సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటకలో గత నాలుగు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు దేశ రాజకీయాలపై పెను ప్రభావాన్నే చూపనున్నాయి. ఇవి రాజకీయ శక్తుల పునరేకీకరణకు అవకాశం కల్పించాయి. లోక్‌సభ ఎన్నికలు దాదాపు 10 నెలలున్న ప్రస్తుత తరుణంలో కర్ణాటక పరిణామాలు కాంగ్రెస్, బీజేపీల్ని ఆలోచనలో పడేశాయి. తనను ఏకాకిని చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని బీజేపీకి, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు చాలా అవసరమని కాంగ్రెస్‌కు కర్ణాటక రాజకీయం స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. గత వారం రోజుల పరిణామాలతో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వైరం మరింత తీవ్రమవడం ఖాయంగా కన్పిస్తోంది.
కుమారస్వామి ప్రమాణంతో బీజేపీకి సవాలు
బుధవారం జేడీఎస్ నేత కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుంచి బీజేపీకి అసలు సవాలు మొదలవుతుంది. ప్రమాణస్వీకారం వేదికగా ప్రతిపక్ష పార్టీల నేతలు కలిసే అవకాశముంది. రాహుల్ గాంధీతో పాటు.. బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, బీఎస్పీ అధినేత్రి మాయవతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తదితరులతో పాటు సైద్ధాతికంగా కలిసివచ్చే పార్టీల నేతల్ని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. ఇదే వేదికగా బీజేపీ ఏకాకిని చేసేందుకు వీరంతా ముందడుగు వేయవచ్చు. ప్రాంతీయ పార్టీలు తమ సొంత ప్రయోజనాల మేరకు ముందుకెళ్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోతుందని.. 11 పెద్ద రాష్ట్రాల్లో తమను ఢీకొట్టే సత్తా ఆ పార్టీకి లేదని బీజేపీ సమర్ధించుకుంటోంది. ప్రస్తుతం పంజాబ్, మిజోరం, పుదుచ్చేరిల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. తాము కర్ణాటకలో మంచి పనితీరు కనపర్చామని, ఉత్తరాది పార్టీ అన్న ముద్ర చెరిపేసుకున్నామనేది ఆ పార్టీ వాదన.
ప్రాంతీయ పార్టీలతో కలిసి...
మరోవైపు బీజేపీని నేరుగా ఢీకొట్టాల్సిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. సైద్ధాంతికంగా కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగాలని 84వ ప్లీనరీలో తీర్మానించిన విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి ఒకరు గుర్తు చేశారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ పొత్తులతో ముందుకు వెళ్లకపోతే ఆ పార్టీకి నిరాశే మిగులుతుందని, కర్ణాటకను లౌకిక శక్తులు నమూనాగా తీసుకోవాలని కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. కర్ణాటకలో కొత్తగా ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదని, ఇరు పార్టీల మధ్య విభేదాలతో కూలిపోతుందని, ఆ పరిస్థితి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమకు సాయపడుతుందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాల స్పందిస్తూ.. ప్రస్తుతం బీజేపీని నిలువరించకపోతే.. లౌకిక శక్తులకు అతి పెద్ద దెబ్బగా మారుతుందని, నరేంద్ర మోదీ నేతృత్వంలో సమాజం మరింత చీలిపోతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment