గజరాజు గర్వభంగం! | Short Story For Kids The Pride Of Gajaraja | Sakshi
Sakshi News home page

గజరాజు గర్వభంగం!

Published Sun, Oct 1 2023 3:13 PM | Last Updated on Sun, Oct 1 2023 3:21 PM

Short Story For Kids The Pride Of Gajaraja - Sakshi

పూర్వం ఓ అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. ఆ అడవిలో తనే పెద్ద జంతువునని, తనకన్నా పెద్ద జంతువు లేనేలేదని, అందరూ తననే గౌరవించాలని చెబుతూ పెత్తనం చలాయించేది. ఏనుగు తీరుతో కుందేలు, తాబేలు, కోతులు, చీమలు భయంతో వణికిపోయేవి. ఆ గజరాజు అడుగుల శబ్దం వినిపిస్తే చాలు జంతువులన్నీ పారిపోయేవి. ఒక రోజు ఓ కోతుల గుంపు వెలక్కాయ చెట్టుపై ఉండడం గమనించింది ఏనుగు. వెలక్కాయలను కోతులు తింటూండం చూసిన ఏనుగుకూ నోరూరింది. చెట్టు దగ్గరకు వచ్చింది. కాయల్ని కోసుకోవడానికి కొమ్మల్ని వంచాలని తొండంతో ప్రయత్నించింది. అందలేదు. పైనే కూర్చున్న కోతులను చూసి ఉరిమింది. అవి భయపడలేదు.

తనకు ఓ పది కాయలు ఇవ్వమని కోతులను ఆజ్ఞాపించింది. ‘మాకు పిల్లలున్నాయి. అవి ఆకలితో అలమటిస్తున్నాయి. వాటికి తీసుకెళ్లాలి. దయచేసి మమ్మల్ని విడిచిపెట్ట’మని అవి ఏనుగును వేడుకున్నాయి. గజరాజు కదలలేదు. ‘ఇంత పెద్ద జంతువును.. నాకు ఆహారం పెట్టకుండా ఎక్కడో ఉన్న పిల్ల కోతుల ఆకలి గురించి ఆలోచిస్తారా? మీకు నేనంటే కొంచెం కూడా భయం లేదు. ఈ అడవంతా నాదే. నేను చెప్పినట్లే మీరంతా వినాలి. నా మాట వినకుంటే ఏం చేస్తానో చూడండి!’ అంటూ తొండంతో ఆ చెట్టును ఊపింది.

ఒక్కసారిగా చెట్టు ఊగడంతో కోతులు మరో చెట్టు మీదకి దూకాయి. అవి తనమాట వినలేదని వాటి మీద మరింత కోపం పెంచుకుంది ఏనుగు. బిగ్గరగా ఘీంకరిస్తూ కోతులు ఎగురుతున్న చెట్లన్నిటినీ తొండంతో కూల్చేసింది. కోతులు తమ పిల్లల కోసం కోసిన వెలగపండ్లను లాక్కుని కాలితో తొక్కేసింది. ఏనుగు వికృత చేష్టలకు కోతులు భయపడి అక్కడి నుంచి తప్పించుకున్నాయి. ఏదోక రోజు ఏనుగుకు తగిన శాస్తి చేయాలని కంకణం కట్టుకున్నాయి.

ఆ రోజు రానే వచ్చింది. ఏనుగు తన తొండంతో భారీ చింత చెట్టును కూల్చివేస్తుండగా చెట్టు కొమ్మలు విరిగి దాని మీద పడ్డాయి. బాధతో విలవిల్లాడింది. అలా గాయాలపాలైన ఏనుగు ఎటూ కదల్లేక ఆ చెట్టు చెంతనే కూలబడిపోయింది. ఆహారం లేక నీరసించిపోయింది. నాలుగు రోజులైనా ఆ దారిన ఎవరూ కనపడలేదు. అప్పుడే ఆ దారిన గంతులేస్తూ వెళ్తున్న కోతులు దానికంటబడ్డాయి. వాటిని పిలుస్తూ తనను రక్షించమని వేడుకుంది. ఏనుగు కష్టం చూసిన కోతులు ‘మమ్మల్ని ఏడిపించిన నీకు తగిన శాస్తే జరిగింది’ అని నవ్వుకున్నాయి.  

‘అవును.. మిమ్మల్ని, ఇతర జంతువులను ఏడిపించినందుకు నాకు సరైన శిక్షే పడింది. జీవితంలో ఇక ఎప్పుడూ ఎవరినీ ఏడిపించను. బుద్ధి వచ్చింది. నన్ను ఈ నరక యాతన నుంచి రక్షించండి’ అని కంటతడి పెట్టుకుంది. కోతుల మనసు కరిగిపోయింది. వాటికి అల్లంత దూరంలో ఓ పెద్ద చెట్టును కూల్చుతున్న మనుషులు కనిపించారు. వారి వద్దకు వెళ్లి ఆపదలో ఉన్న ఏనుగు గురించి చెప్పి రక్షించాలని వేడుకున్నాయి. వాటి అభ్యర్థనను ఆలకించిన మనుషులు ఏనుగు వద్దకు వెళ్లి చూశారు. జేసీబీతో చెట్టు కొమ్మలు తొలగించి ఏనుగును రక్షించారు.  వైద్యుడినీ రప్పించి దాని గాయాలకు తగిన వైద్యం అందించారు. కోతులు, కుందేళ్లు ఏనుగుకు సేవలు చేశాయి. పశ్చాత్తాపం చెందిన ఆ ఏనుగు తనను క్షమించమని ఆ జంతువులన్నిటినీ వేడుకుంది.  

(చదవండి: తెలంగాణ పోరాట స్ఫూర్తి!)
   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement