అమా దబ్లామ్ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ
అనంతపురం: చిరుప్రాయంలోనే తల్లిదండ్రుల మరణంతో కుటుంబ బాధ్యతలు తలకెత్తుకుంది. జీవితంలో ఎత్తు పల్లాలను సునాయశంగా అధిగమించింది. పట్టుమని పాతికేళ్లు కూడా దాటకుండానే ప్రపంచంలోని ఎత్తైన శిఖరాల అధిరోహణకు సిద్ధమైంది. ఇప్పటికే పలు శిఖరాలను అధిరోహించింది. నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన సమీరాఖాన్... తన పేరుకు తగినట్లుగానే ఓ ప్రభంజనాన్నే సృష్టిస్తోంది. ఏ ఆధారం లేకుండా ఒంటరి పోరు సాగిస్తున్న సమీరాఖాన్ విజయ ప్రస్తానం... ఆమె మాటల్లోనే...
మాది అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న విద్యారణ్య నగర్. నాన్న జాఫర్ ఖాన్, అమ్మ ఖాతూన్‌బీ. ఓ చిన్నపాటి ఇంట్లో ఉండేవాళ్లం. ఇప్పటికీ నేను అదే ఇంట్లో ఉంటున్నా. మేము మొత్తం ఐదుగురం ఆడపిల్లలమైతే... నేనే అందరికంటే చిన్నదాన్ని. నా చిన్నప్పుడే అమ్మ అనారోగ్యంతో మరణించింది. మా పోషణ కోసం నాన్న ఓ చిన్న వ్యాపారం మొదలు పెట్టాడు. నలుగురు అక్కలకీ నాన్న పెళ్లిళ్లు చేశాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాం.
బతుకు తెరువు కోసం వలస పోయా
నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో వయస్సు మీద పడి నాన్న ఏ పనీ చేయలేక ఇబ్బంది పడసాగారు. ఇది చూసి చివరకు నేనే ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటూ వచ్చా. సంపాదన అంతంత మాత్రమే ఉండడంతో చదువు మానేసి బెంగళూరుకు చేరుకున్నా. ఓ కాల్ సెంటర్‌లో ఉద్యోగం వచ్చింది. అయితే చాలా తక్కువ సమయంలోనే పదోన్నతులు అందుకున్నా. అలాగని చదువును పక్కన పెట్టేయలేదు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. మరో వైపు డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో చేరి 2015లో డిగ్రీ పూర్తి చేశాను. ఇక జీవితం కుదుట పడుతోంది... పరిస్థితలన్నీ చక్కబడ్డాయి అనుకుంటుండగానే నాన్న మాకు శాశ్వతంగా దూరమయ్యారు. ఆ బాధ నుంచి కోలుకోలేకపోయాను. ఆ పరిస్థితుల్లో నన్ను చూసిన అక్కయ్య వాళ్లు... నన్ను పెళ్లి చేసుకోమన్నారు. అయితే నేను ఒప్పుకోలేదు.
మలుపు తిప్పిన ఒంటరి ప్రయాణం
నాన్న జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు నా స్నేహితులతో కలసి సైక్లింగ్, పర్వతారోహణపై దృష్టి పెట్టాను. నా సంపాదనలోనే కొంత దాచుకుంటూ వస్తూ ట్రెక్కింగ్‌పై శిక్షణ పొందాను. ఓ సారి సైక్లింగ్ చేస్తూ దేశమంతా తిరిగా. అలా ఓ ప్రయాణంలో కొంతమంది విదేశీయులు కలిశారు. ‘ఒంటరి ప్రయాణం సాహసంతో కూడుకున్నది. నీ ధైర్యానికి ఆశ్చర్యమేస్తోంది’ అనే వారన్న మాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయి. వారితో కలసి ఉన్న సమయంలో వారి ఆచార వ్యవహారాలను చాలా క్లోజ్‌గా పరిశీలించాను. చాలా ఇంట్రెస్ట్ కలిగింది. దీంతో విదేశీ ఆచార వ్యవహారాలపై అధ్యయనం చేయాలని అనుకున్నా. అలా మొదలైనా నా ఒంటరి ప్రయాణం... చివరకు దేశ సరిహద్దులు దాటించింది. థాయ్‌లాండ్, కంబోడియా, మయన్మార్, జపాన్, మాల్దీవులు, మలేసియా, సింగపూర్ తదితర 18 దేశాల్లో సైకిల్ యాత్రతో పాటు ఆయా దేశాల్లోని పర్వతాలను అధిరోహిస్తూ వచ్చా.
నేపాల్ టూర్ మరవలేను
నా సహచరులతో కలసి నేపాల్‌లో చేసిన పర్వతారోహణను నేను మరవలేను. అదే సమయంలో అక్కడి మౌంట్ ఐస్‌ల్యాండ్, మౌంట్ అమా దబ్లామ్ అనే రెండు పర్వతాలను అధిరోహించాలనుకున్నా. ఇది సాధ్యమయ్యే పనికాదని చాలా మంది నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. అయినా నేను వినలేదు. ఎవరూ రాకపోతే ఒంటరిగానే పోతానన్నా. దీంతో కొంతమంది నాతో పాటు వచ్చేందుకు సిద్ధమయ్యారు. మౌంట్ అమా దబ్లామ్ పర్వతం పైకి ఎక్కే కొద్ది వాతావరణ పరిస్థితుల్లో శరవేగమైన మార్పులు రాసాగాయి. మంచు పర్వతాల్లో ఈ పరిస్థితులు సర్వసాధారణమే. ఓ వైపు రక్తం గడ్డ కట్టించే చలి, మరో వైపు మంచు తుఫానులు.. . ఇలా అడగడునా సవాళ్లే. కనీస అవసరాలు తీర్చుకోవడం కూడా పెద్ద సమస్యే. అంత ఎత్తైన ప్రదేశంలో నిద్ర కూడా దాదాపు అసంభవం. అలసట, ఆకలి లేకపోవడం వంటి సమస్యలూ ఎన్నో అనుభవించా. అయినా సరే అన్నింటినీ దాటుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించా.
స్నేహితుడి మరణం కలిచివేసింది
అమా దబ్లామ్ పర్వతంపై ట్రెక్కింగ్ అత్యంత ప్రమాదకరమని అక్కడి వాళ్లూ చెప్పారు. అయినా వినకుండా మా సహచర బృందం నేపాల్‌లోని లుకా గ్రామానికి చేరుకుని అక్కడ నుంచి గతేడాది అక్టోబర్ 29న 6,189 మీటర్ల ఎత్తున్న మౌంట్ ఐస్‌ల్యాండ్‌కు బయలుదేరింది. పైకి వెళ్లే కొద్దీ ప్రయాణం కష్టమైంది. 4,800 మీటర్ల ఎత్తు చేరుకున్నాక విడిది శిబిరం వేసుకునే అవకాశం లేకపోవడంతో అక్కడి నుంచి మిగిలిన 1,389 మీటర్ల ఎత్తును తప్పని పరిస్థితిల్లో పూర్తి చేయాల్సి వచ్చింది. చివరకు అనుకున్నది సాధించాం. ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ బయలుదేరాం. అమా దబ్లామ్ పర్వతంపై దాదాపు లక్ష్యానికి దగ్గరయ్యే సమయంలో మాతో పాటు వచ్చిన ఆ్రస్టియా యువకుడు మైఖేల్‌పై రాళ్లు పడి, అక్కడే చనిపోయాడు. నాకైతే నోట మాట రాలేదు. తేరుకునేందుకు చాలా సమయం పట్టింది. ఆ తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేసి, స్నేహితుడి మృతదేహాన్ని సాగనంపి మళ్లీ ప్రయాణాన్ని కొనసాగించాం. చివరకు ఐదు రోజుల పాటు శ్రమించి 6,812 మీటర్ల ఎత్తైన అమా దబ్లామ్ పర్వతాన్ని అధిరోహించాం. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు దక్కడం చాలా సంతోషంగా ఉంది.
ఈవెంట్ ఆర్గనైజర్‌గా..
ప్రస్తుతం నేను బెంగళూరులో ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్నా. ఏటా రెండు సార్లు రెండేసి నెలల్లో హిమాలయాల్లో ఒంటరిగానే ట్రెక్కింగ్ చేస్తుంటాను. మధ్యలో ఒక వారం రోజుల పాటు అనంతపురానికి వచ్చి అక్కయ్యలతో కలసి వెళుతుంటాను. మరో రెండు నెలలు విదేశాల్లో సైక్లింగ్ చేస్తూ అక్కడి ఆచార వ్యవహారాలపై అధ్యయనం చేస్తుంటా. ఇందుకు అవసరమైన డబ్బును ఈవెంట్ ప్లానింగ్ చేయడం ద్వారా సమకూర్చుకుంటుంటాను. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలనే నా ఆకాంక్ష. ఇందుకు అవసరమైన డబ్బును పొగు చేసుకుంటున్నా. నా కష్టాలే ఇంతటి సాహసానికి పురిగొల్పాయి. భవిష్యత్తులో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఓ పాఠశాల ఏర్పాటు చేయాలని అనుకుంటున్నా. దేవుడి సహకారంతో ఈ లక్ష్యాన్ని కూడా సాధిస్తాననే నమ్మకం నాలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment