story
-
అవకాశానికే అవకాశం ఇచ్చింది
కొంతమంది గురించి చెప్పడానికి మాటలు అక్కర్లేదు. వాళ్ల పని చూస్తే చాలు! అలాంటి ప్రతిభావంతురాలే థెమిస్ వెనెస్సా! అవకాశాలను ఆమె వెదుక్కోలేదు.. అవకాశాలే థెమిస్ని వెదుక్కుంటూ వచ్చాయి. అలా వచ్చిన ప్రతి అవకాశంతో మరో చాన్స్‌ని క్రియేట్ చేసింది ఆమె విలక్షణమైన స్టయిలింగ్!థెమిస్ స్వస్థలం చెన్నై. చిన్నప్పుడే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అందుకే స్కూల్‌కి వెళ్లే వయసులోనే నిశ్చయించుకుంది పెద్దయ్యాక తను ఫ్యాషన్ డిజైనర్ కావాలని! అనుకున్నట్టుగానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చదువయ్యాక బెంగళూరులోని ఓ ఫ్యాషన్ మేగజీన్‌లో చేరింది. ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ ద్వారా అప్పటికే సెలబ్రిటీ స్టయిలిస్ట్‌గా పాపులర్ అయిన అర్చా మెహతాను కలిసింది. ఆమె దగ్గర ఇంటర్న్‌గా చేరింది. తర్వాత తమిళ చిత్రం ‘రెమో’తో ఫ్రీలాన్స్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా సినీ ప్రయాణం మొదలుపెట్టింది. ఆమె విలక్షణ శైలికి సినీ ఇండస్ట్రీ ముచ్చటపడి అవకాశాలను అందిచ్చింది. వాటిల్లో ‘ద రోడ్’, ‘మారా’, ‘వేలైక్కారన్’, ‘పొన్నియిన్ సెల్వన్ ’ వంటి సినిమాలున్నాయి. వాటికి ఆమె అసిస్టెంట్ స్టయిలిస్ట్‌గా చేసింది. ఎన్నో ఫొటో షూట్స్, యాడ్స్‌కూ పనిచేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ ప్రాజెక్ట్ వచ్చినా.. పర్సనాలిటీని హైలైట్ చేసే స్టయిలింగ్‌తో వారిని గ్లోబల్ స్టార్స్‌లా చూపింది. ఆ సిగ్నేచర్ స్టయిల్ ఎంతోమంది స్టార్స్‌కి నచ్చింది. శ్రీనిధి, త్రిష, శోభితా ధూళిపాళ, శ్రద్ధా శ్రీకాంత్, చిన్మయిలతో పాటు శివ కార్తికేయన్, విజయ్, జయం రవిలాంటి మేల్ సెలబ్రిటీలకూ స్టయిలింగ్ చేసింది థెమిస్. -
చిట్టి రచయితలు.. అందమైన కథలతో అలరిస్తున్నారు..
పెద్దల కోసం పిల్లలు రచయితలుగా మారి కథలు రాస్తున్నారు. ‘ఆహా’ అనిపించేలా వినసొంపుగా వినిపిస్తున్నారు. పేదింట్లో పుట్టిన చెన్నై శివారులోని కన్నగినగర్ విద్యార్థులు రచయితలుగా, వెంట్రిలాక్విస్ట్లుగా మారి పెద్దలకు కథలు చెబుతున్నారు. వినోదాన్ని పంచుతున్నారు. యూట్యూబ్ నుంచి ఎఫ్ఎం రేడియో వరకు రకరకాల వేదికలపై తమ ప్రతిభను చాటుకుంటున్నారు...‘ఈ ఘనతకు కారణం ఎవరు?’ అనే ప్రశ్నకు జవాబు....చెన్నైకి చెందిన వెంట్రిలాక్విస్ట్ ఎల్ థామస్. ‘క్యారీ విత్ లవ్’ ట్రస్ట్ నిర్వాహకుడైన థామస్ వన్నత్తు పూచ్చిగల్ (సీతాకోక చిలుకలు) పేరుతో పిల్లలలోని సృజనాత్మక ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నాడు. కన్నగిరినగర్లో ఉండే శ్రీ అనే బాలుడు లాస్ట్ బెంచ్ స్టూడెంట్. అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. ఇక చదవడం తన వల్ల కాదు అనుకుంటున్న సమయంలో ‘వన్నత్తు పూచ్చిగల్’ వాట్సాప్ గ్రూప్ తన నిర్ణయాన్ని మార్చేలా చేయడమేకాదు రచయితగా మార్చింది. జంతువులు ప్రధాన పాత్రలుగా ‘బొమ్మలాటం’ అనే నాటకం రాశాడు. స్వీయ ఆలోచన అవసరం గురించి ఈ కథలో చెప్పాడు.ఇదే ప్రాంతానికి చెందిన సంజన స్టోరీ క్రియేటర్‌గా ప్రశంసలు అందుకుంటుంది. పొట్టలం(గంజాయి) అనర్థాలను కళ్లకు కడుతూ రాసిన కథ అందరినీ ఆకట్టుకుంది. జ్యోతిశ్రీ అనే అమ్మాయి రాస్తే... ఎన్నో అక్షర దోషాలు కనిపించేవి. ఇప్పుడు అలా కాదు. చక్కని భాషలో రాస్తుంది. కథలతో మెప్పిస్తోంది. జ్యోతిశ్రీ చిన్న అక్క దివ్యదర్శిని కూడా రచనలు చేస్తోంది. ఆటో డ్రైవర్‌గా తండ్రి పడుతున్న కష్టాలు, గృహిణిగా తల్లి వేదనకు కథా రూపం ఇచ్చింది. ఈ కథలకు జ్యోతిశ్రీ పెద్ద అక్క నర్మద బొమ్మలు వేసింది. వీరు మచ్చుకు కొద్దిమంది మాత్రమే. ఇంకా ఎంతోమంది ఉన్నారు.కథలు రాయడమే కాదు తమ వాక్చాతుర్యంతో ‘వన్నత్తు పూచ్చిగల్’ పేరుతో డిజిటల్ వేదికలపై కూడా సందడి చేస్తున్పారు. తమ అనుభవాలు, స్నేహితుల అనుభవాలు, ఎక్కడెక్కడో విన్న కథలను వినసొంపుగా చెబుతున్నారు. వారి మాటల్లో వినోదమే కాదు విజ్ఞానం, సామాజిక స్పృహ కూడా ఉంటాయి.కళల వెలుగులో..కళ అనేది కేవలం వినోదం కాదని భవిష్యత్ తరాలకు దిక్సూచి అని నిరూపిస్తున్నాడు ఎల్ థామస్. ‘వన్నత్తు పూచ్చిగల్’ ప్రభావంతో చదువులో వెనకబడిన పిల్లల్లో ‘బాగా చదువుకోవాలి’ అనే పట్టుదల పెరిగింది. తమకు ఇష్టమైన కళలో అక్షరాభ్యాసం చేసి ప్రతిభ చాటుకుంటున్నారు. – అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై(చదవండి: మేకప్ వేసుకుంటున్నారా..? ఈ పొరపాట్లు చెయ్యకండి..) -
మంజుమ్మల్ బాయ్స్ నటుడి ప్రేమ కావ్యం.. ఎలా మొదలైందంటే? (ఫోటోలు)
-
ఆమె... ఒక హి‘స్టోరీ’ : ఎవరీ గోపీ సిద్ధి
ఆ అవ్వని చూస్తే కర్ణాటక వాసి అని ఎవరూ అనుకోరు. ‘ఆఫ్రికన్’ అనే అనుకుంటారు. గోపీ సిద్దీ పూర్వీకులు వందల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి ఇండియాకు తీసుకురాబడ్డారు. ఇక్కడికి వచ్చిన తరువాత స్థానిక సంస్కృతులతో కలిసిపోయినప్పటికీ, తమ మూల సంస్కృతిని కాపాడుకుంటున్నారు. సిద్దీస్ జాతి ప్రజలు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలతో పాటు తమ సంస్కృతిని తన కథల ద్వారా లోకానికి చాటుతోంది గోపి సిద్దీ.తులసికొండ (కర్నాటక) ప్రాంతానికి చెందిన కుంటగని గ్రామానికి చెందిన గోపి సన్నా సిద్దీ జనాలకు ఒక వింత. ఒక పురాగాథ. విలువైన కథల చెట్టు. గోపి సిద్దీస్ అనేది ఆఫ్రికన్ సంతతికి చెందిన ఒక ప్రత్యేక జాతి. బానిసలు, కిరాయి సైనికులుగా, నావికులుగా వీరిని భారతదేశానికి తీసుకువచ్చారు. కాలక్రమంలో వీరు స్థానిక భాషలు నేర్చుకున్నారు. ఇక్కడి సంస్కృతిలో భాగం అయ్యారు. అదే సమయంలో తమ ఆఫ్రికన్ వారసత్వ మూలాలను కాపాడుకున్నారు. సంగీతం నుంచి నృత్యరూపాల వరకు అందులో ఎన్నో ఉన్నాయి.ఈ సిద్దీలు కర్నాటక, మహారాష్ట్రలలో ఎక్కువగా కనిపిస్తారు. గోపి సిద్దీ బాల్యంలో కొత్త ప్రాంతానికి వెళితే... ‘ఆఫ్రికన్’ ‘నీగ్రో’ అని పిలిచేవారు. ‘అలా ఎందుకు పిలుస్తున్నారు?’ అని అడిగితే తమ పూర్వీకులు ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చారు అని తల్లి చెబుతుండేది. ఎప్పుడూ ఏవో కథలు వినిపించే గోపి సిద్దీకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. భర్త ఆమెను వదిలేసి మూడు దశాబ్దాలు దాటింది. ఆక్రమణదారుల చెర నుంచి తన వ్యవసాయ భూమిని తిరిగి పొందాలి... ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ తన కథల పుస్తకాలను ప్రచురించాలనే ఉత్సాహం, ఉక్కు సంకల్పంలో మాత్రం మార్పు లేదు. తన పుస్తక ప్రచురణ కోసం నగలు కూడా తాకట్టు పెట్టింది.తమ జాతి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు తనలో నుంచి రచయిత్రి బయటికి రావడానికి కారణం అయ్యాయి. ‘స్వేచ్ఛ గురించి తపించే దృఢమైన వ్యక్తిత్వం గోపి సిద్దీ సొంతం. జీవితంలో ఆమె ఎన్నో పోరాటాలు చేసింది. గోపి సిద్దీ కథల్లో బాధ మాత్రమే కాదు జ్ఞానం కూడా ఉంటుంది. పర్యావరణ స్పృహ ఉంటుంది. తన తాతల కాలం నుంచి వింటూ పెరిగిన కథలు అవి. తనకు పరిచయం అయిన వారికల్లా ఆ కథలను చెబుతుంది. ఆమె శక్తిమంతమైన రచయిత్రి’ అంటుంది ‘బుడా ఫోక్లోర్’ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకు రాలైన సవితా ఉదయ్.పది సంవత్సరాల క్రితం తన ఇంట్లో పని చేయడానికి ఒక పనిమనిషిని వెదుకుతున్న సమయంలో ఉదయ్‌కు గోపీతో పరిచయం ఏర్పడింది. మారుమూల గ్రామానికి పరిమితమైన గోపి సిద్దీ జీవిత కథను తన డాక్యుమెంటరీ ద్వారా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాడు బెంగళూరుకు చెందిన నిశాంత్ గురుమూర్తి. తన స్వచ్ఛంద సంస్థ ‘బుడా ఫోక్లోర్’ ద్వారా జానపదల కథానిలయమైన గోపి సిద్దీతో కర్ణాటక అంతటా పాఠశాల విద్యార్థులతో కథా సెషన్లు నిర్వహిస్తోంది సవితా ఉదయ్. కొంకణీ, కన్నడ భాషలలో ఆమె చెప్పే కథలకు పిల్లలు ఫిదా అవుతుంటారు.ఆ బాధ భరించలేనంత!భాషపరమైన అడ్డంకులు ఉన్నప్పటికి పట్నం పిల్లలు నా కథలను ఇష్టపడుతుంటారు. వారి అభిమానం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కథలు చెప్పడం పూర్తయిన తరువాత నన్ను ఆ΄్యాయంగా కౌగిలించుకొని వీడ్కోలు చెబుతారు. బరువెక్కిన హృదయంతో ఇంటికి వస్తాను. వారిని విడిచి ఇంటికి వస్తుంటే... ఒక్కోసారి ఆ బాధ భరించలేనంతగా ఉంటుంది. – గోపి సిద్దీ -
చూపును మించిన ‘దృష్టి’ : గంగాధర్ స్ఫూర్తిదాయక స్టోరీ
కాకినాడలోని ముతానగర్ తీరప్రాంత గ్రామానికి చెందిన 35 ఏళ్ల గంగాధర్‌ను కలుద్దాం. అతను ధైర్యం, నాయకత్వం, సేవకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు. దృష్టి లోపం ఉన్న గంగాధర్ తన జీవితాన్ని తన సమాజానికి, ముఖ్యంగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార సంఘాలకు సహాయం చేయడానికి అంకితం చేశాడు.ఆయన శారీరక వైకల్యం ఉన్న నూకరత్నంను వివాహం చేసుకున్నారు, వారు ప్రభుత్వ దివ్యాంగుల పింఛను, అతని తల్లిదండ్రుల సహాయంతో తమ కుటుంబ ఖర్చులను వెళ్లదీస్తున్నారు.2013 నుండి రిలయన్స్ ఫౌండేషన్‌తో లబ్ది పొందుతున్న గంగాధర్, ఈ ఫౌండేషన్ హెల్ప్‌లైన్, వాయిస్ మెసేజ్‌లను ఉపయోగించి వాతావరణ హెచ్చరికలు, అల్లకల్లోలమైన సముద్రజలాలు, చేపలు బాగా లభ్యమయ్యే ప్రాంతాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. ఈ ముఖ్యమైన సమాచారాన్ని స్థానిక మత్స్యకార సంఘాలతో పంచుకుంటాడు. తద్వారా వారు సురక్షితంగా ఉండటానికి, జీవనోపాధిని సంపాదించుకోవడానికి సహాయం చేస్తాడు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ మరియు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి భారతదేశ తీరప్రాంతంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సమాచార మద్దతుతో భారతదేశ తీరప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు చేపలవేట మరింత సురక్షితమైందిగా, సుస్థిరమైందిగా, లాభదాయకంగా ఉండేలా చేయడానికి రిలయన్స్ ఫౌండేషన్ ప్రయత్నిస్తోంది.అంతేకాదు బయోమెట్రిక్ కార్డ్‌ల పెన్షన్ దరఖాస్తులు నింపడంలో సాయం చేస్తాడు. అర్హతలున్నప్పటికీ ఆయా పథకాలు పొందలేకపోయిన వారి సమస్యలను పరిష్కరించడంలో తన సంఘానికి సహాయం చేస్తాడు. అలాగే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, ప్రభుత్వ రాయితీల కోసం దరఖాస్తు చేసు కోవడానికి మత్స్యకార సంఘంలోని యువకులకు మార్గనిర్దేశం చేస్తాడు గంగాధర్.అంకితభావం, కృషితో గంగాధర్ తన కమ్యూనిటీకి సహాయం చేస్తున్న తీరు, ఒక వ్యక్తి సవాళ్లను ఎలా అధిగమించగలడు, ప్రపంచంలో ఎలా మార్పు తీసుకురాగలడనే దానిపై అందరికీ స్ఫూర్తినిస్తుంది. గంగాధర్ కథ సంకల్పం, దయ శక్తిని గుర్తు చేస్తుంది, నిజమైన ‘దృష్టి’ హృదయం నుండి వస్తుందని రుజువు చేస్తుంది, అది చూపును మించిన దృష్టి.దివ్యాంగుల సమస్యలపై అవగాహన పెంపొందించడానికి మరియు వైకల్యాలున్న వ్యక్తుల గౌరవం, హక్కులు, శ్రేయస్సు కోసం మద్దతును సమీకరించడానికి డిసెంబరు 3వ తేదీన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహిస్తాం. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవితంలోని ప్రతి అంశంలో దివ్యాంగుల ఏకీకరణ మొదలుకొని వారు పొందగలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడానికి కూడా ఇది ప్రయత్నిస్తుంది. 2024 లో ఈ దినోత్సవం థీమ్ సమగ్రమైన, సుస్థిరమైన భవిష్యత్తు కోసం దివ్యాంగుల నాయకత్వాన్ని విస్తరించడం. -
కథల ఫ్యాక్టరీ! అక్కడ కథలు డ్యాన్స్ చేస్తాయి, చిత్రాలు ..
ఆ ఫ్యాక్టరీలో కథలు డ్యాన్స్ చేస్తాయి. చిత్రాలు గీస్తాయి. సంగీత పరికరాలతో ఆటలు ఆడిస్తాయి. ఆ ఫ్యాక్టరీలో కథలు ఎంతో సహజాతిసహజంగా తయారవుతాయి. చిన్నా పెద్ద అందరినీ నవ్వులలో ముంచెత్తుతాయి. పేరు ‘ది గుడ్ టాక్ ఫ్యాక్టరీ.’ ఫౌండర్ రఘుదత్. హైదరాబాద్ వాసి అయిన రఘు ఆరేళ్లుగా చేస్తున్న ఈ ప్రయాణంలో ‘నా స్టోరీ మీకు స్ఫూర్తినివ్వాలి, నా శరీరం కాదు’ అంటూ సృజనాత్మక ఆలోచనలనూ, ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు... ‘‘ఇటీవల వృద్ధాశ్రమంలో ఒక ప్రోగ్రామ్ చేశాం. అక్కడ ఒక పెద్దావిడ తన చిన్ననాటి స్టోరీ ఒకటి అందరి ముందు పంచుకుంది. చిన్నప్పుడు స్కూల్లో వేదికపైన మాట్లాడాలన్నా, పాట ΄పాడాలన్నా చాలా సిగ్గుపడేవారంట. ఇప్పుడు నలుగురిలో పాడటానికి సిగ్గుపడుతూ అప్పటి రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ తన చిన్ననాటి కథను పంచుకున్నారు. తాత వయసున్న ఒకతను ముందుకు వచ్చి డ్యాన్స్ చేస్తూ తన కాలేజీ రోజులను గుర్తుచేసుకుంటూ నాటి కథను షేర్ చేశారు. అవన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయంటే అక్కడ ఉండి వారి కథల్లో మనమూ గెంతులు వేయాల్సిందే. కొందరు పెయింట్ ద్వారా, మరికొందరు మ్యూజిక్ ద్వారా తమ కథలను పరిచయం చేస్తుంటారు. ఈ విధానం వల్ల అంతర్లీనంగా వారిలో ఉన్న కళ, ఆనందం తమ చుట్టూ ఉన్నవారికి పంచుతారు. ‘ది గుడ్ టాక్ ఫ్యాక్టరీ’ ఉద్దేశ్యం కూడా అదే. అందరూ కథ ద్వారా బోలెడంత ఆనందాన్ని పొందాలి. అందరిలోనూ ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటుంది. నెలకు ఒకసారైనా మనలో ఉన్న ఆ చైల్డ్‌ను బయటకు తీసుకువచ్చి, ఎంజాయ్ చేయిస్తే ఇన్నర్లైఫ్ అంతా హ్యాపీగా మారి΄ోతుంది. అందుకే ‘ది గుడ్ టాక్ ఫ్యాక్టరీ కింద ‘లివ్ యా స్టోరీ’ అని ఉంటుంది. రిజెక్ట్ చేశారనే... పదేళ్లుగా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కౌన్సెలర్‌గా ట్రెయినింగ్ ఇస్తున్నాను. స్పోర్ట్స్ సైకాలజీలో కోర్సు చేశాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మాస్టర్స్ చేశాను. క్రికెట్ అసోసియేషన్స్, క్రికెట్ పర్సన్స్‌కి కౌన్సెలర్‌గా చేశాను. నా స్టూడెంట్స్ కొందరు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఒక స్టోరీ టెల్లింగ్ ఫ్లాట్‌ఫామ్ వాళ్లు నేను డిజేబుల్డ్ అని, సోషల్ మీడియాలో ఎక్కడా లేనని నన్ను రిజెక్ట్ చేశారని తెలిసి బాదనిపించింది. దీంతో నేనే ఓ కొత్త ఫ్లాట్‌ఫామ్ క్రియేట్ చేయాలనుకున్నాను. అప్పటికే, పేరెంట్స్‌ని లేని ఒక అమ్మాయిని దత్తతు తీసుకొని చదివిస్తున్నాను. ఆ అమ్మాయి పేరు ఆఫియా. ఇప్పుడు ఇంటీర్మడియెట్ చేస్తుంది. ఆ అమ్మాయి స్టోరీకి మించినదేదీ ఉండదని తనతోనే ఫస్ట్ స్టోరీ స్టార్ట్ చేశాం. అక్కణ్ణుంచి స్కూళ్లు, కాలేజీలు, ఎన్జీవోలకు, వృద్ధాశ్రమాలకు వెళ్లి స్టోరీ ఈవెంట్స్ చేయడం మొదలుపెట్టాం. 2018లో మొదలు పెట్టిన ఈ ప్రోగ్రామ్‌లో దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు.. ఇలా ఒక వర్గానికి మాత్రమే చెందినవారు ఉండకూడదని, మానవత్వంతో కూడిన కథలే ఉండాలని నియమం పెట్టాం. మా ΄్లాట్‌ఫామ్ పైన ఆటిజమ్ కిడ్స్ కూడా తమ స్కిల్స్‌ను ప్రదర్శించేలా వేదికను సిద్ధం చేశాం. లైఫ్‌స్కిల్స్‌లో శిక్షణ...‘టిజిటిఎఫ్ విద్య’ పేరుతో ఇప్పుడు 20 మంది పేద పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. పాతికమంది వాలంటీర్లు ఉన్నారు. స్కాలర్షిప్స్ ఇవ్వడమే కాకుండా లైఫ్ స్కిల్స్, వాల్యూస్, కమ్యూనికేషన్స్‌పై పిల్లలకు, యూత్‌కి స్కిల్‌డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాం.స్వచ్ఛందంగా... ఈ యేడాది గోవాలో ఆరు రోజుల పాటు పర్పుల్ ఫెస్ట్ జరిగింది. ప్రపంచంలో ఉన్న దివ్యాంగులు అందరూ ఒక చోట చేరే సందర్బం. అందులో ‘ది గుడ్ టాక్ ఫాక్టరీ’ ఒక వాలంటీర్‌గా పనిచేసింది. ముందే 1200 స్టూడెంట్స్‌కి ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి ట్రెయినింగ్ ఇచ్చాం. ఆరు రోజుల ఈవెంట్లో 60–70 వేల మంది పాల్గొన్నారు. అందులో టిజిటిఎఫ్ పెద్ద పాత్ర పోషించింది.వైకల్యం ఉన్న వ్యక్తి ఏదైనా సాధిస్తే గొప్పగా చూడరు. వారి బాడీలో లోపాన్ని చూపిస్తూ అదొక స్ఫూర్తిగా పరిచయం చేస్తారు. జాలిగా చూస్తారు. చాలా కష్టంగా అనిపిస్తుంది. నా స్టోరీ స్ఫూర్తినివ్వాలి, నా శరీరం కాదు’’ అంటున్నారు ‘ది గుడ్ టాక్ ఫ్యాక్టరీ’ రఘు. కథ ఎన్జీవో అయితే... స్వచ్ఛందంగా ఓ పది మందిమి కలిసి ఆరేళ్లుగా ఈ కథల ఫ్యాక్టరీకి పనిచేస్తున్నాం. దీని ద్వారా కొంత మంది పేద పిల్లలకు చదువు చెప్పిస్తే బాగుంటుంది కదా అనుకున్నాం. మూడేళ్ల క్రితం ‘టిజిటిఎఫ్ విద్య’ పేరుతో ఎన్జీవోగా తీసుకొచ్చాం. ఈ సంస్థ ద్వారా చైల్డ్ ఎడ్యుకేషన్‌లో భాగంగా 20 మంది నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేస్తున్నాం. యువతకు, మహిళలకు స్కిల్ డెవలప్మెంట్లో ట్రెయినింగ్స్ ఇస్తున్నాం. ఈ కథల జర్నీలో ఏరుకున్న కథలెన్నో ఉన్నాయి. – రఘు – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: తీవ్ర కాలుష్యం నడుమ..మెరుగైన వాయునాణ్యతతో కూడిన ఇల్లు..!) -
సోషల్ మీడియాకు దూరం.. సివిల్స్‌కు దగ్గర.. ఐఏఎస్ అధికారి నేహా సక్సెస్ స్టొరీ
ఈ ఆధునికయుగంలో మొబైల్ ఫోన్, సోషల్ మీడియా.. ఈ రెండూలేని మన రోజువారీ జీవితాన్ని ఊహించలేం. అయితే సాంకేతిక పరిజ్ఞానం సృష్టిస్తున్న అద్భుతాలు మన దృష్టిని లక్ష్యాల నుంచి పక్కకు మళ్లీస్తున్నాయి. దీంతో చాలామంది తమ కెరియర్, జీవిత లక్ష్యాల సాధనలో వెనుకబడుతున్నారు. దీనిని గుర్తించిన నేహా బయద్వాల్ తన కెరియర్ ఉన్నతి కోసం కఠిన నిర్ణయం తీసుకున్నారు.యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ)లో తన మొదటి ప్రయత్నం విఫలమైనప్పుడు నేహా బయద్వాల్ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దేశంలోని అత్యంత కష్టతరమైన పరీక్షల్లో ఒకటైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో విజయం సాధించేందుకు మూడేళ్ల పాటు మొబైల్‌ఫోన్‌కు దూరంగా ఉంటూ, ప్రిపరేషన్ కొనసాగించాలని ఆమె నిశ్చయించుకున్నారు.రాజస్థాన్‌లోని జైపూర్‌లో జన్మించిన నేహా.. జైపూర్‌లో తన పాఠశాల విద్యను, భోపాల్‌లో హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం కారణంగా నేహా తరచుగా పాఠశాలలు మారవలసి వచ్చేది. నేహా తండ్రి, శ్రవణ్ కుమార్ సీనియర్ ఆదాయపు పన్నుశాఖ అధికారి. ఆయనే నేహా ఐఏఎస్ అధికారి కావడానికి ప్రేరణగా నిలిచారు. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన ఆమె యూపీఎస్సీ సీఎస్ఈ కోసం ప్రిపరేషన్ ప్రారంభించారు. తన మొదటి మూడు ప్రయత్నాలలో నేహా పరీక్షను క్లియర్ చేయడంలో విఫలమయ్యారు.ఈ నేపధ్యంలో సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ వినియోగం తన దృష్టిని మరలుస్తున్నాయని గ్రహించిన ఆమె వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మూడేళ్ల పాటు యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం వాటికి దూరంగా ఉన్నానని నేహా మీడియాకు తెలిపారు. తన ప్రిపరేషన్ సమయంలో నేహా స్నేహితులు, బంధువులకు కూడా దూరంగా ఉన్నారు. ఇలా అనేక ఒడిదుడుకులతో పోరాడి, తన సామాజిక జీవితాన్ని కూడా త్యాగం చేసిన నేహా.. 2021లో తన నాల్గవ ప్రయత్నంలో యూపీఎస్సీ సీఎస్ఈని ఛేదించి, 569 ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్) సాధించి, తన కలను సాకారం చేసుకున్నారు. నేహా ఐఎస్ అధికారిగా ఎంపికైనప్పుడు ఆమె వయసు 24 మాత్రమే. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలో నేహా ఇంటర్వ్యూలో 151 మార్కులతో కలిపి మొత్తం 960 మార్కులు సాధించారు. ఈ విజయం తరువాత నేహా బయద్వాల్ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 28 వేల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.ఇది కూడా చదవండి: ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన సిక్కోలు తేజం.. ఇదో సువర్ణావకాశం -
మీ చేతి ఉన్నివస్త్రం
‘తపాలా బండి గంటల చప్పుడుకు ఏ పడుచు పిల్లయినా నిద్ర లేచినా మళ్లీ అటు తిరిగి పడుకుని తియ్యటి కలలు కంటుంది’ అని ఉంటుంది చెహోవ్ రాసిన ‘ఒక చలి రాత్రి’ కథలో! ఊహించండి. దట్టమైన చలికాలం. రాత్రి మూడు గంటల సమయం. ఏ వెధవ ప్రాణమైనా ముడుక్కుని పడుకుని కాసింత సుఖాన్ని అనుభవించే వేళ. ఒడలు మరిచే వేళ. వెచ్చదనమూ భోగమే అని భావించే వేళ. పొట్టకూటి కోసం, రోజూ చేయాల్సిన పని కోసం తపాలా మూటలను బగ్గీలో వేసుకుని స్టేషనుకు చేర్చక తప్పని మెయిల్మేన్ మనసులో ఎలా ఉంటుంది? నిశ్శబ్దాన్ని కప్పుకొని గాఢ సుషుప్తిలో ఉన్న ఊరి వీధుల గుండా అతడొక్కడే చలికి వణుకుతూ, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటిలో వెళుతూ ఉంటే అతడి అంతరంగ జగాన ఏముంటుందో ఆ సమయాన ఇళ్లల్లోని గదుల్లో రగ్గుల చాటున శయనిస్తున్న మనుషులకు తెలుస్తుందా?శ్రీమంతులు కూడా భలే వాళ్లులే! చలి రాత్రుళ్లలో వారికి మజాలు చేయాలనిపిస్తుంది. అతిథులను పిలవాలనిపిస్తుంది. పార్టీలూ గీర్టీలూ. పనివాళ్లను తొందరగా ఇళ్లకు పోండి అంటారా ఏమి? లేటు అవర్సు వరకూ పని చేయాల్సిందే! బయట చలి ఉంటుంది. పాకల్లో పసిపిల్లలు ‘కప్పుకోవడానికి ఇవాళైనా దుప్పటి కొనుక్కుని రా నాన్నా’ అని కోరడం గుర్తుకొస్తూ ఉంటుంది. ఒంటి మీదున్న ఈ కనాకష్టం బట్టలతో ఇంతరాత్రి చలిలో ఇంటికి ఎలా చేరాలనే భీతి ఉంటుంది. వెచ్చటి ద్రవాలు గొంతులో ఒంపుకునే శ్రీమంతులు ‘ఒరే... ఆ రగ్గు పట్టుకుపో’ అంటారా? ‘ఈ పాత స్వెటరు నీ కొడుక్కు తొడుగు’ అని దయతో పారేస్తారా? ఆ సోయి ఉంటే కొందరు ఎప్పటికీ శ్రీమంతులు కాలేరు. పాపం పనివాడు రంగడు పార్టీలో యజమాని ఉండగా ఆ అర్ధరాత్రి రగ్గు దొంగిలిస్తాడు. పేదవాణ్ణి దొంగను చేసింది లోపలి పెద్దమనిషా... బయటి చలా? డి.వెంకట్రామయ్య ‘చలి’ కథ ఇది.దర్శకుడు బి.నరసింగరావు కథలు కూడా రాశారు. ‘చలి’ అనే కథ. నగరానికి వచ్చిన వెంటనే మొగుడు పారిపోతే ఆ వలస కూలీ చంకన బిడ్డతో వీధుల్లో తిరుగుతూ చలిరాత్రి ఎక్కడ తల దాచుకోవాలా అని అంగలారుస్తుంటుంది. అక్కడ నిలబడితే ఎవరో కసురుతారు. ఇక్కడ నిలబడితే ఎవరో తరుముతారు. నోరూ వాయి లేని చెట్టు ‘పిచ్చిదానా... నిలుచుంటే నిలుచో. నీకేం వెచ్చదనం ఇవ్వలేను’ అని చిన్నబోతూ చూస్తుంది. చెట్టు కింద తల్లీబిడ్డా వణుకుతుంటారు. చలి. చెట్టు కింద తల్లీ బిడ్డా కొంకర్లు పోతూ ఉంటారు. శీతలం. చెట్టు సమీపంలోని చాటు అటుగా వచ్చి ఆగిన కారులోని యువతీ యువకులకు మంచి ఏకాంతం కల్పిస్తుంది. బయట చలి మరి. ఒకే తావు. చెట్టు కింద చావుకు దగ్గరపడుతూ తల్లీబిడ్డ. అదే తావులో ఏమీ పట్టని వెచ్చని సరస సల్లాపం. చలి ఒకటే! బహు అర్థాల మానవులు.శతకోటి బీదలకు అనంతకోటి ఉపాయాలు. పేదవాడు బతకాలంటే నోరు పెంచాలి. లేదా కండ పెంచాలి. కండ పెంచిన మల్లయ్య రైల్వేస్టేషన్ దగ్గర సగం కట్టి వదిలేసిన ఇంటి వసారాను ఆక్రమించుకుంటాడు. తక్కిన కాలాల్లో దాని వల్ల లాభం లేదు. చలికాలం వస్తే మాత్రం రాత్రిళ్లు తల దాచుకోవడానికి అలగా జనాలు ఆ వసారా దగ్గరికి వస్తారు. తలకు ఒక్కరూపాయి ఇస్తే వెచ్చగా పడుకునేందుకు చోటు. కొందరి దగ్గర ఆ రూపాయి కూడా ఉండదు. దీనులు. పేదవాడు మల్లయ్య దయ తలుస్తాడా? తరిమి కొడతాడు. లేచిన ప్రతి ఆకాశహర్మ్యం నా ప్రమేయం ఏముందని నంగనాచి ముఖం పెట్టొచ్చుగాని అది ఎవడో ఒక పేదవాడిలో మంచిని చంపి రాక్షసత్వం నింపుతుంది. వి. రాజా రామమోహనరావు ‘చలి వ్యాపారం’ కథ ఇది.చలిరాత్రి ఎప్పటికీ అయిపోదు. అది పేదవాళ్లకు తామెంత నగ్నంగా జీవిస్తున్నారో గుర్తు చేయడానికే వస్తుంది. చలికి వణికే కన్నబిడ్డల్ని చూపి బాధ పెట్టడానికే వస్తుంది. మనందరం మధ్యతరగతి వాళ్లమే. ఇంటి పనిమనిషిని అడుగుదామా ‘అమ్మా... నీ ఇంట ఒక గొంగళన్నా ఉందా... పిల్లలకు ఉన్ని వస్త్రమైనా ఉందా?’.... ‘చలికి వ్యక్తి మృతి’ అని వార్త. మనిషి చలికి ఎందుకు చనిపోతాడు? ప్రభుత్వం అతనికి ఇస్తానన్న ఇల్లు ఇవ్వకపోతే, ఇల్లు ఏర్పాటు చేసుకునేంత ఉపాధి చూపకపోతే, నీ దిక్కులేని బతుకును ఇక్కడ వెళ్లదీయమని వింటర్ షెల్టరైనా చూపకపోతే, తన నిర్లక్ష్యాన్ని తోడు చేసుకుని చలి హత్యలు చేయగలదని గ్రహించకపోతే అప్పుడు ఆ వ్యక్తి ‘చలికి చనిపోయిన వ్యక్తి’గా వార్తలో తేలుతాడు. విలియమ్ సారోయాన్ అనే రచయిత రాస్తాడు– చలి నుంచి కాపాడటానికి కనీసం శవాల మీదున్న వస్త్రాలనైనా తీసివ్వండ్రా అని! అతని కథలో ఒక యువకుడు ఆకలికి తాళలేక ఓవర్‌కోట్ అమ్మి చలితో చచ్చిపోతాడు.పగిలిన గాజుపెంకుతో కోసినట్టుగా ఉంటుందట చలి. అదంత తీవ్రంగా ఉండేది మను షుల్లో నిర్దయను పెంచడానికా? కాదు! దయను పదింతలు చేయడానికి! పాతదుప్పట్లో, పిల్లలు వాడక వదిలేసిన స్వెటర్లో, నాలుగు కంబళ్లు కొనేంత డబ్బు లేకపోలేదులే అని కొత్తవి కొనో వాటిని స్కూటర్లో, కారులో పడేసి ఆఫీసు నుంచి వచ్చేప్పుడు ఒక్కరంటే ఒక్కరికి ఇచ్చి వస్తే ఎలా ఉంటుందో ఈ చలికాలంలో చూడొద్దా? ఉబ్బెత్తు బ్రాండెడ్ బొంతలో నిద్రపోయే వేళ మన చేతి ఉన్నివస్త్రంతో ఒక్కరైనా నిద్ర పోతున్నారన్న భావన పొందవద్దా? అదిగో... అర్థమైందిలే... మీరు అందుకేగా లేచారు! -
నోరూరించే కేక్ వెనుక ఇంత హిస్టరీ ఉందా? ఇంట్రస్టింగ్ స్టోరీ
పుట్టిన రోజంటే కేక్ కోయాల్సిందే! ఏదైనా వేడుక జరిగినా కేక్ కోయడం తప్పనిసరి. లోపల బ్రెడ్‌తో, పైన క్రీమ్‌తో నోరూరించే కేక్ అంటే అందరికీ ఇష్టమే. అయితే ఈ కేక్ చరిత్రేమిటో తెలుసుకుందామా?కేక్ ఎప్పుడు ఎక్కడ పుట్టిందో కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో ఈజిప్టులో కేక్ తయారు చేసినట్లు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఇవాళ మనం చూసే కేక్‌కు భిన్నంగా తేనె, గోధుమపిండితో దాన్ని తయారు చేసేవారు. అప్పట్లో సంపన్నులు వారింటి వేడుకల్లో అతిథులకు కేక్‌ను ఇచ్చేవారని, కేక్ రుచికరంగా మారేందుకు తేనె, తృణధాన్యాలు వాడేవారని చరిత్రకారులు అంటున్నారు. రోమ్ సామ్రాజ్యంలో సైతం కేక్ తయారీ ఉందని చరిత్ర చెబుతోంది. అప్పట్లో కేక్‌లు తయారు చేసి పూలు, ఇతర ఆకులతో అలంకరించేవారు. అందువల్లే ఆ కాలంలో అవి ఆలివ్ కేక్, ప్లమ్ కేక్‌గా ప్రసిద్ధి పొందాయి. మొదట్లో కేక్ తయారీకి తేనె వాడేవారు. చక్కెర అందుబాటులోకి వచ్చిన తర్వాత చక్కేతో తయారుచేయడం మొదలుపెట్టారు. అయితే అప్పట్లో చక్కెర ఖరీదైన వస్తువు కావడం వల్ల కేక్‌లు కేవలం సంపన్నవర్గాల వారికే పరిమితమయ్యేవి. పుట్టినరోజులు, పెళ్లిరోజుల సమయంలో కేకు కోసి అందరికీ పంచడం అప్పట్లో ఆనవాయితీగా మారి నేటికీ కొనసాగుతోంది. 1764లో డాక్టర్ జేమ్స్ బేకర్, జాన్ హానోన్ కలిసి కోకో గింజలను పొడి చేసి పేస్ట్‌లా మార్చి తొలిసారి చాక్లెట్ కేక్ తయారు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న కేక్ రూపానికి వారు అంకురార్పణ చేశారు. దీంతో కేక్‌ను వివిధ పదార్థాలతో తయారు చేయొచ్చన్న ఆలోచన అందరికీ వచ్చింది. ఆ తర్వాత 1828లో డచ్‌కు చెందిన శాస్త్రవేత్త కోయెనెరాడ్ జోహన్నెస్ వాన్ హౌటెన్ కోకో గింజల్లో పలు రకాల పదార్థాలు కలిపి, అందులోని చేదును ΄ోగొట్టి కేక్‌ను మరింత రుచికరంగా తయారు చేసే పద్ధతిని కనుగొన్నారు. ఆ తర్వాత బ్రిటిష్ వంటవాళ్లు మరిన్ని ప్రయోగాలు చేసి రకరకాల ఫ్లేవర్లలో కేక్‌లు తయారుచేయడం మొదలుపెట్టారు. అందులో గుడ్డు, చక్కెర, వైన్, బాదం, జీడిపప్పు వంటివి కలిపి సరికొత్త ప్రయోగాలు చేశారు. 1947 తర్వాత మైక్రోవేవ్ అవెన్స్ రావడంతో కేక్‌ను బేక్ చేసే ప్రక్రియ సులభంగా మారింది. ప్రస్తుతం వందలాది ఫ్లేవర్లలో కేక్‌లు దొరుకుతున్నాయి. గుడ్డు తినడం ఇష్టపడని వారికోసం ‘ఎగ్‌లెస్ కేక్’ తయారుచేస్తున్నారు. రోజూ ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేక్‌లు తయారై అమ్ముడు΄ోతున్నాయి. -
ఊరికే ఇచ్చే డబ్బు వద్దంటూ.. గంగానదిని ఈదాడు
పిల్లలూ! మీరెప్పుడూ అందరూ మెచ్చుకునే స్థితిలోనే ఉండాలి తప్ప ఎవరూ మీ మీద జాలి పడే స్థితిలో ఉండకూడదు. ఈ విషయం మీకు అర్థమవ్వాలంటే ఈ సంఘటన తెలుసుకోండి.అనగనగా ఓ పిల్లవాడు తన తోటివారితో కలిసి గంగానది అవతలి ఒడ్డున జరిగే జాతర చూసేందుకు వెళ్లాడు. అతనిది పేద కుటుంబం. తండ్రి మరణించడంతో బంధువుల వద్ద ఉంటూ తల్లి అతణ్ని పెంచుతోంది. పడవ ఖర్చుల కోసం ఆమె అతనికి కొంత డబ్బు ఇచ్చింది. దాన్ని అతను జాతరలో ఖర్చుపెట్టాడు. తిరిగి వచ్చేటప్పుడు పడవ ఎక్కేందుకు అతని వద్ద డబ్బు లేదు. మేమిస్తామని స్నేహితులు అతనికి చెప్పారు. కానీ ఆత్మగౌరవం కలిగిన అతను ఆ డబ్బు తీసుకోలేదు. స్నేహితులను పడవలో వెళ్లమని చెప్పి, తనొక్కడే నదిలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. చూశారా! ఎవరి వద్దా ఊరికే డబ్బు తీసుకోకూడదని అతనికెంత పట్టుదలో! ఆ పిల్లాడెవరో కాదు, మన దేశానికి రెండో ప్రధానిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి. ‘జై జవాన్.. జై కిసాన్’ అన్న నినాదం ఆయన ఇచ్చిందే. అయితే మీరు ఇలాంటి సాహసాలు చేయొద్దు. బాగా ఈత వచ్చిన వారే ఇలాంటివి చేయాలి. స్ఫూర్తిని గ్రహిస్తే చాలు.ఇదీ చదవండి : మెగా మ్యూజియం గురించి తెలుసా? -
బార్బీ డాల్.. ఈ సంగతులు తెలుసా మీకు?
ఇదీ బార్బీ బొమ్మ కథ!హాయ్! నేనే.. మీకెంతో ఇష్టమైన బార్బీ బొమ్మని. నా గురించి చె΄్పాలని వచ్చాను. నా పూర్తి పేరు బార్బరా మిలిసెంట్ రాబర్ట్స్. నేను పుట్టింది మార్చి 19, 1959లో. మా ఊరు న్యూయార్క్. నేను మొదటిసారి మీ ముందుకు బ్లాక్ అండ్ వైట్ స్విమ్‌సూట్‌లో వచ్చాను. నేను 11.5 అంగుళాల ఎత్తుతో ఉంటాను. నా మొదటి ధర మూడు డాలర్లు. నాకో ప్రత్యేకమైన రంగు ఉంది. ఆ రంగు పేరు ’బార్బీ పింక్’. నన్ను మీరు రకరకాల రూ΄ాల్లో చూసి ఉంటారు. డాక్టర్, లాయర్, ఇంజినీర్, పైలెట్.. ఇలా 250 రకాల రూపాల్లో నేను మీకు కనిపిస్తాను. మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టే నాలుగేళ్ల ముందే, అంటే 1965లో నేను అంతరిక్షానికి వెళ్లాను తెలుసా? అమ్మాయిలు ఏయే రంగాల్లో అయితే తక్కువగా ఉన్నారో ఆ రంగాల్లో నేను కనిపించి వారిలో స్ఫూర్తి నింపాను. అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే నా కల. ప్రపంచంలోని అన్ని దేశాల వారూ నన్నెంతో ఇష్టపడతారు. నన్నింకా వైవిధ్యంగా తయారు చేసేందుకు నాకోసం సుమారు వెయ్యి మందికిపైగా రకరకాల ఫ్యాషన్లు తయారు చేశారు. మొదట్లో చిన్నపిల్లలు మాత్రమే నన్ను ఇష్టపడేవారు. ఆ తర్వాత 6 నుంచి 99 ఏళ్లవారు కూడా నా మీద ఇష్టం చూపడం మొదలుపెట్టారు. 1997లో నా పేరు మీద ’బార్బీ గాల్’ అనే పాట కూడా తయారు చేశారు. అది ఇప్పటికీ ఎంతో ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికీ 100 బార్బీ బొమ్మలు అమ్ముడు΄ోతున్నాయి. మొత్తం 150 దేశాల్లో నా బొమ్మలు అమ్ముతున్నారు.నా పేరిట అనేక సోషల్‌మీడియా అకౌంట్లు ఉన్నాయి. అందులో నాకు 19 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నా పేరిట ఉన్న యూట్యూబ్ ఛానెల్‌కి ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. నా పేరిట ఉన్న యూట్యూబ్ ఛానెల్లో నాకు సంబంధించి రకరకాల వీడియోలుంటాయి. ఇప్పటిదాకా 151 మిలియన్ల నిమిషాల సేపు ఆ వీడియోలను జనం చూశారు. నా పేరుతో 2023లో ’బార్బీ’ అనే విడుదలైంది. -ఇదీ నా కథ. ఇక ఉంటాను. బై! -
రైల్లో యాచకుడు.. మూడు ఆటోలకు యజమాని
మధుబని: ఎవరైనా ఇష్టంగా ఒక వృత్తిలో చేరాక దానిని మానివేయడం కష్టంగా మారుతుందని అంటారు. ఇదేవిధంగా యాచనను వృత్తిగా ఎంచుకున్న ఒక వ్యక్తి మూడు ఆటోలకు ఓనర్‌గా మారాడు. బీహార్‌లోని దర్భంగా, మధుబని రైల్వే సెక్షన్లో భిక్షాటన సాగించే బంభోలా అలియస్ సూరదాస్ ఇప్పడు వార్తల్లో నిలిచాడు.సూరదాస్ 25 ఏళ్ల క్రితం రైలులో భిక్షాటన చేయడం ప్రారంభించాడు. అంధత్వం కలిగిన సూరదాస్ రైలులో పాటలు పాడుతూ యాచిస్తుంటాడు. తాను ఏ పనీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని, తనకు భిక్షాటన మాత్రమే ఆసరా అని సూరదాస్ మీడియాకు తెలిపాడు. యాచనే తనకు జీవితమని పేర్కొన్నాడు.ఇప్పుడు సూరదాస్ కథ భిక్షాటనకే పరిమితం కాలేదు. ఇప్పుడు అతను మూడు ఆటోలకు యజమాని. తనకు వచ్చే ప్రతీపైసా కూడబెట్టి ఆటోలను కొనుగోలు చేసినట్లు సూరదాస్ తెలిపాడు. తన యాచనతో వచ్చిన సంపాదనతోనే కుటుంబం నడుస్తుందని, యాచనను తన ఊపిరి ఉన్నంతవరకూ కొనసాగిస్తానని తెలిపాడు. కష్టాలు ఎదురైనా మనిషి తన కలలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని ఆయన చెబుతుంటాడు. ఇది కూడా చదవండి: కనువిందు చేస్తున్న విదేశీ వలస పక్షులు -
‘మా అమ్మాయికి బుద్ధి చెప్పండి స్వామీ’
Moral Story: చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. ఇక్కడ మాట అక్కడా, అక్కడి మాట ఇక్కడా చెబుతూ వుంటే చూసి వాళ్ళమ్మ చాలా బాధ పడేది. ఇలా గాలి కబుర్లు చెప్పడం తప్పని ఎంత చెప్పినా ఆ అమ్మాయి మట్టుకు పట్టించుకునేది కాదు. ఈ గాలి కబుర్ల వల్ల లేనిపోని తగాదాలు కూడా వచ్చేవి.ఒక రోజు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆయన దర్శనానికి వెళ్లిన ఆ అమ్మాయి వాళ్ల అమ్మ తన బాధ చెప్పుకుంది. ‘మా అమ్మాయికి బుద్ధి చెప్పండి స్వామీ’ అని కోరుకుంది. సాధువు మర్నాడు అమ్మాయిని తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు.మర్నాడు పొద్దున్నే అమ్మ తన కూతురుని సాధువు వద్దకు తీసుకుని వెళ్ళింది. సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి ‘రోజంతా ఆ కోడి ఈకలు తీసి వూరు మొత్తం చల్లమ్మా’ అని చెప్పాడు.ఎక్కడ తిడతాడో అని భయపడుతూ వచ్చిన అమ్మాయి ‘ఇంతేనా?’ అనుకుంటూ కోడి ఈకలతో వూరంతా తిరుగుతూ కనిపించిన వారందరికి కబుర్లు చెపుతూ ఇక్కడో ఈక, అక్కడో ఈక విసిరేసింది. సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంటే ఆ అమ్మాయిని తల్లి మళ్ళీ ఆ సాధువు దగ్గిరకు తీసుకెళ్లింది.‘ఈ రాత్రి నిద్రపోయి మళ్ళి తెల్లవారగానే రండి’ అని పంపాడు సాధువు.మర్నాడు పొద్దున్నే వాళ్లు వెళితే సాధువు అమ్మాయితో, ‘నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రామ్మా’ అన్నాడు.అమ్మాయి సరేనని ఊరంతా వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కనిపించలేదు. దిగాలుగా సాయంత్రానికి ఆ సాధువు దగ్గరకు వెళ్ళి ‘స్వామి, నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడ దొరకలేదు’ అని చెప్పింది.చదవండి: ‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్ డాటర్స్..!అప్పుడు సాధువు ‘చూశావా... మన మాటలు కూడా ఆ ఈకల లాంటివే. ఒక్క సారి నోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికీ తిరిగి తీసుకోలేము’ అని చెప్పాడు. ‘నోరు అదుపులో ఉంటే సమయం వృధా కాదు. చేయవలసిన పనులు పూర్తవుతాయి. జీవితంలో పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు’ అన్నాడు.ఆ రోజు నుంచి ఆ అమ్మాయి గాలి కబుర్లు మానేసి చక్కగా చదువుకుని వాళ్ల అమ్మను సంతోషపెట్టింది. -
సాహస యాత్రల్లో దిట్ట,, అనంతపురం నివాసి సమీరా
అనంతపురం: చిరుప్రాయంలోనే తల్లిదండ్రుల మరణంతో కుటుంబ బాధ్యతలు తలకెత్తుకుంది. జీవితంలో ఎత్తు పల్లాలను సునాయశంగా అధిగమించింది. పట్టుమని పాతికేళ్లు కూడా దాటకుండానే ప్రపంచంలోని ఎత్తైన శిఖరాల అధిరోహణకు సిద్ధమైంది. ఇప్పటికే పలు శిఖరాలను అధిరోహించింది. నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన సమీరాఖాన్... తన పేరుకు తగినట్లుగానే ఓ ప్రభంజనాన్నే సృష్టిస్తోంది. ఏ ఆధారం లేకుండా ఒంటరి పోరు సాగిస్తున్న సమీరాఖాన్ విజయ ప్రస్తానం... ఆమె మాటల్లోనే...మాది అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న విద్యారణ్య నగర్. నాన్న జాఫర్ ఖాన్, అమ్మ ఖాతూన్‌బీ. ఓ చిన్నపాటి ఇంట్లో ఉండేవాళ్లం. ఇప్పటికీ నేను అదే ఇంట్లో ఉంటున్నా. మేము మొత్తం ఐదుగురం ఆడపిల్లలమైతే... నేనే అందరికంటే చిన్నదాన్ని. నా చిన్నప్పుడే అమ్మ అనారోగ్యంతో మరణించింది. మా పోషణ కోసం నాన్న ఓ చిన్న వ్యాపారం మొదలు పెట్టాడు. నలుగురు అక్కలకీ నాన్న పెళ్లిళ్లు చేశాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాం.బతుకు తెరువు కోసం వలస పోయా నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో వయస్సు మీద పడి నాన్న ఏ పనీ చేయలేక ఇబ్బంది పడసాగారు. ఇది చూసి చివరకు నేనే ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటూ వచ్చా. సంపాదన అంతంత మాత్రమే ఉండడంతో చదువు మానేసి బెంగళూరుకు చేరుకున్నా. ఓ కాల్ సెంటర్లో ఉద్యోగం వచ్చింది. అయితే చాలా తక్కువ సమయంలోనే పదోన్నతులు అందుకున్నా. అలాగని చదువును పక్కన పెట్టేయలేదు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. మరో వైపు డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో చేరి 2015లో డిగ్రీ పూర్తి చేశాను. ఇక జీవితం కుదుట పడుతోంది... పరిస్థితలన్నీ చక్కబడ్డాయి అనుకుంటుండగానే నాన్న మాకు శాశ్వతంగా దూరమయ్యారు. ఆ బాధ నుంచి కోలుకోలేకపోయాను. ఆ పరిస్థితుల్లో నన్ను చూసిన అక్కయ్య వాళ్లు... నన్ను పెళ్లి చేసుకోమన్నారు. అయితే నేను ఒప్పుకోలేదు. మలుపు తిప్పిన ఒంటరి ప్రయాణం నాన్న జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు నా స్నేహితులతో కలసి సైక్లింగ్, పర్వతారోహణపై దృష్టి పెట్టాను. నా సంపాదనలోనే కొంత దాచుకుంటూ వస్తూ ట్రెక్కింగ్‌పై శిక్షణ పొందాను. ఓ సారి సైక్లింగ్ చేస్తూ దేశమంతా తిరిగా. అలా ఓ ప్రయాణంలో కొంతమంది విదేశీయులు కలిశారు. ‘ఒంటరి ప్రయాణం సాహసంతో కూడుకున్నది. నీ ధైర్యానికి ఆశ్చర్యమేస్తోంది’ అనే వారన్న మాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయి. వారితో కలసి ఉన్న సమయంలో వారి ఆచార వ్యవహారాలను చాలా క్లోజ్‌గా పరిశీలించాను. చాలా ఇంట్రెస్ట్ కలిగింది. దీంతో విదేశీ ఆచార వ్యవహారాలపై అధ్యయనం చేయాలని అనుకున్నా. అలా మొదలైనా నా ఒంటరి ప్రయాణం... చివరకు దేశ సరిహద్దులు దాటించింది. థాయ్‌లాండ్, కంబోడియా, మయన్మార్, జపాన్, మాల్దీవులు, మలేసియా, సింగపూర్ తదితర 18 దేశాల్లో సైకిల్ యాత్రతో పాటు ఆయా దేశాల్లోని పర్వతాలను అధిరోహిస్తూ వచ్చా. నేపాల్ టూర్ మరవలేను నా సహచరులతో కలసి నేపాల్‌లో చేసిన పర్వతారోహణను నేను మరవలేను. అదే సమయంలో అక్కడి మౌంట్ ఐస్‌ల్యాండ్, మౌంట్ అమా దబ్లామ్ అనే రెండు పర్వతాలను అధిరోహించాలనుకున్నా. ఇది సాధ్యమయ్యే పనికాదని చాలా మంది నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. అయినా నేను వినలేదు. ఎవరూ రాకపోతే ఒంటరిగానే పోతానన్నా. దీంతో కొంతమంది నాతో పాటు వచ్చేందుకు సిద్ధమయ్యారు. మౌంట్ అమా దబ్లామ్ పర్వతం పైకి ఎక్కే కొద్ది వాతావరణ పరిస్థితుల్లో శరవేగమైన మార్పులు రాసాగాయి. మంచు పర్వతాల్లో ఈ పరిస్థితులు సర్వసాధారణమే. ఓ వైపు రక్తం గడ్డ కట్టించే చలి, మరో వైపు మంచు తుఫానులు.. . ఇలా అడగడునా సవాళ్లే. కనీస అవసరాలు తీర్చుకోవడం కూడా పెద్ద సమస్యే. అంత ఎత్తైన ప్రదేశంలో నిద్ర కూడా దాదాపు అసంభవం. అలసట, ఆకలి లేకపోవడం వంటి సమస్యలూ ఎన్నో అనుభవించా. అయినా సరే అన్నింటినీ దాటుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించా. స్నేహితుడి మరణం కలిచివేసింది అమా దబ్లామ్ పర్వతంపై ట్రెక్కింగ్ అత్యంత ప్రమాదకరమని అక్కడి వాళ్లూ చెప్పారు. అయినా వినకుండా మా సహచర బృందం నేపాల్‌లోని లుకా గ్రామానికి చేరుకుని అక్కడ నుంచి గతేడాది అక్టోబర్ 29న 6,189 మీటర్ల ఎత్తున్న మౌంట్ ఐస్‌ల్యాండ్‌కు బయలుదేరింది. పైకి వెళ్లే కొద్దీ ప్రయాణం కష్టమైంది. 4,800 మీటర్ల ఎత్తు చేరుకున్నాక విడిది శిబిరం వేసుకునే అవకాశం లేకపోవడంతో అక్కడి నుంచి మిగిలిన 1,389 మీటర్ల ఎత్తును తప్పని పరిస్థితిల్లో పూర్తి చేయాల్సి వచ్చింది. చివరకు అనుకున్నది సాధించాం. ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ బయలుదేరాం. అమా దబ్లామ్ పర్వతంపై దాదాపు లక్ష్యానికి దగ్గరయ్యే సమయంలో మాతో పాటు వచ్చిన ఆ్రస్టియా యువకుడు మైఖేల్‌పై రాళ్లు పడి, అక్కడే చనిపోయాడు. నాకైతే నోట మాట రాలేదు. తేరుకునేందుకు చాలా సమయం పట్టింది. ఆ తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేసి, స్నేహితుడి మృతదేహాన్ని సాగనంపి మళ్లీ ప్రయాణాన్ని కొనసాగించాం. చివరకు ఐదు రోజుల పాటు శ్రమించి 6,812 మీటర్ల ఎత్తైన అమా దబ్లామ్ పర్వతాన్ని అధిరోహించాం. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఈవెంట్ ఆర్గనైజర్‌గా.. ప్రస్తుతం నేను బెంగళూరులో ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్నా. ఏటా రెండు సార్లు రెండేసి నెలల్లో హిమాలయాల్లో ఒంటరిగానే ట్రెక్కింగ్ చేస్తుంటాను. మధ్యలో ఒక వారం రోజుల పాటు అనంతపురానికి వచ్చి అక్కయ్యలతో కలసి వెళుతుంటాను. మరో రెండు నెలలు విదేశాల్లో సైక్లింగ్ చేస్తూ అక్కడి ఆచార వ్యవహారాలపై అధ్యయనం చేస్తుంటా. ఇందుకు అవసరమైన డబ్బును ఈవెంట్ ప్లానింగ్ చేయడం ద్వారా సమకూర్చుకుంటుంటాను. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలనే నా ఆకాంక్ష. ఇందుకు అవసరమైన డబ్బును పొగు చేసుకుంటున్నా. నా కష్టాలే ఇంతటి సాహసానికి పురిగొల్పాయి. భవిష్యత్తులో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఓ పాఠశాల ఏర్పాటు చేయాలని అనుకుంటున్నా. దేవుడి సహకారంతో ఈ లక్ష్యాన్ని కూడా సాధిస్తాననే నమ్మకం నాలో ఉంది. -
దసరా సరదాలు: "ప్యారీ మనవరాలు... పూరీ ముచ్చట్లు"
‘‘నానమ్మా... అనవసరంగా స్ట్రెస్సు పెంచుకోకు. తగ్గే మార్గం చెబుతా విను గ్రానీ డ్యూడ్’’ అంది నా కూతురు. ‘‘ఏం చెబుతావో ఏమో... ఈమధ్య అంతా సైన్సు మాట్లాడుతున్నావ్. స్ట్రెస్సు ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు పిండిపైన ఉండే అప్పడాల కర్ర అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు కిందనుండే రౌండు పీట అండ్ బీటా టీటా అల్ఫా ఒమెగా అంటూ అదేదో అంటుంటావ్. నా పాట్లేవో నన్ను పడనీ మనవరాల్ డ్యూడ్’’ అంది మా అమ్మ. మా అమ్మకూ ఈమధ్యే బీటెక్‌లో చేరిన నా కూతురికీ మధ్య భలే ఫ్రెండ్షిప్. ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇద్దరిమధ్యా ‘షోలే’ వీరూ, జైయంత చనువు. టైము దొరికినప్పుడల్లా ఇప్పటి సినిమాల్ని ఓటీటీలో మా అమ్మకు చూపిస్తూంటే, మా అమ్మ అప్పటి సినిమాల్ని టీవీలో నా బిడ్డకు చూపిస్తూ యమా టైంపాస్ చేసేస్తుంటారు ఇద్దరూ! ఈ వైభోగానికి తోడు సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్స్టీ, లోకల్ టాక్సెస్ ఎక్స్ట్రాల్లాగా నానమ్మా, మనవరాళ్లిద్దరి మధ్యా ఎక్స్ట్రా వాదులాటలూ, కీచులాటలూ, గొడవలూ... ఆ తర్వాత ఎదుటాళ్లను గెలిపించి తామోడిపోవడానికి పోటీలూ, పేచీలు! ఫరెగ్జాంపుల్... ‘‘హే యూ ఓల్డ్ లేడీ... చూస్తుండగానే అన్నపూర్ణవు కాస్తా నిర్మలమ్మ అయిపోతున్నావు నువ్వు’’ అంటూ నా కూతురంటే... ‘‘మీ అమ్మ మాత్రం అవ్వడం లేదా... రమ్యకృష్ణలాంటిది కాస్తా వదినమ్మ వేషాల సుధాలాగా’’ అంటుంది మా అమ్మ. ఇదెలా ఉంటుందంటే హీరోని పొడవలేని విలన్ అనుచరుడు కాస్తా చివరకు సెకండ్ హీరోయిన్ని పొడిచేసినంత చిత్రంగా. ఇలా ఎందుకంటే... తన మనవరాల్నేమీ అనలేకా... అందమైన హీరోయిన్లతోనే గాక... ఇంకెవ్వరితోనూ పోల్చలేక! ఆ కూతురితో పోల్చదగ్గది మరొకరుండరూ... ఉండకూడదనే అత్యాశకొద్దీ!!అసలీ సంభాషణకు కారణం... దసరా సెలవలు కదా. అమ్మమ్మ గారి ఇంటికంటూ మా అక్కవాళ్ల పిల్లలు మా ఇంటికి రావడమూ... పండక్కి మా అమ్మను కొన్ని కోర్కెలు కోరడమూనూ. మనవరాళ్లు కదా! వాళ్ల వరాలు తీర్చకుండా ఎలా ఉంటుంది మా అమ్మ. అవేమిటంటే... మా పిల్లలకేమో చిట్టిగారెల్లో మటన్ కూర కావాలట. అక్క పిల్లలేమో ‘గారెలు మేం మామూలుగానే తినేస్తాం. మటన్‌లో పూరీలు ముంచుకుతింటాం. కాబట్టి ఎక్స్ట్రాగా పూరీలు చేయమంటు’న్నారు. దాంతో రెండూ చేసే పనిలో బోల్డెంత ఒత్తిడికి లోనవుతోంది మా అమ్మ. ఆమెను అనునయిస్తూ స్ట్రెస్సును తగ్గించే పనిలో ఉంది నా బిడ్డ. ‘‘అయినా... పూరీలు టైముకు ప్రిపేర్ అవ్వాలంటే... అసలెంతో కొంత స్ట్రెస్ ఉండాల్సిందేలే నానమ్మా’’ అంది నా కూతురు. ‘‘అదేందోగానీ పిల్లా... ఈ స్ట్రెస్సొచ్చినప్పుడల్లా నా కిడ్నీల్లో హార్ట్ ఎటాక్ వచ్చినట్టుంటుంది బ్రో. ఈ ఒత్తిడి అనేది ఉంది చూశావూ... మొదట ‘అగ్నిపర్వతం’ ‘ఈగాలిలో...’పాటలోలాగా కృష్ణ పాస్‌పోర్టు ఫొటోంత సైజులో ఉంటుందా! కాసేపటికే విజయశాంతి పట్టుకున్న సూపర్‌స్టార్ కటౌటంతగా పెరుగుతుంది. అబ్బో... అలా పెరిగినప్పుడు నాకెంత దాహం వేస్తుంటుందో తెలుసా పిల్లా? ‘దేవత’లో శోభన్‌బాబు, శ్రీదేవీ పాటలోని అన్ని బిందెల్లోకీ ఎల్లువొచ్చిన గోదారి నీళ్లన్నీ తాగీ తాగీ ఇంకా తాగుతున్నా ఇంకా దాహమేస్తున్నట్టే అనిపిస్తుంటది’’ ‘‘నీకెందుకు నానమ్మా. నీ నర్వస్నెస్ను ‘రోబో–2’లో పావురమ్మీద స్వారీ చేసే రజినీకాంత్ సైజుకు తగ్గిస్తా’’ ‘‘ఓహో... భైరవద్వీపం ‘నరుడా ఓ నరుడా’ పాటలో మరుగుజ్జుల సైజుకా?’’ అంటూ తన పాత సినిమా ఎగ్జాంపుల్‌కు వెళ్తూనే... ‘‘అయినా పెద్ద చెప్పొచ్చావ్ గానీ... స్ట్రెస్సుంటే వంట వీజీగా ఎలా అవుతుందే అమ్మాయ్?’’ అడిగింది. ‘‘నా ఇంజనీరింగ్ మ్యాథ్స్లా కాకుండా మీ ΄ాతసినిమాల భాషలోనే చెబుతా విను. కొద్దిగా స్ట్రెస్సుంటే... అప్పట్లో మీ ఓల్డుమూవీసులో పోగరుమోతు హీరోయిన్ని ఒక్క టీజింగుసాంగుతోనే హీరో లొంగదీసినంత వీజీగా చేసేగలవు పూరీలన్నీ’’ అంటూ మా అమ్మకు తన ఉపదేశాన్ని మొదలుపెట్టింది నా కూతురు. ∙∙ ‘‘అన్నట్టు నానమ్మా... ఈ స్ట్రెస్సూతో హెల్త్ సమస్యలూ అవీ వస్తాయని దాన్ని ఆడిపోసుకుంటుంటారు గానీ... ఒక్క వంటే కాదు. ఏ పనైనా హాయిగా జరిగి΄ోవాలంటే కాస్త ప్రెషరో, గిషరో వర్కవుట్ అవుతూ ఉండాలి. అదెంతుండాలంటే... కడాయిలో పూరీని పొంగించడానికీ, కుక్కరులోని రైసును ఉడికించడానికీ ఎంత కావాలో... పని సజావుగా జరగడానికి అంతే స్ట్రెస్సుండాలి’’ ‘‘ఎందుకే పాపం ఒత్తిడితో ఆ పూరీల్ని అంతలా పొంగించడం? ఎంత పొంగినా చివరకు పూరీకి బొక్కెట్టే కదా తింటారు. విజిళ్లతో ఎంతగా మిడిసిపడ్డా ఆవిరి ΄ోయాకే కదా కుక్కర్లోంచి అన్నాన్ని దించుతారు!’’ ‘‘నువ్వన్నది కరెక్టేగానీ నానమ్మా... ఎలాగూ తొక్క వలిచే తింటాంగదా అని తొడిమ ఊడిన అరటిపండు తినగలమా? అలాగే పొంగని పూరీతో పూరీ చేయగలమా చెప్పు. పొంగినదానికీ, పొంగనిదానికీ టేస్టులో ఏమాత్రం తేడా లేక΄ోయినప్పటికీ పొంగినదాన్నే కదా ప్లేట్లో వేసుకోబుద్ధవుతుంది! అలా పూరీలోకి చేరి పొంగేలా చేయడమే గాలి గొప్ప. అండ్... వంటలో ఆయొక్క ఐడియల్ ఒత్తిడి ఎంతుండాలంటే... పూరీపొరను చీల్చకూడదూ – అన్నాన్ని మాడ్చకూడదు. సమ్ఝే నానమ్మా డ్యూడ్?!’’ ‘‘నువ్వు ఎన్నైనా చెప్పవే... ఒత్తిడిలో పని జరగదు గాక జరగదు. పైగా నువ్వుంటే ఇంకా డిస్ట్రబెన్సు. కాబట్టి.... రాకమ్మా మనవరాలా రాకమ్మా.... నీ కోవేలా కాలేజీ... కిచేనెందుకూ నీకూ కొలువై ఉండేందుకూ...’’ ‘‘నేనేమీ రాన్లేగానీ... నువ్వనుకునేది కరెక్ట్ కాదు. ఒత్తిడి ఎంతుండాలంటే... భోజనం విషయానికి వస్తే అన్నం మాడి ఆకలితో మనల్ని మాడ్చకూడదు... ఆబగా ఓ ముద్ద ఎక్కువ తినేస్తే ఒంటిని జ్వరంతో కాల్చకూడదు. తలనొప్పి రానీకుండా చూసే కాఫీ అనే అమృతానికీ... అమృతాంజనానికీ సరిగ్గా మధ్యన గీత గీసేంత ఒడుపు కలిగి ఉండటమే ఐడియల్ ఒత్తిడి. దాన్ని నువ్వు స్ట్రెస్సనూ, ప్రెషరను. ఆ నర్వస్నెస్సులో ఓ వైబ్రేషనుంది. ఓ ఎమోషనుంటది. అది ఉండి తీరాలి నానమ్మా. కాబట్టి చపాతీలా చతికిల పడకు. పూరీలా ΄ పొంగనీ ఉత్సాహం నీలో’’ ‘‘అమ్మో అమ్మో... పైకి చూడ్డానికి పూరీలోని పైపొరలా సాఫ్ట్‌గా కనిపిస్తదిగానీ... కింది పొరలా భయంకరమైన టఫ్రా నీ కూతురూ. ప్రతి జనరేషన్‌లోనూ ఓ కొత్త థాట్‌ను ముందుకు తీస్కెళ్లడానికి అప్పుడప్పుడూ వంటగదిలోకి ఒకతొస్తుంది. ఆ పిల్లనే అప్పడాలకర్ర బేరర్ అంటార్రా’’ అపూరూపంగా మనవరాల్ని చూసుకుంటూ నాతో అబ్బురంగా అంది మా అమ్మ. – యాసీన్ -
పెంపుడు శునకాలు అనారోగ్యంతో ఉన్నాయని..
న్యూఢిల్లీ: రతన్ టాటా ఇప్పుడు మన మధ్య లేరు. అయితే అతని జ్ఞాపకాలు, రచనలు నిత్యం మనతోనే ఉంటాయి. రతన్ టాటా చూపిన దాతృత్వానికి సంబంధించిన అనేక ఉదాహణలు మనకు కనిపిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్త సుహైల్ సేథ్.. రతన్ టాటా చాటిన మానవత్వానికి సంబంధించిన ఒక ఘటనను పంచుకున్నారు.ఫిబ్రవరి 2018లో బ్రిటీష్ రాజకుటుంబం రతన్ టాటాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించాలనుకుంటున్నట్లు సుహైల్ సేథ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రిన్స్ చార్లెస్ స్వయంగా రతన్ టాటాకు ఈ బిరుదును ఇవ్వాలనుకున్నారు. అయితే రతన్ టాటా బ్రిటన్ వచ్చేందుకు నిరాకరించారు. అయితే దీని వెనుకగల కారణాన్ని తెలుసుకున్న ప్రిన్స్ చార్లెస్ రతన్ టాటాను మానవతావాదిగా కొనియాడారు.ఈ ఆసక్తికరమైన కథనాన్ని సుహైల్ సేథ్ వివరించారు. 2018, ఫిబ్రవరి 6న ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్‌లో రతన్ టాటాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించాలనుకున్నారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించాలని భావించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుహైల్ సేథ్ ఫిబ్రవరి 3న లండన్ విమానాశ్రయానికి చేరుకున్నారు.ఈ సమయంలో సుహైల్ సేథ్ తన ఫోన్‌ని చూసుకున్నప్పుడు అతని మొబైల్ ఫోన్లో రతన్ టాటా నుండి 11 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వీటిని చూసిన సుహైల్ సేథ్ వెంటనే రతన్ టాటాకు ఫోన్ చేయగా, రతన్ టాటా తాను ఆ అవార్డుల ఫంక్షన్‌కి రాలేనని చెప్పారు. తన పెంపుడు శునకాలు టాంగో, టిటోలు అనారోగ్యంతో ఉన్నాయని వాటిని విడిచిపెట్టి, ఈ అవార్డుల ఫంక్షన్‌కి రాలేనని చెప్పారు. ఈ సమాధానం విన్న సుహైల్ సేథ్ ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్స్ చార్లెస్.. రతన్ టాటాను మానవత్వం కలిగిన మహనీయునిగా జంతు ప్రేమికునిగా పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: నా స్నేహితుడు, మంచి మనిషి: మోదీపై ట్రంప్ ప్రశంసలు -
రతన్ టాటా లవ్ స్టోరీ
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరొందారు. అయితే రతన్ టాటా ఏనాడూ తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడలేదు. కానీ 1997లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా అసంపూర్ణంగా మిగిలిపోయిన తన ప్రేమకథ గురించి ప్రస్తావించారు.తాను 1960లలో అమెరికాలో చదువుకున్న తర్వాత అక్కడే ఉద్యోగం చేయడం ప్రారంభించానని రతన్ టాటా నాటి ప్రముఖ నటి సిమి గ్రేవాల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సమయంలో రతన్ టాటా తాను ప్రేమలో పడిన అమ్మాయిని కలుసుకున్నారు. అయితే ఇంతలోనే అతనిని నాన్నమ్మ అతనిని ఇండియాకు తిరిగి రావాలని కోరారు.దీంతో రతన్ తాను లాస్ ఏంజెల్స్‌లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి భారత్‌కు తిరిగి వచ్చేశారు. రతన్‌టాటా భారత్‌కు తిరిగి రావడానికి ప్రధాన కారణం అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం. ఆ సమయంలో రతన్ టాటా సోదరుడు చాలా చిన్నవాడు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆయన నాన్నమ్మ మాటను కాదనలేక భారత్ తిరిగి వచ్చారు.తాను భారత్‌కు వచ్చిన తర్వాత తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కూడా ఇక్కడికి వస్తుందని భావించానని రతన్ టాటా ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే 1962లో భారత్-చైనా యుద్ధం కారణంగా రతన్ టాటా భావించినట్లు జరగలేదు. భారత్-చైనా యుద్ధం కారణంగా, రతన్ టాటా ప్రేమించిన అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు భారతదేశానికి పంపడానికి ఇష్టపడలేదు. ఈ వివాహానికి వారు సమ్మతించలేదు. ఫలితంగా రతన్ టాటా ప్రేమ కథ అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఇది కూడా చదవండి: రతన్ టాటాకు ప్రధాని మోదీతో పాటు ప్రముఖుల నివాళులు -
కథ విన్నారా?
హీరో ఎన్టీఆర్, తమిళ దర్శకుడు ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఎన్టీఆర్‌ను నెల్సన్ దిలీప్‌కుమార్ కలిసి ఓ కథ వినిపించారని, ఈ కథకు ఎన్టీఆర్ అంగీకారం తెలిపారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో తెరపైకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీ చిత్రం ‘వార్ 2’ (ఇందులో హృతిక్ రోషన్ మరో హీరో)తో బిజీగా ఉన్నారు. త్వరలోనే ప్రశాంత్ నీల్‌తో చేయనున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతారు. మరోవైపు ‘జైలర్ 2’ సినిమా స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరిచే పనుల్లో ఉన్నారు నెల్సన్. ‘జైలర్’లో హీరోగా నటించిన రజనీకాంత్ ‘జైలర్ 2’లోనూ నటిస్తారు. ఇలా... ‘వార్, డ్రాగన్’ సినిమాలను ఎన్టీఆర్ పూర్తి చేశాక, అటు ‘జైలర్ 2’ను నెల్సన్ కంప్లీట్ చేశాక... కానీ ఎన్టీఆర్–నెల్సన్ కాంబోలోని సినిమా సెట్స్‌పైకి వెళ్లే చాన్సెస్ కనిపించడం లేదు. దీంతో ఈ సినిమా పై అధికారిక ప్రకటన రావడానికి, ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి చాలా సమయం పడుతుందని ఊహించవచ్చు. -
గుట్టు విప్పిన సమాధి..
‘తండ్రి సమాధి దగ్గర అన్నదమ్ముల తన్నులాట. ఉత్తరప్రదేశ్‌లోని అజీజ్పూర్లో జరిగిన ఈ సంఘటన ఊళ్లో వాళ్లందరినీ విస్మయానికి గురి చేసింది. శిథిలావస్థకు చేరిన తండ్రి సమాధికి మరమ్మతులు చేయాలని తమ్ముడు, అవసరంలేదు.. ఎలా ఉందో అలాగే ఉంచాలని అన్న పట్టుబట్టడంతో వాదన తగువుగా మారి, చేయి చేసుకోవడం వరకు వెళ్లింది. అన్న మొండిపట్టుపై అనుమానం వచ్చిన తమ్ముడు, అన్న మీద నిఘా పెట్టాడు. ఓ రాత్రివేళ అన్న.. తండ్రి సమాధి పక్కనున్న గుంతలోంచి ఒక కుండను తీసుకెళ్లడం తమ్ముడి కంటబడింది. అన్నకు ఎదురెళ్లి ఆ కుండను లాక్కొని చూశాడు. అందులో బంగారం ఉంది. హతాశుడయ్యాడు. అన్న మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ’ అంటూ చదువుకుపోతున్నాడు ఐటీ ఆఫీస్‌లో.. ఓ ఉద్యోగి.నవ్వుతూ ఆ వార్తను వింటున్న ఓ మహిళా ఉద్యోగికి ఏదో అనుమానం వచ్చినట్టుంది. వెంటనే తన కొలీగ్ చేతుల్లోంచి ఆ పేపర్ లాక్కొని తమ ఆఫీసర్ క్యుబికల్ వైపు పరుగెత్తినట్టే వెళ్లింది. ఆమె చర్యకు ఆశ్చర్యపోయాడు అప్పటిదాకా వార్త చదివిన కొలీగ్. బాస్ దగ్గరకు వెళ్లిన ఆ మహిళా ఉద్యోగి ‘సర్.. మన లాస్ట్ రైడ్‌లో..’ అని ఏదో చెప్పబోతుండగా..‘లీవిట్ .. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఓ పెద్ద వ్యక్తిని ఇన్సల్ట్ చేసినట్టయింది. డిపార్ట్మెంట్ పరువుపోయింది’ అన్నాడు బాస్ అసహనంగా!‘సర్.. అతని సొంతూరులో.. ’ అని మళ్లీ ఆమె ఏదో చెప్పబోతుండగా.. ‘ఆ విషయాన్ని వదిలేయండి అన్నాను కదా..’ అన్నాడు ఫైల్లోంచి ముఖం బయటపెట్టకుండానే!‘అదికాదు సర్.. అతని సొంతూరు.. ’ అని తన మాటను పూర్తి చేయాలని ఆమె ప్రయత్నిస్తుండగా.. బాస్ మళ్లీ అడ్డుపడుతూ ‘సొంతిల్లు, బంధువుల ఇళ్లు, ఫ్యాక్టరీ, గోదామ్లు అన్నీ సర్చ్ చేశాం. ఎక్కడా చిల్లి గవ్వ, చిరిగిన డాక్యుమెంట్ కూడా దొరకలేదు’ అన్నాడు కాస్త చిరాగ్గా. ‘బట్ సర్ అతని తండ్రి సమాధి సర్చ్ చేయలేదు కదా’ స్థిరంగా అన్నది ఆ ఉద్యోగిని. అప్పుడు తలెత్తి ఆమె వంక చూశాడు అతను. ఆమె అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.. ‘సర్.. ఆ బడాబాబు, రీసెంట్గా తన తండ్రి పదిహేనో వర్ధంతి సందర్భంగా.. తన పొలంలో ఉన్న తండ్రి సమాధిని రెనోవేట్ చేశాడని మొన్ననే పేపర్లో చదివాను. దాన్నో విశ్రాంతి మందిరంలా తీర్చిదిద్దాడని పేపర్లు తెగ పొగిడాయి’ అంటూ ఆగింది. ‘అయితే ఏంటీ?’ అన్నట్టుగా చూశాడు. వెంటనే అతని చేతుల్లో తను లాక్కొచ్చిన పేపర్ పెట్టి, ఇందాక తన కొలీగ్ చదివిన వార్తను చూపించింది ఆమె. ఆ వార్త మీద దృష్టిసారించాడు ఆఫీసర్. రెండు నిమిషాల తర్వాత ‘యెస్.. ఎలా మిస్ అయ్యాం ఈ పాయింట్‌ని?’ అన్నాడు పేపర్‌ను మడిచేస్తూ!‘సర్.. ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు!’ అంది ఆమె ఉత్సాహంగా!నాలుగు రోజలకు.. బడాబాబు సొంతూరులోని పొలానికి చేరుకుంది ఐటీ టీమ్. పేపర్లు పొగిడినట్టే అది నిజంగానే సమాధిలా లేదు. వాచ్‌మన్ ఉన్నాడు. తామెవరో చెప్పి, ముందుకు మూవ్ అయ్యారు. ఆ సమాధిని పరిశీలిస్తుండగానే బడాబాబు తన పరివారంతో రెండు కార్లలో అక్కడికి చేరుకున్నాడు. కారు పార్క్ అవుతుండగానే హడావిడిగా కారు దిగి, పరుగెడుతున్నట్టుగా ఐటీ టీమ్‌ని చేరాడు. ‘మా కుటుంబానికి మాత్రమే పర్మిషన్ ఉన్న ప్లేస్ ఇది’ అంటూ బడాబాబు.. ఐటీ ఆఫీసర్ మీదకు పళ్లునూరుతుండగానే ‘కూల్ సర్, మీకు సంబంధించిన అన్ని చోట్లా ఇన్క్లూడింగ్ ఈ సమాధి.. సర్చ్ చేసుకునే పర్మిషన్ మాకుంది’ అంటూ అనుమతుల పత్రం చూపించాడు ఐటీ ఆఫీసర్. ప్యాంట్ జేబులోంచి కర్చీఫ్ తీసుకుని నుదుటికి పట్టిన చెమట తుడుచుకున్నాడు బడాబాబు. పక్కనే ఉన్న అతని అíసిస్టెంట్తో ‘సర్కి మంచినీళ్లు’ అంటూ సైగ చేశాడు ఐటీ ఆఫీసర్. ‘నో థాంక్స్’ అంటూ కోపంగా అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూలబడ్డాడు బడాబాబు. సమాధి చుట్టూ పరిశీలించారు ఐటీ వాళ్లు. అనుమానం ఉన్న చోటల్లా తట్టారు. ఏమీ కనిపించలేదు. రహస్య అరలేవీ తెరుచుకోలేదు. ఇదీ వృథా ప్రయాసే కాదు కదా అనుకుంటూ బడాబాబు వైపు చూశాడు ఐటీ ఆఫీసర్. అతని ముఖంలో చాలా కంగారు కనపడుతోంది. అయితే అంతా కరెక్ట్‌గానే జరుగుతోంది అనే భరోసాకు వచ్చాడు ఐటీ ఆఫీసర్. అతను అలా అనుకుంటున్నాడో లేదో.. ‘సర్’ అంటూ పిలిచాడు ఉద్యోగి. ఒక్క అంగలో అక్కడికి వెళ్లాడు ఆఫీసర్. సరిగ్గా సమాధికి ముందు ఫ్లోరింగ్‌లోని నాలుగు మార్బుల్స్ డిజైన్‌లో ఏదో తేడాగా ఉంది. చూపించాడు ఉద్యోగి. చూశాడు ఆఫీసర్. ప్రత్యేక డిజైన్లా కనపడుతోంది కానీ.. సమ్‌థింగ్ ఫిషీ అనుకున్నాడు. బడాబాబు వైపు చూశాడు. అతనిలో కంగారు ఎక్కువైంది. కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్లారిటీ వచ్చేసింది ఆఫీసర్‌కి.‘సర్..’ పిలిచాడు ఆఫీసర్. ‘ఏంటీ?’ అన్నట్టుగా చూశాడు బడాబాబు. ‘కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ఇట్?’ అడిగాడు ఆఫీసర్. ‘ఓపెన్ చేయడానికి అదేమన్నా తలుపా?’ బడాబాబు సమాధానం.‘డోర్ అయితే మేమే ఓపెన్ చేసేవాళ్లం. ప్లీజ్ ఓపెన్ ఇట్..’ స్థిరంగా చెప్పాడు ఆఫీసర్. అట్టే బెట్టు చేయక జేబులోంచి రిమోట్ తీసి ఓపెన్ చేశాడు. టెన్ బై టెన్ సైజులోని నేలమాళిగ అది. అందులో అన్నీ లాకర్లే! డబ్బు, బంగారం, వెండి, బంగారు విగ్రహాలు, వజ్రాలు ఎట్సెట్రా చాలానే దొరికాయి. అయినా ఆ ఆఫీసర్ ముఖంలో విజయం తాలూకు ఆనవాళ్లు లేవు. ఎందుకంటే ఆయనకందిన లెక్కలో దొరికినవాటి లెక్క సగం కూడా లేదు. ఫార్మాలిటీస్ పూర్తిచేసుకొని, తిరుగు ప్రయాణమవుతూ ‘ఇంకేదో క్లూ మిస్ అయి ఉంటాం’ అనుకున్నాడు.ఇవి చదవండి: ఈ కిక్కిరిసిన అపార్ట్మెంట్ ఎక్కడుందో తెలుసా!? -
కాకి హంసల కథ! పూర్వం ఒకానొక ద్వీపాన్ని..
పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుగారు ఉండే నగరంలోనే ఒక సంపన్న వర్తకుడు ఉండేవాడు. అతడు ఉత్తముడు. ఒకరోజు ఒక కాకి అతడి పెరటి గోడ మీద వాలింది. వర్తకుడి కొడుకులు ఆ కాకికి ఎంగిలి మెతుకులు పెట్టారు. అప్పటి నుంచి కాకి ఆ ఇంటికి అలవాటు పడింది. వర్తకుడి కొడుకులు రోజూ పెట్టే ఎంగిలి మెతుకులు తింటూ బాగా బలిసింది. బలిసి కొవ్వెక్కిన కాకికి గర్వం తలకెక్కింది. లోకంలోని పక్షులేవీ బలంలో తనకు సాటిరావని ప్రగల్భాలు పలుకుతుండేది.ఒకనాడు వర్తకుని కొడుకులు ఆ కాకిని వ్యాహ్యాళిగా సముద్ర తీరానికి తీసుకెళ్లారు. సముద్రతీరంలో కొన్ని రాజహంసలు కనిపించాయి. వర్తకుని కొడుకులు ఆ రాజహంసలను కాకికి చూపించి, ‘నువ్వు వాటి కంటే ఎత్తుగా ఎగరగలవా?’ అని అడిగారు. ‘చూడటానికి ఆ పక్షులు తెల్లగా కనిపిస్తున్నాయే గాని, బలంలో నాకు సాటిరాలేవు. అదెంత పని, అవలీలగా వాటి కంటే ఎత్తుగా ఎగరగలను’ అంది కాకి.‘సరే, వాటితో పందేనికి వెళ్లు’ ఉసిగొల్పారు వర్తకుడి కొడుకులు. ఎంగిళ్లు తిని బలిసిన కాకి తారతమ్యాలు మరచి, హంసల దగ్గరకు డాంబికంగా వెళ్లింది. తనతో పందేనికి రమ్మని పిలిచింది. కాకి తమను పందేనికి పిలవడంతో హంసలు పకపక నవ్వాయి. ‘మేం రాజహంసలం. మానససరోవరంలో ఉంటాం. విహారానికని ఇలా ఈ సముద్రతీరానికి వచ్చాం. మేం మహాబలవంతులం. హంసలకు సాటి అయిన కాకులు ఉండటం లోకంలో ఎక్కడైనా విన్నావా?’ అని హేళన చేశాయి.కాకికి పౌరుషం పొడుచుకొచ్చింది.‘నేను నూటొక్క గతులలో ఎగరగలను. ఒక్కో గతిలో ఒక్కో యోజనం చొప్పున ఆగకుండా వంద యోజనాలు అవలీలగా ఎగరగలను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం. కావాలంటే పందెం కాద్దాం’ కవ్వించింది కాకి.‘మేము నీలా రకరకాల గతులలో ఎగరలేం. నిటారుగా ఎంతదూరమైనా ఎగరగలం. అయినా, నీతో పోటీకి మేమంతా రావడం దండగ. మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది’ అన్నాయి హంసలు.ఒక హంస గుంపు నుంచి ముందుకు వచ్చి, ‘కాకితో పందేనికి నేను సిద్ధం’ అని పలికింది.పందెం ప్రారంభమైంది.కాకి, హంస సముద్రం మీదుగా ఎగరసాగాయి.హంస నెమ్మదిగా నిటారుగా ఎగురుతూ వెళుతుంటే, కాకి వేగంగా హంసను దాటిపోయి, మళ్లీ వెనక్కు వచ్చి హంసను వెక్కిరించసాగింది. ఎగతాళిగా ముక్కు మీద ముక్కుతో పొడవడం, తన గోళ్లతో హంస తల మీద జుట్టును రేపడం వంటి చేష్టలు చేయసాగింది. కాకి వెక్కిరింతలకు, చికాకు చేష్టలకు హంస ఏమాత్రం చలించకుండా, చిరునవ్వు నవ్వి ఊరుకుంది. చాలాదూరం ఎగిరాక కాకి అలసిపోయింది. అప్పుడు హంస నిటారుగా ఎగసి, పడమటి దిశగా ఎగరసాగింది. కాకి ఎగరలేక బలాన్నంతా కూడదీసుకుని ఎగురుతూ రొప్పసాగింది. హంస నెమ్మదిగానే ఎగురుతున్నా, కాకి ఆ వేగాన్ని కూడా అందుకోలేక బిక్కమొహం వేసింది. ఎటు చూసినా సముద్రమే కనిపిస్తోంది. కాసేపు వాలి అలసట తీర్చుకోవడానికి ఒక్క చెట్టయినా లేదు. సముద్రంలో పడిపోయి, చనిపోతానేమోనని కాకికి ప్రాణభీతి పట్టుకుంది. కాకి పరిస్థితిని గమనించిన హంస కొంటెగా, ‘నీకు రకరకాల గమనాలు వచ్చునన్నావు. ఆ విన్యాసాలేవీ చూపడం లేదేం కాకిరాజా?’ అని అడిగింది.కాకి సిగ్గుపడింది. అప్పటికే అది సముద్రంలో పడిపోయేలా ఉంది. ‘ఎంగిళ్లు తిని కొవ్వెక్కి నాకెవరూ ఎదురులేరని అనుకునేదాన్ని. నా సామర్థ్యం ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది. సముద్రంలో పడిపోతున్నాను. దయచేసి నన్ను కాపాడు’ అని దీనాలాపాలు చేసింది. కాకి పరిస్థితికి హంస జాలిపడింది. సముద్రంలో పడిపోతున్న కాకి శరీరాన్ని తన కాళ్లతో పైకిలాగింది. ఎగురుకుంటూ వెళ్లి ఒడ్డుకు చేర్చింది.‘ఇంకెప్పుడూ లేనిపోని డాంబికాలు పలుకకు’ అని బుద్ధిచెప్పింది హంస. ఈ కథను కురుక్షేత్రంలో శల్యుడు కర్ణుడికి చెప్పాడు.‘కర్ణా! నువ్వు కూడా వర్తకుడి పుత్రుల ఎంగిళ్లు తిన్న కాకిలాగ కౌరవుల ఎంగిళ్లు తిని అర్జునుణ్ణి ధిక్కరిస్తున్నావు. అనవసరంగా హెచ్చులకుపోతే చేటు తప్పదు! బుద్ధితెచ్చుకుని మసలుకో’ అని కర్ణుణ్ణి హెచ్చరించాడు. – సాంఖ్యాయన -
రెక్కలు..
చెరువు ఏమీ ఎరగనట్టుగా ఉంది. లేత మట్టిరంగు నీరు గాలికి అలలను ఏర్పరుస్తూ ఉంది. చాలా పెద్ద చెరువే అది. ఎంత లోతు ఉంటుందో. లోతును తలుచుకునే సరికి రాఘవకు కొంచెం భయం వేసింది. మళ్లీ తెగింపు వచ్చింది. ఆ తెగింపును చెదరగొడుతున్నట్టుగా గుడి గంట టంగుమని మోగింది. రాఘవ తల తిప్పి చూశాడు.చెరువు గట్టునే ఉన్న గుడికి పనుల మీద వెళుతున్నవాళ్లు ఆగి నమస్కారాలు పెట్టి వెళుతున్నారు. కొందరు దర్శనం కోసమే వచ్చి లోపలికి వెళుతున్నారు. ఉదయం తొమ్మిది అయి ఉంటుంది. అక్కడికి కాస్త దూరంలోనే ఉన్న స్కూల్ ఫస్ట్ బెల్ కూడా టంగుమని మోగింది.రాఘవ అదేమీ పట్టనట్టుగా దృష్టిని చెరువు వైపు మళ్లించాడు. గుడి వైపు చెరువు ఒడ్డు ఉండటంతో నీళ్లు తక్కువగా ఉన్నాయి. గట్టు మీద నడుచుకుంటూ వెళితే కుడి చివర నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. అంచు నుంచి జారినా దూకినా గల్లంతే. రాఘవకు చెమట పట్టింది. వెంటనే ఆకలి కూడా వేసింది. స్టవ్ మీద ఇడ్లీ ఉడుకుతుంటే తల్లి ‘ఆగరా’ అంటున్నా వచ్చేశాడు. తండ్రి గొంతు వెనుక నుంచి వినిపిస్తూనే ఉంది ‘పోనీ వెధవనీ’ అని.వెధవా తను? టెన్త్‌లో ఎన్ని మార్కులొచ్చాయి. ఇంటర్లో ఎన్ని మార్కులొచ్చాయి. బీటెక్ పూర్తి చేశాక కాలేజీలో అందరూ ‘నువ్వే టాప్. క్యాంపస్ సెలక్షన్లో నీకు ఉద్యోగం వస్తుంది’ అనంటే నిజమే అనుకున్నాడు. మార్కెట్ డౌన్లో ఉందట. క్యాంపస్ సెలక్షన్సే జరగలేదు. ఒక చిన్న కంపెనీ ముంబై నుంచి ఉద్యోగం ఇస్తానని అందిగాని అది బోగస్‌దని తేలింది. ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నాడు. తండ్రిని చేతి ఖర్చులు అడగాలన్నా నామోషీగా ఉంది. తండ్రి మాత్రం ఏం చేయగలడు. చిన్న ఊరు. చిన్న ఉద్యోగం.చేతికందొస్తాడనుకున్న కొడుకు ఖాళీగా ఉంటే బాధ ఉంటుంది. విసుక్కుంటున్నాడు. రాత్రి ఫోన్ చూసుకుంటూ పడుకుని ఉంటే తిట్టాడు. ‘దేశంలో అందరికీ ఉద్యోగాలొస్తుంటే నీకెందుకు రావడం లేదురా. ముప్పొద్దులా తింటూ ఫోను చూసుకుంటూ వుంటే ఎవడిస్తాడు’ అన్నాడు. బాధ కలిగింది. థూ ఎందుకీ జన్మ అనిపించింది. హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్స్‌కు ఫోన్ చేశాడు. ‘మేమే బెంచ్ మీద ఉన్నాం బ్రో. ప్రాజెక్ట్‌లో దూరడం చాలా కష్టంగా ఉంది’ అన్నారు. ఏ ఆశా మిగల్లేదు. ఆ అర్ధరాత్రే వెళ్లి చెరువులో దూకుదామా అనుకున్నాడు. ధైర్యం చాల్లేదు. ఉదయాన్నే లేచి టిఫిన్ కూడా చేయకుండా ఇటొచ్చేశాడు. వచ్చి? దూకాలి. దూకాలంటే మాటలా?ఏదో అలికిడిగా కేరింతలుగా వినిపించింది. గుడి దగ్గర ఎవరో తాత. గుడ్డ పరిచి జామకాయలు అమ్ముతున్నాడు. స్కూలుకెళ్లే పిల్లలు చుట్టూ మూగి ఉన్నారు. పిల్లలు అంతగా మూగడానికి కారణం ఏమిటో చూద్దామని అటుగా అడుగులు వేశాడు. అతనికి తెలియకుండానే పెదాల మీద చిరునవ్వు వచ్చింది. తాత భుజం మీద చిలుక. పిల్లలతో ముద్దు ముద్దు మాటలు చెబుతోంది. ఆ మాటలకు పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతుంటే అది తన రెండు రెక్కల్ని అటు ఇటు ఆడిస్తూ ముక్కుతో శబ్దం చేస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. పిల్లలు ‘హాయ్’ అని పలకరిస్తే అది దాని రెండు రెక్కల్ని కలిపి వందనం చేసింది. జామకాయలు అమ్ముతున్న తాత ‘చిలకమ్మా.. గుడి ఎటువైపుంది’ అనగానే కుడి రెక్కతో గుడి వైపు చూపిస్తూ శబ్దం చేసింది. ‘బడి ఎక్కడుందో చెప్పు’ అనగానే తన ఎడమ రెక్కతో బడివైపు చూపిస్తూ శబ్దం చేసింది. ‘బడి, గుడి అంటే నీకు ఇష్టమా తల్లీ?’ అని తాత అనగానే చిలకమ్మ అవునన్నట్లు బుర్ర ఊపుతూ శబ్దం చేసింది.తాత చిలకమ్మకి ఎంత చక్కగా ట్రైనింగ్ ఇచ్చాడో అనుకున్నాడు రాఘవ. ఓ పిల్లవాడు తాత భుజాన్ని బలంగా తాకడంతో భుజంపైన ఉన్న చిలకమ్మ కింద పడింది. ‘అయ్యో’ అంటూ దాన్ని చేతిలోకి తీసుకున్న రాఘవకి తెలిసింది దాని రెండు కాళ్లలో బలం లేదని. అది తన పొట్ట మీద తాత భుజం మీద కూచుని ఉందని. తాత వెంటనే చిలకమ్మని తన చేతిలోకి తీసుకుని దాని వీపు మీద నిమురుతూ మరల తన భుజం పైకి ఎక్కించుకుని ప్రేమగా జాంపండు తినిపించసాగాడు.రాఘవ కళ్లల్లోని బాధను చూసి ‘మనుషులకే కాదు పక్షులకు కూడా పక్షవాతం వస్తుంది బాబూ. ఇది ఇంతకు ముందు బానే ఉండేది. ఏమైందో ఏమో ఒకరోజు ఉన్నట్టుండి కాళ్లు పడిపోయాయి. కాళ్లు పడిపోయాక రెక్కలున్నా లాభం లేదు. అయినా మా చిలకమ్మ బాధ పడదు. సందడి చేయడం ఏ మాత్రం ఆపదు. దానికి తెలుసు అది సందడి ఆపేస్తే ఈ తాత దగ్గర పిల్లలు మూగరు. జామకాయలు కొనరు. అందుకే ఎగిరే శక్తి పోయినా ఎగరగలననే ఆశను చావనివ్వదు’ అన్నాడు తాత.ఆ మాటలకు చిలకమ్మ తనకి ఏదో అర్థమైనట్టుగా తాత బుగ్గ మీద ముక్కుతో అటు ఇటు రాస్తూ ముద్దాడింది. దానికి వచ్చిన కష్టంతో పోలిస్తే తనకు వచ్చిన కష్టాలు ఏమంత పెద్దవి? తల్లిదండ్రుల ఆశ తీర్చలేకపోయినందుకు బాధ కలిగి, వారికి తన మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.నిజంగా అలా చేస్తే వాళ్లు ఏమైపోతారు? వాళ్లు మాత్రం సంతోషంగా జీవిస్తారా? నిజంగా అది వాళ్లకి చావు కంటే పెద్ద నరకం. అంటే తన చేతులారా తన కన్న తల్లిదండ్రులని తనే చంపుకున్నట్టు కదా... ఇంతకంటే ఘోర పాపం ఉంటుందా?ఇంత ముసలివాడైన తాత జామకాయలు అమ్ముతూ ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తున్నాడే... యువకుడైన తనకీ నిరాశ ఏమిటి? తాత రాఘవ వైపు చూస్తూ ‘చెరువులో దూకడానికి వచ్చావు గదా బాబూ’ అన్నాడు.రాఘవ ఉలిక్కి పడ్డాడు.‘నీకెలా తెలుసు?’ అన్నాడు.‘ఉదయమే చూశాను బాబూ నిన్ను చెరువు గట్టున. నీలాంటి కుర్రాళ్లు ఒంటరిగా వచ్చి హైరానా పడుతుంటే ఆ మాత్రం కనిపెట్టలేనా బాబూ. నేను ముసలాణ్ణయినా ఇప్పటికీ చెరువులో ఆ చివర నుంచి ఈ చివరకు ఈదగలను. ఒకవేళ నువ్వు దూకితే లటుక్కున దూకి జుట్టు పట్టుకుని లాక్కొద్దామని ఒక కన్ను వేసే ఉంచాను. నువ్వే వచ్చావు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నాయనా.. వెతకాలి. కష్టమొచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోతే ఈ లోకంలో మనుషులే ఉండరు‘ అన్నాడు.రాఘవ మనసులో ఇప్పుడు ఉదయపు కోరిక పూర్తిగా చచ్చిపోయింది. కొత్త రాఘవ అయ్యాడు.‘ఈ జామకాయ తిను బాబూ’ అంటూ తన జామకాయల బుట్టలో నుంచి ఓ కాయని తీసి తాత రాఘవ చేతిలో పెట్టాడు. రాఘవ ‘అయ్యో.. నా దగ్గర పైసా కూడా లేదు తాతా’ అనగానే ‘మరేం పర్వాలేదు బాబూ’ అన్నాడు. జామకాయ చాలా రుచిగా ఉంది. చిన్న ముక్క అరచేతిలో ఉంచి చిలకమ్మ దగ్గర పెడితే స్వతంత్రంగా పొడిచి గుటుక్కుమనిపించిందది. నవ్వుకున్నాడు.‘కాయ చాలా రుచిగా ఉంది తాతా’‘ఊరవతల తోటలోవి బాబూ. వాళ్లు నాకు తెలిసినవాళ్లే. మంచి కాపొచ్చే తోట. డబ్బున్నోళ్లు. చేసుకోవాలని లేదు. ఎవరికైనా గుత్తకు ఇద్దామనుకుంటున్నారు. ఈ కాయలను ఒక ఆటోలో వేసుకొని టౌన్‌కు తీసుకెళ్లి అమ్మితే ఇక్కడ పది రూపాయలకు అక్కడ యాభై వస్తాయి. నేనా చేయలేను’ అన్నాడు తాత.రాఘవకు ్రౖడైవింగ్ వచ్చు. చిన్న ట్రాలీ అద్దెకు తీసుకోగలడు. ‘తోట యజమానితో మాట్లాడి నన్ను పరిచయం చేయి తాతా. తర్వాతి కథ నేను చూసుకుంటాను. రేపటి నుంచి మన బిజినెస్ టౌన్లోనే. నువ్వు తోడుండు చాలు’ అన్నాడు రాఘవ.‘ఏంటి బాబూ నువ్వనేది’‘అవును తాతా’ అన్నాడు రాఘవ.తాత కూడా చిరునవ్వు నవ్వాడు.‘ఏం చిలకమ్మా’ అన్నాడు.అది కిచకిచమని అంగీకారం తెలిపింది.ముగ్గురూ లేచి అక్కడ నుంచి కదిలారు. గుడి గంట మరోసారి టంగుమంది. కొత్త రెక్కలతో రాఘవ, తాత, చిలకమ్మ ముందుకు సాగిపోయారు. – నేదూరి భాను సాయి శ్రేయ -
పరివర్తనం: ‘దేవరపాలెం.. దేవరపాలెం..’
‘దేవరపాలెం.. దేవరపాలెం..’ అంటూ కండక్టర్ కనకరాజు రాబోయే స్టాపులో దిగబోయే ప్రయాణికులను అలర్ట్ చేస్తూ గట్టిగా అరిచాడు. కనకరాజు అరుపులకు కొంతమంది సీట్లలోంచి లేచి, హడావిడిగా తమ సామాన్లను తీసుకుంటున్నారు. ‘రావాలి.. రావాలి..’ అంటూ కనకరాజు వారిని మరింత వేగిరపెట్టాడు. కొంతమంది దిగిపోయాక, కొంతమంది ఎక్కారు. కనకరాజు టికెట్స్ కొట్టే కట్టర్‌తో ఎదురుగా ఉన్న ఇనుప రాడ్ మీద ‘రైట్.. రైట్..’ అంటూ గట్టిగా కొట్టాడు. అతను ఇచ్చిన శబ్దసందేశానికి బస్సు పొగలు చిమ్ముకుంటూ బయల్దేరింది.ఆ బస్టాపుకి కొద్దిదూరంలో వున్న ఒకావిడ మర్రిచెట్టు కింద కూర్చుని, బస్సులోంచి దిగుతున్న ప్రయాణికులను ఆత్రంగా చూడటం కనకరాజు కొద్దిరోజులుగా గమనిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వచ్చే ఆ బస్ కోసమే ఆమె రెండు పూటలా వస్తోంది. ఆమెకు సుమారుగా నలభై ఐదేళ్లుంటాయి. ఆమె కళ్ళు తీక్షణంగా మెరుస్తూ, దేనికోసమో వెతుకుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఇదే ఆమె క్రమం తప్పని దినచర్య!‘ఆమె ఎవరు? రోజూ ఎవరి కోసం ఎదురుచూస్తోంది?’ అనే ప్రశ్నలు ఆమెని చూసినప్పుడల్లా కనకరాజు మదిని తొలిచేస్తున్నాయి. కనకరాజు తన ఆలోచనల్లోంచి బయటికి వచ్చి, ఓ పెద్దాయనకు టికెట్ కొడుతూ ‘బాబాయ్, ఎవరావిడ?’ తన మనసుని కుదిపేస్తున్న ప్రశ్నని అతని ముందు పెట్టాడు.‘ఆవిడో పిచ్చి మాలోకమయ్యా..!’ అతను ముక్తసరిగా బదులిచ్చాడు. కనకరాజు ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.తన డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్న కనకరాజు నిస్సత్తువగా హాల్లోని సోఫాలో వాలిపోయాడు. భర్త రాకను గమనించిన అతని భార్య సరోజ వంటగదిలోంచి వస్తూ ‘టీ పెట్టమంటారా?’ అని అనునయంగా అడిగింది.‘వద్దు సరోజా.. అలేఖ్యకి ఇప్పుడెలా వుంది? నిద్రపోతోందా?’ దుఃఖాన్ని గుండె లోతుల్లోనే దిగమింగుకుని నెమ్మదిగా అడిగాడు కనకరాజు.‘జ్వరం కొంచెం కూడా తగ్గుముఖం పట్టడంలేదు. ఏమి తిన్నా వాంతులు చేసుకుంటోంది. ఇప్పుడే పడుకుంది’ చెప్పింది సరోజ బాధని పంటితో బిగబట్టుకుని.కనకరాజుని ఈ మధ్యకాలంలో బాగా వేధిస్తోన్న అతిపెద్ద సమస్య తన ఎనిమిదేళ్ల కూతురి అనారోగ్యం! అతని కూతురు సంవత్సర కాలంగా అంతుచిక్కని కొత్త తరహా న్యుమోనియాతో నరకాన్నే చూస్తోంది. ఏడాదిగా స్కూలుకి కూడా పోవడంలేదు. తెలిసిన వాళ్లు చెప్పిన స్పెషలిస్టులందరికీ చూపించాడు. డాక్టర్లు సూచించిన అన్నిరకాల టెస్టులు చేయించాడు, చేయిస్తూనే వున్నాడు. ఫలితం మాత్రం శూన్యం!కనకరాజుకి ఎప్పటిలాగే ఆరోజు కూడా దేవరపాలెం బస్టాపు దగ్గర రెండు దఫాలూ అదే దృశ్యం ఎదురైంది. ఈసారి ఎవరినీ అడగకూడదని, తనే స్వయంగా ఆమెని కలిసి, విషయమేంటో ఆరా తీయాలని గట్టిగా తీర్మానించుకున్నాడు. తన సెలవు రోజున దేవరపాలెం వెళ్లాడు. బస్టాపు దగ్గర్లోని ఓ బడ్డీ కొట్టులో ఒక వాటర్ బాటిల్ కొంటూ, మర్రిచెట్టు కింద కూర్చున్న ఆవిడను చూపిస్తూ ‘ఎవరండీ ఆవిడ? రోజూ అక్కడ కూర్చుని, ఎవరి కోసం ఎదురు చూస్తుంది?’ అడిగాడు కాస్త చొరవతీసుకుని.‘ఆవిడా? ఎప్పుడో చిన్నప్పుడే పారిపోయిన కొడుకు తిరిగొస్తాడని.. అవిడో పిచ్చిది సార్!’ క్లుప్తంగా బదులిచ్చాడతడు.‘ఈ మాత్రం చాలు. ఆమెని చేరుకోవడానికి’ అనుకుంటూ, ఆ పక్కనే వున్న చెక్కబల్ల మీద కూర్చున్నాడు. ఆ కాసేపటికి బస్సు రావడం, వెళ్లిపోవడం జరిగిపోయాయి. బస్సు వచ్చేటప్పుడు ఆమె కళ్లల్లో అదే వెలుగు. బస్సు వెళ్లిపోయిన మరుక్షణమే నిరాశగా ఇంటిదారి పట్టింది. కనకరాజు దూరం నుంచే ఆమెను అనుసరించసాగాడు. ఆమె వెళ్తూవెళ్తూ ఓ ఇంటి ముందు ఆగిపోయింది. అదే.. తన నివాసం కాబోలు అనుకున్నాడు. అది ఓ సెంటు స్థలంలో కట్టిన చిన్న పాత పెంకుటిల్లు.కనకరాజు ధైర్యాన్ని కూడగట్టుకుని, మరో ఆలోచన చేయకుండా గబగబా ఆమె దగ్గరకు వెళ్లి ‘అమ్మా..! నా పేరు కనకరాజు. మీ బిడ్డకోసం ఎదురు చూస్తున్నారని విన్నాను. నేను డ్యూటీ మీద చాలాచోట్లకు తిరుగుతుంటాను. మీ అబ్బాయి గురించి వివరాలు చెప్తే, నా శాయశక్తులా వెతికిపెడతాను’ నిజాయితీగా తన మనసులోని మాటని ఆమె ముందు పెట్టాడు. ఆమె కనకరాజు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘ఎవరు బాబూ మీరు? మీరు చెబుతున్నది నిజమేనా? నా బిడ్డ నిజంగా నా చెంతకొస్తాడా?’ ఆత్రంగా అడిగింది.‘అవునన్నట్లు’ తలూపాడు కనకరాజు. ఆమె మొహం ఒక్కసారిగా కాంతివంతమైంది.‘బాబూ.. నా కొడుకు పారిపోయి పదిహేనేళ్లు గడిసిపోనాయి. కానీ ఇంతవరకు ఎవ్వరూ యివ్వని భరోసాని యిత్తున్నావు. అందరూ నన్ను ‘పిచ్చిది’ అనేటోళ్లే గానీ, ఎవరూ యిలా చెప్పలేదు బాబూ..’ తన పట్టరాని సంతోషాన్ని, కన్నీళ్ల రూపేణా వ్యక్తపరచింది.ఆమె భావోద్వేగానికి కనకరాజు ఎంతోగానో చలించిపోయాడు. అతని కంట్లో కూడా నీళ్లూరాయి.‘మీ పేరెంటమ్మా..’ అడిగాడు. ‘ఎర్రయ్యమ్మ..’ చెప్పింది.మిగతా వివరాలూ అడిగాడు కనకరాజు. తన కొడుకు పేరు రాజు అని చెప్పింది ఆమె. పదేళ్లప్పుడు మాస్టారు కొట్టారని పుస్తకాల సంచిని అక్కడే విసిరికొట్టి, ఇంటికొచ్చేశాడట. కొడుక్కి బుద్ధి రావాలని రెండు దెబ్బలు వేసిందట ఎర్రయ్యమ్మ. అంతే..కోపంతో రాజు ఊరొదిలి పారిపోయాడు. అది మొదలు ఎర్రయ్యమ్మ పిచ్చిదానిలా చుట్టుపక్కల ఊళ్లే కాదు, సిటీలోని వీథులు, రోడ్లనూ గాలించిందట. తిరిగి తిరిగి కాళ్లు అరిగాయి కానీ కొడుకు జాడ మాత్రం తెలియలేదు. అదో తీరని వెతగా మారిపోయింది. కొడుకు కోసం ఎదురుచూస్తూ లోకం దృష్టిలో పిచ్చిదైపోయింది. ప్రభుత్వం అందిస్తోన్న ఫించనుతోపాటు రెండు ఇళ్లల్లో పాచిపనులు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. తను వుంటున్నది అద్దె ఇల్లే! అయితే ఒకప్పుడు అది తనదేనట. తాగుబోతు భర్త తన వ్యసనాల కోసం ఆ ఇంటిని అమ్మేశాడట. అయితే పెళ్లయిన మూడేళ్లకే చనిపోయాడట అతను. త్వరలోనే తన కొడుకు తనని వెతుక్కుంటూ ఇంటికి వస్తాడని ఈమధ్యనే ఓ సాధువు ఆమెకు జోస్యం చెప్పాడట.ఆమె నోట ఆ వివరాలన్నీ విన్న కనకరాజు ‘ఎర్రయ్యమ్మా, అప్పుడెప్పుడో పారిపోయిన నీ కొడుకు ఇన్నేళ్ల తర్వాత కనిపిస్తే ఎలా గుర్తుపడతావు?’ అనుమానంగా అడిగాడు. అంతే.. ఆమె గబగబా ఇంట్లోకెళ్లి, పోస్టుకార్డు సైజులో వున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒకటి తెచ్చి, ‘మా రాజుగాడి కుడి చెంప మీద కంది గింజంత పుట్టుమచ్చ వుంది.. చూశావా బాబూ..?’ అంటూ ఆ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోన్న పుట్టుమచ్చని చూపించింది.కనకరాజు ఆ ఫొటోని అడుగుదామనుకునేలోపే ఎర్రయ్యమ్మే ‘ఈ ఫొటో నీ దగ్గర ఉంచు బాబూ.. మా వాడిని గుర్తుపట్టడానికి.. ఇంకా ఇలాంటి ఫొటోలు నాలుగైదు నా దగ్గరున్నాయిలే’ అంటూ ఆ ఫొటోని కనకరాజు చేతిలో పెట్టింది.ఆ ఫొటోని భద్రంగా జేబులో పెట్టుకుంటూ, చిన్న కాగితం మీద తన మొబైల్ నెంబరు రాసి ఆమెకిచ్చాడు కనకరాజు. అలా ఎర్రయ్యమ్మకు అంతులేని విశ్వాసాన్ని కలిగించి, కొండంత ధైర్యాన్ని నూరిపోసి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు.తర్వాత కొన్ని రోజులకే డిపోవారు కనకరాజు డ్యూటీ రూటు మార్చేయడంతో అతనికి ఎర్రయ్యమ్మను చూసే వీలు చిక్కలేదు. కూతురిని తరచుగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి రావడం వల్ల కూడా అతనికి ఎర్రయ్యమ్మను కలిసే తీరిక దొరకలేదు. అలా రెండునెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఎర్రయ్యమ్మే అతనికి ఫోన్ చేసింది తన కొడుకు ఇంటికి వచ్చేశాడంటూ! ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు కనకరాజు. డ్యూటీకి సెలవు పెట్టి, ఉన్నపళంగా దేవరపాలెం బయలుదేరాడు.కనకరాజుని చూడగానే సంతోషంతో ఉప్పొంగిపోయింది ఎర్రయ్యమ్మ.‘అయ్యా! మీరు చెప్పినట్టుగానే నా బిడ్డ నాకు దక్కాడు.. మీరు నా పాలిట భగమంతుడే! తమరు కలకాలం చల్లగా ఉండాలయ్యా..’ అంటూ ఆనందబాష్పాలతో కృతజ్ఞతలు చెప్పుకుంది.‘నీ కొడుకు ఎక్కడమ్మా..?’అంటూ ఆత్రంగా అడిగాడు కనకరాజు.‘వంట సరుకులు కొనుక్కొత్తానని వెళ్లాడు బాబూ, వచ్చేత్తాడు..’ ఎర్రయ్యమ్మ అంటుండగానే ఓ పాతికేళ్ల యువకుడు రెండు చేతులతో రెండు సంచులను మోసుకుంటూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు.అతను ఎర్రయ్యమ్మలాగే సన్నగా, పొడవుగా వున్నాడు. ఇంకా పసితనపు ఛాయలు పోలేదు. ఏదో తేజస్సు ఆ కుర్రాడి ముఖంలో! ఎర్రయ్యమ్మ ‘రాజూ, నేను చెప్పానే, గొప్ప మనసున్న మారాజు అని.. ఈ బాబే’ అంటూ కొడుక్కి కనకరాజుని పరిచయం చేసింది.ఆ అబ్బాయి తన రెండు చేతులెత్తి కనకరాజుకి దండం పెట్టాడు. ఎర్రయ్యమ్మ, కొడుక్కి ఏదో చెప్తున్నట్టుగా సైగచేసింది. ఆ యువకుడు చెక్క బెంచీపై కూర్చున్న కనకరాజు కాళ్లకి నమస్కరించాడు.అనుకోని ఆ పరిణామానికి కనకరాజు బిత్తరపోతూ, ఆ కుర్రాడిని పైకి లేపుతూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. భోంచేసి వెళ్లాలని ఎర్రయ్యమ్మ పట్టుపట్టింది. భోంచేసి, వాళ్లిద్దరి దగ్గర వీడ్కోలు తీసుకుని బస్సులో కూర్చున్న కనకరాజు మనసుకి ఎంతో ఊరటగా ఉంది. కానీ.. ఎక్కడో ఏదో తెలియని వెలితి!ఆ వెలితికి సాక్షీభూతంగా నిలిచిన ఓ సంఘటన కళ్ల ముందు కదుల్తూ అతన్ని రెండు వారాల వెనక్కు తీసుకువెళ్లింది.రాజు ఫొటోతో ఎర్రయమ్మ ఇల్లు దాటిన నాటి నుంచి ఎక్కడికి వెళ్లినా.. ఏ కుర్రాడు కనిపించినా ఆ ఫొటోతో పోల్చి చూసుకోవడం కనకరాజు దినచర్యలో భాగమైపోయింది. అలా ఎర్రయ్యమ్మ వేదన గురించే ఆలోచిస్తోన్న కనకరాజుకి ఒకరోజు.. బస్సులో ఓ పాతికేళ్ల యువకుడు బేల ముఖంతో చిన్నగా శోకిస్తూ కనిపించాడు. అది చివరి ట్రిప్ కావడంతో బస్సంతా ఖాళీగావుంది. అతన్ని గమనించిన కనకరాజు, అతని పక్కనే కూర్చుని ‘ఏమైంది బాబూ.. అంతగా కుమిలిపోతున్నావు?’ అంటూ అనునయంగా అడిగాడు. ఆ అనునయానికి కదిలిపోయిన ఆ కుర్రాడు నెమ్మదిగా గొంతు విప్పాడు.‘నా పేరు డేవిడ్ రాజు. ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. మా అమ్మను చూడాలని, ఆమెతో కబుర్లు చెప్పుకోవాలని ఆశ! మా అమ్మ గురించి నా శక్తి మేర చాలా సమాచారం సేకరించాను. అమ్మ నాకు తిండిపెట్టలేని దీనావస్థలో నన్ను మిషనరీ ట్రస్ట్‌లో వదిలేసిందట. ఏడాది పాటు అమ్మ ఆచూకీ కోసం చాలాచోట్లకి తిరిగాను. చాలామందిని కలిశాను. చిట్టచివరికి తన అడ్రస్ పట్టుకోగలిగాను. కానీ, నాలాంటి దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు సార్! తను ఓ నెల కిందటే ఎవరూలేని అనాథలా చనిపోయింది. నన్ను నిజంగానే అనాథని చేస్తూ..’ అంటూ బొటబొటా కన్నీళ్లుకార్చాడు.తను చదివిన ‘లా ఆఫ్ అట్రాక్షన్’ ప్రత్యక్షంగా ఎదురుకావడంతో మాటల్లో చెప్పలేని వింతానుభూతికి లోనయ్యాడు కనకరాజు. ‘మనం ఏదైనా బలంగా కోరుకుంటే.. అది జరిగితీరుతుంది!’ అని ఆ పుస్తకంలో చదివినట్టు జ్ఞాపకం. కుర్రాడి కళ్ల కిందుగా జారిపోతున్న కన్నీళ్లను తుడుస్తూ ‘నీకు అమ్మ ప్రేమ దక్కేటట్టు చేసే బాధ్యత నాది!’ అంటూ తిరుగులేని హామీనిచ్చాడు.ఆ కుర్రాడు తన్నుకొస్తోన్న దుఃఖాన్ని ఆపుకుంటూ, కుతూహలంగా కనకరాజు వైపు చూశాడు. ‘అయితే, నీ కుడి చెంప మీద చిన్న పుట్టుమచ్చ ఒక్కటే లోటు’ అన్నాడు కనకరాజు ఏదో ఆలోచిస్తూ!ఆరోజు ఆలా రెండు హృదయాల వేదనలను ‘ఒక సంతోష సాఫల్యం’గా రూపకల్పన చేశాడు కనకరాజు.ఎర్రయ్యమ్మ, రాజును కలిసిన కనకరాజు తన ఇంటికి చేరుకునేసరికి సాయంత్రమైంది. మెయిన్ గేటు తీసి, లోనికి అడుగుపెడుతుండగా ఎదురుగా కనిపించిన దృశ్యం అతన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అతని కూతురు ‘నాన్నా..’ అంటూ కిలకిలా నవ్వుతూ తనకేసి పరుగుతీస్తోంది లేడిపిల్లలా. పట్టరాని భావోద్వేగంతో కూతుర్ని చేతుల్లోకి తీసుకుని గుండెకు హత్తుకున్నాడు. కళ్లు కన్నీటి సంద్రాలయ్యాయి. ఎదురుగా వస్తోన్న అతని భార్య, తల్లి ముఖాల్లో వెల్లివిరిసిన వసంతకాలపు వెలుగులు!ఆశ్చర్యంగా భార్య వైపు చూశాడు. ‘ఉదయాన్నే మీరు అలా వెళ్లారో లేదో.. ఎప్పుడూ తిననని మొండికేసే పిల్ల ‘ఆకలీ.. ఆకలీ..’ అంటూ ఒకటే గొడవ. జ్వరం ఉందేమోనని చూశాను. ఏదో మంత్రం వేసినట్టుగా పూర్తిగా మాయం! అప్పటికప్పుడు టిఫిన్ చేసి, వేడివేడిగా తినిపించాను. తిన్నప్పటి నుంచి ఒకటే అల్లరి! ఇల్లంతా ఉరుకులు, పరుగులు! ఉదయం నుంచి పది నిమిషాలకొకసారి ఏదో ఒకటి అడిగి తింటూనే ఉంది. ఒక్క వాంతి కూడా కాలేదు. నాకే ఆశ్చర్యంగా ఉందండీ..’అంటూ ఆమె సంబరంగా జరిగినదంతా చెప్పుకుపోయింది. ‘సాటి మనిషికి సాయం చేసే నీ తత్త్వమేరా నీ బిడ్డకు ఆయుష్షు పోసుంటుంది..!’ అంది కనకరాజు తల్లి, కొడుకు వైపు మెచ్చుకోలుగా చూస్తూ. తల్లి మాటలకు చిన్నగా నవ్వేస్తూ, కూతురిని మురిపెంగా చూసుకుంటూ ఇంట్లోకి నడిచాడు కనకరాజు.ఎర్రయ్యమ్మని రాజు ఎలా చూసుకుంటున్నాడో తెలుసుకోవాలన్పించి, ఒకరోజు దేవరపాలెం వెళ్లాడు కనకరాజు. సాదరంగా ఆహ్వానించింది ఎర్రయ్యమ్మ. రాజు ఇంట్లో లేడు. ఆఫీస్ పని మీద సిటీకి వెళ్లాడని చెప్పింది. సాఫ్ట్వేర్ అయిన రాజు.. వారానికి ఒకటీ, రెండ్రోజులు మాత్రమే ఆఫీసుకి వెళ్తుంటాడు. మిగతా రోజులన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎర్రయ్యమ్మ కట్టూబొట్టూ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె ఒంటి మీదకి బంగారం కూడా చేరింది. కొడుకు కోరిక మేరకు పాచిపనులకు స్వస్తి చెప్పింది.ఎర్రయ్యమ్మ చెప్పిన మరో విషయం రాజు మీద కనకరాజుకి తిరుగులేని నమ్మకాన్ని కలిగించింది. తన భర్త ద్వారా పోగొట్టుకున్న, ఒకప్పటి తన సొంతిల్లు అదే ఇప్పుడు అద్దెకున్న ఆ ఇల్లు, దాన్ని ఆనుకొని వున్న మరికొంత ఖాళీస్థలాన్నీ కొని, ఎర్రయ్యమ్మ పేరిట కాగితాలు రాయించాడని చెప్పింది. విన్న కనకరాజు తన ప్రయత్నం సంపూర్తిగా సఫలీకృతమైంది అనుకున్నాడు. మనసు నిండింది.‘ప్రతి జీవితానికి చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలంటారు. నా జీవితానికిది చాలు!’ అనుకుంటూ బయల్దేరడానికి సమాయత్తమయ్యాడు కనకరాజు.కుర్చీలోంచి లేచిన కనకరాజు కాళ్లకి ఎర్రయ్యమ్మ నమస్కరించబోయింది. ఆ హఠాత్పరిణామానికి అతను బిత్తరపోయి దూరం జరుగుతూ ‘ఎర్రయ్యమ్మా, నేను నీ తమ్ముడు లాంటివాడిని. నువ్వు నా కాళ్లకు నమస్కరించడం ఏంటీ?’ అన్నాడు ఇబ్బందిపడుతూ.‘సాటిమనిషి కోసం ఆలోచించే తీరికలేని ఈ కాలంలో.. అనామకురాలైన ఈ ఎర్రయ్యమ్మ కోసం నువ్వు ఎంత తాపత్రయపడ్డావో నాకెరుకే బాబూ..! పారిపోయిన నా కొడుక్కి కుడి చెంప మీద కంది గింజంత పుట్టుమచ్చ ఉందని చెప్పాను. కానీ, వాడి ఛాతీ మీదున్న పాపిడి బిళ్లంత మరొక పుట్టుమచ్చ గురించి చెప్పలేదు! అది నీకు తెలియదు కదా బాబూ..’ అంటోన్న ఆమెకు బదులేం ఇవ్వాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాడు కనకరాజు.‘నా బాధ చూడలేక, నా కొడుకు రూపంలో ఈ అబ్బాయిని, నువ్వే పంపించావని నాకు ఎరుకే బాబూ! రాజు నా కడుపున కాయకపోయినా అంతకన్నా ఎక్కువే! ఇలాంటి మారాజు బిడ్డని నాకు చూపించినందుకు నీకు ఈ ఎర్రయ్యమ్మ జనమ జనమలకు రుణపడి ఉంటాది బాబూ..! నా కొడుకు మొన్ననే నీ గురించి ఓ మాట చెప్పినాడు.. ‘కండక్టర్’ అంటే నడిపించేవాడని అర్థమట! నువ్వు, నిజంగా మా బతుకులను నడిపించిన దేవుడివయ్యా..’ అంటూ చేతులెత్తి దండం పెట్టింది.‘ఎర్రయ్యమ్మా.. నీ రాజును నీ దరికి చేర్చే క్రమంలో నిన్ను ఒక అబద్ధంతో మభ్యపెడుతున్నానని ఎంతో అపరాధభావానికి గురయ్యాను. ఆ వెలితిని కాస్త దూరం చేశావు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి’ అన్నాడు కనకరాజు. తేలికపడిన మనసుతో తన ఇంటి దారి పట్టాడు. – శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు -
రాతి కోటల్లో.. గాంధారి ఖిల్లా!
తెలంగాణలోని రాతి కోటల్లో వరంగల్, భువనగిరి కోటల తర్వాత చెప్పుకోదగ్గది గాంధారి ఖిల్లా. అపారమైన బొగ్గు నిక్షేపాలతో విరాజిల్లుతున్న మంచిర్యాల జిల్లాలో.. వేల సంవత్సరాల క్రితమే మానవ జీవనం ఉన్నట్లు తెలియజేసే సజీవ సాక్ష్యం ఈ గాంధారి ఖిల్లా. మంచిర్యాల పట్టణానికి పన్నెండు కి.మీ. దూరంలో మందమర్రి మండలం, బొక్కలగుట్ట అడవుల్లో ఈ కోట ఉంది. గుట్టపైన నాగశేషుడి ఆలయం, శివుడు, ఏనుగు, విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, కాలభైరవుడి విగ్రహాలు, ద్వారాలు, దేవతా మూర్తుల ప్రతిమలు ఉన్నాయి. శత్రువుల రాకను పసిగట్టే నగారా గుండూ కనిపిస్తుంది. కొండను తొలిచి నిర్మించిన నాగశేషుడి ఆలయం, కాలభైరవ విగ్రహాలు ఆకర్షిస్తాయి. గుట్ట పైన ‘సవతుల బావులు’, కాలువలు ఉన్నాయి. కింద నీటి చెలమలో ఎండాకాలంలోనూ నీటి ఊట పైకి వస్తుంది.చారిత్రక వైభవం..అరుదైన గోండ్వానా రాతి గుట్టలపైన మానవ నిర్మిత నీటి గుండాలతో అద్భుతమైన చారిత్రక సంపద కనిపిస్తుంది. ఈ గుట్టలను ఎవరు తొలిచారనేదానికి స్పష్టతలేదు. పూర్వయుగపు పనిముట్లు, చిత్రలేఖనాలు చరిత్రకారులకు లభ్యమయ్యాయి. కొన్ని ఆధారాల ప్రకారం ఆరవ శతాబ్దంలో కందారపురం పేరుతో గాంధారి కోట రాజధానిగా సోమదేవరాజు రాజరికం చేశారని తెలుస్తోంది. ఆయన కొడుకు మాధవ వర్మ కాకతీయుల మూల పురుషుడనే ప్రస్తావన సిద్ధేశ్వర, ప్రతాప చరిత్రలో ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు. రాష్ట్రకూటుల సామంతుడైన మేడరాజు ఈ గాంధారి కోటను పటిష్ఠం చేశాడు. ఆయన పేరుతో ఉన్న మేడ చెరువు నేటికీ కనిపిస్తుంది. పద్మనాయక రాజులు రాచకొండ కేంద్రంగా పాలిస్తూ, వైష్ణవమతం వ్యాప్తికోసం పెద్దిరాజు అనంతరాజు, రఘు నాయకులు కోటలో హనుమంతుడి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. దీన్ని ధ్రువీకరించే 15వశతాబ్దపు తెలుగు శాసనం ఉంది. పెద్దిరాజును పాండవుల పెద్దనాన్న ధృతరాష్ట్రుడిలా, పెద్దమ్మను ధృతరాష్ట్రుడి భార్య గాంధారిలా భావించి, ఈ కోటను ‘గాంధారి కోట’గా పిలిచారని చరిత్రకారుల అభిప్రాయం. క్రీ.శ.1300లో కథాగేయంగా ‘గాంధారి కథ’ రచన చేసినట్లు చరిత్రకారులు గుర్తించారు. కాని కవి విషయంలో స్పష్టత లేదు. నిజాం కాలంలో పన్ను వసూళ్ల కోసం స్థానిక గోండు మొకాశీలను నియమించుకున్నట్లు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. 1928లో తొలిసారి గాంధారి కథను ప్రచురించినట్లు ఆధారాలున్నాయి. ఇప్పటికీ గిరిజన కథా గేయాల్లో, జానపదాల్లో ఈ కథ వినిపిస్తుంది.అరుదైనది..గుట్టను తొలిచి కట్టిన కోటగా గాంధారి ఖిల్లాకు దక్షిణ భారతదేశంలోనే ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ లోహయుగం నాటి ఆనవాళ్లున్నాయి. కాకతీయ, రాష్ట్రకూటుల కాలం నాటి చారిత్రక సంపద ఉంది. ఇలాంటి అరుదైన కోటలను రక్షించుకుంటే చారిత్రక సంపదతోపాటు, పర్యాటక వనరులనూ కాపాడినట్లవుతుంది. – డా.ద్యావనపల్లి సత్యనారాయణ, తెలంగాణ చరిత్రకారుడు.పర్యాటక కేంద్రంగా..ఎంతో చరిత్ర కలిగిన గాంధారి ఖిల్లాను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధిపరచాలి. దానికి అవసరమైన ఏర్పాట్ల మీద ప్రభుత్వం దృష్టిపెట్టాలి. – మేసినేని రాజయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఆదివాసీ నాయకపోడ్ సాంస్కృతిక కళాభివృద్ధి సంఘం. మాఘమాసం జాతర..అనాదిగా గాంధారి ఖిల్లా నాయక్‌పోడ్ తెగకు ఆరాధ్య ప్రాంతంగా కొనసాగుతోంది. తెలంగాణలో ఇదొక ప్రధాన గిరిజన తెగ. వీరిక్కడ ప్రతి మాఘమాసం (ఫిబ్రవరి) భక్తి, శ్రద్ధలతో జాతర జరుపుతారు. ఇది మూడురోజులు సాగుతుంది. మొదటిరోజు సాయంకాలం దేవతా మూర్తులను సదర్‌భీమన్న నుంచి గోదావరికి తీసుకొచ్చి, స్నానం చేయిస్తారు. ఆ రాత్రి ఆటపాటలతో గడిపి, మరుసటిరోజు మధ్యాహ్నం డప్పు చప్పుళ్లతో జాతర ప్రాంతానికి తీసుకెళ్తారు. చివరిరోజు ఖిల్లా పైభాగంలో ఉన్న మైసమ్మ తల్లి వద్ద పట్నాలు వేసి, నైవేద్యం పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. చరిత్రలో నాటి పాలకులు గాంధారి ఖిల్లాను అష్టదిగ్బంధనం చేసిన ఆనవాళ్లున్నాయి. దాని గుర్తుగా పాలకాయలు (కొబ్బరికాయలు), కోడిగుడ్లు, మేకలు, కోళ్లు (గతంలో దున్నపోతులను) బలి ఇచ్చే సంప్రదాయం నేటికీ ఈ జాతరలో కొనసాగుతోంది. దీనికి నాయక్పోడ్లే ప్రధాన పూజారులు. ముగింపులో జీడికోట వద్ద జరిగే దర్బార్(సభ)లో గిరిజనుల కష్టసుఖాలు, గాంధారి ఖిల్లా అభివృద్ధిపై చర్చిస్తారు. ఈ జాతరకు మహారాష్ట్ర నుంచి కూడా గిరిజనులు వస్తారు. జాతర తిరుగువారం మాత్రం నాయకపోడ్లే జరుపుకుంటారు.ప్రకృతి రమణీయతకు నెలవు..మంచిర్యాల వరకు రైల్లో వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఈ కోటను చేరుకోవచ్చు. గుట్టపైకి మాత్రం కాలినడకనే వెళ్లాలి. కోట పరిసర ప్రాంతంలో చెప్పులతో అనుమతించరు. చుట్టూ అడవి, కాలువలు, చెరువులతో రమణీయంగా ఉంటుందీ ప్రాంతం. వన్యప్రాణుల నిలయం. ట్రెక్కింగ్‌కి అనువైన చోటు. పర్యాటకుల సౌకర్యాల కోసం ప్రణాళికలు వేసినా, అవి ముందుకు సాగలేదు. ఎన్‌హెచ్ 363ని ఆనుకుని గాంధారి వనం పేరుతో అటవీ శాఖ ఓ పార్కును అభివృద్ధి చేసింది. ప్రస్తుతం సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్, వెడ్డింగ్ షూట్లు జరుగుతున్నాయి. ‘పరేషాన్’ అనే సినిమాలో టైటిల్ సాంగ్ ‘గాంధారి ఖిల్లా కత్తవా’ అంటూనే మొదలవుతుంది. – ఆకుల రాజు, సాక్షి ప్రతినిధి, మంచిర్యాలఇవి చదవండి: Health: అంతా మెదడులోనే ఉంది.. -
మెదడు.. మోకాల్లోకి..
కలో.. భ్రమో.. రాత్రి తోకచుక్క కనపడింది. తోకచుక్క సంఘ సంస్కరణ ప్రయాణ పతాక కదా. ఏం జరుగుతుందో ఏం జరగదో.. మెలకువను స్వప్నించి నిద్రలోనే లేచినట్టు.. తిరిగినట్టు.. మాట్లాడినట్టు.. చీకటి తెరలు పూర్తిగా తొలగిపోలేదు. తెల్లవారిన సందడి ఇపుడిపుడే మేల్కొంటోంది. పలుచని మంచు పొగలా చుట్టుకుంటోంది.లేచాను. రోజూ లేచే ఉదయపు నడకల సమయమే. అడుగు ముందుకేశాను. ఒకరకమైన తూలింపు. పట్టించుకోలేదు. లుంగీ మడిచి బాత్రూమ్కు వెళ్ళాను. అపుడు చూశాను, మోకాలు కొద్దిగా వాచినట్లుంది. నొప్పి లేదు. ఎత్తుగా ఉబ్బిన చోట చేతితో నొక్కాను. మెత్తగా నునుపుదేరి ఉంది, రబ్బరు బంతిలా. ఏమైందీ? ఎక్కడైనా తగిలిందా? ఏదైనా కుట్టిందా? గిల్లి మాత్రం చూడలేదు. నడక దుస్తుల్లోకి మారాను. నడుస్తుంటే ఇబ్బందేమీ లేదు. సలుపు కూడా లేదు. ఆటల మైదానంలో పదిసార్లు వలయంగా తిరిగాను. రెండు కిలోమీటర్లు తిరిగినట్టు లెక్క. ‘అలా నడుస్తున్నారేంటీ? కాలు ఈడుస్తున్నట్టు..’ ఇంటికొస్తుంటే సుబ్బారాయుడు పలకరించాడు.‘ఏమీ.. లేదే..’ అన్నాను జాగ్రత్తగా అడుగులేస్తూ. ప్రతిక్షణం నడక దగ్గర్నుంచి మాట దగ్గర్నుంచి అందరికీ కావాలి. రోజువారీకి భిన్నంగా ఎవరూ ఉండకూడదు. ఉంటే ఒకటే ప్రశ్నలు.. ఎందుకు, ఏమిటి, ఎలా.. ఆరా! అరే.. ఎదురైన చాలామంది నడకల్లో ఏదో తేడా స్పష్టంగా కనబడుతోంది. కుంటి నడక కాదు గానీ నేలకు పాదం ఈడుస్తూ.. ఎవర్నీ అడగలేదు. తీరా ఇంట్లోకి చేరగానే ఉమ ఎదురొచ్చింది. ఆమె నడక తీరూ అలాగే ఉంది. ఉన్నట్టుండి నన్ను ఆట పట్టించడానికన్నట్టు గాలిలోకి ఎగిరింది. పైగా నవ్వుతోంది. ఆశ్చర్యంగా చూశాను. ‘ఏమీ లేదండి. నొప్పేం లేదు. అయితే నేలకు తాకించి నడుస్తుంటే బావుంది’ ఇంకేం ప్రశ్నలు వేయలేదు. మొత్తమ్మీద లోకమంతా తెలియని రాగమేదో ఆలపిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి అంటుకునేదా? కాదేమో. స్నానానికి వెళ్ళినపుడు తేరిపారి పరిశీలనగా చూశాను. మోకాలు చిప్ప ఉబ్బి నల్లగా తాటికాయలా ఒకవిధమైన గరుకుగా మారింది. రెండో కాలు మామూలుగానే ఉంది. కూరగాయలు కొనడానికి మార్కెట్టుకెళ్ళాను. అందరూ తెలిసినవారే. కొంచెం పట్టుబట్టి జాగ్రత్తగా అడుగులేస్తూ తిరుగుతున్నాను. చాలామంది ముఖాలు నీరసంగా కనిపిస్తున్నాయి. ఏదో పోగొట్టుకుని దాచినా దాగని సత్యాన్ని మోస్తున్నట్టుగా భారంగా అడుగులేస్తున్నారు. లోకం వింతగా కనిపిస్తోంది.రెండురోజుల క్రితం రామంగాడి గృహప్రవేశం సందర్భంగా సత్యనారాయణ ప్రతం చేయించిన పురోహితుడు కనిపించాడు. ఆయన పంచె ఎగదోసి మోకాలు చిప్ప కనిపించేలా ఎత్తి ఎత్తి అడుగులేస్తూ నడిచి వస్తున్నాడు. అసింటా అన్నట్టు దూరంగా జరుగుతూ అడుగులేస్తున్నాడు. ఆయనకు కూడా అదే చోటులో నల్లగా చర్మం చిట్లినట్లుగా ఉంది. మొన్నటి దృశ్యం కళ్ళ ముందు కనిపించింది. వ్రతం అయిపోయింది. ఇక కథ చెప్పాలి. చెప్పడం మొదలెట్టగానే అది ఎప్పుడూ చెప్పే పాతకథ అని తెలిసిపోయింది. ఆగమని సైగ చేశాను.‘అయ్యా.. పురోహితులు గారూ.. మన్నించండి. ఎపుడూ అదే కథా? మీరు కథలో చెబుతున్న సముద్ర వ్యాపారాలు గట్రా ఇపుడు లేవు కదా. వ్రతం చేయకపోతే వచ్చే నష్టం మా రామం గాడికి వర్తించదు. వాడిది రియలెస్టేటు బిజినెస్. దానికి సంబంధించిన కథ అల్లి చెబితే సబబుగా అర్థవంతంగా ఉంటుంది. వాడు జాగ్రత్తలేవో పడతాడు. అలాగే సాఫ్టువేర్ ఇంజనీరు.. గవర్నమెంటు ఉద్యోగం.. సారా వ్యాపారం.. ఎగుమతులు దిగుమతులు, వాణిజ్యం.. వగైరాల కథలు రెడీమేడ్‌గా తయారుచేసుకుని ఉంచుకుని చెప్పొచ్చు కదా! ఎపుడూ పాత పురాణమేనా.. ఎవరు మెచ్చుకుంటారు?’ అన్నాను సూటిగా చూస్తూ.పురోహితుడు ఒక్కక్షణం మాట్లాడలేదు. ఎదుట వ్యక్తి చెప్పేవి కొందరికి సహించవు. అహం దెబ్బతింటుంది కాబోలు. రామాన్నీ నన్నూ చూస్తూ ఉండిపోయాడు. ఆలోచిస్తున్నట్టుగా ఆగాడు. కాసేపటికి తేరుకున్నాడు. ఆ తర్వాత తనకు సహజసిద్ధమైన లౌక్యం ప్రదర్శించాడు.‘నిజమే సుమండీ.. మహ బాగా చెప్పారు. మీరన్నట్టుగా మహ బేషుగ్గా ఉంటుంది. మీరు చెప్పింది చక్కగా ఉంది. కానీ కథలెక్కడ్నుంచి వస్తాయండీ’ అంటూ దీర్ఘం తీస్తూ అన్నాడు. ఇందాక మొదలెట్టిన కథను తిరిగి చెప్పడం ప్రారంభించాడు. అంతేకాదు వెళుతూ వెళుతూ నా ముఖం కేసి చూసి నాలో ఏ దైన్యం సూచిక కనిపించిందో ఏమో ఒక ఉచిత సలహా విసిరాడు.‘ఏడు ఏలకులను పసువు గుడ్డలో చుట్టి దిండు కింద పెట్టుకుని పడుకోండి. మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీరూ బ్రహ్మాండమైన ఇంతకుమించిన గృహం కట్టుకుంటారు’ అన్నాడు. ఆయన వృత్తికి నేనేమైనా ఆటంకం కలిగించానా? ఏమో మరి. ఇది జరిగి మూడురోజులైంది. ఇంతలో ఇట్లాంటి మోకాలుతో కనిపించాడు. తిరిగొస్తుంటే కామేశ్వరరావు కనిపించాడు. వాళ్ళ అమ్మాయికి ఇంకా పెళ్ళి ఘడియలు రాలేదనుకుంటాడు. వయసొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంది. భారం దేవుడి మీద వేసేశాడు. అసలు జరిగిందేమిటంటే కళ్యాణ యోగం గురించి ఒక జ్యోతిష్యుడ్ని సంప్రదించాడు. అతగాడేమో ‘రెండు సంవత్సరాలు ఆగాలి. ఈలోపు ఎంత ప్రయత్నించినా మీ అమ్మాయికి పెండ్లి చేయలేవు’ అని చెప్పాడట.అంతే ఇక మౌనంగా ఉండిపోయాడు. సరిగ్గా అదే సమయంలో మంచి సంబంధాలు కోరి వచ్చినా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయాడు. ఆ తర్వాత కుజదోషమనీ వరనిరూపణ కుదరలేదనీ.. అదనీ ఇదనీ జాతకాల పిచ్చిలోపడి కాలయాపన చేసేశాడు. పోనీ ఆ జ్యోతిష్యుడు చెప్పిన ఆ రెండేళ్ళు ఊరుకుని తర్వాత కాలంలో గట్టి ప్రయత్నం చేస్తే ఈపాటికి కూతురుకు పెళ్ళి జరిగిపోయేదేమో. కార్యసాధనకు ప్రయత్నం తోడుగా ఉండాలి. గీచి గీచి జాతకాలు పట్టించుకుని చెడగొట్టుకుంటున్నాడు. పలకరించాను. చేతితో మోకాలు దగ్గర తడుముకున్నాడు. ఎత్తుగా గాలి బుడగలా కనిపిస్తోంది. అతని పరిస్థితి అర్థమైపోయింది.ఇంటికెదురుగా శంకరయ్య ఉన్నాడు. భార్య పేరు భారతమ్మ. బయటికెళితే చాలు ప్రతిరోజూ పెళ్ళాం ఎదురు రావాలి. వీధిలోంచి గట్టిగా రమ్మని అరుస్తాడు. ఇంటి లోపల ఎక్కడున్నా ముసిముసి నవ్వులు నవ్వుతూ చీర చెంగుతో ముఖం తుడుచుకుంటూ వచ్చేస్తుంది భారతమ్మ. ఎదురురావడాన్ని మొగుడు ప్రసాదిస్తున్న అరుదైన గౌరవంగా భావిస్తుంది. ఆ అవకాశం ఇచ్చి అర్ధాంగి దగ్గర మంచి మార్కులు కొట్టి బంధం గట్టిగా ముడిపెట్టే చిట్కాను శంకరయ్య పాటిస్తున్నాడేమో. ఆవేళ చూద్దును కదా శంకరం కుంటుకుంటూ నడుస్తున్నాడు. ఓహో .. అనుకున్నాను.జబ్బకూ మెడలోనూ తాయెత్తులు కట్టుకునే వీరయ్య, మెడనిండా ఏవో పసుపు, ఎరుపు రంగుల తాళ్ళూ, ఒంటి మీద కాషాయం దుస్తులూ ముఖం నిండా ఎర్రటి పెద్ద బొట్టూ నుదుటన విభూది పూసుకునే నారాయణ, రాహు కాలం, వర్జ్యం, ముహూర్తం చూసుకుంటే గానీ ఇల్లు కదలని వీరబాబు, ప్రతిరోజూ టెంకాయ కొట్టి దేవుని దర్శనం చేసుకునే సూరిబాబు, నలుపు ఎరుపు దుస్తుల్లో కనిపిస్తున్న సీజనల్ భక్తులు, నిత్యం నదీ స్నానం చేసే వీరభద్రాచార్యులు, దూరపు బంధువెవరో చనిపోతే నిష్ఠగా ఎండుగడ్డితో తలగడ చేసుకుని నేల మీద పడుకుంటూ మైల పడుతున్న రామచంద్రం.. వీళ్ళందరూ అదేరోజు తారసపడ్డారు. అందరూ మోకాలు వాచినవాళ్ళే.ఈవేళే ఎందుకు అకస్మాత్తుగా పాదాలు ఎగేస్తూ కనిపిస్తున్నారు? అసలు నేనెందుకు ఇదే బాధ అనుభవిస్తున్నాను? మనిషి నాగరీకం అయ్యే కొలదీ కొత్త కొత్త బలహీనతల్ని ఎందుకు మోస్తున్నాడు? తాతగారి నాన్నగారి బామ్మగారి భావాలతో కునారిల్లి సొంత ఆలోచనల్ని చంపుకుని బతకడం సరైనదేనా? ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఏ పని అయినా విజయం సాధిస్తుందనీ మూఢనమ్మకాలతో కాలాన్ని వృథా చేసుకోవడం తగదనీ ఎంతమందికి చెప్పగలం? ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాకు తత్వం బోధపడింది. నడవడికలో అమలు చేయాలి.ఉదయం తొమ్మిది గంటలు. బైకు తీసుకుని రోడ్డు మీదకు రాగానే తెల్లని బట్టలతో అచ్చమ్మ ఎదురు పడింది. నన్ను చూసింది. అశుభం అని తలచి వెనక్కి తిరిగి నిలబడింది. తన వల్ల ఎవరికీ మనసులో కూడా ఏ బాధా ఇబ్బంది కలగకూడదనే తలంపుతో చేసిన పని అది. ఆవిడెందుకలా చేసిందో తెలుసు. నేను ఊరుకుంటానా? నేనూ ఆగాను. వారగా తల తిప్పి చూసింది. ఆమె వంకే చూస్తున్నాను. ‘నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. మీరు ఎదురొస్తేనే ముందుకు వెళతాను. లేకపోతే ఇక్కడ్నుంచి కదలను’ అన్నాను. ఆమె కళ్ళు మెరిశాయి. ముఖంలో కాంతులు. గబగబా నా దగ్గరకొచ్చి నిలబడింది.‘నా బాబే.. నా నాయనే.. నా ఆయుస్సు కూడా పోసుకుని నిండు నూరేళ్ళూ సుఖసంతోషాలతో బతుకు తండ్రీ..’ అని తటాలున తన తలలోంచి తెల్ల వెంట్రుకను పీకి నా తలలో వేసి తెల్లని స్వచ్ఛమైన నవ్వుతో అనేక రకాలుగా దీవించింది. మనస్ఫూర్తిగా ఎదురొచ్చి ‘అంతా శుభమే జరుగుతుంది’ అంది. వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది. ఎన్నాళ్ళ నుండో గుట్టగా దాచిన శుభాశీస్సుల బలం.. నాకొక్కడికే చెందుతుందనుకోడం ఎందుకు? దీవెనలు, ఆశీస్సులను ఒక సానుకూల దృక్పథ సంకేతంగానే చూడాలి. పాఠశాల చేరాను. మనసు ఎంతో ఎపుడూ లేనంత ఉల్లాసంగా ఉంది. రోజంతా నెగటివ్ భావనలు రానీయకుండా మసలుకున్నాను. నా వైపు నుండి కాకుండా ప్రతి వ్యక్తినీ అతని దృష్టి కోణంలోంచి పరిశీలిస్తున్నాను. నాలోని మార్పుకు నాకే ఆనందం అనిపించింది. హాయిగా ఉంది.మోకాలు వాపు విచిత్రంగా కొద్దిగా తగ్గింది. ఫలితం అపుడే కనిపించిందా? మనిషి నడవడికను బట్టే రోగాలొస్తాయి. ప్రవర్తనలు ఆలోచనలు దేహానికీ మససుకూ చెందినవేనా? ఖాళీ పీరియడ్‌లో మళ్ళీ ఆలోచనలు చుట్టుముట్టాయి. ఇంతకీ నాకెందుకు మోకాలు వాచింది? తటాలున బుర్రలో ఒక వెలుగు.. మిత్రుడి బలవంతం మీద శంకుస్థాపన జరిగినరోజున కొబ్బరికాయ కొట్టడం గుర్తుకొచ్చింది. అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? ఆలోచనలు సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఏమీ గుర్తుకు రావడంలేదు.ఏదో అపసవ్యంగా ఉండే ఒక చెడు నమ్మకాన్ని మనసులో దూర్చే ఉంటాను. లేకపోతే ఎంతో కొంత శాస్త్రీయంగా ఆలోచించే నాకీ తిప్పలు ఎందుకొచ్చాయి? స్కూలు అయ్యింతర్వాత అట్నుంచి అటే జిల్లా పరిషత్‌కు వెళ్ళాల్సి వచ్చింది. కార్యాలయం హడావుడిగా ఉంది. క్యాంటీను నిండుగా ఉంది. ఉద్యోగుల్లో చాలామంది ఒక కాలు కుంటుకుంటూనో ఈడ్చుకుంటూనో మోకాలు నిమురుకుంటూనో నడుస్తున్నవారే. ఇంటికి చేరేటప్పటికి రాత్రి ఎనిమిది అయ్యింది. వాకిట్లోనే చిన్నాన్న ఎదురయ్యాడు. ఆందోళనగా ఉన్నాడు. నలిగిన ముఖం. నుదుటన చెరిగిన ఎర్రని నిలువు బొట్టు. చెదిరిన జుట్టు. కొద్దిగా కుంటుతూ దగ్గుతూ దగ్గరకొచ్చాడు.‘నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నీవేం కంగారుపడకు. పద.. పద.. లోపలికి..’చిన్నాన్న ఎప్పుడూ అంతే. ఏదీ సరిగ్గా చెప్పడు. విషయం కొస అందిస్తాడు. సాగదీసి గానీ అసలు సంగతి చెప్పడు. మా ఇద్దరిదీ ఒకే ఇల్లు. అన్నదమ్ముల పంపకం. ఇంట్లో వెనుక వైపు వాటాలో ఉంటాడు. భక్తిపరుడు. సకల సెంటిమెంట్లనూ గౌరవిస్తాడు. పాటిస్తాడు. రోజూ పంచాంగం చూస్తాడు. అడిగినవాళ్ళకు అడగనివాళ్ళకు మంచిచెడ్డలు చెప్పడమే పనిగా పెట్టుకుంటాడు. ఎవరింటికైనా వెళితే దిక్కుల్ని చూసి వాస్తు గురించి ఉచిత సలహాలిస్తాడు.‘ఏమైంది?’ గాభరాగా లోపలికెళ్ళాను. గుండెల మీద చేతులేసుకుని సీలింగు చూస్తున్నాడు నాన్న. నన్ను చూసి తల పక్కకు తిప్పి నీరసంగా నవ్వాడు. నోరు విప్పి నెమ్మదిగా గుసగుసగా మాట్లాడుతున్నాడు. మాట స్పష్టంగా లేదు. దగ్గరగా ముఖం పెట్టి వినడానికి ప్రయత్నం చేశాను. ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పలేకపోతున్నాడు. కాసేపటికి చూపు నిలబడిపోయింది. చిన్నాన్నకు అర్థమైంది. ‘ఒరేయ్.. రండి.. వాకిట్లో పడుకో పెడదాం..’ చిన్నాన్న ఉద్దేశం తెలిసింది. ఆయనకేసి కోపంగా చూశాను. చేయి అడ్డంగా పెట్టి వారించాను. ‘మీరాగండి, చిన్నాన్నా.. ఇక్కడ్నుంచి ఆయన్ని కదల్చడానికి వీల్లేదు. ఏమొచ్చింది మీకు? ఇప్పటి దాకా బాగానే ఉన్న వ్యక్తి.. ఇంతట్లోనే ఇంటికి చెడ్డ అయిపోయాడా?’ అన్నాను.‘ఏమంటున్నావు? నీకేమైనా తెలుస్తుందా? ఇంట్లో పోతే ఇల్లు పాడు పెట్టాల్సి వస్తుంది. నా మాట విను..’ బాబాయి హోదా, వయసు తెచ్చిన అధికారంతో నన్ను గదమాయించాడు. ఆయనను దూరంగా గది మూలకు తీసుకెళ్ళి చెప్పడం మొదలెట్టాను. ‘ఆయన ఇన్నాళ్ళూ ఉన్న ఇల్లు ఇది. ఈ ఇంట్లో ఈ గదిలో ఆఖరి ఊపిరి తీసుకునే హక్కు ఆయనకు ఉంది. ఎక్కడికెళ్ళినా ఎంత రాత్రయినా చేరుకునే చోటు ఇది. నా ఊరూ నా ఇల్లూ అంటూ నిత్యం పలవరించేవాడు. మరోచోట నిద్ర పట్టదనేవాడు. మీరెన్నైనా చెప్పండి.. ఇక్కడ్నుంచి కదపడానికి ఒప్పుకోను. పొద్దుట దాక ఇక్కడే ఉంటారు’ స్థిర స్వరంతో చెప్పాను.‘ఈ సమస్య నీ ఒక్కడిదే కాదు. మాది కూడా. ఇదే ఇంట్లో నేనూ కాపురం ఉంటున్నానని గుర్తు పెట్టుకో. మంచి ఘడియలు కావు ఇవి. ఆరుమాసాలో సంవత్సరమో ఇల్లు మైల పడితే ఎక్కడికెళ్ళాలి? ఇంటి పెద్దగా చెబుతున్నాను. చెప్పింది చేయి’ అంటూ వంగి మోకాలు చిప్ప దగ్గర పాముకుంటూ నొక్కుకుంటూ అన్నాడు చిన్నాన్న.నేను రాజీ పడలేదు. పట్టుదలను వీడలేదు. ‘రోజులకు పేర్లు, తిథులు మనం కల్పించుకున్నవే. ఇందులో మంచి చెడ్డలంటూ ఉండవు. అన్ని రోజులూ ఒకలాంటివే. ఆయన ఇంట్లో ఆయన బతకడానికి ఎంత హక్కు ఉందో చావడానికీ అంతే హక్కు ఉంది. ఆ హక్కును కాపాడటానికి కొడుకుగా ఎంతకైనా తెగిస్తాను’ చివర మాట గట్టిగా అన్నాను. ఈ మాటలు పలికానో లేదో మోకాలు చిప్ప వాపు పూర్తిగా తగ్గిపోయింది. ఆయన మాటను విననని అర్థమైపోయింది. నసుక్కుంటూ వెళ్ళిపోయాడు.‘పెద్దాళ్ళు సరే కుర్రాళ్ళు పుట్టుకతో వృద్ధులైపోతున్నారు. మనుషులు చేసిన దేవుళ్ళారా.. మీరెక్కడ? మిమ్మల్ని పోగుచేసి వ్యాపారం చేసే వాళ్ళనీ అసలు మూఢవిశ్వాసాల్ని ఎగదోసేవాళ్ళనీ వినియోగదారుల చట్ట పరిధిలోకి తీసుకు రావాలి. భవిష్యత్తు చెప్పేవాళ్ళకు చెప్పింది జరగనపుడు కఠినశిక్ష విధించి తీరాలి. కనీసం వందేళ్ళ తర్వాత కాలం వీటన్నింటినీ మాన్పుతుందనే నమ్మకం నాది’ అనుకుంటూ సన్నగా లోలోపల మూలిగాను. మామూలు స్థితికి వచ్చిన మోకాలును ప్రేమగా నిమిరాను. ఇంతట్లో మెలకువ తట్టి లేపింది. – దాట్ల దేవదానం రాజుఈ కథను వినడానికి ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి. ఇకపై ప్రతివారం ‘ఈవారం కథ’కు క్యూఆర్ కోడ్ ఇక్కడ ఉంటుంది.ఇవి చదవండి: సింగరేణి తంగలాన్..! -
తనొక అద్భుతం: ఆమె ఆత్మవిశ్వాసం ముందు విధి చిన్నబోయింది (ఫొటోలు)