Karnataka Assembly Floor Test
-
చిచ్చుపెట్టిన కేబినెట్ కూర్పు
బెంగళూరు: కర్ణాటకలో కేబినెట్ విస్తరణతో రేగిన అసంతృప్తి సెగలు మరింత పెరిగాయి. కేబినెట్లో చోటు దక్కని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తో సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు శాఖల కేటాయింపుపై జేడీఎస్ మంత్రులు అసహనంతో ఉన్నారు. జేడీఎస్ మంత్రులు జీటీ దేవెగౌడకు ఉన్నత విద్య, సీఎస్ పుట్టరాజుకు చిన్న నీటి పారుదల శాఖల కేటాయింపు చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో చాముండేశ్వరి నుంచి మాజీ సీఎం సిద్దరామయ్యను జీటీ దేవెగౌడ ఓడించారు. పుట్టరాజు లోక్‌సభకు రాజీనామా చేసి మెల్కొటే అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. వారిద్ద్దరు రవాణా వంటి కీలక శాఖను ఆశించారు. ఆ శాఖను తమకు కేటాయించకుడా.. జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ బంధువు డీసీ తమ్మన్నకు ఇవ్వడంపై ఆగ్రహంగా ఉన్నారు. తమ నేతలకు కీలక శాఖలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఆ ఇద్దరు మంత్రుల మద్దతుదారులు మైసూరు, మాండ్యల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రజాసేవకు ఏ శాఖ అయితే ఏంటి?: సీఎం జేడీఎస్ మంత్రుల అసమ్మతిపై సీఎం కుమారస్వామి మండిపడ్డారు. ప్రజలకు సేవ చేసేందుకు ఏ శాఖ అయితే ఏంటని ప్రశ్నించారు. 8వ తరగతి చదువుకున్న జీటీ దేవెగౌడకు ఉన్నత విద్య శాఖ కేటాయించడంపై స్పందిస్తూ.. నేనేం చదువుకున్నాను? ముఖ్యమంత్రిగా పనిచేయడం లేదా? అని ప్రశ్నించారు. కుమారస్వామి బీఎస్సీ డిగ్రీ చదివారు. ఢిల్లీలో కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు ఎంబీ పాటిల్ నేతృత్వంలోని కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు ఢిల్లీలో రాహుల్‌తో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం పాటిల్ మాట్లాడుతూ.. ‘రాహుల్‌తో నా అభిప్రాయాల్ని పంచుకున్నాను. ప్రత్యేకంగా ఏమీ డిమాండ్ చేయలేదు. సమావేశ వివరాలపై మిగతా 15–20 మంది ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. రాహుల్‌తో భేటీలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్, కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దినేశ్ గుండూరావుతో పాటు కర్ణాటక మంత్రి కృష్ణ బైరే గౌడ పాల్గొన్నారు. ‘విభేదాల్ని పరిష్కరించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి’ అని గౌడ చెప్పారు. సిద్దరామయ్య ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఎంబీ పాటిల్, దినేష్ గుండూరావు, ఆర్.రామలింగారెడ్డి, రోషన్‌బేగ్, హేచ్కే పాటిల్, శివశంకరప్ప, జర్కిహోళి వంటి వారికి కేబినెట్లో చోటు దక్కలేదు. వారంతా కుమారస్వామి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. బీజేపీలో చేరేందుకు పలువురు సిద్ధం: యడ్యూరప్ప కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన అనేక మంది అసంతృప్త ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కర్ణాటక ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప చెప్పారు. బెంగళూరులో పార్టీ నేతల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘జేడీఎస్, కాంగ్రెస్‌ల్లో అసంతృప్తిగా ఉన్నవారిని చేర్చుకోవడం మన బాధ్యత’ అని అన్నారు. అసమ్మతిని ఎదుర్కొనేందుకు కొత్త ఫార్ములా పార్టీలో, ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసమ్మతిని అధిగమించేందుకు కాంగ్రెస్ నాయకత్వం కొత్త ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మంత్రులుగా తీసుకున్న వారిని రెండేళ్ల పాటు కొనసాగించి ఆ తర్వాత కొత్త వారికి అవకాశం కల్పించడం అందులో ఒకటి. మంత్రుల పనితీరుపై ఆరునెలలకోసారి సమీక్ష నిర్వహించి సరిగా పనిచేయని వారికి ఉద్వాసన పలికి కొత్తవారికి చాన్స్ ఇవ్వడం. మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకపోవడం, ఆరు కేబినెట్ పోస్టుల్ని భర్తీ చేయకుండా అవసరమున్నప్పుడు విస్తరించడం వంటివి కూడా ఫార్ములాలో ఉన్నాయి. -
కొలువుదీరిన కుమారస్వామి కేబినెట్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రి కుమారస్వామి కాంగ్రెస్ నేతలతో విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరం రూపొందించిన తన కేబినెట్లో మొత్తం 25 మందికి చోటు కల్పించారు. బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ వాజూభాయ్ వాలా కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. జేడీఎస్ నుంచి 8 మందికి, కాంగ్రెస్ నుంచి 15 మందికి, బీఎస్పీ, కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పక్ష(కేపీజేపీ)లకు ఒక్కోటి చొప్పున పదవులు కల్పించారు. జేడీఎస్‌తో బీఎస్పీ ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకోగా, సంకీర్ణ సర్కారుకు కేపీజేపీ మద్దతు పలికింది. గతంలో సిద్దరామయ్య ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఎంబీ పాటిల్, దినేశ్ గుండూ రావు, రామలింగ రెడ్డి, ఆర్.రోషన్ బైగ్, హెచ్‌కే పాటిల్, శ్యాంనూర్ శివశంకరప్ప, తన్వీర్ సేఠ్, సతీశ్ జార్ఖిహోలిలకు ఈసారి అవకాశం దక్కలేదు. సీఎం వర్గానికి పెద్దపీట.. కుమారస్వామి సామాజికవర్గం ఒక్కలిగలకు మంత్రివర్గంలో పెద్దపీట దక్కింది. మొత్తం 9 మంది ఒక్కలిగలు, నలుగురు లింగాయత్‌లు, ముగ్గురు దళితులు, ముగ్గురు మైనార్టీలు, ఇద్దరు– కురుబలు, ఈడిగ, ఉప్పర, గిరిజన తెగ, బ్రాహ్మణ కులాల నుంచి ఒక్కొక్కరికి స్థానం లభించింది. చాముండేశ్వరి నియోజకవర్గంలో సిద్దరామయ్యను ఓడించిన జేడీఎస్ నాయకుడు జీటీ దేవెగౌడ, కుమారస్వామి సోదరుడు రేవణ్ణలకు కేబినెట్లో చోటు దక్కింది. కాంగ్రెస్ నుంచి ప్రమాణం చేసిన వారిలో డీకే శివకుమార్, కేజే జార్జ్, ఆర్వీ దేశ్‌పాండే, ప్రియాంక్ ఖర్గే, ఆర్బీ పాటిల్ తదితరులున్నారు. బీఎస్పీ, కేపీజేపీలకు ఉన్న ఏౖకైక ఎమ్మెల్యేలు వరసగా ఆర్ఏ మహేశ్, ఆర్. శంకర్లకు కేబినెట్ బెర్తులు దక్కాయి. ఈ కేబినెట్లో అలనాటి నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జయమాల ఏకైక మహిళా మంత్రి కాగా, 83 ఏళ్ల మనాగుళి(జేడీఎస్) అత్యంత పెద్ద వయస్కులు. కొత్త మంత్రులకు ఇంకా శాఖలు కేటాయించాల్సి ఉంది. అసంతృప్తుల నిరసనలు.. మంత్రి పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హెచ్‌కే పాటిల్ బెంగళూరులోని చాళుక్య సర్కిల్లో 200 మంది మద్దతుదారులతో ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సేఠ్‡ అభిమానులు కూడా మైసూరులో నిరసనకు దిగారు. దీనిపై సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. సంకీర్ణ ప్రభుత్వంలో కేబినెట్ కూర్పు చేసేటప్పుడు ఇలాంటి అసంతృప్తులు రావడం సహజమేనని అన్నారు. సంయమనంతో ఉండాలని, అందరికీ న్యాయం చేస్తాననని హామీ ఇచ్చారు. -
కర్ణాటక మంత్రివర్గ విస్తరణ ఆలస్యం?
బెంగళూరు: కర్ణాటక మంత్రివర్గ విస్తరణ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నా పదవుల పంపకంలో ఏకాభిప్రాయం రాలేదు. సీఎంగా కుమారస్వామి, ఉపముఖ్యమంత్రిగా పరమేశ్వర ప్రమాణంచేయడం తెల్సిందే. కాంగ్రెస్ పార్టీ తమ కోటా కింద ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని పట్టుబడుతోందని తెలుస్తోంది. ఆర్థిక శాఖ కాంగ్రెస్ తమకే కావాలంటోంది. అయితే ఈ విషయంలో జేడీఎస్ బెట్టుగా ఉంది. సీఎం పదవిని త్యాగం చేసిన నేపథ్యంలో ఆర్థిక శాఖతో పాటు పీడబ్ల్యూడీ, ఇంధన శాఖలు కూడా తమకే ఇవ్వాలని, మొత్తంగా 22 మందికి మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరలోనే ఈ విషయాన్ని తేల్చేస్తాం’ అని కుమారస్వామి మీడియాకు తెలిపారు. -
మాఫీ చేయకుంటే రాజీనామా
న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: రైతు రుణమాఫీకి తాను కట్టుబడి ఉన్నానని, అలా చేయని పక్షంలో సీఎం పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్ణాటక సీఎం కుమారస్వామి చెప్పారు. ఢిల్లీలో ప్రధానితో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రైతుల రుణాల్ని మాఫీ చేస్తానని స్పష్టంగా చెప్పాను. అధికారంలోకి వచ్చిన 24గంటల్లో రుణమాఫీపై సంతకం చేస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశాను. అయితే కొన్ని పరిమితులున్నందున సమయం అవసరం’ అని పేర్కొన్నారు. రుణ మాఫీకి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించామని.. బుధవారం బెంగళూరులో వాటిని వెల్లడిస్తామని ఆయన తెలిపారు. బీజేపీ తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తోందని, ప్రజలు వాటిని నమ్మొద్దని కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ప్రజలను అవమానించలేదు కాంగ్రెస్ దయతోనే ముఖ్యమంత్రిని అయ్యానని.. ప్రజల దయతో కాదంటూ తను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుండటంపై కుమారస్వామి వివరణ ఇచ్చారు. ప్రజలను అవమానించాలని తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని.. భాగస్వామ్య కూటమి కారణంగానే సీఎం అయ్యానని చెప్పడమే తన ఉద్దేశమన్నారు. ‘నేను సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాను. కాంగ్రెస్ మద్దతున్నన్ని రోజులు సీఎంగా ఉంటాను. ఏ కార్యక్రమం చేయాలన్నా వారి అనుమతి ఉండాల్సిందే. ఆ విషయాన్నే చెప్పా. నా వ్యాఖ్యలను మీరెందుకు (మీడియా) వక్రీకరించారో అర్థం కావడం లేదు’ కుమారస్వామి పేర్కొన్నారు. కాంగ్రెస్సే సీఎం పదవి ఇచ్చింది: దేవెగౌడ రైతు రుణమాఫీపై తామిచ్చిన హామీని నిలబెట్టుకోవడం కష్టమని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ చెప్పారు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ.. ‘మాకు 37 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వేరే పార్టీ మద్దతుతో మేం ప్రభుత్వాన్ని నడపాలి. వారి పథకాలను అమలు చేయాలి. వారి మద్దతు లేకుండా రుణమాఫీ హామీ అమలు సాధ్యం కాదు’ అని అన్నారు. కుమారస్వామికి కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి ఇచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీని తాను కోరానని.. అయితే కుమారస్వామి సీఎం అవ్వాలనేది తమ హైకమాండ్ నిర్ణయమని ఆ పార్టీ నేతలు ఆజాద్, అశోక్ గెహ్లాట్‌లు చెప్పారన్నారు. శాఖలపై తేలని చర్చలు ఐదురోజులుగా మంత్రిత్వ శాఖల పంపకాల విషయంలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య జరుగుతున్న చర్చలు ఇంతవరకు ఓ కొలిక్కి రాలేదు. ఇరు పార్టీలు కీలక మంత్రిత్వ శాఖలపై పట్టుబడుతుండటంతోనే ఎటూ తేలడం లేదు. రాహుల్, సోనియాలు విదేశాలకు వెళ్లడంతో సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, గెహ్లాట్, కేసీ వేణుగోపాల్, సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లతో కుమారస్వామి, జేడీఎస్ నేత డానిష్ అలీ చర్చలు జరిపారు. ఢిల్లీలో తమ పార్టీ పెద్దలతో కుమారస్వామి చర్చలు జరిపారని.. త్వరలోనే ఈ విషయం పరిష్కారం అవుతుందని కాంగ్రెస్ నేతలు చెప్పారు. కర్ణాటకలో రైతులకు రుణమాఫీ చేయాలని సోమవారం ప్రతిపక్ష బీజేపీ నిర్వహించిన రాష్ట్ర బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్‌కు పిలుపునిచ్చినప్పటికీ ప్రజల్నుంచి పెద్దగా స్పందన లభించలేదు. రాష్ట్రంలో బొగ్గు కొరత తీర్చాలని ప్రధానిని కోరా కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి కుమార స్వామి. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కొరతపై మోదీతో చర్చించారు. ‘రాయ్‌చూర్, యరమర, బళ్లారి ప్లాంట్లకు డిమాండ్ మేరకు బొగ్గును సరఫరా చేయాలని ప్రధానిని కోరాను. ఇతర సమస్యలపై కూడా చర్చించాం. ఈ సందర్భంగా సీఎంగా, పీఎంగా తన పాలనా అనుభవాల్ని ప్రధాని నాతో పంచుకున్నారు’ అని కుమార స్వామి చెప్పారు. -
ఎస్పీ–బీఎస్పీ పొత్తు మాకు సవాలే
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–బీఎస్పీ మధ్య పొత్తు కుదిరితే 2019 ఎన్నికల్లో బీజేపీకి సవాలే అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అంగీకరించారు. అయితే అమేథీ, రాయ్‌బరేలీలో ఏదో ఒక సీటులో కాంగ్రెస్‌ను కచ్చితంగా బీజేపీ ఓడిస్తుందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అమిత్‌షా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను దూరం చేసుకోవాలనే ఆలోచన తమకు లేదని శివసేనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2019లో ఎన్డీఏను ఓడించలేమని అర్థమయ్యే ప్రతిపక్షాలు అన్నీ ఏకమై లేనిపోని విమర్శలు చేస్తున్నాయన్నారు. గత ఎన్నికల్లో గెలుపొందని ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళలోని 80 సీట్లను వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ సాధిస్తుందన్నారు. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో సీఎంలను మార్చబోమన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత నాలుగేళ్ల కాలంలో ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా 22 కోట్ల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరిందని అమిత్‌షా చెప్పారు. ప్రభుత్వ విజయాలపై దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు ‘సరైన ఉద్దేశాలు, సరైన అభివృద్ధి(సాఫ్ నియత్, సాహీ వికాస్) అనే సరికొత్త నినాదంతో ముందుకు వెళతామని చెప్పారు. బహుళ పార్టీ ప్రజాస్వామ్యం విఫలమైందనే ఆలోచనలు ప్రజల మదిలోకి వస్తున్న సమయంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజలకు కొత్త ఆశను కలిగించిందని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రతి రంగంలోనూ ఆచరణయోగ్యమైన, స్పష్టమైన చర్యలు తీసుకుందని, దీని ద్వారా తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, అదే సమయంలో పరిశ్రమలకు సహాయకారిగా ఉందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుందని చెప్పారు. -
కర్ణాటకం ముగిసింది!
బెంగళూరు: కర్ణాటకలో దాదాపు పది రోజులుగా సాగిన రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అనూహ్య పరిణామాల మధ్య సీఎం పీఠం అధిరోహించిన సీఎం కుమారస్వామి అసెంబ్లీ బలపరీక్షలో సునాయాసంగా విజయం సాధించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి సాగుతున్న ఉత్కంఠకు ముగింపు పలుకుతూ శుక్రవారం ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ సర్కారు మూజువాణి ఓటుతో నెగ్గింది. బీజేపీ ఎమ్మెల్యేలు ముందే వాకౌట్ చేయడంతో అవాంతరాలు లేకుండా బలపరీక్ష ఘట్టం ముగిసింది. కాంగ్రెస్‌కు చెందిన 78, జేడీఎస్‌కు చెందిన 37, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కలసి మొత్తం 117 మంది ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడంతో కుమారస్వామి ప్రభుత్వం గెలుపొందింది. కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ కుమార్ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చివరి నిమిషంలో తమ స్పీకర్ అభ్యర్థిని బీజేపీ ఉపసంహరించుకోవడంతో పోటీ లేకుండానే ఎన్నిక పూర్తయింది. పార్లమెంటరీ సంప్రదాయాల్ని అనుసరించి తమ అభ్యర్థిని పోటీ నుంచి తప్పించినట్లు ఆ పార్టీ పేర్కొంది. ఈ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు తన పట్ల నమ్మకం చూపనందుకు బాధగా ఉన్నా ఐదేళ్ల పాటు రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తామని కుమారస్వామి అన్నారు. బలపరీక్షలో కుమారస్వామిని ఓడించాలంటే 104 మంది సభ్యులున్న బీజేపీకి మరో 7గురు ఎమ్మెల్యేలు అవసరం. అయితే ఆ పార్టీ ముందే వాకౌట్ చేయడంతో అసెంబ్లీలో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోలేదు. వారం రోజుల వ్యవధిలో కర్ణాటక అసెంబ్లీలో ఇది రెండో బలపరీక్ష. మే 17న కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప సరిపడా ఎమ్మెల్యేలు లేకపోవడంతో 19న రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్– జేడీఎస్ కూటమి తరఫున కుమారస్వామి మే 23న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నమ్మకం చూపనందుకు బాధగా ఉంది అసెంబ్లీలో కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘సంపూర్ణ మెజారిటీ ఇవ్వకుండా నా పట్ల ప్రజలు నమ్మకం ఉంచనందుకు బాధగా ఉంది. ఐదేళ్లు సుస్థిర పాలనను అందిస్తాం. మా సొంత ప్రయోజనాలను తీర్చుకునేందుకు అధికారంలోకి రాలేదు’ అని చెప్పారు. తాను గానీ తన కుటుంబ సభ్యులు గానీ ఎప్పుడూ అధికారం కోసం అర్రులు చాచలేదని, ఎక్కువ సమయం ప్రతిపక్షంలోనే ఉన్నామని పేర్కొన్నారు. ‘2006లో బీజేపీతో నేను సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడపై అపనింద పడింది. ఇప్పుడు కాంగ్రెస్‌తో లౌకిక ప్రభుత్వం ఏర్పాటు ద్వారా దానిని తొలగించాను’ అని చెప్పారు. ఎన్నికల సమయంలో వాగ్దానం చేసినట్లుగానే రైతు రుణాలు మాఫీ చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్లను దుర్వినియోగం చేస్తోందని కుమారస్వామి ఆరోపించారు. మంత్రిత్వ శాఖల పంపకంపై చర్చలు బలపరీక్ష పూర్తవ్వడంతో మంత్రిత్వ శాఖల పంపకంపై జేడీఎస్–కాంగ్రెస్‌లు దృష్టిపెట్టాయి. శాఖల పంపిణీపై చర్చించేందుకు బలపరీక్ష పూర్తయిన కొద్దిసేపటికే ఇరు పార్టీల నేతలూ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత సీఎల్పీ నేత సిద్దరామయ్య నివాసంలో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, జేడీఎస్ నేత హెచ్డీ రేవణ్న తదితరులు హాజరయ్యారు. మంత్రి పదవులపై అధిష్టానంతో చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. రైతురుణాల్ని మాఫీ చేయాలి సభ నుంచి వాకౌట్కు ముందు ప్రతిపక్ష నేత యడ్యూరప్ప సీఎం కుమారస్వామిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్‌కు సీఎం పదవి ఎలా ఇస్తారని మండిపడ్డారు. తన పోరాటం కాంగ్రెస్‌పై కాదని, కుమారస్వామిపైనే అన్నారు. కుమారస్వామి నమ్మక ద్రోహం గురించి అందరికీ తెలుసని, కుమారస్వామి, దేవెగౌడలు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తారని ఆ పార్టీ సభ్యుల్ని హెచ్చరించారు. కుమార స్వామి సీఎంగా ఉండడం నచ్చకనే సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం రూ. 53 వేల కోట్ల రుణాల్ని మాఫీ చేస్తానని కుమారస్వామి ప్రకటించారని, ప్రస్తుత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లోనే దానిపై ప్రకటన చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
కర్ణాటక స్పీకర్‌గా రమేష్ కుమార్ ఏకగ్రీవం
-
కర్ణాటక స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం
సాక్షి, బెంగళూరు : గత కొన్ని రోజులుగా రిసార్టుల్లోనే ఉంటున్న కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. కాగా, బలపరీక్ష నేపథ్యంలో నేటి మధ్యాహ్నం 12 గంటల అనంతరం కర్ణాటక అసెంబ్లీ ప్రారంభమైంది. అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ స్పీకర్ అయ్యారు. స్పీకర్‌గా సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అభ్యర్థి రమేష్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది.తొలుత స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ పేరును సిద్దరామయ్య ప్రతిపాదించారు. ఆ వెంటనే రమేష్ కుమార్ పేరును కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర బలపరిచారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే సురేష్ కుమార్ పోటీ నుంచి తప్పుకున్నారు. సంఖ్యాబలం లేదని చర్చించుకున్న అనంతరం బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కాంగ్రెస్ నేత రమేష్ కుమార్ మరోసారి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. 18 ఏళ్ల తర్వాత ఆయన మరోసారి స్పీకర్ అయ్యారు. సిద్దరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా చేసిన అనుభవం ఆయన సొంతం. నూతన స్పీకర్ రమేష్ కుమార్ దగ్గరికెళ్లి మాజీ సీఎం, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప శుభాకాంక్షలు తెలిపారు. మరికాసేపట్లో కుమారస్వామి సర్కార్ బలపరీక్ష ఎదుర్కోనుంది. -
బలపరీక్షలో కుమారస్వామి విజయం
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బల పరీక్షలో విజయం సాధించారు. విధానసౌధలో శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో 117 మంది ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం శాసనసభలో బలం నిరూపించుకుంది. తమ ప్రభుత్వం విశ్వాసపరీక్షలో విజయం సాధించడంతో కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. కాగా, బలపరీక్షకు ముందే బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా కుమారస్వామి ప్రభుత్వం మ్యాజిక్ ఫిగర్ 111ను దాటేసింది. అంతా అనుకున్నట్టు జరగడంతో కాంగ్రెస్, జేడీఎస్ నాయకత్వం ఊపిరి పీల్చుకుంది. కుమారస్వామి ప్రభుత్వం బలం నిరూపించుకోవడంతో గత కొన్నిరోజులుగా కర్ణాటకలో కొనసాగిన రాజకీయ అనిశ్చితికి తెర పడింది. సభలో అంతకుముందు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతూ కన్నడ ప్రజలు ఎవరికీ స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వలేదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్-జేడీఎస్‌లు కలిశాయని కుమారస్వామి చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా బీజేపీ వ్యవహరించిందని అన్నారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ కొత్తేమీ కాదని, 2004లో ఇలానే జరిగిందని గుర్తు చేశారు. -
కర్ణాటక: నాకేం టెన్షన్ లేదు!
సాక్షి, బెంగళూరు : తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, బల పరీక్షలో కచ్చితంగా తాము నెగ్గి తీరుతామని కర్ణాటక సీఎం కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమకు సంఖ్యా బలం ఉన్నందున అంతిమ విజయం తమదేనన్నారు. మెజార్టీ లేకున్నా బీజేపీ అధికారం కోరుకున్నందున వారికి పరాభవం తప్పలేదన్నారు. నేటి బలపరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ నెగ్గి గత కొన్ని రోజులుగా కర్ణాటకలో ప్రజాస్వామ్యానికి విరుద్దంగా జరుగుతున్న పరిణామాలకు చెక్ పెట్టనున్నట్లు వెల్లడించారు. కాగా, నేటి మధ్యాహ్యం 12:15 గంటలకు కర్ణాటక అసెంబ్లీ సమావేశం కానుంది. ముందుగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను సభ్యులు ఎన్నుకుంటారు. స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి కేఆర్ రమేష్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా సురేష్ కుమార్ నామినేషన్ వేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనంతరం కుమారస్వామి సర్కార్ బలపరీక్షను ఎదుర్కోనుంది. స్పీకర్ ఎన్నిక, బలపరీక్షల నేపథ్యంలో శుక్రవారం కూటమి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా సభకు హాజరు కానున్నారు. విశ్వాస పరీక్షకు 111 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా, కాంగ్రెస్ జేడీఎస్ కూటమికి 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీకి 104 మంది శాసనసభ్యుల మద్దతు ఉంది. దీంతో కుమారస్వామి ఈ బలపరీక్షలో సులువుగా నెగ్గుతారని కూటమి నేతలు చెబుతున్నారు. ఇంకా బెంగళూరులోని రిసార్టుల్లోనే కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. -
బల పరీక్షకు రంగం సిద్ధం..
-
నేడు కుమారస్వామి బలనిరూపణ
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుక్రవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఇరు పార్టీల ఎమ్మెల్యేలను కలిపితే కూటమి వద్ద 117 ఎమ్మెల్యేలున్నారు. స్పీకర్ ఎంపిక తర్వాత ఈ ఎన్నిక జరగనున్నందున సభలో ఉండే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా బలపరీక్షలో గెలిచేందుకు 111 మంది మద్దతు అవసరం. దీంతో చివరి నిమిషంలో రాజకీయాలు చోటుచేసుకుంటేతప్ప కూటమి సర్కారు ‘పరీక్ష’లో నెగ్గటం దాదాపు ఖాయంగానే కనబడుతోంది. కుమారస్వామితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే నమ్మకంతో ఉన్నారు. బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లో బల పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కన్నడ అసెంబ్లీలో శుక్రవారం విశ్వాస పరీక్ష జరగనుంది. విశ్వాస పరీక్షను ‘సంకీర్ణం’ సీరియస్‌గా తీసుకుంది. మొత్తం బలనిరూపణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ‘ఆపరేషన్ కమల’ నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటోంది. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంకా హోటల్ గదుల్లోనే ఉన్నారు. మే 15న ఫలితాలు వెల్లడైనప్పటినుంచీ కాంగ్రెస్ రిసార్టు రాజకీయాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొందరు ఎమ్మెల్యేలు కూటమికే ఓటేస్తామని, ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పినప్పటికీ వారిని హోటల్ నుంచి పంపేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అటు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా నగరంలోని మరో హోటల్లోనే ఉన్నారు. వారిని కూడా ఇళ్లకు పంపేందుకు ఆ పార్టీ నేతలు అంగీకరించనట్లు తెలిసింది. బీజేపీ మరో ప్రయత్నం సరైన బలం లేక విశ్వాస పరీక్షకు ముందే వెనక్కు తగ్గిన బీజేపీ.. స్పీకర్ ఎన్నికకు మాత్రం తమ అభ్యర్థిని బరిలో దించింది. ఐదోసారి ఎమ్మెల్యేగా ఎంపికైన సీనియర్ నేత ఎస్. సురేశ్ కుమార్‌తో నామినేషన్ వేయించింది. శుక్రవారం మధ్యాహ్నం కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షకు ముందు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి తరపున మాజీ స్పీకర్ రమేశ్ కుమార్ స్పీకర్‌గా ఖరారు కాగా, డిప్యూటీ స్పీకర్‌గా జేడీఎస్ ఎమ్మెల్యే ఒకరికి అవకాశం దక్కనుంది. యడ్యూరప్ప, ఇతర ముఖ్యనేతల ఆదేశాలతోనే నామినేషన్ వేసినట్లు సురేశ్ కుమార్ తెలిపారు. ‘అసెంబ్లీలో మా సంఖ్య, వివిధ అంచనాలతో నేను విజయం సాధిస్తానని మా పార్టీ బలంగా నమ్ముతోంది. ఆ ధైర్యంతోనే నేను నామినేషన్ వేశాను. ఫలితం మీరే చూస్తారు’ అని ఆయన పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ సీఎం సిద్దరామయ్య వెంటరాగా రమేశ్ గురువారం నామినేషన్ వేశారు. తమ అభ్యర్థి విజయం సాధించటం తథ్యమని, అందుకని ముందే బీజేపీ తమ నామినేషన్ వెనక్కు తీసుకోవడమే మంచిదని సిద్దరామయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, కర్ణాటక సీఎం కుమారస్వామిపై మాజీ సీఎం, అసెంబ్లీలో బీజేపీ పక్షనేత యడ్యూరప్ప తీవ్ర విమర్శలు చేశారు. సంకీర్ణ భాగస్వామి అయిన కాంగ్రెస్‌పై స్వామికి నమ్మకం లేదన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కుమారస్వామి.. తన డిప్యూటీ పరమేశ్వరకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. లింగాయత్‌ల గురువు పండితారాధ్య శివాచార్య స్వామీజీపై కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు (రాజకీయాల్లో తలదూర్చవద్దంటూ) ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. ఇలాంటి అపవిత్ర కూటమిపై ప్రజలకు పెద్దగా ఆశల్లేవన్నారు. ‘ఐదేళ్ల’పై చర్చించలేదు! డిప్యూటీ సీఎం పరమేశ్వర బెంగళూరు: కుమారస్వామే ఐదేళ్లపాటు సీఎంగా కొనసాగే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పరమేశ్వర స్పష్టంచేశారు. ‘జేడీఎస్‌కు ఏయే మంత్రిత్వ శాఖలు ఇవ్వాలి. కాంగ్రెస్‌కు ఏయే శాఖల బాధ్యతలు ఇస్తారనేదానిపైనా ఎలాంటి నిర్ణయం జరగలేదు’ అని అన్నారు. మరి ఐదేళ్లు జేడీఎస్‌కే ఈ బాధ్యతలు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందా అని ప్రశ్నించగా.. ‘పార్టీలో చర్చిస్తాం. రాష్ట్రానికి సుపరిపాలన ఇవ్వాలనేదే మా లక్ష్యం’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల మధ్య డిప్యూటీ సీఎం విషయంలో వ్యతిరేకత ఉందనే విషయాన్ని ఆయన ఖండించారు. ఇదంతా మీడియా సృష్టేనని ఆయన కొట్టిపడేశారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవిని తనకు ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో పార్టీ ఓటమికి ఈవీఎంలే కారణమని పరమేశ్వర తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 70–80% ఓట్లున్న బూత్‌లలోనూ బీజేపీ మెజారిటీ సాధించటంపై విచారణ జరుపుతామన్నారు. -
రేపు స్పీకర్ ఎన్నిక తర్వాత బలపరీక్ష
-
రేపు బలపరీక్ష, స్పీకర్ ఎన్నిక
బెంగళూరు: జేడీఎస్–కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. అదే రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక కూడా జరగనుంది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు అసెంబ్లీలో సమావేశమవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. కాంగ్రెస్‌కు చెందిన రమేశ్ కుమార్ పేరును స్పీకర్ పదవికి ఇప్పటికే ఖరారు చేయగా, డిప్యూటీ స్పీకర్‌గా జేడీఎస్ ఎమ్మెల్యేల్లో ఒకరికి అవకాశం దక్కనుంది. -
లవ్ ఇన్ బెంగళూరు..!
కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం.. ఎన్డీయేతర ప్రాంతీయ పార్టీల ఐక్యతకు వేదికగా మారింది. సంకీర్ణ కూటమి భాగస్వామిగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్, సోనియాలు హాజరైనా.. వేదికపై ప్రాంతీయ పార్టీల అధినేతల సందడి ప్రధానంగా కనిపించింది. ఎస్పీ చీఫ్ అఖిలేశ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సహా పలువురు ప్రాంతీయ పార్టీల నేతలు, బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. కన్నడనాట బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కీలకంగా వ్యవహరించినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ని ఏపీ సీఎం చంద్రబాబు భుజం తట్టి అభినందించారు. చేయి కలిపి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ కృషిని బాబు ప్రశంసించారు. కాసేపు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. సోనియా, మాయావతిల ఆత్మీయ ఆలింగనం అందరి దృష్టిని ఆకర్షించింది. సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్డీ కుమారస్వామి బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. కేంద్రంలో ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యకూటమి వేసిన తొలి అడుగుగా భావిస్తున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా సహా పలు రాష్ట్రాల సీఎంలు, ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరయ్యారు. కన్నడ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ప్రాంతీయ పార్టీల మేళాను తలపించింది. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పక్షంలో ఉన్న దాదాపు అన్ని పార్టీల నేతలు వేదికపై కనిపించారు. కర్ణాటక విధానసౌధ ఆవరణలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. సైద్ధాంతిక వైరుధ్యాలను పక్కనపెట్టి వీరంతా ఒకే వేదికను పంచుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్నాను. సోనియా, మమతలు ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవడం, తేజస్వీ యాదవ్ మమత, మాయావతి, సోనియాల పాదాలకు నమస్కరించటం అందరి దృష్టిని ఆకర్షించాయి. రాహుల్‌ను ప్రశంసించిన బాబు ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక రాహుల్ దగ్గరికెళ్లిన చంద్రబాబు భుజం తట్టి అభినందించారు. చేయి కలిపి శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటకలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ కృషిని బాబు ప్రశంసించారు. సాధారణంగా రెండు వేళ్లు పైకెత్తి విక్టరీ సింబల్‌తో అభివాదం చేసే చంద్రబాబు.. ఈ వేదికపై మాత్రం చెయ్యి ఊపుతూ అభిమానులను పలకరించటం ఆసక్తిరేపింది. మమత, మాయావతి, అఖిలేశ్‌లతోనూ కబుర్లు చెప్తూ కనిపించారు. కార్యక్రమంలో చంద్రబాబు ఎక్కువసేపు మమతా బెనర్జీతో మాట్లాడుతూ కనిపించారు. మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ దేవెగౌడ వేదికపైకి వచ్చిన అతిథులకు స్వాగతం పలికారు. హాజరైన ప్రముఖులు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, పంజాబ్ సీఎం అమరీందర్, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం విజయన్, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీపీఎం, సీపీఐల ప్రధాన కార్యదర్శులు ఏచూరి, సురవరం సుధాకరరెడ్డి, శరద్ యాదవ్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్, డీఎంకే నేత కనిమొళి, ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రమే కుమారస్వామిని కలిసి అభినందించి వెళ్లారు. వేదికపై అపురూప దృశ్యాలు శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీతారాం ఏచూరి వేదిక చివర్లో కూర్చుని మాట్లాడుకోవటం, అఖిలేశ్, మాయావతిల కబుర్లు, మాయావతి, సోనియా ఆత్మీయ ఆలింగనం వంటి ఆసక్తికర దృశ్యాలన్నీ వేదికపై కనిపించాయి. ఈ ప్రాంతీయ పార్టీల నేతలంతా కార్యక్రమానికి ముందు.. ప్రమాణస్వీకారం తర్వాత ఆప్యాయంగా పలకరించుకున్నారు. ‘అన్ని ప్రాంతీయ పార్టీలతో మేం టచ్‌లో ఉంటాం. తద్వారా దేశాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి మేం కలిసి పనిచేసేందుకు వీలుంటుంది’ అని మమత అన్నారు. ముభావంగా వజూభాయ్! కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత నెలకొన్న పరిస్థితుల్లో బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించటం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న గవర్నర్ వజూభాయ్ వాలా కార్యక్రమంలో ముభావంగా కనిపించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే వేదిక దిగి వెళ్లిపోయారు. కుమారస్వామి గవర్నర్‌కు వీడ్కోలు చెప్పలేదు. వర్షంతో ఇబ్బందులు ప్రమాణ స్వీకారోత్సవానికి వర్షం ఇబ్బంది కలిగించింది. మధ్యాహ్నం 1.30 నుంచే బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. అక్కడే ప్రమాణ స్వీకారం జరుగుతుందా? అన్న అనుమానం కలిగింది. ఒక దశలో విధానసౌధ లోపల కార్యక్రమం నిర్వహించాలని ఆలోచించారు. సాయంత్రంకల్లా వర్షం తగ్గుముఖం పట్టడంతో ప్రాంగణంలోనే ప్రమాణం నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు రావడంతో విధానసౌధ ఎదుట భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. విధానసౌధ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెట్రో స్టేషన్లో ప్రయాణికుల రద్దీతో తీవ్ర గందరగోళం నెలకొంది. నేతలకు ట్రాఫిక్ చిక్కులు ప్రత్యేక విమానంలో బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న సోనియా, రాహుల్‌లు ఎయిర్‌పోర్టునుంచి వస్తుండగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జామ్ అయ్యాయి. నివాసం నుంచి విధానసౌధకు బయల్దేరిన జేడీఎస్ జాతీయాధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడకు కూడా ట్రాఫిక్ చిక్కులు తప్పలేదు. బెంగళూరుకు చేరుకున్న తర్వాత సోనియా, రాహుల్ నేరుగా తమ ఎమ్మెల్యేలున్న హిల్టన్ హోటల్‌కు వెళ్లారు. వారందరితోనూ మాట్లాడారు. వారిని అభినందించారు. బలపరీక్ష పూర్తయ్యేంతవరకు ఎమ్మెల్యేలు హోటల్లోనే ఉండాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. కన్నడ ప్రజల సాక్షిగా.. గవర్నర్ వజూభాయ్ కుమారస్వామితో ప్రమాణం చేయించారు. సంప్రదాయ దుస్తులైన ధోతీ, తెల్లని షర్టు ధరించిన కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, దళిత నేత పరమేశ్వర ప్రమాణం చేశారు. బుధవారం ఉదయమే కేపీసీసీ చీఫ్‌గా పరమేశ్వర రాజీనామా చేశారు. ఈ సంకీర్ణ సర్కారు శుక్రవారం విశ్వాస పరీక్ష ఎదుర్కొనుంది. ఆ తర్వాతే మిగిలిన మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనంతరం కుమారస్వామి కూడా ఒక్కొక్క నాయకుడి దగ్గరకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన తన తల్లి చెన్నమ్మ పాదాలకు నమస్కారం చేశారు. కుమారస్వామి, డీకే శివకుమార్‌లు చేయిచేయి కలిపి కార్యకర్తలకు అభివాదం చేశారు. విధానసౌధ ప్రాంగణంలో ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన వేలాదిమంది కార్యకర్తలు ప్రమాణస్వీకార వేదికపై నుంచి అభివాదం చేస్తున్న పవార్, సోనియా, మాయావతి, రాహుల్, ఏచూరి, కుమారస్వామి, అఖిలేశ్ తదితరులు. ఆప్యాయంగా పలకరించుకుంటున్న మాయావతి, సోనియా. కుటుంబ సభ్యులతో కుమారస్వామి -
కుమారస్వామికి మోదీ ఫోన్.. బలపరీక్ష!
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది. కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత, పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ వజుభాయ్ వాలా వీరిద్దరి చేత విధాన సౌదలో ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. కర్ణాటక నూతన సీఎం కుమారస్వామికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కుమారస్వామికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వాన్ని సజావుగా నడిపించాలని ట్విటర్లో ఆకాంక్షించారు. కుమారస్వామి, పరమేశ్వరలకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. అతిపెద్ద పార్టీగా అవతరరించిన బీజేపీ బలపరీక్షకు వెనకడుగు వేయడం, యడ్యూరప్ప రాజీనామా చేయడంతో కాంగ్రెస్-జేడీఎస్‌లకు మార్గం సుగమమైంది. I congratulate Shri @hd_kumaraswamy Ji and @DrParameshwara Ji on taking oath as Chief Minister and Deputy Chief Minister of Karnataka. My best wishes for their tenure ahead. — Narendra Modi (@narendramodi) 23 May 2018 సీఎం అయ్యాక తొలిసారి మీడియాతో మాట్లాడిన కుమారస్వామి.. రైతుల రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశం నలుదిశల నుంచి వచ్చిన నేతలు 2019 ఎన్నికల్లో మేమంతా ఒకటిగా నిలుస్తామని సంకేతాలు పంపారు. రాజకీయాల్లో ఇదో అతిపెద్ద పరిణామం. కాంగ్రెస్, జేడీఎస్ నేతలు నూతనంగా ఏర్పాటుకానున్న ప్రభుత్వాన్ని రక్షించుకుంటారు. ఏకైక పార్టీ ప్రభుత్వాలనున్న ఇతర రాష్ట్రాలతో పోల్చితే కర్ణాటకలో అత్యుత్తమ పాలన అందించడానికి సిద్దంగా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని కుమారస్వామి పేర్కొన్నారు. బలపరీక్ష.. తొలుత అతిపెద్ద పార్టీ బీజేపీ బలపరీక్షకు ముందు చేతులెత్తేయడంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి రంగంలోకి దిగింది. గవర్నర్ వజుభాయ్ వాలాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. బుధవారం సాయంత్రం దేశంలోని కొందరు కీలక నేతల సమక్షంలో జేడీఎస్ నేత కుమారస్వామి రెండో పర్యాయం కర్ణాటక సీఎంగా ప్రమాణం చేశారు. సీఎం అయితే 24 గంటల్లో బల పరీక్షకు వెళ్లి, అనంతరం కేబినెట్ గురించి ఆలోచిస్తామని కుమారస్వామి ప్రస్తావించారు. కానీ, ఇటీవల చెప్పినట్లుగా కాకుండా రెండో రోజు (ఈ నెల 25న) కుమారస్వామి సర్కార్ బల పరీక్షకు వెళ్లనుంది. వారం రోజుల్లో కేబినెట్ ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే తమ పార్టీల నేతలను బల పరీక్ష ముగిసేవరకు కాపాడుకునేందుకు హోటళ్లలోనే బస చేయిస్తూ వారిని ఇంటికి సైతం దూరం పెట్టిన విషయం విదితమే. -
ఆ ఆడియో టేపులు బూటకమే!
బెంగళూరు: కర్ణాటకలో విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్న కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటకలో తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుంటూ కాంగ్రెస్ విడుదల చేసిన ఆడియో టేపులు బూటకమేనంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే శివరామ్ హెబ్బార్ సోమవారం స్పష్టం చేశారు. హెబ్బార్ భార్యతో బీజేపీ నేతలు మాట్లాడిన ఆడియోటేపులు ఇవేనంటూ విశ్వాస పరీక్షరోజు ఉదయం కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర, అతని మిత్రుడు పుత్తుస్వామిలు హెబ్బార్ భార్యకు డబ్బులు, మంత్రి పదవిని ఇస్తామని ప్రలోభపెట్టినట్లుగా ఉంది. దీనిపై హెబ్బార్ మండిపడ్డారు. తన ఫేస్బుక్ పోస్టులో ఆ ఆడియోటేపుల విశ్వసనీయతను ప్రశ్నించారు. ‘ఈ టేపులో ఉన్నది నా భార్య గొంతు కాదు. అసలు ఆమెకు బీజేపీ నేతల నుంచి ఫోన్లు రాలేదు. ఆ ఆడియో టేపులు బూటకం. దీన్ని నేను ఖండిస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయకుండా ఉండేందుకే కాంగ్రెస్ బూటకపు ఆడియో టేపులతో విషప్రచారం చేసిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మండిపడ్డారు. కాగా, ‘మీడియాకు మేం విడుదల చేసిన ఆడియో టేపు నిజమైందే. మా ఎమ్మెల్యే (హెబ్బార్) చెప్పింది నిజమే. అందులో మాట్లాడింది ఆయన భార్య కాదు. కానీ మిగిలినవి మాత్రం విజయేంద్ర, పుత్తుస్వాముల గొంతులే. ఈ ఇద్దరికీ నిజంగా ధైర్యముంటే.. ఫోరెన్సిక్ వాయిస్ టెస్టుకు హాజరవ్వాలి’ అని కాంగ్రెస్ పేర్కొంది. ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా కూటమి: సంతోష్ హెగ్డే హైదరాబాద్: కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగానే ఉంటుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మాజీ సొలిసిటర్ జనరల్ ఎన్ సంతోష్ హెగ్డే అభిప్రాయపడ్డారు. ఏదో ఒక పార్టీకి సరైన మెజారిటీ ఇవ్వడంలో కన్నడ ప్రజలు విఫలమయ్యారన్నారు. ఏదో ఒక పార్టీకి అధికారం కట్టబెట్టడం ద్వారా వైఫల్యాలు వస్తే నిందించేందుకు, విజయాలు సాధిస్తే ప్రశంసించేందుకు వీలుంటుందన్నారు. బీజేపీని దూరంగా ఉంచేందుకు జేడీఎస్‌కు కాంగ్రెస్ మద్దతివ్వడంలో తప్పులేదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఇక్కడ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఏమీ జరగలేదు. వారి అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, కొందరిని సంతోషపెట్టేందుకే ఈ కూటమి ఏర్పడింది’ అని అన్నారు. -
బీజేపీపై బాంబు పేల్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే!
సాక్షి, బెంగళూరు : ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టిందని, వారికి మంత్రి పదవులతో పాటు రూ.100 కోట్ల మేర ఆశ చూపినట్లుగా కాంగ్రెస్ టేపులు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవనగౌడ చన్నబసవనగౌడ పాటిల్ (బీసీ పాటిల్) స్పందించారు. బలపరీక్షలో బీజేపీకి ఓటేస్తే మంత్రి పదవితో మరెన్నో ఇస్తామని బీజేపీ తనకు ఆశ చూపింది నిజమేనని పేర్కొన్నారు. తనను సంప్రదించి మామూలు నేతలు కాదని, అందులో యడ్యూరప్ప కూడా ఉన్నారని చెప్పి బీజేపీని మరింత ఇరకాటంలోకి నెట్టారు. తమ పార్టీ ఎమ్మెల్యే శివరామ్ హెబ్బర్ గురించి తనకేమీ తెలియదన్నారు. కానీ, తన విషయం గురించి వెల్లడిస్తునన్న పాటిల్ ప్రలోభాలు నిజమనేనన్నారు. బీజేపీ కీలక నేతలు యడ్యూరప్ప, శ్రీరాములు, మురళీధర్ రావు తనను సంప్రదించారని, తమకు ఓటేస్తే మంత్రి పదవి ఇస్తామని ప్రలోభాలకు గురి చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ బలపరీక్ష నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కాంగ్రెస్ నేతలు బీజేపీ ప్రలోభాల ఆడియో టేపులను విడుదల చేయడం తెలిసిందే. మరోవైపు జేడీఎస్ నేత కుమారస్వామి నేడు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్-జేడీఎస్ కేబినెట్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. -
కర్నాటకలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు?
-
పూజలు చేసి.. ఢిల్లీకి కుమారస్వామి
సాక్షి, బెంగళూరు : కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగాలని భావిస్తున్నారు. అందుకు ఏ అడ్డంకులు తనకు ఎదురుకావొద్దని హసన్‌లోని లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు ఢిల్లీకి వెళ్లి కేబినెట్‌పై కాంగ్రెస్ చర్చలు జరపనున్న నేపథ్యంలో ఆయన ఆలయాన్ని సందర్శించడం గమనార్హం. కాగా, కర్ణాటక రాజకీయాలు నేటి మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకోనున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి సమావేశం కానున్నారు. అనంతరం 4:30 గంటలకు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆయన భేటీ అవుతారు. కర్ణాటక మంత్రిమండలి కూర్పు, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్, సమన్వయ కమిటీ ఏర్పాటుపై చర్చిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ స్థిరత్వంపై కుమారస్వామి దృష్టి సారిస్తున్నారు. అయిదేళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని ఆయన ఇదివరకే కుండబద్దలుకొట్టారు. మరోవైపు రొటేషన్ సీఎంకు జేడీఎస్ కూడా నో చెబుతోంది. కీచులాటలు, విభేదాలతో కూటమిని విచ్ఛిన్నం చేయవద్దన్న భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. బీజేపీని నిలువరించడం కోసం ఐదేళ్ల పాటు కూటమికి బీటలు వారకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు సీనియర్ నేతలు కసరత్తులు చేస్తున్నారు. -
దేశంలో కాంగ్రెస్ పార్టీనే అతిపెద్ద అవినీతి పార్టీ
-
ఆ పొత్తే.. కాంగ్రెస్ అవినీతికి నిదర్శనం!
వాషింగ్టన్‌డీసీ: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్-బీజేపీ మధ్య పరస్పర విమర్శల దాడి కొనసాగుతోంది. బీజేపీకి బలం లేకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించి భంగపడిందని, అధికారాన్ని దుర్వినియోగం చేసి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన సంగతి తెలిసింది. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఖండించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీనే అతిపెద్ద అవినీతి పార్టీ అని ఆయన విమర్శించారు. కర్ణాటకలో ప్రజాతీర్పునకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ.. జేడీఎస్‌తో అపవిత్ర పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, కాంగ్రెస్ అవినీతికి ఇది తాజా నిదర్శనమని ఆయన అన్నారు. వాషింగ్టన్‌డీసీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ మొదలుకొని, రాజీవ్‌గాంధీ, గత యూపీఏ ప్రభుత్వాల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని అన్నారు. గత నాలుగేళ్లుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవినీతిరహిత పారదర్శక పాలన అందిస్తోందని చెప్పారు. -
సీఎం సీటు పంచుకోం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్న జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి.. సీఎం సీటును జేడీఎస్–కాంగ్రెస్ కొంతకాలం పాటు పంచుకుంటాయంటూ వస్తున్న వార్తలను ఖండించారు. కూటమి భాగస్వామి కాంగ్రెస్‌తో ఇలాంటి ఒప్పందాలేమీ లేవని ఆయన ఆదివారం బెంగళూరులో స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీ వెళ్లనున్న కుమారస్వామి.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియా గాంధీలతో సమావేశమై మంత్రిమండలి కూర్పుపై చర్చిస్తామన్నారు.‘రేపు ఢిల్లీ వెళ్తున్నాను. సోనియా, రాహుల్‌తో భేటీ అవుతాను. కేబినెట్ విస్తరణతోపాటుగా ఐదేళ్లపాటు సుస్థిర ప్రభుత్వం నడిపేందుకు అవసరమైన అంశాలపై చర్చిస్తాను.సీఎం సీటు పంపకంపై ఎలాంటి ఒప్పందం జరగలేదు. దీనిపై వస్తున్న వార్తలు అవాస్తవం’ అని స్వామి పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత 24 గంటల్లోనే బలనిరూపణ చేసుకుంటానని ఆయన వెల్లడించారు. కుమారస్వామితోపాటుగా సిద్దరామయ్య, జి. పరమేశ్వరన్, డీకే శివకుమార్‌లుకూడా ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా, ఆదివారం కాంగ్రెస్ నేతలతో కుమారస్వామి భేటీ అయ్యారు. విశ్వాస పరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. అయితే డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్ నుంచి దళిత నేతను ఎన్నుకోవటం దాదాపు ఖాయమైంది. అది పీసీసీ చీఫ్ జి. పరమేశ్వరే అని తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ బలం ఆధారంగా.. 34 మంత్రులను ఏర్పాటుచేసుకునే అవకాశం ఉంది. అయితే, జేడీఎస్, కాంగ్రెస్ మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం జేడీఎస్ సీఎం, 13 కేబినెట్ బెర్తులు, కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం సహా 20 కేబినెట్ బెర్తులు పంచుకోనున్నట్లు తెలుస్తోంది. కుమారస్వామి తనవద్దే ఆర్థిక శాఖను అంటిపెట్టుకోవచ్చని సమాచారం. డిప్యూటీ సీఎంగా పీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వరన్ ఎంపిక దాదాపు ఖాయంగానే తెలుస్తోంది. కూటమి ఎమ్మెల్యేలను కాపాడటంతో కీలకపాత్ర పోషించిన డీకే శివకుమార్‌కు కీలక శాఖను అప్పజెప్పాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌తో విభేదాల్లేవ్! ముఖ్యమంత్రి సీటుతో పాటు పలుఅంశాల్లో కాంగ్రెస్‌తో విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కుమారస్వామి తెలిపారు. రాజరాజేశ్వరినగర్, జయనగర్ అసెంబ్లీ స్థానాల ఎన్నికల విషయంపై ప్రస్తుతానికి చర్చించడం లేదన్నారు. ‘ఈ రెండుచోట్ల గెలవటం మాకు చాలా ముఖ్యం. ముందు ప్రభుత్వ ఏర్పాటు. ఆ తర్వాతే వీటిపై చర్చిస్తాం’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలతో సమావేశం అనంతరం.. బెంగళూరులోని ఓ హోటల్లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అయితే క్యాంపులో ఉండాలా లేక ఇంటికెళ్లి బుధవారం ప్రమాణస్వీకారానికి రావాలా అన్న విషయంలో నిర్ణయించుకునే పూర్తి హక్కును ఎమ్మెల్యేలకే వదిలేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం తమిళనాడులోని ఓ దేవాలయ సందర్శనకు స్వామి బయలుదేరారు. రజనీ వర్సెస్ స్వామి తమిళనాడుకు వచ్చి ఇక్కడి రైతుల పరిస్థితి చూస్తే.. కుమార స్వామి మనసు మార్చుకుని కావేరీ నీటిని విడుదల చేసే అవకాశం ఉందని రజనీకాంత్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను కుమారస్వామి తిప్పికొట్టారు. ‘కర్ణాటకలో నీరుంటే వారికి విడుదల చేయగలం. రజనీకాంత్ ఇక్కడికొచ్చి మా డ్యాముల పరిస్థితి, రైతుల దీనస్థితి చూడాలని ఆహ్వానిస్తున్నా. ఇవన్నీ చూశాక కూడా మీరింకా నీరు కావాలంటే మనం చర్చిద్దాం’ అని పేర్కొన్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు! కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి మంత్రివర్గంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండే అవకాశం ఉందని కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి సోమవారం కలిసిన అనంతరం తుది నిర్ణయం వెలువడుతుందని ఆయన వెల్లడించారు. కర్ణాటక విధానసభ ఎన్నికల ఫలితాల రోజున కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం జేడీఎస్‌కు ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాల్సి ఉంది. డిప్యూటీ సీఎంగా పరమేశ్వరతో పాటు జేడీఎస్ నుంచి కూడా మరో ఉపముఖ్యమంత్రి ఉండొచ్చని తాజా సమాచారం. రిసార్టులోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప రాజీనామా తర్వాత జరిగే ప్రతి పరిణామాన్ని కాంగ్రెస్, జేడీఎస్ కూటమి జాగ్రత్తగా గమనిస్తూ ముందుకెళ్తోంది. ఏ విషయంలోనూ తప్పటడుగుల్లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే కుమారస్వామి బలనిరూపణ చేసుకోవాలని భావిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంకా బెంగళూరు శివార్లలోని రిసార్టులోనే ఉన్నారు. ముందుగా అనుకున్నదాని ప్రకారం సోమవారం కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయాల్సి ఉన్నప్పటికీ.. జేడీఎస్ బుధవారానికి వాయిదా వేసింది. సోమవారం (మే 21) మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి కారణంగా దీన్ని రెండ్రోజులు వెనక్కు జరిపారు. ప్రస్తుతానికి 221 మంది సభ్యులున్న సభలో ఈ కూటమికి 117 మంది ఎమ్మెల్యేలున్నారు. కుమారస్వామి తాను ఎన్నికైన రెండో స్థానానికి (రామనగర) రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. అయితే మొదట కంఠీరవ స్టేడియంలోప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించినప్పటికీ.. దీన్ని విధానసౌధకే మార్చే అవకాశం ఉంది. -
రజనీ వ్యాఖ్యలపై మండిపడ్డ కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాలతో పాటు కావేరీ జల వివాదంపై దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి తీవ్ర స్థాయిలో స్పందించారు. కావేరీ జల వివాదంపై రజనీ చేసిన వ్యాఖ్యలను తాను స్వీకరించలేనన్నారు. కుమారస్వామి ఇక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి రజనీకాంత్, తాను ఏ ప్రభుత్వానికి చెందిన వ్యక్తులం కాదన్నారు. సాధారణ పౌరుడిగా నేను రజనీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓసారి ఇక్కడికి వచ్చి రిజర్వాయర్లలో నీటి నిల్వను పరిశీలించండి. మా రైతులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో గమనిస్తే రజనీకాంత్ తన మనసు మార్చుకుంటారని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో చర్చించి మంత్రి మండలిపై నిర్ణయం తీసుకోవడంతో పాటు ఐదేళ్లపాటు ప్రభుత్వం కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కుమారస్వామి చర్చించనున్నారు. రజనీ మక్కల్ మండ్రమ్ మహిళా విభాగం కార్యకర్తలతో ఆదివారం భేటీలో రజనీ మాట్లాడుతూ.. కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. బలపరీక్షకు 15 రోజులు గడువు ఇవ్వడం జోక్ అన్న రజనీ.. కావేరీ జలాల బోర్డును కర్ణాటక ఆధీనంలో కాకుండా.. సీనియర్ ఐఏఎస్ పర్యవేక్షణలో ఉంటేనే తమిళనాడుకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీంతో రజనీ కర్ణాటకలో తమ పరిస్థితులు అర్థం చేసుకుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. -
కర్ణాటకలో తెలుగువాళ్లు మాకే అండగా నిలిచారు!
సాక్షి, విజయవాడ : కర్నాటకలో తెలుగువాళ్లు బీజేపీకి అండగా నిలిచారని ఆ పార్టీ నేత రమేశ్‌నాయుడు తెలిపారు. బెంగళూరు నగరంలోని పద్మనాభ నగర్లో తెలుగువారు అధికంగా ఉంటారని, అక్కడ బీజేపీ అభ్యర్థి అశోశ్ను ఓటర్లు గెలిపించారని తెలిపారు. బీజేవైఎం ఈసీ సభ్యుడిగా ఉన్న రమేశ్ నాయుడు ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. మహాదేవపూర్లోనూ బీజేపీ గెలిచిందని, కానీ టీడీపీ నేతలు తెలుగువాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారంటూ ఊకదంపుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చూసిన చంద్రబాబుని ప్రజలు తిరస్కరించారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీకి ప్రజలు మెజారిటీ సీట్లు కట్టబెట్టారని, అయినా, మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో వాజపేయి తరహాలో విలువలకు నిలబడి.. యడ్యూరప్ప గౌరవంగా రాజీనామా చేశారని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఏడుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయకుండా.. నైతిక విలువలను బీజేపీ కట్టుబడిందని అన్నారు. కర్ణాటక ఎన్నికల కోసం చంద్రబాబు ఇక్కడ నుంచి డబ్బు తరలించారని ఆరోపించారు. అయినా బీజేపీనే గెలిచిందని, నైతిక విజయం తమ పార్టీదేనని చెప్పారు.