సముద్రపు ఇసుకను కొల్లగొట్టేస్తున్నారు
విశాఖ భీమిలీ తీరంలో టీడీపీ కూటమి తిమింగలాల బరితెగింపు
ఖనిజాల కోసం రాత్రిపూట అక్రమంగా రాష్ట్రం దాటిపోతున్న ఇసుక
కందకాలుగా మారిపోతున్న సాగర తీరం
సీ బెడ్‌కు మీటరు లోతులోనే ఖనిజ నిక్షేపాలు
రెండు మీటర్లకు పైగా తవ్వకాలు చేస్తున్న ఇసుక దొంగలు
గార్నైట్, జిర్కోనియం, సిలిమినైట్ వంటి ఖనిజాల కోసమే దోపిడీ
ఫిర్యాదులొస్తున్నా చోద్యం చూస్తున్న అధికారులు
నదులు, వాగుల్లోని ఇసుకనే కాదు.. అధికార టీడీపీ కూటమి ‘తిమింగలాలు’ ఇప్పుడు సముద్ర తీరంలోని ఇసుకనూ కొల్లగొట్టేస్తున్నారు. ఖనిజాన్వేషణ కోసం ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు. రాత్రికి రాత్రి రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు.
ఫలితంగా సముద్ర తీరంలో కందకాలు ఏర్పడుతున్నాయి. ఇలా సాగరతీరాన్ని చెరువులుగా మార్చేస్తూ.. మత్స్యసంపదకు, ప్రకృతికి విఘాతం కలిగిస్తున్నా.. అధికారులు చోద్యం చూస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విశాఖలోని భీమిలి తీరం ఈ అరాచకానికి కేంద్రంగా మారింది.
సాక్షి, విశాఖపట్నం: భీమిలి తీరంలో అరుదైన ఖనిజ నిక్షేపాలుండటంతో అక్రమ తవ్వకాలు పెచ్చరిల్లుతున్నాయి. ఇక్కడ బీచ్ రోడ్డు వెంబడి తిమ్మాపురం, మంగమారిపేట, ఉప్పాడ తీర ప్రాంతంలో రాత్రి సమయాల్లో కొందరు లారీలు, మినీ వ్యాన్‌ల ద్వారా ఇసుకను తవ్వి అక్రమంగా తరలించేస్తున్నారు. ఫలితంగా పెద్దపెద్ద గోతులు ఏర్పడుతూ తీరప్రాంత భద్రతని కలవరపెడుతోంది.
ఇప్పటికే తుపాను సమయాల్లో రుషికొండ, ఐటీ జంక్షన్, సాగర్‌నగర్, తిమ్మాపురం, మంగమారిపేట, ఉప్పాడ తీర ప్రాంతాల్లో సముద్రం పెద్దఎత్తున కోతకు గురవుతోంది. ఇప్పుడు కూటమి నేతల ఇసుక దందాతో 2–3 మీటర్ల మేర భారీ గోతులు దర్శనమిస్తున్నాయి. ఈ తరహా గోతులతో ఆటుపోట్ల సమయంలో తీరం కోతకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.
మాకేం తెలీదు.. మేమేం చూడలేదు?
ఇక కూటమి నేతలు సముద్ర తీరాన్ని విధ్వంసం చేస్తూ.. భారీ గుంతలు తవ్వుతూ ఇసుకను దోచేస్తున్నా అధికారులు మాత్రం అలాంటివేమీ జరగడం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ రవాణా కోసం ప్రత్యేకంగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటుచేసుకున్నా పట్టించుకోవడంలేదు. సీఆర్‌జెడ్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకపోయినా.. టన్నుల కొద్దీ ఇసుక తరలిపోతుండటంతో మత్స్య సంపదకు విఘాతం కలుగుతోందని స్థానికులు భీమిలి డివిజన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు.
అవన్నీ తీరంలోనే కప్పేస్తున్నారు తప్ప.. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు మాత్రం అడుగు ముందుకెయ్యడంలేదు. పైగా.. కూటమి నేతల ఇసుక దాహాన్ని కప్పిపుచ్చే విషయంలో మాత్రం జిల్లా రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు ఎంతో సమన్వయం పాటిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి.
అపారమైన ఖనిజ నిక్షేపాలే కారణం..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్మాణ రంగాన్ని ఇసుక కొరత వేధిస్తోంది. దీంతో.. సముద్రంలో దొరుకుతున్న ఇసుకని ఇంటి నిర్మాణ పనులకు వాడుతున్నామంటూ తప్పుదోవ పట్టించి విచ్చలవిడిగా తోడేస్తూ రాత్రికి రాత్రి రాష్ట్రాలు దాటించేస్తున్నారు. నిజానికి.. సముద్రపు ఇసుక ఇంటి నిర్మాణానికి వినియోగించేది చాలా అరుదు. కానీ.. ఇందులో అపారమైన ఖనిజ నిక్షేపాలు దాగి ఉండడంతో వీటి కోసమే ఈ తవ్వకాలు చేపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భీమిలి తీర ప్రాంతంలో 24 రకాల ఖనిజ నిక్షేపాలతో కూడిన బ్లాకులున్నాయని గతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇటీవల తీరంలో ఇసుక నల్లగా కనిపించడం కూడా దీనిని బలపరుస్తోంది. ఇదే ఇప్పుడు కూటమి నేతల పాలిట వరంగా మారింది. ఇక్కడి ఇసుకలో గార్నెట్, జిర్కోనియం, ఇలిమినైట్, సిలిమినైట్, రూటిల్, లికాక్సిన్, మోనోజైట్ వంటి మినరల్స్ ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భీమిలిలోని 24 బ్లాకుల్లో సుమారు 4.302 మిలియన్ టన్నుల భారలోహాలున్నాయి. సీ బెడ్‌కు కేవలం ఒక మీటరు లోతు నుంచే ఈ ఖనిజ నిక్షేపాలున్నాయని తెలుస్తోంది. అందుకే.. ఖనిజ నిక్షేపాల కోసం ఇసుక తవ్వకాలు జరుపుతూ రూ.కోట్ల లావాదేవీలు చేతులు మారుతున్నట్లు సమాచారం.
అత్యంత అరుదైన ఖనిజ నిక్షేపాలివి..
భీమునిపట్నం తీరంలో లభ్యమయ్యే ఖనిజాలు అత్యంత అరుదైనవని జీఎస్‌ఐ భావిస్తోంది. ఇక్కడ లభ్యమయ్యే గార్నెట్ నిక్షేపాలను శాండ్ బ్లాస్టింగ్, వాటర్ జెట్ కటింగ్, వాటర్ ట్రీట్‌మెంట్ కోసం వినియోగిస్తారు. ఇలిమినేట్, రూటిల్, లికాక్సిన్ వంటి మినరల్స్‌ను సింథటిక్ రూటిల్స్, టైటానియం డైయాక్సిడ్ పిగ్మెంట్, టైటానియం స్పాంజ్, టైటానియం టెట్రాక్లోరైడ్, టైటానియం మెటల్ తయారీకి వినియోగిస్తారు.
అత్యంత అరుదుగా లభించే టైటానియం మెటల్స్‌ను ఎయిర్‌క్రాప్ట్సŠ, స్పేస్ షెటిల్స్, వైద్య పరికరాల తయారీలో వినియోగిస్తుంటారు. ఇందుకోసమే ఎక్కువ లోతులో ఇసుకని తవ్వి చెన్నై, కేరళకు అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
పెద్దపెద్ద లారీల ద్వారా తరలిస్తున్నారు..
తీర ప్రాంతాల్లో సముద్రపు ఇసుకను అడ్డగోలుగా తవ్వేస్తూ తరలించేస్తున్నారు. ఫలితంగా పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. ఇది తీరప్రాంత భద్రతకు ముప్పు కలిగించడమే. ఈ గోతులు చూస్తుంటే సముద్రం ఎప్పుడు ముందుకొచ్చేస్తుందోనని మా ప్రాంత ప్రజలంతా భయపడుతున్నాం. పెద్ద పెద్ద లారీల ద్వారా ప్రతిరోజూ ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.– వేముల ఈశ్వర్‌రెడ్డి, కాపులుప్పాడ
చేపలు దొరకడంలేదు..
ఇప్పటికే గంగమ్మ తల్లి ముందుకొచ్చేస్తూ భయపెడుతోంది. ఇలాంటి ప్రాంతంలో ఇసుక దోచేస్తుండటం మాకు భయం కలిగిస్తోంది. ఇసుక లేకపోతే అలల రాకపోకల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. దీనివల్ల.. ఇటువైపు చేపల రాక ఆగిపోతుంది. ఈ అక్రమ తవ్వకాలు జరిగినప్పటి నుంచి ఈ ప్రాంతాల్లో వేటకు వెళ్తుంటే చేపలు సరిగా దొరకడంలేదు. ఇదే రీతిలో అక్రమ రవాణా కొనసాగితే చిన్న చేప కూడా పట్టుకోలేం. – మేరుగు చిన్నారావు, మత్స్యకారుడు, మంగమారిపేట
భవిష్యత్తులో తీర భద్రతకు పెనుముప్పు..
సముద్రపు ఇసుకను అక్రమంగా తరలించడం తీర ప్రాంత ప్రజలకు భవిష్యత్తులో ప్రమాదకరం. బీచ్ రోడ్డు ప్రధాన రహదారి వెంబడి యథేచ్ఛగా ఇసుకను రవాణా చేస్తున్నా అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడ అనేక సీసీ కెమెరాలున్నాయి. ఇసుక తరలింపుపై దృష్టిపెట్టి అధికారులు చర్యలు తీసుకుంటే అక్రమ రవాణాకు అడ్డుకట్ట వెయ్యొచ్చు. – దౌలపల్లి కొండబాబు, 4వ వార్డు కార్పొరేటర్
Comments
Please login to add a commentAdd a comment