elections 2018
-
TS Elections 2023: తెలంగాణలో కమ్మలకు, వెలమలకు చెడిందా?
రాజకీయాల్లో కుల సమీకరణాల పాత్ర చాలా కీలకం. ఓటు బ్యాంకును నిర్ణయించేది, ఎన్నికల్లో గెలిపించేది కులమే అని నమ్ముతారు. తెలంగాణ ఎన్నికలకు కొద్ది ముందు కమ్మ సామాజిక వర్గం విడుదల చేసిన ఓ ప్రెస్ నోట్ ఇప్పుడు ఆసక్తికరమైన అంశాలపై చర్చకు దారి తీసింది. మొన్నటి బీఆర్ఎస్ టికెట్ల పంపిణీలో వెలమ అభ్యర్థులకు 11 టికెట్లు దక్కగా, కమ్మ సామాజిక వర్గానికి 5 టికెట్లు దక్కాయి. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న తాము, చాలా ప్రాంతాలతో పాటు ఇతర వర్గాలపైనా ప్రభావం చూపిస్తామని నమ్ముతున్న కమ్మలు తమకు 5 సీట్లు సరిపోవన్న అసంతృప్తిలో ఉన్నారు మాకు మీరు.. మీకు మేం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. కెసిఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీకి ముందు నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి మద్ధతు ఉంది. హైదరాబాద్, ఖమ్మంలో ఈ సామాజిక వర్గంకు ఉన్న ఓటు బ్యాంకుతో పాటు వీరు ప్రభావితం చేసే ఓట్లను గంపగుత్తగా బీఆర్ఎస్కు పడేవి. ఇటీవల సీఎం కెసిఆర్ ప్రకటించిన జాబితాలో టికెట్లు దక్కించుకున్న కమ్మలు జూబ్లీహిల్స్ - మాగంటి గోపినాథ్ శేరిలింగంపల్లి - అరికెపూడి గాంధీ సిర్పూర్ - కోనేరు కోనప్ప ఖమ్మం - పువ్వాడ అజయ్‌కుమార్ మిర్యాలగూడ - నల్లమోతు భాస్కరరావు (రేవంత్, మాణిక్కం ఠాగూర్ ను కలిసిన తర్వాత గాంధీభవన్ ముందు కమ్మ నేతలు) తుమ్మల, జలగం ఇద్దరికీ షాక్ ఇప్పుడు ఆ సమీకరణాల్లో తేడా కొట్టిందని కొన్ని పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్ తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఎక్కువ మంది సిట్టింగ్‌లకే టికెట్లు వచ్చాయి. పైగా 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయిన ఇద్దరు ముఖ్యమైన కమ్మ నేతలకు టికెట్ ఈ సారి దక్కలేదు. పాలేరు నుంచి టికెట్ ఆశించిన తుమ్మల నాగేశ్వరరావు నిరాశకు గురి కాగా.. పోటీ చేసే అవకాశం పార్టీ ఇవ్వలేదు. ఇవ్వాళ తుమ్మల కన్నీళ్లు పెడుతూ హైదరాబాద్ నుంచి వెళ్లే దృశ్యాలు ఈ సామాజిక వర్గంలో చర్చనీయాంశమయ్యాయి. (టికెట్ దక్కకపోవడంతో నిరాశకు గురై కన్నీళ్లు పెట్టుకున్న తుమ్మల) కమ్మ @ కిం కర్తవ్యం ఈ పరిణామాలు కమ్మ వర్గంలో కొంత అసంతృప్తి నింపాయి. ఈ మేరకు తెలంగాణ కమ్మ వర్గం ముఖ్యనేతలు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు. ఇక మిగిలింది కాంగ్రెస్, బీజేపీ కాబట్టి .. అర్జంట్‌గా రెండు లేఖలు తయారు చేశారు. ఈ రెండు పార్టీలు ప్రకటించబోయే జాబితాలో కమ్మలకు పది ఎమ్మెల్యే టికెట్లు, దీంతో పాటు వచ్చే ఏడాది రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రెండు ఎంపీ టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని, అలాగే తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డిని కలిసి తమ విజ్ఞప్తులు అందించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ను మాత్రం కలవలేదు. (బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి కలిసి టికెట్లు ఇవ్వాలని కోరిన కమ్మ నేతలు) చాలా స్ట్రాంగ్ తెలంగాణలో ఆర్థికంగా అత్యంత శక్తిమంతమైన కులాలుగా ఉన్న కమ్మ, వెలమ కులాలు రాజకీయంగా మాత్రం వేర్వేరు స్థాయిల్లో ఉన్నాయి. ఈ రెండు కులాలకు హైదరాబాద్‌లోని ప్రధాన స్థలాల్లో సొంత భవనాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ రెండు కులాలకీ చెరో ఐదెకరాల స్థలాన్ని ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంపై వివాదం చెలరేగింది. ఆ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆ విషయంలో కూడా కమ్మ సామాజిక వర్గానికి కొంత అసంతృప్తి మిగిలింది. ఓ రకంగా బీఆర్ఎస్ను రెచ్చగొట్టడానికే కమ్మ నాయకులు కాంగ్రెస్, బీజేపీలను కలిశారన్న ప్రచారం జరుగుతోంది. -
38 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాలి
శామీర్‌పేట్: పోలింగ్ మొదలయ్యే సమయానికి 38 గంటల ముందే (19వ తేదీ సాయంత్రం 5 గంటలకు) ప్రచారాన్ని నిలిపివేయాలని జిల్లా ఉపఎన్నికల అధికారి జ్యోతి తెలిపారు. గురువారం శామీర్‌పేట మండల పరిషత్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ... గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. శామీర్‌పేట మండలంలో 22 గ్రామపంచాయతీలు ఉండగా ఇందులో యాడారం, నాగిశెట్టిపల్లి పంచాయతీల్లో సర్పంచ్‌తో పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైందన్నారు. సీఎం దత్తత గ్రామమైన మూడుచింతలపల్లి సర్పంచ్ ఏకగ్రీవం అయ్యాయని వీటితో పాటు లింగాపూర్ తాండాలోని 8 వార్డుల వార్డుసభ్యులు ఏకగ్రీవంగా ఎన్పికైనట్లు తెలిపారు. శామీర్‌పేట మండలంలో మిగిలి 20 గ్రామపంచాయితీల్లో 74 మంది సర్పంచ్ అభ్యర్ధులతో పాటు 574 మంది వార్డు సభ్యుడి అభ్యర్ధులకు 216 పోలింగ్ బూత్‌ల ద్వారా ఎన్నికలు 21న నిర్వహించి ఆదే రోజు మధ్యాహ్నం తర్వాత ఉపసర్పంచ్‌ను ఎన్నుకోనున్నట్లు తెలిపారు. ఒకరోజు ముందే పోలింగ్‌స్టేషన్‌కు సిబ్బంది... గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ స్టేషన్‌కు ఒక రోజు ముందే ఎన్నికల సిబ్బంది చేరుకుంటారన్నారు. ప్రతి గ్రామానికి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించామని, మండల వ్యాప్తంగా 22 రూట్లలో 22 బస్సుల్లో ఎన్నికల సామాగ్రిని తరలించనున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నలుగురు జోనల్ అధికారులతో పాటు 672 మంది ఎన్నికల సిబ్బందిని నియమించామని, 4 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు(ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ, వీఎస్టీ, ఎంఎస్టీ)లు 24 గంటలు మండల వ్యాప్తంగా పర్యటిస్తున్నాయన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు... మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బృందాలు పర్యటిస్తాయన్నారు. అతి సమస్యాత్మకమైన అలియాబాద్, బొమ్మరాశిపేట, లాల్‌గడి మలక్‌పేట, మజీద్‌పూర్, మూడుచింతలపల్లి, శామీర్‌పేట, తుర్కపల్లి గ్రామాలను గుర్తించామని ఈ గ్రామాల్లో అదనపు పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక బృందాలు(ఫ్లైయింగ్స్క్వాడ్) పర్యటిస్తాయన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అభ్యర్ధులతో పాటు ప్రజలు సహకరించాలన్నారు. -
రేపటి బంగ్లా ఎన్నికలపై భారత దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు ఆదివారం నాడు జరుగుతున్న ఎన్నికలు ఆ దేశానికే కాకుండా భారత దేశానికి కూడా ముఖ్యమైనవే. 1971లో విమోచన యుద్ధం ద్వారా స్వాతంత్య్ర దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచి బంగ్లాదేశ్‌కు సహజమైన మిత్ర దేశంగా ఉంటున్న భారత్‌కు మధ్య బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆర్థిక రంగంలో సాధించిన పురోగతి, సుస్థిరత రాజకీయ రంగంలో సాధించకపోవడం మాత్రం విచారకరమైన విషయమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటికి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే కాకుండా అట్టడుగు స్థాయిలో ఉండింది. గడిచిన దశాబ్దం నుంచి ఆ దేశం ఏటా ఆరు శాతానికిపైనే జీడీపీ వృద్ధి రేటును సాధిస్తూ వచ్చింది. 2017–18 సంవత్సరంలో ఏకంగా 7.86 శాతం వృద్ధి రేటును సాధించింది. బంగ్లా వస్త్ర వ్యాపారంలో ప్రపంచంలోనే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. చైనా తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రెండో దేశంగా కూడా గుర్తింపు పొందింది. ఒకప్పుడు వెనకబడిన దేశంగా బంగ్లాదేశ్‌ను పేర్కొన్న ఐక్యరాజ్య సమితి ఇప్పుడు దాన్ని అభివృద్ధి చెందుతున్న వర్ధమాన దేశంగా వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్ తనకు అవసరమైన సరుకులను ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్న విదేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. దక్షిణాసియాలోనే భారత్‌కు బంగ్లా అతిపెద్ద వ్యాపార భాగస్వామి. ఇరు దేశాల మధ్య నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ప్రజాస్వామ్యం అంతంత మాత్రమే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాలుగేళ్లకే దేశ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్‌ను హత్య చేసి సైన్యం అధికారంలోకి వచ్చింది. చాలాకాలం పాటు సైనిక నియంత పాలనే కొనసాగింది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా కృషి చేయలేదు. గత పార్లమెంట్ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (ఇస్లాం పార్టీ) బహిష్కరించడంతో పాలకపక్ష అవామీ లీగ్ పార్టీ ఎలాంటి పోటీ లేకుండా సగానికి పైగా పార్లమెంట్ సీట్లను గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో 38 శాతం పోలింగ్ నమోదయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించుకుంది. అయితే వాస్తవానికి 22 శాతం మాత్రమే పోలింగ్ జరిగినట్లు స్వతంత్ర వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా ఎవరి మధ్య పోటీ దేశానికి స్వాతంత్య్ర లభించినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో ప్రధానంగా రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటోంది. వాటిలో ప్రధానమైనది దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అవామీ లీగ్. సెక్యులర్ పార్టీగా గుర్తింపు పొందిన ఈ పార్టీకే మైనారీటీలైన హిందువులు, మెజారిటీలయిన బౌద్ధులు ఓటు వేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ పార్టీకి గట్టి పోటీ ఇస్తూ వస్తున్నది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఇస్లాం సిద్ధాంతాన్ని నమ్ముకున్న ఈ పార్టీ గత ఎన్నికలను బహిష్కరించడం వల్ల వరుసగా పదేళ్లపాటు షేక్ హసీనా నాయకత్వాన ఆవామీ లీగ్ పార్టీయే అధికారంలో ఉంది. ఈ కారణంగా కూడా ప్రజల్లో ఆమె పట్ల వ్యతిరేకత పెరిగింది. ప్రజాస్వామ్య పద్ధతులను తుంగలో తొక్కి ఆమె అణచివేత రాజకీయాలకు పాల్పడుతోందన్న విమర్శలు కూడా ఎక్కువే ఉన్నాయి. మాదక ద్రవ్యాలు, అవినీతిపై యుద్ధం పేరిట ఆమె తన రాజకీయ ప్రత్యర్థులందరిని దాదాపుగా మట్టుబెట్టారు.ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ ఖలేదా జియాను అవినీతి ఆరోపణలపై జైలుకు పంపించారు. ఆ కారణంగా ప్రస్తుత ఎన్నికల్లో ఆమె పోటీ చేయడానికి వీల్లేకుండా పోయింది. తన ప్రభుత్వాన్ని విమర్శించినందుకు దేశంలో మంచి గుర్తింపున్న మీడియా ఫొటోగ్రాఫర్ షాహిదుల్ ఆలంను కూడా కటకటాల వెనక్కి నెట్టారు. భారత్ మద్దతు ఎవరికి ? బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఆది నుంచి అవామీ లీగ్‌కే భారత్ లోపాయికారిగా మద్దతిస్తుండగా 2014 ఎన్నికల నుంచి బహిరంగంగా మద్దతివ్వడం ప్రారంభించింది. ఈ కారణంగానే షేక్ హసీనాతో భారత మైత్రి బలపడుతూ వచ్చింది. ఫలితంగా 2015లో ఇరు దేశాల మధ్య రెండు ప్రధాన ఒప్పందాలు కుదిరాయి. ఒకటి భూ సరిహద్దుకు సంబంధించిన ఒప్పందం కాగా, మరోటి అక్కడి భూభాగం మీది నుంచి పనిచేస్తున్న ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం’ లాంటి భారత ఈశాన్య రాష్ట్రాల మిలిటెంట్ సంస్థలను సమూలంగా నిర్మూలించడం. ఈ రెండో ఒప్పందం కారణంగానే రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ సైనికులు ఇచ్చిన సమాచారం మేరకు భారత సైనికులు బంగ్లా సరిహద్దుల్లోకి చొచ్చుకుపోయి అస్సాం మిలిటెంట్ నాయకులను కాల్చి వేశారు. ఈసారి కూడా అవామీ లీగ్‌కే భారత ప్రభుత్వం మద్దతిస్తోంది. ఇంతకీ ఎవరిదీ గెలుపు? షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ను గట్టిగా ఎదుర్కొనేందుకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ ఈసారి 20 చిన్నా, చితక పార్టీలను కలుపుకొని ‘జాతీయ ఐక్య సంఘటన’ పేరిట పోటీకి రంగంలోకి దిగింది. ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత కూడా తమకు కలసి వస్తోందని జాతీయ ఐక్య సంఘటన భావిస్తోంది. ఈసారి ఇరు పక్షాల మధ్య పోటీ బలంగా ఉంటుందని, ఏ పక్షమైనా గెలవచ్చని ముందస్తు ఎన్నికల సర్వేలు సూచిస్తున్నాయి. అయితే ఈసారి కూడా ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగే అవకాశం లేనందున అవామీ లీగ్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీడియా భావిస్తోంది. ఎన్నికల కమిషన్, పోలీసులు ప్రభుత్వం చేతుల్లో కీలు బొమ్మలయ్యాయని ప్రతిపక్ష అభ్యర్థులను అన్యాయంగా అభియోగాలు మోపి అరెస్ట్ చేయిస్తున్నారని ప్రతిపక్షం నాయకులు ఆరోపిస్తున్నారు. కేసులు, అరెస్ట్‌కారణంగా 17 పార్లమెంట్ సీట్లలో ప్రతిపక్షానికి అభ్యర్థులు లేకుండా పోయారు. పోలింగ్ కేంద్రాల్లో ఫొటోలు గానీ వీడియోలుగానీ తీయరాదంటూ మీడియాపై ఆంక్షలు విధించినందున రిగ్గింగ్ జరిగే అవకాశం ఎక్కువ ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. -
పోలీసు శాఖలో ఎన్నికల సందడి
గుంటూరు: రాజధాని జిల్లా గుంటూరు పోలీసుల శాఖలో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అర్బన్, రూరల్ జిల్లాల పరిధిలో ఎన్నికల్లో పోటీ పడేందుకు కొందరు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం పదవుల్లో కొనసాగుతూ రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న నాయకులు ఇప్పటి నుంచే పావులు కదుపుతూ వచ్చే ఎన్నికల్లో అనుకూలమైన అభ్యర్థికి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఓ సంఘం నాయకుడి పట్ల కొందరు అసంతృప్తితో ఉన్నారు. ఈ ఎన్నిక్లలో కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని ఆలోచన చేస్తున్నారు. బరిలో ఏడుగురు.. రెండు జిల్లాల పరిధిలో మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీలో పాల్గొననున్నట్లు పోలీసులు చర్చించుకుంటున్నారు. తమకు సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించి అండగా నిలిచే అభ్యర్థులకే తమ మద్దతు తెలుపుతామంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే పోలీస్ మార్క్‌లో అభ్యర్థుల ఎంపిక సదరు అభ్యర్థులకు మద్దతు తెలపాలంటూ చాపకింద నీరులా ప్రచారం చేస్తున్నారు. నూతన సంవత్సరంలో.. వచ్చే నెలలో నోటిఫికేషన్ వెలువడిన అనంతరం వారం రోజుల వ్యవధిలో ఎన్నిక ప్రక్రియను ముగిస్తారు. ప్రస్తుతం అర్బన్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా పోటీ పడేందుకు శైలేంద్ర కుమార్, మస్తాన్‌వలి, జానయ్యలు సిద్ధంగాగా ఉండగా, రూరల్ జిల్లా పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న చందు పూర్ణచంద్రరావు, బాల కోటేశ్వరరావు, చెన్నయ్య, హరి బరిలో పోటీపడతారని ప్రచారం జరుగుతుంది. వీరిలో ఉన్నతాధికారులకు, సిబ్బందికి మధ్య వారధిగా ఎవరుంటారనే అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఆయా సంఘాల నాయకులు చిన్నచిన్న పొరపాట్లు చేశారని, అలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా బాధ్యతగా పనిచేసేవారినే ఎన్నుకుంటామని పోలీసులు అంటున్నారు. సంఘం ఎన్నిక జరిగేదిలా.. పోలీస్ అధికారుల సంఘం ఎన్నికలో సీఐ నుంచి కానిస్టేబుల్ వరకు పాల్గొంటారు. జిల్లా పరిధిలోని సీఐలు అందరూ కలసి ఓ మెంబర్‌ను, సబ్ డివిజన్ పరిధిలో ఉండే ఎస్ఐ, ఏఎస్ఐలు 50 మంది ఉంటే ఓ మెంబరును, అంతకంటే ఎక్కువ మంది ఉంటే ఇద్దరిని ఎన్నుకోవచ్చు. మహిళా హెడ్ కానిస్టేబుళ్లు ప్రతి 40 మంది ఒక్క మెంబరు, ఒక్కో స్టేషన్ పరిధిలో ఉండేహెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు(పురుషులు) ప్రతి 40 మంది ఒక్క మెంబరు చొప్పున ఎన్నుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఆర్మడ్ రిజర్వ్ విభాగం అధికారులు, సిబ్బంది కూడా పాల్గొంటారు. ఎన్నికైన మెంబర్లు సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లను కలుపుకొని మొత్తం 13 మంది సభ్యులను ఎన్ను కుంటారు. అనంతరం అధ్యక్షుడు, కార్యదర్శి కలిసి ఇద్దరు కో–ఆప్షన్ మెంబర్లును ఎన్నుకోవడంతో ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది. వీరంతా అనంతరం రాష్ట్ర స్థాయిలో జరిగే పోలీస్ అధికారుల సంఘం ఎన్నికలో నేరుగా పోటీ చేయడం, ఓటు వేసేందుకు అర్హులు. కలుపుకుపోయేతత్వం ఉండాలి.. ఎన్నికలో ఎంతమందైనా పోటీపడవచ్చు. అందరిని కలుపుకు పోతూ సమస్యలు పరిష్కరించగలిగే నాయకత్వం ఉండాలి. అలాంటప్పుడే ఉన్నతాధికారులు, తొటి సిబ్బంది గౌరవం దక్కుతుంది. సివిల్, ఏఆర్ రెండు కళ్లు లాంటివి. ఎవరినీ నొప్పించకుండా సమయస్ఫూర్తిగా నెగ్గుకురావాలి.–దళవాయి సుబ్రహ్మణ్యం,రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి -
ప్రధాని మోదీ ప్రచారం చేసినా...
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెల్సిందే. అయితే ఆయన ఎన్నికల ప్రచారం చేసిన ప్రాంతాల పరిధిలో 70 శాతం నియోజక వర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయిందని ‘ఇండియాస్పెండ్’ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. 80 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 30 చోట్ల మోదీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. వాటిల్లో 23 సీట్లను బీజేపీ గెలుచుకోగా, 57 సీట్లలో ఓడిపోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 54 నియోజకవర్గాల పరిధిలో 22 ఎన్నికల ర్యాలీలు (అంటే 70 శాతానికిపైగా) ప్రధాని మోదీ ర్యాలీలు నిర్వహించగా, 22 సీట్లను (41 శాతం) గెలుచుకోగలిగింది. ఇక చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లోని 26 నియోజక వర్గాల పరిధిలో మోదీ ఎనిమిది ర్యాలీలు నిర్వహించగా, ఒకే ఒక్క సీటును బీజేపీ గెలుచుకుంది. మిజోరం మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి 58 ర్యాలీలు నిర్వహించగా, బీజేపీ 27 సీట్లను గెలుచుకుంది. 42 సీట్లను కోల్పోయిందని ఇండియాస్పెండ్ విశ్లేషించింది. ఈ విషయంలో మోదీ కన్నా యోగి పర్యటించిన ప్రాంతాల్లోనే బీజేపీ కాస్త ఎక్కువ విజయం సాధించింది. మోదీ పర్యటించిన ప్రాంతాల్లో బీజేపీ 28.75 స్థానాల్లో, యోగి పర్యటించిన ప్రాంతాల్లో బీజేపీ 39.3 శాతం విజయం సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో యోగి 27 బహిరంగ సభలు నిర్వహించగా, 37 స్థానాలకుగాను 21 స్థానాల్లో బీజేపి విజయం సాధించింది. ఇక చత్తీస్‌గఢ్‌లో యోగి 23 ర్యాలీలు నిర్వహించగా, బీజేపీ కేవలం ఐదు సీట్లను గెలుచుకుంది. -
తండ్రిని వెనకేసుకొచ్చిన ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘పెద్ద బఫూన్’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) చేసిన వ్యాఖ్యలను ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమర్థించారు. ఢిల్లీలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... వెర్రి పనులు చేసే వారిని బఫూన్‌గా వర్ణిస్తామని, పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన తింగరి చేష్టలను దేశమంతా చూసిందన్నారు. ‘సభా సంప్రదాయాలను ఉల్లఘించి లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అమాంతంగా వాటేసుకోవడం జాతి యావత్తు వీక్షించింది. రాహుల్ చర్యను ప్రతి ఒక్కరు వెర్రి పనిగా భావించారు. అందుకే మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా స్పందిచార’ని కవిత వివరించారు. ప్రాంతీయ పార్టీలదే హవా తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలపై స్పందిస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్ దారుణంగా వైఫల్యం చెందిందని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం రాలేదని, బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని తెలిపారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను టీ20 మ్యాచ్‌లా ప్రజలు ఉత్కంఠతో వీక్షించారని చెప్పుకొచ్చారు. రాజస్తాన్‌లో పాత సంప్రదాయం కొనసాగడం వల్లే కాంగ్రెస్‌కు అధికారం దక్కిందని విశ్లేషించారు. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల హవా ఉంటుందని అభిలషించారు. ‘ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండివుంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని గట్టిగా చెప్పగలను. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయి. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలు మెరుగ్గా ఉన్నాయ’ని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ తథ్యం కాంగ్రెస్, బీజేపీ లేకుండా ఫెడరల్ ఫ్రంట్ సాకారమవుతుందని, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల అవసరాలను గుర్తించేలా ఫెడరల్ ఫ్రంట్ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని డీఎంకే నేత స్టాలిన్ భావి ప్రధానిగా వర్ణించడంపై స్పందిస్తూ.. కాంగ్రెస్ అనుకూల కూటమిలో లుకలుకలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాహుల్‌ను ఒక పార్టీ సమర్థిస్తే, అదే కూటమిలోని రెండు ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకించాయన్నారు. ‘మేము ఏర్పాటు చేయాలనుకుంటున్న మూడో ప్రత్యామ్నాయం ఒకరిని ప్రధాని చేయడానికో, ఒక పార్టీని అధికారంలోకి తేవడానికో కాదు. కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కొనుగొనాలన్న ఉద్దేశంతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. తెలంగాణలో మా పార్టీ ఇప్పటికే చేసి చూపించింది. తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలుల్లోకి తేవాలనుకుంటున్నామ’ని ఎంపీ కవిత వెల్లడించారు. -
ఎన్నికల్లో తగ్గుతున్న మహిళా విజేతలు
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 678 సీట్లకుగాను కేవలం 62 సీట్లలో మాత్రమే మహిళలు విజయం సాధించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో 9.30 కోట్ల మంది మహిళలు ఉండగా, వారిలో కేవలం 9 శాతం మంది మాత్రమే మహిళలు చట్టసభలకు ఎన్నికయ్యారు. 2013–2014 సంవత్సరంలో ఈ రాష్ట్రాల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 77 ఉండగా, అంటే 11 శాతం ఉండేదని భారత ఎన్నికల కమిషన్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఈసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో క్రితంసారి కన్నా ఎక్కువ మందే పోటీ చేసినప్పటికీ తక్కువ మంది గెలవడం గమనార్హం. ఒక్క చత్తీస్‌గఢ్‌లో మాత్రమే గతం కన్నా ఈసారి ఎక్కువ మంది విజయం సాధించారు. మిజోరంలో పది లక్షలకుపైగా కలిగిన జనాభాలో 49 శాతం మంది మహిళలు ఉన్నప్పటికీ అసెంబ్లీలో వారి ప్రాతినిధ్యం శూన్యం. ప్రజాస్వామ్యంలో మహిళల ప్రాతినిధ్యం అంటే ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు వేయడం కాదని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఓ ఎంపీగా గెలవడమని అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రితికా కుమార్ వ్యాఖ్యానించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు చురుగ్గా పాల్గొని ఎన్నికవడమే కాకుండా మళ్లీ పోటీచేసి కూడా విజయం సాధిస్తున్నారని ఆన్నారు. వరుసగా గత మూడు ఎన్నికల నుంచి ఈ ఐదు రాష్ట్రాల్లో మహిళలు ఎక్కువ మందే పోటీ చేస్తున్నప్పటికీ వారు ఎక్కువగా గెలవలేక పోతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 2,716 మంది అభ్యర్థులకుగాను 235 మంది మహిళలు పోటీ చేశారు. 2013 ఎన్నికల్లో 108 మంది, 2008 ఎన్నికల్లో 226 మంది మహిళలు పోటీ చేశారు. ఫలితాల్లో మాత్రం వెనకబడుతున్నారు. 2008లో 25 మంది, 2013లో 30 మంది విజయం సాధించగా, ఈసారి 22 మంది మహిళలు మాత్రమే విజయం సాధించారు. ఇక రాజస్థాన్‌లో 2008లో 154 మంది, 2013లో 152 మంది పోటీ చేయగా ఈసారి ఏకంగా 182 మంది పోటీ చేశారు. 2013 ఎన్నికల్లో 25 మంది విజయం సాధించగా, ఈసారి 22 మంది మాత్రమే విజయం సాధించారు. పోటీ చేస్తున్న వారి సంఖ్యలో గెలుస్తున్న వారి సంఖ్యను తీసుకుంటే మగవారికన్నా మహిళలే ఎక్కువ విజయం సాధిస్తున్నారు. రాజస్థాన్‌లో మొత్తం పోటీ చేసిన వారి సంఖ్యలో మహిళల శాతం ఎనిమిది ఉండగా, విజయం సాధించిన వారిలో వారి శాతం 11.5 శాతం ఉండడమే అందుకు ఉదాహరణ. నేషనల్ ఎలక్షన్ వాచ్ అధ్యయనం ప్రకారం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఈసారి 12 శాతం సీట్లను మహిళలకు ఇచ్చారు. అన్ని పార్టీలకన్నా అతి తక్కువగా తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ 3 శాతం సీట్లనే మహిళలకు ఇచ్చింది. ఇక ఓ మహిళ అధ్యక్షులుగా ఉన్న బహుజన సమాజ్ పార్టీ 9 శాతం టిక్కెట్లను మహిళలకు ఇచ్చింది. వివిధ పార్టీల తరఫున పోటీ చేసిన మహిళల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ మంది విజయం సాధించారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు చర్చకు వస్తున్న సందర్భంగా ఇలాంటి వివరాలు అవసరమని రితికా కుమార్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల బిల్లును ఈ సమావేశాల్లోనే ఆమోదించేందుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
బీసీ కోటా 24 శాతం లోపే!
సాక్షి. హైదరాబాద్: త్వరలో జరగనున్న పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 23–24 శాతానికి మధ్య పరిమితం కానున్నా యి. ఎట్టి పరిస్థితిలో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఎన్నికల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. సుప్రీం కోర్టు తీర్పు మేరకు 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్ర న్యాయ శాఖ శనివారం రాత్రి అత్యవసర ఉత్తర్వులు (ఆర్డినెన్స్) జారీ చేసిం ది. కొత్తగా అమల్లోకి వచ్చిన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని, బీసీలకు 34 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం పొందుపరిచింది. ఎన్నికల్లో 2011 జనా భా లెక్కల ఆధారంగా పంచాయతీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉండగా, ఎస్సీలకు 20.46 శాతం, ఎస్టీలకు 5.73 శాతం రిజర్వేషన్లను కేటాయించాల్సి ఉంది. దీనికి తోడు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం బీసీలకు 34 శాతం కోటా అమలు చేస్తే మొత్తం రిజర్వేషన్లు 60.19 శాతానికి పెరిగిపోనున్నాయి. పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు చేసేందుకు సుప్రీం కోర్టు తీర్పు అడ్డంకిగా మారింది. జనవరి 10లోగా పంచాయతీ ఎన్నికలను నిర్వహిం చాలని హైకోర్టు విధించిన గడువు ముంచుకొస్తోంది. దీంతో ప్రభుత్వం ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయడం ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు జరిపింది. సర్పంచ్ పదవుల కోసం జనాభా దామాషా ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఎస్టీ, ఎస్సీలకు వరుసగా 5.73 శాతం, 20.46 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో బీసీలకు 23.81 శాతం కోటా మాత్రమే లభించే అవకాశముంది. గత జూన్ 12న పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 12,751 సర్పంచ్ స్థానాలుం డగా, షెడ్యూల్ ప్రాంతంలోని 1,308 పంచాయతీల తో పాటు 100 శాతం ఎస్టీల జనాభా కలిగిన 1,326 పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు అవనున్నాయి. దీనికి తోడు 5.73 శాతం ఎస్టీ కోటా కింద రానున్న 580 స్థానాలకు కలిపి ఎస్టీలకు మొత్తం 3,214 సర్పంచ్ పదవులు రిజర్వు అవుతాయి. ఎస్సీలకు 20.46 శాతం కోటా కింద 2,070 స్థానాలు రిజర్వు కానున్నాయి. 34 శాతం కోటా కింద అప్పట్లో బీసీలకు 3,440 స్థానాలకు కేటాయించారు. తాజాగా ఆర్డినెన్స్ మేరకు బీసీ కోటాను 24 శాతానికి లోపు తగ్గించనుండటంతో ప్రాథమిక అంచనాల ప్రకారం బీసీలకు కేటాయించే సర్పంచ్ స్థానాల సంఖ్య 2,784 కు తగ్గే అవకాశముంది. రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే ఈ అంశంపై స్పష్టత రానుంది. చివరిసారిగా 2013–14లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమ లు చేయగా, ఒక్కసారి 10 శాతానికి పైగా రిజర్వేషన్లు తగ్గిపోనుండటంతో బీసీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసినట్లు శనివారం వార్తలు వచ్చాయి. అయితే సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కోటా 24 శాతం లోపే పరిమితం కానుంది. -
బీజేపీ పాలనలో 51 శాతం జనాభా!
మూడు హిందీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో ఇప్పుడు (2018 డిసెంబర్) దేశంలో కాషాయపక్షం పాలనలోని జనాభా సంఖ్య 63 కోట్ల 40 లక్షలకు (51 శాతం) పడిపోయింది. 2017లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దేశ జనసంఖ్యలో 71 శాతం (దాదా పు 88 కోట్ల 80 లక్షలు) ఉన్నట్టు అంచనా. తాజా ఎన్నికల ఫలితాలతో బీజేపీ పాలనలోని జనాభా సంఖ్య 25 కోట్ల 40 లక్షలు తగ్గిపోయింది. ప్రస్తుతం బీజేపీ ప్రత్యక్ష పాలనలో లేదా భాగస్వామిగా ఉన్న సంకీర్ణాల పాలనలో 16 రాష్ట్రాలున్నాయి. 2014 మే 24న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఏడు రాష్ట్రాలు ఈ పార్టీ పాలనలో ఉనాయి. ఇప్పుడు వీటి సంఖ్య 16 రాష్ట్రాలకు (సంకీర్ణాలతో కలిపి) పెరిగింది. ఈ రాష్ట్రాలు: అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బిహార్, గోవా, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయా, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్. తాజా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకానొక దశలో బీజేపీ రాష్ట్రాల సంఖ్య 21 వరకూ ఉండేవి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ లేదా సంకీర్ణ భాగస్వామిగా ఉన్న రాష్ట్రాల సంఖ్య ఐదుకు (కర్ణాటక, పంజాబ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్) పెరిగింది. 2017లో కాంగ్రెస్ పాలనలోని రెండు రాష్ట్రాల్లో 7% జనాభా ఉండగా, ఇప్పుడు రాష్ట్రాల సంఖ్యతోపాటు పాలనలోని జనాభా 21 శాతానికి పెరిగింది. మిజోరంలో కాంగ్రెస్ అధికారం కోల్పో యిన విషయం తెలిసిందే. ఇతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కేరళ, మిజోరం, తమిళనాడు, పశ్చిమబెంగాల్. జమ్మూకశ్మీర్ ప్రస్తుతం గవర్నర్ పాలనలో ఉంది. ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 678 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ 305 సీట్లు, బీజేపీ 199 సీట్లు గెలుచుకున్నాయి. దేశ జనాభాలో ఆరో వంతు లేదా 15% ఈ రాష్ట్రాల్లో ఉంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆ మూడు రాష్ట్రాలు.. మళ్లీ బాంబ్ పేల్చిన చంద్రబాబు!
-
ఆ మూడు రాష్ట్రాలు.. మళ్లీ బాంబ్ పేల్చిన చంద్రబాబు!
సాక్షి, విశాఖపట్నం: తన ప్రచారంతో, అడ్డగోలు వ్యాఖ్యలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నిండా ముంచేసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. తాజాగా విచిత్ర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలువడానికి టీడీపీనే కారణమంటూ ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ కృషి వల్లనే ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి ఆ మూడు రాష్ట్రాల్లో చంద్రబాబు కనీసం ప్రచారం కూడా చేయలేదు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని.. ఆయన విస్తృతంగా ప్రచారం చేసిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మహాకూటమి పేరిట కాంగ్రెస్ పార్టీతో జతకలిసిన చంద్రబాబు.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనూ ఇదేవిధంగా ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఆధునిక తెలంగాణ నిర్మాతను తానేనని, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్‌రోడ్డు తానే కట్టానని ఆయన ఎన్నో గొప్పలు పోయారు. అసలే తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన చంద్రబాబు.. ఇలా ఇష్టారీతిగా మాట్లాడటంతో తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడమే కాదు.. పొత్తుతో వచ్చిన చంద్రబాబును రెండు సీట్లకు మాత్రమే పరిమితం చేసి.. గుణపాఠం నేర్పారు. అయినా, చంద్రబాబు తీరు మారనట్టు కనిపిస్తోంది. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయాలను ఆయన తన ఖాతాలో వేసుకోవడంతో హస్తం శ్రేణులు సైతం విస్తుపోతున్నాయి. -
ఏం చేద్దాం: ఓటమిపై బీజేపీ అంతర్మథనం
సాక్షి, న్యూఢిల్లీ: తాజాగా ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో.. ఆ పార్టీ అధినాయకత్వంలో అంతర్మథనం మొదలైంది. తాజా పరాభవాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్రాల పధాధికారుల సమావేశం ఢిల్లీలో గురువారం ప్రారంభమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, లక్ష్మణ్‌తోపాటు మురళీధర్‌రావు, ఇతర రాష్ట్రాల సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తాజాగా నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణాలు విశ్లేషించడం, పార్టీ నాయకత్వంలో, శ్రేణుల్లో మళ్లీ నైతిక ఉత్తేజాన్ని నింపి రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం సిద్ధం చేయడం లక్ష్యంగా అమిత్ షా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి: స్పందించిన యోగి!
పట్నా: తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. అత్యంత కీలకమైన హిందీ మాట్లాడే రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీని ఓడించి.. కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ విజయాలపై తాజాగా బీజేపీ స్టార్ క్యాంపెయినర్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో గెలించిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అబద్ధాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని, దీంతో బీజేపీ భవిష్యత్తు ఎన్నికల్లో లాభపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ సహా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో యోగి విస్తృతంగా పర్యటించి.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయినా, ఆయన ప్రచారం పార్టీకి పెద్దగా లాభించలేదు. ఈ నేపథ్యంలో బుధవారం నేపాల్‌కు వెళ్లి.. జానకీ ఆలయంలో ‘వివాహ పంచమి’ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. తిరుగుప్రమాణంలో పట్నాలో ఆగారు. ఈ సందర్భంగా బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్ సమరంగా భావిస్తున్న 4 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆయన తేలిక చేసి మాట్లాడారు. -
కొంపముంచిన ‘హిందూత్వ ఎజెండా’
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణంగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఘంటారావంగా భావిస్తారు. ఈ మూడు రాష్ట్రాలను కలుపుకొని మొత్తం 65 లోక్‌సభ సీట్లు ఉండగా, గత లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏకంగా 62 సీట్లను సాధించింది. ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు. అయినప్పటికీ రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఘంటారావంగాగానీ, రాజకీయ పండితులు వర్ణించినట్లు సెమీ ఫైనల్స్‌గాగానీ పరిగణించలేం. కాకపోతే ఓ హెచ్చరికగా చూడవచ్చు. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటుచేసేంతగా మెజారిటీలు వచ్చి ఉన్నట్లయితే సెమీ ఫైనల్‌గా చూసే అవకాశం ఉండేది. కానీ ఒక్క చత్తీస్‌గఢ్‌లో తప్పించి, మిగతా రెండు రాష్ట్రాల్లో మిత్రపక్షాల సహాయంతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తోంది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వరుసగా మూడు పర్యాయాలు బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. కనుక ప్రభుత్వం వ్యతిరేకత ఉండడం సహజం. అయినప్పటికీ మధ్యప్రదేశ్‌లో అది ప్రతిఫలించలేదంటే ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్‌కున్న మంచిపేరు కావచ్చు. ఇక తెలంగాణలో గత ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుపొంది.. ప్రస్తుతం వందకుపైగా సీట్లకు పోటీ చేసిన బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. మిజోరంలో రెండు సీట్లను ఆశించి రంగంలోకి దిగి ఒక్క సీటును మాత్రమే దక్కించుకోగలిగింది. ప్రధానంగా ఎన్నికలు జరిగిన ఈ మూడు రాష్ట్రాలు హిందీ బెల్టులో ఉండడం, ప్రచారం చేసుకునే స్థాయిలో చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలు కూడా పెద్దగా లేకపోవడంతో అక్కడ ప్రభుత్వాలను నిలబెట్టుకునేందుకు.. తెలంగాణలో విస్తరించేందుకు బీజేపీ హిందూత్వ ఎజెండాను ఎత్తుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత అంతటి ప్రచారకుడిగా భావించి.. బీజేపీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా రంగంలోకి దింపింది. మిజోరం మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో విస్తతంగా పర్యటించిన ఆయన ‘రామ్, రామ్ మందిర్, రామ్ రాజ్యం’ గురించే ఎక్కువ మాట్లాడారు. తెలంగాణ దండకారణ్యంలో రాముడు పర్యటించారని చెప్పినా ఆయన మిగతా మూడు రాష్ట్రాలకు కూడా రాముడితో ఏదో ఒక లింకు పెట్టారు. తెలంగాణలో బీజేపీకి అధికారమిస్తే రాజధాని హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తానని చెప్పారు. రాష్ట్ర వనరులన్నీ ముస్లింలకే దోచిపెడుతున్నారంటూ ప్రజల మధ్య విధ్వేషాలను సృష్టించేందుకు ప్రయత్నించారు. ‘రాముడు గీముడు జాన్తా నహీ’ అంటూ తెలంగాణ సెంటిమెంట్ ముందు ఆయన ప్రచారం నిలబడలేకపోయింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ‘అభివృద్ధి’ నినాదం ద్వారానే విజయం సాధించిన విషయాన్ని పార్టీ పక్కన పెట్టి కేవలం హిందూత్వ ఎజెండానే ఎత్తుకోవడం వల్ల బాగా నష్టం జరిగిందని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సంజయ్ కాక్డే అభిప్రాయపడడం గమనార్హం. 2020 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పిన మోదీ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేసినా పట్టించుకోకపోవడం, ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తానంటూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని గాలికొదిలేసిన నేపథ్యంలో అభివృద్ధి ఎజెండాను ప్రచార అస్త్రంగా బీజేపీ చేసుకోలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికైనా హిందూత్వ ఎజెండాను పక్కనపెట్టకపోతే మంగళవారం నాటి ఫలితాలు పునరావృతం కాక తప్పవని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. -
మధ్యప్రదేశ్‌లో హంగ్?
భోపాల్: మంగళవారం ఉదయం నుంచి ఎంతో ఉత్కంఠ రేపిన మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చివరకు ఏ పార్టీకీ విజయాన్ని అందించకుండా నిరాశపరిచాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య విజయం దోబూచులాడింది. పూర్తి ఫలితాలు ఇంకా వెల్లడి కానప్పటికీ మధ్యప్రదేశ్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. 230 సీట్లున్న శాసనభలో సాధారణ ఆధిక్యానికి 116 సీట్లు అవసరం కాగా, బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఏ పార్టీ ఆ మార్కును చేరుకోలేక పోతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో అతి తక్కవ సీట్లే ఉన్నా పలు చిన్నా చితకా పార్టీలు, స్వతంత్రులకు అత్యంత ప్రాధాన్యమేర్పడింది. వీరి మద్దతు ఎవరికి లభిస్తే ఆ పార్టీ అధికారం చేపట్టనుంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్ నేతలు మధ్యప్రదేశ్ గవర్నర్‌ను ఆనందీబెన్ పటేల్‌ను మంగళవారం రాత్రి పొద్దుపోయాక కోరారు. మంగళవారం అర్ధరాత్రి 12.15 గంటల సమాయానికి 172 స్థానాల ఫలితాలు వెలువడగా బీజేపీ 83, కాంగ్రెస్ 85, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఒక సీటు గెలిచింది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. మరో 58 స్థానాల్లో లెక్కింపు కొనసాగుతుండగా 26 సీట్లలో బీజేపీ, 28 స్థానాల్లో కాంగ్రెస్, రెండు చోట్ల బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), మరోచోట ఎస్పీ అభ్యర్థి, ఇంకో చోట స్వతంత్ర అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొత్తంగా గెలిచిన, ముందంజలో ఉన్న స్థానాలతో కలిపి బీజేపీకి 109, కాంగ్రెస్‌కు 113 సీట్లు ఉన్నాయి. ప్రయత్నాలు ప్రారంభించిన కాంగ్రెస్ సాధారణ ఆధిక్యం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయం కావడంతో ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బీఎస్పీ, ఎస్పీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులతోనూ కాంగ్రెస్ నేతలు చర్చలు ప్రారంభించారు. ఎంపీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్, కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాలు గెలిచిన అభ్యర్థులతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే గతంలో కాంగ్రెస్‌తో పొత్తు అంశాన్ని మాయావతి కొట్టిపారేశారు. తాజాగా బీఎస్పీ నేత ఒకరు మాట్లాడుతూ ‘మాతో పొత్తు లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. ఏ పార్టీకి మద్దతివ్వాలో మాయావతి నిర్ణయిస్తారు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రాథమిక ఫలితాలను బట్టి రాష్ట్రంలో ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలలో దేనికీ మెజారిటీ రాదని తేలడంతో ‘ఇతరుల’కు ప్రాధాన్యం పెరిగింది. బీఎస్పీ, ఎస్పీ, స్వతంత్రులకు కలిపి మొత్తంగా 7 స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. హంగ్ వస్తే ప్రధాన పార్టీలు వీరి మద్దతుపై ఆధారపడక తప్పదు. సీఎల్పీ భేటీ బుధవారం జరగనుండగా, కాంగ్రెస్ కేంద్ర పరిశీలకుడిగా ఏకే ఆంటోనీ మంగళవారమే భోపాల్ చేరుకున్నారు. గవర్నర్‌కు లేఖ రాసిన కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లో అతిపెద్ద పార్టీగా నిలవడం దాదాపు ఖాయం కావడంతో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను ఆ పార్టీ నేతలు ఇప్పటికే కోరారు. ఈ మేరకు ఎంపీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. వ్యతిరేకత ఉన్నా గట్టి పోటీ మధ్యప్రదేశ్‌లో బీజేపీకి చెప్పుకోదగ్గ ఫలితాలు భోపాల్: మధ్యప్రదేశ్‌లో పదమూడేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత బలంగానే ఉన్నా కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇస్తోంది. మేజిక్ ఫిగర్ 116కు కేవలం కొన్ని సీట్ల దూరంలోనే బీజేపీ ఆగిపోయేలా కనిపిస్తోంది. మరోవైపు 13 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ సారి కూడా సాధారణ ఆధిక్యం కూడా సాధించలేక పోతోందంటే అది ఆ పార్టీ వైఫల్యంగానే చెప్పుకోవాలి. మౌలిక సదుపాయాలైన కరెంటు, నీరు, రహదారుల విషయంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలూ లేకపోవడం బీజేపీకి లాభించింది. సంస్థాగతంగా చౌహాన్‌కు మంచి పట్టు ఉండటంతో ఎన్నికల్లో బీజేపీ, ఆరెస్సెస్‌లు కలిసి పని చేసి క్షేత్రస్థాయి వరకు వెళ్లగలిగాయి. భూమి పుత్రుడిగా(కిసాన్ కీ బేటా)పే రొందిన చౌహాన్ తన హయాంలో ఇంటా బయటా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. మురికివాడల్లోని ప్రజలు, ఆర్థికంగా బలహీన వర్గాల వారికోసం చౌహాన్ ఆవాస్ యోజన వంటి పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు పరచడంతో ఆ వర్గాల మద్దతు గణనీయంగా పొందగలిగారు. ఒకప్పుడు రోగిష్టి రాష్ట్రాలుగా ముద్రపడ్డ బీమారు (బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్) నుంచి మధ్యప్రదేశ్‌ను బయటకు తీసుకొచ్చి చౌహాన్ అభివృద్ధివైపు నడిపించారనే భావన అక్కడి ప్రజల్లో ఉంది. -
ఐదు రాష్ట్రాల ఫలితాలు: బీజేపీకి బిగ్ షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : 2014 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి భారతీయ జనతా పార్టీకి తగిలిన అతిపెద్ద షాక్ నేటి ఫలితాలు. ముఖ్యంగా హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌లో నువ్వా, నేనా అన్నట్లు బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వడం, రాజస్థాన్‌లో వసుంధర రాజె నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం, రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి చత్తీస్‌గఢ్‌లో పాగా వేసిన బీజేపీని కాంగ్రెస్ పార్టీ గద్దె దించడం అసాధారణమే. తెలంగాణలో ఐదు స్థానాలు కలిగిన బీజేపీ, అత్యధిక స్థానాలకు పోటీ చేసి కనీసం 20 సీట్లనైనా గెలుచుకుందామని ఆశించి బొక్కా బోర్లా పడింది. ఇక మిజోరంలో కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్ మధ్యనే అధికార మార్పిడి జరగడం సర్వ సాధారణమే. ప్రీపోల్ సర్వేలు, పోస్ట్ పోల్ సర్వేలన్నీ కూడా కొంత గతి తప్పాయి. జాతీయ సర్వేలన్నీ రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని సూచించాయి. వాటి అంచనాలను తలకిందులు చేస్తూ చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం విశేషం. తెలంగాణలో పాలకపక్షం టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఎక్కువ సర్వేలు చెప్పినా అఖండ విజయం సాధింస్తుందని ‘ఇండియా టుడే’ సర్వేనే అంచనా వేయగలిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోకపోవడం కాంగ్రెస్ అధిష్టానంకు కొంత నిరుత్సాహం కలిగించే అంశమే. రాజస్థాన్‌లో కాంగ్రెస్ విజయం రాజస్థాన్‌లో మొత్తం 200 సీట్లకుగాను 199 సీట్లకు ఎన్నికలు జరిగాయి. 2013 ఎన్నికల్లో బీజేపీకి 163 సీట్లు రాగా, కాంగ్రెస్‌కు కేవలం 21 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు కావాల్సినదానికన్నా ఎక్కువ సీట్లు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. 1993 నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. ఓసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తోంది. ఈసారి వసుంధర ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తోంది. వసుంధర రాజె స్వతహాగా అహంభావి కావడం, ప్రజలతో మమేకమయ్యే మనస్తత్వం లేకపోవడం ఓటర్లకు ఆమెను దూరం చేస్తూ వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి గజేంద్ర షెకావత్‌ను తొలగించడం, 2017లో వ్యతిరేకించినప్పటికీ వివాదాస్పద ‘పద్మావత్’ సినిమాను విడుదల చేయడం రాజ్‌పుత్‌లకు ప్రభుత్వం మీద కోపం తెప్పించింది. ఏప్రిల్–మే నెలల్లో వ్యవసాయ సంక్షోభం కారణంగా ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం, నిరుద్యోగ సమస్య ఓటమికి కారణమయ్యాయి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య 55 శాతం ఉండగా, 2013 నుంచి వసుంధర రాజె ప్రభుత్వం ఏటా 15 లక్షలకు మించి ఉద్యోగాలను కల్పించలేక పోయింది. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు కూడా పుట్టి ముంచాయి. మెవ«ద్ ప్రాంతంలో 28 అసెంబ్లీ సీట్లు ఉండగా, అక్కడి ప్రజలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం 1998 సంవత్సరం నుంచి అలవాటు. వారు గతంలో బీజేపీకి ఓటు వేయగా, ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్సే మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 సీట్లు ఉండగా, 2013 ఎన్నికల్లో బీజేపీకి 44.88 శాతం ఓట్లతో 165 సీట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 36.38 శాతంతో 58 సీట్లు వచ్చాయి. స్వయంగా వంద సీట్లను దాటిన కాంగ్రెస్ పార్టీ మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ మద్దతుతో సుస్తిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉంది. 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవిలో శివరాజ్ సింగ్ చౌహాన్ కొనసాగినప్పటికీ ఆయన పట్ల ప్రజా వ్యతిరేకత లేదు. తమ పంటలకు తగిన గిట్టుబాటు ధరలు కల్పించడం లేదని, రుణాలు మాఫీ చేయడం లేదని ప్రభుత్వం పట్ల రైతుల్లో వ్యతిరేకత ఉంది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా 2017లో మంద్సార్లో రైతులు నర్విహించిన ర్యాలీపై పోలీసులు కాల్పులు జరపడంతో ఆరుగురు రైతులు మరణించారు. అప్పటి నుంచి ప్రభుత్వం పట్ల రైతుల ఆగ్రహం మరింత పెరిగింది. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. బీజేపీ ప్రభుత్వం గత 14 ఏళ్లలో ఏటా 17,600 ఉద్యోగాలను మాత్రమే కల్పించకలిగింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ పరిమితి వయస్సు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచడం కూడా నిరుద్యోగులకు కోపం తెప్పించింది. జ్యోతిరాధిత్య సింధియా, కమల్ నాథ్లో ఎవరు ప్రభుత్వ సారథులో నిర్ణయించక పోవడం కూడా కాంగ్రెసకు కలిసి వచ్చింది. చత్తీస్‌గఢ్‌లోనూ.. మొత్తం సీట్లు 90. బీజేపీ పాలనలో 15 సంవత్సరాల నుంచి రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నా ఆయన పట్ల ప్రజల్లో అంతగా వ్యతిరేకత లేదు. కాకపోతే నిరుద్యోగం, దారిద్య్రం, నక్సలిజం సమస్యలు ఈ ప్రాంతాన్ని పీడిస్తున్నాయి. ఎనిమిది జిల్లాల పరిధిలోని 18 అసెంబ్లీల పరిధిలో నక్సల్స్ సమస్య తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని 40 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువున నివసిస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం కూడా తీవ్రంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రుణాలు మాఫీ చేస్తామని, వరికి కనీస మద్దతు ధరను 2,500 రూపాయలు చేస్తామని, పేద కుటుంబానికి నెలకు 35 కిలోల బియ్యాన్ని ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు ప్రజలకు ఎంతో ఆకర్షించాయి. ఫలితంగా అక్కడి రైతులు తమ చేతికి వచ్చిన వరి పంటలను ఇంకా కోయలేదు. ఇక మిజోరం ఫలితాలు మామూలే. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తోంది. -
యోగి ‘రాముడి’కథ ఎవరికి నచ్చలేదు
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మిజోరం మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ విస్తృతంగా ప్రచారం సాగించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయన ఏకంగా 74 ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ప్రతి చోటు ఆయన రాముడిని ప్రస్థావించి ఓ చోటుకు రాముడికి ఉన్న సంబంధాన్ని అనుబంధాన్ని వివరించడంతోపాటు బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి రాష్ట్రంలో ప్రజలందరిని సమానంగా చూసే రామరాజ్యం తీసుకొస్తామని ఆయన చెప్పారు. టెర్రరిస్టులకు మాత్రం బిర్యానీ తినిపించమని, బుల్లెట్లు తినిపిస్తామని చెప్పారు. ఆదిత్యనాథ్ చత్తీస్‌గఢ్ వెళ్లినప్పుడు అది రాముడి తల్లిగారి ఊరని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పుడు రాముడు వనవాసం సమయంలో దండకారణ్యంలో తిరిగాడని చెప్పారు. మధ్యప్రదేశ్ వెళ్లినప్పుడు రాముడిని సవాల్ చేసిన పరుశరాముడి ప్రాంతమని తెలిపారు. రాజస్థాన్ వెళ్లినప్పుడు అది రాముడి కుడిభుజమైన బజరంగ్ బాలి ప్రాంతమని ఆలిని ఓడించడానికి ఆయన ఒక్కడు చాలని వ్యాఖ్యానించారు. ముస్లింల పక్షపాతంటూ కాంగ్రెస్‌ను ఆయన ఆలితో పోల్చారు. రాజస్థాన్‌లోని నాగౌర్‌లో యోగి మాట్లాడుతూ 2006లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి దేశ వనరులు మొట్టమొదట చెందాల్సిందీ ముస్లింలకని మన్మోహన్ చెప్పారని, మరప్పుడు హిందువులు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ విభజించు పాలించి రాజకీయాలకు పాల్పడుతున్నారని, అందుకే దేశంలో టెర్రరిస్టులు తయారవుతున్నారని, టెర్రరిస్టులకేమో బిర్యానీ తినిపిస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి 2006లో ప్రధాని మన్మోహన్ మాట్లాడుతూ దేశంలోని ఎస్సీ, ఎస్టీలను, మైనారిటీ మతస్థులను, ముఖ్యంగా ముస్లింలను వెనకబడిన వారిగా గుర్తించామని, వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అదిత్యయోగే కాకుండా సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 31 సభల్లో, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా 56 చోట్ల ప్రసంగించినా లాభం లేకపోయింది. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే బీజేపీ రాణించగలిగింది. మిగతా అన్ని రాష్ట్రాల్లో పరాజయాన్ని మూటకట్టుకుంది. -
జాతీయ కాంగ్రెస్‌కు నేడే సుదినం
సాక్షి, న్యూఢిల్లీ : 2014, మే 16వ తేదీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇదే సుదినం. ఆ రోజున వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం పార్లమెంట్లో 44 సీట్లకు పడిపోయింది. ఆ తర్వాత మొన్నటి వరకు జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతూనే వస్తోంది. ఒకటి, రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా ఆవిర్భవించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయింది. బీజేపీ మాత్రం సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి తన విజయపరంపరను కొనసాగిస్తూ ఏకంగా 15 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఓ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకన్నా తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఇతరులతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం, మధ్యప్రదేశ్‌లో బీజేపీతో దీటుగా ఎదుర్కోవడం సాధారణ విషయం కాదు. ఒక్క తెలంగాణాలోనే ఆశించిన ఫలితాలు అందలేదు. రానున్న రోజుల్లో బీజేపీకి గడ్డు రోజులు ఉంటాయని ఉత్తరప్రదేశ్‌లోని మూడు లోక్‌సభకు జరిగిన ఎన్నికల ఫలితాలే చెప్పాయి. నాడు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన డిప్యూటి చీఫ్ కేశవ్ ప్రాతినిథ్యం వహించిన రెండు స్థానాలతోపాటు మరో లోక్‌సభ సీటును బీజేపీ కోల్పోయింది. ఈ ఎన్నికల ఫలితాలు హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
ఈ ఫలితాలే ‘రోడ్ మ్యాప్’!
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల పోరుకు సెమీ ఫైనల్స్‌గా పరిగణిస్తున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ఈవీఎంలలో నిక్షిప్తమైంది పోటీలో నిలిచిన అభ్యర్థుల భవిష్యత్తే కాదు.. ప్రధాన రాజకీయ పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ల భవితవ్యం కూడా. 2019 లోక్‌సభ ఎన్నికలపై ఈ ఫలితాలు గణనీయ ప్రభావం చూపనున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ల్లో కమలం పార్టీ అధికారంలో ఉంది. ఈశాన్యంలో కాంగ్రెస్‌కు మిగిలిన ఏకైక రాష్ట్రం మిజోరం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే.. రాజస్తాన్‌లో ఈ సారి కాంగ్రెస్ అధికార పీఠాన్ని అధిరోహించనుంది. అలాగే, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్దే విజయమని, మిజోరం కాంగ్రెస్ చేజారనుందని అవి తేల్చాయి. రెండు పక్షాలకు గెలుపు అవసరమే! రాజస్తాన్‌తో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా కాంగ్రెస్ చేజిక్కించుకోగలిగితే.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు గట్టి బలం చేకూరుతుంది. కాంగ్రెస్ చీఫ్‌గా, జాతీయ స్థాయి నేతగా రాహుల్ గాంధీ స్థానం బలోపేతమవుతుంది. బీజేపీయేతర పక్షాల కూటమికి కాంగ్రెస్ పక్షాన రాహుల్ నేతృత్వం వహించగల అవకాశాలు మెరుగవుతాయి. లేని పక్షంలో, ఎన్నికల పొత్తులు, సీట్ల పంపకాల చర్చల్లో ఎన్డీఏయేతర ప్రాంతీయ పార్టీల నుంచి వచ్చే అనేకానేక డిమాండ్లకు తలొగ్గాల్సి వస్తుంది. కనీసం రెండు రాష్ట్రాల్లోనైనా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. బీజేపీ వ్యతిరేక విపక్ష కూటమికి నేతగా రాహుల్ ఆమోదనీయత పెరుగుతుంది. ఇతర పక్షాలు కాంగ్రెస్ మాట వినక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా, కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాకుంటే, రాహుల్ ఇమేజ్‌తో పాటు కాంగ్రెస్ ప్రతిష్ట భారీగా దెబ్బతింటాయి. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ఏన్డీయేయేతర ప్రాంతీయ పార్టీల నేతలు ‘ప్రత్యామ్నాయాలు’గా ఎదుగుతారు. మిజోరంలో అధికారం కోల్పోతే మొత్తంగా ఈశాన్యం నుంచి కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యమే ఉండదు. మరోవైపు, కనీసం రెండు రాష్ట్రాల్లోనైనా విజయం సాధించడం బీజేపీకి అవసరం. ఇన్నాళ్లూ కొనసాగిన విజయపరంపరను ఈ ఎన్నికల్లోనూ కొనసాగించడం ద్వారానే ఆ పార్టీ ఆత్మవిశ్వాసంతో లోక్‌సభ ఎన్నికల బరిలో దిగగలదు. ఎన్డీయే పక్షాలతో పొత్తు చర్చల్లోనూ ఆధిక్యత కనపర్చగలదు. ఓటమి ఎదురైతే మాత్రం పార్టీలో, పార్టీ అగ్రనేతల్లో ఆత్మవిశ్వాసం భారీగా దెబ్బతింటుంది. పార్టీ లో అసహన స్వరాల జోరు పెరుగుతుంది. కూటముల్లోనూ మార్పులు ఈ ఫలితాల అనంతరం జాతీయ స్థాయిలో ప్రధాన కూటములైన ఎన్డీయే, యూపీఏల్లోని పార్టీల్లో కూడా మార్పుచేర్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఎంతగా విమర్శించినా, బీజేపీ మిత్రపక్షంగానే శివసేన కొనసాగుతుంది. కానీ, బిహార్‌కు చెందిన రాష్ట్రీయ లోక్‌సమత పార్టీల్లాంటివి మాత్రం ఇప్పటికే ఎన్డీయేకు దూరమయ్యే దిశగా సంకేతాలిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే మిత్రపక్షాలపై పట్టును పెంచుకోగలదు. పక్క చూపులు చూస్తున్న ఎన్డీయే పార్టీల ఆలోచనల్లో మార్పు రాగలదు. మొత్తానికి, ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలంతా ప్రచారం చేయడాన్ని బట్టే ఈ ఎన్నికలను ఆయా పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అర్థమవుతుంది. - నేషనల్ డెస్క్ -
ఓటేయని వారు 1,96,124 : వరంగల్ అర్బన్
సాక్షి, హన్మకొండ అర్బన్: పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఎవరికెన్ని ఓట్లు పోలై ఉంటాయని అభ్యర్థులు, వారి అనుచరులు లెక్కలు వేసుకుంటుండగా, జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ శాతం ఏ మేరకు పెరిగిందని లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తంగా చర్చంతా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసి వెళ్లిన వారి గురించే జరుగుతోంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కలిపి 1,96,124 మంది అంటే.. సుమారు 30 శాతం మంది ఓటర్లు పోలింగ్ కేంద్రం ముఖం చూడలేదు. తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఓటర్ లిస్ట్ మార్క్డ్ జాబితా ప్రకారం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 6,78,036 మంది ఓటర్లు ఉండగా వారిలో 4,81,912 మంది ఓటర్లు(71.40 శాతం) మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయినా పెరిగింది.. జిల్లాలో 2014 సాధారణ ఎన్నికల సమయంలో మొత్తం 6,78,090 మంది ఓటర్లు ఉండగా వారిలో 4,67,335 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలో 68.43 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం 2018 ఎన్నికల్లో మాత్రం 71.40 శాతం ఓట్లు పోల్ కావడంతో గతంకన్నా 2.97 శాతం పెరిగినట్లయ్యింది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఈ సారి పశ్చిమలో 1.46 శాతం పెరిగింది. వర్ధన్నపేట నియోజకవర్గంలో అత్యధికంగా 5.56 శాతం పోలింగ్ పెరిగింది. ఇక వరంగల్ తూర్పులో మాత్రం ఊహించని విధంగా పోలింగ్ గతంకన్నా 1.96 శాతం తగ్గింది. మరో విశేషం ఏమిటంటే జిల్లాలో 2014 ఓటర్ల జాబితాలో కన్నా ప్రస్తుతం ఓటర్ల జాబితాలో 54 మంది తక్కువగా ఉన్నారు. వరంగల్ పశ్చిమలో అత్యధికంగా 1,00,471 మంది ఓటు వేయలేదు. ఇక్కడ 41.71 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. వరంగల్ తూర్పులో 58,169 మంది పోలింగ్‌కు రాలేదు. ఇక్కడ 27.47 శాతం మంది ఓటర్లు ఓటుకు దూరంగా ఉన్నారు. వర్ధన్నపేటలో 37,484 మంది ఓటేయలేదు. ఇక్కడ 16.63 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోలేదు. మొత్తంగా ఓటర్ల జాబితాలో 2 శాతం వరకు మరణించిన వారివి, మరికొందరివి రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది. ఆ ఓట్లు మినహా మిగతావారు ఓటేయలేదని అధికారులు భావిస్తున్నారు. -
మోదీని తక్కువ అంచనా వేయొద్దు.. విజయం మాదే
సాక్షి, న్యూ ఢిల్లీ: తెలంగాణ సహా మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ముగియడంతో జాతీయ మీడియ సంస్థలు, పలు సర్వేసంస్థలు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. తాజా ఎగ్జిట్‌ఫోల్స్ ఫలితాల ప్రకారం ఐదు రాష్ట్రాల్లోనూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అయితే ఈ ఫలితాలను తలకిందులు చేస్తూ తమ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ ఆగ్రనేతలు అభిప్రాయపడుతున్నారు. మోదీని అందరూ తక్కువ అంచనా వేస్తున్నారని.. అయన నాయకత్వంలో బీజేపీకి గెలుపే తప్పా ఓటముండదని తేల్చిచెబుతున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఎగ్జిట్స్‌పోల్స్ ఫలితాలను తిప్పి కొట్టారు. ‘ప్రజానాడి తెలిసిన నేతను, ప్రజలతో ప్రయాణం చేశాను. వారిని కలిశాను. నేనే పెద్ద సర్వేయర్‌ను. ఎవ్వరూ ఊహించని విధంగా మధ్యప్రదేశ్‌లో అత్యధిక మెజార్టీతో బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతుంది’ అంటూ శివరాజ్ సింగ్ జోస్యం చెప్పారు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు కాంగ్రెస్‌కు స్వల్పసంతోషాన్ని కలిగించేవని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాల రోజు కాంగ్రెస్‌కు రిక్త హస్తం ఖాయమని జోస్యం చెప్పారు. ఇక ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలకు భిన్నంగా మోదీ-షా నాయకత్వంలోని బీజేపీ అఖండ విజయాన్ని సాధిస్తుందని మరో బీజేపీ నేత ఆశాభావం వ్యక్తం చేశారు. -
పోలింగ్ సామగ్రికి పటిష్ట భద్రత
పాల్వంచ : అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రిని పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ పటిష్ట భధ్రత చర్యలు చేపట్టారు. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జిల్లాలోని 995 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. కొన్ని చోట్ల ఓటర్లు సాయంత్రం కూడా బారులుదీరి ఉండటంతో ఓటింగ్ ఆలస్యం అయింది. అనంతరం మారుమూల ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఈవీఎంలు, వీవీప్యాట్లను కౌంటింగ్ కేంద్రానికి కట్టుదిట్టమైన భద్రత నడుమ తరలించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ... కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రజత్ కుమార్ శైనీ, ఎస్పీ సునీల్‌దత్, జాయింట్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భద్రాచలం సబ్ కలెక్టర్ భవేష్ మిశ్రా, డీఎస్పీలు కుమారస్వామి, మధుసూదన్‌రావు పర్యవేక్షణ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఈవీఎంలను ఆన్లైన్ చేయడంతో పాటు బ్యాలెట్ యూనిట్లను కేటగిరీల వారీగా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలను అమర్చారు. స్ట్రాంగ్ రూంలకు విద్యుత్ సరఫరా లేకుండా చేశారు. ఎలాంటి అగ్నిప్రమాదాలు, షార్ట్‌సర్క్యూట్ జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల లెక్కింపు తీరును బయట నుంచి ఆయా అభ్యర్థులు, అధికారులు పరిశీలించేలా బయట ప్రొజెక్టర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. -
హోం మంత్రి కటారియాకు ఈసారి కష్టాలే!
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని ప్రతిష్టాకరమైన ఉధంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన హోం మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు గులాబ్ చంద్ కటారియాకి మొదటి సారి ఓటమి భయం పట్టుకుంది. అదీ సొంత పార్టీ నాయకుడే కాకుండా ఇంతకాలం తన సహచరుడిగా ఉన్న దల్పత్ సురాణా నుంచే. పైగా ఆయన కూడా కటారియాలాగా జైనుడే కావడం గమనార్హం. 74 ఏళ్లు వచ్చినప్పటికీ యువతరానికి అవకాశం ఇవ్వకుండా ఆరోసారి కూడా కటారియా రంగంలోకి దిగడంతో, తాను తిరుగుబాటు అభ్యర్థిగా జనతాసేన టిక్కెట్‌పై నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని సురాణా తెలిపారు. మొదటినుంచి ఆరెస్సెస్ అండ కలిగిన కటారియాకు బీజేపీ అధిష్టానం టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చింది. ‘నా లక్ష్యం ఒక్కటే కటారియాను ఓడించడం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినా ఫర్వాలేదు’ అని సురాణా వ్యాఖ్యానించారు. కటారియా తన తల బిరుసుతనంతో పార్టీలో ఎవరినీ ఎదగకుండా చేశారని ఆయన విమర్శించారు. తాను బరిలోకి దిగకపోతే కటారియాకు ప్రత్యర్థిగా నిలబడే దమ్ము ఎవరికీ లేదని, అందుకనే మొన్నటివరకు ఆయన అనుచరిడిగా కొనసాగిన తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెప్పారు. నియోజకవర్గంలో దాదాపు 44 వేల మంది జైన ఓటర్లు ఉన్నారని, వారంతా ఇదివరకు కటారియాకే మద్దతిచ్చారని, ఇప్పుడు సురాణాకు ఇస్తున్నారని, ఆయనకు మద్దతిస్తున్న బ్రాహ్మణ నాయకుడు మంగేలాల్ జోషి తెలిపారు. ఆరెస్సెస్‌లోని యువత కూడా సురాణాకే మద్దతిస్తోంది. సురాణా ఎన్నికల్లో విజయం సాధించాక తిరిగి బీజేపీ పార్టీలోకి వస్తారని ఆ యువత భావిస్తోంది. కటారియాపై తిరుగుబాటు అభ్యర్థి సురాణా ఒక్కరే కాదు.. ప్రధాని నరేంద్ర మోదీ వీరాభిమాని, నమో విచార్ మంచ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ రటాలియా కూడా పోటీ చేస్తున్నారు. కటారియాను రాజ్‌పుత్‌లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘కటారియాను ఓడించే సత్తా ఎవరికి ఉంటే వారికే మేము ఓటు వేస్తాం’ అని ‘మేవర్ క్షత్రియా మహాసభ సంస్థాన్’ అధ్యక్షుడు తన్వీర్ సింగ్ కష్ణావత్ తెలిపారు. ఇదివరకు తామంతా బీజేపీకే మద్దతు ఇస్తూ వచ్చామని, మేవర్‌లో 28 సీట్లుంటే బీజేపీ ఇద్దరు రాజ్‌పుత్‌లకు మాత్రమే సీట్లు ఇచ్చిందని, ఈ కారణంగా ఈ సారి తాము బీజేపీని ఓడించేందుకే కంకణం కట్టుకున్నామని ఆయన తెలిపారు. కటారియా మాత్రం అంతిమంగా విజయం తనదేనని చెబుతున్నారు. ఫలితాలు వెలువడ్డాక మాట్లాడండి అని మీడియాతో వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలపై ప్రజలు కోపంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించగా, ఆ అంశాలను ప్రజలు ఇప్పుడు మరచిపోయరని అన్నారు. మరి ఉద్యోగాల హామీ గురించి ప్రస్తావించగా, పకోడీల లాంటి థియరీ నాకోటి ఉందని, దాంతోని యువతను ఆకట్టుకున్నానని ఆయన చెప్పారు. కానీ ఆయన మొహంలో అంతకుముందున్న ధీమా కనిపించడం లేదు. -
ఓటరు ఎటువైపు?!
దాదాపు రెండు నెలలుగా హోరెత్తుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం బుధవారం సాయంత్రంతో ముగిసింది. శుక్రవారం జరగబోయే పోలింగ్‌కు ఎన్నికల యంత్రాంగం సర్వ సన్నద్ధమైంది. తెలంగాణతోపాటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రాష్ట్రం రాజస్తాన్ పోలింగ్ తెలంగాణతోపాటే జరగబోతోంది. ఇతర రాష్ట్రాల మాటెలా ఉన్నా తెలంగాణలో తొలిసారి జరగబోతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పక్షం అంతిమ విజేతగా నిలుస్తుందన్న అంశంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల సంఘం నవంబర్ 11న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసినా అంతకు నెల రోజుల ముందే టీఆర్ఎస్ తన అభ్యర్థుల్ని ఖరారు చేసుకుని ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టింది. ప్రతి పార్టీ ఈ ఎన్నికలను చావో రేవో అన్నట్టు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు రాష్ట్రా నికొచ్చి సభలూ, సమావేశాల్లో మాట్లాడారు. బీజేపీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మొదలుకొని కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నాయ కులు వివిధ జిల్లాల్లో జరిగిన సభలూ, సమావేశాల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ తరఫున ముఖ్య మంత్రి కె. చంద్రశేఖరరావు అన్నీ తానే అయి దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ఎప్పటికప్పుడు పార్టీ వ్యూహానికి పదునుపెడుతూ పార్టీ శ్రేణులను ఉరికించారు. పార్టీ కీలక నేతలు తారకరామారావు, హరీశ్‌రావులు సైతం పలు నియోజక వర్గాల బాధ్యతలను తీసుకుని ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని సంకల్పించుకున్న కాంగ్రెస్...అందుకోసం తన చిరకాల ప్రత్యర్థి అయిన తెలుగుదేశంతో పొత్తుకు సైతం సిద్ధపడి సీపీఐని, తెలంగాణ జన సమితి(టీజేఎస్) లను కూడా కలుపుకొని ప్రజా కూటమి పేరుతో ఎన్నికల బరిలో నిల్చుంది. ఏం చేసైనా అధికారం అందుకుని తీరాలని తహతహలాడిన కాంగ్రెస్ పార్టీ అందుకు తగినట్టుగా సకాలంలో అభ్యర్థుల్ని మాత్రం ఖరారు చేసుకోలేకపోయింది. తమ పార్టీలోనూ, కూటమిలోనూ కూడా చివరి నిమిషం వరకూ గందరగోళాన్ని మిగిల్చింది. మిత్రపక్షాలకు కేటాయించిన కొన్ని స్థానాల్లో తన అభ్యర్థులకు బీ ఫారాలిచ్చింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు తేదీ అయిన నవంబర్ 22కు కూడా తేల్చ కపోవడంతో నాలుగైదుచోట్ల కూటమిలోని పక్షాలే పరస్పరం తలపడే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో నాలుగున్నరేళ్లుగా వివిధ అంశాలపై ఒంటరిగా పోరాడుతున్న కాంగ్రెస్ చివరి నిమి షంలో స్వీయ సామర్థ్యంపై నమ్మకం లేకనో, మీడియాలో కథనాలొస్తున్నట్టు భారీగా డబ్బు సమ కూరుస్తానన్న చంద్రబాబు ప్రలోభానికి లొంగిపోవడం వల్లనో... పొత్తుకు సిద్ధపడి రాజకీయంగా తప్పు చేసిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ఆత్మ విశ్వాసంతో పనిచేసిందో ఎవరూ మరిచిపోరు. 2004లో కేవలం అధిష్టానం ఒత్తిడి వల్ల ఆయన టీఆర్ఎస్తో పొత్తుకు అంగీకరించారు. 2009లో ఒంటరిగా పోటీకి దిగినా విజయం ఖాయమని అధిష్టానానికి నచ్చజెప్పి ఒప్పించి దాన్ని నిజం చేసి చూపారు. కానీ రాహుల్‌గాంధీ మొదలుకొని స్థానిక నాయకత్వం వరకూ కాంగ్రెస్‌లో ఎవరూ ఇప్పుడు ఆ స్థాయి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించలేక ‘పూలమ్మినచోటే కట్టెలమ్మిన’ తరహాలో చంద్రబాబు ప్రతిపాదించిందే తడవుగా దాన్ని శిరసావ హించారు. పోనీ సిద్ధపడితే పడ్డారు...కాంగ్రెస్ సగర్వంగా చెప్పుకోవడానికి అవకాశమున్న అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయాలను తమ సమక్షంలోనే చంద్రబాబు సొంత ఖాతాలో వేసుకుంటుంటే అచేతనులుగా గుడ్లప్పగించి చూశారు. ఐటీ అంకురార్పణ, శంషాబాద్ అంతర్జాతీయ విమానా శ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు వంటివన్నీ ఆయన తన ఘనతగా చెప్పుకుంటుంటే ‘కాద’ని చెప్పడానికి వారికి నోరు పెగల్లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌కు అంతో ఇంతో ప్రతిష్ట మిగిలిందంటే అది వైఎస్ పుణ్యమే. కానీ ఆయన్ను స్మరించుకోలేని దుస్థితికి కాంగ్రెస్ నాయకులు దిగజారారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలొచ్చినా అది తనవల్లే సాధ్యమైందని ముందూ మునుపూ దబాయించడా నికి చంద్రబాబుకు చేజేతులా అవకాశమిచ్చారు. నిజానికి తెలంగాణలో తెలుగుదేశం ప్రాభవం ముగిసి చాన్నాళ్లయింది. ఆ పార్టీలో పలుకుబడి ఉన్న నేతలు, కార్యకర్తల్లో అత్యధికులు టీఆర్ఎస్కు వలసపోయారు. ఇప్పుడున్నది నామ మాత్రావశిష్టమైన టీడీపీ మాత్రమే. చంద్రబాబు తన బ్రాండ్ మకిలిని కూటమిలోని ఇతర పక్షాలకు కూడా అంటించారు. మరి 48 గంటల్లో పోలింగ్ జరగబోతున్నదనగా తెలంగాణలోని వివిధ జిల్లాలు మొదలుకొని రాజధానిలోని కూకట్పల్లి వరకూ పట్టుబడుతున్న కరెన్సీ మూటలు, బంగారం నిల్వలు తెలంగాణ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఇందులో కరెన్సీ విలువ రూ. 129 కోట్లుకాగా, బంగారం విలువ రూ. 8 కోట్లని వార్తలొస్తున్నాయి. ఇవిగాక లక్షలాది రూపాయల మద్యం ఏరులై పారుతోంది. పట్టుబడిన డబ్బు, బంగారం నిల్వల్లో అధిక భాగం కూటమి అభ్యర్థులదే కావడం, ఇదంతా ఆంధ్రప్రదేశ్ నుంచే తరలి వచ్చిందని కథనాలు రావడం తెలంగాణ ప్రజల్ని మాత్రమే కాదు...అక్కడివారిని సైతం కలవరపరుస్తాయి. ఇంతవరకూ రూ. 129 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నామని బుధ వారం రాత్రి పోలీసులు చేసిన ప్రకటన వెల్లడించిందంటే నాయకులు ఎంతకు దిగజారారో అర్ధమ వుతుంది. తెలంగాణ ప్రజలు రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్నవారు. వివేకమూ, విజ్ఞతా గల వారు. ధన, కనక, మద్య ప్రవాహాలతో ఏమార్చాలని చూసిన పార్టీలకూ, నేతలకూ తమ ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పగలరని గత చరిత్ర చెబుతోంది. ఈ నెల 11న వెలువడే ఫలితాల్లో మరో సారి అదే ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తుందని ఆశిద్దాం. -
ఈ సారి సహారియాల ఓటు ఎవరికి ?
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 72 మంది ఆకలితో చనిపోయారనే వార్త 2002లో జాతీయ పత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. వారిలో 47 మంది ఒక్క రాజస్థాన్‌లోని కిషాన్‌గంజ్ సమితిలోనే చనిపోవడం గమనార్హం. వారంతా కూడా సహారియా తెగకు చెందిన వారే కావడం మరింత గమనార్హం. ఈ ఆకలి చావులకు వ్యతిరేకంగా నాడు సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన పర్యావసానంగానే 2006లో ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఎస్)’, 2013లో జాతీయ ఆహార భద్రతా చట్టం వచ్చాయి. కిషన్‌గంజ్ నియోజకవర్గంలోని ధిక్వాణి, రతాయి, ఖైరాయ్ గ్రామాల్లో సహారియాలు ఎక్కువగా ఉన్నారు. మొత్తం రాజస్థాన్ రాష్ట్ర జనాభాలోనే 40 శాతం ఉన్న సహారియాలను షెడ్యూల్డ్ తెగల కింద గుర్తిస్తున్నారు. వారికి ఈ కిషన్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని 1985లోనే కేటాయించారు. ఒకప్పుడు దట్టమైన అడవుల్లో నివసిస్తూ అటవి ఉత్పత్తులపై ఆధారపడి బతికిన సహారియాలు అడవులు ధ్వంసమవడం, పలచపడడం తదితర కారణాల వల్ల మైదాన ప్రాంతాల్లోకి వచ్చిపడ్డారు. అక్షరాస్యత ఏమాత్రంలేని వీరంతా కూలినాలి చేసుకుని బతికేవారే. చాలాకాలం వీరు భూస్వాముల వద్ద, ధనిక రైతుల వద్ద వెట్టి చాకిరి చేస్తూ బతికారు. ఆ చాకిరి నుంచి వీరికి విముక్తి కల్పించిందీ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ప్రతి కుటుంబంలో ఒక్కరికి కనీసం వంద రోజులు పని కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద ఏడాది క్రితం తాను 24 రోజులు పనిచేశానని, వాటికి కూలీ నేటి వరకు రాలేదని బరన్ జిల్లాలోని ధిక్వాని గ్రామానికి చెందిన కమలేష్ భాయ్ తెలిపారు. ఈ ఎన్నికలలోగానైనా కూలీ డబ్బులు వస్తాయని ఆశించానని, రాలేదని ఆమె చెప్పారు. డబ్బులు రాకపోతే ఆకిలితో చావడమో, వెట్టి చాకిరికి వెళ్లిపోవడమో తప్పేట్లు లేదని ఆమె వాపోయారు. మూడేళ్ల క్రితం వరకు ఉపాధి హామీ పథకం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, అప్పుడు తనతోపాటు ఎన్నో కుటుంబాలు భూస్వాముల వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందామని ఆమె తెలిపారు. మూడేళ్లుగానే నిధులు లేవంటూ ఆమె సతాయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆమె ఆరోపణలతో మిగతా గ్రామాల ప్రజలు కూడా ఏకీభవించారు. ‘ఉపాధి హామీ పథకం మా జీవనాధారం’ అని రతాయ్ గ్రామానికి చెందిన అనితా సహారియా వ్యాఖ్యానించారు. గత కొన్నేళ్లుగా ఈ పథకం ఎందుకనో సవ్యంగా అమలు జరగడం లేదని ఆమె విమర్శించారు. 2008–10 సంవత్సరాలతో పోలిస్తే వంద రోజులు పని పొందిన వారి సంఖ్య పదింటిలో ఒకటికి పడిపోయినట్లు అధికారిక లెక్కలే తెలియజేస్తున్నాయి. ప్రజా పంపిణీ పథకం కింద తమకు రేషన్ సరుకులు కూడా సరిగ్గా అందడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఆధార్‌కార్డులతో అనుసంధానించిన రేషన్ మిషన్లు తమ వేలి ముద్రలను గుర్తించక పోవడం వల్ల డీలర్లు సరుకులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని అన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని అన్నారు. 2015 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తనకు మూడంటే మూడుసార్లు మాత్రమే రేషన్ ఇచ్చారని, వేలి ముద్రలను యంత్రం గుర్తించకపోయినా డీలరు దయతలచి మూడు సార్లు ఇచ్చారని 72 ఏళ్ల హల్కీ భాయ్ తెలిపారు. రేషన్ సరుకులు అందక పేద ప్రజలు దీపావళి రోజున కూడా పస్తులున్నారంటూ స్థానిక పత్రికల్లో వార్తలు రావడంతో ఆ వారంతో సెప్టెంబర్, అక్టోబర్ రేషన్ కోటాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక కేంద్ర పథకాలైన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల, స్వచ్ఛ భారత్ పథకాలేవి తమకు అందుబాటులోకి రాలేదని కిషన్‌గంజ్ నియోజకవర్గం పరిధిలోని సహారియాలు ఆరోపిస్తున్నారు. ప్రధాని మంత్రి ఆవాస్ కింద తమ లబ్దిదారుడికి ఒకే ఒక ఇల్లు మంజూరయిందని, మొత్తం ఇంటికి 1.40 లక్షల రూపాయలను మంజూరు చేయాల్సి ఉండగా కేవలం మొదటి విడతగా 52 వేల రూపాయలను మాత్రమే విడుదల చేశారని, దాంతో పైకప్పు నిర్మించకుండా వదిలేశారని బాధితుడు తెలిపారు. బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లు అన్యాయంగా ఇళ్లను మంజూరు చేయించుకున్నారని వారు ఆరోపించారు. ఇక ఉజ్వల పథకం కింద ఉచితంగా మంజూరైన గ్యాస్ కనెక్షన్‌ను మొదటి సిలిండర్ అయిపోగానే మూలన పడేశామని వారంతా ముక్తకంఠంతో చెప్పారు. సిలిండర్ రీఫిల్లింగ్‌కు వెయ్యి రూపాయలను తాము ఎక్కడి నుంచి కడతామని వారంటున్నారు. అక్కడక్కడ అధ్వాన్నంగా కట్టిన మరుగుదొడ్లు కూడా మూలన పడ్డాయని వారు ఆరోపించారు. ఈసారి ఎవరికి ఓటేస్తారని వారిని ప్రశ్నించగా, ఎప్పటిలాగా కాంగ్రెస్‌కే ఓటేస్తామని వారు చెప్పారు. ఎందుకని ప్రశ్నించగా ప్రస్తుత ప్రభుత్వం తమను ఏనాడు పట్టించుకోలేని వారు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున హీరాలాల్ సహారియా, బీజేపీ తరఫున హేమ్రాజ్ మీనా కుటుంబాలే మొదటి నుంచి ఎస్టీలకు రిజర్వ్ చేసిన ఈ కిషన్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే నిర్మలా సహారియా పోటీ చేస్తుండగా, బీజేపీ తరఫున లిలిత్ మీనాలు పోటీ చేస్తున్నారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడున సెలవు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ నెల ఏడో తేదీన రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించేందుకు వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏడో తేదీన రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. శుక్రవారం జరగననున్న పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని, ఓటు హక్కును పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం పిలుపునిస్తోంది. -
రాహుల్‌కు కేజ్రివాల్ ఆదర్శం కావాల్సింది!
సాక్షి, న్యూఢిల్లీ : ‘మీరు మందిర్–మసీదు వివాదంలో పడిపోయారో మీ పిల్లలు ఆలయాల్లో పూజారులు అవుతారు తప్ప, ఇంజనీర్లు కాలేరు’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఢిల్లీలో న వంబర్ నాలుగవ తేదీన ‘సిగ్నేచర్ బ్రిడ్జి’ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘డ్యామ్‌లు ఆధునిక దేవాలయాలు’ అంటూ పంజాబ్‌లో బాక్రానంగల్ డ్యామ్ ప్రారంభోత్సవం సందర్భంగా భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివద్ధికి నెహ్రూ చేసిన కషిని కూడా ప్రస్తావించారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సేల్), భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెఈఎల్), ఖరగ్‌పూర్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), కోల్‌కతా, అహ్మదాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, బాబా ఆటమిక్ రీసర్చ్ సెంటర్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), ఢిల్లీలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏమ్స్)తదితర ప్రతిష్టాకర సంస్థలన్నీ నెహ్రూ కషి ఫలితమేనని గుర్తు చేశారు. పనిలో పనిగా ఢిల్లీలో పిల్లల విద్యకోసం 6,500 తరగతి గదులను తన ప్రభుత్వం కొత్తగా నిర్మించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలను దష్టిలో పెట్టుకొని అయోధ్యలో రామాలయ నిర్మాణ అంశాన్ని రాజేస్తున్న నేపథ్యంలో బీజేపీ కరుడుగట్టిన హిందూత్వాన్ని ఎదుర్కోవడంలో భాగంగా కేజ్రివాల్ ఇదంతా మాట్లాడారు. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి మానిష్ సిసోడియా ఇటీవల ఎన్డీటీవీ షోకు హాజరైనప్పుడు ఆయన్ని అయోధ్య వివాదం గురించి ప్రశ్నించగా, ‘హిందు, ముస్లిం సామాజిక వర్గాలతో చర్చలు జరపాలి. ఇరు వర్గాలు ఒప్పుకుంటే అక్కడో యూనివర్శిటీని నిర్మించాలి’ అని సూచించారు. ఇదీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కరుడుగట్టిన హిందూత్వ వాదాన్ని ఎదుర్కొంటున్న విధానం. జవహర్ లాల్ నెహ్రూ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ మాత్రం బీజేపీ హిందూత్వ వాదాన్ని ఎదుర్కోవడానికి గుళ్లూ గోపురాలు తిరుగుతున్నారు. పూజలు, పునస్కారాలు చేస్తున్నారు. తాను జంధ్యం ధరించే బ్రాహ్మణుడినేనని తోటి వారితో చెప్పించుకుంటున్నారు. గోత్రాలను కూడా తవ్వి తీస్తున్నారు. తాను విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు అది భారీ కుదుపులకు గురయిందని, రక్షించాల్సిందిగా ఆ శివుడిని వేడుకోకాగానే విమానం ఎలాంటి కుదుపులు లేకుండా క్షేమంగా గమ్యం చేరుకుందని, దాంతో ఆ క్షణం నుంచి తాను శివభక్తుడిగా మారిపోయానని రాహుల్ చెప్పుకుంటున్నారు. ఆ లెక్కన ఆ విమానంలో ఎంత మంది శివభక్తులు తయారయ్యారో! రాహుల్ అనుసరిస్తున్నది మధువైన హిందుత్వమని, కరుడుగట్టిన బీజేపీ హిందూత్వాన్ని ఎదుర్కోవడానికి ఇదే సరైన మార్గమని ఆయనకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మేథావి శశిథరూర్ కితాబ్ కూడా ఇచ్చారు. లౌకికవాద కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ గతంలో దేవున్ని విశ్వసించిన దాఖలాలు లేవు. నమ్మడం, నమ్మక పోవడం ఆయన వ్యక్తిగత విషయం. ఇప్పుడు ఆయన ప్రతి ఎన్నికల సందర్భంగా ప్రతి రాష్ట్రంలోని గుళ్లూ గోపురాలు తిరుగుతూ దాన్ని సామాజిక అంశం చేశారు. నమ్మిన సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉండాలిగానీ, ఓట్ల కోసం ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏనాడు దేవుడిని నమ్మకపోయినా ఐదు పర్యాయాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా 94 ఏళ్లపాటు జీవించిన ఎం. కరుణానిధిని, దేవుడిని నమ్ముతాడో, లేదో తెలియని నేటి అరవింద్ కేజ్రివాల్‌ను రాహుల్ గాంధీ ఆదర్శంగా తీసుకొనే ఉంటే రాజకీయాల్లో రాణించే అవకాశం మరింత మెరుగ్గా ఉండేది. -
‘సట్టా’ చాటేదెవరు.. బీజేపీకి బుకీల జై!
హిందీబెల్ట్‌లోని మూడు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కోట్ల రూపాయల బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్‌లు భారీగా ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఈ సట్టా (బెట్టింగ్)పై రోజురోజుకూ అంచనాలు మారుతున్నాయి. రాజస్తాన్.. కాంగ్రెస్‌కే చాన్స్! ‘రాజస్తాన్‌లో ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ వెంటనే మళ్లీ అధికారంలోకి రావడం గత 25 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా జరగలేదు. ఈ సారి కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వసుంధర రాజే కరిజ్మా తగ్గినట్లు కనిపిస్తోంది’ అని ఢిల్లీలో పేరుగాంచిన బుకీ ఒకరు చెప్పారు. రాజస్తాన్ ఎన్నికల్లో బీజేపీ 60 స్థానాలకే పరిమితం కావచ్చని సట్టా మార్కెట్ అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు 105 స్థానాలు వస్తాయని, మిగిలిన స్థానాల్లో ఇతరులు గెలుస్తారని చెబుతోంది. ఇందుకు తగ్గట్లే బెట్స్ జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో నువ్వా నేనా? ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన మధ్యప్రదేశ్‌పై బెట్టింగ్ చాలా ఆసక్తికరంగా జరుగుతోంది. ఇరు పక్షాల మధ్య చాలా స్వల్ప వ్యత్యాసంతో పందేలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇరు పార్టీల సీట్ల విషయంలో తేడా స్వల్పంగా ఉంటుందని బుకీలు అంచనా వేస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లో బీజేపీదే హవా! ఎన్నికలు పూర్తయిన చత్తీస్‌గఢ్‌లో బీజేపీకి మెజార్టీ వస్తుందని బుకీ ట్రెండ్ చెబుతోంది. బుకీల అంచనాలు ఎంతవరకు ఫలిస్తాయో వచ్చేనెల 11న తెలిసిపోతుంది. -
ఎడారి గడ్డపై.. సోషల్ ఇంజనీరింగ్
‘మోదీ, మీరంటే కోపం లేదు. కానీ.. రాజేని సహించే ప్రసక్తే లేదు’ రాజస్తాన్‌లో ఎక్కడికి వెళ్లినా ఇదే నినాదం వినిపిస్తోంది. ఎవరికీ అందుబాటులో ఉండరు, తలబిరుసు ఎక్కువ వంటి విమర్శల్ని ఎదుర్కొంటూ ఎన్నికలకు ముందే ప్రజాగ్రహం వేడిని చూస్తున్న వసుంధరా రాజే.. కుల సమీకరణలతోనైనా నెగ్గడానికి వ్యూహాలు పన్నుతున్నారు. ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు ఎన్ని ఉన్నప్పటికీ రాజస్తాన్‌లో కులమే అత్యంత కీలకమని, అభ్యర్థుల జయాపజయాల్ని అదే శాసిస్తుందని బలంగా నమ్ముతున్న రెండు పార్టీలు టిక్కెట్ల పంపిణీ సమయంలో కులాల లెక్కల్ని పక్కాగా వేసుకొని బరిలోకి దిగాయి. దీంతో 30 చోట్ల ఒకే కులానికి చెందిన అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటున్నారు. 15 నియోజకవర్గాల్లో జాట్లు తలపడుతుండగా.. 7 స్థానాల్లో బ్రాహ్మణులే బ్రాహ్మణులతో తలపడాల్సి వస్తోంది. 4 సీట్లలో రాజ్‌పుత్‌లు ఒకరిపై మరొకరు సై అంటుండగా.. 2 చోట్ల గుజ్జర్లు, యాదవ్‌లు నువ్వా నేనా అని సమరశంఖం పూరిస్తున్నారు. రాజపుత్‌లు ఎవరివైపు? రాజస్తాన్ జనాభాలో 9% ఉన్న రాజపుత్‌లు ఓట్లు ఏ పార్టీకైనా అత్యంత కీలకం. గతసారి ఎన్నికల్లో బీజేపీ అండదండగా ఉన్న ఈ సామాజిక వర్గం ఇప్పుడు కమలనాథులపై ఆగ్రహంతో ఉంది. రాజ్‌పుత్ అయిన గ్యాంగ్‌స్టర్ ఆనందపాల్ సింగ్ నకిలీ ఎన్కౌంటర్, పద్మావత్ సినిమా విడుదలకు రాజే సర్కార్ సై అనడం, ఎస్సీ, ఎస్టీ చట్టానికి సవరణలు వంటివి బీజేపీపై రాజ్‌పుత్‌లలో కోపాన్ని పెంచాయి. రాజ్‌పుత్ సంఘాలు బహిరంగంగానే సభలు నిర్వహిస్తూ గతంలో కమలం పార్టీకి ఓటు వెయ్యడం తాము చేసిన తప్పిదమంటూ ప్రకటనలు చేస్తున్నాయి. ఈ సారి బీజేపీని ఓడించాలంటూ శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన కన్వీనర్ లోకేంద్ర కాల్వీ పిలుపునిచ్చారు. వీరి ఓట్లన్నీ ఈ సారి కాంగ్రెస్‌కు మళ్లే అవకాశం ఉంది. ఇక రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన నేత జస్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. అయితే, రాజపుత్ర సేనను చీల్చిన సుఖ్‌దేవ్ సింగ్ గోగామేధీ బీజేపీకి మద్దతు ప్రకటించారు. రాజ్‌పుత్‌లు - 9% ప్రభావాన్ని చూపించే నియోజకవర్గాలు- 25 బీజేపీ ఇచ్చిన టికెట్లు- 26 కాంగ్రెస్ ఇచ్చిన టికెట్లు- 15 గుజ్జర్ల అండ దక్కేదెవరికి? రాష్ట్ర జనాభాలో 9%శాతం ఉన్న గుజ్లర్లు కూడా ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన ఈ వర్గం తమను సంచార తెగగా గుర్తించి ఎస్టీ హోదా కల్పించాలంటూ దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఎస్టీ కులమైన మీనాలతో రాజకీయంగా పోటీపడుతున్నారు. రాజే సర్కార్ గత జులైలోనే గుజ్లర్లను తిరిగి ఓబీసీల్లోకి చేర్చింది. దీంతో ఇప్పటికే అమల్లో ఉన్న 21% రిజర్వేషన్లు వారికీ వర్తిస్తాయి ఇక అదనంగా ఒక్క శాతాన్ని అత్యంత వెనుకబడిన వర్గాల్లోకి (ఎంబీసీ) చేర్చింది. ఈ చర్యతో రాష్ట్రంలో సుప్రీం అనుమతిచ్చిన 50% రిజర్వేషన్లు పూర్తయ్యాయి. అయినా గుజ్లర్లు సంతృప్తిగా లేరు. మరోవైపు కాంగ్రెస్‌లో గుజ్జర్ అయిన సచిన్ పైలెట్ సీఎం అభ్యర్థి రేసులో ముందు ఉండడంతో ఈ ఎన్నికల్లో గుజ్లర్లు కాంగ్రెస్‌కే మద్దతు ఇవ్వొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ‘ప్రభుత్వంలో మా ప్రాధాన్యం చాలా తక్కువగా ఉంది. గుజ్జర్ నేతలు ఎక్కువ మంది ఎన్నికైతేనే మా డిమాండ్లు సాధించుకునే అవకాశం ఉంటుంది. సచిన్ పైలెట్ సీఎం రేసులో ఉండడం హర్షణీయం. ఈ సారి మా మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుంది’ అని గుజ్జర్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి శైలేంద్ర సింగ్ ధభానీ వెల్లడించారు. గుజ్జర్లు- 9% ప్రభావాన్ని చూపించే నియోజకవర్గాలు- 25 కాంగ్రెస్ ఇచ్చిన టికెట్లు- 12 బీజేపీ ఇచ్చిన టికెట్లు- 10 జాట్లు రూటు ఎటు? గ్రామీణ రాజస్థాన్‌లో జాట్ల ప్రాబల్యం ఎక్కువ. రాష్ట్ర జనాభాలో 15% ఉన్న వీరు మొదట్నుంచి కాంగ్రెస్ పక్షమే. కానీ ఆ పార్టీ తమకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తి వీరిలో ఉంది. పరశురామ్ మధేర్నా, రామ్నివాస్ మీర్ధా, శీష్‌రాం ఓలా వంటి బలమైన జాట్ నేతలను కాంగ్రెస్ ఎప్పుడూ సీఎంను చేయలేదని జాట్లు అసంతృప్తిగా ఉన్నారు. గత ఎన్నికల్లో పరశురామ్ మధేర్నాను సీఎంగా కాంగ్రెస్ ప్రకటించాలని ఒత్తిడి తెచ్చారు. కానీ మాలీ వర్గానికి చెందిన అశోక్ గెహ్లాట్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో వీరంతా కాంగ్రెస్‌కు దూరమయ్యారు. జాట్లలో అత్యధికులు వ్యవసాయ రంగం మీద ఆధారపడే ఉన్నారు. అయితే రైతాంగ సమస్యల కారణంగా వారు బీజేపీ వైపు కూడా ఉండే అవకాశం లేదు. తిరిగి జాట్లను తమ గూటికి లాక్కోవడానికి కాంగ్రెస్ పార్టీ అన్నిరకాలుగా ప్రయత్నించింది. వ్యూహాత్మకంగా ఎవరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా ముందుకు వెళ్లింది. ఈ సారి ఎన్నికల్లో ప్రముఖ జాట్ నాయకుడు హనుమాన్ బేనీవాల్ రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీతోబరిలో దిగడంతో జాట్ ఓటు బ్యాంకు అటు మళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాట్లు- 15% ప్రభావాన్ని చూపించే నియోజకవర్గాలు- 60 కాంగ్రెస్ ఇచ్చిన టికెట్లు- 33 బీజేపీ ఇచ్చిన టికెట్లు- 33 సర్వేలు ఏం చెబుతున్నాయంటే ఏబీపీ సీఎస్డీఎస్ బీజేపీ - 84 కాంగ్రెస్- 110 ఇతరులు-06 టైమ్స్ నౌ సీఎన్ఎక్స్ బీజేపీ - 70-80 కాంగ్రెస్- 110-120 బీఎస్పీ- 1-3 ఇతరులు- 7-9 ఇక ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా సర్వేలో వసుంధా రాజే ప్రభుత్వం మారాలని 48% మంది కోరుకుంటే, రాజే ప్రభుత్వ పనితీరుపై 32% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల వివరాలు.. ఎన్నికలు – డిసెంబర్ 7 ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు కౌంటింగ్, ఫలితాలు – డిసెంబర్ 11 రాష్ట్ర జనాభా– 6.86 కోట్లు హిందువులు– 88.49%, ముస్లింలు– 9.07% ఓటర్ల సంఖ్య – 4,77,89,815 పోలింగ్ కేంద్రాల సంఖ్య– 51,965 అసెంబ్లీ స్థానాలు – 200 పోలింగ్ జరిగే సీట్లు– 199 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు– 34 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు– 25 జనరల్ సీట్లు– 141 పోటీలో ఉన్న అభ్యర్థులు–2,873 మహిళా అభ్యర్థులు– 189 సీఎం – వసుంధరా రాజే (బీజేపీ) 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–163 సీట్లు– 45,17% కాంగ్రెస్–22 సీట్లు– 33.07% ఇతరులు–17 సీట్లు– 22% -
చెలిమెలో కమలం వికసించేనా?
రాజస్తాన్‌లో ఎన్నికల తేదీ సమీపిస్తోంది. ఇక్కడి ప్రజలు ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు అధికార పార్టీగా ఉన్న బీజేపీ ఈ ఆనవాయితీని బ్రేక్ చేయాలని తహతహలాడుతోంది. ఒకవేళ బీజేపీ ఈసారి అధికారాన్ని నిలబెట్టుకుంటే.. అది ‘ముఖ్యమంత్రి జల స్వావలంబన యోజన’ కారణంగానే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దాదాపు 12 వేల గ్రామాల్లో ఈ పథకం విజయవంతగా సాగుతూ ఇప్పటికే సత్ఫలితాలను ఇచ్చింది. అంటే సుమారు 60 నియోజకవర్గాల్లో ఈ పథకం బీజేపీకి ఓట్లు కురిపించే అవకాశం ఉంది. విపక్షాలన్నీ మిగిలిన రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేస్తుంటే.. బీజేపీ మాత్రం పథకం ద్వారా లబ్ధిపొందిన నియోజకవర్గాల్లో దీన్నే ప్రచారం చేస్తోంది. ఈ పథకం పూర్తిస్థాయి వ్యూహరచన, కార్యాచరణ మొత్తం మన తెలుగు వ్యక్తిదే కావడం గమనార్హం. జలవనరుల నిపుణుడు, తెలంగాణ బీజేపీ నేత వెదిరె శ్రీరాం చేస్తున్న భగీరథ ప్రయత్నమే ఈ ‘ముఖ్యమంత్రి జల స్వావలంభన యోజన’. రాజస్తాన్ ప్రభుత్వం రెండున్నరేళ్లుగా ఈ పథకం ద్వారా అమలు చేస్తున్న ఈ చతుర్విధ జల సంరక్షణ విధానాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు నీతిఆయోగ్ ప్రణాళిక రచిస్తోందంటే.. మన తెలుగోడి సత్తా ఏ స్థాయిలో సత్ఫలితాలు అందిస్తుందో అవగతమవుతుంది. రాజకీయంగా కీలకమే ఇలా వ్యూహాత్మకంగా ప్రాంతాలను ఎంపిక చేసి ఎడారి రాష్ట్రంలో నీటి సంరక్షణ కోసం వసుంధరా రాజే తీవ్రంగా శ్రమించారు. దీన్నో యజ్ఞంలా ముందుకు తీసుకెళ్లారు. సాగునీరుతోపాటు తాగునీటిని అందించే విషయంలో తన లక్ష్యాలను నిపుణులతో పంచుకున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సమిష్టిగా కదలడంతో ఒక ఉద్యమంలా మారిన ఈ జల సంరక్షణ పథకం ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తోంది. ఇప్పుడదే రాజకీయంగా ఆమెకు అనుకూలంగా మారవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ 60 నియోజకవర్గాల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవడం రాజకీయంగా వసుంధరకు అత్యంత అవసరం. అటు కాంగ్రెస్‌కు కూడా ఈ పథకం విజయవంతంగా అమలైన ప్రాంతాల్లో రాజే ప్రాభవానికి వీలైనంత గండి కొట్టడం చాలా అవసరమే. అందుకే నీటి వసతి సంగతి సరే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందంటూ ప్రచారం చేస్తోంది. దీంతో రాజకీయంగా ఈ 60 నియోజకవర్గాలు అధికారంలోకి రావాలనుకునే వారికి కీలకమ్యాయి. జలవనరులను సమకూర్చడంతో బీజేపీ, రాజేపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతున్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజావ్యతిరేకత పెల్లుబుకుతున్నందున దీని ప్రభావం ఈ ప్రాంతాల్లోనూ ఉంటుందనేది కాంగ్రెస్ అభిప్రాయం. నీటి బొట్టును ఒడిసిపట్టి.. కరవు కాటకాలతో నిత్యం తల్లడిల్లుతున్న రాజస్థాన్‌లో నీటి కొరతను కొంతమాత్రమైనా తీర్చే ప్రయత్నంలో.. తెలంగాణకు చెందిన వెదిరె శ్రీరాం సాయాన్ని రాజే తీసుకున్నారు. రాజస్తాన్‌లో సగటు వర్షపాతం 564.89 మిల్లీమీటర్లు మాత్రమే. కొన్ని ప్రాంతాల్లో 171 మి.మీ. ఉంటే కొన్ని ప్రాంతాల్లో 970 మి.మీ. వరకు ఉంటుంది. ఇలాంటి ఎడారి ప్రాంతాన్ని శ్రీరాం సాయంతో హరిత రాజస్తాన్గా మార్చేందుకు రాజే సంకల్పించారు. ముఖ్యమంత్రి జల స్వావలంబన్ అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణకు చెందిన రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ టి.హనుమంతరావు ప్రతిపాదించిన ‘చతుర్విధ జల సంరక్షణ’ ప్రక్రియను శ్రీరాం వెదిరె ఇక్కడ అమలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులైన జక్కిడి జంగారెడ్డి, అఫ్సర్ నాణ్యత పర్యవేక్షణ అధికారులుగా ప్రత్యేక డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే నాగార్జునసాగర్ మాజీ చీఫ్ ఇంజినీర్ రమేష్ సాంకేతిక సాయం అందిస్తున్నారు. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాన నీటి చుక్కలను ఒడిసిపట్టి వాటిని భూమిలో ఇంకేలా చేసేందుకు మూడు రకాలుగా కందకాలు తవ్వడం, వాటి కింది భాగంలో చిన్న, చిన్న ఊట చెలిమలు సృష్టించడం, ఇంకా కింది ప్రాంతంలో చెరువులు, చెక్ డ్యాములు నిర్మించడం ఈ చతుర్విధ జల ప్రక్రియలో భాగం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో వినియోగిస్తున్నారు. శాటిలైట్ మ్యాపులు, డ్రోన్ల సహాయంతో సర్వే చేసి జల సంరక్షణ ప్రాంతాలను ఎంపిక చేస్తున్నారు. సమ్మిళిత నీటి సూచికలో పైపైకి ఇటీవల నీతిఆయోగ్ విడుదల చేసిన సమ్మిళిత నీటి సూచికలో రాజస్తాన్ 2015–16లో 13వ స్థానంలో ఉండగా 2016–17లో 10వ స్థానానికి ఎగబాకింది. అన్ని రాష్ట్రాల కంటే 2016–17లో రాజస్తాన్‌కు ఎక్కువ స్కోర్ పెంచుకుంది. భూఉపరితల నీటి వనరులను సృష్టించడం, పాత నీటి వనరులను రీఛార్జ్ చేయడం, నీటి వినియోగ సంఘాలను ఏర్పాటు చేయడం, ప్రజల భాగస్వామ్యం పెరగడం వంటి అంశాల ఆధారంగా రాజస్తాన్ ఈ స్కోర్ సాధించింది. డ్రోన్లు, శాటిలైట్ మ్యాప్‌ల ఆధారంగా నీటి వనరుల అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించింది. ఈ పథకం రాజస్తాన్ ఎన్నికల్లో, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో.. ఒక నిర్ణయాత్మక శక్తిగా, ఫలితాలను నిర్ణయించే శక్తిగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐదారేళ్లు చేస్తే.. వంద శాతం.. – శ్రీరాం వెదిరె, ఆర్ఎస్బీఏ ఛైర్మన్ ఐదారేళ్లు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తే రాజస్తాన్‌లో 100% ఫలితాలు సాధించవచ్చు. ఈ ప్రక్రియను స్వయంగా తిలకిస్తున్న ప్రజలు, ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లో అమలు చేయాలని కోరుతున్నారు. ప్రధాని సూచన మేరకు దేశవ్యాప్తంగా దీన్ని అమల్లోకి తీసుకురావాలని నీతిఆయోగ్ భావిస్తోంది. ఈ పథకం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అమూల్యమైన ప్రయోజనం చేకూరుతుంది. గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. తాగునీరందుతోంది. తృణ ధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంతోపాటు బత్తాయి వంటి ఉద్యానవన పంటల విస్తీర్ణం కూడా పెరుగుతోంది. బీడు భూముల్లో పంట సాగుతోపాటు పశుగ్రాసం కూడా లభిస్తుండడంతో పశుసంపద కూడా వృద్ధి చెందనుంది. .:: రాజస్తాన్ నుంచి లెంకల ప్రవీణ్ కుమార్ -
కాంగ్రెస్ నేతతో నేలకు ముక్కు రాయించిన యువకులు
జైపూర్ : రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ కాంగ్రెస్ నేతకు ఘోర అవమానం ఎదురైంది. నిర్లక్ష్యంగా కారు నడిపి తమపై బురద పడేసాడంటూ కొంత మంది యువకులు... ఆయనను అడ్డగించి నడిరోడ్డుపై నేలకు ముక్కు రాయించారు. అసలేం జరిగిందంటే.... కాంగ్రెస్ పార్టీకి చెందిన భగవతి లాల్.. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ పైలట్ సాగ్వారా పట్టణంలో ర్యాలీకి హాజరయ్యేందుకు కారులో బయల్దేరారు. జోసావా గ్రామం చేరుకోగానే అక్కడ ఉన్న నీటి గుంటను గమనించకుండా కారును వేగంగా పోనిచ్చారు. ఈ సమయంలో రోడ్డు పక్కన ఉన్న నలుగురు యువకులపై బురద పడింది. దీంతో ఆగ్రహించిన ఆ యువకులు ఆయన కారును చేజ్ చేసి మరీ ఆపారు. హడావుడిగా వెళ్తున్న కారణంగానే ఇలా జరిగిందని చెప్పినా వినకుండా.. ఆయనను మోకాళ్లపై నిలబెట్టి నడిరోడ్డుపై నేలకు ముక్కు రాయించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటనపై దుగన్‌పూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ కుమార్ గురువారం స్పందించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘భగవతి లాల్‌తో దురుసుగా ప్రవర్తించిన ఆ యువకులను వారి సామాజిక వర్గానికి(పాటీదార్) చెందిన పెద్దలు పిలిచి మందలించారు. అంతేకాకుండా భగవతిని ఎలా అయితే అవమానించారో అదే రీతిలో(వాళ్లతో నేలకు ముక్కు రాయించి) వారికి క్షమాపణ కూడా చెప్పించారు’ అని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
‘నేను సేవకున్ని.. కానీ ఆయన పైలెట్’
జైపూర్ : నేను పైలెట్‌ను కాను.. సేవకున్ని అంటూ కాంగ్రెస్ పార్టీపై పరోక్ష విమర్శలు చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి యునస్ ఖాన్. టోంక్ నియోజకవర్గం నుంచి.. కాంగ్రెస్ అభ్యర్థి సచిన్ పైలెట్‌కు వ్యతిరేకంగా బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు యునస్ ఖాన్. రాష్ట్రంలో బీజేపీ తరపున ఉన్న ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి యునస్ ఖాన్. టోంక్ ప్రాంతంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోన్న యునస్ ‘ఈ ఎన్నికలను హిందూ - ముస్లింల ఫైట్‌గా భావించకండి. ఇది కులానికి, మతానికి సంబంధించిన యుద్ధం కాదు. ఇది ప్రజాస్వామ్య యుద్ధం అని తెలిపారు. బీజేపీ తరపున ఒకే ఒక మైనారిటీ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయడం గురించి ప్రశ్నించగా ‘ఈ విషయం గురించి నాకు పూర్తిగా తెలీదు. కానీ రాజస్తాన్‌లో దివంగత రంజాన్ ఖాన్, నేను 1980 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నామం’టూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి సచిన్ పైలెట్ గురించి మాట్లాడుతూ.. ‘సచిన్జీకి ఇది కొత్త ప్లేస్.. కొత్త మనుషులు. వీటన్నింటిని పక్కన పెడితే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి.. ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారు. ఇది తప్ప ఆయనకు మరో కల లేదు. కానీ నేను ప్రజల మనిషిని. పోయిన సారి నేను దీద్వానాలో పని చేశాను.. ఈ సారి టోంక్‌లో. ప్రజలు ఆశీర్వదీస్తే ఇక్కడ కూడా సేవకునిలా పనిచేస్తాను’ అన్నారు. అంతేకాక ‘నేను సేవకున్ని.. ఎమ్మెల్యే మాత్రమే కాగాలను.. కానీ ఆయన చాలా పెద్ద మనిషి.. పైలెట్ కదా’ అంటూ సచిన్‌పై పరోక్ష విమర్శలు చేశారు. టోంక్ ప్రజలకు కావాల్సింది పైలెట్ కాదు.. సేవకుడని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో దీద్వానా నుంచి గెలుపొందిన యునస్ ఖాన్, వసుంధరా రాజే ప్రభుత్వంలో రవాణా మరియు పబ్లిక్ వర్క్స్ మంత్రిగా పని చేశారు. ముస్లింలు ఎక్కువగా ఉండే టోంక్ నియోజకవర్గంలో బీజేపీ తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యే అజిత్ సింగ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ కాంగ్రెస్ పార్టీ సచిన్ పైలెట్‌ను తన అభ్యర్థిగా ప్రకటించడంతో.. బీజేపీ అజిత్ సింగ్ స్థానంలో యునస్ ఖాన్ని నిలబెట్టింది. -
నేటి రాజకీయాల్లో ‘తిట్ల పురాణం’
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రట్ల అభ్యర్థిగా బరాక్ ఒబామా పోటీ చేసినప్పుడు రిపబ్లికన్లు దిగజారుడు విమర్శలు చేశారు. ఆ విమర్శలకు ఆయన భార్య మిషెల్ ఒబామా స్పందిస్తూ ‘వెన్ దే గో లో, వియ్ గో హై’ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు భారత ఎన్నికల ప్రచారంలో అందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది. వారు నీచమైన విమర్శలకు దిగితే మేము అంతకన్నా నీచమైన విమర్శలకు దిగుతామంటూ పోటీ పడుతున్నారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాల ఊసే లేదు. మేనిఫెస్టోలోని అంశాల గురించి చర్చే లేదు. అడపా దడపా తప్పించి అభివద్ధి కార్యక్రమాల ప్రస్థావనే లేదు. పాలకపక్ష పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా, చిన్న పార్టీ అయినా, పెద్ద పార్టీ అయినా పెద్ద తేడాలు లేవు. రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి, పరస్పరం దిగజారుడు విమర్శలు, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లిదండ్రుల గురించి ఒకరు మాట్లాడితే, రాహుల్ గాంధీ తాత పుట్టుపూర్వోత్తరాల గురించి, గోత్రాల గురించి మరొకరు మాట్లాడుతున్నారు. పార్టీల అధికార ప్రతినిధులే మతాల ప్రస్థావన తీసుకొస్తున్నారు. మసీదును విష్ణు ఆలయంగా మార్చండంటూ పిలుపునిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఓ రాజకీయ నేతయితే ఏకంగా ‘ఆలి వర్సెస్ బజరంగ్ బలి’ యుద్ధం అంటున్నారు. పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా, సమయం, సందర్భమూ ఏదైనా వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలనే సంస్కతి, సంస్కారాన్ని పాటించిన ఇంద్రజిత్ గుప్తా, చంద్రశేఖర్, అటల్ బిహారి వాజపేయి, డాక్టర్ మన్మోహన్ సింగ్‌లు నేడెక్కడా?! నాటి నాయకులు విదేశాలకు వెళ్లినప్పుడు దేశ రాజకీయాల గురించి అసలు ప్రస్తావించేవారు. భారతీయుల ఐక్యతను, దేశం గొప్పతనాన్ని చాటిచెప్పే అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు కూడా బహిరంగంగానే విమర్శించుకుంటున్నారు. దేశ నాయకులు ప్రత్యర్థులను ప్రత్యర్థులుగా కాకుండా శత్రువులుగా చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘మౌత్ కా సౌదాగర్, చాయ్‌వాలా, నీచ్’ అని విమర్శిస్తే, సోనియా గాంధీని ‘జెర్సీ ఆవు’ అని, రాహుల్ గాంధీని ‘హైబ్రిడ్ చైల్డ్’ అని, డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ‘పాకిస్థాన్ ఏజెంట్’ అంటూ నీచంగా మాట్లాడుతున్నారు. గతంలో పార్లమెంట్ హాలులో ఎంపీలు వాడివేడిగా చర్చలు జరిపినా, ఘాటుకా విమర్శలు చేసుకున్నా, మళ్లీ పరస్పరం అభినందించుకున్న సన్నివేశాలు అనేకం ఉండేవి. అటల్ బిహారి వాజపేయి తొలిసారిగా ఎంపీగా పార్లమెంట్లో మాట్లాడుతూ పండిట్ నెహ్రూ పాలనను తీవ్రంగా విమర్శించారు. నాడు వాజపేయి వాక్ ఛాతుర్యాన్ని అభినందించిన ప్రధాని పండిట్ నెహ్రూ, ఏదోరోజు వాజ్‌పేయి దేశానికి ప్రధాని అవుతారని కితాబు ఇచ్చారు. ఇందిరాగాంధీని కూడా దుర్గా దేవీగా ఓ సందర్భంలో వాజ్‌పేయి ప్రశంసించారు. 1984లో గ్వాలియర్ నుంచి పోటీ చేసిన వాజపేయి, మాధవరావు సింధియా చేతుల్లో ఓడిపోయినప్పటికీ ఆయన కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారని తెలిసి, ఆయన్ని అఫీసియల్ అసైన్మెంట్ఫై (1988లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశం కోసం) అమెరికాకు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ పంపించారు. అలా చేయడం వల్ల ప్రభుత్వం ఖర్చులతో ఆయన అమెరికా వెళ్లడమే కాకుండా ఆయనకు ట్రీట్మెంట్ కూడా అందింది. ‘నేడు నేను బతికున్నానంటే అందుకు రాజీవ్ గాంధీయే కారణం’ ఓ ఇంటర్వ్యూలో వాజ్‌పేయి వ్యాఖ్యానించారు కూడా. రాజకీయంగా గాంధీలకు వ్యతిరేకంగా పోరాడిన మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ జీవిత చరమాంకంలో క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రభుత్వ ఖర్చులపై చికిత్స కోసం అమెరికా వెళ్లడానికి నిరాకరిస్తే సోనియా గాంధీ స్వయంగా ఆయన్ని కలుసుకొని ఒప్పించారు. -
‘కాంగ్రెస్‌కు ఓటేసే వాళ్లు రావణుడి భక్తులు’
జైపూర్ : రామ భక్తులు బీజేపీకి ఓటేస్తారు.. రావణుడి అనుచరులు మాత్రమే కాంగ్రెస్‌కి ఓటేస్తారంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. ఈ సందర్భంగా రామాయణాన్ని మరోసారి తెర మీదకు తెచ్చారు. ‘హనుమాన్ గిరిజనుడు. అడవుల్లోనే తిరిగారు. రాముని కోరిక మేరకు హనుమంతుడు నలుదిక్కులను ఏకం చేసి ఈ అఖండ భారతదేశాన్ని నిర్మించేందుకు కృషి చేశారు. ఇప్పుడు మేము కూడా ఈ ఆశయాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నామం’టూ యోగి వ్యాఖ్యానించారు. అంతేకాక రాముడిని కొలిచేవారంతా బీజేపీకి ఓటేస్తారని.. రావణాసురిని అనుచరులు మాత్రమే కాంగ్రెస్‌కు ఓటేస్తారని యోగి ఆరోపించారు. రాజస్తాన్‌లో ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఓ వైపు యోగి హిందువులను, దళిత ఓటర్లను ఆకర్షించే పనిలో ఉండగా.. మరోవైపు మోదీ అభివృద్ధి తనవల్లే సాధ్యమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. -
‘మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో బీజేపీ ఓటమి’
కోల్కత్తా : మధ్యప్రదేశ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఓటమి తప్పదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2019 లోక్‌సభ ఎన్నికలపై పడే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. బెంగాల్లో ఆమె ఓ సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. వారికి ప్రజలు ఓటమితో స్వాగతం పలుకుతారని వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే అది అర్థమవుతుందని అన్నారు. బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తృణమూల్ ఓటు బ్యాంకును చీల్చలేరని మమతా ధీమా వ్యక్తం చేశారు. ఎన్నోఏళ్లుగా బెంగాల్లో నాటుకుపోయిన మావోయిస్టుల సమస్యను తమ ప్రభుత్వం శాశ్వతంగా తీర్చిందని, కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో ఆ సమస్య ఇంకా కొనసాగుతోందని ఆమె గుర్తుచేశారు. కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా నేడు (బుధవారం) మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణతో పాటు రాజస్తాన్‌కు డిసెంబర్ 7న పోలింగ్ జరగనుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఎంతో కీలకంగా భావించే ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీతో సహా ఇతర ప్రాంతీయ పార్టీలు సైతం ప్రతీష్టాత్మకంగా భావిస్తున్నాయి. -
మధ్యప్రదేశ్, మిజోరంలో ముగిసిన పోలింగ్
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు పలు ప్రాంతీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో భాగంగా బుధవారం మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాలలో పోలింగ్ జరుగుతుంది. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు గాను 2,899 మంది అభ్యర్థులు బరిలో నిలువగా ఈసీ 65 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌లో పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మరోవైపు మిజోరంలోని 40 స్థానాలకు 209 మంది అభ్యర్థులు బరిలో నిలువగా ఈసీ 1,164 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 11న జరగనుంది. మధ్యప్రదేశ్, మిజోరం పోలింగ్ లైవ్ అప్డేట్స్: సాయంత్రం 5.45: మధ్యప్రదేశ్, మిజోరంలో ముగిసిన పోలింగ్: మధ్యప్రదేశ్‌లో సుమారు 65.5శాతం, మిజోరంలో 73శాతం పోలింగ్ నమోదు మధ్యాహ్నం 2.30: మధ్యప్రదేశ్‌లో మధ్యాహ్నం 2 గంటల వరకు 35.80 శాతం పోలింగ్ నమోదయింది. మధ్యాహ్నం 2.15: కాంగ్రెస్ నాయకుడు కమల్‌నాథ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన హస్తం గుర్తు చూపించడంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఎవరికి ఓటేశారని జర్నలిస్టులు అడిగితే చేతి గుర్తు చూపించానని ఆయన వివరణయిచ్చారు. కమలం గుర్తు చూపించమంటారా అంటూ ఎదురు ప్రశ్నించారు. మధ్యాహ్నం 1.45: పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు, వీవీప్యాట్ల మొరాయింపుపై ప్రధాన సీఈసీ ఓపీ రావత్ స్పందించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సమస్య తలెత్తినట్టు తెలిపారు. సమస్య తలెత్తిన ఈవీఎంలను, వీవీప్యాట్లను రీప్లేస్ చేసినట్టు పేర్కొన్నారు. ఒకవేళ ఈవీఎం పనిచేయకపోవడం ఓటర్లు పోలింగ్ కేంద్రాల నుంచి తిరిగి వెళ్లినట్టయితే.. ఆయా కేంద్రాల్లో రీపోలింగ్ గురించి ఆలోచిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 1.30: మధ్యాహ్నం ఒంటిగంటకు మధ్యప్రదేశ్‌లో 28.68 శాతం, మిజోరంలో 49 శాతం పోలింగ్ నమోదయింది. మద్యాహ్నం 12.30: ఈవీఎంలలో లోపాలు తలెత్తినట్టు 100కు పైగా పోలింగ్ కేంద్రాల నుంచి ఫిర్యాదులు అందినట్టు మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి వీఎల్ కాంతారావు తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించామని పేర్కొన్నారు. మద్యాహ్నం 12.00: పలు చోట్ల ఈవీఎంలు పనిచేయడం లేదని ఫిర్యాదుల వస్తున్న నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఈసీ ఓటింగ్ సమయాన్ని పెంచాలని జ్యోతిరాదిత్య సింధియా కోరారు. ఉదయం 11.40: ఉదయం 11 గంటల వరకు మిజోరంలో 29 శాతం, మధ్యప్రదేశ్‌లో 21 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 11.30: మధ్యప్రదేశ్‌లోని గుణ, ఇండోర్లలో ఎన్నికలు విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కొల్పోయిన ముగ్గురు అధికారుల కుటుంబాలకు ఈసీ పరిహారం ప్రకటించింది. ఉదయం 11.00: కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా గ్వాలియర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజల ఆశీస్సులతో డిసెంబర్ 11న కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉదయం 10.00: ఉదయం 9 గంటల వరకు మిజోరంలో 15 శాతం, మధ్యప్రదేశ్‌లో 6.32 శాతం పోలింగ్ నమోదైనట్టు సమాచారం. మధ్యప్రదేశ్‌లోని కొన్ని చోట్ల ఈవీఎంలలో సమస్య తలెత్తింది. ఉదయం 9.30: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన సొంత నియోజకవర్గం బుధ్నీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ 100 శాతం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 200 సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేశారని తెలిపారు. ఉదయం 9.15: మధ్యప్రదేశ్, మిజోరంలో తొలి సారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువతి, యువకులు ఉత్సహం కనబరుస్తున్నారు. మరోవైపు మిజోరం ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉదయం 8.35: కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు చింద్వారా హనుమాన్ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ ప్రజలపై పూర్తి స్థాయి నమ్మకం ఉందన్నారు. చాలా కాలం నుంచి రాష్ట్రంలోని అమాయక ప్రజలను బీజేపీ మోసం చేస్తూ వస్తుందన్నారు. ఉదయం 8.20: మిజోరంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు. ఉదయం 8.00: మధ్యప్రదేశ్‌లో పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 5.4 కోట్ల మంది నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 2 లక్షల మంది పోలీసులతో ఈసీ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌లో మూడు దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి కూడా సీఎం పీఠంపై కన్నేసింది. మరోవైపు బీజేపీ వ్యతిరేకతను తమవైపు మలుచుకుని ఎలాగైనా అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డింది. ఉదయం 7.50: రాష్ట్రవ్యాప్తంగా మరికొద్దిసేపట్లో పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నర్మద తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, మధ్యప్రదేశ్‌లోని 3 నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్ 7 గంటలకే ప్రారంభమైంది. ఇక్కడ మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది. మిగతా 227 నియోజకవర్గాల్లో 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7.00: మిజోరంలో పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ స్టేషన్ల వద్దకు చేరుకుంటున్నారు. మొత్తం 7.7 లక్షల మంది నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2008, 2013లలో మిజోరంలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ సారి కూడా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇక్కడ కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. -
ఢిల్లీ పీఠానికి..సోపానమిదే!
ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయనేది సుస్పష్టం. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారానికి అడుగు దూరంలో ఆగిపోవడం.. వివిధ రాష్ట్రాల్లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కమలం పార్టీకి ఎదురుదెబ్బలు తగలడంతో ప్రధాని మోదీ ప్రభావం తగ్గుతోందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు మోదీని ఆదరిస్తారా? తిరస్కరిస్తారా? అన్నది తేలిపోతుందని విశ్లేషణలు చెబుతున్నాయి. రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు ఎలాగున్నా బీజేపీపై పెద్దగా ప్రభావం ఉండదు. కానీ మధ్యప్రదేశ్ మాత్రం అధికార పీఠాన్ని నిర్ణయించేదిగా ఉండనుంది. వేళ్లూనుకున్న బీజేపీ మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. గత రెండు ఎన్నికల్లో కూడా ఇక్కడ కమలానికే ఓటర్లు పట్టం కట్టారు. ఆ పార్టీకి రాష్ట్రంలో అన్ని వర్గాల్లో మంచి పట్టుంది. ఒక్కో ఎన్నికకు.. ఒక్కో రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు విస్తరిస్తూ వస్తోంది. అయితే.. ఇటీవలి రైతుల ఆందోళన, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాలతో పాటు పలు సామాజిక సంఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే (నాలుగోసారి) జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభ తగ్గలేదని, మోదీకి ఆదరణ కొనసాగుతోందని అర్థం చేసుకోవచ్చు. అదే కాంగ్రెస్ విజయం సాధిస్తే అది ఎర్రకోటలో పాగా వేసేందుకు గాలులు అనుకూలంగా ఉన్నాయనే సంకేతాలు అందుతాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ఓట్లు, సీట్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. 2008 ఎన్నికల్లో 230 సీట్లకుగాను బీజేపీ 143 సీట్లు గెలుచుకుంటే, 2013 ఎన్నికల నాటికవి 165కు పెరిగాయి. అలాగే, 2008 ఎన్నికల్లో 37.64% ఓట్లు రాగా, గత ఎన్నికల్లో 44.87% వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అయితే మధ్య ప్రదేశ్‌లో బీజేపీ రికార్డు స్థాయిలో 54.03% ఓట్లు రాబట్టుకుంది. పుంజుకున్న బీజేపీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పతనం మొదలయిన తర్వాత చాలా రాష్ట్రాల్లో కనీసం రెండు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతున్నాయి. అయితే, మధ్య ప్రదేశ్‌లో మాత్రం వరసగా కాంగ్రెస్ అధికారానికి దూరమవడం, బీజేపీ ఆధిపత్యం కొనసాగడం జరుగుతోంది. తద్వారా ఇక్కడ బీజేపీ ఎన్నికల రాజకీయాలకు అతీతంగా బీజేపీ తన పట్టు నిలుపుకుందని రుజువవుతోంది. ‘రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల్లోనూ బీజేపీ తన బలం పెంచుకుంటోంది. ప్రత్యర్థుల కంటే బాగా పని చేయగలదన్న అభిప్రాయం ప్రజల్లో కలిగించింది. దాని ఫలితమే వరస ఎన్నికల్లో గెలుపు’ అంటున్నారు ఎన్నికల విశ్లేషకులు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ 15 ఏళ్లుగా అధికారాన్ని కాపాడుకోవడమే కాక కాంగ్రెస్‌ను తనకు చాలా దూరంలో నిలబెట్టగలిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 36.38% ఓట్లు వచ్చాయి. ఇది బీజేపీ ఓట్ల శాతం కంటే 9%తక్కువ. -
చివరి నిమిషమే..కీలకం!
‘వంద అడుగులు బోరు వేస్తే నీళ్లు పడతాయని తెలిసి 99 అడుగుల వద్ద ఆపేస్తే ఎలా సార్?’ ఇటీవలి హిట్ సినిమా డైలాగ్ ఇది. ఈ మాట ఎన్నికలకు కూడా వర్తిస్తుంది. పోలింగ్ ముందు వరకు విస్తృతంగా ప్రచారం చేసి.. చివరి రోజు ఆదమరుపుతో ఉంటే ఫలితం గల్లంతవుతుందని అనేక సందర్భాల్లో సుస్పష్టమైంది. అందుకే చివరి నిమిషంలో నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం తప్పదనే సూత్రాన్ని అన్ని పార్టీలూ మదిలో పెట్టుకుని ముందుకెళ్తున్నాయి. ప్రస్తుతం దేశంలో సెమీ ఫైనల్స్‌గా చెప్పుకునే ఐదు రాష్ట్రాల ఎన్నికలు చివరి దశకు వచ్చాయి. ఓ పక్క మోదీ, మరోపక్క రాహుల్ సుడిగాలి పర్యటనలు చేస్తూ విజయం కోసం శ్రమిస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను తాజా ఎన్నికలు గణనీయంగా ప్రభావితం చేస్తాయని అంచనా. అందుకే ఎలాగైనా ఈ రాష్ట్రాల్లో విజయం సాధించాలని పార్టీలు కష్టపడుతున్నాయి. అందుకోసం చివరి నిమిషం వరకు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ యత్నాలు చేస్తున్నాయి. తొలిదశ కంటే.. మలిదశలో ప్రచారంలో ఎక్కువ శ్రమించిన పార్టీకి విజయం దక్కుతున్నట్లు ఇప్పటివరకున్న లెక్కలు చెబుతున్నాయి. ఓటు ఎవరికి వేయాలని ముందుగా నిర్ణయించుకునే వారికంటే.. చివరి నిమిషంలో స్పష్టతకు వచ్చే వారే ఎక్కువగా ఉంటారు. అందుకే చివరి దశలో ఉధృతంగా ప్రచారం చేయడం బాగా కలిసొస్తుందని విశ్లేషకులంటున్నారు. మలిదశ ప్రచారమే కీలకం ఎన్నికల్లో ఆఖరు దశ ప్రచారం ఎంత కీలకమనే విషయమై లోతుగా అధ్యయనాలు జరిగాయి. మలిదశ ప్రచారం భారత ఎన్నికల్లో చాలా ప్రధానమని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. ఈ పరిశోధనల్లో భాగంగా దేశీయ ఓటర్లను మూడు రకాలుగా విభజించారు. వీరిలో మూడో కేటగిరీ ఓటర్లే గెలుపోటములను తారుమారు చేస్తుంటారని వివిధ సందర్భాల్లో రుజువైంది. మొత్తం ఓటర్లలో రెండవ, మూడవ కేటగిరీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని పరిశోధన తెలిపింది. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం గతంలో ఎక్కువగా ఉండేదని పరిశోధన వెల్లడించింది. గతంతో పోలిస్తే 2014లో లాస్ట్ మినిట్ ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంది. 1999లో దాదాపు 55%మంది మూడో కేటగిరీ ఓటర్లుండగా, 2014కు వచ్చేసరికి వీరి సంఖ్య 27%కి తగ్గింది. ఈ సంఖ్య తక్కువవుతున్నప్పటికీ.. ఇప్పటికీ వీళ్లని విస్మరించలేమని రాజకీయ పరిశీలకులంటున్నారు. విజయం వైపే మొగ్గు గెలుపు గుర్రాలకే ఆదరణ ఎక్కువ. చివరి నిమిషం ఓటర్లు కూడా గెలిచేందుకు అవకాశం ఉన్నవారినే ఆదరిస్తారు. ఈ అంశాన్ని గత అధ్యయనాలు వివరిస్తున్నాయి. అందుకే ప్రచారంలో పార్టీలు ప్రజల్లో సెంటిమెంట్‌ను రేకెత్తించి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తుంటాయి. తాము గెలుపునకు దగ్గరగా ఉన్నామని ఓటర్లలో సెంటమెంట్ రాజేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఓటర్ల మైండ్ తమకు అనుకూలంగా ఉండేలా ప్రయత్నిస్తుంటాయి. ఇదంతా చివరి నిమిషం ఓటర్లను ప్రభావితం చేయడంలో వ్యూహమే. వీటి కారణంగానే.. ఈ చివరి నిమిష ఓటర్లు గెలిచే అవకాశం ఉన్న పార్టీకే ఓటేస్తారని పరిశోధన వెల్లడిస్తోంది. ఉదాహరణకు 2014లో ఎందుకు ఫలానా పార్టీకి ఓటేశారు? అనే విషయమై సర్వే చేస్తే ఎలాగూ గెలుస్తారన్న అంచనాతో సదరు పార్టీకి ఓటేశామని సర్వేలో 43% మంది చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో మోదీ విజయం సాధిస్తారని చాలామంది భావించారు. ఈ భావనే చివరినిమిషం ఓటర్లను ప్రభావితం చేసింది. గెలుపు గుర్రానికి ఓటేశామనేవారిలో కాంగ్రెస్ కన్నా బీజేపీకి 18% మెజార్టీ లభించింది. 48% ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చిన ఓటర్లు, వీళ్లు ఆయా పార్టీల కార్యకర్తలై ఉంటారు. ఈ ఓట్లపై పార్టీలకు అవగాహన ఉంటుంది. 25% ప్రచార సమయంలో నిర్ణయం తీసుకునే ఓటర్లు, ఎన్నికల హామీలను చూసి నిర్ణయం తీసుకుంటారు. 27% చివరి నిమిషం ఓటర్లు, ఓటింగ్‌పై ఆసక్తి తక్కువగా ఉన్న ఓటర్లు. చివరి నిమిషంలో హఠాత్తుగా ఓటేయాలని డిసైడవుతుంటారు. -
మధ్యప్రదేశ్‌లో ఎవరిది ‘పైచేయి’?
-
మధ్యప్రదేశ్‌లో ఎవరిది ‘పైచేయి’?
సాక్షి, న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను సెమీ ఫైనల్‌గా రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్న నేపథ్యంలో వాటిల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి జరగుతున్న ఎన్నికలను ‘టై–బ్రేకర్’గా పరిగణించవచ్చు. ఐదు రాష్ట్రాల్లో మిజోరమ్, చత్తీస్‌గఢ్‌లు చిన్న రాష్ట్రాలు కాగ, తెలంగాణ ఎన్నికలను ప్రాంతీయ యుద్ధంగానే భావించవచ్చు. రాజస్థాన్ పెద్ద రాష్ట్రమే అయినప్పటికీ రెండు దశాబ్దాల నుంచి కాంగ్రెస్, బీజేపీలే వరుసగా పంచుకుంటున్నాయి. పైగా రాజస్థాన్‌లో ఈసారి కాంగ్రెస్ విజయం ఖాయమని దాదాపు అన్ని సర్వేలు తేల్చేశాయి. ప్రధాన హిందీ రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఏ సర్వేలు స్పష్టం చేయడం లేదు. కొన్ని సర్వేలు కాంగ్రెస్ వైపు, మరికొన్ని సర్వేలు బీజేపీ వైపు మొగ్గుచూపాయి. మధ్యప్రదేశ్ జనాభాలో 70 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఎన్నికలను ప్రధానంగా ప్రభావితం చేసే వర్గం ఇదే. పంటలకు సరైన గిట్టుబాటు ధరలను కల్పించాలని, రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ 2017లో రైతులు నిర్వహించిన సమ్మె ఇక్కడ రక్తసిక్తమయింది. మండ్సార్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించారు. ఆ సంఘటన నాడు యావత్ దేశ రైతు లోకాన్ని కదిలించింది. రైతులకు గిట్టుబాటు ధరల స్థానంలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘భవంతర్ భుక్తాన్ యోజన’ పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు, మార్కెట్ ధరకు ఉన్న వ్యత్యాసాన్ని నేరుగా ప్రభుత్వం ఇవ్వడమే ఈ పథకం లక్ష్యం. అయితే ఈ పథకం విఫలమైందని, వ్యాపారులకు, ధనిక రైతులకే ఉపయోగపడుతోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రుణాలను మాఫీ చేయకపోవడం పట్ల కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు కూడా తమను దెబ్బతీసిందని వారు వాపోతున్నారు. ఎన్నికలపై నిరుద్యోగం ప్రభావం నిరుద్యోగ సమస్య రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగులు 53 శాతమని, నిరుద్యోగం కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న యువకుల సంఖ్య 2005తో పోలిస్తే 2015 నాటికి 20 రెట్లు పెరిగిందని ‘బిరోజ్గర్ సేన’ వెల్లడించింది. రాష్ట్ర వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ‘వ్యాపం’ కుంభకోణం పట్ల కూడా నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేయడం, జీఎస్టీని ప్రవేశపెట్టడం పట్ల మరోపక్క చిన్న వ్యాపారులు పాలకపక్షంపై ఆగ్రహంతో ఉన్నారు. దళితులు వ్యతిరేకం ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని సుప్రీం కోర్టు సడలించడాన్ని వ్యతిరేకిస్తూ గత ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించిన భారత్ బంద్ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో విమల్ ప్రకాష్ అనే దళితుడు మరణించాడు. ఈ సంఘటనే కాకుండా శివరాజ్ సింగ్ చౌవాన్ సంపన్న వర్గాల సంక్షేమం కోసమే కషి చేశారని, నిమ్న వర్గాలైన తమను అంతగా పట్టించుకోలేదని ఎస్సీ, ఎస్టీలు బలంగా భావిస్తున్నారు. నాడు బంద్‌తో దళితులు దూరం అవుతారని భావించిన మోదీ సర్కార్ ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని యథావిధిగా పునరుద్ధరించారు. అది కొంత మంది అగ్రవర్ణాలకు కోపం తెప్పించింది. వారు సెప్టెంబర్ ఐదవ తేదీన ఎస్సీ,ఎస్టీల చట్టాన్ని ఎత్తివేయాలంటూ రాష్ట్రంలో బంద్ నిర్వహించారు. దేశ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్‌ను నియమించడం పట్ల, దేశంలో తాము ఆశించిన రిజర్వేషన్ల విధానాన్ని ఎత్తివేయక పోవడం పట్ల కూడా కొన్ని అగ్రవర్ణాలు పాలకపక్షంపై ఆగ్రహంతో ఉన్నాయి. మెజారిటీ ప్రజలు పాలకపక్షాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ‘మామ’గా వారికి దగ్గరైన శివరాజ్ సింగ్ చౌవాన్ పట్ల వారికి అంత వ్యతిరేకత లేదు. అందువల్లనే కాంగ్రెస్–బీజేపీ మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మాయావతి నాయకత్వంలో బీఎస్పీ పార్టీ కాంగ్రెస్ ఓట్లను చీల్చడం తమకు లాభించే అంశమని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ‘సపక్స్ సమాజ్’ అని కొత్త పార్టీ ఆ మేరకు బీజేపీ ఓట్లను చీలుస్తుందన్న విషయాన్ని వారు మరచిపోతున్నారు. రాష్ట్రంలో 45 శాతం మంది ఉన్న ఆదివాసీల్లో కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతానికి ‘హస్తం’ దే పైచేయని సామాజిక, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
డ్రగ్స్.. మద్యం..మిజోరం
‘తాగుడు, మాదక ద్రవ్యాల వ్యవసాలున్న వారిని మా పార్టీ తరఫున అభ్యర్థులుగా ఎన్నికల్లో నిలబెట్టం. ఎలాటి చెడు అలవాట్లు లేని వారికే టికెట్లిస్తాం’ మిజోరం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల నిఘా వేదికకు సమర్పించాల్సిన అవగాహన పత్రమిది. ‘ఎన్నికల్లో తాగుబోతులు, మాదక ద్రవ్యాలు తీసుకునే వారికి ఓటు వేయకండి. ఈ అలవాట్లున్న వారిని దూరం పెట్టండి’ ఎన్నికలప్పుడు క్రైస్తవ మత పెద్దలు ప్రజలకిచ్చే సందేశమిది. ఈ రెండు ప్రకటనలు చాలు మిజోరంలో మద్యం, డ్రగ్స్ పోషిస్తున్న కీలకపాత్రను అర్థం చేసుకునేందుకు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఈ రెండు అంశాలు పార్టీల తలరాతలను నిర్ణయించనున్నాయి. ఇక్కడి నుంచే దేశంలోకి! రాష్ట్ర జనాభాలో 87% వరకు క్రైస్తవులే. అక్కడ చర్చి పెద్దల మాటే శాసనం. అయితే.. మద్యం, మాదక ద్రవ్యాలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుండటంతో ప్రతి ఎన్నికల్లో ఈ రెండు అంశాలు కీలకంగా మారతాయి. ప్రతి పార్టీ ప్రతి ఎన్నికల్లో ఈ రెండింటినీ తరిమేస్తామని వాగ్దానం చేస్తుంది. ఏ పార్టీ ఈ వాగ్దానాలను అమలుచేయగలదని అనుకుంటారో.. ఆ పార్టీనే ఓటర్లు గెలిపిస్తూ వస్తున్నారు. ప్రజలను ఈ చెడు అలవాట్లనుంచి దూరం చేయడానికి ప్రిస్బిటేరియన్ సినోడ్ (చర్చిలతో కూడిన అతిపెద్ద సంస్థ) ప్రయత్నిస్తోంది. ప్రతి ఎన్నికల్లో తాగుబోతులకు ఓటెయ్యవద్దంటూ ప్రజలకు పిలుపునిస్తుంది. అలాగే, చర్చి మద్దతు ఉన్న మిజోరం పీపుల్స్ ఫోరం (ఎన్నికల నిఘా వేదిక) కూడా రాజకీయ పార్టీల నుంచి హామీ పత్రం తీసుకుంటుంది. మరోవైపు యంగ్ మిజో అసోసియేషన్ (వైఎంఏ)కు చెందిన సప్లయ్ రిడక్షన్ స్క్వాడ్ (ఎస్సారెస్) రాష్ట్రంనుంచి డ్రగ్స్ మహమ్మారిని తరిమేయడానికి పోరాటం చేస్తోంది. డ్రగ్స్ వాడే వారు రోడ్డుమీద ఎక్కడపడితే అక్కడ పడిపోతుంటారు. ఈ ఏడాది ఇంత వరకు 36 మంది డ్రగ్స్ కారణంగా చనిపోయారని, వారిలో 15 చావులకు హెరాయినే కారణమని ఎస్సారెస్ బాధ్యుడు చవాంగ్ తెలిపారు. 2004లో 142 మంది డ్రగ్స్‌కు బలయ్యారని ఆయన అన్నారు. ఉత్తరాన కాచర్ పర్వతాలు, తూర్పున మయన్మార్, దక్షిణాన ఉన్న బంగ్లాదేశ్ నుంచి మిజోరంకు భారీగా మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి. అఫ్గానిస్తాన్ తర్వాత ప్రపచంలో అత్యధికంగా హెరాయిన్‌ను సరఫరా చేసేది మయన్మారే. మిజోరం నుంచే దేశంలోని ఇతర ప్రాంతాలకు మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. అన్ని పార్టీల దృష్టి వీటిపైనే ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీలు మేనిఫెస్టోల్లో పేర్కొనకపోయినా మద్యం, మాదక ద్రవ్యాల నియంత్రణ గురించి ప్రచారాల్లో మాత్రం తప్పక ప్రస్తావిస్తుంటాయి. తాము అధికారంలోకి వస్తే డ్రగ్స్ బాధితుల కోసం మరిన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పార్టీలంటున్నాయి. రాష్ట్రంలో చాలా ఏళ్ల నుంచి మద్యనిషేధం అమల్లో ఉంది. అయితే 2015లో కాంగ్రెస్ ఈ నిషేధాన్ని ఎత్తేసింది. మద్యనిషేధం కారణంగా యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ పేర్కొంది. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే బీజేపీ మాత్రం స్థానిక బ్రాండ్లనే ప్రోత్సహిస్తామని ప్రచారం చేస్తోంది. -
పట్టుచిక్కేదెవరికి?
ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో 40 అసెంబ్లీ సీట్లతో పరిమాణంలో చిన్నగానే కనబడుతున్నా.. ఇది కీలకమైన రాష్ట్రమే. బీజేపీ కన్నా కాంగ్రెస్‌కే ఇది అత్యంత కీలకం. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈశాన్యంలో ఒక్కోరాష్ట్రంలో పట్టుకోల్పోతూ వస్తున్న కాంగ్రెస్‌కు.. ఈ ప్రాంతంలో మిగిలిన చిట్టచివరి రాష్ట్రం మిజోరం. అందుకే ఎలాగైనా ఇక్కడ పట్టునిలుపుకోవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. అటు బీజేపీ కూడా మిజోరంను తమ ఖాతాలో వేసుకుంటే.. కాంగ్రెస్ ముక్త్ ఈశాన్య నినాదాన్ని సంపూర్ణం చేసినట్లు ఉంటుందని భావిస్తోంది. అయితే ఇంతవరకు మిజోల గడ్డపై ఒక్క ఎమ్మెల్యే సీటు లేకపోయినా.. క్రైస్తవుల కోటలో పాగా వేయాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. బుధవారం ఎన్నికలు జరగనున్న మిజోరంలో ప్రతిపక్షమైన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎమ్మెన్‌ఎఫ్) ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఏదేమైనా మిజోరంలో గెలవడం కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్య. బీజేపీతో సమస్యలు: కాంగ్రెస్ విమర్శ అధికార కాంగ్రెస్, విపక్ష ఎమ్మెన్‌ఎఫ్ పార్టీలకు బీజేపీ తమ శత్రువు అని చెప్పుకోవడమే ప్రధాన ప్రచారాంశంగా మారింది. మిజోరం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలనుకుంటున్న బీజేపీ.. నేరుగా కాంగ్రెస్‌తో తలపడటం వీలుకాకపోవడంతో ఎమ్మెన్‌ఎఫ్ సాయంతో పోటీ చేస్తోందంటూ సీఎం లాల్ థన్వాలా విమర్శిస్తున్నారు. ఎన్నికల తర్వాత బీజేపీ, ఎమ్మెన్‌ఎఫ్ కలిసిపోతాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. దీంతోపాటుగా.. క్రైస్తవులకు వ్యతిరేక పార్టీగా ముద్రపడిన బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని క్రిస్టియన్ల అస్తిత్వానికి సమస్యలు ఎదురవుతాయని కూడా కాంగ్రెస్ప్రచారం చేస్తోంది. ఈ ఎన్నికల్లో కనీసం 30 స్థానాలు గెలుచుకుంటామని థన్వాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి ఆరు సార్లు సీఎంగా పని చేసిన థన్వాలా.. 2014లో బీజేపీ హవా నడిచిన సమయంలో కూడా మిజోరంలో తన పట్టు నిలుపుకోగలిగారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు బీజేపీని హిందూత్వ పార్టీగానే గుర్తిస్తున్నారని, ఆపార్టీకి అధికారం అప్పగించరని ఆయన అన్నారు. ధీమాగా ఎమ్మెన్‌ఎఫ్ విపక్షమైన ఎమ్మెన్‌ఎఫ్ కూడా విజయంపై ధీమాగానే ఉంది. బీజేపీతో తమకెలాంటి సంబంధం లేదని ఆ పార్టీ సీఎం అభ్యర్థి, మాజీ సీఎం జొరాంతంగ స్పష్టం చేస్తున్నారు. బీజేపీకి ఒక్క సీటు దక్కితే గొప్పేనంటున్నారు. కాగా, ఈసారి ఎన్నికల్లో ఇటీవలే ఏర్పాటైన జేడ్పీఎం కూటమి కూడా గణనీయమైన ప్రభావం చూపించగలదని పరిశీలకులు అంటున్నారు. ఈ కూటమి పోటీ చేస్తున్న 35 స్థానాల్లో ప్రధాన పార్టీల ఓట్లు చీల్చుతుందని వారంటున్నారు. కాంగ్రెస్ 40 సీట్లలో, బీజేపీ 39 చోట్ల అభ్యర్థులను నిలబెట్టింది. ఎమ్మెన్‌ఎఫ్ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆరు ప్రాంతీయ పార్టీల కూటమి జోరం పీపుల్స్ మూమెంట్ (జెడ్పీఎం) 35 సీట్లలో బరిలో ఉంది. లోక్‌సభ మాజీ స్పీకర్ పీఎ సంగ్మా నాయకత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లు కూడా కొన్ని చోట్ల అభ్యర్ధులను పోటీలో దించాయి. కమలానికి ఓట్లు తక్కువే! గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం 0.37% ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా కూడా ఈ సారి బీజేపీ 39 స్థానాల్లో పోటీ పడుతోంది. కాంగ్రెస్‌లో కుమ్ములాటలు తనకు మేలు చేస్తాయని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నేతలు ఇటీవల పార్టీకి రాజీనామా చేయడాన్ని తమకనుకూలంగా మలుచుకోవడానికి వ్యూహ రచన చేస్తోంది. సీఎం సహా 9మందిపై క్రిమినల్ కేసులు ముఖ్యమంత్రి థన్వాలా, ప్రతిపక్ష నేత జొరాంతంగ సహా 9 మంది అభ్యర్ధులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని మిజోరం ఎలక్షన్ వాచ్ తెలిపింది. ఈ ఎన్నికల్లో మొత్తం 200 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 116 మంది కోటీశ్వరులు. వీరిలో 35 మంది ఎమ్మెన్‌ఎఫ్, 33 మంది కాంగ్రెస్ వాళ్లున్నారు. ఆయన ఆస్తి 55 కోట్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులందరిలో కోటీశ్వరుడు ఎమ్మెన్‌ఎఫ్ నాయకుడు రాబర్ట్ రోమావియా రోవ్టే. ఈయన ఆస్తి 55 కోట్లు. రాబర్ట్ (51)కు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ఒక ఫుట్‌బాల్ క్లబ్ ఉంది. ఐజ్వాల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాబర్ట్ ఇన్ని కోట్లున్నా ప్రచారం మాత్రం కాలినడకనే. ఇంటింటికీ తిరిగి ఆయన ప్రచారం చేస్తున్నారు. బ్యానర్లు, కటౌట్ జోలికి పోకుండా విజిటింగ్ కార్డు సైజున్న కార్డులపై పేరు, నియోజకవర్గం ముద్రించి పంచిపెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం రాబర్ట్‌కు ఇదే మొదటి సారి. ప్రచారంలో ప్రత్యర్థులెవరినీ వ్యక్తిగతంగా దూషించని రాబర్ట్ తన అనుచరులకు కూడా అదే చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి లాల్సవ్టాపై ఆయన పోటీ చేస్తున్నారు. ప్రముఖనాయకులు: లాల్ థన్వాలా (కాంగ్రెస్), జొరామ్‌తంగ (ఎమ్మెన్‌ఎఫ్), జేవీ హ్లునా (బీజేపీ), ఎన్నికల్లో కీలకాంశాలు: మద్యనిషేధం, అక్రమ వలసదారులు, మౌలిక వసతుల లేమి, నిరుద్యోగం, బ్రూ శరణార్థులు, ప్రభుత్వ వ్యతిరేకత, రెబెల్ అభ్యర్ధులు. మేనిఫెస్టోల్లో ప్రధానాంశాలు బీజేపీ: రూ.1కే కిలో బియ్యం, అందరికీ ఇళ్లు కాంగ్రెస్: విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, కొత్త భూ–వినిమయ చట్టం తీసుకురావడం. ఎమ్మెన్‌ఎఫ్: సామాజిక రాజకీయ అభివృద్ది, గ్రామస్థాయిలో పౌరుల నమోదు. -
అక్కడి ఎన్నికల్లో బందిపోట్ల ప్రభావం
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని సాత్న జిల్లా చిత్రకూట్ హిందువులకు ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైన పట్టణం. అయోధ్య రాముడు గడిపిన 14 ఏళ్ల వనవాసంలో 11 ఏళ్లు ఈ ప్రాంతం అడవుల్లోనే గడిపాడన్నది ప్రతీతి. ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతానికి రాముడు అయోధ్య నుంచి సతీసమేతంగా నడిచివచ్చారంటూ స్థానికులు ఇక్కడ ఓ దారిని చూపిస్తారు. ‘రామ్ వన్ పథ్’గా ఈ మార్గాన్ని అభివద్ధి చేస్తానంటూ తెగ ప్రచారం చేయడం ద్వారా 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మొదటిసారి విజయం సాధించారు. ఆయన ఏమీ చేయలేకపోవడంతో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో అదే హామీతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఆయన కూడా తన హామీని నిలబెట్టుకోలేక పోయారు. ఈ నేనపథ్యంలో మొత్తం చిత్రకూట్ అసెంబ్లీ అభివద్ధికి కృషి చేస్తామని కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు హామీల మీద హామీలు ఇస్తున్నారు. కులాలు, వర్గాలు ఓట్లను ప్రభావితం చేసే ఈ నియోజకవర్గంలో ఈ హామీలను ప్రజలెవరు నమ్మడం లేదు. ఈ నియోజక వర్గం ఎన్నికలపై బందిపోట్ల ప్రభావం కూడా ఎక్కువే. అందుకే 1998, 2003, 2013 ఎన్నికల్లో మాజీ బందిపోటు ప్రేమ్ సింగ్ విజయం సాధించారు. 2008లో మాత్రం బీజేపీ అభ్యర్థి కేవలం 722 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. ఆయన కూడా నియోజక వర్గం అభివద్ధికి ఎలాంటి కృషి చేయకపోయినా ఆయనకు భయపడి ప్రజలు ఓటేశారట. 2017లో ప్రేమ్ సింగ్ మరణించడంతో ఆయన స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నీలాంషు చతుర్వేది ఉప ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. ఇప్పటికీ బిబ్లీకోల్, సాధనా పటేల్ లాంటి చిన్న స్థాయి బందిపోట్లు ఎన్నికల్లో పోటీ చేసిన కనీసం పదివేల ఓట్లు వస్తాయని స్థానిక వ్యాపారి ప్రద్యూమ్న త్రిపాఠి వ్యాఖ్యానించారు. చిత్రకూట్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిసారి ఒక్క బందిపోటైనా పోటీ చేస్తారట. అయితే ఈసారి ఎన్నికల్లో ఒక్కరు కూడా లేకపోవడం ఆశ్చర్యకరమేనని స్థానికులు అంటున్నారు. ఈ ప్రాంతం ఆర్థికంగా బాగా వెనకబడి ఉండడం, దాచుకోవడానికి చుట్టూ దట్టమైన అటవి ప్రాంతాలు ఉండడం దోపిడీ దొంగలు పెరగడానికి కారణమని స్థానిక ప్రజలే చెబుతున్నారు. ఎప్పటిలాగా ఈసారి కూడా కులాల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నది అర్థం అవుతుంది. నియోజక వర్గంలో మొత్తం ఓటర్లు 1,98,933 మంది. 40 శాతం ఉండే జనరల్ క్యాటగిరీ ఓటర్లలో 36 శాతం బ్రాహ్మణలు కాగా, ఆరు శాతం మంది ఠాకూర్లు ఉన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే నీలాంషు చతుర్వేదిని కాంగ్రెస్ మళ్లీ నిలబెట్టింది. ఈసారి కూడా బ్రాహ్మణులు మూకుమ్మడిగా మంచిపేరుగల నీలాంషుకే మద్దతిస్తుండడంతో బీజేపీ ఠాకూర్లకు చెందిన సురేంద్ర సింగ్ గహావర్ను పోటీకి నిలబెట్టింది. బీఎస్పీ పార్టీ 19.72 శాతం ఓట్లు కలిగిన షెడ్యూల్ కులానికి చెందిన రవీంద్ర సింగ్ పట్వారీని నిలబెట్టింది. ఇక షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఓటర్లు 18.91 శాతం, ఇతర వెనకబడిన వర్గాలకు చెందిన ఓటర్లు 21 శాతం ఉన్నారు. ఓబీసీల మద్దతు కూడా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీఎస్పీ–కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఇంక ఆ అభ్యర్థికి తిరుగే ఉండేది కాదని అంటున్నారు. -
‘మిస్టర్ స్టుపిడ్’.. క్షమాపణలు చెప్పాలి’
ఇండోర్ : పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సందర్భంగా సిద్ధూ ఇండోర్ మేయర్‌ను విమర్శించిన సంగతి తెలిసిందే. సిద్దూ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె, సిద్ధూని ఉద్దేశిస్తూ.. ‘మిస్టర్ స్టుపిడ్’ అనడమే కాక మేయర్ మాలిని లక్ష్మణ్‌సింగ్ గౌర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సిద్ధూ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ మహిళా కార్యకర్తలు కూడా ఇండోర్‌లోని రాజ్వాడ ప్రాంతంలో దేవి అహల్య విగ్రహం ముందు మౌన దీక్ష చేసి నిరసన తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఇండోర్‌లో జరిగిన ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్న సిద్ధూ, నగర మేయర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నగరంలో జరుగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేతపై మాట్లాడుతూ.. ‘చప్పట్లు కొట్టండి అలాగే మేయర్‌ను కూడా కొట్టండి’ అంటూ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక నష్టపరిహారం ఇవ్వకుండా ప్రజల ఇళ్లను కూల్చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సిద్ధూ టెలివిజన్ కామెడీ షోలో ‘చప్పట్లు కొట్టు’ అనే పదం ఎక్కువగా వాడతారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన అదే పదాన్ని వాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా నేత పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఆ పార్టీ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో సిద్ధూ క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నవంబర్ 28న మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులకు ఉద్యమకారులని బిరుదులిస్తుంది: మోదీ
జైపూర్ : ‘26/11 ముంబై దాడులు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయి. వాళ్ళ ప్రభుత్వ హయంలో జరిగిన దాడులను ఆపలేని వాళ్లే.. పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత జవానులు జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆధారాలడుగుతున్నారు. జవానులు ఏదైనా ఆపరేషన్‌లో ఉన్నప్పుడు కెమెరాలు తీసుకువెళ్లి ఫొటోలకు పోజులిస్తారా? ఈ నాలుగేళ్లలో కశ్మీరులో అడుగుపెట్టిన ఏ ఉగ్రవాదైనా తప్పించుకోగలిగాడా? మా ప్రభుత్వం మావోయిస్టులు, ఉగ్రవాదుల సమస్యను తీవ్రంగా తీసుకుంది’అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్‌ను విమర్శించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7 న జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని మ్మురం చేశారు. ప్రచారంలో భాగంగా గిరిజన ప్రాంతమైన బాన్సవారలో నిర్వహించిన సభలో మోదీ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. రాహుల్‌గాంధీ పేరును ప్రస్తావించకుండా గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన వారసుడికి పేదప్రజల కష్టాలెలా తెలుస్తాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులకు ఉద్యమకారులని బిరుదులిస్తుందని, రాహుల్‌కు ఎన్సీసీ అంటే ఏమిటో తెలియదని, మానిఫెస్టో అంటే ఏమిటో కూడా తెలియని వ్యక్తి, మానససరోవరం వెళ్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
ప్రజాస్వామిక నిరసన.. నోటా!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) దశాబ్దం కిందట పురుడుపోసుకున్న ఒక ఆలోచన. ఐదేళ్ల కిందట అమలుకు నోచుకున్న ఒక ఆయుధం. ప్రజాస్వామిక పద్ధతిలో నిరసనకు కల్పించబడిన హక్కు. నిరసనకు జనం చేతిలో ఆయుధం. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరూ నచ్చనప్పుడు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి తెరమీదకొచ్చిన సరికొత్త మీట. అదే నోటా. నన్ ఆఫ్ ది అబౌ (నోటా). రాజకీయ పార్టీల తరఫున పోటీ చేస్తున్న వారితో పాటు స్వతంత్రులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరికీ ఓటు వేయడం ఇష్టంలేనప్పుడు, పోటీ చేస్తున్న వారెవరూ నచ్చలేదని తెలియజెప్పే ఒక ప్రజాస్వామిక ఆయుధం. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్)కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి కీలకమైన తీర్పు వెల్లడించింది. 27 సెప్టెంబర్ 2013 రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం 11 అక్టోబర్ 2013 నుంచి నోటాను ప్రవేశపెట్టింది. నోటా అమలు చేస్తున్న వాటిల్లో మనది 14 వ దేశం. నోటాకూ ఒక గుర్తు ఓటర్లలో అక్షరాస్యత తక్కువగా ఉండటం, ఓటర్లలో అవగాహన లేకపోవడం వంటి కారణంగా ఆయా రాజకీయ పార్టీలకు కేటాయించినట్టే నోటాకూ ఒక గుర్తు ఉండాలని ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తల నుంచి పెద్దఎత్తున డిమాండ్ వచ్చింది. దాంతో నోటాకూ ఒక గుర్తు కేటాయించాలని 2015 లో ఎన్నికల సంఘం తీర్మానించింది. అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడి) రూపొందించిన గుర్తును నోటాగా కేటాయిస్తూ ఎన్నికల సంఘం 18 సెప్టెంబర్ 2015 న ఆదేశాలు జారీ చేసింది. . ఈవీఎంలలో అభ్యర్థుల పేర్లు, వాటిపక్కన గుర్తు లు ఉన్నట్టుగా చూపించే చిత్రంపై ఇంటూ మార్క్ తో అడ్డంగా కొట్టివేసినట్టుగా చూపించేదే నోటా గుర్తు. ఈ ప్రజాస్వామిక నిరసన హక్కు ఓటర్లకు ఆయుధంగా ఉపయోగపడుతుందా? ఓటర్లు ఆశించిన లక్ష్యం నెరవేరుతుందా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఏదైనా ఒక నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులకన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ప్రజల ప్రజాస్వామిక నిరసన ఫలిస్తుందా? అంటే అలా జరగదు. నోటాకు అత్యధికంగా ఓట్లు నమోదైనప్పటికీ ఆ తర్వాత క్రమంలో అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలిచినట్టుగా ప్రకటిస్తారు. అయితే, నోటా ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అలాంటి సందర్భాలు ఎదురుకాలేదు. అలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న డిమాండ్‌పైన చర్చకు ఆస్కారం కలుగుతుంది. నోటా ప్రవేశపెట్టినప్పటి నుంచి కొందరు దానికి ఓటు వేయడం గమనించాం. ఇప్పుడు కొందరు నోటాకు ఓటు వేయాలంటూ ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఎన్నికల్లో అదీ ఒక గుర్తే... దానికి ప్రచారం చేయొచ్చా? చేయరాదా ? అన్నింటిలాగే నోటాకూ ప్రచారం చేయొచ్చు. అలా చేస్తున్న వారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది కూడా. తొలిసారి ఇవే రాష్ట్రాల్లో 2013లో చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాంలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి నోటా ఉపయోగించారు. (ఢిల్లీ శాసనసభకు ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు జరిగాయి), అప్పట్లో ఈ రాష్ట్రాల్లో 1.85 శాతం ఓట్లు నోటాకు నమోదయ్యాయి. సరిగ్గా ఐదేళ్ల తర్వాత ఆ నాలుగు రాష్ట్రాలకు మళ్లీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇకపోతే, 2014 సాధారణ ఎన్నికల్లో 1.1 శాతం ఓట్లు నోటాకు నమోదయ్యాయి. ఒక్కో ఎన్నికలో ఒక్కో తీరులో ఓట్లు నోటాకు పోలయ్యాయి. 2014 లో కొన్ని రాష్ట్రాలు హర్యానా, జార్ఘండ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో నోటాకు (2.02 శాతం) పడిన ఓట్లు పెరిగాయి. 2015 లో ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో 0.40 శాతం నోటాకు పోలైతే బీహార్‌లో మాత్రం 2.49 శాతం నమోదయ్యాయి. 2016లో అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు ఎన్నికల్లో మొత్తంగా 1.6 శాతం ఓట్లు నోటాకు మీటపై పడ్డాయి. అక్టోబర్ 2013 నుంచి మే 2016 మధ్య కాలంలో దేశంలో జరిగిన ఎన్నికల ఓటింగ్ సరళిని విశ్లేషించినప్పుడు... గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లోనే నోటాకు ఎక్కువ ఓట్లు నమోదుకావడం గమనార్హం. ప్రత్యేకించి ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. లండన్ కింగ్స్ కాలేజీకి చెందిన గరిమా గోయల్ తన పరిశోధనా పత్రంలో ఈ విషయం వెల్లడించినట్టు ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ పేర్కొంది. గిరిజనులు ప్రత్యేకంగా ఎక్కడయితే తమ కమ్యూనిటికి ప్రాతినిథ్యం ఉండటం లేదో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా నోటాకు నమోదవుతున్నట్టు వెల్లడైంది. అలాగే, వామపక్ష తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. గడ్చిరోలీ, జార్గ్రామ్, కల్యాణ్ (రూరల్), జగన్నాథ్‌పూర్, చాత్ర, ఉమర్కోట్, ఛత్తర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా నోటాకు ఓట్లు నమోదయ్యాయి. లోక్‌సభ నియోజకవర్గాల విషయానికొస్తే 2014 ఎన్నికల్లో బస్తర్, నీల్గిరీస్, నబరంగ్‌పూర్ నియోజకవర్గాల్లో ఎక్కువగా వచ్చాయి. ఈ ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావం అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే, ఎక్కడైతే ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య ముఖాముఖి పోటీ ఉందో ఆ ప్రాంతాల్లో కూడా నోటాకు వచ్చిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు కొన్ని గణాంకాలు సూచిస్తున్నాయి. అందుకు కారణంగా ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన ఈరెండు పార్టీలకు వ్యతిరేకంగా ఇవి నమోదవుతున్నాయన్న వాదన వినిపిస్తున్న వారూ ఉన్నారు. మొత్తంమీద ఏ నియోజకవర్గంలో చూసిన 1 నుంచి 3 శాతంకు మించి నోటాకు ఓట్లు పడలేదు. నోటా ప్రవేశపెట్టిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఓట్లు నోటాకొస్తాయని అంచనా వేశారు. పైగా పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత ఎక్కువ ఉంటుంది. పైగా రాజకీయాల్లో నేర చరిత కలిగిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో నోటాకు ఎక్కువ ఓట్లు పడుతాయని అంచనాకు రావొచ్చు. కానీ అందరి అంచనాలకు పట్టణ ప్రాంతాలకన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే నోటాకు ఎక్కువ ఓట్లు నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం గమనార్హం. నోటా ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన ఫలితాల సరళిని బట్టి ‘‘పై వారెవరికీ ఓటు వేయదలచుకోలేదని’’ (నోటాకు వేస్తున్న) చెప్పే వారి సంఖ్య అంతగా ఉండటం లేని కారణంగా నోటా పెద్ద చర్చనీయాంశం కాలేదు. ఈ రకమైన ప్రజాస్వామిక నిరసన ఒక సాధనంగా మాత్రమే మిగిలిపోతోంది. అందుకే ‘‘నన్ ఆఫ్ ది అబో’’ (నోటా) తరహాలో యాంత్రికమైన సాధనంగా కాకుండా ‘‘ రైట్ టు రిజెక్ట్ ’’ (తిరస్కరించే హక్కు) ఉండాలని కోరుతున్నవాళ్లూ ఉన్నారు. నోటా స్థానంలో అభ్యర్థిని పూర్తిగా తిరస్కరించే హక్కు (రైట్ టు రిజెక్ట్) కల్పించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. తెలంగాణలో నోటా తీరు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో (ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి) తెలంగాణలోని 119 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1,51,731 ఓట్లు నోటాకు పడ్డాయి. అంటే ప్రతి నియోజకవర్గంలో సగటున 1275 ఓట్లు నోటాకు నమోదయ్యాయన్నమాట. రెండు వేలు ఆ పైన నోటాకు ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు 11 ఉన్నాయి. అలాగే వెయ్యి నుంచి రెండు వేల మధ్యన నోటాకు పోలైన నియోజకవర్గాలు 67 ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో అత్యధికంగా నోటా ఓట్లు పోలయ్యాయి. ఇకపోతే, పోస్టల్ బ్యాలెట్ల తీరు పరిశీలించినప్పుడు 19 నియోజకవర్గాల్లో నోటాకు ఒక్క ఓటు కూడా పడలేదు. పది అంతకన్నా ఎక్కువ ఓట్లు నోటాకు పోలైన నియోజకవర్గాలు 13 ఉన్నాయి. అత్యధికంగా తాండూరులో పోలైన పోస్టల్ బ్యాలెట్లలో అత్యధికంగా 25 మంది నోటాకు ఓటు వేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా, అత్యల్పంగా నోటాకు ఓట్లు నమోదైన పది నియోజకవర్గాలు -
సీఎం రేసు: సచిన్ పైలట్ ఆసక్తికర సమాధానం
జైపూర్: రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగిస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. రాజస్థాన్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సీఎం రేసులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎవరు సీఎం అవుతారని ప్రశ్నించగా.. ఫైలట్ తనదైనా స్టైల్లో సమాధానం ఇచ్చారు. ‘నాకు 26 సంవత్సరాలున్నప్పుడు కాంగ్రెస్ ఎంపీగా అవకాశం ఇచ్చింది. 31 ఏళ్లు ఉన్నప్పుడు కేంద్రంలో మంత్రి పదవిని, 35 ఏళ్లకు రాజస్థాన్ రాష్ట్ర కాంగ్రెస్‌కు అధ్యక్షుడిని చేసింది. కాంగ్రెస్ నాకు చాలా చేసింది. ఇప్పుడు నావంతు కాంగ్రెస్‌కు తిరిగి ఇచ్చే సమయం వచ్చింది. పార్టీని సంస్థాగతంగా అభివృద్ది చేయడమే నా ముందున్న లక్ష్యం’ అని అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీలో ఒక ఆనవాయితి ఉంది. ముందు ఎన్నికలు జరుగుతాయి. తరువాత ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఇప్పుడు సీఎం ఎవరనేది ముఖ్యం కాదు. బీజేపీ అవినీతి పాలన నుంచి రాష్ట్రప్రజలను బయటపడవేయడమే ముఖ్యం’ అని స్పష్టంచేశారు. 2013 ఎన్నికల్లో 200స్థానాలలో బీజేపీ 163 స్థానాలను కైవసం చేసుకొని అధికారాన్ని చేజిక్కుంచుకుంది. ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోనుందని విశ్లేషకులు చేబుతున్నారు. అదే జరిగితే బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే. -
టీవీ ప్రచారంలో బీజేపీ టాప్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో టీవీ ప్రచారంలో బీజేపీయే అందరికన్నా ముందుంది. ఎంతలా అంటే.. టీవీ పెడితే చాలు బీజేపీ అడ్వయిర్టైజ్మెంటే కనపడేంతగా. ఈ లిస్టులో బీజేపీ తర్వాతే మిగిలిన కంపెనీ బ్రాండ్లున్నాయని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) వెల్లడించింది. హిందుస్థాన్ యునిలివర్, రాకెట్ బెన్కీసర్, అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, విమల్ పాన్‌మసాలా, ట్రివాగో, డెటాల్, విప్రో తదితర ప్రకటనలు బీజేపీ యాడ్ల తర్వాతి స్థానాన్ని ఆక్రమించాయి. తాజా వారాంతపు నివేదికల్లో ఈ విషయం వెల్లడైందని బార్క్ తెలిపింది. అన్ని చానెళ్లలో బీజేపీయే అతిపెద్ద అడ్వయిర్టైజర్ అని వెల్లడించింది. విపక్ష కాంగ్రెస్ పార్టీ అయితే.. ప్రకటనల జాబితాలో టాప్–10లోనూ లేకపోవడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు పూర్తవగా మధ్యప్రదేశ్, మిజోరంలలో నవంబర్ 28న, తెలంగాణ, రాజస్తాన్‌లలో డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల విషయంలో ఇప్పుడే అసలు వేడి మొదలవుతుందని.. అందుకే బీజేపీ టీవీ యాడ్ల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోందని మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
పెయిడ్ న్యూస్, ప్రకటనలను గుర్తించాలి
సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ గ్రామీణ, అర్బన్ నియోజకవర్గాలకు నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకుడు ధీరజ్ కుమార్ గురువారం కలెక్టరేట్లోని ఎన్నికల కార్యాలయాలను పరిశీలించారు. ముందుగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వీవీప్యాట్లు, ఈవీఎంల అవగాహన కేంద్రాన్ని పరిశీలించారు. ఈవీఎంల ఉపయోగం, వీవీప్యాట్ల వినియోగంపై సిబ్బంది ని వివరాలు అడిగారు. అనంతరం ఎన్నికల మీడియా కేంద్రంలో పర్యటించి అభ్యర్థులు, పార్టీలు నిర్వహిస్తున్న ప్రచారం, ప్రకటనల రికార్డింగ్ లోకల్ కేబుల్ టీవీల్లో ఏ విధంగా రికార్డు చేస్తున్నారు? వాటిని ఏ విధంగా పరిశీలిస్తున్నారని ఆరా తీశారు. వార్త పత్రికల్లో ప్రచురణ అవుతున్న అనుమానిత చెల్లింపు వార్తలు, ప్రకటన క్లిప్పింగులను పరిశీలించారు. స్వీప్ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నిక ల ముఖ్య సమాచారమంతా మీడియా ద్వారానే తెలుస్తున్నందున, ప్రతి సమాచారాన్ని మీడియా ద్వారానే ప్రజలకు తెలియజేయాలన్నారు. కలెక్టర్ రామ్మోహన్ రావు వివరిస్తూ ఎంసీసీ కమిటీ ఆధ్వర్యంలో ప్రవర్తన నియామావళి ఉల్లంఘన జరగకుండా ఎక్కడికక్కడ టీంల ద్వారా తనిఖీలు చేయిస్తున్నామన్నారు. స్థానిక సెలబ్రెటీల ద్వారా ఓటు హక్కు వినియోగంపై ప్రచారం చేస్తున్నామని, కేబుల్ టీవీల్లో ప్రసారమయ్యే ప్రకటనపై వీడి యో సర్వేలెన్స్ బృందాల ఆధ్వర్యంలో రోజువారి కార్యక్రమాలు పరిశీలించి ప్రకటనలపై రిటర్నింగ్ అధికారులతో అభ్యర్థులకు, పార్టీలకు నోటీసులు జారీకి ఆదేశాలిచ్చామన్నారు. పత్రికల్లో వచ్చే ప్రకటనలు, అనుమానిత చెల్లింపు వార్తపై ఏరోజుకారోజు ఆర్వోలకు వివరాలు పంపడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెక్‌పోస్టు వద్ద రవాణా, ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూ అధికారులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి జిల్లాకు వచ్చే వాహనా లపై నిఘా పెట్టామని, అనుమానిత డబ్బు, మ ద్యాన్ని సీజ్ చేస్తున్నట్లు వివరించారు. ఎంసీసీ నోడల్ అధికారి సింహాచలం, డీఆర్వో అంజయ్య, సమాచార శాఖ డీడీ మహ్మద్ ముర్తుజా ఉన్నారు. -
మందసౌర్ మొనగాడెవరో?
మందసౌర్ నియోజకవర్గానికి మధ్యప్రదేశ్ రాజకీయాల్లో చాలా ప్రాముఖ్యం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ముగ్గురు(సుందర్‌లాల్ పట్వా, వీకే సక్లేచ, కైలాస్‌నాధ్ కట్జూ) మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 1957లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జన్‌సంఘ్ అభ్యర్ధి సుందర్‌లాల్ గెలుపొందారు. తర్వాత కాలంలో కాంగ్రెస్ అడపాదడపా విజయం సాధించినా ఎక్కువగా జన్‌సంఘ్, బీజేపీకి ఈ నియోజకవర్గం అనుకూలంగా ఉంది. 2003 అనంతరం ఈ నియోజకవర్గం పూర్తిగా బీజేపీ పట్టులోకి వెళ్లింది. గత మూడు దఫాలు బీజేపీ అభ్యర్ధి ఇక్కడ గెలుపొందాడు. ఈ దఫా మారిన పరిస్థితులను అనుకూలంగా మలచుకొని గెలుపొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2013లో బీజేపీ అభ్యర్ధి యశ్పాల్ దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతో సమీప కాంగ్రెస్ అభ్యర్ధి మహేంద్ర సింగ్ గుర్జార్‌పై గెలుపొందారు. 2008లో బీజేపీ అభ్యర్ధి యశ్పాల్ దాదాపు 18,000 ఓట్ల మెజార్టీతో సమీప కాంగ్రెస్ అభ్యర్ధి మహేంద్ర సింగ్ గుర్జార్‌పై గెలుపొందారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎనిమిదిమంది పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి యశ్పాల్ సింగ్ సిసోడియా, కాంగ్రెస్‌నుంచి నరేంద్ర నహతా, బీఎస్పీ నుంచి ఈశ్వర్ మక్వానా పోటీ పడుతుండగా, ఛెన్సింగ్ నాంద్వెల్(ఆమ్ఆద్మీ పార్టీ), సునీల్ బన్సాల్(సపాక్స్), అనీల్సోనీ, అబ్దుల్ హబీబ్, సురేశ్పండిట్(ఇండిపెండెంట్లు) కూడా పోటీలో ఉన్నారు. ఓపియం సాగు.. ప్రపంచంలో ఔషధ అవసరాల కోసం ఓపియం పండించే దేశాల్లో భారత్ మొదటి స్ధానంలో ఉంది. భారత్‌లో మాళ్వా ప్రాంతంలోనే ఓపియం సాగు ఎక్కువగా చేస్తారు. ప్రభుత్వ ఓపియం పాలసీ కింద లైసెన్సులు పొందిన రైతులు మందసౌర్ తదితర జిల్లాలో ఓపియంను పండిస్తారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో ఈ లైసెన్సుల జారీ, పంట సాగు పర్యవేక్షణ జరుగుతుంది. అక్టోబర్ నుంచి సాగు ఆరంభమవుతుంది. మార్చి కల్లా పంట చేతికొస్తుంది. మంచి లాభాలు తెచ్చే పంట కావడంతో లైసెన్సుల కోసం గొడవలు జరుగుతుంటాయి. ఈ గొడవలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు ప్రభుత్వానికి శరాఘాతంగా మారనున్నాయి. మండోదరి పుట్టినూరు.. పురాణాల్లో మందసౌర్ను దశపుర అనేవారు. రామాయణం ప్రకారం ఈ ప్రాంతం రావణ పత్ని మండోదరి జన్మస్థలం. అందుకే ఇక్కడ రావణబ్రహ్మ ఆరాధన కనిపిస్తుంది. రావణుడిని తమ అల్లుడిగా వీరు భావిస్తారు. అందుకే ఈ ప్రాంతీయులు దసరా రోజున రావణ దహనం జరుపుకోరు. నగరంలోని ఖాన్‌పురా ప్రాంతంలో 35 అడుగుల ఎత్తైన దశకంఠుడి విగ్రహం ఉంది. ప్రస్తుత నగరానికి పూర్వం ఇక్కడ మర్, సౌర్ అనే రెండు గ్రామాలుండేవని, ఇవి రెండూ కలిసి మందసౌర్ ఏర్పడిందని మరో కథనం. భౌగోళికంగా ఈ ప్రాంతం మాల్వా, మేవార్ సరిహద్దులో ఉంది. అందుకే మాళ్వా పాలకుడు హుషాంగ్ షా ఘోరీ మందసౌర్‌లో బ్రహ్మాండమైన కోటను కట్టించాడు. బ్రిటీష్ పాలనలో ఈ ప్రాంతం గ్వాలియర్ రాజ్యం కింద ఉండేది. పశుపతినాధ ఆలయం, యశోధర్ముడి సూర్యదేవాలయం చాలా ప్రసిద్ధం. ప్రధాని వస్తే అంతే... మధ్యప్రదేశ్‌లో బీజేపీ కంచుకోటల్లో ఒకటైన మందసౌర్ నియోజకవర్గానికి సంబంధించి ఒక పుకారు షికారు చేస్తుంది. ఏదైనా పార్టీ తరఫున ప్రచారానికి ప్రధాని వస్తే అంతే సంగతులని, నియోజకవర్గంలో విపక్షం గెలుస్తుందని చాలామంది నమ్ముతారు. 1989లో రాజీవ్ ప్రచారానికి వచ్చాక ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి విజయం సాధించాడు. 1998లో బీజేపీ అభ్యర్ధి తరఫున వాజ్పాయ్ ప్రచారానికి వచ్చారు. ఇంకేముంది.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి విజయభేరి మోగించాడు. దీంతో ప్రజల్లో ఈ నమ్మకం బాగా బలపడింది. 2013లో అప్పటికి ఇంకా ప్రధాని కాని నరేంద్రమోదీ బీజేపీ తరఫున ప్రచారానికి వచ్చారు. కానీ ఈ సారి అదే మోదీ ప్రధాని హోదాలో ఈ నెల 24న మందసౌర్ వస్తున్నారు. దీంతో పాత సెంటిమెంట్ తలచుకుని కార్యకర్తలు భయపడుతున్నారు. ఓటింగ్‌ను ప్రభావితం చేసే అంశాలు రైతుల ఆందోళన గతేడాది జూన్‌లో గిట్టుబాటు ధరలు కోరుతూ ఈ ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారడం, పోలీసు కాల్పులు జరగడం, ఆరుగురు ఆందోళనకారులు మరణించడం జరిగాయి. దీంతో ఆందోళనలు మరింత ముదిరి సరిహద్దు జిల్లాలకు కూడా పాకాయి. దీంతో ఈ ప్రాంతంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రబలింది. బీజేపీ రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. బీబీవై పేరిట రైతు సంక్షేమానికి కొత్త పథకం ప్రకటించింది. కాల్పుల్లో చనిపోయినవారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. ఈ ఆందోళన వెనుక ఓపియం మాఫియా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వెల్లుల్లి ధర ఓపియంతో పాటు ఈ ప్రాంతంలో వెల్లుల్లి సాగు కూడా ఎక్కువ. అయితే 2017 మార్చి నుంచి మందసౌర్ మార్కెట్లో వెల్లుల్లి ధర దారుణంగా పడిపోయింది. 2016లో రూ.10వేలకు క్వింటాల్ కొనుగోలు జరిగింది. అలాంటిది ఇప్పుడు రూపాయి, రెండ్రూపాయలకు వెల్లుల్లిని అమ్ముకోవడంపై ఈ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బాలికపై అత్యాచారం ఈ ఏడాది జూన్‌లో ఎనిమిదేళ్ల బాలికపై ఇరువురు అత్యాచారం చేసి చంపేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు నిదర్శనమని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ప్రభుత్వం ఈ కేసులో వేగంగా స్పందించి ఇరువురు నిందితులను అరెస్టు చేసింది. మతాలు, కులాల ఈక్వేషన్లు మందసౌర్‌లో మతాల వారీగా హిందువులు, ముస్లింలు, జైనులు ఎక్కువగా ఉన్నారు. కులాల పరంగా సింధియా రాజ్పుట్స్, పటీదార్లు, చమార్లు ఎక్కువగా కనిపిస్తారు. హిందు ఓట్లు సమీకృతం చేయడంలో ఇంతవరకు బీజేపీ సఫలమవుతూ వస్తోంది. ఈ దఫా బీజేపీని ఎదుర్కొనేందుకు ముస్లిం–జైన్ ఫార్ములా అవలంబించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే వ్యూహాత్మకంగా జైన్ కులస్తుడికి టికెట్ ఇచ్చింది. మరోవైపు రైతు ఆందోళనలో మరణించినవారంతా పటేల్ కులానికి చెందిన వారే. ఎస్సీ ఎస్టీ చట్ట సవరణ సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని యథాతధంగా కొనసాగించేందుకు కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్‌పై నియోజకవర్గంలోని ఓబీసీ, ఓసీ ఓటర్లు మండిపడుతున్నారు. తమ తమ ఊర్లలో ఈ చట్టానికి వ్యతిరేకిస్తూ బ్యానెర్లు ప్రదర్శిస్తున్నారు. తమ ఆందోళను వ్యక్త పరిచేందుకు రాజ్‌పుత్‌లు, పటీదార్లు సపాక్స్ పార్టీ పేరతో పోటీ చేస్తున్నారు. -
శరణార్థినే శరణుజొచ్చి!
మిజోరం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు అసెంబ్లీలో ఖాతా తెరవని బీజేపీ.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ దిశగా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఏ అవకాశాన్నీ వదలకుండా తీవ్రంగా కృషిచేస్తోంది. మిజోరంలోని చక్మాలు, మారాలు, లాయిస్, బ్రూల ఓట్లే లక్ష్యంగా పావులు కదుపుతోంది. త్రిపురలో తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్న బ్రూ గిరిజన తెగ శరణార్థుల ఓట్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు చేసిందేమీ లేదంటూ.. బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. 1997 సంవత్సరంలో మిజోలకు, బ్రూలకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. అవి హింసాత్మకంగా మారడంతో బ్రూలు పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లారు. ఉత్తర త్రిపురలో మొత్తం 6 తాత్కాలిక శిబిరాల్లో బ్రూ తెగవారు తలదాచుకుంటున్నారు. వీరిని వెనక్కి తీసుకురావడానికి మిజోరం, త్రిపురల్లో బ్రూ తెగ సంక్షేమం కోసం పోరాడుతున్న సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే.. కేవలం 31 కుటుంబాలే తిరిగి రాష్ట్రానికి వచ్చాయి. మరో 32 వేల మంది శరణార్థులు అక్కడే ఉన్నారు. వారిలో 11,232 మందికి ఓటు హక్కు ఉంది. అదే ఇప్పుడు బీజేపీ వీరిపై దృష్టిపెట్టేందుకు కారణమైంది. ఓటు హక్కుపై రగడ ఇంకా సొంత రాష్ట్రానికి తిరిగి రాని బ్రూ తెగ గిరిజనులు ఓటు హక్కు వినియోగంపై మిజోరంలో పెద్ద ఎత్తు ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. చివరికి రాష్ట్ర ఎన్నికల అధికారి ఎస్బీ శశాంక్ పదవికే ఎసరు వచ్చింది. త్రిపురలో శరణార్థి శిబిరాల్లో బ్రూలు ఓటు హక్కు వినియోగానికి శశాంక్ అనుమతినిచ్చారు. శశాంక్ నిర్ణయాన్ని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి చువాంగ్ తప్పుపట్టారు. దీంతో ఎన్నికల విధుల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారంటూ శశాంక్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ చువాంగ్‌పై వేటు వేసింది. ఈ పరిణామాలపై పౌర సంఘాలు, విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. బ్రూలకు కొమ్ముకాస్తున్నారంటూ శశాంక్‌కు వ్యతిరేకంగా ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికింది. మిజోరం వచ్చి వాళ్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని డిమాండ్లు వినిపించాయి. ఈ ఆందోళనలకు తలొగ్గిన ఎన్నికల సంఘం.. శశాంక్‌ను తప్పించి ఆశిష్ కుంద్రాకు ఎన్నికల అధికారిగా బాధ్యతలు అప్పగించింది. మరోవైపు బ్రూలు స్థానికుల డిమాండ్‌ని వ్యతిరేకిస్తున్నారు. 2013 ఎన్నికల్లోనూ, 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ తాము ఈ శిబిరాల నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఈ సున్నితమైన సమస్యను పరిష్కరించడానికి మధ్యేమార్గంగా మిజోరం, త్రిపుర సరిహద్దు గ్రామాల్లో పోలింగ్ బూతులు ఏర్పాటు చేసి బ్రూలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆశిష్ చర్యలు చేపట్టారు. అయితే బ్రూ గిరిజనులు ఓటు వేయడం పట్ల మెజారిటీ మిజోలకు కంటగింపుగా ఉంది. త్రిపురలో ఉన్న బ్రూలు ఓటేయడానికి ఎలాంటి ప్రత్యేక ఏర్పాటు చేయవద్దంటూ ఎన్నికల సంఘానికి మిజో విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. స్పష్టమైన లక్ష్యాలతో.. ఈశాన్య ముక్త్ కాంగ్రెస్ కలను సాకారం చేసుకోవడానికి మిజోరం ఎన్నికలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టిసారించింది. కాంగ్రెస్‌ను ఎలాగైనా ఓడించేందుకు పకడ్బందీ వ్యూహాలనే రచిస్తోంది. బ్రూ గిరిజన తెగ శరణార్థి ఓటర్ల సంఖ్య 11 వేలే అయినప్పటికీ జనాభా తక్కువగా ఉన్న మిజోలో స్వల్ప ఓట్లు కూడా అభ్యర్థి జయాపజయాల్ని నిర్ణయిస్తాయి. అందుకే ఆ ఓట్లను ఆకర్షించడానికి శరణార్థి శిబిరాలకు వెళ్లి మరీ ప్రచారం చేస్తోంది. బ్రూలను వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వమే ప్రయత్నించిందని, రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెడితే వారి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఇస్తామంటూ ప్రచారం చేస్తోంది. 40 స్థానాలున్న మిజో అసెంబ్లీలో గత ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేసి 0.37శాతం మాత్రమే ఓటు షేర్ సాధించింది. ఇప్పుడు 39 స్థానాల్లో పోటీకి దిగుతోంది. క్రిస్టియన్ల జనాభా మెజారిటీగా ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీకి విజయావకాశాలు తక్కువే. అయితే వరసపెట్టి ఈశాన్య రాష్ట్రాల్లో పట్టు బిగుస్తూ వస్తున్న కమలనాథులు మిజోరంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్ఈడీఏ)తో ఎన్నికలకు ముందు పొత్తు కుదుర్చుకోనప్పటికీ, హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఎన్నికల తర్వాత చేతులు కలిపే అవకాశాలున్నాయి. నామినేషన్లు కుప్పలుతెప్పలు.. ఎన్నికలు జరుగుతున్న 4 రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన ఛత్తీస్‌గఢ్‌లో ఒక సీటుకు సరాసరిగా 34 నామినేషన్లు దాఖలవగా.. మిజోరంలో కనిష్టంగా సగటున సీటుకు 5గురు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా నామినేషన్ల సంఖ్య వేలల్లో ఉంది. ప్రచార సామగ్రికి డిమాండ్! రాజస్తాన్‌లో ఎన్నికలు దగ్గరపడేకొద్దీ పార్టీల్లో, ప్రచారంలో వేడి పెరుగుతోంది. రోజురోజుకు అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సామగ్రికి ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. పార్టీలన్నీ ఒకదాన్ని మించి మరొకటి ప్రచారంలో పోటీపడుతూ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఎనలేని పాట్లు పడుతున్నాయి. ప్రమోషన్ కటౌట్లు, బ్యానర్లు, స్టికర్లు తదితర ప్రచార సామగ్రిని వినియోగిస్తున్నాయి. వీటి కోసం భారీగా ఆర్డర్లు ఇస్తున్నాయి. ముఖ్యంగా బ్యానర్లు, పోస్టర్లకు బాగా గిరాకీ ఉందని వీటి ఉత్పత్తిదారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఎస్పీ, ఆప్ తదితర పార్టీలు పోటీలో ఉన్నాయి. అన్ని పార్టీల సామగ్రికీ గిరాకీ ఉందన్నారు. -
ఈసారి ‘వైఎంఏ’ మద్దతు ఎవరికో!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిసారి మిజోరమ్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘యంగ్ మిజో అసోసియేషన్ (వైఎంఏ)’ ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తుందో ఆ పార్టీయే విజయం సాధిస్తూ వస్తోంది. 1998–2003 ఎన్నికల్లో మిజోరం నేషనల్ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీయే విజయం సాధించింది. ఆ తర్వాత 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా వైఎంఏ మద్దతుతో కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నవంబర్ 28వ తేదీన జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వాన ‘ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి’ కూడా రంగప్రవేశం చేయడంతో వైఎంఏ ఈసారి ఎవరికి మద్దతు ఇస్తున్నది ఆసక్తిగా మారింది. యంగ్ మిజో అసోసియేషన్ ఏ రాజకీయ పార్టీతోని అనుబంధం లేకుండా పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థకు రాష్ట్రవ్యాప్తంగా 4,27,323 మంది సభ్యులు ఉన్నారు. సామాన్యంగా వీరంత నాయకత్వం మాటకు కట్టుబడి ఓటేస్తారు. మొత్తం రాష్ట్ర జనాభాలో వైఎంఏ సభ్యుల సంఖ్య దాదాపు 40 శాతం ఉండడంతో వారు ఎవరికి ఓటేస్తే ఆ పార్టీనే విజయం సాధిస్తూ వస్తోంది. అందుకని ఎన్నికల బరిలో దిగే ప్రతిపార్టీ వైఎంఏ మద్దతును కూడగట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ సంఘంలోని వివిధ విభాగాలు, వివిధ కమిటీలు రాజకీయాలకు అతీతంగా చర్చలు జరిపి ఎవరికి ఓటు వేస్తే రాష్ట్ర ప్రయోజనాలకు మంచిది? ఏ పార్టీ అయితే రాష్ట్రంలో అభివృద్ధి కార్యకమాలు కొనసాగుతాయి? అన్న అంశాలతోపాటు గత ప్రభుత్వం పాలనాతీరును కూడా క్షుణ్ణంగా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాయి. 91 శాతం అక్షరాస్యత కలిగిన మిజోరంలో ఈ సంఘం సభ్యులు చాలా చైతన్యవంతులు. వారికి రాజకీయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంటుంది. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో సభ్యులంతా చురుగ్గా పాల్గొంటారు. అన్నింటికీ ప్రభుత్వం మీద ఆధారపడరు. మురికి వాడలను శుద్ధిచేయడంలో స్వచ్ఛందంగా పాల్గొంటారు. అత్యవసరమైన ప్రాంతాల్లో సంఘం తరఫున రోడ్లు వేస్తారు. మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. ఆపదలో ఉన్న పేదలను ఆదుకుంటారు. ఏ కుటుంబంలో ఎవరు చనిపోయినా సంఘం సభ్యులు వెళ్లి దగ్గరుండి దహన సంస్కారాల వరకు అన్ని చూసుకుంటారు. శ్మశానంలో సమాధి కోసం గోతులు కూడా స్వయంగా తవ్వుతారు. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన కుటుంబం వెంట సంఘం సభ్యులు కనీసం మూడు రోజులు ఉంటారు. ఆ సందర్భంగా వారికి అన్ని విధాల అండగా ఉంటారు. ప్రకృతి వైపరీత్యాల సంభవించినప్పుడు కూడా సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. 804 బ్రాంచీలు, 17 కమిటీలు వైఎంఏకు రాష్ట్రవ్యాప్తంగా 47 గ్రూపు యూనిట్లు, 804 బ్రాంచీలు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనే కమిటీతోపాటు సంగీతం, సాహిత్యం, క్రీడలకు కలుపుకొని మొత్తం 17 కమిటీలు ఉన్నాయి. వీటన్నింటిపైనా ఆరుగురు కార్యవర్గ సభ్యులతో సెంట్రల్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి మాత్రం ఆవిర్భావం నుంచి ఇంతవరకు ఒక మహిళ కూడా ఎన్నిక కాలేదు. గత మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు మహిళలు పోటీ చేయగా, ఈసారి ఎన్నికల్లో 15 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. యువతే ఉండాల్సిన అవసరం లేదు యంగ్ మిజో అసోసియేషన్ అనగానే ఇందులో యువతీ యువకులే ఉంటారని ఎవరైనా అనుకోవచ్చు. 14 ఏళ్ల దాటిన మిజోలందరూ ఐదు రూపాయల రుసుము చెల్లించి ఈ సంఘంలో చేరవచ్చు. సభ్యత్వం పునరుద్ధరణకు వారు ప్రతి ఏటా ఐదు రూపాయలు చెల్లిస్తూ పోవాలి. అలా జీవితాంతం సంఘంలో సభ్యులుగా కొనసాగవచ్చు. సభ్యత్వం వద్దనుకుంటే ఏ వయస్సులోనైనా వదులుకోవచ్చు. ఈ సంఘాన్ని 1935లో ఓ క్రైస్తవ మిషనరీ ఏర్పాటు చేసింది. స్వాతంత్య్రానంతరం నుంచి ఏ క్రైస్తవ మిషనరీతో సంబంధం లేకుండా స్వచ్ఛంద సంస్థగానే ఇది పనిచేస్తూ వస్తోంది. ఇందులో మెజారిటీ సభ్యులు క్రైస్తవులే అయినప్పటికీ ఏ మతస్థులైనా చేరవచ్చు. మిజోరం మొత్తం జనాభాలో 85 శాతం క్రైస్తవులే అన్న విషయం తెల్సిందే. సంప్రదింపుల ద్వారా ఓ నిర్ణయం ఏ రాజకీయ పార్టీకి మద్దతివ్వాలనే అంశంపైన వీరు వివిధ స్థాయిల్లో, వివిధ గ్రూపులతో సంప్రతింపులు, చర్చలు జరిపి ఓ నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయాన్ని అధికారికంగా బయటకు వెళ్లడించరు. లోపాయికారిగానే సందేశం వెళుతుంది. ఆ సందేశానికి దాదాపు 90 శాతం మంది సభ్యులు కట్టుబడి ఓటేస్తారు. ఈ సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా భయపడిందంటే సంఘానికున్న శక్తిని అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల అధికారికి వ్యతిరేకంగా ఆందోళన నవంబర్ ఆరవ తేదీన సంఘం సభ్యులు దాదాపు 50 వేల మంది తరలివచ్చి ఎన్నికల సంఘం కార్యాలయాన్ని చుట్టుముట్టారు. వారి ఒత్తిడికి తలొగ్గిన ఎన్నికల సంఘం ఓ ఉద్యోగిని బదిలీ చేసింది. త్రిపుర శిబిరంలో తలదాచుకుంటున్న 32 వేల మంది శరణార్థి బ్రూలు ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినందునే వారు ఎన్నికల అధికారిపై మండిపడ్డారు. రాష్ట్రంలో మైనారిటీలైన బ్రూలన్నా, చక్మాలన్నా ఈ సంఘం సభ్యులకు పడదు. అందులో అగ్రవర్ణాల వారు ఎక్కువగా ఉండడం కారణమని మైనారిటీలు ఆరోపిస్తున్నారు. వీరంతా అక్రమంగా తమ రాష్ట్రానికి వలస వచ్చిన వారన్నది వైఎంఏ నమ్మకం. అందుకనే ప్రతి ఎన్నికల సందర్భంగా మైనారిటీల నుంచి ఎవరికి టిక్కెట్లు ఇవ్వరాదని ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ సంఘం విజ్ఞప్తి చేయడం పరిపాటిగా మారింది. కొన్ని సార్లు వీరి మాటను రాజకీయ పార్టీలు విన్నాయి. కొన్ని సార్లు సున్నితంగా తిరస్కరించాయి. ఏదిఏమైనా సంఘం మద్దతే పార్టీకి విజయం. సంప్రతింపుల్లో సంఘం సభ్యులు ఈసారి కూడా కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెల్సింది. -
ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న తుది దశ పోలింగ్
రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లో తుది దశ పోలింగ్ కొనసాగుతుంది. 19 జిల్లాలోని 72 నియోజకవర్గాలకు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 90 స్థానాలు ఉన్నా చత్తీస్‌గఢ్ అసెంబ్లీకి తొలి దశలో 18 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపు నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈసీ మొత్తం 19,296 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రమణ్‌సింగ్ ప్రభుత్వంలోని 9 మంది మంత్రులు, స్పీకర్‌తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ భూపేశ్ బఘేల్, అజిత్ జోగి సహా ఇరు పార్టీల కీలక నేతల భవిష్యత్ నేడు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఛత్తీస్‌గఢ్‌లో నాలుగోసారి అధికారం చేపట్టాలని బీజేపీ, 15 ఏళ్లుగా కొనసాగుతున్న విపక్ష హోదాను అధికార పక్షంగా మార్చుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీఎస్పీ, అజిత్ జోగికి చెందిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్, సీపీఐల కూటమి కూడా విజయంపై ఆశలు పెట్టుకుంది. కాగా, 72 స్థానాల్లో 1,079 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
జంగ్..మైదాన్ కా!
ఛత్తీస్‌గఢ్‌లో నేడు రెండో విడత పోలింగ్ జరగనుంది. మావోయిస్టుల ప్రాబల్యమున్న 18 నియోజకవర్గాల్లో తొలి విడతలో ఎన్నికలు జరగగా.. మిగిలిన 72 స్థానాల్లో మంగళవారం ఓటు పండగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఛత్తీస్‌గఢ్‌లో అసలు రాజకీయానికి రెండో విడత వేదిక కానుంది. తొలి విడతలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ నెలకొంది. కానీ రెండో దశలో అజిత్ జోగి కారణంగా రెండు ప్రధాన పార్టీలకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. దీంతో రెండో విడతలో మూడుముక్కలాట ఖాయంగా కనబడుతోంది. ఈ విడత ఎన్నికలు జరిగే స్థానాల్లో జోగి–బీఎస్పీ ప్రభావముండే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలున్నాయి. దీనికితోడు బీఎస్పీకి సన్నిహితంగా ఉండే సత్నామీలు ఈ నియోజకవర్గాల్లో నిర్ణయాత్మకం ఓటర్లు. రాజకుటుంబాల ప్రభావం ఉండే 14 ఆదీవాసీ నియోజకవర్గాల్లోనే రెండో దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో బీజేపీకి గట్టిపట్టుండగా.. ఈసారి వీటిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. కాగా, అటు రమణ్‌సింగ్ అభివృద్ధి ఇమేజ్ కారణంగా మెరుగైన స్థానాలు సాధిస్తామని బీజేపీ భావిస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతే తమకు సీఎం పీఠాన్ని అప్పగిస్తోందని అనుకుంటోంది. అటు, మొదటి విడతతో పోలిస్తే రెండో దశలో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా లేనప్పటికీ.. భద్రతను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే 76.28% శాతం పోలింగ్ జరగడంతో మైదాన ప్రాంతాల్లో ఓటింగ్ శాతం మరింత ఎక్కువగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బరిలో కోటీశ్వరులు, నేర చరితులు ఈ సారి ఎన్నికల బరిలో అదృష్టం పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో కోటీశ్వరులు, నేరచరితులు ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ పడుతున్న 1,079 మంది అభ్యర్థుల్లో 130 మందికి నేరచరిత్ర ఉంది. వారిలో 90 మందిపై హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసులున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించిన వివరాల ప్రకారం కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ మంది నేరచరితులకు టికెట్లు ఇచ్చింది. ఆ పార్టీ నుంచి పోటీ పడుతున్న వారిలో 18 మందిపై తీవ్రమైన కేసులున్నాయి. 17 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండోస్థానంలో ఉండగా.. అజిత్ జోగి పార్టీ జేసీసీ నుంచి 15 మంది, బీజేపీ తరఫున ఆరుగురు నేరచరిత కలిగిన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక కోట్లకు పడగలెత్తిన అభ్యర్థుల్లో బీజేపీ ముందు వరసలో ఉంది. బీజేపీ అభ్యర్థుల్లో 61 మంది కోటీశ్వరులుంటే, కాంగ్రెస్ 53 మందికి, జేసీసీ 35 మందికి టికెట్లు ఇచ్చింది. అంబికాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత (కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రచారం) టీఎస్ సింగ్‌దేవ్ రూ.500 కోట్లకు పైగా ఆస్తులతో అత్యంత ధనిక అభ్యర్థిగా నిలిచారు. హెల్ప్ అంటే రమణ్ రెండు నెలల క్రితం బస్తర్ ప్రాంతంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలి కుమారుడికి పాము కరిస్తే, ఆమె సాయం కోసం ఫోన్ చేసింది సీఎం రమణ్ సింగ్‌కే. వెంటనే రమణ్ సింగ్ హెలికాప్టర్లో ఆ అబ్బాయిని తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. సరైన సమయానికి రాయపూర్ ఆస్పత్రిలో చికిత్స జరగడంతో ఆ అబ్బాయి బతికి బయటపడ్డాడు. ఈ ఒక్క ఘటన చాలు.. విపక్షాల్లోనూ సీఎం రమణ్‌సింగ్‌కు ఉన్న ఇమేజ్ గురించి చెప్పడానికి. కేవలం ఇదొక్క సంఘటనే కాదు ప్రజలతోనూ ఆయన మమేకమవుతారనడానికి ఉదాహరణలు కోకొల్లలు. ఆయనకున్న వ్యక్తిగత ఇమేజ్ కారణంగానే మళ్లీ అధికారంలోకి వస్తామని బీజేపీ భావిస్తోంది. ‘చావల్ బాబా’గా పౌరసరఫరా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచారు. సెల్ ఫోన్ విప్లవాన్ని తీసుకువచ్చి రాష్ట్రాన్ని సాంకేతికంగానూ పరుగులు పెట్టించారు. సుపరిపాలనతో.. అన్ని వర్గాలను కలుపుకొని పోవడంలో కూడా రమణ్సింగ్ది ప్రత్యేకమైన శైలి. మావో సమస్యను ఉక్కుపాదంతో అణిచేసిన జాతీయవాదిగా, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలతో సామాజికవాదిగా, పారిశ్రామికంగా రాష్టాన్ని పరుగులు పెట్టించిన అభివృద్ధి కారకుడిగా రమణ్ సింగ్‌కు రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతే ఆయుధంగా.. సరిగ్గా ఎన్నికల తేదీల ప్రకటనకు ముందు ప్రదేశ్ కాంగ్రెస్కమిటీ అధ్యక్షుడే బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌లో నాయకత్వలేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు నేతలు తమను తాము సీఎం అభ్యర్థులుగా ప్రకటించుకుంటున్నప్పటికీ.. లోటు మాత్రం స్పష్టంగా కనబడుతోంది. ఈ సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వ పగ్గాలు అందుకునేందుకు ప్రభుత్వ వ్యతిరేకతపైనే నమ్మకముంచింది. గత మూడుసార్లు స్వల్ప తేడాతోనే ఓడినందున ఈసారి ఆ తప్పులు చేయకుండా పట్టుబిగించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. రైతుల్లో ఉన్న అసంతృప్తిని గమనించిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లో రుణమాఫీ చేస్తానని తొలిదశ పోలింగ్ ప్రచారం ముగిసే ముందు ప్రకటించారు. 15 ఏళ్ల పాలన కారణంగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకునేందుకు.. రైతులు, మహిళలు, యువతను ఆకట్టుకునే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించింది. తొలిదశలో 76% పోలింగ్ జరగడంతో (ఎక్కువ పోలింగ్ జరిగితే అధికార పార్టీకి నష్టమనే భావనలో) దీని ప్రభావం రెండోదశలోనూ ఉంటుందని.. అది తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. జోగి ఝలక్ ఎవరికి? ద్విముఖ పోరుంటే గెలిచేది నువ్వా–నేనా అనేది తేలిపోతుంది. మూడో పార్టీ/వ్యక్తి రంగంలో వస్తే.. విజయం ఎవరిని వరిస్తుందనేది ఊహించడం కష్టం. అదే పరిస్థితి ఛత్తీస్‌గఢ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందనుకున్న సమయంలో ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ (జేసీసీ) పేరుతో జోగి పోటీలోకి రావడం సమీకరణాలు మార్చేసింది. ఇది బీజేపీ, కాంగ్రెస్‌లకు ఇబ్బందికర పరిణామమే అయినా.. రెండు పార్టీలూ అవతలి పార్టీకే.. జోగితో నష్టమని ప్రచారం చేసుకుంటున్నాయి. 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి బయటకు వచ్చి కేజేపీని స్థాపించిన యడ్యూరప్ప కారణంగా.. బీజేపీకి తీవ్ర నష్టం జరిగింది. ఇప్పుడు అదే సీన్ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ విషయంలో పునరావృతం అవుతుందనే అంచనాలపై చర్చ జరుగుతోంది. నామమాత్ర తేడాతోనే.. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఓట్లు, సీట్ల పరంగా అత్యంత స్వల్ప తేడాతో బీజేపీ గట్టెక్కింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంస్థాగత ఇబ్బందులే కారణమనేది సుస్పష్టం. అయితే ఈసారి గతంలోలాగా పొరపాట్లు చేయకుండా.. అధికార పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. 15ఏళ్ల రమణ్‌సింగ్ పాలనతో విసిగిపోయిన జనాలు తమ విజయంలో కీలకమవుతారని భావించింది. ఈ ఆశలకు మాజీ సీఎం, గతంలో కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న అజిత్ జోగి రూపంలో ఎదురుదెబ్బ తగలనుంది. జోగి పార్టీ జేసీసీ కారణంగా కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ ఇబ్బందులు పడుతోంది. కాంగ్రెస్‌కు పట్టున్న దళిత స్థానాల్లో బీఎస్పీతో జోగి దెబ్బకొట్టొచ్చని విశ్లేషణలున్నాయి. హిందీరాష్ట్రాల్లో 2003 నుంచి గణాంకాలు పరిశీలిస్తే కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐల ఓట్లు కలిపితే.. బీజేపీ కన్నా ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్, జోగి కలిసి పోటీ చేసుంటే.. బీజేపీ ఓటమి ఖాయమనే వాదన వినిపించింది. కానీ ఇందుకు ఇటు కాంగ్రెస్, అటు జోగి ఇద్దరూ అంగీకరించలేదు. ఇప్పుడు ఈ త్రిముఖ పోరులో జోగి కారణంగా అంతిమంగా బీజేపీకే మేలు జరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బీఎస్పీ ఎంట్రీతో.. బీఎస్పీ యూపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కాకపోయినా.. గెలిచే పార్టీల అవకాశాలను మాత్రం దెబ్బతీస్తోంది. ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. అలాంటి బీఎస్పీ.. ఈసారి జోగితో జతకట్టడం ఎవరి ఓట్లకు నష్టమనేది చర్చనీయాంశమైంది. ఈ చర్చే జోగిని ఈసారి ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక వ్యక్తిగా మార్చింది. జోగి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందున.. ఆయన వల్ల కాంగ్రెస్‌కే నష్టమనే వాదనలు వినబడుతున్నాయి. జోగి–బీఎస్పీ కూటమిలో సీట్ల పంపిణీ కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. రాష్ట్రంలో ఈ కూటమి తరఫున 55 సీట్లలో జేసీసీ బరిలో ఉంది. వీటిలో మెజార్టీ స్థానాల్లో 2008, 2013లో కాంగ్రెస్ మంచి ప్రదర్శన చూపింది. ఎస్సీ, ఎస్టీలే కీలకం రాష్ట్రంలో గణనీయంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ ఓటర్లు మాయావతి, జోగి జట్టుకట్టడంతో.. మూడో కూటమి వైపు మొగ్గు చూపుతారని అంచనా. 9 ఎస్సీ రిజర్వ్డ్, 17 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో మూడో కూటమి ప్రభావం ఉండొచ్చు. కూటమితో పొత్తు ఉండుంటే.. ఈ సీట్లలో కాంగ్రెస్‌కు మేలు జరిగేది. పొత్తు లేకపోవడంలో ఈ త్రిముఖ పోటీలో బీజేపీ కష్టంమీద గెలిచే అవకాశాలున్నాయని అంచనా. ఈసారి ఎస్సీల్లోని సత్నామీ వర్గం ఓట్లను గెలిచేందుకు కాంగ్రెస్ కొత్త వ్యూహం పన్నింది. సత్నామీల గురువులు ముగ్గురిని చేర్చుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. నేటి రెండోదశే నిర్ణయాత్మకం! 72 నియోజకవర్గాల్లో మంగళవారం పోలింగ్ జరగనుంది. మైదాన ప్రాంతాల్లో జరిగే ఈ ఓటింగే ఎన్నికల్లో నిర్ణయాత్మకం కానుంది. అజిత్ జోగికి చెందిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జేసీసీ) ప్రభావం అత్యధికంగా ఉండే ఈ ప్రాంతాల్లో ముక్కోణపు పోటీ ఎవరికి లాభం చేకూరుస్తుందో? ఎవరు నష్టపోతారో? అనేది విశ్లేషకులకూ అంతుచిక్కడం లేదు. గత మూడు ఎన్నికల్లోనూ ముక్కోణపు, బహుముఖ పోటీల కారణంగా బీజేపీకే లాభం చేకూరింది. ఈ సారి బీఎస్పీతో జతకట్టి బరిలో దిగిన అజిత్ జోగి కూడా కాంగ్రెస్ ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి మేలుచేస్తారనే అంచనాలైతే బలంగా ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో 14% ఉన్న సత్నామీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. జోగికి సత్నామీల్లో పట్టు ఉంది. ఈ వర్గం బీఎస్పీకి శాశ్వత ఓటు బ్యాంకు కూడా. బీఎస్పీ–జేసీసీ కూటమి బలమైన శక్తిగా అవతరించడానికి కారణం కూడా ఈ వర్గమే. మధ్య ఛత్తీస్‌గఢ్‌లో సత్నామీలు ఎక్కువగా ఉన్న 10 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో జోగి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బిలాస్పూర్, జంజీగర్ ప్రాంతాల్లో ఈ కూటమి తన ప్రభావాన్ని చూపిస్తుందన్న అంచనాలున్నాయి. జంజీగర్, చంపా వంటి స్థానాల్లో బీజేపీ నుంచి పార్టీ ఫిరాయించి బీఎస్పీలో చేరిన వారున్నారు. అలాంటి స్థానాల్లో గెలుపు ఎవరిదో అంచనా వేయడం సంక్లిష్టంగా మారింది. ఇలా మొత్తం 12 స్థానాల్లో గెలుపోటములు అంచనా వేయడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సత్నామీల గురువు గురు బాలదాస్.. కాంగ్రెస్‌తో చేతులు కలపడంతో ఆ సామాజిక వర్గం ఓట్లు ఎటు మళ్లుతాయనేది ఆసక్తికరంగా మారింది. అజిత్ జోగి, మాయావతి కూటమి 6–7% ఓట్లను కొల్లగొట్టగలరని అంచనాలున్నాయి. ఈ ఓట్ల చీలిక ఎవరికి నష్టం చేకూరుస్తుందో.. ఇప్పుడే చెప్పలేని స్థితి. రెండో దశలో ఓబీసీ ఓట్లు కూడా కీలకమే. జనాభాలో 45% ఓబీసీలుంటే వారిలో 22% మంది సాహులు ఉన్నారు. సాహులు సంప్రదాయంగా బీజేపీకే మద్దతు నిలుస్తున్నారు. కాంగ్రెస్‌తో పోల్చి చూస్తే బీజేపీయే సాహులకు ఎక్కువ టిక్కెట్లు ఇచ్చింది. రాజ కుటుంబీకులపై ఆశలు ఆదివాసీ ప్రాంతమైన సుర్గుజాల్లో మొత్తం 14 నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ రాజకుటుంబాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ కుటుంబాలను దగ్గర చేసుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఈ కుటుంబాల వారికే రెండు పార్టీలు కనీసం నాలుగేసి స్థానాల్లో బరిలో దింపాయి. 2000 సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ.. ఈ ప్రాంతంపై బీజేపీదే పట్టు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ కూడా తన బలాన్ని పెంచుకుంటోంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేసులో ఉన్న టీఎస్ సింగ్‌దేవ్ ఈ రాజ కుటుంబాలకు చెందినవారే. ఆయనపై బీజేపీ అదే రాజవంశానికి చెందిన అనురాగ్ సింగ్‌దేవ్‌ను బరిలో దింపింది. బీజేపీలో నేత దిలీప్ సింగ్ జుదావో కూడా ఇక్కడి జష్పూర్కి చెంది రాజ కుటుంబీకుడు. ఆయన కుమారుడు యుధవీర్ సింగ్ చంద్రపూర్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యుధవీర్ భార్య సంయోగిత సింగ్ ఈసారి చంద్రపూర్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. 2003 ఎన్నికల్లో 14 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 10 సీట్లను సాధించింది. 2013 ఎన్నికల్లో ఇరు పార్టీలు చెరిసగం సీట్లను పంచుకున్నాయి. -
సచిన్‌పై యూనస్ ఖాన్ పోటీ!
జైపూర్ : ఉత్కంఠ పోరుకు వేదికగా మారిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. దానిలో భాగంగా కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న పీసీసీ చాఫ్ సచిన్ పైలెట్‌పై ముస్లిం నేత, మంత్రి యూనిస్ ఖాన్‌ను బరిలో దింపింది. రాజస్తాన్‌లో అత్యధికంగా ముస్లిం ప్రాబల్య ప్రాంతమైన టోంక్ స్థానంలో వీరిద్దరు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి బలమైన క్యాడర్ ఉన్న ఈ స్థానంలో 1972 నుంచి ముస్లిం అభ్యర్థినే బరిలో నిలుపుతూ వచ్చింది. బీజేపీ కూడా గత నాలుగు దశాబ్దాల నుంచి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న అభ్యర్థినే పోటీలో నిలిపేంది. కాగా నలభై ఆరేళ్ల తరువాత కాంగ్రెస్ తొలిసారి ముస్లిమేతరులకు టికెట్ కేటాచించడం గమనార్హం. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో రెండు పార్టీలు అభ్యర్థులను మార్చాయి. దీంతో ఈ నియోజకవర్గంపై రాజకీయం రసవత్తరంగా మారింది. నలభైఏళ్ల సాంప్రదాయానికి చెక్‌పెట్టిన కాంగ్రెస్ సచిన్‌ను బరిలోకి దింపడంతో.. చివరి నిమిషంలో తేరుకున్న బీజేపీ మైనార్టీల ఓట్లను దండకుంనేందుకు ముస్లిం అభ్యర్థిని బరిలో నిలిపింది. యూనిస్ ఖాన్ వసుంధర ప్రభుత్వంలో రవాణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సోమవారం నామిషన్లకు చివరి రోజు కావడంతో బీజేపీ విడుదల చేసిన ఐదో జాబితాలో ఆయన పేరును ఖరారు చేసింది. గత ఎన్నికల్లో బీజేపీ తరుఫున కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే గెలిచిన విషయం తెలిసిందే. -
బీజేపీ వివాదాస్పద ఎమ్మెల్యే రాజీనామా
జైపూర్ : ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి తలనొప్పులు తీసుకువచ్చే రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే గయాన్ దేవ్ ఆహూజా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న రామ్‌గఢ్ నియోజకవర్గంలో పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో రాజీనామా చేసినట్లు తెలిపారు. అయినా వెనక్కి తగ్గేదిలేదని, రామ జన్మభూమి, గో రక్షణ, హిందూత్వ వంటి ప్రచార అస్త్రాలతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు ఆయన సోమవారం ప్రకటించారు. గతంలో ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఢిల్లీ జవహర్లాల్ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో అక్కడి విద్యార్థులు ప్రతి రోజూ మూడు వేలకు పైగా కండోమ్‌లు వాడుతారని, అమ్మాయిలు, అబ్బాయిలు విచ్చలవిడిగా తిరుగుతారంటూ వ్యాఖ్యలు చేసి వివాదంతో చిక్కుకున్నాడు. ఇతరులపైనే కాదు సొంత పార్టీ నేతలపై కూడా తలతిక్క మాటలతో విరుచుకుపడడం ఆయన నైజాం. ఇలా ప్రతిసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ఇరకాటంలో పెడతారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీంతో దేవ్ తీరుతో విసిగిన పార్టీ నాయకత్వం ఆయనను పక్కన పెట్టాలని భావించింది. దీనిలో భాగంగానే ఈసారి ఎన్నికల్లో టికెట్ నిరాకరించి.. ఆ స్థానంలో బీజేపీ నేత సక్వుత్ సింగ్‌ను బరిలో నిలిపింది. -
సీబీఐ అంటే వారికి భయం
భోపాల్: బయటకు వెల్లడించలేని రహస్యాలు చాలా ఉన్న వారే సీబీఐ అంటే భయపడతారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రాల్లో సోదాలు, దర్యాప్తులు చేపట్టకుండా ఏపీ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు సీబీఐకిచ్చిన సాధారణ అనుమతిని వెనక్కి తీసుకోవడంపై ఆయన పైవిధంగా స్పందించారు. అలాగే, తమ ప్రభుత్వం చేపట్టిన నోట్లరద్దు రాజకీయ చర్య కాదు, నైతికతకు సంబంధించినదని సమర్థించుకున్నారు. ఈ నెల 28వ తేదీన మధ్యప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలకుగాను శనివారం బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వెల్లడించకూడని ఎన్నో రహస్యాలు ఉన్న వారే తమ రాష్ట్రాలకు సీబీఐ రావద్దంటారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలానా కేసుకు సంబంధించి అని చెప్పలేను. భవిష్యత్‌లో అలాంటి అవకాశం ఉందనే భయంతో తీసుకున్న చర్య అది’ అని అన్నారు. ‘మన సమాఖ్య వ్యవస్థలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలతోపాటు, రాష్ట్రాలు, కోర్టులు అప్పగించిన కొన్ని తీవ్రమైన కేసులను సీబీఐ విచారిస్తుంది. సీబీఐని అడ్డుకున్నంత మాత్రాన పశ్చిమబెంగాల్లో నర్మద, శారదా చిట్ ఫండ్ స్కాంలపై దర్యాప్తు ముగిసినట్లేనని చెప్పలేను’ అని అన్నారు. వివాదాస్పద నోట్ల రద్దును సమర్థించిన అరుణ్ జైట్లీ ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు ‘అత్యంత నైతికమైన’ చర్యగా పేర్కొన్నారు. ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలు ఏడాదికి పది లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీల పంపిణీ వంటి అంశాలతో శనివారం మధ్యప్రదేశ్ బీజేపీ మేనిఫెస్టో ‘సమృద్ధ మధ్యప్రదేశ్ దృష్టి పత్ర’తో పాటు మహిళలకు ప్రత్యేకంగా ‘నారీ శక్తి సంకల్ప పత్ర’ ను విడుదల చేసింది. రైతులకు రూ.40వేల కోట్ల రుణాల పంపిణీ, వచ్చే ఐదేళ్లలో 80 లక్షల హెక్టార్ల భూమిని సాగు యోగ్యం చేయడం, ఆహార శుద్ధి పరిశ్రమకు ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు వంటివి ఇందులో ఉన్నాయి. అందరికీ పని కల్పించడంతోపాటు ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు పేర్కొంది. మహిళల కోసం.. పాఠశాలల్లో శానిటరీ నాప్కిన్ల తయారీ మిషన్ల ఏర్పాటు, 12వ తరగతి పరీక్షల్లో 75శాతం మార్కులు సాధించే వారికి స్కూటీల పంపిణీవంటివి ఉన్నాయి. -
రండి.. రండి.. అక్కడ దొరక్కపోతే ఇక్కడ టికెటిస్తాం!
రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను జయించేందుకు బీజేపీ.. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా మేథోమధనం చేస్తున్నాయి. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాల అనంతరం జాబితాలు విడుదల చేస్తున్నాయి. రాజస్తాన్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచే తీరాలన్న పట్టుదలతో ఈ రెండు పార్టీలున్నాయి. అందుకే ఆ పార్టీ నుంచి వచ్చిన వారికి ఈ పార్టీలో.. ఈ పార్టీ నుంచి వచ్చిన వారికి ఆ పార్టీలో టికెట్లు ఇచ్చేస్తున్నాయి. వాస్తవానికి రెండు పార్టీలు కూడా ఎన్నికలకు ముందు.. కేవలం టికెట్ల కోసమే పార్టీలో చేరే వారికి బీ–ఫారం ఇవ్వొద్దనుకున్నాయి. రాహుల్ గాంధీ ఒక అడుగు ముందుకేసి పక్క పార్టీలనుంచి వచ్చే వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ ‘నో’ చెప్పాల్సిందేనని ఏఐసీసీ సమావేశాల్లో స్పష్టం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. వసుంధరా రాజేను ఓడించాలంటే.. బీజేపీ నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వాల్సిందేనంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్‌కే నచ్చజెబుతున్నారు. దీంతో పారాచ్యూట్ నేతలకు ఇరు పార్టీలు ఎర్రతివాచీ పరుస్తున్నాయి. మొత్తం 152 పేర్లతో విడుదలైన కాంగ్రెస్ జాబితాలో నలుగురు వివిధ పార్టీల నేతలకు టికెట్ ఇచ్చింది. జాబితా విడుదలకు నిమిషాల ముందు పార్టీలో చేరిన వారికీ టికెట్ ఖరారు చేసింది. అటు, బీజేపీ కూడా కాంగ్రెస్, బీఎస్పీ నుంచి వచ్చిన నేతలకు పిలిచి టికెట్లు ఇస్తోంది. ఎమ్మెల్యేలుగా గెలిస్తేనే.. పార్లమెంటుకు 152 పేర్లతో కాంగ్రెస్ విడుదల చేసిన తొలిజాబితాలో పలువురు సీనియర్లకు స్థానం దక్కింది. 2019 ఎన్నికలకు రంగం సిద్ధం చేసే ఉద్దేశంతో మాజీ ఎంపీలు, సీనియర్ నేతలను కూడా ఎమ్మెల్యేలుగా బరిలో దిగాల్సిందేనని ఆదేశించింది. పాతిక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 20 మందికి తొలి జాబితాలో చోటు లభించింది. జాబితా విడుదలకు ఒకరోజు ముందే కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేత హరీష్ మీనాకు డియోలి ఉనియారా టికెట్ కేటాయించగా.. మరో ముగ్గురు బీజేపీ నేతలకు టికెట్లు ఇచ్చారు. సచిన్ తొలి ఎన్నికలు సీఎం రేసులో ఉన్న సచిన్ పైలట్‌కు టోంక్ స్థానాన్ని, అశోక్ గెహ్లాట్‌కు సర్దార్‌పుర సీటును కేటాయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం సచిన్‌కు ఇదే మొదటి సారి. టికెట్ లభించిన సీనియర్లలో కేంద్ర మాజీ మంత్రి సీపీ జోషి, గిరిజా వ్యాస్, రామేశ్వర్ దూది, అజ్మీర్ ఎంపీ రఘు శర్మ, దౌశ ఎంపీ హరీశ్ మీనా, మాజీ ఎంపీ రఘువీర్ మీనా తదితరులున్నారు. గెహ్లాట్‌కు అసెంబ్లీ టికెట్ కేటాయించడాన్ని బట్టి ఆయన్ను రాష్ట్ర రాజకీయాలకే పరిమితం చేయాలని నాయకత్వం భావిస్తున్నట్టు అర్థమవుతోంది. కాగా, కాంగ్రెస్ తొలి జాబితాలో 19 మంది మహిళలు, 9 మంది ముస్లింలు, 30 మంది ఎస్సీలు, 24 మంది ఎస్టీలు ఉన్నారు. 16 మందికి విశ్రాంతినిచ్చిన బీజేపీ కాంగ్రెస్ తొలి జాబితా విడుదలకు ఒకరోజు ముందే 31 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది. సిట్టింగ్‌లలో 16 మందికి టికెట్ నిరాకరించింది. దీంతో రెండు జాబితాల్లో కలిపి మొత్తం 37 మంది సిట్టింగులకు ఉద్వాసన పలికినట్టయింది. 19 మంది మహిళలకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. తొలి రెండు జాబితాల్లో ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా లేకపోవడం గమనార్హం. రాజే వద్దన్నప్పటికీ దాదాపు 13 మంది సీనియర్ నేతల కుటుంబ సభ్యులకు రెండో జాబితాలో చోటు లభించింది. అన్నీ పాత ముఖాలే.. సిట్టింగుల్లో చాలా మందిపై అసంతృప్తి ఉన్నందున కొత్తవారికి టికెట్లు ఇస్తారనే ప్రచారం బీజేపీలో జోరుగా సాగింది. అయితే తొలి రెండు జాబితాలు చూస్తే మాత్రం ఈ కొత్తదనమేదీ కనిపించలేదు. సిట్టింగులకే ఎక్కువ సీట్లివ్వడంతోపాటు.. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన వారికీ ఈసారి అవకాశాన్నిచ్చారు. గెలుపు ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక జరిగిందని బీజేపీ సీనియర్ నేతలంటున్నారు. బికనేర్, షెకావతీ ప్రాంతాల్లో కొత్తవారెవరూ ఆసక్తి చూపకపోవడంతోనే పాతవారికి అవకాశం ఇచ్చామని చెబుతున్నారు. ఎక్కువ సంఖ్యలో కొత్తవారికి అవకాశమిస్తే.. ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్న విషయాన్ని అంగీకరించినట్లవుతుందని పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వసుంధరా రాజే చెప్పారు. ఈ సమయంలో మార్పు మంచిది కాదని ఆమె పేర్కొన్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజేకు వ్యతిరేకంగా వెళ్లొద్దనే బీజేపీ నాయకత్వం భావిస్తోందని సమాచారం. ఏదేమైనా ఇరు పార్టీలు గెలుపుకోసం.. నిర్దేశించుకున్న నిబంధనలు పక్కనపెట్టి మరీ ముందుకెళ్తున్నాయి. రాజేను ఓడించాలని! రాజస్తాన్‌లో రసవత్తర పోరుకు కాంగ్రెస్ తెరలేపింది. ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి వసుంధరా రాజేపై మొన్నటివరకు రాష్ట్ర బీజేపీలో కీలకనేతగా ఉండి.. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మానవేంద్ర సింగ్‌ను పోటీలో నిలుపుతున్నట్లు ప్రకటించింది. మానవేంద్ర సింగ్ రాకతో.. ఝాల్రాపటన్‌లో పోటీ ఆసక్తికరంగా మారింది. బీజేపీ మాజీ నేత, మోదీని విమర్శించిన జస్వంత్ సింగ్ కుమారుడే మానవేంద్ర సింగ్. అయితే.. కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువైనందునే మానవేంద్రను బరిలో దించారని రాజే విమర్శించారు. -
ఇండోర్ బుకీ చెబితే!
క్రికెట్ మ్యాచైనా.. రాజకీయమైనా కాదేదీ బెట్టింగ్‌కు అనర్హం. 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో.. వీటిపైనా బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. బెట్టింగ్ గురించి మాట్లాడుకుంటే.. ఇండోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎన్నికల బెట్టింగ్‌లో జైపూర్, ముంబై తర్వాత ఇండోర్ బుకీలే ఫేమస్. ఇక్కడ బెట్టింగ్‌లో ఫెవరిట్లే ఎక్కువసార్లు విజయాలు సాధించారు. అందుకే టెన్షన్ పుట్టిస్తున్న ఈ ఎన్నికల వాతావరణంలో.. ఇండోర్ బుకీల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. కాగా, ఈ సెమీఫైనల్స్ ఫలితాలపై నెలరోజుల కిందినుంచే పందేలకు తలుపులు తెరిచారు. ఇందులో.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని మొదట్లో భారీగా పందేలు కాశారు. కాంగ్రెస్‌కు 122, బీజేపీకి 90 సీట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ మెల్లగా పరిస్థితులు మారుతున్నాయి. అయితే నామినేషన్ల పర్వం ముగిశాక ఈ ఫలితాలు పూర్తిగా మారిపోతాయని బుకీలంటున్నారు. అల్లాటప్పాయేం కాదు! అయితే.. బెట్టింగ్ కోసం వస్తున్న అంచనాలు నోటికొచ్చినట్లుగా చెప్పరని.. కొన్ని సాంకేతిక అంశాల సాయంతోనే ఎక్కడెక్కడ ఎవరెవరు గెలుస్తారనే అంశాలపై పందెం నిర్వహిస్తామని బుకీలంటున్నారు. ఇష్టం వచ్చినట్లు బెట్టింగ్ నెంబర్లను మారుస్తామని విమర్శిస్తారు. కానీ అవన్నీ అవాస్తవాలంటున్నారు. ప్రజలతో మాట్లాడడం, నియోజకవర్గాల్లో ప్రజలనాడిని గమనించడం ద్వారా సర్వేలు చేశాకే నెంబర్లను అంచనావేస్తామన్నారు. అయితే.. ఇండోర్ బెట్టింగ్ మార్కెట్ ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేస్తుందని పేరుంది. కానీ 2015లో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండోర్ బెట్టింగ్ ఫలితాలు అంచనాలు తప్పాయి. ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ 17 సీట్లు గెలుస్తుందని చెబితే.. ఆ పార్టీ 67 చోట్ల గెలిచింది. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ 203 స్థానాలు వస్తాయంటే.. అనూహ్యంగా ఆ పార్టీ 325 సీట్లను గెలిచింది. ఈ దెబ్బకు గెలిచినవారికి డబ్బులు కట్టేందుకు ఉన్నదంతా ఊడ్చి ఇచ్చామని నిర్వాహకులు వాపోతున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ అభిప్రాయాల్లో మార్పులతో అంకెలు మారతాయని సీనియర్ బుకీ ఒకరు వివరించారు. ఫలితాలొచ్చాకే.. బెట్టింగ్‌లో గెలిచిన వారికి నగదు పంపిణీ జరుగుతుందన్నారు. ఎమ్మెల్యేకు ఎంకామ్ కష్టాలు! మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సురేంద్ర పట్వాకు విచిత్రమైన కష్టమొచ్చింది. ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో ఎంకామ్ చదివినట్లు పేర్కొన్నారు. ఇంతవరకు ఓకే కానీ ఎంకామ్‌ను ఒక్క సంవత్సరంలో పూర్తి చేసినట్లు పేర్కొనడంతోనే చిక్కొచ్చింది. 1983లో తన బ్యాచిలర్ డిగ్రీ, 1984లో ఎంకామ్ పూర్తిచేసినట్లు సురేంద్ర తన నామినేషన్లో పేర్కొన్నారు. ఈ పాయింటే ఇప్పుడు ఆయన ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. సురేంద్ర అఫిడవిట్లో తప్పుడు వివరాలు పేర్కొన్నారని.. ఒక్క ఏడాదిలోనే పీజీ ఎలా పూర్తి చేస్తారంటూ ఆయన ప్రత్యర్థులు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించిన సదరు అధికారి.. మంత్రి నామినేషన్‌ను హోల్డ్‌లో పెట్టారు. విద్యార్హతతోపాటుగా మంత్రి ఆస్తుల విషయంలోనూ అఫిడవిట్లో పొరపాట్లు దొర్లాయి. తన కుటుంబం రూ.36.5 కోట్లు రుణం తీసుకున్నట్లు సురేంద్ర తెలిపారు. మరోచోట తాను చెల్లించాల్సిన రుణాలు రూ.14 కోట్లని వెల్లడించారు. గరం గరం.. ఎన్నికల పకోడీ! ఇటీవల కాలంలో పకోడీ ఉన్నట్లుండి ఫేమస్ అయిపోయింది. దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువైందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందిస్తూ, అందరికీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేదని, పకోడీలు వేసుకొనైనా స్వయం ఉపాధి పొందవచ్చని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ మాటపై భగ్గుమన్న ప్రతిపక్షాలు రోడ్లపై పకోడీలు వేయడం ద్వారా తీవ్రమైన నిరసన వ్యక్తం చేశాయి. మరోపక్క, లూథియానాలో పకోడీలు వేసే ఒక చిరు వ్యాపారి లక్షల్లో ఆదాయపన్ను కట్టి అందరినీ నివ్వెర పరిచాడు. ఇలా కొన్నాళ్లుగా పకోడీ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడిదే పకోడీలను మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి బీజేపీ వాడుకుంటోంది. భోపాల్ ఎమ్మెల్యే సురేంద్రనాథ్ సింగ్ పకోడీలు వేయడం ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారం సందర్భంగా పకోడీలు వేసి అందరికీ పంచుతున్నారు. పకోడీలు వేయడం స్వయం ఉపాధికి, ఆత్మగౌరవానికి ప్రతీకంటూ ప్రచారం చేస్తున్నారు. అసలు పకోడీ వేయడమంటేనే ఒక కళ అని ఆయన అనుచరులంతా చెప్పుకుంటున్నారు. -
సెల్‌చల్..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్‌లకు సవాల్‌గా మారిన సంగతి తెలిసిందే. అందుకే ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో గెలిచేందుకు వీలైనన్ని వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. అందులో ఒకటి. సెల్‌ఫోన్‌తో ప్రజలకు చేరువవ్వడం. నేరుగా పార్టీ నాయకత్వం ప్రజలను చేరుకోవడం కష్టం కనుక.. క్షేత్రస్థాయి కార్యకర్తల ద్వారా ప్రతి ఓటరును చేరుకునేందుకు ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగానే.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈమధ్య ఎక్కడకు ప్రచారానికి వెళ్లినా.. కార్యకర్తలతో ఫోన్లో మాట్లాడుతూ సభకు వస్తున్నారా? అని వాకబు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టుకోసం కాంగ్రెస్.. కాంగ్రెస్ పార్టీ గతంలో అనుసరించిన వ్యూహాలకు భిన్నంగా క్షేత్రస్థాయిపై పట్టుకోసం కొత్త ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా బూత్ స్థాయిలో కార్యకర్తల మద్దతు సాధనకు ‘విద్య’ పేరుతో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఇలాంటి ప్రయత్నాలు చేయడం కాంగ్రెస్‌కు ఇదే ప్రథమం. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఈ పని నడుస్తోంది. డేటా విశ్లేషణ విభాగం అధిపతి ప్రవీణ్ చక్రవర్తి కనుసన్నల్లో ఆయన బృందం మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలోని ప్రతీ బూత్‌స్థాయిలోని కార్యకర్తల వివరాలు నిక్షిప్తం చేశారు. ఏ పోలింగ్‌బూత్‌లో పార్టీ బలంగా ఉంది, ఎక్కడెక్కడ ఏయే కార్యకర్తలపై ఆధారపడవచ్చో.. పార్టీ అభ్యర్థులకు సమాచారం అందజేస్తున్నారు. దీంతో ఈ వివరాలు కావాలంటూ అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని ప్రవీణ్ చక్రవర్తి చెబుతున్నారు. పార్టీ కార్యకర్తల భర్తీకి ఉపయోగిస్తున్న ‘శక్తి’ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా సేకరిస్తున్న డేటాబేస్‌నే విద్య సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచారు. పాతవ్యూహానికి బీజేపీ పదును ఇలాంటి సాంకేతికతను బీజేపీ గత ఎన్నికల్లోనే వినియోగించింది. అయితే.. 2019 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావడంలో భాగంగా కొత్తగా‘సెల్‌ఫోన్ ప్రముఖ్’ పేరిట ప్రచారాన్ని ప్రారంభించింది. దేశంలోని 9,27,533 పోలింగ్‌బూత్‌లకు ఒక్కో సెల్‌ఫోన్ ప్రముఖ్‌ను నియమించింది. ఈ కార్యకర్తకు ఓ స్మార్ట్‌ఫోన్‌ను ఇచ్చి దీని ద్వారా వాట్సాప్ ఆధారిత ప్రచారాన్ని కొనసాగిస్తారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రూపొందించిన పోలింగ్ బూత్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా దీనిని అమలుచేస్తున్నారు. ప్రధాని మోదీ కూడా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా బూత్‌స్థాయి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
అమ్మాయిలకు స్కూటీ, 10 లక్షల ఉద్యోగాలు
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మెట్రో, పది లక్షల ఉద్యోగాలు, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామంటూ హామీల వర్షం కురిపించారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో కలిసి అరుణ్ జైట్లీ బీజేపీ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. శనివారం బీజేపీ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రాజకీయాల అజెండాను మార్చేసింది. ప్రజల కనీస జీవన ప్రమాణాలు పెంచడమే తమ అజెండా అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అరుణ్ జైట్లీ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం గుపించారు. ‘2003 వరకూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ ఏడాది ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే పట్టణాల్లో కూడా తాగు నీరు, రోడ్లు, కరెంట్ వంటి కనీస సౌకర్యాలు లేవు’ అని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే మౌళిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తామన్నారు. గ్వాలియార్, జబల్పూర్ నగరాలకు మెట్రో రైలు సౌకర్యం తీసుకోస్తామని హామీ ఇచ్చారు. ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికలకు స్కూటీ ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో మిని స్మార్ట్ సిటిని నిర్మిస్తామన్నారు. ఈ నెల 28న మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11న ఫలితాలు ప్రకటిస్తారు. 2003 నుంచి మధ్యప్రదేశ్‌లో బీజేపీ పార్టీనే అధికారంలో ఉంది. నాలుగో సారి అధికారం కోసం ఆ పార్టీ శ్రమిస్తోంది. -
‘అసలైన అర్బన్ నక్సల్ అరవింద్ కేజ్రీవాల్’
రాయ్‌పూర్ : అర్బన్ నక్సల్స్‌కి అసలైన ఉదాహరణ ఆమ్ ఆద్మీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారి వ్యాఖ్యానించారు. ఆప్, కాంగ్రెస్ పార్టీలు రెండూ నక్సల్స్‌కు మద్దతుగా నిలుస్తామని ఆయన విమర్శించారు. రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా తివారి శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. దేశ గణతంత్ర దినోత్సవం రోజున ధర్నా నిర్వహించిన ఘనత కేజ్రీవాల్‌కే దక్కుతుందని, ఆయన విధానాలు నక్సల్స్ మాదిరిగానే ఉంటాయని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో దేశంలో నక్సల్స్‌పై ఉక్కుపాదం మోపారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి అర్బన్ నక్సల్స్‌కు మద్దతుగా నిలుస్తున్నారని, సంఘ విద్రోహులను వారు విప్లవకారులుగా కీర్తిస్తారని విమర్శించారు. కశ్మీర్ సరిహద్దుల్లో భారత సైనికులపై తూటలతో దాడులు చేస్తున్న పాకిస్తాన్ ఆర్మీ అధికారిని కాంగ్రెస్ మంత్రి సిద్దూ ఆలింగనం చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ వైఖరేంటో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లోని 72 స్థానాలు రెండో దశ ఎన్నికలు ఈనెల 20న జరగునున్న విషయం తెలిసిందే. -
అసెంబ్లీ ఎన్నికలు.. విధ్వంసానికి ఆల్‌ఖైదా ప్లాన్!
సాక్షి, న్యూఢిల్లీ : పలు రాష్ట్రాల్లో జరగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా కన్నేసిందే. ఎన్నికల్లో విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు ఆల్ ఖైదా రచిస్తోందని ఇంటిలిజెన్స్ అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆల్ ఖైదా కమాండర్ జాకీర్ ముసాను పంజాబ్ సరిహద్దుల్లో భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. పంజాబ్- పాకిస్తాన్ సరిహద్దు నుంచి భారత్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాది జాకీర్ ముసాను శనివారం బీఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. డిసెంబర్ 7న జరిగే రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అలర్లు సృష్టించేందుకు జాకీర్‌ను ఆల్ ఖైదా పంపిణి దూతగా నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని పంజాబ్, రాజస్తాన్ సరిహద్దుల్లో రక్షణ దళాన్ని అలర్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా సరిహద్దు రాష్ట్రాలైన రాజస్తాన్, పంజాబ్‌లు పాకిస్తాన్‌తో 1090 కి.మీ మెర సరిహద్దును పంచుకుంటున్నాయి. దీంతో సరిహద్దుల్లో హైలర్ట్ ప్రకటించినట్లు రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. -
కాంగ్రెస్‌కు నరేంద్ర మోదీ సవాల్
అంబికాపూర్: ధైర్యముంటే గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడిని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ సవాలు విసిరారు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నెలకొల్పిన ప్రజాస్వామ్య విలువల వల్లే చాయ్‌వాలా కూడా ప్రధాని కాగలిగారన్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. తాను ప్రధాని అయినందుకు ఆ క్రెడిట్‌ను కాంగ్రెస్.. ప్రజలకు కాకుండా నెహ్రూకు కట్టబెట్టిందని మండిపడ్డారు. అనంతరం మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌లో జరిగిన మరో ర్యాలీలో ప్రసంగిస్తూ.. ‘నాలుగున్నరేళ్ల చాయ్‌వాలా’ పనితీరుకు, ‘నాలుగు తరాల నెహ్రూ–గాంధీ కుటుంబ’ పాలనకు మధ్య జరిగే పోటీకి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ‘గాంధీ కుటుంబానికి చెందని, నిబద్ధత కలిగిన నాయకుడిని ఐదేళ్లు మీ పార్టీకి అధ్యక్షుడిగా నియమించండి. గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కూడా కాంగ్రెస్ అధ్యక్షుడయ్యే లాంటి ప్రజాస్వామ్యాన్ని నెహ్రూ నిర్మించారని అప్పుడు నేనూ నమ్ముతా’ అని అన్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో తుదివిడత పోలింగ్ ఈనెల 20న జరగనుంది. మధ్యప్రదేశ్‌లో ఒకేవిడతలో 28న జరగనుంది. నాలుగు తరాలా? నాలుగున్నరేళ్లా?.. కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనలో సమకూర్చని విద్యుత్, ఎల్పీజీ, బ్యాంకు సేవలు వంటి సౌకర్యాల్ని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేరువచేసిందని మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మోదీ అన్నారు. ‘ నాలుగు తరాల కాంగ్రెస్ పాలన, నాలుగున్నరేళ్ల చాయ్‌వాలా పాలన మధ్య పోటీ పెడదాం. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందించాలన్న లక్ష్యంతో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బ్యాంకుల్ని జాతీయం చేశారు. కానీ పేదలకు ఈ నిర్ణయంతో ఎలాంటి ప్రయోజనం కలగలేదు. కానీ మా ప్రభుత్వం నాలుగున్నరేళ్లలోనే అందరికీ బ్యాంకింగ్ సేవలు కల్పించింది అని పేర్కొన్నారు. -
ఆ చౌకీదార్‌ను ప్రజలు దొంగ అంటున్నారు!
భోపాల్: గతంలో ప్రతిచోటా అవినీతి గురించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు మాత్రం ఆ మాట ఎత్తడం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘56 అంగుళాల ఛాతీ గురించి మాట్లాడిన మోదీ తనను తాను అవినీతి జరగకుండా కాచుకునే కాపలాదారుడినని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు అవినీతి నిర్మూలనపై నోరు మెదపడం లేదు. ఇప్పుడు మోదీ చౌకీదార్ అని అంటే, ప్రజలు వెంటనే ఆ చౌకీదార్ దొంగ అని అంటున్నారు’ అని శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా దియోరిలో జరిగిన ర్యాలీలో ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని అభివర్ణించారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటి పథకాలు ప్రారంభించినా కూడా ఎన్డీయే హయాంలో రోజుకు 450 ఉద్యోగాల్నే సృష్టిస్తున్నారని, అదే సమయంలో చైనాలో అయితే సుమారు 50 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలకే మరింత ‘మాఫీ’.. ఇప్పటికే కొందరు పారిశ్రామికవేత్తలకు రూ.3.5 లక్షల కోట్ల రూపాయల్ని మాఫీచేసిన ప్రధాని నరేంద్ర మోదీ..త్వరలోనే మిగిలిన రూ.12 లక్షల కోట్లను కూడా రద్దుచేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘ఓసారి మోదీని కలిసి రైతు రుణమాఫీ గురించి అడిగితే ఆయన నోరు మెదపలేదు. కానీ తనకు సన్నిహితులైన పారిశ్రామికవేత్తలకు మాత్రం రూ.3.5 లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేశారు. ఇంకా చెల్లించాల్సి ఉన్న రూ.12 లక్షల కోట్ల రూపాయల్ని కూడా నెమ్మదిగా రద్దుచేస్తారు. నోట్లరద్దు సమయంలో ప్రజలంతా బ్యాంకుల ముందు క్యూలు కడితే..విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లాంటి వారు ప్రజాధనంతో దేశం దాటి వెళ్లేలా మోదీ అనుమతించారు. అప్పుడు అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలు క్యూలో నిల్చోవడం చూశారా?’ అని ప్రశ్నించారు. పంజాబ్, కర్ణాటకలలో మాదిరిగా అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్‌లోనూ 10 రోజుల్లోనే రైతు రుణాల్ని మాఫీచేస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి 10 రోజుల్లోనే ఈ హామీని అమలుచేయకుంటే, ఆయన్ని పదవి నుంచి తొలగిస్తామని చెప్పారు. -
ఇంటింటికా.. ఓకే!
మిజోరం ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్ధులు ఇకపై ఇంటింటి తిరిగి ప్రచారం చేసుకోవచ్చు. ఎన్నికలంటేనే ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకోవడమే కదా, మళ్లీ కొత్తగా చెప్పేదేంటి అనుకుంటున్నారా? ఇది తెలియాంటే మీకు మిజోరామ్ పీపుల్స్ ఫోరమ్ (ఎంపీఎఫ్) గురించి తెలియాలి. ఎన్నికల సమయంలో ఎంపీఎఫ్ సంస్థ వాచ్డాగ్ లాగా పనిచేస్తుంది. చర్చి అండతో ఏర్పాటైన ఎంపీఎఫ్‌లో పలు ప్రభుత్వేతర ప్రముఖ సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. సినిమా భాషలో చెప్పాలంటే ఎంపీఎఫ్ శాసిస్తుంది, ప్రజలు పాటిస్తారు. అదంతే. దాన్నెవరూ మార్చలేరు. ఎంపీఎఫ్ పుణ్యమా అని మిజోరంలో గత రెండు ఎన్నికల సందర్భంగా ఇంటింటి ప్రచారానికి అవకాశం లేదు. ఏదైనా నియోజకవర్గంలో పోటీపడుతున్న వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులందరూ ఒకే ఉమ్మడి వేదికపైనే ప్రచారం చేసుకోవాల్సి వచ్చేది. ఆయా అభ్యర్థులు తమ గుణగణాలు, తామేం చేయదలచుకున్నది ఆ వేదిక ద్వారా ప్రజలకు చెప్పేవారు. అభ్యర్థులు కూడా ఎంపీఎఫ్‌ను కాదని ముందడుగు వేయడానికి సాహసించలేదు. గత రెండు ఎన్నికల్లోనూ ఇదే స్టాండ్ తీసుకున్న ఎంపీఎఫ్ ఈసారికి నిబంధనలను కాస్త సడలించింది. ఒకే వేదిక ప్రచార విధానాన్ని పక్కనపెట్టి ఇంటింటి ప్రచారానికి అనుమతించింది. దీంతో పార్టీలు ఎగిరిగంతేశాయి. అయితే ఎంపీఎఫ్ ఇందుకు కొన్ని షరతులు విధించింది. ఇంటింటికీ తిరిగే అభ్యర్ధుల వెంట కార్యకర్తలు ఉండకూడదు, అభ్యర్థి ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చూసేందుకు ఆయనతోపాటు ఎంపీఎఫ్ ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలి. ఇది వినేందుకు కాస్తంత ఇబ్బదికరంగానే ఉన్నా.. పాపం ఇంటింటి ప్రచారానికి అవకాశం ఇచ్చారుగా అన్న సంతోషంతో పార్టీలన్నీ ఈ నిబంధనకు అంగీకరించాయి. 2006లో ఎంపీఎఫ్ ఏర్పాటైంది. అంతకుముందు ఎన్నికల సందర్భంగా హింస, ప్రలోభాలు తీవ్రస్థాయిలో ఉండేవని, వీటిని అడ్డుకునేందుకే.. చర్చి రంగంలోకి దిగి ఈ ఫోరమ్ ఏర్పరిచిందని ప్రతినిధులు చెప్పారు. తమ సంస్థ ఏపార్టీకీ అనుకూలం కాదని, తాము ఎన్నికల్లో తటస్థంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీఎఫ్ కళ్లు గప్పి ఓటర్లను ప్రలోభపెడుతోందని మిజో పీపుల్స్ మూవ్మెంట్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ఈ ఆరోపణలను ఖండించింది. అయితే.. ఎంపీఎఫ్ సభ్యులను కలుపుకుని ప్రచారానికి వెళ్లడం అసౌకర్యంగా ఉందని మెజారిటీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
క్యాష్ 'పార్టీ' కీలకం
మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ విడిపోయి 18 ఏళ్లవుతుంది. ఈ కాలంలో వివిధ రంగాల్లో రాష్ట్రం పురోగతి సాధించింది. కొత్త ప్రపంచస్థాయి రాజధాని మొదలుకుని చాలా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ప్రగతి ప్రయాణంలోనే.. ఛత్తీస్‌గఢ్‌లో నయా ధనిక వర్గం ఆవిర్భవించింది. ఈ వర్గం స్థానికంగా బలపడుతూ.. రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి చేరేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నయాధనిక వర్గం ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే బీజేపీ, లేదంటే కాంగ్రెస్ అన్నట్లుగా ఉన్న పరిస్థితినుంచి ఈ వర్గం సొంతబలంతో ఎదిగేందుకు కృషిచేస్తోంది. క్రమేణా ప్రధానపార్టీల బలం క్షీణిస్తుండటంతో.. మాజీ సీఎం, కొత్తపార్టీ పెట్టిన అజిత్ జోగి నేతృత్వంలోని మూడో ఫ్రంట్‌తో రాజకీయ ప్రవేశానికి ప్రయత్నాలు చేస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు అవకాశం లభించిన జోగి ఆలోచనలకు ఈ వర్గం అండగా నిలుస్తోందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీకి మార్పు రాష్ట్రం ఏర్పాటయ్యేనాటికి అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 48మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 22 మంది గిరిజన ఆధిపత్యంగల సర్గుజ, బస్తర్ డివిజన్ల నుంచే (మొత్తం 26 సీట్లలో) గెలిచారు. వీటిలో 25 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు. ఇక బిలాస్పూర్, రాయ్‌పూర్, దుర్గ్ డివిజన్లలో ఉన్న 64 సీట్లలో బీజేపీకి 32, కాంగ్రెస్‌కు 29 ఉన్నాయి. రాష్ట్రంలో మొదటి అసెంబ్లీ ఎన్నికల నాటికి (2003) పరిస్థితి మారిపోయింది. బస్తర్, సర్గుజ డివిజన్లలో బీజేపీ పట్టు సాధిస్తే.. బిలాస్పూర్, రాయ్‌పూర్, దుర్గ్ డివిజన్లలో కాంగ్రెస్ పాగావేసింది. 2008 ఎన్నికల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. అయితే, 2013 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ దెబ్బతిన్నాయి. సర్గుజ, బస్తర్‌లలో కాంగ్రెస్ 15 సీట్లే గెలుచుకుంది. 37 మంది కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 26 మంది ఓడిపోయారు. బీజేపీ కూడా ప్రభుత్వ వ్యతిరేకతతో నష్టపోయింది. ఆ ఎన్నికల్లో ఐదుగురు మంత్రులు సహా పలువురు సిట్టింగ్‌లు ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ.. 2004, 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల్లో ఒకరికి మొత్తం 11 సీట్లకు గాను పది సీట్లు దక్కాయి. కానీ.. అసెంబ్లీల్లో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల అభ్యర్ధులు గణనీయమైన ఓట్లు సంపాదించారు. ఈ పరిస్థితిపై ప్రధాన పార్టీల్లో 2014 నుంచి కలవరం మొదలైంది. క్షీణిస్తున్న పార్టీల ఓటుబ్యాంకు రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2018 వరకు ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు రెండింటి ఓటు బ్యాంకులూ క్షీణిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం స్థానిక వర్గం (నయా ధనికవర్గం) బలపడటమే కాక ఎన్నికల ఫలితాలను నిర్ణయించే శక్తిగా ఎదుగుతూ వస్తోంది. ధనబలంతో పాటు కులం బలం ఆధారంగా ఈ వర్గం సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసే సత్తా సంతరించుకుంది. ప్రధాన పార్టీలతో వీరు తలపడటంతో చాలా చోట్ల బహుముఖ పోటీలు అనివార్యమయ్యాయి. ఈ అభ్యర్ధులు ప్రధాన పార్టీల ఓట్లను చీల్చడం వల్ల ఓట్లను నిర్ణయించే స్థితికి చేరుకున్నారు. బ్రాహ్మణులకూ బీఎస్పీ టికెట్లు ఉదాహరణకు బెల్టర నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే (బ్రాహ్మణుడు)ను కాదని పార్టీ జిల్లా అధ్యక్షుడు రజనీష్ సింగ్‌ను నిలబెట్టింది. కాంగ్రెస్ ఓబీసీ అభ్యర్థిని బరిలో దించింది. జోగి–బీఎస్పీ కూటమి పంజాబీ బ్రాహ్మణుడిని పోటీకి దించింది. బీజేపీకి సంప్రదాయకంగా వస్తున్న బ్రాహ్మణుల ఓట్లను రాబట్టుకోవడానికి ఈ కూటమి పంజాబీ బ్రాహ్మణుడిని ఎన్నుకుంది. అలాగే, బీఎస్పీ మద్దతు ఉండటం వల్ల కాంగ్రెస్‌కు పడే దళితుల ఓట్లను కూడా చీల్చే అవకాశం ఉంది. ఏ పార్టీ ఓట్లను ఏ మేరకు చీల్చగలడన్న దానిపై సదరు అభ్యర్థి విజయం ఆధారపడి ఉంటుంది. అలాగే, అకల్తరలో జోగి కోడలు బీఎస్పీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. ఆమెకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కూడా బలమైన వాడే. సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ వ్యక్తి. ఆయన కాంగ్రెస్ ఓట్లు జారిపోకుండా చూసుకోగలిగితే ఆ మేరకు బీఎస్పీ నష్టపోతుంది. లేదంటే బీఎస్పీ అభ్యర్ధి అవకాశాలు మెరుగుపడతాయి. -
ఉల్లంఘనులపై నజర్..
పాల్వంచరూరల్: ప్రస్తుతం శాసనసభ ముందస్తు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. డిసెంబర్ 7వ తేదీన పోలింగ్‌ను నిర్వహించనున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాన్ని ఎన్నుకునేందకు జరిగే ఈ ప్రక్రియలో ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే..వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ఎన్నికల నిబంధనలకు లోబడే అంతా నడుచుకోవాల్సి ఉంటుంది. నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు కఠినంగా వ్యవహరిస్తారు. ఎవరు అతిక్రమించినా చట్టం తనపని తాను చేస్తుంది. ప్రజాప్రాతినిథ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువగా కేసులు నమోదు చేస్తుంటారు. 67 సంవత్సరాల క్రితం అమల్లోకి వచ్చిన (రిప్రజంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్) 1951 ప్రకారం చట్టంలో అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ ఎక్కువగా ఎన్నికల సమయంలో కొన్నింటిని అతిక్రమించిన పార్టీలు, వ్యక్తులపైన ప్రయోగిస్తుంటారు. ఆ శిక్షలేంటో తెలుసుకుందాం. రెచ్చగొడితే జైలుకే.. మతం, జాతి, కులం, సంఘం లేదా భాషా ప్రాతిపాదికపై వర్గాల, పౌరుల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టినా, çశత్రుత్వాన్ని పెంపొందించినా నేరమే. 123 ఆర్పీ యాక్ట్ ప్రకారం అందుకు శిక్ష పడుతుంది. 125 ఆర్పీ యాక్ట్ మేరకు ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందిస్తే..మూడు సంవత్సరాలు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. అలాగే..తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలుకు అర్హులు. ఎన్నికల సమయానికి 48 గంటల ముందు బహిరంగంగా సభలు నిర్వహించినా శిక్ష అర్హులే. అందుకు రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 127 ఆర్పీ యాక్ట్ ప్రకారం..ఎన్నికల సమావేశం సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరిపినా యూఎస్ 42 సీఆర్పీసీ ప్రకారం ఆ వ్యక్తులను అరెస్ట్ చేయొచ్చు. ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండువేల జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. పోస్టర్‌పై పేరు ఉండాల్సిందే.. ఎవరైనా తన పేరు, చిరునామా లేకుండా ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు ముద్రిస్తే ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది. లేదా రెండు వేల రూపాయల జరి మానా లేదా రెండూ అమలు చేయొచ్చు. 128 ఆర్పీ యాక్ట్ ప్ర కారం..బహిరంగంగా ఓటేస్తే 3 నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ అమలుకు అవకాశం. 29 ఆర్పీ యాక్ట్ ఎన్నికలకు సంబంధించిన అధికారులు లేదా పోలీసులు పోటీచేసే అభ్యర్థికి సహకరించినా లేదా ప్రభావం కలిగించినా శిక్షార్హులు. అందుకు మూడు నెలల జైలు లేదా జరిమానా పడుతుంది. 130 ఆర్పీ యాక్ట్ ప్రకారం..పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల లోపల ప్రచారం చేయకూడదు. ఒక వేళ ప్రచారం చేస్తే రూ.250 జరిమానా విధిస్తారు. పోలింగ్ రోజు జరభద్రం.. పోలింగ్ స్టేషన్‌కు దగ్గరలో నియమాలకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారం చేసినా ఏ పోలీస్ అధికారి అయినా ఆ సామగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు. మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. ఓటేసే సమయంలో నియమ నిబంధనలు పాటించని వారికి మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా పడుతుంది. పోలింగ్ బూత్ వద్దకు చేరవేసేందుకు అక్రమంగా వాహనాలు సమకూర్చడం కూడా నేరమే. ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగం చేస్తే శిక్షార్హులే. అందుకు రూ.500 వరకు జరిమానా. 134అ ఆర్పీ యాక్ట్ ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ఏజెంట్‌గా గానీ, పోలింగ్ ఏజెంట్‌గా గానీ లేదా ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏజెంట్‌గా వ్యవహరించినా శిక్షకు అర్హులు. అందుకు మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయొచ్చు. పోలింగ్ స్టేషన్ పరిసరాలకు మారణాయుధాలు కలిగి వెల్లడం నిషేధం. ఈవీఎం అపహరిస్తే..శిక్ష పడుతుంది. సంవత్సరం జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండూ అమలు చేయొ చ్చు. పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు మద్యం అమ్మడం, అందించడం నేరం. అందుకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.2 వేల జరిమానా పడుతుంది. -
హనుమతో కలవరం!
రాజస్తాన్‌లో చిన్న పార్టీలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొన్నటివరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గానే ఉంటుందన్న పోరు ఇప్పుడు మూడో కూటమి రంగంలోకి దిగటంతో మరింత రసవత్తరంగా మారింది. ఇప్పుడు ఈ మూడో కూటమే ఇరు జాతీయ పార్టీలకు చెమటలు పట్టిస్తోంది. గత ఎన్నికల వరకు బీజేపీలోనే బలమైన జాట్‌వర్గం నేతగా ఉన్న హనుమాన్ బేణీవాల్.. గతనెల 29న రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ)ని స్థాపించారు. బీజేపీ సీనియర్ నేతగా ఉండి.. రాజేతో విభేదించి బయటకొచ్చి భారత్ వాహినీ పార్టీ (బీవీపీ)ని ఏర్పాటుచేసిన బీజేపీ ఎమ్మెల్యే ఘన్‌శ్యామ్ తివారీ కూడా ఆర్ఎల్పీతో కలిశారు. మరికొన్ని చిన్న పార్టీలను కలుపుకుని మూడో ఫ్రంట్ ఏర్పాటుకు వీరు సిద్ధమవుతున్నారు. అయితే.. 130 స్థానాలే టార్గెట్‌గా పనిచేస్తున్న ఈ కూటమితో బీజేపీ, కాంగ్రెస్‌ల్లో కలవరం మొదలైంది. 30 చోట్ల పవర్ఫుల్ హనుమ జాట్ వర్గం నేతగా బీజేపీ విజయాల్లో హనుమాన్ పాత్ర విస్మరించలేనిది. రాజస్తాన్‌లో 14–15% జనాభా ఉన్న జాట్లు దాదాపు 30 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. దీంతో హనుమాన్ బేణీవాల్ ఈ నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరనేది సుస్పష్టం. కులాభిమానాలు బలంగా పనిచేసే రాజస్తాన్‌లో ఆర్ఎల్పీ ప్రభావం గణనీయంగా ఉంటుందనేది బీజేపీ, కాంగ్రెస్‌లకు జీర్ణించుకోలేని విషయం. ‘అయితే బీజేపీ లేదంటే.. కాంగ్రెస్ కొన్నేళ్లుగా ఈ రెండు పార్టీలను చూసి చూసి జనం విసుగెత్తిపోయారు. ఈ పార్టీల అవినీతితో విరక్తిచెందారు. అందుకే రాష్ట్ర ప్రజలు మూడో ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. వారి నమ్మకాలను వమ్ము చేయబోం’ అని బేణీవాల్ ప్రచారంలో పేర్కొంటున్నారు. ఈయన ‘కిసాన్ హుంకార్ మహా ర్యాలీ’లకు జనం పోటెత్తుతుండటంతో.. ఏ స్థాయిలో ఈయన ప్రభావం ఉండొచ్చనే అంశంపై అంచనాలు మొదలయ్యాయి. ఘనశ్యాముడూ కలిస్తే.. భారత్ వాహినీ పార్టీ (బీవీపీ)ని స్థాపించిన మాజీ బీజేపీ సీనియర్ నేత ఘన్‌శ్యామ్ తివారీ తక్కువోడేం కాదు. రాష్ట్రంలో 7% ఉన్న బ్రాహ్మణ ఓట్లకు ఘన్‌శ్యామ్ తివారీ నేతగా ఉన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘన్‌శ్యామ్ కూడా సొంతపార్టీ పెట్టుకోవడం బీజేపీకి పెద్ద దెబ్బే. దీనికి తోడు ఘన్‌శ్యామ్ కనీసం 20 స్థానాలను ప్రభావితం చేయగలడు. ఈయనకు బ్రాహ్మణులతోపాటు ఇతర అగ్రవర్ణాల్లోనూ మంచి పట్టుంది. దీంతో ఆర్ఎల్పీ, బీవీపీ కలిసి మూడో ఫ్రంట్‌గా ఏర్పడి పోటీచేయాలని నిర్ణయించాయి. ఈ రెండు పార్టీలు కలిస్తే బీజేపీకే ఎక్కువ నష్టం అని రాజకీయ విశ్లేషకులంటున్నారు. అయితే కాంగ్రెస్‌కు కూడా జాట్, బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాల ఓట్లు తగ్గతాయనే భావనా వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 200 సీట్లలో పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించిన హనుమాన్, ఘన్శ్యామ్లు బీఎస్పీ వంటి పార్టీలతో పొత్తుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే.. 130 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన భావిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్ఎల్పీ 30 చోట్ల గెలవగలదని బేణీవాల్ అంచనా. బీజేపీ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టిన గిరిజన నాయకుడు కిరోలీలాల్ మీనా తిరిగి బీజేపీలో చేరడంతో.. మీనా ప్రభావం ఉన్న 70 చోట్ల వదిలిపెడితే.. మిగిలిన 130 సీట్లలో క్రియాశీలకంగా మారాలని వ్యూహాలు పన్నుతున్నారు. ఎవరీ హనుమాన్? హనుమాన్ బేణీవాల్ 2013 వరకు బీజేపీలో సీనియర్ నాయకుడు. వసుంధరా రాజేపై తరచూ అసమ్మతి గళం వినిపించేవారు. 2013 ఎన్నికలకు ముందు కూడా రాజేపై అవినీతి ఆరోపణలు చేయడంతో పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. దీంతో ఆయన ఎన్నికల్లో ఖిన్వసార్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థిపై 23వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. గత అయిదేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతినే ప్రధానాస్త్రం చేసుకొని విమర్శలు చేస్తున్నారు. 15 రోజుల క్రితం ఆర్ఎల్పీని స్థాపించి.. రాష్ట్రంలో మూడో కూటమి రాగాన్ని ఆలాపిస్తున్నారు. బలమైన జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత. జాట్, ముస్లిం, యాదవ, కుమావట్ వంటి సామాజిక వర్గాల మద్దతు తమకే ఉంటుందని హనుమాన్ భావిస్తున్నారు. ముసుగులో ‘డేరా’ వద్దకు... గత ఎన్నికల సమయంలో డేరా బాబా ఆశీస్సుల కోసం, ఆయన శిష్యగణం ఓట్ల కోసం రాజకీయ నాయకులు బహిరంగంగా ‘డేరా సచ్చా సౌదా’ కేంద్రాలకు క్యూ కట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి బాబా జైలుపాలయ్యాడు. అయితే ఇప్పటికీ డేరా బాబాను అభిమానించే అనుచరగణం గణనీయంగానే ఉంది. దీంతో రాజకీయ నాయకులు సచ్చా సౌదా కేంద్రాల్లో కీలక వ్యక్తుల మద్దతు కోసం పాకులాడుతున్నారు. కానీ గతంలోలాగా బహిరంగంగా ఆయా కేంద్రాల వద్దకు పోతే విమర్శల పాలవుతామన్న భయంతో రహస్యంగా సచ్చాసౌదాల లీడర్లతో మీటింగ్‌లు పెట్టుకుంటున్నారు. పంజాబ్, హర్యానాల్లో డేరా బాబాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ రాష్ట్రాలను ఆనుకుని ఉన్న జిల్లాల్లో ముఖ్యంగా శ్రీగంగానగర్, హనుమాన్‌నగర్ లాంటి ప్రాంతాల్లో చాలామందికి ఇప్పటికీ డేరాబాబా దేవుడికిందే లెక్క. ఎన్నికల వేళ డేరా భక్తగణం అండ ఉంటే ఈజీగా గట్టెక్కవచ్చని నాయకుల అంచనా. అయితే ఇప్పటివరకు ఫలానా నాయకుడికి ఓటేయమని డేరా నుంచి భక్తులకు అధికారిక ఆదేశాలు రాలేదు. గత ఎన్నికల్లో డేరా పాపులారిటీ ఉన్న 11 సీట్లలో 9 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గాల పరిధిలో డేరాకు దాదాపు 10 లక్షల మంది అనుచరులున్నారు. ఇంత కీలకం కాబట్టే రాజకీయపార్టీల నేతలు డేరా అనుగ్రహం కోసం పాకులాడుతున్నారు. సామాన్య ప్రజల్లో పలచనకాకుండా ఉండేందుకు తమ యత్నాలను సీక్రెట్‌గా కొనసాగిస్తున్నారు. -
చెరగని సిరా.. చెదరని ‘ముద్ర’
సాక్షి, హైదరాబాద్: మీ వేలికి ఉన్న సిరాచుక్క దేశ ప్రగతికి దిక్సూచి అన్నట్టుగా... ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికల సమయంలో కీలకభూమిక పోషించడమే కాదు.. అందరికీ సుపరిచితమైన సిరా చుక్క తయారీకి గ్రేటర్ హైదరాబాద్ చిరునామాగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద దేశాలతోపాటు మన దేశంలోని 29 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు రాష్ట్ర రాజధాని నగరం నుంచే సిరా చుక్క ఎగుమతి చేస్తుండటం విశేషం. నగరం కేంద్రంగా మూడు దశాబ్దాలకుపైగా ఈ మహాక్రతువును నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న సంస్థ రాయుడు లేబొరేటరీస్ కావడం విశేషం. వేలిపై సిరా చుక్క.. ఓటుకు చిహ్నం.. మనం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం కూడా సిరా చుక్కే. అందుకే, మన దేశంతోపాటు చాలా దేశాలు ఎన్నికలవేళ ఓటేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి. భారత ఎన్నికల సంఘంలోని నిబంధన 37(1) ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలుపై సిరా గుర్తును పరిశీలించాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిపై ఉంటుంది. ఒకవేళ ఓటరుకు ఎడమ చేయి చూపుడు వేలు లేనట్లయితే వేరే ఏ వేలుకైనా సిరా చుక్క పెట్టాలి. 100 దేశాలకు హైదరాబాద్ నుంచే ఎగుమతి... భారత్‌లో ప్రధానంగా రెండు సంస్థలు మాత్రమే ఎన్నికల సిరాను తయారు చేస్తున్నాయి. కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్(ఎంపీవీఎల్) ఒకటికాగా.. హైదరాబాద్ ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలోని రాయుడు లేబొరేటరీస్ మరొకటి కావడం విశేషం. భారత ఎన్నికల సంఘం మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్‌తోపాటు రాయుడు లెబొరేటరీస్ తయారు చేస్తున్న సిరాను ఎక్కువగా వినియోగిస్తోంది. ’ఎన్నికల కోసం దాదాపు 100 దేశాలకు చెరగని సిరా(ఇండెలిబుల్ ఇంక్)ను సరఫరా చేస్తున్నాం. ఇండియా, శ్రీలంకతోపాటు దక్షిణాఫ్రికా, లిస్బెన్, మడగాస్కర్, నైజీరియా, మాలే, ఒమన్, మాల్దీవులు, మొజాంబిక్, రువాండా, జాంబియా, ఇథియోపియా, ఈస్టర్ తిమోర్ తదితర దేశాలు మా వినియోగదారులుగా ఉన్నాయి’ అని రాయుడు లేబొరేటరీస్ సీఈవో శశాంక్ రాయుడు ‘సాక్షి’కి తెలిపారు. భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో జరిగే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో తమ సిరానే ఉపయోగిస్తున్నారని చెప్పారు. 37 ఏళ్లుగా రాయుడు ల్యాబ్స్ ఇండెలిబుల్ ఇంక్‌ను తయారు చేస్తోందన్నారు. మొదట్లో సిరాను చిన్న(5 మి.లీ) బాటిల్స్‌లో నింపి సరఫరా చేసేవాళ్లమని, 2004 తర్వాత ఇంక్ మార్కర్లను తీసుకొచ్చామన్నారు. ఒక మార్కర్ లేదా ఒక ఇంకు సీసా 500 మంది ఓటర్ల వేళ్లకు సరిపోతుందని పేర్కొన్నారు. ఈ సాంకేతికతను తొలుత ప్రవేశపెట్టింది తమ రాయుడు లేబొరేటరీనేనని ఆయన వివరించారు. పల్స్ పోలియో కార్యక్రమంలోనూ.. పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు గుర్తించేందుకు వారి వేలుపై సిరా చుక్క పెడుతుంటారు. డబ్ల్యూహెచ్‌వో కూడా ఇండెలిబుల్ ఇంక్ కోసం రాయుడు లేబొరేటరీస్ సంస్థతో దీర్ఘకాలిక ఒప్పం దం చేసుకుంది. ఏ దేశంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగినా అక్కడ ఈ సిరానే ఉపయోగిస్తుండటం విశేషం. ఇక యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం గుర్తింపు, యూనిసెఫ్‌తోపాటు, ఐఎస్వో 9001:2015, ఐఎస్వో 14001:2015, డబ్లు్యహెచ్‌వో–జీఎంపీ తదితర ధ్రువీకరణలను రాయుడు సంస్థ సాధించింది. అభివృద్ధి చెందిన జర్మ నీ తదితర దేశాలకు అల్ట్రా వయొలెట్ ఇంక్‌ను కూడా ఈ సంస్థ సరఫరా చేస్తోంది. అల్ట్రా వయొలెట్ సిరా అంటే.. ఈ సిరాచుక్క వేలిపై పెడితే కనిపించదు. కానీ ఓటరు వేలును అతినీలలోహిత కాంతి కింద పెట్టినప్పుడు దర్శనమిస్తుంది. అప్పుడు బోగస్ ఓటరును పసిగట్టే వీలుంటుంది. ఈ సిరా చుక్క ఈజీగా చెరిగిపోదు.. ఎన్నికల్లో వాడే సిరాను సెమి పర్మనెంట్ ఇంక్గా చెప్పొచ్చు. అంటే కొద్ది రోజులపాటు చెదిరిపోకుండా ఉండే సిరా అన్నమాట. ఈ సిరాలో కొన్ని రకాల రసాయనాలతోపాటు 10 నుంచి 18 శాతం వరకు సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది వెలుతురు పడగానే గట్టిగా మారుతుంది. వేలుపై పెట్టిన తర్వాత మూడు నుంచి ఏడు రోజులపాటు చెదిరిపోకుండా ఉంటుందని శశాంక్ తెలిపారు. నాణ్యత, మన్నిక మా చిరునామా నాణ్యత, మన్నికతో కూడిన ఉత్పత్తులను తయారు చేయడమే మా లేబొరేటరీ ధ్యేయం. మూడున్నర దశాబ్దాల క్రితం కృష్ణా–గోదావరి ప్రింటింగ్ ఇంక్ పేరుతో మా సంస్థను స్థాపించాం. 1995లో సంస్థ పేరును రాయుడు లేబొరేటరీస్గా మార్చాం. ఎన్నికల సిరాతోపాటు అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి సర్జికల్ మార్కర్లు, వాటర్ ఎరేజర్లు, ఇతర ఇంక్‌లను తయారు చేస్తున్నాం. మా ల్యాబ్‌లో ప్రస్తుతం 20 మంది పనిచేస్తున్నారు. ఏటా రూ.20 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాం. –శశాంక్ వి.రాయుడు, సీఈవో, రాయుడు లేబొరేటరీస్ -
'ప్రగతి' ప్రదాత ఆమే 'నిర్ణేత'
ఆడది వంటింటి కుందేలనే సామెత ఎప్పుడో పాతదైపోయింది. ఆకాశంలో.. అవకాశంలోనూ సగమని నిరూపిస్తూ అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా దూసుకుపోతున్నారు. భారత్ సహా ప్రపంచదేశాల్లో ఈ మార్పు స్పష్టంగా కనబడుతోంది. అయితే అతివలు తక్కువగా రాణిస్తున్న, వీరి ప్రభావం కొంతమేర మాత్రమే కనిపిస్తున్న ఏకైక రంగం రాజకీయమే. పురుషాధిక్య రాజకీయ రంగంలో చోటుకోసం మహిళ ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ.. వీరికి పట్టు చిక్కడం లేదు. ఆడవారికి 33% రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండూ అటకెక్కింది. ఇంత జరుగుతుంటే మహిళలు రాజకీయాల్లోకి వస్తారా? వస్తే ఏదైనా సాధించగలిగే సత్తా ఉందా? అని ఎవరైనా అనుకుంటే అది అమాయకత్వమే. ఎందుకంటే వరల్డ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనమిక్ రీసెర్చ్ అనే సంస్థ దేశవ్యాప్తంగా జరిపిన పరిశోధనలో అవాక్కయ్యే వాస్తవాలు వెల్లడయ్యాయి. మహిళా ప్రజాప్రతినిధులున్న నియోజకవర్గాలు.. పురుషులతో పోలిస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఈ పరిశోధనలో స్పష్టమైంది. భాగస్వామ్యం పెరుగుతోంది అసలు రాజకీయ నాయకురాళ్లు దేశ ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యానికి సమర్థులేనా? అనే అంశంపై జరిపిన పరిశోధనలో.. మహిళల సామర్థ్యంపై ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలు ఎమ్మెల్యేలుగా, ఇతర ప్రజాప్రతినిధులుగా ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధిపై జరిపిన పరిశోధనలు సరికొత్త విషయాలను ప్రపంచానికి పరిచయం చేశాయి. ‘ప్రభుత్వ ఖర్చులు, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాల్సిన మొత్తాన్ని నిర్ణయించే అంశాల్లో మహిళా రాజకీయ నేతల భాగస్వామ్యం మెల్లిగా పెరుగుతోందని మా సర్వేలో తేలింది’ అని పరిశోధకులు తెలిపారు. అభివృద్ధిలో ముందంజ 1992 నుంచి 2012 వరకు దేశవ్యాప్తంగా 4,265 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పరిశోధన నిర్వహించారు. దీంట్లో.. మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 4.5% నుంచి 8% పెరిగినట్లు వెల్లడైంది. పురుషులతో పోలిస్తే మహిళా రాజకీయ నేతలకు నేరచరిత తక్కువగా ఉంటోంది. మహిళలు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో పురుష ఎమ్మెల్యేల కన్నా 15.25% అభివృద్ధి ఎక్కువగా జరిగినట్లు వెల్లడైంది. ఈ స్థానాల్లో జీడీపీలోనూ 1.85% ఎక్కువ వృద్ధి కనిపించింది. పనిపైనే శ్రద్ధ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లను పరిశీలిస్తే.. పురుషులపై కేసులు మహిళలతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. పురుష ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడటం, ఆస్తులు సంపాదించుకోవడం వంటి కార్యక్రమాలపైనే ఆసక్తి చూపుతున్నారు. మౌలిక వసతుల కల్పనలోనూ మహిళా నేతలున్న నియోజకవర్గాలు ముందంజలో ఉన్నాయి. ఇద్దరూ నిధులు తీసుకురావడంలో సమానమైన ఆసక్తులే కనబరుస్తున్నప్పటికీ.. పని పూర్తిచేయడంలో మహిళలు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. దీనికితోడు అనవసర ఖర్చుల్లేకుండా.. ప్రతిపాదిత మొత్తంలోనే ప్రాజెక్టులు పూర్తిచేస్తున్న ఘనత కూడా మహిళలకే దక్కుతోంది. స్ఫూర్తితో ముందుకు పనిలో సాధించిన విజయంతో స్ఫూర్తిని ముందుకు పోవడంలోనూ మహిళలో ముందువరుసలో ఉన్నారు. పనిని విభజన చేసుకుని పూర్తి చేయడంలోనూ వీరిదే పైచేయి. అవకాశవాదంగా వ్యవహరించడంలో మహిళల శాతం తక్కువే. ప్రస్తుత భారతదేశంలో 4,118 ఎమ్మెల్యేలుండగా.. మహిళల సంఖ్య 9% మాత్రమే. 2018 జాతీయ ఆర్థిక సర్వే ప్రకారం దేశ జనాభాలో మహిళల సంఖ్య 48.5%. ఆ రాష్ట్రానికి ఒక మహిళ ముఖ్యమంత్రి. అసెంబ్లీలో మహిళా ప్రాతినిధ్యమూ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువే. 2013 ఎన్నికల్లో వసుంధరా రాజేని గద్దెనెక్కించడంలో మహిళలు కీలక పాత్ర పోషించారు. ఈ సారి కూడా మహిళలనే ఆమె నమ్ముకున్నారు. మరి మహిళా ఓటర్లు రాజేను మళ్లీ సీఎం చేస్తారా? వాస్తవానికి ఒకప్పుడు రాజస్తాన్‌లో మహిళలు ఓటరు జాబితాలో కూడా పేరు ఇవ్వడానికి ముందుకురాలేదు. కానీ వసుంధర రాజే ప్రచార శైలి కారణంగా మహిళల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. ‘మన రాష్ట్రంలో రెండే కులాలు ఉన్నాయి. ఒకటి పురుషులు, రెండు మహిళలు. మహిళా సాధికారత కోసం మేము ఎన్నో పథకాలు తెచ్చాం. ఇక మనం ఎవరి ఎదుట చెయ్యి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి రాదు’ అంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఎన్నికల ర్యాలీల్లో పదే పదే మహిళా ఓటర్లను ఉద్దేశించి చెబుతున్నారు. వసుంధరా రాజేలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. ఎనలేని ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూ, మధ్య మధ్యలో జోకులు వేస్తూ, తన సంభాషణా చాతుర్యంతో ఓటర్లను కట్టిపడేస్తుంటారు. ఎన్నికల సభల్లో ఆమె మాట్లాడుతూ ఉంటే మహిళల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ఆమె ఎన్నికల ర్యాలీలకు మహిళలు పోటెత్తుతున్నారు. రాజే పట్ల ఎనలేని ఆరాధనాభావం కనబరుస్తున్నారు. అయితే అన్ని రంగాల్లోనూ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వసుంధర కేవలం మహిళల అండదండలతో అధికారాన్ని సంపాదించుకోగలరా అన్నది ప్రశ్నే. మరోవైపు కాంగ్రెస్ కూడా మహిళలే తమ తురుపు ముక్కలంటూ ప్రసంగాలు చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మహిళల్ని అందలం ఎక్కిస్తామని, మరో అయిదేళ్లలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సగం వాటిల్లో మహిళల్నే ముఖ్యమంత్రుల్ని చేస్తామంటూ హామీలైతే గుప్పిస్తున్నారు. కానీ సీట్లు విషయానికొచ్చేసరికి మొండిచేయి ఇస్తు్తన్నారు. వెనుకబాటులో మొదటి స్థానం బడికి వెళ్లాల్సిన చిన్నారుల కాళ్లకి మెట్టెలు కనిపిస్తాయి. బంగారం లాంటి బాల్యం నాలుగ్గోడల మధ్య నలిగిపోతుంటుంది. బాల్యవివాహాల్లో ఇప్పటికీ రాజస్థానే టాప్. మహిళలపై అకృత్యాల్లో మూడో స్థానం. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు నలుగురి మధ్యలోకొచ్చి మాట్లాడరు. ఓటరు జాబితాలో పేరు ఇవ్వడానికీ ఇష్టపడరు. ఓటు వెయ్యడానికి వచ్చినా తండ్రి, భర్త, కొడుకు ఎవరికి వెయ్యమంటే వారికే. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో అక్షరాస్యత కేవలం 52%. చదువులేకపోవడం, చిన్నప్పుడే సంసార భారాన్ని మోయాల్సి రావడం వల్ల మహిళల్లో చైతన్యం తక్కువ. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలతో వేలి చుక్కే వజ్రాయుధం అన్న సంగతి గ్రహిస్తున్నారు. 2013లో మొదటిసారిగా అత్యధికంగా మహిళలు ఓటు వినియోగించుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జలోర్ జిల్లా దాదల్ గ్రామంలో 2013లో మొదటి సారిగా మహిళలు పోలింగ్ బూత్‌ల దగ్గర క్యూ కట్టారు. చట్టసభల్లో ఎక్కువే రాజస్థాన్ మహిళల్లో వెనుకబాటు కనిపించినా చట్టసభల్లో ప్రాతినిధ్యం విషయానికి వచ్చేసరికి ఆ రాష్ట్రం ముందువరసలోనే ఉంది. బీహార్ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం రాజస్థానే. మొత్తం 200 స్థానాలున్న అసెంబ్లీలో 2008లో తొలిసారి 29 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ 23 మందికి టిక్కెట్లు ఇస్తే, బీజేపీ 32 మందికి ఇచ్చింది. ఇక 2013లో కాంగ్రెస్ 24 మందికి ఇస్తే, బీజేపీ 26 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. మొత్తం 27 మంది మహిళలు ఎన్నికైతే అందులో బీజేపీ నుంచే 23 మంది ఎన్నికయ్యారు. రాజేతో పాటు నలుగురు మంత్రులుగా ఉన్నారు. రాజే పథకాలు అమ్మాయి పుట్టినప్పటి నుంచి యుక్తవయసు వచ్చే వరకు, పెళ్లి నుంచి ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేంతవరకు వసుంధర రాజే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. బడికి వెళ్లే విద్యార్థినులకు సైకిళ్లు ఇవ్వడం దగ్గర్నుంచి, నిరుపేద మహిళలకు ఉచితంగా మొబైల్ ఫోన్ల వరకు పలు పథకాలు మహిళల మనసుని దోచుకున్నాయి. రాజశ్రీ యోజన , జనని సురక్ష యోజన, మహిళలకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరేలా భామాషా యోజన, ‘ఈ– సఖి’ పేరుతో డిజిటల్ అక్షరాస్యతా కార్యక్రమం, మహిళలకు ఉచిత శానిటరీ నాప్కిన్స్ పంపిణీ, ఇలా మహిళలకు అండగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అంతకు ముందు అశోక్ గెహ్లాట్ సీఎంగా ఉన్నప్పుడు కూడా జనని శిశు సురక్ష యాత్ర, శుభలక్ష్మి యోజన వంటి పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ, రాజే తన పథకాలతో మహిళా ఓటర్లను పూర్తిగా తనవైపు తిప్పుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి మద్దతుతో ఈ సారి రాజే గట్టెక్కుతారా వేచి చూడాల్సిందే. రాజస్థాన్ మొత్తం ఓటర్లు 4.74 కోట్లు మహిళా ఓటర్లు 2.27 కోట్లు - 1972లో వెయ్యి మంది పురుషులకు 723 మహిళలు ఓటు హక్కు వినియోగించుకుంటే 2013 నాటికి వెయ్యి మంది పురుషులకు 899 మంది మహిళలు ఓటు వేశారు. - 2008లో 65% మంది మహిళా ఓటర్లు మాత్రమే ఓటు వినియోగించుకుంటే 2013 వచ్చేసరికి అది 10% పెరిగింది. గత ఎన్నికల్లో 75% మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. (భారత్‌లో మహిళా ఓటర్ల వినియోగం సగటున 65%) మహిళా ఓటర్లు పెరగడం వెనక.. - పెరుగుతున్న అక్షరాస్యత - రాజకీయ వార్తలపై ఆసక్తి పెరగడం - రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనే మహిళల సంఖ్య పెరగడం - స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం లాభమెవరికి? మహిళా ఓటర్ల సంఖ్య పెరగడంతో మొదట వీరంతా కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మహిళాధ్యక్షులున్న పార్టీకే ఆడవారి ఓట్లు ఎక్కువగా పడ్డాయి. కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ, యూపీలో మాయావతి, తమిళనాట జయలలిత, పశ్చిమబెంగాల్లో మమత ఈ వర్గం ఓట్లను సంపాదించుకోగలిగారు. అయితే రాను రానూ వీరిలో వస్తున్న మార్పు కారణంగా ఈ ఓటు బీజేపీవైపు మళ్లుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల పురుషుల్లోనూ, మహిళల్లోనూ సరిసమానమైన ఆదరణ కనిపిస్తున్నట్లు లోక్‌నీతి – సీఎస్డీఎస్ సర్వేలో వెల్లడైంది. మహిళా ఓటర్ల మొగ్గు బీజేపీ వైపు పెరుగుతూ వస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 30% మహిళలు బీజేపీ వైపు ఉంటారన్న సీఎస్డీఎస్ అంచనా వేసింది. మహిళల క్యూ పెరుగుతోంది దేశవ్యాప్తంగా మహిళల ఓటింగ్ శాతం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలతోపాటు రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీస్ (సీఎస్డీఎస్) అనే సంస్థ చేసిన పరిశోధనలో మహిళల ఓటింగ్ శాతానికి సంబంధించి ఆసక్తికర అంశాలు తెలిశాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటింగ్ 65.5% కాగా.. పురుషులు 67% మంది ఓట్లు వేశారు. అంటే పురుషుల, మహిళా ఓటర్ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. సీఎం అభ్యర్ధులపై క్రిమినల్ కేసులు మిజోరంలో కాంగ్రెస్, మిజోనేషనల్‌ఫ్రంట్ తరఫున సీఎం అభ్యర్థులుగా పోటీ పడుతున్న లాల్ థన్వాలా, జోరామ్తంగపై పెండింగ్ క్రిమినల్ కేసులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పెండింగ్ క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలు వీరిద్దరే కావడం గమనార్హం. చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు పెండింగ్ క్రిమినల్ కేసుల వివరాలను గౌహతి హైకోర్టు అందించింది. ఈ కేసులు నిరూపితమైతే ఈ ఇద్దరు జైలు శిక్ష అనుభవించక తప్పదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో నామినేషన్ పేపర్లలో కొన్ని స్థిరాస్తులను దాచిపెట్టి చూపించారని లాల్ థన్వాలాపై కేసు ఉంది. తనపై ఈ కేసు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు థన్వాలా తాజా నామినేషన్ పేపర్లలో వెల్లడించారు. ఈ కేసులు నిరూపితమైతే ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడనుంది. ప్రతిపక్ష నేత జోరామ్తంగపై రెండు పెండింగ్ కేసులున్నాయి. కుట్ర, విధ్వంసం, సాక్ష్యాల విధ్వంసం, అనైతికంగా అధిక ఆస్తులుండడం తదితరనేరాలు ఈకేసుల్లో పోలీసులు ఈయనపై ఆరోపించారు. ఈ కేసులు నిరూపితమైతే ఆయనకు దాదాపు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. ఎన్నికలపై 12 లక్షల ట్వీట్లు ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి గత వారం రోజుల్లో 12 లక్షల ట్వీట్లు రికార్డయ్యాయని సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తెలిపింది. ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ ట్వీట్లలో వినియోగించేందుకు ఒక ప్రత్యేక ఎమోజీని సైతం అందుబాటులోకి తెచ్చామని ట్విట్టర్ తెలిపింది. ప్రజల్లో ప్రముఖంగా చర్చకు వచ్చే అంశాలకు ప్రాచుర్యం కల్పించే చర్యలు చేపట్టామని తెలిపింది. డిసెంబర్ 23 వరకు ప్రజలు AssemblyElections2018 emoji పేరిట ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక ట్వీట్లు చేయవచ్చని తెలిపింది. అన్ని రాష్ట్రాలకు వేర్వేరుగా ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్స్ కేటాయించామని ట్విట్టర్ తెలిపింది. వసుంధరా రాజే.. ఫస్ట్ దేశంలోనే వరుసగా అత్యధిక కాలం మహిళా సీఎంగా పనిచేసిన రికార్డును రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కూడా కొనసాగుతున్న ఆమె...సోమవారానికి 3,639 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంలో రెండో స్థానంలో ఉన్నారు. ఈమె 2,735 రోజులు మహిళా సీఎంగా పనిచేశారు. ఇంకా కొనసాగుతున్నారు. వివిధ దశల్లో ఎక్కువ రోజులు పనిచేసిన సీఎంగా షీలాదీక్షిత్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఈమె మొత్తం వివిధ కాలాల్లో 5504 రోజులు సీఎంగా పనిచేశారు. వీధినాటకాలు..ఇంద్రజాల ప్రదర్శనలు.. సోషల్ మీడియాతో ప్రతి ఓటర్ను చేరవచ్చని ప్రతి పార్టీ భావిస్తున్న తరుణంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు మధ్యప్రదేశ్ బీజేపీ కొత్తపంథా అవలంబిస్తోంది. నవీన సాంకేతికత ఆధారంగా పనిచేసే సోషల్ మీడియాతో పాటు సాంప్రదాయ రూపాలైన వీధినాటకాలు, ఇంద్రజాల ప్రదర్శనలతో ఓటర్లను ఆకట్టుకోవాలని నిర్ణయించింది. చిన్న పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వీధినాటకాలు, ఇంద్రజాల ప్రదర్శనల ద్వారా తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రచారం చేయనుంది. ఇందులో భాగంగా పార్టీ ఆఫీసుకు పలు డ్రామా గ్రూపులను, ఇంద్రజాలికులను పిలిపించి వారిలో సరైనవారిని ఎంచుకొంది. ఇలా ఎంపికైన వారు ఇకమీదట రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు పయనమై బీజేపీ ప్రభుత్వం చేపట్టినఅభివృద్ధి పనులను ప్రజలకు వీధినాటకాల రూపంలో వివరించనున్నారు. ఎంతో వడపోత అనంతరం తాను ఎంపికయ్యానని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అందించిన ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తానని ఒక కళాకారుడు చెప్పాడు. ఈ విధంగా సాంప్రదాయ కళారూపాలను పార్టీ ప్రచారానికి వాడుకోవడం గతంలో కూడా చేశామని బీజేపీ ప్రతినిధి చెప్పారు. వీధినాటకాల కళాకారులతో పాటు ఆరుగురు ఐంద్రజాలికులను కూడా పార్టీ ప్రచారం నిమిత్తం ఎంచుకున్నట్లు చెప్పారు. 2013 ఎన్నికల్లో కూడా చౌహాన్ ప్రభుత్వ కార్యక్రమాలను వివరించేందుకు ఇదే తరహాలో మ్యాజిక్ ప్రదర్శకులను ఎంచుకున్నామని, గుజరాత్ గత ఎన్నికల్లో సైతం ఇలా కళారూపాలతో ప్రదర్శనలు జరిపామని పార్టీ వర్గాలు చెప్పాయి. వీటి ద్వారా మరింత ప్రభావంతంగా ప్రజల్లోకి వెళ్తామన్నాయి. -
దాస్తేనే నేరం
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నేర చరిత్రను కలిగి ఉంటే సదరు అభ్యర్థులతో పాటు వారిని బరిలోకి దింపే రాజకీయ పార్టీలూ నేర చరిత్రను తప్పక ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా అమల్లోకి తెచ్చిన నిబంధన మున్ముందు రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురానుంది. ఇకపై లోక్‌సభ, శాసనసభ, రాజ్యసభ, శాసనమండలి ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నేరాల చిట్టాను స్వయంగా బహిర్గతం చేయాల్సిందే. ఆయా నేరాలకు సంబంధించిన ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న వారు, నేరారోపణలు రుజువై శిక్షæ ఖరారైన వారు ఇకపై ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. ఆ నేరాల చిట్టాను ప్రజల ముందుంచాలి. ప్రస్తుత శాసనసభ ఎన్నికలతో తొలిసారిగా రాష్ట్రంలో అభ్యర్థుల నేరాల చిట్టా ఓటర్ల చేతికి అందబోతోంది. అభ్యర్థుల నేర చరిత్రను పరిగణలోకి తీసుకుని ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించే స్థాయికి ప్రజల్లో చైతన్యం పెరిగితే ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన కొత్త నిబంధన ఎందరో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతుంది. అన్నిచోట్లా అదే చర్చకు అవకాశం! అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పత్రికలు, వార్తా చానళ్లల్లో పెద్దసంఖ్యలో అభ్యర్థుల నేర చరిత్రపై ప్రకటనలు వెలువడే అవకాశాలున్నా యి. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థుల నేర చరిత్ర ప్రకటనలకు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం లభించనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల నేర చరిత్ర ప్రజల్లో చర్చకు దారితీయనుంది. ఓటెయ్యడానికి ముందే ప్రజలు తమ నేర చరిత్రను తెలుసుకోనుండడంతో.. నేరచరిత గల అభ్యర్థులకు ఎన్నికల ఫలితాలపై ఆందోళన తప్పేలా లేదు. సుప్రీంకోర్టు చొరవ.. ఈసీ దూకుడు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే.. ఆ విషయాన్ని అభ్యర్థితో పాటు, ఆ అభ్యర్థికి చెందిన రాజకీయ పార్టీ బహిర్గతం చేయాల్సిందేనని గత సెప్టెంబర్ 25న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇకపై పార్లమెంట్ ఉభయ సభలు, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే నేర చరిత్ర గల అభ్యర్థులతో పాటు అలాంటి అభ్యర్థులను నిలబెట్టే రాజకీయ పార్టీలు నిర్దేశించిన ఫార్మాట్లో డిక్లరేషన్ ప్రచురించాలని కేంద్ర ఎన్నికల సంఘం గత అక్టోబర్ 10న ఆదేశాలు జారీ చేసింది. అయితే, నేర చరిత్రపై పత్రికలు, వార్తా చానళ్లలో జారీ చేసే ప్రకటనల ఖర్చులను అభ్యర్థుల ఎన్నికల వ్యయం కింద జమ చేయరాదని ఇప్పటికే కొన్ని పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితి రూ.28 లక్షలకు మించరాదనే నిబంధన నేపథ్యంలో ఈ ప్రకటనల ఖర్చుకు మినహాయింపు ఇవ్వాలని కోరాయి. కానీ, నేర చరిత్రపై జారీ చేసే ప్రకటనల ఖర్చును సదరు అభ్యర్థులు, పార్టీల ఎన్నికల వ్యయం కింద లెక్కించాలని తాజాగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నేర చరిత్రను ప్రకటించకుంటే ఎన్నికల తర్వాత చర్యలు తప్పవని, సుప్రీం తీర్పు ఉల్లంఘన కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. 5 వరకు నేర చరిత్ర బట్టబయలు - నేర చరిత్ర కలిగిన అభ్యర్థులతో పాటు వారిని పోటీకి దింపే పార్టీలు నియోజకవర్గ స్థాయిలో విస్తృత ప్రజాదరణ కలిగిన పత్రికతో పాటు వార్తా చానల్లో వేర్వేరు తేదీల్లో నేర చరిత్రపై నిర్దేశిత నమూనాల్లో కనీసం మూడు ప్రకటనలు జారీ చేయాలి. - అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను తెలుపుతూ ఫార్మాట్–సీ1లో పొందుపరిచి పత్రిక/చానల్లో డిక్లరేషన్ ప్రచురించాలి. తమ నేర చరిత్రను తమ పార్టీకు తప్పనిసరిగా తెలపడంతో పాటు నేరాల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పొందుపర్చాలి. - నేర చరిత్ర గల అభ్యర్థులను బరిలోకి దింపే పార్టీలు తమ పార్టీ అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను ఫార్మాట్–సీ2లో పొందుపరిచి డిక్లరేషన్ ఇవ్వాలి. దీన్ని పార్టీ వెబ్సైట్లో ప్రదర్శనకు ఉంచాలి. - నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (ఈ నెల 19) నుంచి పోలింగ్ తేదీకి రెండు రోజుల ముందు (డిసెంబరు 5) వరకు కనీసం మూడు వేర్వేరు తేదీల్లో నేరచరితపై డిక్లరేషన్లను ప్రచురించాలి. ఎవరు నేర చరితులు? హత్య, హత్యాయత్నం, అత్యాచారం, అత్యాచారయత్నం, దోపిడీ, దొంగతనాలు, దాడులు, గూండాయిజం, కిడ్నాప్, అవినీతి, అక్రమార్జన, అక్రమ సారా, గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా వంటి తీవ్ర ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న వారితో పాటు ఇలాంటి ఆరోపణలు రుజువై న్యాయస్థానాల నుంచి శిక్షæ పొందిన వారు. పెద్దక్షరాల్లో ‘నేరచరిత’ నేరచరిత గల అభ్యర్థులు.. పత్రికలు, ప్రసార సాధనాల్లో ఇచ్చే ప్రకటనల్లో ‘నేరచరిత’ గురించి ‘బోల్డ్’ (పెద్ద) అక్షరాల్లో ఇవ్వాలి. ఎవరి కంటాపడకుండా చిన్న సైజు అక్షరాల్లో ప్రకటనలిచ్చేసి చేతులు దులుపుకుందామనుకుంటే చెల్లదు. కనీసం 12 సైజ్ ఫాంట్‌తో ప్రకటన ఇవ్వాలి. వార్తా చానల్లో 7 క్షణాల పాటు ఆ ప్రకటనను ప్రదర్శించాలి. నేరాలకు ‘పట్టిక’ కట్టాలి ఎన్నికల సంఘం నిర్దేశించిన పట్టిక రూపంలో అభ్యర్థులు/పార్టీలు నేర చరిత్రను ప్రకటించాలి. విచారణ పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించి కోర్టు పేరు, కేసు నంబర్, ప్రస్తుత స్థితి, ఏ చట్టంలోని ఏయే సెక్షన్లు, నేరానికి సంబంధించిన సంక్షిప్త వివరాలను ప్రకటించాలి. నేరం రుజువై శిక్ష పడితే కోర్టు పేరు, తీర్పు తేదీ, సంక్షిప్తంగా నేరం వివరాలు, విధించిన శిక్షను పట్టికలో చూపాలి. నేరానికి సంబంధించిన సంక్షిప్త వివరాల గడిలో నేర స్వభావమూ తెలపాలి. ..::మహమ్మద్ ఫసియొద్దీన్ -
ముగిసిన పోలింగ్; ఇద్దరు మావోయిస్టుల మృతి
రాయ్‌పూర్ : కట్టుదిట్టమైన భద్రత నడుమ ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నా ఈసారి 70 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. సురక్షిత ఓటింగ్ కోసం భద్రతా దళాలను భారీగా రంగంలోకి దించటంతో పోలింగ్ శాతం పెరిగిందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇక తొంభై నియోజక వర్గాలున్న ఛత్తీస్గడ్ రాష్ట్రంలో రాజ్‌నంద్‌గాం, కొండగాం, కాంకేర్, బస్తర్, నారాయణ్‌పూర్, సుక్మా, బీజాపూర్, దంతేవాడ జిల్లాల పరిధిలోని 18 నియోజకవర్గాల్లో ఈరోజు తొలిదశ పోలింగ్ జరిగింది. వీటిలో మావోయిస్టుల ప్రభావం ఉన్న 10 నియోజకవర్గాల్లో పోలింగ్ మధ్యాహ్నం 3 గంటలకే ముగియగా, మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మిగిలిన 72 నియోజక వర్గాల్లో ఈనెల 20(నవంబరు)న పోలింగ్ జరగనుండగా.. ఫలితాలు డిసెంబరు 11న వెలువడనున్నాయి. కాగా పోలింగ్ సమయంలో మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నందున ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో భద్రతను రెట్టింపు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు 500 కంపెనీల బలగాలతో గస్తీ ఏర్పాటు చేసిన అధికారులు.. 50 డ్రోన్లు, 17 హెలికాఫర్టు, వెయ్యి శాటిలైట్ ట్రాకర్స్‌తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతి తోంక్ పాల్ చింతల్నార్ నుండి ఎలక్షన్ డ్యూటీ ముగించుకుని వస్తున్న భద్రతాదళాల మీద మావోయిస్టుల కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీరి మృతదేహాలను భద్రత దళాలు స్వాధీన పరుచుకున్నాయి. కాగా ఈ సమయంలో భద్రతా దళాలతో పాటు, డ్యూటీ ముగించుకుని వస్తున్న ఎలక్షన్ సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన తొలిదశ ఎన్నికల పోలింగ్
-
ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన తొలిదశ ఎన్నికల పోలింగ్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గాం, కొండగాం, కాంకేర్, బస్తర్, నారాయణ్‌పూర్, సుక్మా, బీజాపూర్, దంతేవాడ జిల్లాల పరిధిలోని 18 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగుతుంది. వాటిలో మావోయిస్టుల ప్రభావం ఉన్న 10 నియోజకవర్గాల్లో పోలింగ్ వేళల్లో మార్పులు చేశారు. అక్కడ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. మిగత ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నా నేపథ్యంలో ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేసింది. అధికారులు లక్ష మంది భద్రత సిబ్బందితో పోలింగ్ స్టేషన్ల వద్ద భద్రత ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో భద్రతను రెట్టింపు చేశారు. పోలింగ్ ప్రశాతంగా సాగేందుకు 500 కంపెనీల బలగాలతో గస్తీ ఏర్పాటు చేసిన అధికారులు.. 50 డ్రోన్లు, 17 హెలికాఫర్టు, వెయ్యి శాటిలైట్ ట్రాకర్స్‌తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
హాలీవుడ్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న సెమీఫైనల్ పోరు
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా విపక్షాలను ఏకం చేయాలని కాంగ్రెస్ భావిస్తుంటే, ఎన్నికల్లో విజయం సాధించి కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపాలని బీజేపీ పట్టుదలగా ఉంది. కుల సమీకరణాలు, చివరినిమిషంలో అభ్యర్థులు పార్టీలు మారడం, అధికార విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఈ ఎన్నికలు హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు కీలక ఎన్నికలు కావడంతో విజయం కోసం బీజేపీ తరఫున ప్రధాని మోదీ, కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో నేడు తొలిదశ పోలింగ్ జరగనుంది. బీఎస్పీతోనే తంటా.. ఛత్తీస్‌గఢ్‌లో సీఎం రమణ్‌సింగ్ సర్కారు తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటుండగా, ఎలాగైనా ఈసారి అధికారం చేపట్టాలన్న కాంగ్రెస్ పార్టీ గంపెడాశతో ఉంది. అయితే అజిత్ జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్(జేసీసీ)–బీఎస్పీ కూటమి ఈ ఆశలపై నీళ్లు చల్లే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క సీటునే గెలుచుకున్నప్పటికీ 4.27 శాతం ఓట్లను చీల్చిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అలాగే గత ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) 1.57 శాతం ఓట్లను, గోండ్వానా గణతంత్ర పార్టీ 0.29 ఓట్లను పొందాయని తెలిపారు. దాదాపు 10 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలపై బీఎస్పీ–జేసీసీ కూటమి దృష్టిసారించినట్లు వెల్లడించారు. అయితే ఈ కూటమి వల్ల నష్టం మీకేనని కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. 2013 ఎన్నికల్లో ఈ పదింటిలో బీజేపీ 9 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. శివరాజ్‌సింగ్‌కు వ్యతిరేక పవనాలు.. మధ్యప్రదేశ్‌లో గత 18 ఏళ్లుగా అధికారాన్ని నిలుపుకున్న శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తోంది. మంద్సౌర్ రైతులపై కాల్పులు, పంటలకు మద్దతు ధర సహా పలు అంశాల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ రాష్ట్రంలో ఏడాదిన్నర కాలంలో విస్తృతంగా పర్యటించారు. భేదాభిప్రాయాలను పక్కనపెట్టి పార్టీ విజయం కోసం కృషి చేయాలని నేతలు జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్, దిగ్విజయ్‌లకు దిశానిర్దేశం చేశారు. కాగా, ఇక్కడ సైతం బీఎస్పీ గట్టి ప్రభావాన్ని చూపనుంది. 2013లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 230 స్థానాలకు గానూ బీజేపీ 165 సీట్ల(44.88 శాతం ఓట్లు)తో అధికారాన్ని నిలబెట్టుకోగా, కాంగ్రెస్ 58 స్థానాలకు(36.38 శాతం ఓట్లు) పరిమితమైంది. ఇక బీఎస్పీ 6.29 శాతం ఓట్లతో నాలుగు సీట్లను దక్కించుకోగా, స్వతంత్రులు మూడు చోట్ల గెలిచారు. ఇటీవల సీఎం శివరాజ్‌సింగ్ బావ సంజయ్ సింగ్, మరో నేత సర్తాజ్ సింగ్ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరడం, దళిత నేత ప్రేమ్‌చంద్ గుడ్డు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో 28న జరగనున్న ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. వసుంధర రాజేకు గుబులు.. తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని విశ్లేషకులు అంటున్నారు. 119 స్థానాలున్న అసెంబ్లీలో 2014 ఎన్నికల్లో 63 స్థానాలు దక్కించుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అలాగే మిజోరంలో పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌కు వ్యతిరేకత ఎదురుకానుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఏ పార్టీకీ వరుసగా రెండోసారి అధికారాన్ని అప్పగించని రాజస్తాన్ ప్రజల మనస్తత్వం సీఎం వసుంధరా రాజేను కలవరపెడుతోంది. మొత్తం 200 సీట్లున్న రాజస్తాన్ అసెంబ్లీకి 2013లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 163 చోట్ల ఘనవిజయం సాధించగా, కాంగ్రెస్ కేవలం 21 సీట్లతో చతికిలపడింది. -
టికెట్ దక్కలేదని..
జీవితాన్నంతా తాము నమ్మిన సిద్ధాంతానికే అర్పించారు. పార్టీకి కష్టం వచ్చిన ప్రతిసారీ మేమున్నామంటూ స్థైర్యాన్నిచ్చారు. కానీ తమ వంతు వచ్చేసరికి.. పార్టీ ‘పక్క’రాగం అందుకోవడంతో నిశ్చేష్టులయ్యారు. నిరాశ, ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దీనస్థితికి నిదర్శనమిది. అటు ఓ బీజేపీ టికెట్ ఆశించిన నేతకూ చివరి నిమిషంలో ఆ పార్టీ షాకిచ్చింది. కాంగ్రెస్‌లోనూ టికెట్ రాలేదన్న నిరాశతో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌సింగ్ కుశ్వాహ ఆత్మహత్యాయత్నం చేశారు. గ్వాలియర్ నుంచి ప్రేమ్‌సింగ్ టికెట్ ఆశించగా.. కాంగ్రెస్ అధిష్టానం కూడా చివరి నిమిషంలో స్థానికేతరుడైన మదన్‌సింగ్ కుశ్వాహకు టికెట్ ఇచ్చింది. దీంతో మనస్తాపం చెందిన ప్రేమ్‌సింగ్ గ్వాలియర్‌లోని మాధవ్‌రావ్ సింధియా విగ్రహం ముందు నిలబడి నిరసన వ్యక్తం చేస్తూనే.. వెంట తెచ్చుకున్న విషాన్ని తాగారు. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. ప్రేమ్‌సింగ్ జేబులో సూసైడ్ నోట్ దొరికింది. ‘పార్టీలో కొందరు నేను బీజేపీలో చేరుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ఆరోపణలు నిరాధారం. 46 ఏళ్లుగా కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేశాను. నా చివరి శ్వాస వరకు కాంగ్రెస్ కార్యకర్తగానే ఉంటాను. మాధవ్‌రావ్ సింధియాతో కలిసి 35 ఏళ్లు పనిచేశాను. కాంగ్రెస్ నాయకత్వం అహంకార పూరితంగా, చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తోంది. బహిరంగంగానే ఇందిర, రాజీవ్‌లను తిట్టిన వారికి టికెట్లు ఇవ్వడం దారుణం’ అని లేఖలో పేర్కొన్నారు. బీజేపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అత్వార్ సింగ్ అనే సీనియర్ బీజేపీ కార్యకర్త జబల్పూర్ (పశ్చిమ) టికెట్‌ను ఆశించారు. తనకు పార్టీలో పోటీ ఎవరూ లేకపోవడంతో అదే ధీమాతో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం చివరి నిమిషంలో హరేంద్రజీత్ సింగ్‌కు టికెట్ ఇచ్చింది. దీంతో ఆవేదన చెందిన అత్వార్ జబల్పూర్లోని బీజేపీ కార్యాలయం వద్ద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోతుండగానే.. అక్కడున్న కార్యకర్తలు అడ్డుకున్నారు. ముస్లింలకు నిరాశేనా! మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్న ముస్లింలకు ఈ ఎన్నికల్లోనూ నిరాశే ఎదురైంది. నవంబర్ 28న జరగనున్న ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక ముస్లిం అభ్యర్థినే బరిలో దించగా.. కాంగ్రెస్ ముగ్గురికి అవకాశం కల్పించింది. బీజేపీ తరఫున ఫాతిమా సిద్దిఖీ భోపాల్ (ఉత్తరం) నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈమె మాజీ మంత్రి రసూల్ అహ్మద్ సిద్దిఖీ కూతురు. కాంగ్రెస్ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరిఫ్ అకీల్ బరిలో ఉన్నారు. బుర్హాన్పూర్ నుంచి హమీద్, భోపాల్ (సెంట్రల్) నుంచి ఆరిఫ్ మసూద్‌లు పోటీ చేస్తున్నారు. ‘బీజేపీ నుంచి మేం సీట్లను ఆశించడం లేదు. మా రాష్ట్రం ముస్లిం నేతలు జాతీయ రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నాం. అందుకే మేం కాంగ్రెస్‌పైనే ఆశలు పెట్టుకున్నాం. మొదట్నుంచీ మా మద్దతు కాంగ్రెస్‌కే’ అని మధ్యప్రదేశ్ ముస్లిం వికాస్ పరిషత్ కన్వీనర్ మహ్మద్ మాహిర్ పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో ముస్లింలు 8–9%. అయితే తమ జనాభాకు తగ్గట్టుగా ప్రజాప్రాతినిధ్యం లేదని ముస్లిం మేధావులంటున్నారు. అయితే.. కాంగ్రెస్‌లో మాత్రం గెలిచే అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడం ద్వారానే టికెట్ల ఎంపిక జరిగిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జేపీ ధనోపియా పేర్కొన్నారు. -
క్యాస్టే... బూస్ట్
భారత రాజకీయాలు, ఎన్నికల్లో కులాల పాత్రను వేరుగా చూడలేం. ఈ ఒక్క రాష్ట్రానికి అది మినహాయింపు అని చెప్పలేం. చిన్న కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పెద్దరా ష్ట్రాలైన మధ్యప్రదేశ్, యూపీ వంటి రాష్ట్రాలవరకు ప్రతిచోటా కుల సమీకరణాలు అత్యంత కీలకంగా మారాయి. అందుకే పార్టీలన్నీ సోషల్ ఇంజనీరింగ్‌పైనే దృష్టి పెడుతున్నాయి. సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) జరిపిన అధ్యయనంలో మధ్యప్రదేశ్‌లో పోలయ్యే ఓట్లలో 65% కులం ఆధారంగా పడేవేనని వెల్లడైంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత ఎక్కువ శాతంలో కులం ఓట్లు పడవు. ఇక్కడ చాలా కులాలు ఉన్నప్పటికీ అగ్రవర్ణాలు, ఓబీసీలదే ఆధిపత్యం. రాష్ట్ర జనాభాలో 55% ఉన్న ఈ వర్గం (రాజ్‌పుత్, యాదవ, బ్రాహ్మణ వర్గాలు) బీజేపీకి సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఇందులో అగ్రవర్ణాలు 22%. ఎస్సీ, ఎస్టీల జనాభా 37%. వీరిలో ఎస్సీలు కాంగ్రెస్‌కు అండగా ఉండగా.. ఎస్టీల్లో మెజారిటీ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ.. మిగిలిన కులాలతో పోలిస్తే సరైన చైతన్యం లేకపోవడంతో రాజకీయంగా వీరు ప్రభావం చూపలేకపోతున్నారు. దీంతో మధ్యప్రదేశ్‌లో అగ్రవర్ణాలు, ఓబిసీలదే పైచేయిగా ఉంది. ప్రధాన పార్టీలు కూడా ఈ రెండు వర్గాలపైనే ప్రధానంగా దృష్టి సారించాయి. ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ సీఎం ఉమాభారతి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాకేశ్ సింగ్‌లు ఓబీసీలే కావడం రాష్ట్రంలో వారి పరపతి ఏ స్థాయిలో ఉందో చెబుతోంది. కుల సమీకరణాలు మారుతున్నాయ్ 2018లో ఈ కుల సమీకరణాల్లో మార్పు వచ్చింది. ఓబీసీలకు రాజకీయంగా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో అగ్రవర్ణాలు బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ చట్టానికి సవరణలు చేయడంపైనా.. బీజేపీ వైఖరి అగ్రవర్ణాలకు రుచించలేదు. ఈ విషయంలో కాంగ్రెస్ తమకు మద్దతుగా ముందుకు రాకపోవడంతో వారు ఆ పార్టీని కూడా తప్పుపడుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్ జనాభా 7 కోట్లు కాగా.. ఇందులో 52% అగ్రవర్ణాలు, ఓబీసీలున్నారు. ఎస్సీలు 16%, ఎస్టీలు 21% ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర జనాభాలో 91% హిందువులుండగా.. ముస్లింలు 7%, ఇతర మైనారిటీలు 2%గా ఉన్నారు. ఓబీసీలదే మెజారిటీ సంఖ్యాపరంగా చూస్తే ఈ ఛత్తీస్‌గఢ్‌లో 42% ఉన్న ఓబీసీలదే (కుర్మీలు, సాహులు) మెజారిటీ. బ్రాహ్మణులు, యాదవులు ఉన్నప్పటికీ రాజకీయాలను ప్రభావితం చేసే సంఖ్యలో లేరు. అందుకే కాంగ్రెస్, బీజేపీలు ఓబీసీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 2.56 కోట్లు కాగా.. వీరిలో ఎస్సీలు 12.82%, ఎస్టీలు 30.62%. మొత్తం జనాభాలో 93.25% హిందువులు. ఓబీసీల్లో ఎక్కువ మంది కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. అయితే, అజిత్‌జోగి హయాంలో కాంగ్రెస్ తమను చిన్నచూపు చూసిందన్న కోపంతో బీజేపీ వైపు మళ్లారు. అజిత్‌జోగి, రమణ్ సింగ్, భూపేష్ భగేల్, తామ్రధ్వాజ్ సాహులు రాష్ట్రంలో పేరొందిన ఓబీసీ నేతలు. తల్లీకొడుకుల సవాల్! ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్శిస్తున్న స్థానం దంతేవాడ నియోజకవర్గం. ఇందుకు కారణం.. తల్లీకొడుకులు వేర్వేరు పార్టీలనుంచి బరిలో ఉండటమే. నక్సలైట్ల చేతిలో చనిపోయిన సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ భార్య దేవతికి (సిట్టింగ్)కి ఈసారి కూడా ఆమెకే కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. ఈ స్థానం నుంచి ఈసారి మహేంద్ర కర్మ కుమారుడు ఛవీంద్ర కర్మ ఎస్పీ టికెట్‌పై బరిలో దిగారు. ఇన్నాళ్లూ తల్లికి రాజకీయాల్లో చేదోడువాదోడుగా ఉన్న చవీంద్ర బరిలో ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. పోటీ చేయొద్దంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు.. ఛవీంద్రను కలిసి బతిమాలినప్పటికీ ఫలితం కనిపించలేదు. ‘అమ్మకు నేను వ్యతిరేకం కాదు. కానీ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన బూటకపు హామీలపైనే నా పోరాటం’ అని ఛవీంద్ర పేర్కొన్నారు. -
'ఎర్ర'కోటలో హోరాహోరీ!
వేలిపై సిరాచుక్క కనబడితే ఖబడ్దార్ అని మావోయిస్టులన హెచ్చరికలు ఓవైపు.. ఓటే వజ్రాయుధం, హక్కు అంటూ ఎన్నికల సంఘం, ఎన్జీవోల చైతన్య కార్యక్రమాలు మరోవైపు. పోలీసుల బూట్ల చప్పుడు నడుమ బస్తర్‌లో నేడు తొలిదశ పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రాబల్యమున్న, అత్యంత సున్నితమైన ప్రాంతాలు కావడంతో ఈ 18 నియోజకవర్గాల్లో పోలింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో 11 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు, ఒకటి ఎస్సీ నియోజవకర్గం. కాగా, ‘ఎర్ర’కోటలో పట్టు బిగించేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రత్యేక వ్యూహాలతో ప్రచారం చేశాయి. గత ఎన్నికల్లో 12 చోట్ల కాంగ్రెస్ గెలవగా.. ఆరింటిని బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఈసారి సంఖ్యను పెంచుకోవాలని కాంగ్రెస్.. పూర్వవైభవాన్ని పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. సీఎం రమణ్‌సింగ్, వాజ్‌పేయి అన్నకూతురు కరుణ శుక్లా సహా 190 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నాడు బీజేపీ కంచుకోట 2013 ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. 2008 ఎన్నికల్లో బీజేపీ 15 స్థానాల్లో గెలుపొందింది. 2003 ఎన్నికల నాటికి ఈ ప్రాంతంలో 15 స్థానాలు ఉండేవి. అప్పుడు కూడా బీజేపీ 10 స్థానాల్లో నెగ్గి బస్తర్‌పై తన పట్టుచూపించింది. అయితే గత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌పై ప్రజలు సానుభూతి చూపించారు. ఇందుకు కారణం.. మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వాజుడుం బృందాన్ని సిద్ధం చేసిన మహేంద్ర కర్మతోపాటు కాంగ్రెస్ నేతలను మావోయిస్టులు హతమార్చడమే. అయితే ఈసారికూడా అదే సానుభూతితో మరిన్ని స్థానాల్లో పాగా వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. హెచ్చరికలు బేఖాతరు ఎన్నికల్లో పాల్గొనవద్దంటూ మావోయిస్టులు పోస్టర్లు వేయడం.. అయినా ప్రజలు యథావిధిగా ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతూనే ఉంది. ఈ ప్రాంతంలో ఏటేటా పోలింగ్ శాతం కూడా పెరుగుతూ వస్తోంది. 2003లో 65.68% ఓటింగ్ నమోదైతే, 2008లో 67.14% నమోదైంది. 2013లో రికార్డు స్థాయిలో 75.93% ఓటింగ్ నమోదైంది. త్రిముఖపోటీ ఉంటుందా? నిన్నటివరకు బస్తర్ ప్రాంతంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు ప్రధానంగా ఉంది. సీపీఐ, బీఎస్పీ వంటి ఇతర జాతీయ పార్టీలు, చిన్నా చితకా స్థానిక పార్టీలు ఇక్కడ ప్రభావాన్ని చూపించలేకపోయాయి. అయితే.. ఈసారి అజిత్ జోగి పార్టీ జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జేసీసీ), బీఎస్పీ, సీపీఐల కూటమి ప్రభావం ఉంటుదనిపిస్తోంది. అయితే.. ఆదివాసీల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో అజిత్ జోగికి మంచి పట్టు ఉన్నప్పటికీ.. ఎనిమిది స్థానాలను బీఎస్పీకి ఇవ్వడం తప్పిదమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డోంగర్‌గఢ్, డోంగర్గావ్, అనంత్‌గఢ్, కంకేర్, కేశ్కల్, కోండాగావ్, దంతేవాడ, కోంటా నియోజకవర్గాల్లో బీఎస్పీ పోటీకి దిగుతోంది. ఈ స్థానాల్లో గత ఎన్నికల్లో బీఎస్పీకి కేవలం 2% ఓట్లు మాత్రమే వచ్చాయి. అంతేకాకుండా ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌పై పోటీకి దిగుతానంటూ మొదట్లో ప్రకటించిన అజిత్ జోగి ఆ తర్వాత వెనుకడుగు వేయడంతో బీజేపీ, కాంగ్రెస్‌లను జేసీసీ ఢీకొట్టలేదనే అభిప్రాయం ప్రజల్లో పడింది. అర్బన్ మావోయిస్ట్ గీ జీఎస్టీ కాంగ్రెస్ పార్టీ అర్బన్ మావోయిస్టులకు మద్దతుగా నిలుస్తూ నిరుపేద ఆదివాసీల అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేశారు. అయితే జీఎస్టీ, పెద్దనోట్ల ద్వారా వ్యాపారులు, సామాన్యులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయంటూ రాహుల్ ప్రతివిమర్శలు చేశారు. సీఎం రమణ్‌సింగ్, మంత్రులు మహేష్ గాగ్డా, కేరార్ కశ్యప్‌లు బరిలో ఉండడంతో ఆసక్తి నెలకొంది. వీరంతా గత మూడుసార్లుగా ఎన్నికల్లో నెగ్గుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం పాత, కొత్త నేతల కలయికతో ముందుకెళ్తోంది. మూడుచోట్ల సిట్టింగులకు కాకుండా కొత్తవారికి చాన్స్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ బరిలో ఉన్న రాజ్‌నంద్‌గావ్‌లో.. కాంగ్రెస్ తరఫున మాజీ ప్రధాని వాజపేయి అన్న కూతురు కరుణ శుక్లాను బరిలోకి దిగటంతో పోటీ రసవత్తరంగా మారింది. నక్సల్స్ సమస్యని అధిగమిస్తూనే రమణ్‌సింగ్ రాష్టాన్ని అభివృద్ధిచేస్తున్నారన్న మంచిపేరైతే సంపాదించారు. దంతేవాడ ఈ పేరు వింటేనే ఎన్కౌంటర్లు, తుపాకుల చప్పుళ్లే గుర్తొస్తాయి. బిక్కుబిక్కుమంటూ కాలం గడపటం ఇక్కడి ప్రజల నిత్యకృత్యమయిపోయింది. గత ఎన్నికల్లో ఈ దంతేవాడ నియోజకవర్గంలోనే 10 వేలమంది నోటాకు ఓటేశారు. ఇదే.. రాజకీయాలపై అక్కడి ప్రజలకున్న విరక్తికి నిదర్శనం. ఇక్కడినుంచి.. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, దివంగత కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ భార్య దేవతి కర్మనే మళ్లీ బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఈమె బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. కంకేర్ సహజ వనరులు అపారంగా ఉన్న ఈ ప్రాంతంలోనూ నక్సల్స్ సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ ధ్రువ్‌ను కాదని.. ఆదివాసీల కోసం పనిచేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి శిశుపాల్ సోరిని బరిలోకి దింపింది. బస్తర్ ఓటు వేస్తే వేళ్లు నరికేస్తామంటూ మావోయిస్టుల హెచ్చరికల మధ్య బస్తర్ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ కత్తి మీద సామే. ఆదివాసీలు అత్యధికంగా ఉన్న బస్తర్‌లో వారి ఆరోగ్యమే ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. సర్వేలు ఏం చెబుతున్నాయ్ ! ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోటీ ఉన్నప్పటికీ, అజిత్‌జోగి పార్టీ ప్రతిపక్ష ఓట్లను చీల్చడంతో కమలనాథులకు లబ్ధి చేకూరుతుందని ఇండియాటుడే సర్వే అంచనా వేసింది. అయితే బస్తర్ ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్ పై చేయి సాధిస్తుందని ఆ సర్వేలో వెల్లడైంది. ఏబీపీ న్యూస్, సీఎస్డీఎస్ సర్వేలో నాలుగోసారి బీజేపీదే అధికారమని తేలింది. కాంగ్రెస్ నామమాత్రపు పోటీ కూడా ఇవ్వదని, మొత్తం 90 స్థానాల్లో బీజేపీ 56 నియోజకవర్గాలను గెలుచుకుంటుందని ఆ సర్వే వెల్లడించింది. ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్స్‌లోనూ.. 50 సీట్లతో బీజేపీయే నెగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. లక్ష మంది పహారా! లక్షమంది భద్రతా బలగాల బందోబస్తు నడుమ నేడు ఛత్తీస్‌గఢ్ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. మావోయిస్టుల హెచ్చరికలు, 15 రోజుల్లోనే మూడు వేర్వేరు ఘటనల్లో 13 మందిని పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 18 నియోజకవర్గాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా, గత పదిరోజుల్లో బస్తర్ ప్రాంతంతోపాటు రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో 300కు పైగా ఐఈడీ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల ప్రతి చర్యలకు సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు ఆపరేషన్స్ స్పెషల్ డీజీ డీఎం అవస్థి వెల్లడించారు. పారామిలటరీ, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ బలగాలతోపాటు 65వేల మంది వివిధ రాష్ట్రాల పోలీసులు కూడా ఈ బందోబస్తులో ఉన్నారు. బలగాలతోపాటు వైమానిక దళం, బీఎస్ఎఫ్ హెలికాప్టర్లతో నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నామని అవస్థీ తెలిపారు. ‘ఎన్నికల సిబ్బందిని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు తీసుకెళ్లి.. ఎన్నిక పూర్తయిన తర్వాత క్షేమంగా గమ్యస్థానం చేర్చడమే అసలైన సవాల్. ఈ దిశగా ఓ వ్యూహంతో పనిచేస్తున్నాం. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతరలు, ఐఈడీలు పెట్టారు. దీంతో చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నాం’ అని ఆయన వెల్లడించారు. కాగా, అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఉదయం ఏడుగంటలనుంచి సాయంత్రం 3 వరకు మాత్రమే పోలింగ్ జరపనున్నారు. 2013 ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 6 స్థానాలు బీజార్, జగదల్పూర్, నారాయణ్‌పూర్, అనంత్‌గఢ్, డోగార్గావ్, రాజ్‌నంద్‌గావ్ -
ఓ(పో)టెత్తిన యువత
మంచిర్యాలఅగ్రికల్చర్: యువజనులను ఓటరు జాబితాలో చేర్చేందుకు అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో ఓటుహక్కు వినియోగంపై యువతలో చైతన్యం పెరిగింది. ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం రెండుసార్లు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఈ నెల 9న చివరి గడువు ముగిసే నాటికి జిల్లావ్యాప్తంగా 44,160 మంది ఓటరుగా నమోదుకావడం విశేషం. తాజాగా 15,017 మంది.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కు పొందడం కోసం ఓటరు జాబితాలో పేరు నమోదుకు ఎన్నికల సంఘం రెండోసారి అవకాశం కల్పించగా, ఈ నెల 9వ తేదీతో గడువు ముగిసింది. జిల్లావ్యాప్తంగా 15,017 మంది ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత పదిహేను రోజుల పాటు ఆఫ్‌లైన్, ఆన్లైన్ ద్వారా యువతీ యువకులు ఓటుహక్కు కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. నియోజకవర్గాల చూస్తే అత్యధికంగా బెల్లంపల్లిలో 6,647 దరఖాస్తులు వచ్చాయి. తర్వాత మంచిర్యాలలో 5,850, చెన్నూర్‌లో 2,520 మంది నమోదు చేసుకున్నారు. ఓటుహక్కు నమోదుకు ఫారం–6, ఓటరు జాబితాలో తొలగింపు, అభ్యంతరాలను స్వీకరించేందుకు ఫారం–7 దరఖాస్తులు 4,509 రాగా, ఓటరు జాబితాలో మార్పులు,చేర్పులు చేసుకునేందుకు ఫారం–8 దరఖాస్తులు 1,552 వచ్చాయి. అదే నియోజకవర్గ పరిధిలో చిరునామా మార్చుకునేందుకు ఫారం–8ఏ దరఖాస్తులు 863 వచ్చాయి. ఎన్నికల అధికారులు సెప్టెంబర్ 10న ఆవిష్కరించిన ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 5,01,743 మంది ఓటర్లు ఉన్నారు. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావడంతో ఎన్నికల సంఘం మరో నెలరోజులు కొత్త ఓటర్ల నమోదు అవకాశం కల్పించింది. జిల్లాలో ఓటరు నమోదుపై చైతన్యం కల్పించేందుకు బూత్ స్థాయి అధికారులు ర్యాలీలు, సమావేశాల ద్వారా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి 2018 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని నమోదు చేసుకునే విధంగా ప్రోత్సహించారు. దీంతోపాటు ఓటరు జాబితాలో తప్పొప్పులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో అధికారులు చనిపోయిన వారి పేర్లను తొలిగించి, తప్పులను సరిచేసి ఎన్నికల సంఘానికి నివేదిక అందజేశారు. ఈ నివేదికల ఆధారంగా చనిపోయిన, రెండుచోట్ల ఉన్న ఓటర్లను తొలగించి, కొత్తగా నమోదైన ఓటర్లతో తుది ఓటరు జాబితాలో 5,30,886 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. మరోసారి ఓటరు నమోదుకు అవకాశం కల్పించాలని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరడంతో ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఇచ్చింది. తాజాగా వచ్చిన దరఖాస్తుల అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలిస్తారు. అన్ని వివరాలు సవ్యంగా ఉన్నట్లయితే ఓటరు జాబితాలో చోటు లభిస్తుంది.