ఎన్నికల హామీలపై తెప్ప తగలేసిన సీఎం చంద్రబాబు
ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక సాక్షిగా మరోసారి వెల్లడి
8 రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలైన ఎన్నికల హామీల అమలు
దాదాపు రూ.లక్షన్నర కోట్లను కేటాయించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు
కర్నాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్,మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో అమలు
రాష్ట్రంలో 19 – 59 ఏళ్ల మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,500 ఇస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు కాలయాపన
ఆడబిడ్డ నిధి.. తల్లికి వందనం ఊసే పట్టని బాబు
ఆగిపోయిన చేయూత, సున్నా వడ్డీ.. కాపు నేస్తం.. ఈబీసీ నేస్తం
విద్యా దీవెన అందక పిల్లల చదువుల కోసం తల్లుల అవస్థలు
సాక్షి, అమరావతి: ఎన్నికలు ముగిసి టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటింది... ఒకవైపు ఎనిమిది రాష్ట్రాల్లో మహిళలకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలు ఇప్పటికే ప్రారంభమైనా సీఎం చంద్రబాబు మాత్రం కసరత్తుల పేరుతో నింపాదిగా కాలక్షేపం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో అమ్మ ఒడి నుంచి చేయూత దాకా.. సున్నా వడ్డీ నుంచి విద్యా దీవెన వరకు దాదాపు ప్రతి పథకంలోనూ నవరత్నాలతో అక్క చెల్లెమ్మలకే లబ్ధి చేకూర్చగా.. టీడీపీ సర్కారు పగ్గాలు చేపట్టాక మహిళా సాధికారతను గాలిలో దీపంలా మార్చింది! మహిళలకు రక్షణతోపాటు ఆర్థిక భద్రత కరువైంది.
2024 ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను ఆయా చోట్ల అధికారంలోకి రాగానే 8 రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు వారికిచ్చిన హామీలను ఇంకా నెరవేర్చడం లేదని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మహిళలే కేంద్రంగా ఎనిమిది రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పేర్లు, వాటికి బడ్జెట్‌లో కేటాయించిన నిధుల వివరాలను నివేదికలో పొందుపరిచింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లేకపోవడం గమనార్హం.
ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ..
సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రాష్ట్రంలో 19 నుంచి 59 సంవత్సరాల లోపు వయసున్న ప్రతి మహిళకు ఏటా రూ.18 వేల చొప్పున (నెలకు రూ.1,500) ఇస్తానని చంద్రబాబు ఎన్నికల హామీల్లో వాగ్దానం చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి పథకాల అమలు ప్రారంభమైనా సీఎం చంద్రబాబు మాత్రం ఏడు నెలలు గడిచిపోతున్నా ఆ ఊసే పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ‘ఆడబిడ్డ నిధి’ కోసం నిరీక్షిస్తున్న 1.80 కోట్ల మంది మహిళలు మోసపోయామని గ్రహిస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా పేద మహిళలను ఆర్థికంగా నిలబెట్టిన చేయూత, సున్నా వడ్డీ, ఆసరా లాంటి పథకాలు చంద్రబాబు హయాంలో ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడంతో ఇప్పుడు అక్క చెల్లెమ్మల పరిస్థితి దయనీయంగా ఉంది.
8 రాష్ట్రాల్లో బడ్జెట్‌లోనూ కేటాయింపులు..
మహిళలు కేంద్రంగా కర్నాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో ఇచ్చిన హామీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, బడ్జెట్‌లో కేటాయింపులు కూడా చేశాయని రీసెర్చ్ నివేదిక పేర్కొంది. 8 రాష్ట్రాల్లో మహిళలకు ప్రకటించిన పథకాల అమలుకు ఏడాదికి దాదాపు రూ.1.5 లక్షల కోట్లు వ్యయం చేస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల రెవెన్యూ రాబడుల్లో 3 శాతం నుంచి 11 శాతం వరకు మహిళా పథకాలకు వ్యయం చేస్తున్నట్లు నివేదిక తెలిపింది.
తల్లికి వందనం లేదు.. వంచనే!
తాము అధికారంలోకి రాగానే మహిళల కోసం పలు పథకాలను అమలు చేస్తామని టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో హామీలిచ్చాయి. స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు దీని అమలు గురించి కనీసం బ్యాంకర్ల సమావేశంలో కూడా ప్రస్తావించలేదు. ఇక పీ–4 మోడల్‌లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో చెప్పారు.
ప్రత్యేక చర్యలు దేవుడెరుగు.. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలకే గండి కొట్టారు. ఇక సుప్రీం కోర్టు తీర్పు మేరకు అంగన్‌వాడీవర్కర్లకు గ్రాట్యుటీ చెల్లిస్తామని హామీ ఇచ్చి ఆ ఊసే మరిచిపోయారు. ఆశా వర్కర్ల కనీస వేతనం పెంచుతామని ఆశ పెట్టి ఊరించి నట్టేట ముంచారు. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తామని మేనిఫెస్టోలో చెప్పి దాన్ని కూడా అమలు చేయడం లేదు. కలలకు రెక్కలు పథకం ద్వారా విద్యార్థినులకు రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికి ఎన్నికలకు ముందే దరఖాస్తులు సైతం స్వీకరించి బుట్ట దాఖలు చేశారు.
పండుగ కానుకలు ఇవ్వడంతో పాటు పెళ్లి కానుక పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో వాగ్దానం చేశారు. ఇప్పటికే మూడు ప్రధాన పండుగలు వెళ్లిపోయాయి. పెళ్లి కానుక అందక ఎన్నో జంటలకు నిరాశే ఎదురైంది. సూపర్ సిక్స్‌లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై మంత్రుల బృందం అధ్యయనం పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇలా ఎన్నికల ముందు ఎడాపెడా హామీలు గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మహిళలను కూటమి సర్కారు వంచిస్తోంది.
ఉచిత గ్యాస్‌లోనూ మాయ
ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి జిమ్మిక్కులతో మహిళలను మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో 1.54 కోట్ల కుటుంబాలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4 వేల కోట్లు అవసరం. కానీ ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.895 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. దీంతో కేవలం కోటి మందికి మాత్రమే ఒక్క సిలిండర్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది రెండు సిలిండర్లకు కోత పెట్టారు.
జగనన్న ఉండి ఉంటే..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉండి ఉంటే గత ఏడు నెలల్లో తమకు ఎంతో మేలు జరిగేదని రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెమ్మ గుర్తు చేసుకుంటోంది. మహిళలకు రక్షణతోపాటు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా జగనన్న ఎంతో భరోసా ఇచ్చారని పేర్కొంటున్నారు. గత ఐదేళ్లూ మహిళా సాధికారతకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారు. ఏటా ఏప్రిల్‌లో పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు.. మే నెలలో విద్యా దీవెన.. జూన్‌లో అమ్మ ఒడి.. జూలైలో విద్యా కానుక.. ఆగస్టులో మళ్లీ విద్యా దీవెన.. సెప్టెంబర్‌లో చేయూత.. నవంబర్‌లో తిరిగి విద్యా దీవెన.. డిసెంబర్‌లో ఈబీసీ నేస్తం, మిగిలిపోయిన అర్హులకు సైతం పథకాలతో లబ్ధి చేకూర్చే కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేపట్టారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో నవరత్నాలతోపాటు పథకాలన్నీ మహిళలే కేంద్రంగా సంక్షేమాన్ని అందచేశారు. డ్రాపౌట్స్‌ను అరికట్టడం, పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో 42.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున జగనన్న అమ్మఒడి కింద నేరుగా నగదు జమ చేశారు. ఒక్క అమ్మ ఒడి ద్వారానే రూ.26 వేల కోట్లకుపైగా లబ్ధి చేకూర్చారు. దేశంలో మరెక్కడా లేని విధంగా వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకే నేరుగా నగదు జమ చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన అన్ని పథకాలను కూటమి సర్కారు కక్షపూరితంగా నిలిపివేయడంతో ఇంటిని చక్కదిద్దే మహిళలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం కింద ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా అమలు చేయకుండా పిల్లలను సైతం మోసగించారు.
అమ్మ ఒడి పథకాన్ని నిలిపివేసిన కూటమి ప్రభుత్వం కనీసం తల్లికి వందనం పథకాన్నైనా అమలు చేయకుండా కక్షపూరితంగా వ్యవహరించింది. ఇక మహిళలకు వైఎస్సార్‌సీపీ హయాంలో ఇచ్చిన చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పథకాలను కూటమి సర్కారు అటకెక్కించడంతో అన్ని వర్గాల మహిళలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment