కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌తో కుమారస్వామి (ఫైల్)
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్న జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి.. సీఎం సీటును జేడీఎస్–కాంగ్రెస్ కొంతకాలం పాటు పంచుకుంటాయంటూ వస్తున్న వార్తలను ఖండించారు. కూటమి భాగస్వామి కాంగ్రెస్‌తో ఇలాంటి ఒప్పందాలేమీ లేవని ఆయన ఆదివారం బెంగళూరులో స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీ వెళ్లనున్న కుమారస్వామి.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియా గాంధీలతో సమావేశమై మంత్రిమండలి కూర్పుపై చర్చిస్తామన్నారు.‘రేపు ఢిల్లీ వెళ్తున్నాను. సోనియా, రాహుల్‌తో భేటీ అవుతాను. కేబినెట్ విస్తరణతోపాటుగా ఐదేళ్లపాటు సుస్థిర ప్రభుత్వం నడిపేందుకు అవసరమైన అంశాలపై చర్చిస్తాను.సీఎం సీటు పంపకంపై ఎలాంటి ఒప్పందం జరగలేదు. దీనిపై వస్తున్న వార్తలు అవాస్తవం’ అని స్వామి పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత 24 గంటల్లోనే బలనిరూపణ చేసుకుంటానని ఆయన వెల్లడించారు.
కుమారస్వామితోపాటుగా సిద్దరామయ్య, జి. పరమేశ్వరన్, డీకే శివకుమార్‌లుకూడా ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా, ఆదివారం కాంగ్రెస్ నేతలతో కుమారస్వామి భేటీ అయ్యారు. విశ్వాస పరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. అయితే డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్ నుంచి దళిత నేతను ఎన్నుకోవటం దాదాపు ఖాయమైంది. అది పీసీసీ చీఫ్ జి. పరమేశ్వరే అని తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ బలం ఆధారంగా.. 34 మంత్రులను ఏర్పాటుచేసుకునే అవకాశం ఉంది. అయితే, జేడీఎస్, కాంగ్రెస్ మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం జేడీఎస్ సీఎం, 13 కేబినెట్ బెర్తులు, కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం సహా 20 కేబినెట్ బెర్తులు పంచుకోనున్నట్లు తెలుస్తోంది. కుమారస్వామి తనవద్దే ఆర్థిక శాఖను అంటిపెట్టుకోవచ్చని సమాచారం. డిప్యూటీ సీఎంగా పీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వరన్ ఎంపిక దాదాపు ఖాయంగానే తెలుస్తోంది. కూటమి ఎమ్మెల్యేలను కాపాడటంతో కీలకపాత్ర పోషించిన డీకే శివకుమార్‌కు కీలక శాఖను అప్పజెప్పాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్‌తో విభేదాల్లేవ్!
ముఖ్యమంత్రి సీటుతో పాటు పలుఅంశాల్లో కాంగ్రెస్‌తో విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కుమారస్వామి తెలిపారు. రాజరాజేశ్వరినగర్, జయనగర్ అసెంబ్లీ స్థానాల ఎన్నికల విషయంపై ప్రస్తుతానికి చర్చించడం లేదన్నారు. ‘ఈ రెండుచోట్ల గెలవటం మాకు చాలా ముఖ్యం. ముందు ప్రభుత్వ ఏర్పాటు. ఆ తర్వాతే వీటిపై చర్చిస్తాం’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలతో సమావేశం అనంతరం.. బెంగళూరులోని ఓ హోటల్‌లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అయితే క్యాంపులో ఉండాలా లేక ఇంటికెళ్లి బుధవారం ప్రమాణస్వీకారానికి రావాలా అన్న విషయంలో నిర్ణయించుకునే పూర్తి హక్కును ఎమ్మెల్యేలకే వదిలేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం తమిళనాడులోని ఓ దేవాలయ సందర్శనకు స్వామి బయలుదేరారు.
రజనీ వర్సెస్ స్వామి
తమిళనాడుకు వచ్చి ఇక్కడి రైతుల పరిస్థితి చూస్తే.. కుమార స్వామి మనసు మార్చుకుని కావేరీ నీటిని విడుదల చేసే అవకాశం ఉందని రజనీకాంత్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను కుమారస్వామి తిప్పికొట్టారు. ‘కర్ణాటకలో నీరుంటే వారికి విడుదల చేయగలం. రజనీకాంత్ ఇక్కడికొచ్చి మా డ్యాముల పరిస్థితి, రైతుల దీనస్థితి చూడాలని ఆహ్వానిస్తున్నా. ఇవన్నీ చూశాక కూడా మీరింకా నీరు కావాలంటే మనం చర్చిద్దాం’ అని పేర్కొన్నారు.
ఇద్దరు డిప్యూటీ సీఎంలు!
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి మంత్రివర్గంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండే అవకాశం ఉందని కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి సోమవారం కలిసిన అనంతరం తుది నిర్ణయం వెలువడుతుందని ఆయన వెల్లడించారు. కర్ణాటక విధానసభ ఎన్నికల ఫలితాల రోజున కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం జేడీఎస్‌కు ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాల్సి ఉంది. డిప్యూటీ సీఎంగా పరమేశ్వరతో పాటు జేడీఎస్ నుంచి కూడా మరో ఉపముఖ్యమంత్రి ఉండొచ్చని తాజా సమాచారం.
రిసార్టులోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప రాజీనామా తర్వాత జరిగే ప్రతి పరిణామాన్ని కాంగ్రెస్, జేడీఎస్ కూటమి జాగ్రత్తగా గమనిస్తూ ముందుకెళ్తోంది. ఏ విషయంలోనూ తప్పటడుగుల్లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే కుమారస్వామి బలనిరూపణ చేసుకోవాలని భావిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంకా బెంగళూరు శివార్లలోని రిసార్టులోనే ఉన్నారు. ముందుగా అనుకున్నదాని ప్రకారం సోమవారం కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయాల్సి ఉన్నప్పటికీ.. జేడీఎస్ బుధవారానికి వాయిదా వేసింది. సోమవారం (మే 21) మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి కారణంగా దీన్ని రెండ్రోజులు వెనక్కు జరిపారు. ప్రస్తుతానికి 221 మంది సభ్యులున్న సభలో ఈ కూటమికి 117 మంది ఎమ్మెల్యేలున్నారు. కుమారస్వామి తాను ఎన్నికైన రెండో స్థానానికి (రామనగర) రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. అయితే మొదట కంఠీరవ స్టేడియంలోప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించినప్పటికీ.. దీన్ని విధానసౌధకే మార్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment