
మంత్రి ఇలాకాలో భారీఎత్తున ఇసుక దందా
పీకేపాడు రీచ్‌ను పిండేస్తున్న అక్రమార్కులు
అనుమతి లేకున్నా యంత్రాల ద్వారా లోడింగ్
ఇరవై అడుగుల మేర తోడేసిన అక్రమార్కులు
రోజుకు వందల లారీలు, టిప్పర్లతో రవాణా
లోడింగ్ చార్జీల రూపంలో రోజూ రూ.లక్షల్లో వసూళ్లు
కర్ణాటక, తమిళనాడుకు యథేచ్ఛగా తరలింపు
పర్యావరణానికి తూట్లు.. పట్టించుకోని అధికారులు
అనుమతులు లేని రీచ్.. ఆపై పర్యావరణానికి తూట్లు పొడుస్తూ భారీ యంత్రాలతో తోడివేత.. రాత్రీపగలు తేడా లేకుండా వందల వాహనాల్లో లోడింగ్.. యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు తరలింపు..! ఇదీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇలాకాలో ఉన్న పెన్నా నదిలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్న తీరు. స్థానిక ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులకు వాటాలు ఉండడంతో కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రీచ్‌లో ఇసుక దందాపై ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనపై ఉక్కుపాదం మోపారు కానీ ఇసుక దందాను మాత్రం నిలువరించలేకపోతున్నారు.
ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని అనంతసాగరం మండలం పడమటికంభంపాడు (పీకేపాడు) వద్ద పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన ఓ ఇసుక డాన్ స్థానిక ప్రజాప్రతినిధికి రోజువారీ కప్పం కట్టే ఒప్పందంతో రీచ్‌ను స్వాధీనం చేసుకున్నాడు. మొదట పర్యావరణ అనుమతి లేదని అధికారులు అడ్డుచెప్పినా.. స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశాలతో వెనక్కి తగ్గారు. ఇదే అదనుగా ఏకంగా యంత్రాలు ఉపయోగిస్తూ తోడేస్తున్నారు. రోజుకు 100 భారీ వాహనాలతో పాటు ట్రాక్టర్లతో అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇరవై అడుగుల మేర గుంతలతో పెన్నా నదిలో ఇసుకను పిండుతున్నారు. – సాక్షి ప్రతినిధి, నెల్లూరు
రోజుకు 5 వేల టన్నుల అక్రమ రవాణా
ఏడు యూనిట్ల టిప్పర్ ఖరీదు రూ.10 వేలు. అంతకుమించి పెద్ద లారీలు, టిప్పర్లు అయితే రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్లకు రూ.వెయ్యి వంతున యూనిట్ ఇసుకను విక్రయిస్తున్నారు. నాణ్యతపరంగా పెన్నా ఇసుకకు చాలా డిమాండ్ ఉంది. దీంతో అందినంత తోడేస్తున్నారు. ఇసుక దందా నడుపుతున్న డాన్ 20 పైగా సొంత వాహనాల్లో ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా సాగిస్తున్నాడు. అదికాకుండా ఇతర వాహనాల నుంచి లోడింగ్ చార్జీలు భారీగా వసూలు చేస్తున్నారు.
⇒ రోజూ 100 భారీ వాహనాలతో పాటు ట్రాక్టర్లకు లోడింగ్ ద్వారా దాదాపు 5 వేల టన్నుల ఇసుక రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. లోడింగ్ చార్జీల ద్వారానే దాదాపు రూ.10 లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నెలవారీగా చూస్తే సగటున రూ.3 కోట్ల ఇసుక దందా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు వైఎస్సార్ కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ఏరియాలకు ఈ రీచ్ నుంచే అక్రమ రవాణా సాగుతోంది. రోజువారీగా వందల వాహనాలతో తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు.
నెలవారీ మామూళ్లు
పీకే పాడు రీచ్‌లో ఇసుక దందా సజావుగా సాగేందుకు మైనింగ్, రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్‌పోర్టు అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహన యజమానులు మాత్రం వారి రూట్‌లోని పోలీస్ స్టేషన్లకు రూ.12 వేలు వంతున ఇస్తున్నట్లు చెబుతున్నారు. మామూళ్లు ఇస్తుండడంతో ఓవర్ లోడ్‌తో వెళ్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
నేషనల్ హైవేపై గుంతలు
భారీ వాహనాలు ఓవర్ లోడ్‌తో ఇసుక తరలిస్తుండడంతో ఉప్పలపాడు సమీపంలోని జాతీయ రహదారిపై గోతులు ఏర్పడ్డాయి. 12 టైర్ల వాహనానికి 18 టన్నులు మాత్రమే లోడింగ్ చేయాలి. కానీ, టిప్పర్ల బాడీని పెంచి కట్టించడంతో 40 టన్నుల వరకు లోడింగ్ చేస్తున్నారు. దీంతో రోడ్లు గుంతలుపడి వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు.
ఇసుక దందాపై స్థానికుల ఆందోళన
పీకే పాడు రీచ్‌లో ఇసుక అక్రమ దందాపై స్థానికులు కన్నెర్ర చేస్తున్నారు. రోడ్లు పాడవుతుండడంతో పాటు భారీ వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, పెన్నా నదిలో భారీ గుంతలతో భూగర్భ జలాలు అడుగంటి పంటలకు సాగునీరు అందడం కష్టంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దందాపై ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో ఆందోళన చేపట్టారు. గతంలో రోడ్డెక్కి ఇసుక వాహనాలను అడ్డుకున్నారు.
సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానం అంటూ దోపిడీకి సహకరిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధి అండతోనే మాఫియా రెచ్చిపోతోందని, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. స్థానికుల ఆందోళనను అధికారులు పట్టించుకోపోగా, ఇసుకాసురులకు కొమ్ముకాయడం విశేషం.