లాంలో అక్రమ మైనింగ్ వ్యవహారంలో చెలరేగిన వివాదం
అనుమతుల్లేకుండా జనావాసాల్లో బ్లాస్టింగ్
ఇళ్లపై పడిన రాళ్లు
దురుసు ప్రవర్తన కారణంగా వివాదం
తాడికొండ: తాడికొండ మండలం లాం గ్రామంలో అక్రమ మైనింగ్ వ్యవహారం రచ్చకెక్కడంతో మహిళలు ఆగ్రహించి ఓ టీడీపీ నేతను చితకబాదిన వైనం తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. లాం గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా తెలుగు తమ్ముళ్లు అక్రమంగా మైనింగ్ చేసి గ్రావెల్‌ను జోరుగా రాత్రి, పగలు అనే తేడా లేకుండా తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బ్లాస్టింగ్ చేసే సమయంలో అక్కడ జనావాసాల మధ్య పెద్ద రాయి వచ్చి పడింది. దాన్ని తొలగించకుండా తెలుగు తమ్ముళ్లు వదిలేయడంతో టీడీపీకే చెందిన అహ్మద్ కుటుంబ సభ్యులు పార్టీ గ్రామ అధ్యక్షుడు షేక్ అఫ్జల్‌ను నిలదీశారు.
ఇలా అయితే తాము ఉండేదెలా అంటూ ప్రశ్నించారు. స్థానికులు దీనికి వత్తాసు పలకడంతో వ్యవహారం ముదిరింది. అఫ్జల్ దుర్భాషలాడడంతో స్థానిక మహిళలతోపాటు, తెలుగు తమ్ముళ్లు దాడికి దిగారు. దాడిలో అఫ్జల్ చొక్కా చిరిగిపోయింది. దీంతో ఆగ్రహించిన అఫ్జల్ వర్గీయులు ఎదురుదాడికి పాల్పడడంతో గ్రామంలో ఉద్రిక్తతత నెలకొంది.
కాగా, గ్రామంలో రెండు నెలలుగా అక్రమంగా మైనింగ్, బ్లాస్టింగ్ కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రెండుసార్లు కలెక్టర్‌తోపాటు, మైనింగ్, విజిలెన్స్ అధికారులకు గ్రామస్తులు నేరుగా ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు కనీసం తొంగి చూసిన దాఖలాలు లేవు. దీంతో స్థానికులు మండిపడుతున్నారు. ఈ విషయమై తాడికొండ సీఐ కె.వాసును వివరణ కోరగా వివాదంపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ రాలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment