ప్రభుత్వం నన్ను విచారణాధికారిగా నియమించింది. నా కమిటీలో సభ్యులుగా ఒక ఎస్పీ, ఒక మహిళా డిఎస్పీ కూడా వున్నారు. ఆమె పేరు సౌమ్య. ముగ్గురం కారులో బయల్దేరాం. లక్నో నుంచి ఆరు గంటల ప్రయాణం. అది చిత్రకూట్ జిల్లా. దాని ముఖ్యాలయం కర్వీ. అక్కడ ప్రభుత్వ అతిథి గృహంలో వసతి ఏర్పాటు చేశారు. అల్పాహారం తీసుకొని, ఉదయం తొమ్మిది గంటలకు బయల్దేరాం. మాకు మార్గం చూపించేందుకు ఒక ఎస్సైను పైలెట్‌గా పెట్టారు. ఎటు చూసినా కొండలు. వింధ్యాచల పర్వతాలు. పచ్చటి చీర కట్టుకున్న కొండల మేనిపై సూర్యోదయ కిరణాలు మరింత తళతళలాడుతున్నాయి.
రాళ్ళూ రప్పలతో ఎప్పుడూ ఎండిపోయిన ముఖంతో దీనంగా వుండే బుందేల్‌ఖండ్ నేల.. పచ్చని పొలాలతో, చెట్లతో యవ్వన చైతన్యంతో వెలుగుతోంది. ఆ ప్రకృతిని చూస్తుంటే, చాన్నాళ్ల నా కళ్ల ఆకలి తీరిపోయిందనిపించింది. కారు నత్తనడక నడుస్తోంది. డ్రైవర్ తప్పు కాదు. రోడ్డు లోపం అంతకన్నా కాదు. అన్నా ఆవుల వల్ల. వందల కొలది ఆవులు రోడ్డుకు అడ్డంగా తిరుగుతుంటాయి. పాలివ్వని ఆవుల్ని యిలా గాలికి వదిలేస్తారు. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఎక్కడ చూసినా కనిపించే ముఖచిత్రం యిది.
అన్నా ఆవులు, నీలి ఆవులు కలిసి పంటల్ని నాశనం చేస్తుంటాయి. రైతులు తమ కన్నీళ్లను కడుపులోనే దాచుకుంటున్నారు. మా కారు కొండల పాదాల వద్ద వున్న గుడిసెలకు రెండు కిలోమీటర్ల దూరంలో ఆగింది. అక్కడి నుండి నడక. అక్కడ సుమారు వంద గుడిసెలు. మట్టితో కట్టినవి. విద్యుత్తు లేని వూరులుంటాయా అన్న అనుమానం రాకుండా అవి సాక్ష్యంగా నిలబడ్డాయి. శ్రీశ్రీ వర్ణించిన ‘భిక్షు వర్షీయసి’ ని గుర్తు చేస్తున్నట్లున్నాయి ఆ గుడిసెలు.
నడుచుకుంటూ ఆ వూరి మధ్యలోంచి వెళ్తున్నాం. ఇళ్ల చూర్ల మధ్య ముఖాలు పెట్టి, మమ్మల్ని చూస్తున్నారు జనం. ఒకరిద్దరిని పిలిచి హిందీలో అడిగాం. ‘ఇవాళ పనిలోకి వెళ్ళలేదా?’ అని. ‘పని లేదు సాబ్ ’ హిందీలోనే నిర్లిప్త సమాధానం. పోలీసుల్ని చూసి వాళ్ళ కళ్లు భయపడలేదు. ఇందరు అధికారులు ఆ గుడిసెల దగ్గరకి ఎందుకు వచ్చారన్న ఆశ్చర్యం లేదు. నాకు ఆశ్చర్యమనిపించింది. ఏ హావభావాలు లేని వాళ్ళ పెదాలు చూసి. దేశాన్ని ఒక్క కుదుపు కుదిపిన ఘటన. విభిన్న విచారణ సంస్థలకు కంటి
మీద కునుకు లేకుండా చేసిన ఘటన. అగ్ని పర్వతం పుట్టిన చోటును వీసమంతయినా కదపలేకపోయింది. వచ్చిన పని వెదుక్కుంటూ బాధితురాలు బబ్లీ ఇంటికి చేరాం. పన్నెండేళ్ల బాలికను తీసుకొని, వాళ్లమ్మ బయటకొచ్చింది. తల్లి కొంగు చాటున అమాయకంగా నిలబడింది. ఎటు చూసినా పేదరికం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మా కమిటీ సభ్యురాలు సౌమ్య ఆమెను వివరాలు అడుగుతున్నది. అన్నింటికీ వాళ్ళమ్మే సమాధానం చెబుతోంది. పని వెదుక్కుంటూ మీర్జాపూర్ జిల్లా నుండి ముప్పై ఏళ్ల క్రితం వలస వచ్చారట. వాళ్లందరికీ గుడిసెలు కట్టుకోవడానికి ఒక భూస్వామి మూడెకరాల పొలాన్ని కేటాయించాడట.
ఒకరి తర్వాత ఒకరు చేరి, ఇప్పటికి వంద కుటుంబాలయ్యాయి. గత పదేళ్లలో ఇసుక తవ్వకాల పనులు బాగా ఎక్కువయ్యాయని చెప్పింది. అందులో కూలీ పని నిత్యం వుంటుందని చెప్పింది. ‘ఈ చిన్న పిల్లలు కూడా కూలి పనికి వస్తారా?’ అడిగాం. లేదు. వీళ్ళు ఇంటి దగ్గరే వుండి, వంట చేస్తారు.’ ‘వీళ్ళు ఇసుక పని దగ్గరకు అస్సలు రారా?’
‘అప్పుడప్పుడు భోజనం తీసుకుని వస్తారు.’ ‘అంటే, రోజూ మీరు వెళ్ళేప్పుడే భోజనం తీసుకెళ్తారా?’‘అవును.’‘గుత్తేదారు జీతం యివ్వడానికి యిబ్బంది పెడతాడా?’‘ లేదు. ప్రతి సోమవారం పేమెంట్ చేస్తారు. ’‘ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఒక్కటే జీతమా?’‘ రోజుకి ఆడవాళ్ళకి రెండొందలు. మగవాళ్లకు మూడొందలు.’
ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లు అక్కడ పోగయ్యారు. ఆసక్తిగా వింటున్నారు. ‘ఎక్కువ జీతం ఎర చూపి, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ఎప్పుడైనా ప్రవర్తించారా?’ ‘లేదు సాబ్. అలాంటిదెప్పుడూ లేదు. పనిలో మేమందరం కలిసే వుంటాం. కలిసే వస్తాం’ అంది మరొక ఆమె. ‘ఈమెవరు?’ అని అడిగాను. ‘గుడియా వాళ్ళమ్మ’ అని బదులిచ్చింది మరొకామె. మేం దర్యాప్తు చేస్తున్న మరొక బాధితురాలు గుడియా. మహిళా అధికారి.. బబ్లీని దగ్గరకు పిలిచింది. బిక్కు బిక్కుమంటూ వచ్చింది. భోజ్‌పురిలో అడగడం మొదలు పెట్టింది.
‘ఎవరికీ భయపడనక్కర లేదు. జరిగింది జరిగినట్లు చెప్పమ్మా!’ మౌనంగా నిలుచుంది. ఏ ప్రశ్న లేని వుత్తరంలా వుంది ఆమె ముఖం. ‘మేమున్నాం. నీకే భయం లేదు. గుత్తేదారు నిన్నేం చేశాడో చెప్పు.’ ‘కుచ్∙నహీ కియా’ నూతిలో నుండి ఒడ్డుకు వచ్చినట్లుగా, ఆమె పెదాలను దాటి వచ్చింది ఆ మాట. మహిళా అధికారి మరింత సౌమ్యాన్ని ప్రదర్శించింది. ‘చెప్పమ్మా. ఆ రాక్షసుడు నీ చెయ్యి పట్టుకు లాగాడా?’‘ నహీ.. కుఛ్∙నహీ హువా.’ అదే వ్యక్తీకరణ. ‘గుత్తేదారిని ఎప్పుడన్నా చూశావా?’ ‘నహీ’ ‘నువ్వు ఆ ఇసుక తవ్వకం పని చేశావా?’ ‘నహీ.’ ‘నిన్ను గుత్తేదారు మనుషులెవరన్నా రమ్మన్నారా?’
‘నహీ’ ‘మరి నువ్వు ఏం చేస్తావు?’ ‘ఖానా బనాతీ హూ’ ‘చదువుకున్నావా?‘ ‘నహీ’‘టీవీ వాళ్లకు అలా ఎందుకు చెప్పావు?’ ‘పైసా కే లియే’‘అలా చెబితే డబ్బులు యిస్తానన్నారా?’ ‘హా!’ అక్కడ నుండి బబ్లీ వాళ్లమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది. ‘ఈ వూరిలో చదువుకున్నవాళ్ళెవరైనా వున్నారా?’ అని అడిగాం. ‘ఆ! యిదిగో ఈ దుర్గే పెద్ద చదువు చదివింది’ అన్నారు. మూడేళ్ళ పాపను ఎత్తుకుని నిలబడ్డ దుర్గ గర్వంగా చూసింది. ‘ఏం చదువుకున్నావమ్మా?’ అడిగాను నేను. ముసి ముసిగా నవ్వుతోంది. పరవాలేదు, చెప్పమ్మా అన్నట్లుగా ఆమె వైపే చూస్తున్నాను.
‘పాంచ్’ అంది మెల్లగా ముసి ముసి నవ్వులో నుంచి బయట పడుతూ. నా గుండె ఆ క్షణం కొట్టుకోవడం మానేసింది. వంద గుడిసెలకు ఇదే పెద్ద చదువు. ఆరా తీశాను. చదువు మీద వాళ్లకు నమ్మకం లేదు. చదువు కూడు పెట్టదంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఆవారాగా తిరుగుతున్న చదువుకున్నోళ్లను లెక్కబెడుతున్నారు. ‘ఇంతకీ, ఏం జరిగిందో నువ్వు చెప్పు’ అంటూ ఆ చదువుకున్న అమ్మాయిని అడిగాను. ఏమీ జరగలేదంది. మా కమిటీలో మహిళా సభ్యురాలు సౌమ్య గుడియాను పిలిచింది. ఏం జరిగిందో చెప్పమని అడిగింది.
‘బతాదియానా’అంది మెల్లగా. ఎవరికి చెప్పావంటూ మళ్ళీ అడిగింది సౌమ్య. ‘బహుత్ బార్’ అంది. ఆ తర్వాత దేనికీ సమాధానం చెప్పలేదు. ‘అదేం చెబుతుంది చిన్నపిల్ల. నేను చెబుతాను రాసుకోవమ్మా’ అంటూ నోరు తెరచి బిగ్గరగా మున్నీదేవి కూతుర్ని వెనక్కి నెట్టి నిలబడింది. ‘నా పేరు మున్నీ. నాకు అక్షరం ముక్క రాదు. అయినా పూస గుచ్చినట్లు చెబుతాను’ అంటూ భోజ్‌పురిలో మొదలు పెట్టింది. ‘నాకు ఆరుగురు పిల్లలు. నా వయస్సెంతో నాకు తెలీదు. నేను అబద్ధం చెప్పను’ అంటూ ధారాప్రవాహంగా సాగిపోతున్నాయి ఆమె మాటలు. ‘మా వూరిలోకి ఒక సంస్థ నుంచి అంటూ ఒక మహిళ వచ్చింది. ఆమెతో పాటు ఒక వీడియో కెమెరా పట్టుకుని ఒక కుర్రాడు, మాట్లాడేది చేత్తో
పట్టుకుని ఒక అమ్మాయి వచ్చారు.’ ఆమె గుక్క తిప్పుకోకుండా చెప్పుకు పోతోంది. ‘మొదట మా గుమ్మం దగ్గరికి వచ్చారు. సంస్థ తాలూకు మహిళ మీకు మేలు జరుగుతుందని మమ్మల్ని ప్రలోభ పెట్టింది. మేం చెప్పినట్లు కెమెరా ముందు చెప్తే, మీకు బోల్డు డబ్బులు వస్తాయంది. మావి కాలుతున్న కడుపులు కదా. పైగా చదువూ సంధ్యాలేని బతుకులు. ఎవరేది చెప్పితే, అది నమ్మేస్తాం. డబ్బు ఎర చూసే సరికి సరే అన్నాం.’ ఆమె గొంతులో కొంచెం బాధ, కొంచెం పశ్చాత్తాపం తొంగి చూశాయి. గొంతు సవరించుకుంది. ‘వాళ్ళు మా గుడియాకు ఎలా మాట్లాడాలో చెప్పారు. వాళ్ళు చెప్పినట్లే కెమెరా ముందు చెప్పింది.’
‘ఏం చెప్పింది?’ సౌమ్య అడిగింది. ‘జీతం కోసం శరీరం యివ్వాల్సి వస్తుందని. గుత్తేదారు మాతో పాటు, మా లాంటి ఆడపిల్లల్ని పాడు చేస్తున్నాడని.’‘అందులో నిజం లేదా?’ సౌమ్య ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ అడిగింది. నిమిషం పాటు మౌనం. ఆ తర్వాత అందుకుంది. ‘కేసులు పెట్టొచ్చు. మీరు కోల్ జాతి వాళ్ళు కాబట్టి దళిత చట్టం కింద పరిహారం వస్తుంది అని సంస్థ మహిళ నమ్మబలికింది.’‘మా ఇంటి దగ్గర నుండి బబ్లీ ఇంటికి వెళ్లారు. అవే మాటలు చెప్పించారు. దాన్నే టీవీల్లో తెగ చూపించారంట.’ఆమె సహజ వక్త. ఎక్కడ నొక్కి పలకాలో, ఎక్కడ తగ్గి పలకాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ గొంతు పెంచాలో స్వాభావికంగా చేస్తోంది.
‘ఇప్పటి దాకా మీలా ఐదు బృందాలు వచ్చాయి. అందరికీ చెప్పిందే చెబుతూ విసిగిపోయాం.’ మానవధికార సంఘం, చైల్డ్ లేబర్, మహిళా హక్కుల సంఘం, హైకోర్టు బృందం, జిల్లా కలెక్టరు బృందం వచ్చి వెళ్లినట్లు నాకు తెలుసు. ఈ అన్ని కమిటీలు కూడా టీవీలో, పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగానే వచ్చాయి. ఎవరి ఫిర్యాదు వల్లనో వచ్చినవి కావు. ‘ఆ సంస్థ వాళ్ళు మీకు డబ్బులేమైనా యిచ్చారా?’ అనడిగింది సౌమ్య. ‘చెరో రెండు వేలు చేతిలో పెట్టి వెళ్లిపోయారు. మీరే చెప్పండి యిప్పుడు ఈ పిల్లల భవిష్యత్తు ఏం కాను?’ అంటూ ఆమె కళ్లు చెమ్మగిల్లాయి.
ఇక ఆమె మాట్లాడలేదు. నెమ్మదిగా వెనక్కి జారుకుంది. వూరంతా గాలించాం. సాక్ష్యం కోసం. ఆడ, మగా అంతా ఖాళీగా వున్నారు. గుసగుసలు. అక్కడక్కడ ఏవగింపులు. గుంపులు గుంపులుగా కూర్చున్నారు. కొరోనా భయం కూడా లేకుండా. ‘పనిలోకి వెళ్ళలేదు ఏం?’ అని ఒకరిద్దరి మగాళ్లను అడిగాం. ‘పని ఆగిపోయింది’ అన్నారు. టీవీలో వచ్చిన విషయం గురించి అడిగాం. ఒక్కరు కూడా దాన్ని సమర్థించలేదు. అబద్ధం అన్నారు. గుడిసెల మధ్యలో నుండి మాలో మేం మాట్లాడుకుంటూ మెల్లగా కారు దగ్గరికి వచ్చాం. నేను కారులో కూర్చుంటుండగా మున్నీదేవి వేగంగా నడుచుకుంటూ వచ్చింది.
నా చేతిలో ఒక చిన్న భరిణ పెట్టింది. ‘ఏంటిది?’ అని అడిగాను. ‘కారులో కూర్చొని చూడండి’ అని వూరిలోకి వెళ్ళిపోయింది. మా కారు ఆ గుడిసెల్ని విడిచిపెడుతూ కదిలిపోయింది. భరిణ తెరచి చూశాను. ఇంకిపోయిన రెండు కన్నీటి బొట్లు..!
(చదవండి: ఇంట్లో వాళ్లే కాదు... మొత్తం ఊరంతా)
Comments
Please login to add a commentAdd a comment