chitrakoot
-
ద్విచక్ర వాహనంపై ఐదుగురు.. రూ. 17 వేల జరిమానా!
సాధారణంగా మనం ద్విచక్ర వాహనంపై ఇద్దరు లేదా ముగ్గురు రైడర్లను చూసి ఉంటారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో ఒక బైక్‌పై ఐదుగురు కుర్రాళ్లు ప్రయాణిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఐదుగురు కుర్రాళ్లు బైక్‌పై వెళుతుండగా వారిని ట్రాఫిక్ పోలీసులు గమనించి, వారికి భారీ మొత్తంలో చలానా జారీచేశారు. ఈ ఉదంతం చిత్రకూట్ జిల్లాలోని ఖోహ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఓ బైక్‌పై ఐదుగురు కూర్చొని గ్రామంలో ఉల్లాసంగా తిరుగుతున్నారు. ఇంతలో వారికి ట్రాఫిక్ పోలీసులు తారసడ్డారు. చిత్రకూట్ ట్రాఫిక్ టీఎస్ఐ శైలేంద్రకుమార్ సింగ్ ఆ బైక్ నడిపే కుర్రాళ్లను అడ్డుకుని, వారికి రూ.17 వేలు చలానా జారీ చేయడంతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతం గురించి చిత్రకూట్ ట్రాఫిక్ టీఎస్ఐ శైలేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ కార్వీ కొత్వాలి ప్రాంతంలోని ఖోహ్ గ్రామంలో ఐదుగురు కుర్రాళ్లు బైక్‌పై వెళుతూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడాన్ని గమనించామన్నారు. తరువాత వారిని ఆపి, వారి పేరు, చిరునామా తెలుసుకున్నామని, డ్రైవింగ్ లైసెన్స్ ను తనిఖీ చేశామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణిస్తున్న ఈ ఐదుగురు కుర్రాళ్లకు రూ.17 వేలు చలాన్ జారీ చేశామన్నారు. అలాగే ఆ వాహనాన్ని సీజ్ చేశమన్నారు. -
చిత్రకూట్ దీపావళి వేడుకల్లో తొక్కిసలాట.. పలువురికి గాయాలు!
అయోధ్య తర్వాత అంతటి ఘన చరిత్ర కలిగిన మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో దీపావళి మేళా ప్రారంభమయ్యింది. ఇది ఐదు రోజుల పాటు జరగనుంది. దీపావళి సందర్భంగా లక్షలాది మంది భక్తులు చిత్రకూట్‌కు చేరుకున్నారు. భక్తులు మందాకినీ నదిలో స్నానం చేసి, మాతగజేంద్ర నాథ్ ఆలయంలో జలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. అలాగే కామతానాథ్ స్వామిని దర్శించుకుని, పంచకోసి పర్వతం కమదగిరికి ప్రదక్షిణలు చేస్తున్నారు. లంకా విజయం తర్వాత శ్రీరాముడు చిత్రకూట్‌లో దీపాలను దానం చేశాడని స్థానికులు చెబుతారు. ఈ నేపధ్యాన్ని పురస్కరించుకుని చిత్రకూట్‌లో దీపావళి మేళా నిర్వహిస్తుంటారు. ఈసారి చిత్రకూట్ దీపావళి మేళాకు అత్యధికంగా భక్తులు తరలివచ్చారు. 25 కిలోమీటర్ల పరిధిలో ఈ మేళాను ఏర్పాటు చేశారు. కామదగిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల రద్దీ నెలకొంది. దీంతో తోపులాట చోటుచేసుకుని పలువురు గాయాలపాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు గాయపడిన భక్తులకు వైద్య సహాయం అందించారు. ప్రస్తుతం లక్షలాది మంది భక్తులు చిత్రకూట్‌లో దీపదానాలు నిర్వహిస్తున్నారు. జిల్లా యంత్రాంగం భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేసింది. మేళా ప్రాంతంలో పోలీసు బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఇది కూడా చదవండి: దీపావళి వేళ... అమ్మవారికి రోబోటిక్ హారతులు! -
చిత్రకూట్ దీపావళి ప్రత్యేకత ఏమిటి? మందాకినీ తీరంలో ఏం జరుగుతుంది?
మధ్యప్రదేశ్‌ని చిత్రకూట్‌లో జరిగే దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపావళి పండుగ సందర్భంగా చిత్రకూట్‌లోని మందాకిని నది తీరంలో ఐదు రోజుల పాటు జరిగే జాతరలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారు. లంకను జయించిన శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తూ, ఋషులతో కలిసి మందాకిని నదిలో దీప దానాన్ని చేశాడని స్థానికులు చెబుతారు. చిత్రకూట్‌లో దీపావళి పండుగను అయోధ్యలో జరిగే వేడుకల స్థాయిలో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ధన్తేరస్ మొదలుకొని భాయ్ దూజ్ వరకు ఐదు రోజుల పండుగ జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులు మందాకినీ నదిలో దీప దానం చేస్తారు. అంటే నదికి దీపాలు సమర్పించి, తమకు శ్రేయస్సు అందించాలని నదీమతల్లిని కోరుకుంటారు. చిత్రకూట్‌లో పదకొండున్నర సంవత్సరాలపాటు వనవాసం చేసిన శ్రీరాముడు ఇప్పటికీ ఇక్కడ తిరుగాడుతూ, భక్తులకు కనిపిస్తాడని స్థానికులు చెబుతుంటారు. దీపావళి సందర్భంగా ఇక్కడ నిర్వహించే ఐదు రోజుల దీప దాన ఉత్సవం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రతీయేటా 20 నుంచి 25 లక్షల మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇది కూడా చదవండి: డోంగర్‌ఘఢ్‌కు ప్రధాని మోదీ.. బమ్లేశ్వరి ఆలయంలో పూజలు -
వంద గుడిసెలకు ఇదే పెద్ద చదువా!
ప్రభుత్వం నన్ను విచారణాధికారిగా నియమించింది. నా కమిటీలో సభ్యులుగా ఒక ఎస్పీ, ఒక మహిళా డిఎస్పీ కూడా వున్నారు. ఆమె పేరు సౌమ్య. ముగ్గురం కారులో బయల్దేరాం. లక్నో నుంచి ఆరు గంటల ప్రయాణం. అది చిత్రకూట్ జిల్లా. దాని ముఖ్యాలయం కర్వీ. అక్కడ ప్రభుత్వ అతిథి గృహంలో వసతి ఏర్పాటు చేశారు. అల్పాహారం తీసుకొని, ఉదయం తొమ్మిది గంటలకు బయల్దేరాం. మాకు మార్గం చూపించేందుకు ఒక ఎస్సైను పైలెట్‌గా పెట్టారు. ఎటు చూసినా కొండలు. వింధ్యాచల పర్వతాలు. పచ్చటి చీర కట్టుకున్న కొండల మేనిపై సూర్యోదయ కిరణాలు మరింత తళతళలాడుతున్నాయి. రాళ్ళూ రప్పలతో ఎప్పుడూ ఎండిపోయిన ముఖంతో దీనంగా వుండే బుందేల్‌ఖండ్ నేల.. పచ్చని పొలాలతో, చెట్లతో యవ్వన చైతన్యంతో వెలుగుతోంది. ఆ ప్రకృతిని చూస్తుంటే, చాన్నాళ్ల నా కళ్ల ఆకలి తీరిపోయిందనిపించింది. కారు నత్తనడక నడుస్తోంది. డ్రైవర్ తప్పు కాదు. రోడ్డు లోపం అంతకన్నా కాదు. అన్నా ఆవుల వల్ల. వందల కొలది ఆవులు రోడ్డుకు అడ్డంగా తిరుగుతుంటాయి. పాలివ్వని ఆవుల్ని యిలా గాలికి వదిలేస్తారు. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఎక్కడ చూసినా కనిపించే ముఖచిత్రం యిది. అన్నా ఆవులు, నీలి ఆవులు కలిసి పంటల్ని నాశనం చేస్తుంటాయి. రైతులు తమ కన్నీళ్లను కడుపులోనే దాచుకుంటున్నారు. మా కారు కొండల పాదాల వద్ద వున్న గుడిసెలకు రెండు కిలోమీటర్ల దూరంలో ఆగింది. అక్కడి నుండి నడక. అక్కడ సుమారు వంద గుడిసెలు. మట్టితో కట్టినవి. విద్యుత్తు లేని వూరులుంటాయా అన్న అనుమానం రాకుండా అవి సాక్ష్యంగా నిలబడ్డాయి. శ్రీశ్రీ వర్ణించిన ‘భిక్షు వర్షీయసి’ ని గుర్తు చేస్తున్నట్లున్నాయి ఆ గుడిసెలు. నడుచుకుంటూ ఆ వూరి మధ్యలోంచి వెళ్తున్నాం. ఇళ్ల చూర్ల మధ్య ముఖాలు పెట్టి, మమ్మల్ని చూస్తున్నారు జనం. ఒకరిద్దరిని పిలిచి హిందీలో అడిగాం. ‘ఇవాళ పనిలోకి వెళ్ళలేదా?’ అని. ‘పని లేదు సాబ్ ’ హిందీలోనే నిర్లిప్త సమాధానం. పోలీసుల్ని చూసి వాళ్ళ కళ్లు భయపడలేదు. ఇందరు అధికారులు ఆ గుడిసెల దగ్గరకి ఎందుకు వచ్చారన్న ఆశ్చర్యం లేదు. నాకు ఆశ్చర్యమనిపించింది. ఏ హావభావాలు లేని వాళ్ళ పెదాలు చూసి. దేశాన్ని ఒక్క కుదుపు కుదిపిన ఘటన. విభిన్న విచారణ సంస్థలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఘటన. అగ్ని పర్వతం పుట్టిన చోటును వీసమంతయినా కదపలేకపోయింది. వచ్చిన పని వెదుక్కుంటూ బాధితురాలు బబ్లీ ఇంటికి చేరాం. పన్నెండేళ్ల బాలికను తీసుకొని, వాళ్లమ్మ బయటకొచ్చింది. తల్లి కొంగు చాటున అమాయకంగా నిలబడింది. ఎటు చూసినా పేదరికం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మా కమిటీ సభ్యురాలు సౌమ్య ఆమెను వివరాలు అడుగుతున్నది. అన్నింటికీ వాళ్ళమ్మే సమాధానం చెబుతోంది. పని వెదుక్కుంటూ మీర్జాపూర్ జిల్లా నుండి ముప్పై ఏళ్ల క్రితం వలస వచ్చారట. వాళ్లందరికీ గుడిసెలు కట్టుకోవడానికి ఒక భూస్వామి మూడెకరాల పొలాన్ని కేటాయించాడట. ఒకరి తర్వాత ఒకరు చేరి, ఇప్పటికి వంద కుటుంబాలయ్యాయి. గత పదేళ్లలో ఇసుక తవ్వకాల పనులు బాగా ఎక్కువయ్యాయని చెప్పింది. అందులో కూలీ పని నిత్యం వుంటుందని చెప్పింది. ‘ఈ చిన్న పిల్లలు కూడా కూలి పనికి వస్తారా?’ అడిగాం. లేదు. వీళ్ళు ఇంటి దగ్గరే వుండి, వంట చేస్తారు.’ ‘వీళ్ళు ఇసుక పని దగ్గరకు అస్సలు రారా?’ ‘అప్పుడప్పుడు భోజనం తీసుకుని వస్తారు.’ ‘అంటే, రోజూ మీరు వెళ్ళేప్పుడే భోజనం తీసుకెళ్తారా?’‘అవును.’‘గుత్తేదారు జీతం యివ్వడానికి యిబ్బంది పెడతాడా?’‘ లేదు. ప్రతి సోమవారం పేమెంట్ చేస్తారు. ’‘ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఒక్కటే జీతమా?’‘ రోజుకి ఆడవాళ్ళకి రెండొందలు. మగవాళ్లకు మూడొందలు.’ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లు అక్కడ పోగయ్యారు. ఆసక్తిగా వింటున్నారు. ‘ఎక్కువ జీతం ఎర చూపి, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ఎప్పుడైనా ప్రవర్తించారా?’ ‘లేదు సాబ్. అలాంటిదెప్పుడూ లేదు. పనిలో మేమందరం కలిసే వుంటాం. కలిసే వస్తాం’ అంది మరొక ఆమె. ‘ఈమెవరు?’ అని అడిగాను. ‘గుడియా వాళ్ళమ్మ’ అని బదులిచ్చింది మరొకామె. మేం దర్యాప్తు చేస్తున్న మరొక బాధితురాలు గుడియా. మహిళా అధికారి.. బబ్లీని దగ్గరకు పిలిచింది. బిక్కు బిక్కుమంటూ వచ్చింది. భోజ్‌పురిలో అడగడం మొదలు పెట్టింది. ‘ఎవరికీ భయపడనక్కర లేదు. జరిగింది జరిగినట్లు చెప్పమ్మా!’ మౌనంగా నిలుచుంది. ఏ ప్రశ్న లేని వుత్తరంలా వుంది ఆమె ముఖం. ‘మేమున్నాం. నీకే భయం లేదు. గుత్తేదారు నిన్నేం చేశాడో చెప్పు.’ ‘కుచ్∙నహీ కియా’ నూతిలో నుండి ఒడ్డుకు వచ్చినట్లుగా, ఆమె పెదాలను దాటి వచ్చింది ఆ మాట. మహిళా అధికారి మరింత సౌమ్యాన్ని ప్రదర్శించింది. ‘చెప్పమ్మా. ఆ రాక్షసుడు నీ చెయ్యి పట్టుకు లాగాడా?’‘ నహీ.. కుఛ్∙నహీ హువా.’ అదే వ్యక్తీకరణ. ‘గుత్తేదారిని ఎప్పుడన్నా చూశావా?’ ‘నహీ’ ‘నువ్వు ఆ ఇసుక తవ్వకం పని చేశావా?’ ‘నహీ.’ ‘నిన్ను గుత్తేదారు మనుషులెవరన్నా రమ్మన్నారా?’ ‘నహీ’ ‘మరి నువ్వు ఏం చేస్తావు?’ ‘ఖానా బనాతీ హూ’ ‘చదువుకున్నావా?‘ ‘నహీ’‘టీవీ వాళ్లకు అలా ఎందుకు చెప్పావు?’ ‘పైసా కే లియే’‘అలా చెబితే డబ్బులు యిస్తానన్నారా?’ ‘హా!’ అక్కడ నుండి బబ్లీ వాళ్లమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది. ‘ఈ వూరిలో చదువుకున్నవాళ్ళెవరైనా వున్నారా?’ అని అడిగాం. ‘ఆ! యిదిగో ఈ దుర్గే పెద్ద చదువు చదివింది’ అన్నారు. మూడేళ్ళ పాపను ఎత్తుకుని నిలబడ్డ దుర్గ గర్వంగా చూసింది. ‘ఏం చదువుకున్నావమ్మా?’ అడిగాను నేను. ముసి ముసిగా నవ్వుతోంది. పరవాలేదు, చెప్పమ్మా అన్నట్లుగా ఆమె వైపే చూస్తున్నాను. ‘పాంచ్’ అంది మెల్లగా ముసి ముసి నవ్వులో నుంచి బయట పడుతూ. నా గుండె ఆ క్షణం కొట్టుకోవడం మానేసింది. వంద గుడిసెలకు ఇదే పెద్ద చదువు. ఆరా తీశాను. చదువు మీద వాళ్లకు నమ్మకం లేదు. చదువు కూడు పెట్టదంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఆవారాగా తిరుగుతున్న చదువుకున్నోళ్లను లెక్కబెడుతున్నారు. ‘ఇంతకీ, ఏం జరిగిందో నువ్వు చెప్పు’ అంటూ ఆ చదువుకున్న అమ్మాయిని అడిగాను. ఏమీ జరగలేదంది. మా కమిటీలో మహిళా సభ్యురాలు సౌమ్య గుడియాను పిలిచింది. ఏం జరిగిందో చెప్పమని అడిగింది. ‘బతాదియానా’అంది మెల్లగా. ఎవరికి చెప్పావంటూ మళ్ళీ అడిగింది సౌమ్య. ‘బహుత్ బార్’ అంది. ఆ తర్వాత దేనికీ సమాధానం చెప్పలేదు. ‘అదేం చెబుతుంది చిన్నపిల్ల. నేను చెబుతాను రాసుకోవమ్మా’ అంటూ నోరు తెరచి బిగ్గరగా మున్నీదేవి కూతుర్ని వెనక్కి నెట్టి నిలబడింది. ‘నా పేరు మున్నీ. నాకు అక్షరం ముక్క రాదు. అయినా పూస గుచ్చినట్లు చెబుతాను’ అంటూ భోజ్‌పురిలో మొదలు పెట్టింది. ‘నాకు ఆరుగురు పిల్లలు. నా వయస్సెంతో నాకు తెలీదు. నేను అబద్ధం చెప్పను’ అంటూ ధారాప్రవాహంగా సాగిపోతున్నాయి ఆమె మాటలు. ‘మా వూరిలోకి ఒక సంస్థ నుంచి అంటూ ఒక మహిళ వచ్చింది. ఆమెతో పాటు ఒక వీడియో కెమెరా పట్టుకుని ఒక కుర్రాడు, మాట్లాడేది చేత్తో పట్టుకుని ఒక అమ్మాయి వచ్చారు.’ ఆమె గుక్క తిప్పుకోకుండా చెప్పుకు పోతోంది. ‘మొదట మా గుమ్మం దగ్గరికి వచ్చారు. సంస్థ తాలూకు మహిళ మీకు మేలు జరుగుతుందని మమ్మల్ని ప్రలోభ పెట్టింది. మేం చెప్పినట్లు కెమెరా ముందు చెప్తే, మీకు బోల్డు డబ్బులు వస్తాయంది. మావి కాలుతున్న కడుపులు కదా. పైగా చదువూ సంధ్యాలేని బతుకులు. ఎవరేది చెప్పితే, అది నమ్మేస్తాం. డబ్బు ఎర చూసే సరికి సరే అన్నాం.’ ఆమె గొంతులో కొంచెం బాధ, కొంచెం పశ్చాత్తాపం తొంగి చూశాయి. గొంతు సవరించుకుంది. ‘వాళ్ళు మా గుడియాకు ఎలా మాట్లాడాలో చెప్పారు. వాళ్ళు చెప్పినట్లే కెమెరా ముందు చెప్పింది.’ ‘ఏం చెప్పింది?’ సౌమ్య అడిగింది. ‘జీతం కోసం శరీరం యివ్వాల్సి వస్తుందని. గుత్తేదారు మాతో పాటు, మా లాంటి ఆడపిల్లల్ని పాడు చేస్తున్నాడని.’‘అందులో నిజం లేదా?’ సౌమ్య ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ అడిగింది. నిమిషం పాటు మౌనం. ఆ తర్వాత అందుకుంది. ‘కేసులు పెట్టొచ్చు. మీరు కోల్ జాతి వాళ్ళు కాబట్టి దళిత చట్టం కింద పరిహారం వస్తుంది అని సంస్థ మహిళ నమ్మబలికింది.’‘మా ఇంటి దగ్గర నుండి బబ్లీ ఇంటికి వెళ్లారు. అవే మాటలు చెప్పించారు. దాన్నే టీవీల్లో తెగ చూపించారంట.’ఆమె సహజ వక్త. ఎక్కడ నొక్కి పలకాలో, ఎక్కడ తగ్గి పలకాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ గొంతు పెంచాలో స్వాభావికంగా చేస్తోంది. ‘ఇప్పటి దాకా మీలా ఐదు బృందాలు వచ్చాయి. అందరికీ చెప్పిందే చెబుతూ విసిగిపోయాం.’ మానవధికార సంఘం, చైల్డ్ లేబర్, మహిళా హక్కుల సంఘం, హైకోర్టు బృందం, జిల్లా కలెక్టరు బృందం వచ్చి వెళ్లినట్లు నాకు తెలుసు. ఈ అన్ని కమిటీలు కూడా టీవీలో, పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగానే వచ్చాయి. ఎవరి ఫిర్యాదు వల్లనో వచ్చినవి కావు. ‘ఆ సంస్థ వాళ్ళు మీకు డబ్బులేమైనా యిచ్చారా?’ అనడిగింది సౌమ్య. ‘చెరో రెండు వేలు చేతిలో పెట్టి వెళ్లిపోయారు. మీరే చెప్పండి యిప్పుడు ఈ పిల్లల భవిష్యత్తు ఏం కాను?’ అంటూ ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. ఇక ఆమె మాట్లాడలేదు. నెమ్మదిగా వెనక్కి జారుకుంది. వూరంతా గాలించాం. సాక్ష్యం కోసం. ఆడ, మగా అంతా ఖాళీగా వున్నారు. గుసగుసలు. అక్కడక్కడ ఏవగింపులు. గుంపులు గుంపులుగా కూర్చున్నారు. కొరోనా భయం కూడా లేకుండా. ‘పనిలోకి వెళ్ళలేదు ఏం?’ అని ఒకరిద్దరి మగాళ్లను అడిగాం. ‘పని ఆగిపోయింది’ అన్నారు. టీవీలో వచ్చిన విషయం గురించి అడిగాం. ఒక్కరు కూడా దాన్ని సమర్థించలేదు. అబద్ధం అన్నారు. గుడిసెల మధ్యలో నుండి మాలో మేం మాట్లాడుకుంటూ మెల్లగా కారు దగ్గరికి వచ్చాం. నేను కారులో కూర్చుంటుండగా మున్నీదేవి వేగంగా నడుచుకుంటూ వచ్చింది. నా చేతిలో ఒక చిన్న భరిణ పెట్టింది. ‘ఏంటిది?’ అని అడిగాను. ‘కారులో కూర్చొని చూడండి’ అని వూరిలోకి వెళ్ళిపోయింది. మా కారు ఆ గుడిసెల్ని విడిచిపెడుతూ కదిలిపోయింది. భరిణ తెరచి చూశాను. ఇంకిపోయిన రెండు కన్నీటి బొట్లు..! (చదవండి: ఇంట్లో వాళ్లే కాదు... మొత్తం ఊరంతా) -
తండ్రి తిట్టాడని 90 అడుగుల ఎత్తు నుంచి..
Waterfall Jump Video: చిన్న చిన్న కారణాలతో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటోంది ఇప్పటి తరం. తాజాగా.. తండ్రి మందలించాడని ఓ యువతి అఘాయిత్యానికి పాల్పడబోయింది. ఏకంగా 90 అడుగుల ఎత్తు నుంచి దూకేసింది. కానీ, ఆశ్చర్యకరరీతిలో.. ఆ జలపాతమే ఆమెను రక్షించింది!.. ఛత్తీస్‌గఢ్ బస్తర్ జిల్లా జగదల్పూర్ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో చిత్రకూట్ చౌకీ వద్ద మంగళవారం సాయంత్రం ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. జలపాతం చివరి దాకా వెళ్లి.. నిల్చుంది. ఆ సమయంలో కొందరు ఆమెను గమనించి.. వద్దని వారించారు. కానీ, ఆమె వినకుండా దూకేసింది. కానీ, అంత పై నుంచి పడ్డా కూడా అదృష్టం కొద్దీ ఆమెకు ఏం కాలేదు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రాళ్లపై పడకుండా.. నేరుగా నీళ్లలోకి వచ్చి చేరింది. ఆమె బతికే ఉందని గుర్తించిన స్థానికులు పడవల్లో వెళ్లి రక్షించి.. ఒడ్డుకు తెచ్చారు. Watch this Earlier in the day, a woman attempted to commit suicide by jumping into Chitrakoot waterfall of Bastar district, #Chhattisgarh. Fortunately, the woman managed to swim back to shore.#mentalhealth pic.twitter.com/qtBGMaFhnu — Arvind Chauhan (@Arv_Ind_Chauhan) July 18, 2023 ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించి పేరెంట్స్‌కు అప్పజెప్పారు. సెల్‌ఫోన్ అతిగా వాడుతున్నందుకు తండ్రి మందలించడంతోనే ఆమె ఆత్మహత్యకు యత్నించిందని తెలుస్తోంది. జలపాతం వద్ద కొందరు యువకులు తమ సెల్ఫోన్లలో ఆమె దూకేటప్పుడు దృశ్యాలను బంధించగా.. అవి వైరల్ అవుతున్నాయి. ఇంద్రావతి నదిపై చిత్రాకోట్ జలపాతం ఉంది. దాదాపు 90 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు దూకుతుంటుంది. ఈ వాటర్ఫాల్కు స్థానికంగా మినీ నయాగారా ఫాల్స్‌గా పేరుంది. వానాకాలంలో 300 మీటర్ల విస్తీర్ణంతో ప్రవహిస్తుంటుంది. అయితే చుట్టూ రక్షణా వలయంలాంటివి లేకపోవడంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అస్తమాను ఫోన్ తోనే.. తండ్రి తిట్టారని 90 అడుగుల ఎత్తు నుండి
రాంచీ: భారత నయాగరాగా పిలవబడే చిత్రకూట్ జలపాతంలోకి దూకి ఒక యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు సమాయానికి స్పందించబట్టి ఆ యువతి 90 అడుగుల ఎత్తు నుండి దూకినా కాపాడగలిగారు. ఎటొచ్చి ఆమే ఎందుకు చనిపోవాలనుకుందో కారణం తెలిసిన తర్వాత ఎవ్వరికీ నోట మాట రాలేదు. తన కోపమే తనకి శత్రువు అంటారు. అలాంటి కోపమే ఓ యువతి ప్రాణాలను యమలోకం అంచు వరకు తీసుకెళ్ళింది. పిల్లలు తప్పు చేస్తే తల్లదండ్రులు మందలించడం సర్వసాధారణమే. పిల్లలు అందుకు బదులుగా కోపగించడం కూడా సహజమే. రెండు మూడు రోజులు ఈ పరిస్థితి ఉంటుంది. తర్వాత అంతా మామూలే.. ఎక్కడో కొంతమంది మాత్రమే తల్లదండ్రులు తిట్టారని అజ్ఞానంతో వ్యవహరిస్తూ ఉంటారు. అచ్చంగా అలాంటి పిచ్చి పనే చేసింది చిత్రకూట్ కు చెందిన సరస్వతి మౌర్య(21). నిత్యం సెల్ ఫోన్లో ఎదో ఒకటి చూసుకుంటూ కాలక్షేపం చేస్తోందన్న కారణంతో ఆమె తండ్రి శాంటో మౌర్య ఆమెను పరుషమైన మాటాలతో దూషించారట. తప్పు చేస్తున్నానని గ్రహించకపోగా అంత మాత్రానికే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెబుతున్నారు పోలీసులు. కోపంతో సరస్వతి చిత్రకూట్ జలపాతాల వద్దకు వెళ్లి చుట్టుపక్కల వారు వారిస్తున్నా వినకుండా 90 అడుగుల ఎత్తు నుండి అందులోకి దూకేసింది. క్షణాల్లో ఆమె నదీప్రవాహంలో కిందకు వెళ్ళిపోయింది. అక్కడి గ్రామస్థులు అప్రమత్తమై బోటు మీద వెళ్లి సరస్వతిని రక్షించారు. అక్కడున్న సందర్శకుల్లో ఒకరు ఈ దృశ్యాన్ని ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇది కూడా చదవండి: కుటుంబాన్ని చంపి తగులబెట్టి.. మృతుల్లో ఆరు నెలల పసికందు.. -
వ్యాపారంలో తీవ్ర నష్టాలు.. కుటుంబ సభ్యులను మూడేళ్లుగా బంధించి..
యూపీలోని చిత్రకూట్‌లో ఆశ్చర్యకర ఉదంతం ఒకటి చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన వ్యాపారి కాశీ కేశర్వానీ తన కుటుంబ సభ్యులందరినీ ఇంటిలోనే బంధీ చేశాడు. అతను మూడేళ్లుగా తన భార్య, పిల్లలను ఇంటిలోనే ఉంచాడు. బయటకు వెళ్లనివ్వలేదు. దీనికితోడు ఇంటి కిటికీలను కూడా పూర్తిస్థాయిలో మూసివేశాడు. పిల్లల చేత చదువు మాన్పించేశాడు. ఇంటికి అవసరమైన నిత్యావసర వస్తువులు తానే తీసుకువస్తున్నాడు. గత మూడేళ్లుగా అతని భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఇంటిలోనే మగ్గిపోతున్నారు. ఇటీవల వీరి ఇంటికి వచ్చిన బంధువులు వీరి ఇంటి తలుపులకు తాళాలు వేసివుండటంతో ఇరుగుపొరుగువారి సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ఇంటి తలుపుల తాళాలు పగులగొట్టి, లోపలి పరిస్థితి చూసి నివ్వెరపోయారు. తరువాత కాశీ భార్య, పిల్లలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చైల్డ్ లైన్ టీమ్ సభ్యుడు దీపా శుక్లా తెలిపిన వివరాల ప్రకారం కాశీ కేశర్వానీ భార్య పూనమ్(45), కుమారుడు రజత్(13) కుమార్తె అర్షిత(14) గత మూడేళ్లుగా ఇంటిలోనే మగ్గుతున్నారని అన్నారు. రెండు రోజుల క్రితం కాశీ బావ తన సోదరి, అతని భర్తతో కలిసి చిత్రకూట్ వచ్చాడు. అయితే కాశీ ఇంటికి తాళం వేసి ఉండటంతో ఇరుగుపొరుగువారి సహాయంతో చైల్డ్ లైన్‌తో పాటు పోలీసులకు ఫోన్ చేశాడు. వారు సంఘటనానికి వచ్చి ఇంటిలోని పరిస్థితులను పరిశీలించారు. ఇంటిలోని ప్రతీగదిలో హోమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఒక గదిలో సమాధి లాంటి నిర్మాణం ఉంది. దానిపై కత్తి గుచ్చి ఉంది. ఆ గది తలుపులపై ఓం అక్షరంతో పాటు జై మాతా దీ అని రాసివుంది. దీనికితోడు ఆ వ్యాపారి తన ఇంటిలోకి ఏమాత్రం వెలుగు చొరబడకుండా ఉండేందుకు అన్ని కిటికీలను మూసివేశాడు. వ్యాపారి విచిత్ర ప్రవర్తన కారణంగా అతని భార్య మానసిక వ్యాధిగ్రస్తురాలైంది. వారి పిల్లలు శారీరకంగా చాలా బలహీనంగా మారిపోయారు. బాధితులు ముగ్గురు ఏమాత్రం నడవలేని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం కాశీ తన వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. ఇంటి పరిస్థితులు ఇతరులకు తెలియకూడదని భార్యపిల్లలను ఇంటిలోనే బంధించాడు. పిల్లల చేత చదువు మాన్పించాడు. నిత్యావసరాలను తానే తీసుకు వస్తుండేవాడు. వారంతా ఇంట్లో పూజలు చేస్తుండేవారు. ప్రస్తుతం అతనికి కూడా మానసిక వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
జైల్లో కాల్పుల కలకలం.. గ్యాంగ్‌స్టర్ మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ చిత్రకూట్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చెలరేగి కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు హతమయ్యారు. ఇద్దరు ఖైదీలను తోటి ఖైదీ కాల్చి చంపడంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గ్యాంగ్ వార్ ఘటనపై నివేదక అందజేయాలని డివిజనల్ కమిషనర్ డీకే సింగ్, చిత్రకూట్ ఐజీ, జైళ్ల శాఖ డీఐజీ సంజీవ్ త్రిపాఠిలను ఆదేశించారు. మృతి చెందిన ఖైదీలను అన్షు దీక్షిత్, మిరాజుద్దీన్ అలియాస్ మిరాజ్ అలీ, ముకీం కాలాగా పోలీసులు ప్రకటించారు. మిరాజ్ అలీ, ముకీం కాలాని అన్షు దీక్షిత్ తుపాకీతో కాల్చి చంపేశాడు. మరికొందరు ఖైదీల తలకు తుపాకీ గురిపెట్టి చంపుతానని బెదిరించడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దీక్షిత్ ప్రాణాలు కోల్పోయాడని సీనియర్ పోలీసు అధికారి సత్యనారాయణ్ తెలిపారు. అయితే జైల్లోకి తుపాకీ ఎలా వచ్చిందనే విషయంపై విచారణ చేపట్టినట్లు ఆయన చెప్పారు. అందరూ కరుడుగట్టిన నేరస్తులని.. వారిపై చాలా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన అన్నారు. అయితే ఈ ఘటనపై జిల్లా జైలర్ ఎస్పీ త్రిపాఠి సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో ఖైదీల మధ్య గొడవ జరుగుతున్న సమయంలో సిబ్బంది ఆపేందుకు యత్నించారని.. ఆ సమయంలో దీక్షిత్ జైలు అధికారి రివాల్వర్ లాక్కుని తోటి ఖైదీలపై కాల్పులు జరిపాడని అన్నారు. అనంతరం జరిగిన ఎదురుకాల్పుల్లో దీక్షిత్ చనిపోయాడని చెప్పారు. అయితే ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లో గ్యాంగ్ వార్ కారణంగానే కాల్పుల ఘటన చోటుచేసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. యూపీలోని షామ్లీకి చెందిన ముకీం కాలా హత్యలు, దోపిడీలు, వసూళ్ల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రాజకీయ నేతగా ఎదిగిన గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ ముఠాలో మిరాజ్ అలీ కీలక సభ్యుడిగా తెలుస్తోంది. సీతాపూర్‌కి చెందిన కాంట్రాక్ట్ కిల్లర్ అన్షు దీక్షిత్ గతంలో గ్యాంగ్ స్టర్ మున్నా బజరంగి వద్ద పనిచేసినట్లు సమాచారం. మిరాజ్ అలీని మార్చి 20న వారణాసి జైలు నుంచి చిత్రకూట్ జైలుకి మార్చారు. కాలాని సహరాన్పూర్ నుంచి ఈ నెల 7న ఇక్కడికి తరలించినట్లు తెలుస్తోంది. దీక్షిత్ 2019 నుంచి ఇదే జైలులో ఉంటున్నాడు. చదవండి: ఆస్పత్రిలో పక్కా ప్లాన్: సెంట్రీ బిర్యానీలో మత్తు మందు కలిపి -
ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకరినే మనువాడారు!
లక్నో: శోభా, రీనా, పింకీ.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు. ఏం చేసినా ఈ ముగ్గురు కలిసే చేస్తారు. కలిసి డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత కలిసికట్టుగా ఒకేసారి పెళ్లిపీటలెక్కారు. కానీ విడ్డూరంగా ముగ్గురూ ఒక్కడినే మనువాడారు. ఇది జరిగి 12 సంవత్సరాలు అవుతోంది. అయితే ఉత్తరాదిన ఆచరించే కర్వా చౌత్ పండగ సందర్భంగా ఈ దంపతులు మరోసారి వార్తల్లో నిలిచారు. ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకోట్‌కు చెందిన కృష్ణకు ముగ్గురు భార్యలు. ఆ ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లు కావడం. ప్రస్తుతం ఈ ముగ్గురికీ చెరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్లంతా కలిసి కంసీ రామ్ కాలనీలో అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలవుతున్నా ఆ కుటుంబంలో గొడవలు అనేవే లేవట. (చదవండి: భార్య ఉపవాసం.. భర్త ఆత్మహత్య) ఈ కుటుంబం గురించి వాళ్ల బంధువు మాట్లాడుతూ.. " అతడి ముగ్గురు భార్యలు చదువుకున్నవాళ్లు. వాళ్లు ఎప్పుడూ విడిగా ఉందామనుకోలేదు. కలిసి ఉండటంలోనే సంతోషం ఉందని నమ్ముతున్నారు. కానీ కృష్ణ ఒకే వేదికపై ఈ ముగ్గురిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడన్నది మాత్రం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. అతడు కూడా దీని గురించి ఎప్పుడూ నోరు మెదపలేదు" అని చెప్పుకొచ్చారు. ఇక కర్వా చౌత్ సందర్భంగా భర్త సుఖ సంతోషాలు కోరుతూ ముగ్గురు భార్యలు ఉపవాసం ఉండి, సాయంత్రం చంద్రుడికి పూజలు చేశారు. ఆపై చంద్రుడు వచ్చాక ఓ జల్లెడను తెరగా చేసుకుని భర్తను చూశారు. ఆ సమయంలో తీసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి: హ్యాపీ కర్వాచౌత్ గౌతం: కాజల్) -
గిరిజన బాలికలపై ఆఘాయిత్యాలు
బుందేల్‌ఖండ్ : పేదరికమే ఆ బాలికలకు శాపంగా మారింది. పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన వారిని గనుల్లో పనిచేసేలా చేసింది. లైంగిక దోపిడికి గురయ్యేలా చేసింది. ఈ పరిస్థితి వారితల్లిదండ్రులకు కూడా తెలుసు కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రకూట్‌లో సాగుతోంది ఈ దురాగతం. గిరిజన బాలికల పేదరికాన్ని అడ్డుపెట్టుకొని కొందరు ధనవంతులు ఇష్టారాజ్యంగా లైంగిక దోపిడికి పాల్పడుతున్న దీనగాథ ఇది. చిత్రకూట్ ప్రాంతంలో ఆడపిల్లలు చదువుకోవడమే చాలా అరుదు. ఒకవేళ స్కూల్‌కి వెళ్లినా 7వ తరగతే మహా ఎక్కువ. కుటుంబ పోషణ కోసం ఆ చిన్నారులు ఆ అక్రమ గనుల్లో పనిచేయాల్సిందే.. కానీ అక్కడ కూడా వారి శ్రమకు తగ్గ డబ్బులు ఇవ్వరు శ్రమదోపిడీ చేస్తారు. అంతేనా.. పేదరికాన్ని అడ్డుపెట్టుకొని వారిని లైంగికంగా దోచుకుంటారు. పొట్టకూటి కోసం ఏమీ చేయలేక బాలికలు వారి శరీరాలను 200-300 రూపాయలకు అమ్ముకోవాల్సిన దుస్థితి. భారతీయ శిక్షాస్మృతిలోని చట్టాలు, నిబంధనలేవీ చిత్రకూట్ ప్రాంతం దాకా దరిచేరవు. అక్కడి మైనర్ బాలికలు లైంగికంగా దోపిడీకి గురవుతున్నా ప్రభుత్వాలకు పట్టదు. ‘నా పేరు రింకు (పేరు మార్చాం). కాంట్రాక్టర్లు మాతో చాలా పని చేయించుకుంటారు. కానీ ముందు చెప్పినంత డబ్బులివ్వరు. మమ్మల్ని శారీరకంగా వాడుకుంటారు. ఒకవేళ తిరగబడితే చంపేస్తామని బెదిరిస్తారు. రోజుకి 200-300 రూపాయలు ఇస్తామని పనికి కుదుర్చుకొని కేవలం 150 రూపాయలే ఇస్తారు. మిగిలిన డబ్బులు ఇవ్వాలంటే వాళ్లకి సహకరించాల్సిందే. కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఏమీ చేయలేక దానికి ఒప్పుకుంటాం. కొన్నిసార్లు అయితే ఒకరి కంటే ఎక్కువ మంది మాపై అత్యాచారానికి పాల్పడతారు’ అంటూ మీడియాతో గోడు వెళ్లబోసుకుంది. ‘లాక్డౌన్ కారణంగా మా బతుకులు చాలా దయనీయంగా మారాయి. అనారోగ్యం కారణంగా మా ఆయన మంచాన పడ్డాడు. దీంతో నా బిడ్డ సౌమ్య (పేరు మార్చాం)ను 7వ తరగతి మధ్యలోనే చదువు మాన్పించా. పనికి పోతుండేది. కానీ లాక్డౌన్ వల్ల పరిస్థితులు తలకిందులయ్యాయి. పని లేకపోవడంతో ఆ కాంట్రాక్టర్లు దీన్నే ఆసరాగా చేసుకొని నా బిడ్డ లాంటి ఎంతోమంది బాలికలను లైంగికంగా హింసిస్తున్నారు. వాళ్లపై తిరగబడే శక్తి మాకు లేదు ఎందుకంటే మా బతుకులు అలాంటివ’ని రింకు తల్లి వాపోయింది. చిత్రకూట్‌లో జరుగుతున్న ఈ అఘాయిత్యాలపై ఓ జాతీయ మీడియా ప్రచురించిన కథనంపై జిల్లా మేజిస్ట్రేట్ స్పందించి దర్యాప్తునకు ఆదేశించింది. చట్ట పరంగా వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా మేజిస్ట్రేట్ శేష్ మణిపాండే హామీ ఇచ్చారు. దీనిపై దర్యాప్తు చేయడానికి ఓ బృందాన్ని నియమించారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చేస్తామని అంతేకాకుండా గ్రామ వార్డు సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో జరిగే ఇలాంటి దుశ్చర్యలపై ఎప్పటికప్పుడు తమకు నివేదించాలని చిత్రకూట్ ఎఎస్పీ ఆర్ఎస్ పాండే కోరారు. -
పొలానికి వెళ్లిన ఇద్దరు బాలికలు శవాలుగా...
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. పొలానికి వెళ్లిన ఇద్దరు బాలికలు గురువారం శవాలుగా మారారు. చిత్రకూట్‌లోని మావో తహసీల్ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు... మృతులు ఇద్దరు గురువారం ఉదయం పొలానికి వెళ్లారు. అయితే ఎంతసేపటికి వారు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారిని వెదుక్కుంటూ వెళ్లారు. ఈ క్రమంలో సదరు బాలికలు ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యలేనా? ప్రాథమిక దర్యాప్తులో భాగంగా మృతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా 2014లో కూడా ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సామూహిక అత్యాచారానికి గురయ్యామనే అవమాన భారంతో వారు బలవన్మరణానికి ఒడిగట్టారని బంధువులు ఆరోపించగా.. సీబీఐ మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. -
అక్కడి ఎన్నికల్లో బందిపోట్ల ప్రభావం
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని సాత్న జిల్లా చిత్రకూట్ హిందువులకు ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైన పట్టణం. అయోధ్య రాముడు గడిపిన 14 ఏళ్ల వనవాసంలో 11 ఏళ్లు ఈ ప్రాంతం అడవుల్లోనే గడిపాడన్నది ప్రతీతి. ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతానికి రాముడు అయోధ్య నుంచి సతీసమేతంగా నడిచివచ్చారంటూ స్థానికులు ఇక్కడ ఓ దారిని చూపిస్తారు. ‘రామ్ వన్ పథ్’గా ఈ మార్గాన్ని అభివద్ధి చేస్తానంటూ తెగ ప్రచారం చేయడం ద్వారా 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మొదటిసారి విజయం సాధించారు. ఆయన ఏమీ చేయలేకపోవడంతో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో అదే హామీతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఆయన కూడా తన హామీని నిలబెట్టుకోలేక పోయారు. ఈ నేనపథ్యంలో మొత్తం చిత్రకూట్ అసెంబ్లీ అభివద్ధికి కృషి చేస్తామని కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు హామీల మీద హామీలు ఇస్తున్నారు. కులాలు, వర్గాలు ఓట్లను ప్రభావితం చేసే ఈ నియోజకవర్గంలో ఈ హామీలను ప్రజలెవరు నమ్మడం లేదు. ఈ నియోజక వర్గం ఎన్నికలపై బందిపోట్ల ప్రభావం కూడా ఎక్కువే. అందుకే 1998, 2003, 2013 ఎన్నికల్లో మాజీ బందిపోటు ప్రేమ్ సింగ్ విజయం సాధించారు. 2008లో మాత్రం బీజేపీ అభ్యర్థి కేవలం 722 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. ఆయన కూడా నియోజక వర్గం అభివద్ధికి ఎలాంటి కృషి చేయకపోయినా ఆయనకు భయపడి ప్రజలు ఓటేశారట. 2017లో ప్రేమ్ సింగ్ మరణించడంతో ఆయన స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నీలాంషు చతుర్వేది ఉప ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. ఇప్పటికీ బిబ్లీకోల్, సాధనా పటేల్ లాంటి చిన్న స్థాయి బందిపోట్లు ఎన్నికల్లో పోటీ చేసిన కనీసం పదివేల ఓట్లు వస్తాయని స్థానిక వ్యాపారి ప్రద్యూమ్న త్రిపాఠి వ్యాఖ్యానించారు. చిత్రకూట్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిసారి ఒక్క బందిపోటైనా పోటీ చేస్తారట. అయితే ఈసారి ఎన్నికల్లో ఒక్కరు కూడా లేకపోవడం ఆశ్చర్యకరమేనని స్థానికులు అంటున్నారు. ఈ ప్రాంతం ఆర్థికంగా బాగా వెనకబడి ఉండడం, దాచుకోవడానికి చుట్టూ దట్టమైన అటవి ప్రాంతాలు ఉండడం దోపిడీ దొంగలు పెరగడానికి కారణమని స్థానిక ప్రజలే చెబుతున్నారు. ఎప్పటిలాగా ఈసారి కూడా కులాల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నది అర్థం అవుతుంది. నియోజక వర్గంలో మొత్తం ఓటర్లు 1,98,933 మంది. 40 శాతం ఉండే జనరల్ క్యాటగిరీ ఓటర్లలో 36 శాతం బ్రాహ్మణలు కాగా, ఆరు శాతం మంది ఠాకూర్లు ఉన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే నీలాంషు చతుర్వేదిని కాంగ్రెస్ మళ్లీ నిలబెట్టింది. ఈసారి కూడా బ్రాహ్మణులు మూకుమ్మడిగా మంచిపేరుగల నీలాంషుకే మద్దతిస్తుండడంతో బీజేపీ ఠాకూర్లకు చెందిన సురేంద్ర సింగ్ గహావర్ను పోటీకి నిలబెట్టింది. బీఎస్పీ పార్టీ 19.72 శాతం ఓట్లు కలిగిన షెడ్యూల్ కులానికి చెందిన రవీంద్ర సింగ్ పట్వారీని నిలబెట్టింది. ఇక షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఓటర్లు 18.91 శాతం, ఇతర వెనకబడిన వర్గాలకు చెందిన ఓటర్లు 21 శాతం ఉన్నారు. ఓబీసీల మద్దతు కూడా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీఎస్పీ–కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఇంక ఆ అభ్యర్థికి తిరుగే ఉండేది కాదని అంటున్నారు.