పినంత సులభమా? గమనిస్తే, ‘ఆప్’ సాధించిన అపూర్వ ఎన్నికల విజయం సైతం అంత సులభమైనదేమీ కాదు. ముగ్గురు మాజీ సీఎంలతో సహా కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)లకు చెందిన కొమ్ములు తిరిగిన నేతల్ని ‘ఆప్’లోని కొత్త తరం ఓడించిన తీరు ఓ నవ చరిత్ర. ఈ సరిహద్దు రాష్ట్రంలో ప్రధానంగా త్రిముఖంగా సాగిన పోటీలో కాంగ్రెస్ 23 శాతం, ఎస్ఏడీ 20.2 శాతం ఓట్లు సాధిస్తే, ఏకంగా 42 శాతం ఓట్లు ‘ఆప్’ సొంతమయ్యాయి. అయిదేళ్ళ క్రితం 2017లో కేవలం 23.7 శాతం ఓట్లతో, పట్టుమని 20 సీట్లే గెలిచి, ప్రధానంగా దక్షిణ మాల్వా ప్రాంతానికే పరిమితమైన ఓ పార్టీకి ఇది ఘన విజయమే. ఈసారి మాల్వా, దోవబ్, మాఝా ప్రాంతాలు మూడింటిలోనూ గణనీయమైన ఓటు షేర్‌తో రాష్ట్రం మొత్తాన్నీ తన ఎన్నికల చిహ్నం చీపురుతో ఊడ్చేసింది. కేంద్ర ప్రభుత్వ కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటంతో బీజేపీ–ఎస్ఏడీ పొత్తు విడిపోవడంతో, ఏడాది క్రితం పంజాబ్‌లో అధికార కాంగ్రెసే మరోసారి గెలుపు గుర్రం. కానీ, 2017లో గెలిచినప్పుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను మార్చడం మీద శ్రద్ధ పెట్టింది. క్షణానికోలా మాట్లాడుతూ, ఏ పార్టీలో ఎంతకాలం ఉంటారో తెలియని మాజీ క్రికెటర్ సిద్ధూను నమ్ముకొని నట్టేట మునిగింది. రాష్ట్రానికి తొలిసారి దళిత సీఎం అంటూ ఆఖరు నిమిషంలో చన్నీతో చేసిన ప్రయోగం ఫలితమివ్వకపోగా, పార్టీలోని అధికార ఆశావహులతో కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. అటు కేంద్ర, ఇటు రాష్ట్ర అధికార పక్షాలతో విసిగిపోయి, అంతకు మునుపు ఎస్ఏడీ అవినీతి పాలన అనుభవం మర్చిపోని ఓటర్లు ఏకైక ప్రత్యామ్నాయం ‘ఆప్’కు బ్రహ్మరథం పట్టడం అర్థం చేసుకోదగినదే! పంజాబ్ ఎన్నికలలో సాధించిన ఘన విజయం స్ఫూర్తితో మరిన్ని రాష్ట్రాలకు రెక్కలు చాచాలని కూడా ‘ఆప్’ ఉత్సాహపడుతోంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లాంటి ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలకు సైతం పార్టీని విస్తరింపజేయాలన్న ఆకాంక్షను ‘ఆప్’ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే బయటపెట్టారు. నిజానికి, ఇటీవలి ఎన్నికలలో గోవా లాంటి చోట్ల ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ, 2023లో జరిగే రాజస్థాన్ ఎన్నికలలోనూ పంజాబ్ తరహా మేజిక్ చేయాలని భావిస్తోంది. నాలుగేళ్ళ క్రితం 2018 రాజస్థాన్ ఎన్నికల్లోనూ 200 స్థానాలకు 140కి పైగా సీట్లకు ‘ఆప్’ పోటీ చేసింది. అప్పట్లో ఒక్క సీటైనా గెలవని ఆ పార్టీ ఇప్పుడు పంజాబ్ ఇచ్చిన జోష్‌తో మళ్ళీ బరిలోకి దూకాలని చూస్తోంది. విద్యుచ్ఛక్తి సమస్యలు, భారీ విద్యుత్ రేట్లతో సతమతమవుతున్న రాజస్థాన్ ప్రజలకు ఢిల్లీ, పంజాబ్‌లలో లాగా పరిష్కారం చూపుతామన్నది ‘ఆప్’ చెబుతున్న మాట. హామీలివ్వడం తేలికే... నిలబెట్టుకోవడమే కష్టం. ‘ఆప్’ ముందున్న సవాల్ అదే. నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలు, తక్కువ ఖర్చుకే వైద్యసేవల ‘మొహల్లా’ క్లినిక్‌లు, ఉచిత విద్యుత్ లాంటి ‘ఢిల్లీ నమూనా’తోనే దేశరాజధానిలో ఆ పార్టీ రెండోసారి గద్దెనెక్కింది. పంజాబ్‌లోనూ అదే బాటలో ఢిల్లీ పౌరుల కన్నా 100 యూనిట్లు ఎక్కువగా 300 యూనిట్ల ఉచిత విద్యుత్, పాఠశాలల ఉన్నతీకరణ, 16 వేల క్లినిక్‌లు, ఉచిత ఔషధాలు – శస్త్రచికిత్సల ఆరోగ్య హామీ పథకం వగైరా ‘ఆప్’ ప్రకటించింది. విస్తీర్ణంలో ఢిల్లీ (1484 చ.కి.మీ) కన్నా పంజాబ్ (50,362 చ.కి.మీ) చాలా పెద్దది. జనాభా సైతం ఢిల్లీ కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ. మిగులు ఆదాయ బడ్జెట్‌తో నడిచే ఢిల్లీతో పోలిస్తే పంజాబ్ ఖజానాలో నిత్యం కటకట. తాజా మాజీ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఋణభారం రూ. 2.6 లక్షల కోట్లకు పెరిగింది. ఇది కాక కరోనా ఆపత్కాల ఖర్చులు, ప్రజాకర్షక పథకాల పుణ్యమా అని రాష్ట్ర అప్పులు, స్థూల రాష్ట్ర ఉత్పత్తి(జీఎస్డీపీ) నిష్పత్తి ఈ ఆర్థిక సంవత్సరం 50శాతం దాటుతుందని అంచనా. అంటే హామీలు తీర్చే ఆర్థిక వనరులకై భగవంత్ సారథ్యంలో ‘ఆప్’ అల్లాడి ఆకులు మేయక తప్పదు. డ్రగ్స్ అక్రమరవాణా, శాంతిభద్రతల సమస్యలు ఈ సరిహద్దు రాష్ట్రాన్ని ఎప్పటి నుంచో పీడిస్తున్నాయి. వాటిని అరికట్టాలంటే పోలీసు యంత్రాంగ విస్తరణ, నూతన శిక్షణ తప్పవు. ఢిల్లీలో లాగా పోలీసు శాఖ కేంద్ర అధీనంలో ఉందనీ, లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుకుంటున్నారనీ పంజాబ్‌లో చెప్పడానికి వీలుండదు. అలా ఇప్పుడు ‘ఆప్’కూ, అధినేత కేజ్రీవాల్‌కూ, రాజకీయాల్లోకి వచ్చిన 12 ఏళ్ళకే సీఎం స్థాయికి ఎదిగిన హాస్యనటుడైన 48 ఏళ్ళ భగవంత్ సింగ్ మాన్‌కూ అందరికీ ఇది అగ్నిపరీక్షే. ఢిల్లీలో లాగానే పంజాబ్‌లోనూ హామీలు నెరవేర్చి, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందిస్తారా? -
సహస్రం.. సంక్షేమం: జగనన్న పాలనకు 1000 రోజులు
సాక్షి, శ్రీకాకుళం: ‘జనానికి మేలు చేయాలన్న మనస్తత్వం ఉండాలి. అనుకునేదానిని ఆచరణలో పెట్టాలన్న పట్టుదల అణువణువునా జ్వలించాలి. కార్యాచరణ ప్రణాళికపై స్పష్టత కుదరాలి. అడుగు ముందుకేయాలన్న ఆరాటం అంతరంగంలో అలలా వెల్లువెత్తాలి. ఇన్ని కలగలిస్తేనే ఓ పాలకుడి వల్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది.’ పై లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న నాయకుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి నేటికి 1000 రోజులైంది. ఈ వెయ్యి రోజుల పాలనలో సిక్కోలుపై సంక్షేమ పథకాల జల్లు కురిసింది. కోవిడ్ సమయంలోనూ ఏ పథకాన్నీ ఆపకుండా కొనసాగించారు. జిల్లాలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విద్య, వైద్య పరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆరోగ్యమస్తు.. ►కిడ్నీ వ్యాధులు అధికంగా ప్రబలుతున్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు వీలుగా పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇందుకు అనుసంధానంగా కిడ్నీ వ్యాధుల రీసెర్చ్ సెంటర్, అతిపెద్ద డయాలసిస్ సెంటర్‌ను మంజూరు చేశారు. ఇప్పుడా పనులు జోరుగా సాగుతున్నాయి. ►సీతంపేటలో రూ.49 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు చేశారు. ►ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరుగా భావిస్తున్న నేపథ్యంలో ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో ని ఏడు మండలాలకు ఇంటింటికీ మంచినీటిని కుళాయిల ద్వారా నిరంతరం అందించేలా ప్రత్యేక ప్రాజెక్టును మంజూరు చేశారు. ఇందుకోసం రూ.700 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నారు. ►ఆరోగ్యశ్రీ పథకంతో పాటు – నాడు–నేడు కింద 83 ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. ►పాతపట్నం 50 పడకల సామాజిక ఆస్పత్రిని రూ.4.2కోట్లతో, జొన్నవలస ఆస్పత్రిని రూ.2.45కోట్లతో, లావేరులో రూ.1.20 కోట్లతో, సోంపేట సామాజిక ఆస్పత్రిని రూ. 4.60కోట్లతో, బారువ సామాజిక ఆస్పత్రిని రూ.5.60కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. చదవండి: (కోవిడ్ తర్వాత పెరిగిన ఆ సమస్యలు.. జాగ్రత్త లేకుంటే ప్రమాదమే..) అతివలకు అండగా.. జిల్లాలో వైఎస్సార్ చేయూత కింద 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ కులాల మహిళలకు ఒక్కో ఏడాదికి రూ.18,750 చొప్పున 10,309 మందికి అందజేస్తున్నారు. వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా సంఘాలు గత ఎన్నికల ముందు తీసుకున్న రుణాన్ని ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తోంది. 51,764 సంఘాల్లోని 5,71,369 మందికిరూ.1508.71కోట్లు చెల్లిస్తోంది. ఇప్పటికే రెండు విడతల రుణ మొత్తాన్ని మహిళల ఖాతాలకు జమ చేసింది. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద బ్యాంకుల నుంచి డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలపై పడిన వడ్డీ తిరిగి చెల్లించే కార్యక్రమం కింద 2020లో 48,634 సంఘాల్లోని 5,48,723 మందికి రూ.31.68కోట్లు, రెండో విడత కింద 53,950 సంఘాలకు రూ.31.92కోట్లు చెల్లించింది. గంగపుత్రుల బెంగ తీరేలా.. భావనపాడులో రూ.3200కోట్లతో పోర్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే బుడగట్లపాలెంకు రూ. 332కోట్లతో ఫిషింగ్ హార్బర్ మంజూరు చేశారు. మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మాణం చేపడుతున్నారు. మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ అందజేస్తున్నారు. విద్యకు అగ్రపీఠం ►జగనన్న అమ్మఒడి కింద 2020లో 2,41,562 మందికి రూ.362.34కోట్లు, 2021లో 3,48,331 మందికి రూ.487.86కోట్లు చెల్లించింది. నాడు–నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేస్తోంది. ►జగనన్న విద్యా కానుక కింద 2020లో 2,49,405మందికి, 2021లో 2,74,509 మందికి కిట్లు పంపిణీ చేసింది. జగనన్న విద్యావసతితో విద్యార్థులకు బాసటగా నిలుస్తోంది. అన్నదాతకు వెన్నుదన్ను.. ►జిల్లాలో రైతులకు వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీని అందించారు. నేరడి బ్యారేజీ వివాదాన్ని కొలిక్కి తెచ్చారు. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అగ్రీ ల్యాబ్, ఆక్వా ల్యాబ్, భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పాలకొండ, పలాసకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మంజూరు చేశారు. వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం కింద 27,523 మంది రైతులకు రూ.23.30 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. ఇంకా కొన్ని.. ►జిల్లాలో 1,10,825 మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు అందజేశారు. వాటిలో 91,600 ఇళ్ల నిర్మాణాలకు మంజూరు చేశారు. ఇప్పటికే 60వేల వరకు ఇళ్ల పనులు జరుగుతున్నాయి. ►3,83,590 మంది వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు అందజేస్తున్నారు. ►జగనన్న తోడు కింద వీధి చిరువ్యాపారులకు రుణ సౌకర్యం కల్పించారు. ►జగనన్న చేదోడు కింద రజక, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సాయం అందించారు. -
Himanta Biswa Sarma: అస్సాం సీఎంగా హిమంత
గువాహటి: అస్సాం నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత, నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్ కన్వీనర్ హిమంత బిశ్వ శర్మ ఎన్నికయ్యారు. రాష్ట్ర 15వ సీఎంగా సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఆదివారం తమ శాసనసభా పక్ష నేతగా శర్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత ఎన్డీఏ కూడా ఆయనను తమ శాసన సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రస్తుత సీఎం సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వ శర్మ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ రేసులో ఎట్టకేలకు శర్మ విజయం సాధించారు. పార్టీ అధిష్టానం ఈ ఇద్దరు నేతలను శనివారం ఢిల్లీకి పిలిపించి, చర్చలు జరిపింది. శాసనసభాపక్ష భేటీలో హిమంత బిశ్వ శర్మ పేరును సర్బానంద సోనోవాలే ప్రతిపాదించడం విశేషం. అన్ని కోవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ అసెంబ్లీ భవనంలోని బీజేపీ కాన్ఫరెన్స్ హాల్లో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి శర్మ, సోనోవాల్ కలిసి ఒకే వాహనంలో వచ్చారు. అంతకుముందు, ఉదయం సీఎం సర్బానంద సోనోవాల్ గవర్నర్ జగదీశ్ ముఖికి రాజీనామా సమర్పించారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడ్డాయి. 126 స్థానాల అసెంబ్లీలో ఎన్డీయే 75 సీట్లు గెలుచుకోగా, బీజేపీ సొంతంగా 60 సీట్లలో విజయం సాధించింది. సోనోవాల్ నా మార్గదర్శి హిమంత బిశ్వ శర్మ ఆదివారం సాయంత్రం గవర్నర్ జగదీశ్ ముఖిని కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఎన్డీయే ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు సమర్పించారు. శర్మతో పాటు సీఎం పదవి నుంచి దిగిపోతున్న సర్బానంద సోనోవాల్ కూడా రాజ్‌భవన్‌కు వెళ్లారు. అస్సాం సీఎంగా శర్మతో సోమవారం మధ్యా హ్నం 12 గంటలకు శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రలో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. అంతకుముందు, శర్మ మాట్లాడుతూ.. సర్బానంద సోనోవాల్ తనకు మార్గదర్శిగా కొనసాగుతారన్నారు. ముఖ్యమంత్రిగా ప్రజాసేవకు అవకాశం కల్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితర నేతలు, రాష్ట్ర ప్రజలకు శర్మ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా నిజాయితీగా, నిబద్ధతతో పని చేస్తానన్నారు. ముఖ్యమంత్రిగా సోనోవాల్ గొప్పగా పనిచేశారని, ఆయన హయాంలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని సోనోవాల్పై శర్మ ప్రశంసలు గుప్పించారు. ముందు చూపున్న, రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసిన, విలువలతో కూడిన నేత సోనోవాల్ అని పేర్కొన్నారు. 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రధాని మోదీ ఈశాన్య ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని, తాజా ఎన్నికల ప్రచారంలోనూ రాష్ట్రమంతా పర్యటించారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. అస్సాంను మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తారు శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన హిమంత బిశ్వ శర్మ తనకు తమ్ముడులాంటి వాడని తాత్కాలిక సీఎం సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్డీఏ పక్షాల సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘హిమంతకు పెద్ద బాధ్యతలు అప్పగించారు. ఆయనకు నా ప్రేమ, ఆశీస్సులు అందజేస్తున్నాను. రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసం ఆయన కృషి చేస్తారు’ అని ఆకాంక్షించారు. -
మూడోసారి బెంగాల్ పీఠంపై దీదీ
కోల్‌కతా: హోరాహోరీ అసెంబ్లీ ఎన్నికల పోరులో విజయఢంకా మోగించిన తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ వరసగా మూడోసారి బెంగాల్ సీఎంగా ప్రమాణం చేశారు. బుధవారం కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఆమెతో సీఎంగా ప్రమాణంచేయించారు. మమత కేబినెట్లో కొత్త మంత్రులంతా 9వ తేదీన ప్రమాణం చేయను న్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత హింస చెలరేగడానికి కారకులైన వారిని వదిలిపెట్టేదిలేదని ఈ సందర్భంగా ఆమె ప్రతిజ్ఞ చేశారు. బెంగాల్లో కోవిడ్ కట్టడే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని మమత స్పష్టంచేశారు. కాగా, సీఎంగా ప్రమాణంచేసిన మమత దీదీకి అభినందనలు అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దేశంలోని పౌరులందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తూ ప్రధాని మోదీకి మమత ఓ లేఖ రాశారు. అల్లర్లను చెల్లెలు మమత అదుపుచేయగలదు: గవర్నర్ ధన్కర్ ‘మూడోసారి సీఎం అయిన మమతకు ధన్య వాదాలు. అయితే, ప్రస్తుతం అల్లర్లు, హింసతో బెంగాల్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ హింసా త్మక ఘటనలకు నా సోదర సమానురాలైన మమతా బెనర్జీ అడ్డుకట్ట వేయగలదనే నమ్ముతున్నా. హింసకు గురౌతున్న మహిళలు, చిన్నారులను రక్షించి తక్షణమే శాంతిభద్రతలను ఆమె అదుపులోకి తెస్తారని భావిస్తున్నా’అని గవర్నర్ ధన్కర్ వ్యాఖ్యానించారు. -
బిహార్ సీఎంగా మళ్లీ నితీశ్
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ వరుసగా నాలుగోసారి సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో నెగ్గిన ఎన్డీయే కూటమి ముందే ప్రకటించినట్టుగా సీఎం పగ్గాలు నితీశ్‌కే అప్పగించింది. ఆదివారం పట్నాలో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతగా నితీశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 243 సీట్లున్న అసెంబ్లీలో 125 సీట్ల మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సుపరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్న నితీశ్‌కుమార్ కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల సమస్యను ఎదుర్కోవడంలో విఫలం కావడంతో చాలా మంది ఆయనకు వ్యతిరేకమయ్యారు. గత అసెంబ్లీతో పోల్చి చూస్తే నితీశ్ పార్టీ జనతాదళ్ యునైటెడ్ (జేడీ–యూ) బలం 71 నుంచి 43కి పడిపోయింది. అయినప్పటికీ ముందుగా చేసిన నిర్ణయానికి కట్టుబడి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మిస్టర్ క్లీన్ ముద్ర ఉన్న నితీశ్‌కు మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. గవర్నర్‌ని కలుసుకున్న నితీశ్ ఎన్డీయే శాసనసభా పక్షనాయకుడిగా ఎన్నికైన వెంటనే నితీశ్ కుమార్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఫాగూ చౌహాన్‌ను కలుసుకున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయనని కోరారు. ఎన్డీయే పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. అనంతరం నితీశ్ విలేకరులతో మాట్లాడుతూ సోమవారమే తాను పదవీ ప్రమాణం చేయనున్నట్టుగా చెప్పారు. ‘‘ఎన్డీయే కూటమిలో నాలుగు పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖని గవర్నర్‌కి సమర్పించాను. గవర్నర్ ఆదేశం మేరకు సోమవారం సాయంత్రం 4–4:30 మధ్య రాజ్‌భవన్‌లో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాను’’అని చెప్పారు. ఎన్డీయే కూటమి సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ భూపేంద్ర యాదవ్, ఎన్నికల ఇన్చార్జ్ ఫడ్నవీస్ హాజరయ్యారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా తార్ కిశోర్ బిహార్ ఉప ముఖ్యమంత్రి పదవి ఈసారి ఇద్దరిని వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కతిహర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తార్ కిశోర్ ప్రసాద్, బెత్తాహ్ ఎమ్మెల్యే రేణుదేవిలను డిప్యూటీ సీఎంలుగా దాదాపు ఖరారు అయినట్టే. అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నాయకునిగా తార్ కిశోర్ ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆయనే డిప్యూటీ సీఎం పగ్గాలు చేపడతారని భావిస్తున్నారు. ఇన్నాళ్లూ డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన సుశీల్ కుమార్ మోదీకి కేంద్రంలో పదవి అప్పగించే అవకాశాలున్నాయి. బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో ఆయనే ప్రసాద్ పేరు ప్రతిపాదించారు. బీజేపీఎల్పీ ఉప నేతగా రేణు దేవిని ఎన్నుకోవడంతో ఆమెకు కూడా డిప్యూటీ సీఎం పదవి లభిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరీ తార్కిశోర్ ప్రసాద్ ? రాజకీయవర్గాల్లో పెద్దగా పరిచయం లేని ప్రసాద్ (52) ఎంపికపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఏబీవీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రసాద్ వెనుకబడిన కల్వార్ సామాజిక వర్గానికి చెందినవారు. కతిహర్ నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. తార్ కిశోర్, రేణు దేవి -
ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కేజ్రీవాల్‌తో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆదివారం రాంలీలా మైదానంలో ‘ ధన్యవాద్ ఢిల్లీ’ పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కేజ్రీవాల్‌తో ప్రమాణం చేయించారు. వరుసగా మూడవ సారి ఆయన ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించారు.మనిష్ సిసోడియా, కైలేష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. (చదవండి : బ్రేక్ లేకుండా.. రాష్ట్రాలేలిన హ్యాట్రిక్ హీరోలు..!) కాగా, ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులెవరికీ ఆహ్వానాలు పంపలేదు. వేదికపై కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వివిధ రంగాలకు చెందిన 50 మంది ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ‘ఢిల్లీ వాసులారా, మీ కుమారుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.వచ్చి మీ కుమారుడిని ఆశీర్వదించండి’ అంటూ శనివారం కేజ్రీవాల్ పిలుపునివ్వడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో వరసగా మూడో మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 62 సీట్లలో బీజేపీ 8 సీట్లలో విజయం సాధించింది. -
కేజ్రీ.. ముచ్చటగా మూడోసారి
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(51) ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని చారిత్రక రాంలీలా మైదానం వేదిక కానుంది. మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న కేజ్రీవాల్ ఈసారి.. రాజకీయ ప్రముఖులెవరికీ ఆహ్వానాలు పంపలేదు. వేదికపై కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వివిధ రంగాలకు చెందిన 50 మంది ప్రత్యేక అతిథులు ఉంటారని ఆప్ నేత మనీశ్ సిసోడియా వెల్లడించారు. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి సుమిత్ నగల్, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఐఐటీ సీటు సాధించిన విజయ్ కుమార్, మొహల్లా క్లినిక్ డాక్టర్ ఆల్కా, బైక్ అంబులెన్స్ సర్వీస్ అధికారి యుధిష్టిర్ రాఠీ, నైట్ షెల్టర్ కేర్ టేకర్ సబీనా నాజ్, మెట్రో పైలట్ నిధి గుప్తా తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి 1.25లక్షల మంది ప్రజలు తరలివస్తారని భావిస్తున్నామని మనీశ్ సిసోడియా చెప్పారు. ప్రధాని మోదీతోపాటు ఢిల్లీకి చెందిన బీజేపీ, ఆప్ ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపారు. ‘ఢిల్లీ వాసులారా, మీ కుమారుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వచ్చి మీ కుమారుడిని ఆశీర్వదించండి’ అంటూ కేజ్రీవాల్ ట్విట్టర్లో ప్రజలను ఆహ్వానించారు. రాంలీలా మైదానం, పరిసరాల్లో ఢిల్లీ పోలీసు, పారామిలిటరీ దళాలు, సీఆర్పీఎఫ్ కలిపి సుమారు 3 వేల మందిని మోహరించనున్నారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల నిఘాతోపాటు మైదానం చుట్టుపక్కల బ్యాగేజి స్కానర్లను, డోర్ ఫ్రేమ్ డిటెక్టర్లను అమర్చారు. మైదానంలోపలా బయటా ‘ధన్యవాద్ ఢిల్లీ’ అంటూ కేజ్రీవాల్ ఫొటో ఉండే భారీ కటౌట్లు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: బీజేపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలంటూ జారీ చేసిన ఆదేశాన్ని అరవింద్ కేజ్రీవాల్ వెనక్కి తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా కోరారు. ఈ ఆదేశం నియంతృత్వాన్ని తలపిస్తోందని ఆయన వ్యాఖ్యానిం చారు. ఉపాధ్యాయులకు తాము ఆహ్వానాలు పంపామేతప్ప, ఆదేశాలు కాదని ఆప్ నేత మనీశ్ సిసోడియా స్పష్టం చేశారు. కాబోయే మంత్రులకు కేజ్రీవాల్ విందు ఢిల్లీ అభివృద్ధి కార్యాచరణతోపాటు వచ్చే మూడు నెలల్లో తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపై కేజ్రీవాల్ కాబోయే మంత్రులతో చర్చించారు. గత మంత్రివర్గంలోని ఆరుగురికి శనివారం తన నివాసంలో కేజ్రీవాల్ విందు ఇచ్చారు. ఢిల్లీలో రెండు కోట్ల మొక్కలు నాటడం, యమునా నదిని శుద్ధి చేయడం, కాలుష్యం తగ్గించడం వంటి ప్రజలకిచ్చిన 10 హామీల అమలుకు రంగంలోకి దిగాలని సహచరులను కేజ్రీవాల్ కోరారని ఆప్ నేత మనీశ్ సిసోడియా తెలిపారు. గత మంత్రివర్గంలో ఉన్న సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్ సహా ఆరుగురు మంత్రులు కేజ్రీవాల్‌తోపాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
16న కేజ్రీవాల్ ప్రమాణం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా 16న ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్‌లీలా మైదానం ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రజలందరూ ప్రత్యక్షంగా వీక్షించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆప్ నేత మనీష్ సిసోడియా చెప్పారు. కేజ్రీవాల్‌తోపాటు కేబినెట్ మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున కదిలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు కేజ్రీవాల్ కొత్తఎమ్మెల్యేలతో తన నివాసంలో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలందరూ లాంఛనప్రాయంగా కేజ్రీవాల్‌ను ఆప్ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత కేజ్రీవాల్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను కలసి కొత్త ప్రభుత్వ ఏర్పాట్లపై చర్చించారు. భారీగా జన సమీకరణ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఆప్ సన్నాహాలు చేస్తోంది. భారీగా జన సమీకరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.. ఒకప్పుడు అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి వేదికగా నిలిచిన రామ్‌లీలా మైదానంలో ఆయనకు కుడిభుజంగా పని చేసి దేశ ప్రజలందరి దృష్టిని కేజ్రీవాల్ ఆకర్షించారు. కేబినెట్లో పాత ముఖాలే ? గత ప్రభుత్వంలో పనిచేసిన వారికే మళ్లీ కేజ్రీవాల్ కేబినెట్లో అవకాశం ఇవ్వనున్నట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఎలాంటి మార్పులు చేయకపోవచ్చునని తెలుస్తోంది. మనీశ్ సిసోడియా, రాజేంద్ర పాల్ గౌతమ్, సత్యేంద్ర జైన్, కైలాస్ గెహ్లాట్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్‌లు కొత్త కేబినెట్లో చోటు దక్కించుకోనున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో హోరెత్తించి, ఆప్ విద్యా రంగ సంస్కరణల్లో భాగస్వామిగా నిలిచిన ఆప్ నాయకురాలు అతిషి మర్లేనా, పార్టీకి కొత్త శక్తిగా మారిన రాఘవ్ చద్దాకు ఆర్థిక శాఖ కట్టబెడతారన్న ప్రచారమూ సాగింది. -
జార్ఖండ్ 11వ సీఎంగా హేమంత్
రాంచీ: జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష నాయకులు, కేంద్రంలో అధికార బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల అధినేతలు ఎందరో తరలిరాగా అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. తెల్లరంగు కుర్తా పైజామా, ముదురు నీలం రంగు నెహ్రూ జాకెట్ ధరించి వచ్చిన 44 ఏళ్ల ఈ ఆదివాసీ నేత అందరినీ ఆకర్షించారు. గవర్నర్ ద్రౌపది ముర్ము ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఆరు నెలలు తిరక్కముందే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట కట్టుకోవడంతో విపక్షాల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి 47 స్థానాలతో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ప్రమాణ స్వీకారానికి హాజరైన వారిలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆయన సోదరి కనిమొళి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌లు ఉన్నారు. విపక్షాల బలం పెరుగుతూ ఉండడంతో వీరంతా చిరునవ్వుతో ఒకరినొకరు పలకరించుకున్నారు. సోరెన్‌తో పాటు కాంగ్రెస్ నాయకుడు అలంఘీర్ ఆలమ్, జార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు రామేశ్వర్ ఒరాయన్, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద భోక్త కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రధాని అభినందనలు జార్ఖండ్ సీఎంగా పదవీ ప్రమాణం చేసిన సోరెన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తరఫు నుంచి వీలైనంత సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీఎంగా రెండోసారి జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన శిబూసోరెన్ వారసుడిగా హేమంత్ సోరెన్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఆయన రాష్ట్ర పగ్గాలను చేపట్టడం ఇది రెండోసారి. సోరెన్ గతంలో ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయితే సీఎంగా కేవలం 14 నెలలు మాత్రమే ఉన్నారు. బీజేపీయేతర పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి హేమంత్ పకడ్బందీ వ్యూహాలనే రచించారు. -
29న సీఎంగా హేమంత్ ప్రమాణం
రాంచీ/న్యూఢిల్లీ: జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) నేత హేమంత్ సోరెన్(44) ఈ నెల 29వ తేదీన జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం హేమంత్ సోరెన్, సంకీర్ణంలోని కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) తదితర పార్టీల నేతలతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్ ద్రౌపది ముర్మును కలిశారు. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా గవర్నర్ అంగీకరించారని, ఈ నెల 29వ తేదీన మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అనంతరం హేమంత్ సోరెన్ తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టంపై ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ..ఈ చట్టం కారణంగా తమ రాష్ట్రంలోని ఏ ఒక్కరికి నష్టం జరిగే అవకాశమున్నా అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతకుముందు జేఎంఎం ఎమ్మెల్యేలు సమావేశమై పార్టీ వర్కింగ్గా ఉన్న ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్‌ను పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్, ఆర్జేడీ నేతలతోపాటు కూటమికి మద్దతు ప్రకటించిన జార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజాతాంత్రిక్) చీఫ్ బాబూలాల్ మరాండీతో కూడా సమావేశం అయ్యారు. ఎన్నికలకు ముందే ఏర్పాటైన జేఎంఎం– కాంగ్రెస్– ఆర్జేడీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా హేమంత్ సోరెన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలి ఎన్నికల్లో శాసనసభలోని 81 స్థానాలకు గాను సంకీర్ణానికి 47 సీట్లు దక్కిన విషయం తెలిసిందే. బీజేపీ క్షీణతకు నిదర్శనం జార్ఖండ్:పవార్ ముంబై: దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాభవం తగ్గుతోందని జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యానించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేఎంఎం నేత, జార్ఖండ్ కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు శరద్ పవార్ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై హేమంత్ ట్విట్టర్లో స్పందిస్తూ..మహారాష్ట్రలో పవార్ సాగించిన పోరాటం తమకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. -
సీఎం ఖట్టర్.. డిప్యూటీ దుష్యంత్
చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికల్లో ‘హంగ్’ ఫలితాల అనంతరం హరియాణాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ మొగ్గు చూపడంతో పదవుల పంపిణీలోనూ దాదాపు స్పష్టత వచ్చింది. ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్(65) కొనసాగనుండగా, జేజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దుష్యంత్ చౌతాలా(31) డిప్యూటీ సీఎం పదవి చేపట్టనున్నారు. ఇటీవలి ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీలోని 90 స్థానాలకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 స్థానాలను ఏ పార్టీ సాధించ లేకపోయింది. ప్రధాన పార్టీలైన బీజేపీ 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10 సీట్లు గెల్చాయి. ప్రజాతీర్పును జేజేపీ గౌరవించడం లేదంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై ఆయన..‘ప్రజాతీర్పు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఉంది. అయినా, ఈ ఎన్నికల్లో మేం కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయలేదు కదా?’ అని ప్రశ్నించారు. గవర్నర్‌ను కలిసిన నేతలు బీజేపీకి చెందిన సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ శనివారం గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యను కలిసి తనతోపాటు మంత్రివర్గ సహచరులు సమర్పించిన రాజీనామా పత్రాలను అందజేశారు. రాజీనామాలను ఆమోదించిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారు. దీంతోపాటు తమకు మెజారిటీ సభ్యుల మద్దతున్నందున ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ ఖట్టర్ చేసిన వినతిని కూడా ఆయన అంగీకరించారు. అనంతరం సీఎం ఖట్టర్ మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి పండుగ రోజు ఆదివారం మధ్యాహ్నం 2.14 గంటలకు హరియాణా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. తనతోపాటు డిప్యూటీ సీఎంగా దుష్యంత్, కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారన్నారు. జేజేపీ, స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో 90 సీట్లున్న అసెంబ్లీలో తమ బలం 57కు పెరగనుందని ఆయన చెప్పారు. ఖట్టర్ వెంట వెళ్లిన జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా, స్వతంత్రులు కూడా గవర్నర్‌కు బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు లేఖలను అందజేశారు. గోపాల్ కందా మద్దతు తీసుకోం అంతకుముందు ప్రభుత్వ అతిథిగృహంలో జరిగిన బీజేపీ శాసనసభాపక్షం సమావేశం తమ నేతగా ఖట్టర్‌ను ఎన్నుకుంది. ఈ భేటీకి పార్టీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ హాజరయ్యారు. సీఎం పదవికి ఖట్టర్ పేరును ఎమ్మెల్యేలు అనిల్ విజ్, కన్వర్ పాల్ ప్రతిపాదించగా మిగతా వారు ఆమోదం తెలిపారని సమావేశం అనంతరం రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఖట్టర్ మంత్రి వర్గంలో ఒక్కరే డిప్యూటీ సీఎం ఉంటారని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో వివాదాస్పద ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తాము తీసుకోవడం లేదని ఆయన వెల్లడించారు. దుష్యంత్ తండ్రి జైలు నుంచి బయటకు చౌతాలా కుటుంబంలో విభేదాలు రావడంతో ఐఎన్ఎల్డీ పార్టీ నుంచి బయటకు వచ్చిన దుష్యంత్ గత ఏడాదే జేజేపీని స్థాపించారు. ఆయన తల్లి నైనా ఈ ఎన్నికల్లో బధ్రా నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ ఉప ప్రధాని చౌధరి దేవీలాల్ మునిమనవడు, మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా మనవడే దుష్యంత్. అధికారంలో ఉండగా ఉపాధ్యాయుల నియామకంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఓం ప్రకాశ్‌తోపాటు ఆయన తనయుడు, దుష్యంత్ తండ్రి అయిన అజయ్ చౌతాలా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సిర్సా, హిసార్లలో ఉన్న దుష్యంత్ చౌతాలా నివాసాల వద్ద భద్రతను పెంచారు. అంతేకాకుండా, ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న దుష్యంత్ తండ్రి అజయ్ చౌతాలా ఆదివారం నుంచి రెండు వారాలపాటు బయట గడిపేందుకు ఖైదీలకిచ్చే సెలవులాంటి వెసులుబాటు(ఫర్లో)ను అధికారులు కల్పించారు. -
మర్యాదగా తప్పుకోకుంటే అవిశ్వాసమే!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి 24 గంటలు కూడా కాకముందే బీజేపీ జోరుపెంచింది. కాంగ్రెస్ నేత, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సందేశాన్ని పంపింది. స్వచ్ఛందంగా తప్పుకోకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలవంతంగా సాగనంపాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు బీజేపీ తరఫు ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని నేరుగా స్పీకర్‌కు చేరవేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ విషయమై బీజేపీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘రమేశ్ కుమార్ స్వచ్ఛందంగా తప్పుకోకుంటే ఆయనపై అవిశ్వాసం పెట్టక తప్పదు. అయితే మా తొలిప్రాధాన్యం సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గడం, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలపడమే. ఇది పూర్తయ్యాక స్పీకర్ విషయమై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి లబ్ధి చేకూర్చేలా స్పీకర్ వ్యవహరించవచ్చన్న అనుమానంతోనే బీజేపీ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు యడియూరప్ప ప్రభుత్వానికి తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని జేడీఎస్ చీఫ్ దేవెగౌడ చెప్పారు. అనర్హతపై రెబెల్స్ న్యాయపోరాటం.. స్పీకర్ అనర్హతవేటు వేసిన నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుతో పాటు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాలని ఎమ్మెల్యేలు రమే శ్ జార్కిహోళి, మహేశ్ కుమటహళ్లి, శంకర్లు నిర్ణయించారు. సుప్రీంలో రమేశ్, మహేశ్‌ల పిటిషన్లు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నందున స్పీకర్ కనీసం నోటీసు ఇవ్వకుండా, తమ వివరణ తీసుకోకుండా అనర్హులను చేయడంపై వీరిద్దరూ అఫిడవిట్లు దాఖలు చేస్తారని సమాచారం. స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్.శంకర్‌ను కాంగ్రెస్ సభ్యుడిగా పరిగణిస్తూ స్పీకర్ అనర్హతవేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకర్ సోమవారం హైకోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తోంది. తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందినందున ఫిరాయింపుల చట్టం కింద వేటువేయడం కుదరదని శంకర్ చెబుతున్నారు. తమిళనాడులో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినప్పటికీ, 6 నెలల్లోపు జరిగిన ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు సుప్రీంకోర్టు, ఈసీ అనుమతించిన విషయా న్ని గుర్తుచేస్తున్నారు. కాబట్టి అసెంబ్లీ ముగిసేవరకూ (2023) అనర్హత వేటేస్తూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులు కోర్టులో నిలబడవని స్పష్టం చేస్తున్నారు. -
ఐదోసారి సీఎంగా నవీన్
భువనేశ్వర్: ఒడిశా శాసనసభ ఎన్నికల్లో వరుసగా ఐదోసారి విజయఢంకా మోగించిన బిజు జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ మే 29వ తేదీన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆయన వరుసగా ఐదోసారి ఒడిశా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. అంతకుముందు బీజేడీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం సుమారు 45 నిమిషాలు జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నవీన్ పట్నాయక్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ గణేషి లాల్‌ను కలసిన నవీన్ పట్నాయక్.. ఎమ్మెల్యేలు తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తీర్మాన ప్రతిని ఆయనకు అందజేశారు. అనంతరం ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ గణేషి లాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నవీన్ పట్నాయక్‌ను ఆహ్వానించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 146 శాసనసభ స్థానాలకు గాను 112 సీట్లలో బీజేడీ విజయం సాధించింది. బీజేపీ 23 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇక కాంగ్రెస్ 9 సీట్లకే పరిమితమైంది. పాట్కూరా శాసనసభ స్థానంలో అభ్యర్థి మరణం, ఫోణి తుపాను కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. దేశంలో మోదీ గాలి వీస్తున్పప్పటికీ రాష్ట్రంలో మాత్రం 23 సీట్లకే బీజేపీ పరిమితమైంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ అదనంగా 13 స్థానాల్ని గెలుచుకొని ప్రతిపక్ష స్థానాన్ని అందుకుంది. నిరాడంబర వ్యక్తిత్వం నిరాడంబర జీవనశైలి, సాదాసీదా ఆహార్యం, సాత్వికాహారం రాజీలేని పనితీరు ఒడిశాలో వరుసగా అయిదు పర్యాయాలు అధికారాన్ని నిలుపుకున్న నవీన్ పట్నాయక్ వ్యవహార శైలి. రాష్ట్రానికి చాలాకాలం దూరంగా ఉండటంతో మాతృభాష ఒడియాపై పట్టులేకున్నా కష్టించి పని చేయడంపై మమకారమే ఆయనను ప్రజలకు చేరువ చేసింది. ఐదేళ్లు పాటు పాలించిన నేతలు తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొం టున్న ప్రస్తుత రాజకీయాల్లో సుమారు 19 ఏళ్ల పాటు అధికారాన్ని నిలుపుకుని.. మరోసారి సీఎంగా గెలిచిన ఘనత ఆయన సొంతం. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు.. జననం.. విద్యాభ్యాసం.. ఒడిశా దివంగత ముఖ్యమంత్రి, జనతా దళ్ నేత బిజు పట్నాయక్, గ్యాన్ పట్నాయక్ దంపతుల కుమారుడైన నవీన్ పట్నాయక్ ఒడిశాలోని కటక్ ప్రాంతంలో అక్టోబర్ 16, 1946లో జన్మించారు. డెహ్రాడూన్‌లోని వెల్హం బాలుర పాఠశాల, డూన్ పాఠశాలల్లో ఆయన ప్రాథమిక విద్య నభ్యసించారు. అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాల యానికి చెందిన సెయింట్ స్టీఫెన్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. పాఠశాల స్థాయి నుంచే ఆయన చరిత్ర, ఆయిల్ పెయింటింగ్, అథ్లెటిక్స్‌పై మక్కువ పెంచుకున్నారు. డూన్ స్కూల్లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి నవీన్ మూడేళ్ల జూనియర్. ఒడిశా రాష్ట్రానికి, రాజకీయాలకు దూరంగా ఉన్న నవీన్ .. తండ్రి మరణంతో అమెరికా నుంచి తిరిగివచ్చి 1996లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. -
కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
జైపూర్: రాజస్తాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ రాజస్తాన్ 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణాస్వీకారం చేశారు. ఆయతోపాటు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సచిన్ ఫైలెట్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. జైపూర్‌లోని చారిత్రక అల్బర్ట్ హాల్లో రాష్ట్ర గవర్నర్ కళ్యాణ్ సింగ్ వీరితో సోమవారం ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు రాష్ట్ర మాజీ సీఎం వసుంధర రాజే, ఒమర్ అబ్దుల్లా, తేజస్వీ యాదవ్, కర్ణాటక సీఎం కుమార స్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా తదితరులు హాజరైయ్యారు. మోదీ శుభాక్షాంక్షలు.. రాజస్తాన్ నూతన సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అశోక్ గహ్లోత్‌కి, ఉప ముఖ్యమంత్రి సచిన్‌కు ప్రధాని నరేంద్ర మోధీ అభినందనలు తెలియజేశారు. -
నేడే కమల్‌నాథ్ ప్రమాణం
భోపాల్: మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని జంబోరీ మైదానంలో ఈ వేడుక ఉంటుందనీ, ప్రమాణ స్వీకారానికి ముందు సర్వమత ప్రార్థనలు ఉంటాయని కాంగ్రెస్ నాయకురాలు శోభా ఓజా ఆదివారం చెప్పారు. కమల్‌నాథ్ ప్రమాణం చేశాక గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆ ప్రాంగణం నుంచి వెళ్లిపోతారనీ, అనంతరం కమల్‌నాథ్‌తోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని శోభా చెప్పారు. ఇతర మంత్రులెవరూ లేకుండా కమల్‌నాథ్ మాత్రమే సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవె గౌడ, కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఆయన సోదరి కనిమొళి తదితరులు ప్రమాణ స్వీకార వేడుకకు రానున్నారని ఓజా చెప్పారు. ఇటీవలి మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు సాధించి సాధారణ ఆధిక్యానికి రెండు స్థానాల దూరంలో ఆగిపోయినప్పటికీ బీఎస్పీ, ఎస్పీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటం తెలిసిందే. 15 వరుస సంవత్సరాల బీజేపీ పాలన తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే ఏర్పాటు కాబోతోంది. వింధ్య ప్రాంతంలో ఓటింగ్ సరళిపై విచారణ మధ్యప్రదేశ్‌లోని వింధ్య ప్రాంతంలో కాంగ్రెస్‌కు అతి తక్కువ సీట్లు రావడంతో ఈ ప్రాంతంలోని ఓటింగ్ సరళిపై విచారణ జరిపించనున్నట్లు కమల్‌నా«ద్ తెలిపారు. ఇక్కడి ఈవీఎంలపై తమకు అనుమానాలున్నాయన్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 30 శాసనసభ నియోజకవర్గాలుండగా కాంగ్రెస్‌కు కేవలం 6 సీట్లే దక్కాయి. -
గహ్లోత్.. అనే నేను
జైపూర్: చరిత్రాత్మక ఆల్బర్ట్ హాల్లో సోమవారం రాజస్తాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గహ్లోత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రిగా సచిన్ పైలెట్ కూడా ప్రమాణం చేస్తారు. రాజస్తాన్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గహ్లోత్ నేడు ఉదయం 10 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ భవనంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతల సమక్షంలో అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని అశోక్ గహ్లోత్ తెలిపారు. సాధారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు రాజ్‌భవన్‌లో నిర్వహిస్తారు. అయితే 2003, 2013లో వసుంధరారాజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచి ఈ సంప్రదాయంలో మార్పు వచ్చింది. ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆల్బర్ట్ హాల్‌ను ఖరారు చేశామని కాంగ్రెస్ ప్రతినిధి సత్యేంద్రసింగ్ రాఘవ్ మీడియాకు తెలిపారు. వేడుక బహిరంగంగా జరపాలని నిర్ణయించడంతో 11 వేల మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, పుదుచ్చేరి సీఎం వి.నారాయణస్వామి, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్ హుడా తదితరులు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. అద్భుతమైన నిర్మాణ శైలికి ఆల్బర్ట్ హాల్ ఒక ఉదాహరణ. 1876లో వేల్స్ యువరాజు ఆల్బర్ట్ ఎడ్వర్డ్ జైపూర్ సందర్శన సందర్భంగా ఈ భవనానికి పునాది పడింది. 1887లో నిర్మాణాన్ని పూర్తి చేశారు. -
17న కమల్‌నాథ్ ప్రమాణం
భోపాల్: మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్(72) ఈనెల 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయన గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను కలిశారు. ఆయన వెంట సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, సురేశ్ పచౌరీ, వివేక్ తన్ఖా, అరుణ్ యాదవ్ తదితరులున్నారు. వారి భేటీ సుమారు 50 నిమిషాలపాటు సాగింది. ఈ సందర్భంగా గవర్నర్..‘రాజ్యాంగంలోని ఆర్టికల్–164 ప్రకారం అసెంబ్లీలోని అతిపెద్ద పార్టీ నేతగా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా నియమిస్తున్నాను. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను’ అంటూ కమల్‌నాథ్‌కు ఆమె ఓ లేఖ అందజేశారు. అనంతరం రాజ్‌భవన్ వెలుపల కమల్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ..భోపాల్‌లోని లాల్‌పరేడ్ గ్రౌండ్లో 17వ తేదీ మధ్యాహ్నం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కేంద్ర కేబినెట్లో పలు మంత్రిత్వశాఖలు నిర్వహించిన అనుభవమున్న కమల్‌నాథ్ మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. అసెంబ్లీలోని 230 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 116 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకోగా ఎస్పీ(1), బీఎస్పీ(2), స్వతంత్రులు(4) కలిపి 121 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ 109 స్థానాలను మాత్రం గెలుచుకుంది. అపార అనుభవం, ఆర్థిక బలం కమల్‌నాథ్‌ను సీఎంగా ఎంపిక చేయడం వెనుక ప్రధాన కారణాలు ఇవి.. ► రాజకీయ, పరిపాలన, వ్యాపార రంగాల్లో అపార అనుభవం. ఆయా రంగాల్లో కీలక భూమికలను విజయవంతంగా నిర్వహించిన దక్షత. ► నిధుల సమీకరణలో దిట్ట. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి పార్టీ రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీర్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు. దశాబ్దానికి పైగా అధికారంలో లేకపోవడంతో రాష్ట్రంలో పార్టీ దివాళా స్థితిలో ఉంది. ఈ స్థితి నుంచి ఆర్థికంగా పార్టీని గట్టెక్కించారు. ► 9 సార్లు లోక్‌సభకు ఎన్నిక. మోదీ హవాను తట్టుకుని ఎంపీ అయ్యారు. కేంద్రమంత్రిగా పలు కీలకపదవుల్లో పనిచేశారు. ► దేశంలోని వ్యాపార దిగ్గజాలతో సత్సంబంధాలు. ► రాష్ట్ర రాజకీయాలపై పట్టు. అన్ని వర్గాలతో సంబంధాలు. కార్యకర్తల్లో సింధియాపై ఉన్నది ఆకర్షణ అని, కమల్ నాథ్‌పై ఉన్నది అభిమానమని అంటుంటారు. పార్టీలో అంతర్గత వర్గ పోరాటాలపై అవగాహన, వాటిని చక్కదిద్దే సామర్ధ్యం. పీసీసీ చీఫ్‌గా అసెంబ్లీ ఎన్నికల ముందు వర్గ కుమ్ములాటలను విజయవంతంగా అదుపు చేశారు, అందరిని ఒక్కటి చేశారు. ► గాంధీ కుటుంబంతో సాన్నిహిత్యం. డూన్ స్కూల్లోనే సంజయ్ గాంధీతో స్నేహం. ఇందిరతో కొడుకులాంటి అనుబంధం. సోనియా, రాహుల్‌లకు విశ్వసనీయ సలహాదారు. ► ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్(114), బీజేపీ(109)ల స్థానాల్లో పెద్ద తేడా లేదు. మిత్ర పక్షాల మద్దతుతో మేజిక్ మార్క్ అయిన 116 సాధించింది కాంగ్రెస్. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కారును బీజేపీ పడగొట్టకుండా కాచుకోవడం కమల్‌నాథ్ వల్లనే సాధ్యమన్న నమ్మకం. ► లోక్‌సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలు గెలుచుకోవాలంటే అనుభవం, ఆర్థిక బలం, వ్యూహ నైపుణ్యం ఉన్న కమల్ సీఎంగా ఉండటం పార్టీకి అవసరం. ► 72 ఏళ్ల వయస్సు మరో కారణం. రాజకీయాల్లో మరి ఎన్నాళ్లో కొనసాగకపోవచ్చు. సింధియా యువకుడు. బోలెడంత రాజకీయ భవిష్యత్తు ఉంది. -
మీ పదవీకాలం సజావుగా సాగాలి: మోదీ
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జేడీఎస్ నేత కుమారస్వామికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ‘కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేసిన కుమారస్వామి, పరమేశ్వరలకు శుభాకాంక్షలు. వారి పదవీకాలం సజావుగా సాగాలని కోరుకుంటున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు. కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి బీజేపీ దూరంగా ఉంది. కమల్ శుభాకాంక్షలు చెన్నై: కొత్త సీఎం కుమారస్వామికి మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘కొత్త ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఇరురాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు ఇది మంచి ఆరంభం’ అని ట్వీట్ చేశారు. కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా, రాహుల్, ఏచూరి, కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్యలతో కమల్ సమావేశమయ్యారు. -
అక్కడ ప్రమాణం చేస్తే.. ఐదేళ్లు కష్టమే!
సాక్షి, బెంగళూరు: జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి సీఎంగా విధానసౌధ ముందు ప్రమాణస్వీకారం చేశారు. గత చరిత్ర చూస్తే విధానసౌధ ఆవరణలో ప్రమాణస్వీకారం చేసిన ఏ ముఖ్యమంత్రీ ఇంతవరకు ఐదేళ్లు పదవిలో లేరు. గతంలో ప్రమాణస్వీకార కార్యక్రమాలు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో నిర్వహించేవారు. కానీ 1993లో అప్పటి జనతాదళ్ నేత రామకృష్ణ హెగ్డే తొలిసారిగా విధానసౌధ ముందు సీఎంగా ప్రమాణం చేశారు. మద్యం కాంట్రాక్టుల ఆరోపణలతో ఏడాదిలోపే సీఎం పదవిని కోల్పోయారు. అదేఏడాది హెగ్డే మరోసారి సీఎంగా ప్రమాణంచేసినా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో మళ్లీ పదవిని పోగొట్టుకున్నారు. 1990లో సీఎంగా విధానసౌధ వద్ద ప్రమాణం చేసిన బంగారప్ప కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. కావేరీ జాలాల విషయమై రాష్ట్రంలో అల్లర్లు చెలరేగడంతో ఆయన రెండేళ్లలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2006లో బీజేపీ మద్దతుతో విధానసౌధ ముందు సీఎంగా ప్రమాణం చేసిన కుమారస్వామి కేవలం 20 నెలలే పరిపాలించగలిగారు. యడ్యూరప్పకూ చుక్కెదురే.. కర్ణాటకలో 2008లో జరిగిన ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పటికీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అప్పట్లో విధానసౌధ ముందు అట్టహాసంగా, ఎంతో ఆడంబరంతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప అవినీతి ఆరోపణలతో మూడేళ్లకే పదవికి దూరమయ్యారు. -
మోదీ అశ్వమేధ గుర్రాన్ని కట్టేశాం
బెంగళూరు/మైసూరు: ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాల అశ్వమేధ గుర్రాన్ని కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ కూటమి కట్టేసిందని కర్ణాటక సీఎం కుమారస్వామి వ్యాఖ్యానించారు. సీఎంగా ప్రమాణం చేశాక మాట్లాడుతూ ‘మోదీ, షాల అశ్వమేధ గుర్రాన్ని కట్టేయడమే నా లక్ష్యమని యూపీ ఎన్నికల తర్వాత చెప్పా. కాంగ్రెస్ సాయంతో ఈరోజు కర్ణాటకలో నేను ఆ పని చేయగలిగా’ అని అన్నారు. సీఎంగా ప్రమాణం చేయడానికి ముందు ఆయన మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు రుణాలను మాఫీ చేసి తీరుతామనీ, అయితే ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో ఉన్నందున అందుకు కొంత సమయం పడుతుందన్నారు. రైతులు ఆత్మహత్యల వంటి తీవ్ర చర్యలకు పాల్పడకుండా మనోనిబ్బరంతో ఉండాలనీ, రైతుల బిడ్డగా, సేవకుడిగా వారి బాధను అర్థం చేసుకుంటానన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసే పోటీ చేస్తాయని వెల్లడించారు. సంకీర్ణ ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకునేందుకు కొన్ని పరిమితులు ఉంటాయనీ, ఏదైనా చేయాలంటే భాగస్వామ్య పక్షం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుతో దేశరాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నామ ని అన్నారు. బీజేపీకి అధికారం దక్కనివ్వకూడదన్న లక్ష్యంతోనూ, దేశ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్‌తో జతకలిసినట్లు కుమారస్వామి వెల్లడించారు. -
లవ్ ఇన్ బెంగళూరు..!
కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం.. ఎన్డీయేతర ప్రాంతీయ పార్టీల ఐక్యతకు వేదికగా మారింది. సంకీర్ణ కూటమి భాగస్వామిగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్, సోనియాలు హాజరైనా.. వేదికపై ప్రాంతీయ పార్టీల అధినేతల సందడి ప్రధానంగా కనిపించింది. ఎస్పీ చీఫ్ అఖిలేశ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సహా పలువురు ప్రాంతీయ పార్టీల నేతలు, బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. కన్నడనాట బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కీలకంగా వ్యవహరించినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ని ఏపీ సీఎం చంద్రబాబు భుజం తట్టి అభినందించారు. చేయి కలిపి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ కృషిని బాబు ప్రశంసించారు. కాసేపు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. సోనియా, మాయావతిల ఆత్మీయ ఆలింగనం అందరి దృష్టిని ఆకర్షించింది. సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్డీ కుమారస్వామి బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. కేంద్రంలో ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యకూటమి వేసిన తొలి అడుగుగా భావిస్తున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా సహా పలు రాష్ట్రాల సీఎంలు, ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరయ్యారు. కన్నడ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ప్రాంతీయ పార్టీల మేళాను తలపించింది. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పక్షంలో ఉన్న దాదాపు అన్ని పార్టీల నేతలు వేదికపై కనిపించారు. కర్ణాటక విధానసౌధ ఆవరణలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. సైద్ధాంతిక వైరుధ్యాలను పక్కనపెట్టి వీరంతా ఒకే వేదికను పంచుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్నాను. సోనియా, మమతలు ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవడం, తేజస్వీ యాదవ్ మమత, మాయావతి, సోనియాల పాదాలకు నమస్కరించటం అందరి దృష్టిని ఆకర్షించాయి. రాహుల్‌ను ప్రశంసించిన బాబు ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక రాహుల్ దగ్గరికెళ్లిన చంద్రబాబు భుజం తట్టి అభినందించారు. చేయి కలిపి శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటకలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ కృషిని బాబు ప్రశంసించారు. సాధారణంగా రెండు వేళ్లు పైకెత్తి విక్టరీ సింబల్‌తో అభివాదం చేసే చంద్రబాబు.. ఈ వేదికపై మాత్రం చెయ్యి ఊపుతూ అభిమానులను పలకరించటం ఆసక్తిరేపింది. మమత, మాయావతి, అఖిలేశ్‌లతోనూ కబుర్లు చెప్తూ కనిపించారు. కార్యక్రమంలో చంద్రబాబు ఎక్కువసేపు మమతా బెనర్జీతో మాట్లాడుతూ కనిపించారు. మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ దేవెగౌడ వేదికపైకి వచ్చిన అతిథులకు స్వాగతం పలికారు. హాజరైన ప్రముఖులు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, పంజాబ్ సీఎం అమరీందర్, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం విజయన్, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీపీఎం, సీపీఐల ప్రధాన కార్యదర్శులు ఏచూరి, సురవరం సుధాకరరెడ్డి, శరద్ యాదవ్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్, డీఎంకే నేత కనిమొళి, ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రమే కుమారస్వామిని కలిసి అభినందించి వెళ్లారు. వేదికపై అపురూప దృశ్యాలు శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీతారాం ఏచూరి వేదిక చివర్లో కూర్చుని మాట్లాడుకోవటం, అఖిలేశ్, మాయావతిల కబుర్లు, మాయావతి, సోనియా ఆత్మీయ ఆలింగనం వంటి ఆసక్తికర దృశ్యాలన్నీ వేదికపై కనిపించాయి. ఈ ప్రాంతీయ పార్టీల నేతలంతా కార్యక్రమానికి ముందు.. ప్రమాణస్వీకారం తర్వాత ఆప్యాయంగా పలకరించుకున్నారు. ‘అన్ని ప్రాంతీయ పార్టీలతో మేం టచ్‌లో ఉంటాం. తద్వారా దేశాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి మేం కలిసి పనిచేసేందుకు వీలుంటుంది’ అని మమత అన్నారు. ముభావంగా వజూభాయ్! కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత నెలకొన్న పరిస్థితుల్లో బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించటం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న గవర్నర్ వజూభాయ్ వాలా కార్యక్రమంలో ముభావంగా కనిపించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే వేదిక దిగి వెళ్లిపోయారు. కుమారస్వామి గవర్నర్‌కు వీడ్కోలు చెప్పలేదు. వర్షంతో ఇబ్బందులు ప్రమాణ స్వీకారోత్సవానికి వర్షం ఇబ్బంది కలిగించింది. మధ్యాహ్నం 1.30 నుంచే బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. అక్కడే ప్రమాణ స్వీకారం జరుగుతుందా? అన్న అనుమానం కలిగింది. ఒక దశలో విధానసౌధ లోపల కార్యక్రమం నిర్వహించాలని ఆలోచించారు. సాయంత్రంకల్లా వర్షం తగ్గుముఖం పట్టడంతో ప్రాంగణంలోనే ప్రమాణం నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు రావడంతో విధానసౌధ ఎదుట భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. విధానసౌధ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెట్రో స్టేషన్లో ప్రయాణికుల రద్దీతో తీవ్ర గందరగోళం నెలకొంది. నేతలకు ట్రాఫిక్ చిక్కులు ప్రత్యేక విమానంలో బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న సోనియా, రాహుల్‌లు ఎయిర్‌పోర్టునుంచి వస్తుండగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జామ్ అయ్యాయి. నివాసం నుంచి విధానసౌధకు బయల్దేరిన జేడీఎస్ జాతీయాధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడకు కూడా ట్రాఫిక్ చిక్కులు తప్పలేదు. బెంగళూరుకు చేరుకున్న తర్వాత సోనియా, రాహుల్ నేరుగా తమ ఎమ్మెల్యేలున్న హిల్టన్ హోటల్‌కు వెళ్లారు. వారందరితోనూ మాట్లాడారు. వారిని అభినందించారు. బలపరీక్ష పూర్తయ్యేంతవరకు ఎమ్మెల్యేలు హోటల్లోనే ఉండాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. కన్నడ ప్రజల సాక్షిగా.. గవర్నర్ వజూభాయ్ కుమారస్వామితో ప్రమాణం చేయించారు. సంప్రదాయ దుస్తులైన ధోతీ, తెల్లని షర్టు ధరించిన కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, దళిత నేత పరమేశ్వర ప్రమాణం చేశారు. బుధవారం ఉదయమే కేపీసీసీ చీఫ్‌గా పరమేశ్వర రాజీనామా చేశారు. ఈ సంకీర్ణ సర్కారు శుక్రవారం విశ్వాస పరీక్ష ఎదుర్కొనుంది. ఆ తర్వాతే మిగిలిన మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనంతరం కుమారస్వామి కూడా ఒక్కొక్క నాయకుడి దగ్గరకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన తన తల్లి చెన్నమ్మ పాదాలకు నమస్కారం చేశారు. కుమారస్వామి, డీకే శివకుమార్‌లు చేయిచేయి కలిపి కార్యకర్తలకు అభివాదం చేశారు. విధానసౌధ ప్రాంగణంలో ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన వేలాదిమంది కార్యకర్తలు ప్రమాణస్వీకార వేదికపై నుంచి అభివాదం చేస్తున్న పవార్, సోనియా, మాయావతి, రాహుల్, ఏచూరి, కుమారస్వామి, అఖిలేశ్ తదితరులు. ఆప్యాయంగా పలకరించుకుంటున్న మాయావతి, సోనియా. కుటుంబ సభ్యులతో కుమారస్వామి -
కుమారస్వామి ప్రమాణం.. విచిత్ర దృశ్యాలు
బెంగళూరు: సైద్ధాంతిక విబేధాలను పక్కనపెట్టిమరీ బద్ధశత్రువులు కరచాలనం చేశారు.. ఉమ్మడి శత్రువును ఎలా ఢీకొట్టాలో గుసగుసలాడుతూ వ్యూహాలు పంచుకున్నారు. వారిలో కొందరు అవకాశవాదులూ ఉన్నారు.. ఏదైదేనేం.. మొత్తానికి ఒక్కటిగా చేతులు పైకిలేపారు.. బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ ప్రాంగణం నుంచి ఉమ్మడిగా సమర శంఖారావం పూరించారు.. మరి ఆ శబ్ధం ఢిల్లీలోని రాయిసీనా హిల్స్ ఆఫీసులో కొలువుదీరిన నరేంద్ర మోదీకి.. దీన్‌దయాళ్ మార్గ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కూర్చున్న అమిత్ షాకి ఎలా వినపడి ఉంటుంది? (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) రాజకీయాల్లో శాశ్వత మిత్రులుగానీ, శాశ్వత శత్రువులుగానీ ఉండరన్న నానుడి తెలిసిందే. అయితే కీలకమైన 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి శత్రువును ఎదుర్కోవడానికి మిత్రులుకాని వారంతా ఒక్కటికావడం.. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవంలో కనిపించిన విచిత్ర దృశ్యం. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరితో చేయికలిపారు. ఐక్యంగా ఉంటే శత్రువును ఓడించొచ్చని ఇప్పటికే గ్రహించిన మాయావతి-అఖిలేశ్‌లు పక్కపక్కనే నిల్చొని నవ్వులు చిందించారు. గంభీరవదనంతో శరద్ పవార్ వేదికకు నిండుదనం తెచ్చారు. ఆర్ఎల్డీ నేత అజిత్‌సింగ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్‌లు అదనపు వెలుగులు చిందించారు. ఇక ఎన్నికలకో పార్టీతో జతకడుతూ రంగులు మార్చే చంద్రబాబు నాయుడు.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో కరచాలనం చేసి ముచ్చటించారు. చాలా రోజుల తర్వాత అంతమంది మనుషుల మధ్యలో, అతిదగ్గరగా నిలబడ్డ సోనియా గాంధీ.. మీడియా కెమెరాల వైపునకు సవాలు విసురుతున్నట్లు ఓ చూపు చూశారు.. భారత్‌లో గతంలోనూ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ.. ఎన్నికలకు ముందు ఇన్ని విభిన్న పార్టీలు ఒకే వేదికపైకి రావడం, తద్వారా ఉమ్మడి శత్రువుకు హెచ్చరిక సంకేతాలు పంపడం మాత్రం ఇదే ప్రధమం. కాంగ్రెసేతర-బీజేపీయేతర కూటమి కావాలన్న కేసీఆర్, తమిళానాడులో ఆందోళనల కారణంగా స్టాలిన్, తెలియని కారణంతో నవీన్ పట్నాయక్‌లు ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. -
బద్ధశత్రువులు కరచాలనం చేశారు
-
ఐదేళ్లు నడుపుతా.. మద్దతివ్వండి
న్యూఢిల్లీ: కాంగ్రెస్, జేడీఎస్ కలసి సుహృద్భావపూర్వకంగానే కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నట్లు జేడీఎస్ నేత కుమారస్వామి స్పష్టం చేశారు. బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న స్వామి.. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్, సోనియా గాంధీలతో సమావేశమయ్యారు. తుగ్లక్ లేన్‌లోని రాహుల్ నివాసంలో 20 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో కన్నడనాట ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలు, మంత్రిత్వ శాఖల పంపకం పైనే ప్రధానంగా చర్చ జరిగింది. కర్ణాటకలో సుస్థిరమైన పాలన అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. కీలకాంశాల్లో రాహుల్ మద్దతు, సలహాలు, సూచనలు కావాలని కుమారస్వామి కోరగా.. రాహుల్ సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పారని సమాచారం. భేటీ అనంతరం కుమార స్వామి మాట్లాడుతూ.. ‘మేం ఇకపై కలసి ముందుకెళ్లాలని నిర్ణయించాం. అందుకే వారి (సోనియా, రాహుల్) సూచనలు తీసుకుందామనే ఇక్కడికి వచ్చాను. మంత్రివర్గ శాఖల పంపకంలో ఎలాంటి బేరసారాల్లేవు. మేం సుహృద్భావపూర్వక వాతావరణంలో చర్చించుకుని నిర్ణయిస్తాం’ అని పేర్కొన్నారు. ప్రమాణస్వీకారానికి సోనియా, రాహుల్ రావాలని ఆయన ఆహ్వానించారు. బెంగళూరులోనే నిర్ణయం డిప్యూటీ సీఎం ఎంపికపై స్పందిస్తూ.. ‘దీనికి సంబంధించిన విధివిధానాలను రాహుల్ చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు కేసీ వేణుగోపాల్‌కు దీనిపై చర్చించేందుకు పూర్తి అనుమతులిచ్చారు. కర్ణాటక సీనియర్ నేతలతో మంగళవారం బెంగళూరులో సమావేశమై మంత్రివర్గ కూర్పుపై తుది నిర్ణయం తీసుకుంటాం’ అని కుమారస్వామి వెల్లడించారు. జేడీఎస్–కాంగ్రెస్ కూటమి కర్ణాటకకు సుస్థిరమైన పాలన అందిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రశాంతంగా నడిచేందుకు ఓ సమన్వయ కమిటీని ఏర్పాటుచేసేందుకు ఇరుపార్టీలు అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఆరుగురు సభ్యుల కమిటీలో ఇరుపార్టీల్లోని చెరో ముగ్గురు సీనియర్ నేతలుండాలని నిర్ణయించారు. కూటమిలో పెద్ద పార్టీగా ఉన్నందున స్పీకర్ పోస్టును తమకే ఇవ్వాలని కాంగ్రెస్ ప్రతిపాదించగా.. కుమారస్వామి అంగీకరించినట్లు తెలిసింది. అయితే, కాంగ్రెస్ తరపున ఎవరు ఉపముఖ్యమంత్రిగా ఉండాలనే అంశంపై మంగళవారం జేడీఎస్‌తో చర్చల్లోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉండాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తుండగా.. కుమారస్వామి తిరస్కరించినట్లు తెలుస్తోంది. పరస్పర ప్రయోజనాలపై చర్చ ఈ భేటీ జరిగిన కాసేపటికే.. స్వామి ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ‘కుమారస్వామిని కలవటం ఆనందంగా ఉంది. కర్ణాటకలో ఇరువురి పరస్పర ప్రయోజనాల అంశాలను, రాజకీయ పరిస్థితులను చర్చించుకున్నాం. బెంగళూరులో ఆయన ప్రమాణస్వీకారానికి నేను వెళ్తున్నా’ అని రాహుల్ ట్వీట్ చేశారు. సోనియా, రాహుల్‌లను కలవకముందే.. బీఎస్పీ అధినేత్రి మాయావతిని స్వామి కలిశారు. 2019 ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసికట్టుగా ప్రయత్నించాలన్న అంశంపై వీరిద్దరు చర్చించినట్లు తెలిసింది. రేపు సాయంత్రం 4.30కు కర్ణాటక సీఎంగా కుమారస్వామి బుధవారం సాయంత్రం 4.30 గంటలకు విధానసౌధలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్ వజూభాయ్ వాలా పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీతోపాటుగా బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్ సహా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరు కానుండగా.. తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు, ఎస్పీ నేత అఖిలేశ్‌యాదవ్. బీఎస్పీ అధినేత్రి మాయావతిలు కూడా ప్రమాణస్వీకారంలో పాల్గొనవచ్చని తెలుస్తోంది. 12 ఏళ్లలో కుమారస్వామి సీఎంగా బాధ్యతలు తీసుకోవటం ఇది రెండోసారి. కాగా, మంత్రి పదవులు ఆశిస్తున్న వారికి కేబినెట్లో స్థానం దక్కని పక్షంలో తిరుగుబాటు రావొచ్చన్న ఆందోళనతో.. కుమారస్వామితోపాటు కొందరితోనే మంత్రులుగా ప్రమాణం చేయించాలని సోనియా, రాహుల్ సూచించినట్లు సమాచారం. విశ్వాస పరీక్ష తర్వాత కేబినెట్‌ను విస్తరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోమవారం ఢిల్లీలో రాహుల్, సోనియాలతో కుమారస్వామి. చిత్రంలో డానిష్ అలీ, కేసీ వేణుగోపాల్ -
సీఎం సీటు పంచుకోం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్న జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి.. సీఎం సీటును జేడీఎస్–కాంగ్రెస్ కొంతకాలం పాటు పంచుకుంటాయంటూ వస్తున్న వార్తలను ఖండించారు. కూటమి భాగస్వామి కాంగ్రెస్‌తో ఇలాంటి ఒప్పందాలేమీ లేవని ఆయన ఆదివారం బెంగళూరులో స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీ వెళ్లనున్న కుమారస్వామి.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియా గాంధీలతో సమావేశమై మంత్రిమండలి కూర్పుపై చర్చిస్తామన్నారు.‘రేపు ఢిల్లీ వెళ్తున్నాను. సోనియా, రాహుల్‌తో భేటీ అవుతాను. కేబినెట్ విస్తరణతోపాటుగా ఐదేళ్లపాటు సుస్థిర ప్రభుత్వం నడిపేందుకు అవసరమైన అంశాలపై చర్చిస్తాను.సీఎం సీటు పంపకంపై ఎలాంటి ఒప్పందం జరగలేదు. దీనిపై వస్తున్న వార్తలు అవాస్తవం’ అని స్వామి పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత 24 గంటల్లోనే బలనిరూపణ చేసుకుంటానని ఆయన వెల్లడించారు. కుమారస్వామితోపాటుగా సిద్దరామయ్య, జి. పరమేశ్వరన్, డీకే శివకుమార్‌లుకూడా ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా, ఆదివారం కాంగ్రెస్ నేతలతో కుమారస్వామి భేటీ అయ్యారు. విశ్వాస పరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. అయితే డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్ నుంచి దళిత నేతను ఎన్నుకోవటం దాదాపు ఖాయమైంది. అది పీసీసీ చీఫ్ జి. పరమేశ్వరే అని తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ బలం ఆధారంగా.. 34 మంత్రులను ఏర్పాటుచేసుకునే అవకాశం ఉంది. అయితే, జేడీఎస్, కాంగ్రెస్ మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం జేడీఎస్ సీఎం, 13 కేబినెట్ బెర్తులు, కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం సహా 20 కేబినెట్ బెర్తులు పంచుకోనున్నట్లు తెలుస్తోంది. కుమారస్వామి తనవద్దే ఆర్థిక శాఖను అంటిపెట్టుకోవచ్చని సమాచారం. డిప్యూటీ సీఎంగా పీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వరన్ ఎంపిక దాదాపు ఖాయంగానే తెలుస్తోంది. కూటమి ఎమ్మెల్యేలను కాపాడటంతో కీలకపాత్ర పోషించిన డీకే శివకుమార్‌కు కీలక శాఖను అప్పజెప్పాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌తో విభేదాల్లేవ్! ముఖ్యమంత్రి సీటుతో పాటు పలుఅంశాల్లో కాంగ్రెస్‌తో విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కుమారస్వామి తెలిపారు. రాజరాజేశ్వరినగర్, జయనగర్ అసెంబ్లీ స్థానాల ఎన్నికల విషయంపై ప్రస్తుతానికి చర్చించడం లేదన్నారు. ‘ఈ రెండుచోట్ల గెలవటం మాకు చాలా ముఖ్యం. ముందు ప్రభుత్వ ఏర్పాటు. ఆ తర్వాతే వీటిపై చర్చిస్తాం’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలతో సమావేశం అనంతరం.. బెంగళూరులోని ఓ హోటల్లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అయితే క్యాంపులో ఉండాలా లేక ఇంటికెళ్లి బుధవారం ప్రమాణస్వీకారానికి రావాలా అన్న విషయంలో నిర్ణయించుకునే పూర్తి హక్కును ఎమ్మెల్యేలకే వదిలేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం తమిళనాడులోని ఓ దేవాలయ సందర్శనకు స్వామి బయలుదేరారు. రజనీ వర్సెస్ స్వామి తమిళనాడుకు వచ్చి ఇక్కడి రైతుల పరిస్థితి చూస్తే.. కుమార స్వామి మనసు మార్చుకుని కావేరీ నీటిని విడుదల చేసే అవకాశం ఉందని రజనీకాంత్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను కుమారస్వామి తిప్పికొట్టారు. ‘కర్ణాటకలో నీరుంటే వారికి విడుదల చేయగలం. రజనీకాంత్ ఇక్కడికొచ్చి మా డ్యాముల పరిస్థితి, రైతుల దీనస్థితి చూడాలని ఆహ్వానిస్తున్నా. ఇవన్నీ చూశాక కూడా మీరింకా నీరు కావాలంటే మనం చర్చిద్దాం’ అని పేర్కొన్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు! కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి మంత్రివర్గంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండే అవకాశం ఉందని కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి సోమవారం కలిసిన అనంతరం తుది నిర్ణయం వెలువడుతుందని ఆయన వెల్లడించారు. కర్ణాటక విధానసభ ఎన్నికల ఫలితాల రోజున కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం జేడీఎస్‌కు ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాల్సి ఉంది. డిప్యూటీ సీఎంగా పరమేశ్వరతో పాటు జేడీఎస్ నుంచి కూడా మరో ఉపముఖ్యమంత్రి ఉండొచ్చని తాజా సమాచారం. రిసార్టులోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప రాజీనామా తర్వాత జరిగే ప్రతి పరిణామాన్ని కాంగ్రెస్, జేడీఎస్ కూటమి జాగ్రత్తగా గమనిస్తూ ముందుకెళ్తోంది. ఏ విషయంలోనూ తప్పటడుగుల్లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే కుమారస్వామి బలనిరూపణ చేసుకోవాలని భావిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంకా బెంగళూరు శివార్లలోని రిసార్టులోనే ఉన్నారు. ముందుగా అనుకున్నదాని ప్రకారం సోమవారం కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయాల్సి ఉన్నప్పటికీ.. జేడీఎస్ బుధవారానికి వాయిదా వేసింది. సోమవారం (మే 21) మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి కారణంగా దీన్ని రెండ్రోజులు వెనక్కు జరిపారు. ప్రస్తుతానికి 221 మంది సభ్యులున్న సభలో ఈ కూటమికి 117 మంది ఎమ్మెల్యేలున్నారు. కుమారస్వామి తాను ఎన్నికైన రెండో స్థానానికి (రామనగర) రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. అయితే మొదట కంఠీరవ స్టేడియంలోప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించినప్పటికీ.. దీన్ని విధానసౌధకే మార్చే అవకాశం ఉంది. -
ఎప్పుడు.. ఏంటీ...
న్యూఢిల్లీ: మే 12 నుంచి శనివారం వరకు థ్రిల్లర్‌ను తలపించిన కర్ణాటక రాజకీయ పరిణామాల క్రమం.. ► మే 12: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ► మే 15: వెలువడిన ఎన్నికల ఫలితాలు. 104 మంది సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 37 సీట్లు. ► ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీతోపాటు కాంగ్రెస్–జేడీఎస్ కూటమి సంసిద్ధత. ► మే 16: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీని కోరిన గవర్నర్ వజూభాయ్ వాలా. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని యడ్యూరప్పకు ఆహ్వానం. ► దీనికి వ్యతిరేకంగా అదే రోజు సాయంత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ ► మే 16, 17: అర్ధరాత్రి తర్వాత కాంగ్రెస్ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు ► యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ ► సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం ► మే 18: మే 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు బలం నిరూపించుకోవాలని యడ్యూరప్పకు సుప్రీంకోర్టు ఆదేశం ► ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య నియామకంపై మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్–జేడీఎస్. ► మే 19: విశ్వాస పరీక్ష కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు. బోపయ్య నియామకానికి సమర్థన. ► సాయంత్రం 4 గంటలకు: ‘విశ్వాస పరీక్ష ఎదుర్కోలేను. రాజీనామా చేస్తా..’ అని ప్రకటించిన యడ్యూరప్ప. -
23న కుమారస్వామి ప్రమాణం
బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా హెచ్డీ కుమారస్వామి మే 23న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడు రోజులకే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో.. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి శాసనసభా పక్ష నేతగా ఉన్న కుమారస్వామిని శనివారం రాత్రి గవర్నర్ వజుభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ‘గవర్నర్ ఆహ్వానం మేరకు ఆయనను కలుసుకున్నాను. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కోసం మే 15న సమర్పించిన వినతిపత్రం మేరకు మమ్మల్ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు’ అని కుమార స్వామి చెప్పారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం రాజ్‌భవన్ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 15 రోజుల్లో సభలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారని, అంతకంటే ముందుగానే బలపరీక్షకు వెళ్తామని తెలిపారు. మే 21న కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉండవచ్చని తొలుత చెప్పిన ఆయన.. కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం మే 23న ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. అందుకు కారణాల్ని మాత్రం వెల్లడించలేదు. మే 21న రాజీవ్ గాంధీ వర్ధంతి నేపథ్యంలో ప్రమాణ స్వీకారాన్ని మే 23కు మార్చారని జేడీఎస్ నాయకుడొకరు చెప్పారు. ‘మే 24న బలపరీక్షకు వెళ్లాలన్న అంశంపై కాంగ్రెస్‌తో చర్చించాం’ అని కుమారస్వామి పేర్కొన్నారు. మే 21న సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి ధన్యవాదాలు చెపుతానని, అలాగే కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన ఎంత మంది మంత్రులుగా ఉండాలన్న అంశంపై వారితో చర్చిస్తానని ఆయన తెలిపారు. విపక్ష నేతలకు ఆహ్వానం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు ప్రాంతీయ పార్టీల నేతల్ని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించామని కుమారస్వామి చెప్పారు. యూపీఏ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, మాయావతి, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, కేసీ వేణుగోపాల్, మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ పరమేశ్వర, పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు కాంగ్రెస్–జేడీఎస్‌లు సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తాయని తెలిపారు. మరోసారి బీజేపీ తమ ఎమ్మెల్యేలను చీల్చే ప్రయత్నం చేయవచ్చని ఆందోళన వ్యక్తం చేసిన కుమార స్వామి.. ‘వారు ఇబ్బందులు సృష్టిస్తారన్న విషయం తెలుసు. వాటిని తిప్పికొట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు. -
యడ్డీ ప్రమాణాన్ని అడ్డుకోలేం!
న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయంపై సుప్రీంకోర్టులో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకూ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్–జేడీఎస్‌లు సుప్రీంలో ఉమ్మడి పిటిషన్ దాఖలు చేయగా.. ప్రమాణ స్వీకారంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి మెజార్టీ ఉండగా.. బీజేపీ నేత యడ్యూరప్పను ప్రమాణస్వీకారానికి గవర్నర్ ఆహ్వానించారని, దానిని అడ్డుకోవాలని అర్థరాత్రి 12 గంటల సమయంలో కాంగ్రెస్–జేడీఎస్‌లు సుప్రీం తలుపుతట్టాయి. అప్పటికప్పుడే వాదనలు వినాలని ఆ పార్టీ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఇంటికి వెళ్లి అభ్యర్థించారు. దీంతో జేడీఎస్–కాంగ్రెస్‌లు ఉమ్మడిగా దాఖలు చేసిన పిటిషన్ విచారణ కోసం అప్పటికప్పుడు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని సీజేఐ ఏర్పాటు చేశారు. గురువారం తెల్లవారుజామున 2.11 గంటలకు కాంగ్రెస్–జేడీఎస్ పిటిషన్‌పై ప్రత్యేక ధర్మాసనం విచారణ ప్రారంభించింది. 5.28 గంటలకు మధ్యంతర ఆదేశాలిస్తూ.. ‘ యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై మేం స్టే ఇవ్వలేం. అయితే ప్రమాణస్వీకారం, కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు అనేవి కేసు తుది తీర్పునకు లోబడి ఉంటాయి’ అని స్పష్టం చేసింది. గవర్నర్, యడ్యూరప్ప లేఖల్ని సమర్పించండి.. మెజార్టీ ఉన్న కాంగ్రెస్–జేడీఎస్ కూటమిని ఆహ్వానించకపోవడం అప్రజాస్వామికమని, గురు వారం ఉదయం 9 గంటలకు ప్రమాణస్వీకారం ఉండడం వల్లే అర్ధరాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని కాంగ్రెస్–జేడీఎస్‌ల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేశ్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై స్టే విధించాలని, లేదంటే వాయిదా వేయాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. అందుకు సుప్రీం నిరాకరిస్తూ.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలాకు యడ్యూరప్ప పంపిన లేఖ, యడ్యూరప్పను ఆహ్వానిస్తూ గవర్నర్ పంపిన సమాధానాన్ని శుక్రవారంలోగా తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ధర్మాసనం వాయిదావేసింది. అర్ధరాత్రి పిటిషన్ వేయాల్సిన అవసరమేంటి? ఈ కేసులో కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, బీజేపీ ఎమ్మెల్యేలు గోవింద్ కర్జోల్, ఉదాసి, బసవరాజ్ బొమ్మైల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీలు వాదనలు వినిపిస్తూ.. ప్రమాణ స్వీకారం వాయిదా, స్టే విధించాలన్న అభ్యర్థనను వ్యతిరేకించారు. ‘యడ్యూరప్ప, గవర్నర్ల మధ్య సమావేశంలో ఏం జరిగిందో మనకు తెలియదు. మొత్తం వ్యవహారం అస్పష్టంగా ఉంది. ఇంతవరకూ అన్నీ ఊహాగానాలే’ అని వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పిటిషన్ దాఖలు చేయడాన్ని రోహత్గీ ప్రశ్నిస్తూ.. ‘ఒకరి ప్రమాణ స్వీకారంతో ఏదైనా ఘోరం జరిగిపోతుందా? ఇది చావు బతుకుల సమస్యో లేక ఎవరినో ఉరితీస్తున్న అంశమో కాదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు పార్టీని ఆహ్వానించడం గవర్నర్‌కున్న రాజ్యాంగ విధి.. ఆయన చర్యలు ఎప్పుడూ న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ కేసులో లాగానే యథాపూర్వ స్థితిని కొనసాగించమని కోర్టు ఆదేశించవచ్చు’ అని రోహత్గీ వాదించారు. ఆ సయయంలో సింఘ్వీ జోక్యం చేసుకుంటూ.. బలనిరూప ణ కోసం గవర్నర్ 15 రోజుల గడువు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. అలా చేయడం వల్ల ప్రలోభాలకు, ఎమ్మెల్యేల కొనుగోలుకు దారితీసే ప్రమాదముందన్నారు. -
యడ్డీ గట్టెక్కేదెలా..?
న్యూఢిల్లీ: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప ముందు బలనిరూపణ పెద్ద సవాలుగా నిలిచింది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కలిపి బీజేపీ బలం 105 మాత్రమే. మెజారిటీ మేజిక్ ఫిగర్ మాత్రం 112. ఈ పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష నెగ్గడమెలా? ఇందుకు సంబంధించి యడ్యూరప్ప ముందు రెండు మార్గాలున్నాయి. అవి.. 1. విపక్ష సభ్యుల గైర్హాజరు విశ్వాస పరీక్ష సమయంలో కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన కనీసం 13 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా చేయాలి. లేదా అసెంబ్లీకి హాజరైనా ఓటింగ్‌లో పాల్గొనకుండా చూడాలి. దానివల్ల అసెంబ్లీకి హాజరై ఓటేసే ఎమ్మెల్యేల సంఖ్య 209కి పడిపోతుంది. అప్పుడు హాజరైన లేదా ఓటేసిన ఎమ్మెల్యేల్లో యూడ్యూరప్పకు మెజారిటీ(సగం కన్నా ఒకరు ఎక్కువ) లభిస్తే సరిపోతుంది. అంటే 105 మంది ఎమ్మెల్యేల మద్దతుంటే యడ్యూరప్ప గట్టెక్కుతారు. ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కలిపి బీజేపీకి ఇప్పటికే 105 మంది శాసన సభ్యుల మద్దతుంది. గైర్హాజరైన లేదా ఓటేయని ఎమ్మెల్యేలను ఆయా పార్టీలు బహిష్కరిస్తే ఉప ఎన్నికలు జరుగుతాయి. 2. కాంగ్రెస్, జేడీఎస్‌ల్లో చీలిక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల్లో.. ఏ ఒక్క పార్టీ నుంచైనా కనీసం మూడింట రెండొంతుల మంది ఆయా పార్టీల నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరాలి. ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కాకుండా ఉండాలంటే.. కాంగ్రెస్ నుంచి కనీసం 52 మంది లేదా జేడీఎస్ నుంచి 24 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించాలి. కాంగ్రెస్ నుంచి మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు వస్తే బీజేపీ బలం 157 చేరుతుంది. లేదా జేడీఎస్ నుంచి మూడింట రెండొంతుల మంది వస్తే బీజేపీ బలం 129కి చేరుతుంది. అయితే, ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను ఫిరాయించేలా ఒప్పించడం కష్టసాధ్యమే. -
యడ్యూరప్ప అనే నేను...
సాక్షి, బెంగళూరు: కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభాపక్ష నేత బూకనకెరె సిద్ధలింగప్ప యడ్యూరప్ప (75) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో యడ్యూరప్పతో రాజ్‌భవన్‌లో గవర్నర్ వజూభాయ్ వాలా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన కాసేపటికే రైతు రుణమాఫీపై యడ్యూరప్ప అధికారులతో చర్చించారు. రెండ్రోజుల్లో దీనిపై తీర్మానం చేస్తామని ఆయన వెల్లడించారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై స్టే విధించాలన్న కాంగ్రెస్, జేడీఎస్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో గురువారం ఉదయం యడ్డీ ప్రమాణం చేశారు. దీనికి నిరసనగా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందు ఆందోళన నిర్వహించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్, జేడీఎస్ నేతల నుంచి ఆటంకం కలుగుతుందనే ముందస్తు సమాచారంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజ్‌భవన్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. యడ్డీ సీఎంగా బాధ్యతలు తీసుకోవటం ఇది మూడోసారి. గతంలో 2007లో నవంబర్ 12న తొలిసారిగా (వారం రోజులపాటు), రెండోసారి 2008, మే 3న మరోసారి సీఎంగా ప్రమాణం చేశారు. రెండోసారి సీఎం అయ్యాక మూడేళ్ల 10 నెలల పాటు ఆ పదవిలో కొనసాగారు. రైతుల సాక్షిగా.. ప్రచారంలో తనను రైతుబంధుగా చెప్పుకున్న యడ్యూరప్ప తెల్లని సఫారీపై ఆకుపచ్చ శాలువా వేసుకుని విజయ సంకేతం చూపుతూ రాజ్‌భవన్ చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ యడ్డీని ఆహ్వానించారు. ‘భగవంతుడి సాక్షిగా, రైతు సాక్షిగా..’ అని ఆయన ప్రమాణం చేశారు. సాధారణంగా బీజేపీ సీఎంల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాలు ఈసారి గైర్హాజరవటం గమనార్హం. కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, అనంత్‌కుమార్ సహా ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో కార్యకర్తలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. యడ్యూరప్ప కుటుంబసభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 104 మంది శాసనసభ్యులున్న బీజేపీ తగిన సంఖ్యాబలం సాధించాలంటే మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఇప్పటికే ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు ప్రకటించారు. గవర్నర్ ఆదేశాల మేరకు 15 రోజుల్లోగా రాష్ట్ర విధానసభలో యడ్యూరప్ప బలనిరూపణ చేయాల్సి ఉంది. ఆ తరువాతే కేబినెట్ విస్తరణ చేపడతామని యడ్యూరప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన ఎంతో ఉద్విగ్నంగా కనిపించారు. ‘విశ్వాసం’ నిలబెట్టుకుంటా ప్రమాణం తరువాత నేరుగా విధానసౌధకు వెళ్లిన యడ్డీ.. ముఖద్వారం మెట్లకు నమస్కరించి లోపలికెళ్లారు. సీఎస్ రత్నప్రభ, ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అధికారులతో సమావేశం అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులందరికి రూ. లక్ష రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులతో చర్చించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకుని మరో రెండు రోజుల్లో రుణమాఫీపై ప్రకటన చేస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటామని.. విశ్వాస పరీక్షలో 100% విజయం సాధిస్తామన్నారు. ‘మా ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గుతుంది. ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుంది. ఆ నమ్మకం నాకుంది. గవర్నర్ అవకాశం ఇచ్చిన 15 రోజుల పాటు నేను వేచిచూడను. వీలైనంత త్వరగా మెజారిటీ నిరూపించుకుంటాను’ అని యడ్డీ పేర్కొన్నారు. ‘రిసార్టు’ భద్రత ఉపసంహరణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మకాం వేసిన బెంగళూరు బిడది సమీపంలోని ఈగల్టన్ రిసార్డు వద్ద భద్రతను ఉపసంహరించారు. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో తమ ఎమ్మెల్యేల భద్రతపై కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన నెలకొంది. పాత్రికేయులను రిసార్ట్ లోనికి అనుమతించటం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే అక్కడ పహారా కాస్తున్నారు. తమ ఎమ్మెల్యేలను సంప్రదించటానికి గురువారం మధ్యాహ్నం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. -
24 గంటల్లోగా రైతు రుణాల మాఫీ
శివాజీనగర : రాష్ట్రంలో బీజేపీ ఈసారి 150 స్థానాల్లో గెలుపొందటంలో ఎలాంటి సందేహం లేదని, 17న తాను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయటం తథ్యమని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీఎస్.యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. అధికారం స్వీకరించిన 24 గంటల్లోగా జాతీయ, సహకార బ్యాంకుల నుంచి పొందిన రూ. లక్ష వరకు రుణ మాఫీ చేస్తానని, లేనిపక్షంలో ఒక్క రోజు కూడా అధికారంలో కొనసాగనని శపథం చేశారు. ఆదివారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో విలేకరులతో మాట్లాడుతూ... జాతీయ బ్యాంకుల రుణమాఫీ చేయాలని సిద్దరామయ్య బోదిబోమంటూ కొట్టుకొంటున్నారని, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానాతో పాటు అనేక రాష్ట్రాల్లో రుణ మాఫీ చేసినా కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయాలని ఎవ్వరు చెప్పటం లేదన్నారు. అయితే సిద్దరామయ్య మాత్రం ఇటువంటి వితండమైన ప్రశ్నను ముందుంచుతున్నారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీతో తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తున్నందున జేడీఎస్‌తో పొత్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బళ్లారి రెడ్డి సహోదరులకు సర్వే ఆధారంగా టికెట్ ఇవ్వడమైనదని, జనార్ధనరెడ్డి టికెట్ పంపిణీ విషయంలో జోక్యం చేసుకోలేదని తెలిపారు. రెడ్డి సహోదరుల, వారి అనుచరులపై ఎలాంటి ఆరోపణలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆనంద్‌సింగ్, నాగేంద్రలను పక్కలో కూర్చోపెట్టుకుని మరొకరి గురించి మాట్లాడే నైతిక హక్కు సిద్దరామయ్యకు ఉందా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత క్యాబినెట్లో ముస్లీంలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్తమ పథకాలను కొనసాగించటంతో పాటు ఇందిరా క్యాంటిన్‌ను అన్నపూర్ణ పథకంగా పేరుమార్చి ముందుకు కొనసాగిస్తామని బీఎస్‌వై తెలిపారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ.పరమేశ్వర్, లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేలు ఒకే వేదికపై కూర్చొని పార్టీ తరపున ప్రచారం జరపాలని ఆయన సవాల్ చేశారు. కాంగ్రెస్ విడిపోయిన ఇల్లుగా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదనే విషయం అటు ఉంచిన చాముండేశ్వరి, బాదామిలో ముందు సీఎం గెలిచి రావాలని ఎదురుదాడి చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో సిద్దరామయ్యకు ఓటమి తప్పదని, బాదామిలో బీజేపీ అభ్యర్థి శ్రీరాములు విజయం సాధిస్తారని, ఏ కారణానికి సిద్దరామయ్య గెలుపొందడని ఆయన ఓటమి సద్దిమూట అని జోస్యం చెప్పారు. అవినీతితో లూటీ చేసిన సిద్దరామయ్య తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, 70 లక్షల హుబ్లెట్ వాచ్ ఎవరు ఇచ్చారని రాష్ట్ర ప్రజల ముందు బహిరంగపరచాలని యడ్యూరప్ప తెలిపారు. కుల,మతాల మధ్య విష బీజం విత్తి రాజకీయ తీగను విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తున్న సిద్దరామయ్యకు ఇదే తిరుగు బాణం అవుతుందన్నారు. ప్రత్యేక లింగాయత్ మతం చేయాలని వీరిని ఎవరు అడిగారని, తాను ముఖ్యమంత్రి కాకూడదని ఒకే కారణానికి దానిని విడగొట్టే నీచమైన సంస్కృతికి దిగజారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని ప్రతిఫలం కూడా నేడు సిద్దరామయ్య అనుభవిస్తారని తెలిపారు. -
త్రిపుర సీఎంగా విప్లవ్ ప్రమాణం
అగర్తలా: సుమారు పాతికేళ్ల కమ్యూనిస్టుల పాలన అనంతరం త్రిపురలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర నూతన సీఎంగా విప్లవ్ కుమార్ దేవ్(48) శుక్రవారం ప్రమాణం చేశారు. అగర్తలాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తథాగతరాయ్ విప్లవ్‌తో సీఎంగా ప్రమాణంచేయించారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ , కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్, బీజేపీ నాయకులు అడ్వాణీ, ఎంఎం జోషి, తాజా మాజీ సీఎం మాణిక్ సర్కార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విప్లవ్‌తో పాటు బీజేపీకే చెందిన జిష్ణు దేవ్ వర్మన్ ఉప ముఖ్యమంత్రిగా, మరో ఏడుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ సీఎంలు రూపానీ(గుజరాత్), శివరాజ్ సింగ్ చౌహాన్(మధ్యప్రదేశ్), సర్బానంద సోనోవాల్(అసోం), రఘువర్ దాస్(జార్ఖండ్)లూ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్రిపురకు పూర్తి మద్దతు: మోదీ త్రిపుర సమగ్రాభివృద్ధి కోసం కొత్త ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా మద్దతిస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. విప్లవ్ ప్రమాణ స్వీకారం చేశాక మోదీ ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి అవకాశాలు అపారంగా ఉన్నాయని, వాటిని వెతికిపట్టుకోవాలని పిలుపునిచ్చారు. ‘ త్రిపుర ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే రాష్ట్రాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి. ప్రతి భారతీయుడు ఈశాన్య వాసులకు అండగా ఉంటాడు’ అని అన్నారు. ఆరెస్సెస్ నుంచి మరో సీఎం.. విప్లవ్ రాజకీయ ప్రస్థానం ఆరెస్సెస్‌తో∙మొదలైంది. గోమతి జిల్లా రాజ్‌ధార్ నగర్ గ్రామంలోని మధ్య తరగతి కుటుంబంలో 1971, నవంబర్ 25న విప్లవ్ జన్మించారు. ఆయన తండ్రి జనసంఘ్‌లో పనిచేశారు. డిగ్రీ పూర్తిచేసిన విప్లవ్ ఆరెస్సెస్‌లో చేరి సుమారు 16 ఏళ్లు సేవలందించారు. -
ఏకగ్రీవం
శాసనసభా పక్ష నేతగా జయలలిత ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం రాజీనామా నేడు సీఎంగా జయ ప్రమాణస్వీకారం అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశంలో జయను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి ఈనెల 11వ తేదీన వచ్చిన తీర్పులో జయ నిర్దోషిగా బైటపడడంతో అధికార హోదాపై నిషేధం తొలగింది. సీఎం పదవి చేపట్టేందుకు మార్గం సుగమం అయింది. దీంతో శుక్రవారం ఉదయం 7 గంటలకు పార్టీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించాల్పిందిగా పార్టీ అధినేత్రి జయలలిత ఆదేశించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఉదయం 6 గంటల నుండే సందడి మొదలైంది. అన్నాడీఎంకే మొత్తం 151 మంది ఎమ్మెల్యేలుండగా స్పీకర్ హోదాలో ఉన్న కారణంగా ధనపాల్, ఆసుపత్రిలో ఉన్న సెందూర్ పాండియన్, జైల్లో ఉన్న అగ్రి కృష్ణమూర్తి, రాజీనామా చేసిన వెట్రివేల్ హాజరుకాలేదు. ఐదు మంది డీఎండీకే రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో కూర్చున్నారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వంలో సమావేశం ప్రారంభం కాగా శాసనసభాపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా తాను రాజీనామా చేస్తున్నట్లు పన్నీర్‌సెల్వం ప్రకటించారు. ఆ తరువాత జయను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులంతా కరతాళ ధ్వనలు చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానం ఆమోదం కాగానే పదినిమిషాల్లో సమావేశాన్ని ముగించారు. ఐదు మంది మంత్రులు వెంటరాగా పన్నీర్‌సెల్వం తన రాజీనామాను తీర్మానప్రతిని ఉదయం 7.45 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు అందజేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేవరకు కొనసాగాల్సిందిగా గవర్నర్ కోరారు. జయను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానం పంపారు. ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మరికొందరు మంత్రులు వెంటరాగా మధ్యాహ్నం 1.28 గంటలకు పోయిస్గార్డెన్ నుండి బయలుదేరిన జయ ప్రజలకు అభివాదం చేసుకుంటూ 2.15 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాజ్‌భవన్ సిబ్బంది తొలుత జయకు స్వాగతం పలికి గవర్నర్ వద్దకు తీసుకెళ్లారు. గవర్నర్ కే రోశయ్య జయకు పుష్పగుచ్చం ఇవ్వగా, ఆయన సతీమణి శివలక్ష్మి జయకు శాలువాకప్పి సత్కరించారు. ఆనంతరం జయ సైతం గవర్నర్‌కు పుష్పగుచ్చం ఇచ్చారు. అనంతరం రోశయ్య, జయలు అరగంటపాటూ సంభాషించుకున్నారు. 28 మంది మంత్రులతో కూడిన జాబితాను గవర్నర్‌కు జయ సమర్పించారు. 2.15 గంటలకు రాజ్‌భవన్ నుండి బయలుదేరిన జయ నేతల విగ్రహాలకు మాలలు వేసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. ముస్తాబైన మద్రాసు హాలు జయ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న మద్రాసు సెంటినరీ ఆడిటోరియం ముస్తాబు పూర్తిచేసుకుంది. ఈనెల 23 వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకార మహోత్సం ప్రారంభం అవుతుంది. కార్యక్రమానికి ఏపీ, ఒడివా సీఎంలు చంద్రబాబు, నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, రవిశంకరప్రసాద్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది. -
సీఎంగా ప్రమాణం చేసిన నవీన్
-
సీఎంలుగా ప్రమాణం చేసిన నవీన్, పవన్
ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ వరుసగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ ఎస్.సి.జమీర్ బుధవారం రాజ్‌భవన్‌లో నవీన్ పట్నాయిక్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 21 మంది ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణం చేయించారు. 10 మంది కేబినెట్ మంత్రులు కాగా, 11 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అత్యంత సాదాసీదాగా జరిగిన ఆ వేడుకలకు వందలాది మంది బీజేడీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పాత్రికేయులు హాజరైయ్యారు. అలాగే సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా ఐదవ సారి పవన్ కుమార్ చామ్లీంగ్ ప్రమాణ స్వీకారం చేశారు. సిక్కిం రాజధాని గంగ్టక్లోని రాజభవన్ ఆశీర్వాద్ హాల్లో ఆ రాష్ట్ర గవర్నర్... చామ్లీంగ్ చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కార్యక్రమానికి సిక్కింగ్ డెమెక్రటిక్ ఫ్రెంట్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరైయ్యారు.