సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని సాత్న జిల్లా చిత్రకూట్ హిందువులకు ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైన పట్టణం. అయోధ్య రాముడు గడిపిన 14 ఏళ్ల వనవాసంలో 11 ఏళ్లు ఈ ప్రాంతం అడవుల్లోనే గడిపాడన్నది ప్రతీతి. ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతానికి రాముడు అయోధ్య నుంచి సతీసమేతంగా నడిచివచ్చారంటూ స్థానికులు ఇక్కడ ఓ దారిని చూపిస్తారు. ‘రామ్ వన్ పథ్’గా ఈ మార్గాన్ని అభివద్ధి చేస్తానంటూ తెగ ప్రచారం చేయడం ద్వారా 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మొదటిసారి విజయం సాధించారు. ఆయన ఏమీ చేయలేకపోవడంతో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో అదే హామీతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఆయన కూడా తన హామీని నిలబెట్టుకోలేక పోయారు.
ఈ నేనపథ్యంలో మొత్తం చిత్రకూట్ అసెంబ్లీ అభివద్ధికి కృషి చేస్తామని కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు హామీల మీద హామీలు ఇస్తున్నారు. కులాలు, వర్గాలు ఓట్లను ప్రభావితం చేసే ఈ నియోజకవర్గంలో ఈ హామీలను ప్రజలెవరు నమ్మడం లేదు. ఈ నియోజక వర్గం ఎన్నికలపై బందిపోట్ల ప్రభావం కూడా ఎక్కువే. అందుకే 1998, 2003, 2013 ఎన్నికల్లో మాజీ బందిపోటు ప్రేమ్ సింగ్ విజయం సాధించారు. 2008లో మాత్రం బీజేపీ అభ్యర్థి కేవలం 722 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. ఆయన కూడా నియోజక వర్గం అభివద్ధికి ఎలాంటి కృషి చేయకపోయినా ఆయనకు భయపడి ప్రజలు ఓటేశారట. 2017లో ప్రేమ్ సింగ్ మరణించడంతో ఆయన స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నీలాంషు చతుర్వేది ఉప ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. ఇప్పటికీ బిబ్లీకోల్, సాధనా పటేల్ లాంటి చిన్న స్థాయి బందిపోట్లు ఎన్నికల్లో పోటీ చేసిన కనీసం పదివేల ఓట్లు వస్తాయని స్థానిక వ్యాపారి ప్రద్యూమ్న త్రిపాఠి వ్యాఖ్యానించారు.
చిత్రకూట్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిసారి ఒక్క బందిపోటైనా పోటీ చేస్తారట. అయితే ఈసారి ఎన్నికల్లో ఒక్కరు కూడా లేకపోవడం ఆశ్చర్యకరమేనని స్థానికులు అంటున్నారు. ఈ ప్రాంతం ఆర్థికంగా బాగా వెనకబడి ఉండడం, దాచుకోవడానికి చుట్టూ దట్టమైన అటవి ప్రాంతాలు ఉండడం దోపిడీ దొంగలు పెరగడానికి కారణమని స్థానిక ప్రజలే చెబుతున్నారు. ఎప్పటిలాగా ఈసారి కూడా కులాల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నది అర్థం అవుతుంది. నియోజక వర్గంలో మొత్తం ఓటర్లు 1,98,933 మంది. 40 శాతం ఉండే జనరల్ క్యాటగిరీ ఓటర్లలో 36 శాతం బ్రాహ్మణలు కాగా, ఆరు శాతం మంది ఠాకూర్లు ఉన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే నీలాంషు చతుర్వేదిని కాంగ్రెస్ మళ్లీ నిలబెట్టింది.
ఈసారి కూడా బ్రాహ్మణులు మూకుమ్మడిగా మంచిపేరుగల నీలాంషుకే మద్దతిస్తుండడంతో బీజేపీ ఠాకూర్లకు చెందిన సురేంద్ర సింగ్ గహావర్‌ను పోటీకి నిలబెట్టింది. బీఎస్పీ పార్టీ 19.72 శాతం ఓట్లు కలిగిన షెడ్యూల్ కులానికి చెందిన రవీంద్ర సింగ్ పట్వారీని నిలబెట్టింది. ఇక షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఓటర్లు 18.91 శాతం, ఇతర వెనకబడిన వర్గాలకు చెందిన ఓటర్లు 21 శాతం ఉన్నారు. ఓబీసీల మద్దతు కూడా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీఎస్పీ–కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఇంక ఆ అభ్యర్థికి తిరుగే ఉండేది కాదని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment