యూపీలోని చిత్రకూట్‌లో ఆశ్చర్యకర ఉదంతం ఒకటి చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన వ్యాపారి కాశీ కేశర్వానీ తన కుటుంబ సభ్యులందరినీ ఇంటిలోనే బంధీ చేశాడు. అతను మూడేళ్లుగా తన భార్య, పిల్లలను ఇంటిలోనే ఉంచాడు. బయటకు వెళ్లనివ్వలేదు. దీనికితోడు ఇంటి కిటికీలను కూడా పూర్తిస్థాయిలో మూసివేశాడు. పిల్లల చేత చదువు మాన్పించేశాడు. ఇంటికి అవసరమైన నిత్యావసర వస్తువులు తానే తీసుకువస్తున్నాడు. గత మూడేళ్లుగా అతని భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఇంటిలోనే మగ్గిపోతున్నారు.
ఇటీవల వీరి ఇంటికి వచ్చిన బంధువులు వీరి ఇంటి తలుపులకు తాళాలు వేసివుండటంతో ఇరుగుపొరుగువారి సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ఇంటి తలుపుల తాళాలు పగులగొట్టి, లోపలి పరిస్థితి చూసి నివ్వెరపోయారు. తరువాత కాశీ భార్య, పిల్లలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చైల్డ్ లైన్ టీమ్ సభ్యుడు దీపా శుక్లా తెలిపిన వివరాల ప్రకారం కాశీ కేశర్వానీ భార్య పూనమ్(45), కుమారుడు రజత్(13) కుమార్తె అర్షిత(14) గత మూడేళ్లుగా ఇంటిలోనే మగ్గుతున్నారని అన్నారు. రెండు రోజుల క్రితం కాశీ బావ తన సోదరి, అతని భర్తతో కలిసి చిత్రకూట్ వచ్చాడు.
అయితే కాశీ ఇంటికి తాళం వేసి ఉండటంతో ఇరుగుపొరుగువారి సహాయంతో చైల్డ్ లైన్‌తో పాటు పోలీసులకు ఫోన్ చేశాడు. వారు సంఘటనానికి వచ్చి ఇంటిలోని పరిస్థితులను పరిశీలించారు. ఇంటిలోని ప్రతీగదిలో హోమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఒక గదిలో సమాధి లాంటి నిర్మాణం ఉంది. దానిపై కత్తి గుచ్చి ఉంది. ఆ గది తలుపులపై ఓం అక్షరంతో పాటు జై మాతా దీ అని రాసివుంది. దీనికితోడు ఆ వ్యాపారి తన ఇంటిలోకి ఏమాత్రం వెలుగు చొరబడకుండా ఉండేందుకు అన్ని కిటికీలను మూసివేశాడు. వ్యాపారి విచిత్ర ప్రవర్తన కారణంగా అతని భార్య మానసిక వ్యాధిగ్రస్తురాలైంది. వారి పిల్లలు శారీరకంగా చాలా బలహీనంగా మారిపోయారు.
బాధితులు ముగ్గురు ఏమాత్రం నడవలేని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం కాశీ తన వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. ఇంటి పరిస్థితులు ఇతరులకు తెలియకూడదని భార్యపిల్లలను ఇంటిలోనే బంధించాడు. పిల్లల చేత చదువు మాన్పించాడు. నిత్యావసరాలను తానే తీసుకు వస్తుండేవాడు. వారంతా ఇంట్లో పూజలు చేస్తుండేవారు. ప్రస్తుతం అతనికి కూడా మానసిక వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment