జీవితాలను పండించుకుంటున్నారు! సలాం! | successful women in agriculture | Sakshi
Sakshi News home page

జీవితాలను పండించుకుంటున్నారు! సలాం!

Published Wed, Sep 18 2024 10:57 AM | Last Updated on Wed, Sep 18 2024 11:30 AM

successful women in agriculture

ప్రస్తుతం వ్యవసాయంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న రసాయనాల వల్ల పంటలు కలుషితమవడంతో పాటు మట్టిలో సూక్ష్మజీవులు నశించి΄ోతున్నాయి. పర్యావరణానికి హాని కలగటమే కాకుండా మానవాళి అనారోగ్యానికి ఆహారంలోని రసాయనాల అవశేషాలు కారమణవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావు పేటకు చెందిన మహిళా రైతులు కొందరు ఈ ముప్పును గుర్తించారు. విషపూరిత ఆహార పదార్థాల నుంచి కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ప్రకృతి సాగుకు నడుం బిగించారు. ఒకవైపు భూసారాన్ని పెంచుతూ మరోవైపు అధిక దిగుబడులు సాధిస్తూ తమ జీవితాలను పండించుకుంటున్నారు.

ప్రకృతి వ్యవసాయ విభాగం మహిళలకు ప్రకృతి సాగుపై అవగాహన కల్పిస్తోంది. అందులో భాగంగా పల్నాడు జిల్లాలో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీల) ద్వారా మహిళా రైతులను గుర్తించి గ్రామాల వారీగా అవగాహన కల్పించి, ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులను సాధించేందుకు ప్రకృతి సేద్యమే ఏకైక మార్గమని నమ్ముతున్న మహిళా రైతులు ఇప్పుడిప్పుడే ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతున్నారు. మహిళా సంఘాల్లోని ప్రతి మహిళా కనీసం తన ఇంటికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలనైనా పెరటి తోటల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించుకునే విధంగా అవగాహన కల్పించడమే లక్ష్యంగా గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిపుణులు, అధికారుల కృషి ఫలిస్తోంది. గత నాలుగేళ్లలో జిల్లాలో ప్రకృతి సాగు అంచనాకు మించి విస్తరించింది. 

ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని కూడా వ్యవసాయ శాఖ రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికెల) పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో సిబ్బంది ఆర్‌బీకేల్లోనే రైతులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయానికి వాడే ఉత్పాదకాలను స్వయంగా రైతులే  పొలం దగ్గర తయారు చేసుకొని వాడాలని, బయట కొనకూడదన్నది ఒక నియమం. అయితే, నాటు ఆవు లేక, ఉన్నా వాటిని తయారు చేసుకునే ఓపిక, తీరిక లేని వారు ప్రకృతి సాగుపై ఆసక్తి ఉన్నా ముందడుగు వేయలేక΄ోతున్నారు. అటువంటి వారి కోసం ఒక్కో మండలంలో ఐదు నుంచి పది వరకు ఎన్‌పీఎం (నాన్‌  పెస్టిసైడ్‌ మేనేజ్‌మెంట్‌) షాపులను ప్రకృతి వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసింది. 

ఈ పద్ధతిలో సాగు చేసిన రైతుల ఉత్పత్తులను మార్క్‌ఫెడ్‌ ద్వారా 10 నుంచి 15 శాతం అధిక మద్దతు ధర చెల్లించేలా ప్రకృతి వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. అ మేరకు రైతులతో ముందస్తుగా ఒప్పందం చేసుకొని ఉత్పత్తులను సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా పండించిన ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. వినియోగదారులే రైతుల వద్దకు వచ్చి అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. దీనితోపాటు.. టీటీడీతోపాటు మరో 11 ప్రధాన దేవస్థానాలు మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయ దిగుబడులు కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ప్రకృతి వ్యవసాయదారులకు మంచి గుర్తింపు లభిస్తోంది. 
– పుట్లూరి శివకోటిరెడ్డి, సాక్షి, నరసరావుపేట రూరల్‌ 

ఉద్యమంగా  ప్రకృతి వ్యవసాయం
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను నైవేద్యాల తయారీకి వాడేందుకు టీటీడీతో ΄ాటు మరో 11 దేవస్థానాలు మూడేళ్లుగా కొనుగోలు చేస్తున్నాయి. ఇది ప్రకృతి వ్యవసాయదారులకు మంచి గుర్తింపు. సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్నాం.  
– కె.అమలకుమారి, జిల్లా  ప్రాజెక్ట్‌ మేనేజర్, ప్రకృతి వ్యవసాయ విభాగం, నరసరావుపేట

 పెట్టుబడి తక్కువ.. 
ఒక ఎకరంలో వరి, మరో ఎకరంలో మెట్ట పంటలు సాగు చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి తగ్గింది. దిగుబడి బాగుంది. ఈ ఉత్పత్తులకు అధిక ధర వస్తుండటంతో లాభదాయకంగా ఉంది. 
– శివలక్ష్మి, మహిళా రైతు, ఏనుగు΄ాలెం, వినుకొండ మండలం, పల్నాడు జిల్లా

దిగుబడి బాగుంది.. 
మా రెండు ఎకరాల్లో పంట సాగు చేసేందుకు గతంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోయాం. కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయంలో వరి పంటను పండిస్తున్నాను. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అవగాహన కల్పించారు. ఖర్చులు తగ్గాయి. దిగుబడులు పెరిగాయి.  
– లక్ష్మీదుర్గ, మహిళా రైతు, కారుమంచి, శావల్యాపురం మండలం
 

ఇదీ చదవండి: తాతల నాటి నత్త మాంసం కూర తిన్నారా? అనేక రోగాలకు మందు!


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement