mineral deposits
-
శరణమా.. రణమేనా?
వాషింగ్టన్: ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. అటు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. దేశాధినేతలం అన్న విషయం కూడా మర్చిపోయి మీడియా సాక్షిగా వాగ్వాదానికి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఒకరినొకరు దుయ్యబట్టుకున్నారు. అచ్చం వీధి బాగోతాన్ని తలపించేలా పాత విషయాలన్నీ తిరగదోడుతూ, పరస్పరం దెప్పిపొడుచుకుంటూ రెచ్చిపోయారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నడూ కనీవినీ ఎరగని ఈ దృశ్యాలకు వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసు వేదికైంది. ఉక్రెయిన్‌లోని అపార ఖనిజ నిక్షేపాల్లో అమెరికాకు 50 శాతం వాటా ఇవ్వాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేయడం, బదులుగా రష్యా నుంచి తమ దేశానికి కచి్చతమైన రక్షణ హామీలు కావాలని జెలెన్స్కీ కోరడం తెలిసిందే. వాటిపై స్పష్టమైన ఒప్పందాల నిమిత్తం అగ్ర రాజ్యం చేరిన ఆయన శుక్రవారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులు పాల్గొన్న ఈ భేటీకి మీడియాను అనుమతించడమే గాక ప్రత్యక్ష ప్రసారం కూడా చేయడం విశేషం. భేటీ చాలాసేపటిదాకా ప్రశాంతంగానే సాగినా చివర్లో పూర్తిగా అదుపు తప్పింది. నేతలిద్దరి మాటల యుద్ధంతో రచ్చ రచ్చగా మారింది. చివరికి ఎటూ తేలకుండానే ముగిసింది. భేటీ అనంతరం జరగాల్సిన ట్రంప్, జెలెన్స్కీ సంయుక్త మీడియా భేటీ కూడా రద్దయింది! అంతేగాక, ‘జెలెన్స్కీ వైట్‌హౌస్ వీడి వెళ్లిపోవచ్చు’ అంటూ మీడియా సమక్షంలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. శాంతి ఒప్పందానికి సిద్ధపడితేనే తిరిగి తమతో చర్చలకు రావాలని సూచించారు. దాంతో ఎన్నో ఆశల నడుమ జెలెన్స్కీ చేపట్టిన అమెరికా యాత్ర ఆశించిన ఫలితం రాబట్టకపోగా వికటించిన్నట్టు కనిపిస్తోంది. అలా మొదలైంది... రష్యా–ఉక్రెయిన్ వివాదం విషయమై దశాబ్ద కాలంగా అమెరికా వ్యవహరిస్తున్న తీరును ఆక్షేపిస్తున్నట్టుగా జెలెన్స్కీ మాట్లాడటంతో పరిస్థితి వేడెక్కింది. అమెరికా మీడియా అంతా చూస్తుండగా అంత అమర్యాదకరంగా మాట్లాడటం సరికాదంటూ వాన్స్ జోక్యం చేసుకున్నా ఆయన వెనక్కు తగ్గలేదు. తమతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ రష్యా 2014 నుంచీ తుంగలో తొక్కుతూ వస్తున్నా అమెరికా సరైన రీతిలో జోక్యం చేసుకోలేదంటూ ఆక్షేపించారు. అధ్యక్షులు బరాక్ ఒబామా, ట్రంప్, బైడెన్ ఎవరూ తమకు చేయాల్సినంతగా సాయం చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఖనిజ ఒప్పందానికి ప్రతిగా ఉక్రెయిన్ రక్షణకు అమెరికా స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ క్రమంలో, ‘‘యుద్ధంలో అంతులేని నష్టాన్ని చవిచూడాల్సి వస్తే ఎలా ఉంటుందో అమెరికాకు తెలియదు. బహుశా మున్ముందు తెలిసొస్తుందేమో!’’ అన్న జెలెన్స్కీ వ్యాఖ్యలతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. ట్రంప్ ఒక్కసారిగా తీవ్ర అసహనానికి లోనయ్యారు. జెలెన్స్కీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘అలాంటి పరిస్థితి మాకెప్పుడూ రాదు. ఎప్పటికీ తిరుగులేని శక్తిగానే ఉంటాం’’ అంటూ ఆగ్రహంగా బదులిచ్చారు. ‘‘ఉక్రెయిన్‌కు ఇన్నేళ్లుగా అన్నివిధాలా ఆదుకుంటూ వస్తున్నాం. ఈ యుద్ధంలో ఇప్పటికే 350 బిలియన్ డాలర్ల మేర సాయుధ, ఆర్థిక సాయం అందించాం. లేదంటే రష్యాతో యుద్ధం కొనసాగించడం మీ తరమయ్యేదే కాదు. పోరు రెండే వారాల్లో ముగిసిపోయేది’’ అంటూ దుయ్యబట్టారు. అయినా జెలెన్స్కీకి మాత్రం కనీస కృతజ్ఞత కూడా లేదంటూ విరుచుకుపడ్డారు. మీడియా ముందే తనతో గొడవకు దిగుతూ అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు. ‘‘అమెరికా దన్ను లేనిదే మీరెందుకూ కొరగారు! మాకు షరతులు విధించే, మమ్మల్ని డిమాండ్ చేసే పరిస్థితిలో అసలే లేరు. అది గుర్తుంచుకోండి’’ అంటూ వేలు చూపిస్తూ మరీ జెలెన్స్కీని కటువుగా హెచ్చరించారు. ‘‘మీరు లక్షలాది ప్రాణాలను పణంగా పెడుతున్నారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని తెచ్చిపెట్టేలా ప్రమాదకర జూదం ఆడుతున్నారు’’ అంటూ జెలెన్స్కీని ఆక్షేపించారు. మధ్యలో పదేపదే ఆయన భుజంపై కొట్టి మరీ ఆగ్రహం వెలిగక్కారు. రష్యాతో ఏ విషయంలోనూ రాజీ పడేదే లేదన్న జెలెన్స్కీ వ్యాఖ్యలను కూడా ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ‘‘పుతిన్ ఒక ఉగ్రవాది. యుద్ధాల్లోనూ నిబంధనలుంటాయి. వాటన్నింటినీ కాలరాసిన పుతిన్ వంటి హంతకునితో ఎలాంటి రాజీ ఉండబోదు’’ అని జెలెన్స్కీ అన్నారు. అలా కుదరదని, యుద్ధానికి తెర దించాలంటే రష్యాతో చాలా విషయాల్లో రాజీ పడాల్సిందేనని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ‘‘ఇలాగైతే మాతో వ్యాపారం కష్టమే. అమెరికాతో ఖనిజ వనరుల ఒప్పందానికి అంగీకరిస్తారా, సరేసరి. లేదంటే మీకూ మాకూ రాంరాం’’ అంటూ తేల్చిపడేశారు. వాగ్వాదం పొడవునా నేతలిరువురూ పదేపదే వాగ్బాణాలు విసురుకున్నారు. కనీసం ఇప్పటికైనా అమెరికా చేస్తున్న దానికి కృతజ్ఞతలు చెప్పండంటూ వాన్స్ కల్పించుకోగా ట్రంప్ వారించారు. ‘‘పర్లేదు. ఈ డ్రామా నాకూ సరదాగానే ఉంది. జరుగుతున్నదేమిటో అమెరికా ప్రజలందరూ చూడాలి’’ అన్నారు.సాయానికి హామీ ఇవ్వలేం: ట్రంప్ జెలెన్స్కీతో భేటీకి ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో సహజ వనరుల ఒప్పందంపై ఆయన, తాను కాసేపట్లో సంతకాలు చేస్తామని ప్రకటించారు. యుద్ధం వీలైనంత త్వరగా ముగియాలన్నదే తన ఉద్దేశమన్నారు. అయితే, ‘‘ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సాయం కొనసాగుతుంది. కాకపోతే ఈ విషయంలో మానుంచి మరీ ఎక్కువగా ఆశించకూడదు’’ అని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కృతనిశ్చయంతో ఉన్నారంటూ మరోసారి ప్రశంసించారు. -
తీరంలో ఘోరం
నదులు, వాగుల్లోని ఇసుకనే కాదు.. అధికార టీడీపీ కూటమి ‘తిమింగలాలు’ ఇప్పుడు సముద్ర తీరంలోని ఇసుకనూ కొల్లగొట్టేస్తున్నారు. ఖనిజాన్వేషణ కోసం ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు. రాత్రికి రాత్రి రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. ఫలితంగా సముద్ర తీరంలో కందకాలు ఏర్పడుతున్నాయి. ఇలా సాగరతీరాన్ని చెరువులుగా మార్చేస్తూ.. మత్స్యసంపదకు, ప్రకృతికి విఘాతం కలిగిస్తున్నా.. అధికారులు చోద్యం చూస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విశాఖలోని భీమిలి తీరం ఈ అరాచకానికి కేంద్రంగా మారింది.సాక్షి, విశాఖపట్నం: భీమిలి తీరంలో అరుదైన ఖనిజ నిక్షేపాలుండటంతో అక్రమ తవ్వకాలు పెచ్చరిల్లుతున్నాయి. ఇక్కడ బీచ్ రోడ్డు వెంబడి తిమ్మాపురం, మంగమారిపేట, ఉప్పాడ తీర ప్రాంతంలో రాత్రి సమయాల్లో కొందరు లారీలు, మినీ వ్యాన్ల ద్వారా ఇసుకను తవ్వి అక్రమంగా తరలించేస్తున్నారు. ఫలితంగా పెద్దపెద్ద గోతులు ఏర్పడుతూ తీరప్రాంత భద్రతని కలవరపెడుతోంది. ఇప్పటికే తుపాను సమయాల్లో రుషికొండ, ఐటీ జంక్షన్, సాగర్‌నగర్, తిమ్మాపురం, మంగమారిపేట, ఉప్పాడ తీర ప్రాంతాల్లో సముద్రం పెద్దఎత్తున కోతకు గురవుతోంది. ఇప్పుడు కూటమి నేతల ఇసుక దందాతో 2–3 మీటర్ల మేర భారీ గోతులు దర్శనమిస్తున్నాయి. ఈ తరహా గోతులతో ఆటుపోట్ల సమయంలో తీరం కోతకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. మాకేం తెలీదు.. మేమేం చూడలేదు?ఇక కూటమి నేతలు సముద్ర తీరాన్ని విధ్వంసం చేస్తూ.. భారీ గుంతలు తవ్వుతూ ఇసుకను దోచేస్తున్నా అధికారులు మాత్రం అలాంటివేమీ జరగడం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ రవాణా కోసం ప్రత్యేకంగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటుచేసుకున్నా పట్టించుకోవడంలేదు. సీఆర్‌జెడ్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకపోయినా.. టన్నుల కొద్దీ ఇసుక తరలిపోతుండటంతో మత్స్య సంపదకు విఘాతం కలుగుతోందని స్థానికులు భీమిలి డివిజన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అవన్నీ తీరంలోనే కప్పేస్తున్నారు తప్ప.. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు మాత్రం అడుగు ముందుకెయ్యడంలేదు. పైగా.. కూటమి నేతల ఇసుక దాహాన్ని కప్పిపుచ్చే విషయంలో మాత్రం జిల్లా రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు ఎంతో సమన్వయం పాటిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. అపారమైన ఖనిజ నిక్షేపాలే కారణం..రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్మాణ రంగాన్ని ఇసుక కొరత వేధిస్తోంది. దీంతో.. సముద్రంలో దొరుకుతున్న ఇసుకని ఇంటి నిర్మాణ పనులకు వాడుతున్నామంటూ తప్పుదోవ పట్టించి విచ్చలవిడిగా తోడేస్తూ రాత్రికి రాత్రి రాష్ట్రాలు దాటించేస్తున్నారు. నిజానికి.. సముద్రపు ఇసుక ఇంటి నిర్మాణానికి వినియోగించేది చాలా అరుదు. కానీ.. ఇందులో అపారమైన ఖనిజ నిక్షేపాలు దాగి ఉండడంతో వీటి కోసమే ఈ తవ్వకాలు చేపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భీమిలి తీర ప్రాంతంలో 24 రకాల ఖనిజ నిక్షేపాలతో కూడిన బ్లాకులున్నాయని గతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇటీవల తీరంలో ఇసుక నల్లగా కనిపించడం కూడా దీనిని బలపరుస్తోంది. ఇదే ఇప్పుడు కూటమి నేతల పాలిట వరంగా మారింది. ఇక్కడి ఇసుకలో గార్నెట్, జిర్కోనియం, ఇలిమినైట్, సిలిమినైట్, రూటిల్, లికాక్సిన్, మోనోజైట్ వంటి మినరల్స్ ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భీమిలిలోని 24 బ్లాకుల్లో సుమారు 4.302 మిలియన్ టన్నుల భారలోహాలున్నాయి. సీ బెడ్‌కు కేవలం ఒక మీటరు లోతు నుంచే ఈ ఖనిజ నిక్షేపాలున్నాయని తెలుస్తోంది. అందుకే.. ఖనిజ నిక్షేపాల కోసం ఇసుక తవ్వకాలు జరుపుతూ రూ.కోట్ల లావాదేవీలు చేతులు మారుతున్నట్లు సమాచారం.అత్యంత అరుదైన ఖనిజ నిక్షేపాలివి..భీమునిపట్నం తీరంలో లభ్యమయ్యే ఖనిజాలు అత్యంత అరుదైనవని జీఎస్ఐ భావిస్తోంది. ఇక్కడ లభ్యమయ్యే గార్నెట్ నిక్షేపాలను శాండ్ బ్లాస్టింగ్, వాటర్ జెట్ కటింగ్, వాటర్ ట్రీట్మెంట్ కోసం వినియోగిస్తారు. ఇలిమినేట్, రూటిల్, లికాక్సిన్ వంటి మినరల్స్‌ను సింథటిక్ రూటిల్స్, టైటానియం డైయాక్సిడ్ పిగ్మెంట్, టైటానియం స్పాంజ్, టైటానియం టెట్రాక్లోరైడ్, టైటానియం మెటల్ తయారీకి వినియోగిస్తారు. అత్యంత అరుదుగా లభించే టైటానియం మెటల్స్ను ఎయిర్క్రాప్ట్సŠ, స్పేస్ షెటిల్స్, వైద్య పరికరాల తయారీలో వినియోగిస్తుంటారు. ఇందుకోసమే ఎక్కువ లోతులో ఇసుకని తవ్వి చెన్నై, కేరళకు అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది.పెద్దపెద్ద లారీల ద్వారా తరలిస్తున్నారు..తీర ప్రాంతాల్లో సముద్రపు ఇసుకను అడ్డగోలుగా తవ్వేస్తూ తరలించేస్తున్నారు. ఫలితంగా పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. ఇది తీరప్రాంత భద్రతకు ముప్పు కలిగించడమే. ఈ గోతులు చూస్తుంటే సముద్రం ఎప్పుడు ముందుకొచ్చేస్తుందోనని మా ప్రాంత ప్రజలంతా భయపడుతున్నాం. పెద్ద పెద్ద లారీల ద్వారా ప్రతిరోజూ ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.– వేముల ఈశ్వర్‌రెడ్డి, కాపులుప్పాడచేపలు దొరకడంలేదు..ఇప్పటికే గంగమ్మ తల్లి ముందుకొచ్చేస్తూ భయపెడుతోంది. ఇలాంటి ప్రాంతంలో ఇసుక దోచేస్తుండటం మాకు భయం కలిగిస్తోంది. ఇసుక లేకపోతే అలల రాకపోకల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. దీనివల్ల.. ఇటువైపు చేపల రాక ఆగిపోతుంది. ఈ అక్రమ తవ్వకాలు జరిగినప్పటి నుంచి ఈ ప్రాంతాల్లో వేటకు వెళ్తుంటే చేపలు సరిగా దొరకడంలేదు. ఇదే రీతిలో అక్రమ రవాణా కొనసాగితే చిన్న చేప కూడా పట్టుకోలేం. – మేరుగు చిన్నారావు, మత్స్యకారుడు, మంగమారిపేటభవిష్యత్తులో తీర భద్రతకు పెనుముప్పు..సముద్రపు ఇసుకను అక్రమంగా తరలించడం తీర ప్రాంత ప్రజలకు భవిష్యత్తులో ప్రమాదకరం. బీచ్ రోడ్డు ప్రధాన రహదారి వెంబడి యథేచ్ఛగా ఇసుకను రవాణా చేస్తున్నా అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడ అనేక సీసీ కెమెరాలున్నాయి. ఇసుక తరలింపుపై దృష్టిపెట్టి అధికారులు చర్యలు తీసుకుంటే అక్రమ రవాణాకు అడ్డుకట్ట వెయ్యొచ్చు. – దౌలపల్లి కొండబాబు, 4వ వార్డు కార్పొరేటర్ -
సముద్ర గర్భ మైనింగ్ వేలం ప్రారంభం
న్యూఢిల్లీ: సముద్ర గర్భ ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాల వేలం మొదటి రౌండ్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. వీటిలో 13 మైన్స్‌ను విక్రయానికి ఉంచడం జరిగింది. ఈ మైన్స్‌లో మూడు సున్నపు మట్టి, మూడు నిర్మాణ ఇసుక, ఏడు పాలీమెటాలిక్ నాడ్యూల్స్– క్రస్ట్లు ఉన్నాయి. సముద్రగర్భ ఖనిజ వనరుల అన్వేషణ విషయంలో భారత్ పురోగతిని ఈ కేటాయింపులు సూచిస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. ఈ ఖనిజాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి, హైటెక్ తయారీ, గ్రీన్ ఎనర్జీ పరివర్తనకు కీలకం కావడం గమనార్హం. వేలానికి సిద్ధమైన ఆఫ్‌షోర్ ప్రాంతాలలో ప్రాదేశిక జలాలు, కాంటినెంటల్ షెల్ఫ్, ప్రత్యేక ఆర్థిక మండలి, దేశంలోని ఇతర సముద్ర మండలాలు ఉన్నాయి. ఖనిజ సంపద పటిష్టతను సూచిస్తోంది: మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రారంభ కార్యక్రమంలో బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఆఫ్‌షోర్ బ్లాకుల అన్వేషణ వల్ల దేశంలోని ఖనిజ సంపద మరింత పటిష్టం అవుతుందని తెలిపారు. భారతదేశంలో కీలకమైన ఖనిజాల కోసం డిమాండ్ పెరుగుతోందని వివరించారు. లిథియం డిమాండ్ ఎనిమిది రెట్లు పెరుగుతుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్ త్వరలో క్రిటికల్ మినరల్స్ మిషన్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భాగస్వాములకోసం అన్వేషణ: వీఎల్ కాతా రావు ఖనిజ అన్వేషణ, అభివృద్ధి విభాగంలో భాగస్వాముల కోసం ప్రభుత్వం ప్రయతి్నస్తున్నట్లు గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు ఈ సందర్భంగా తెలిపారు. ఖనిజాలపై పరిశోధన– అభివృద్ధిపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు. సముద్ర గర్భ మైనింగ్ వేలం పక్రియ ప్రారంభం నేపథ్యంలో దేశ, విదేశాల్లో రెండు మూడు రోడ్‌షోలు చేయడానికి తాము సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. గనుల అదనపు కార్యదర్శి సంజయ్ లోహియా మాట్లాడుతూ, ఆఫ్‌షోర్ మినరల్ బ్లాక్‌లను విజయవంతంగా వేలం వేయడానికి అవసరమైన అన్ని నిబంధనలను పూర్తి చేసినట్లు చెప్పారు. ఆఫ్‌షోర్ ప్రాంతాలలో మైనింగ్‌ను చేపట్టే చర్యలు తీసుకోవడమే మనకు సవాలు అని ఆయన పేర్కొంటూ, అయితే ఆయా చర్యల్లో విజయవంతం అవుతామన్న భరోసాను వ్యక్తం చేశారు. కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, పాలీమెటాలిక్ నాడ్యూల్స్ వంటి అధిక డిమాండ్ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి అలాగే సప్లై చైన్‌ను స్థిరీకరించడానికి భారత్ విభిన్న ఖనిజ వనరులను అభివృద్ధి చేయాలని గనుల మంత్రిత్వ శాఖ తెలిపింది.గ్లోబల్ లీడర్‌గా ఎదగడమే లక్ష్యం ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 2002ను పార్లమెంటు గత ఏడాది ఆగస్టులో సవరించింది. ఆఫ్‌షోర్ ప్రాంతాలలో ఖనిజ బ్లాకుల కేటాయింపు విధానంగా వేలాన్ని తప్పనిసరి చేసింది. వనరుల అన్వేషణ–వెలికితీత కోసం ఉత్పత్తి లీజులు, మిశ్రమ లైసెన్స్‌ల మంజూరును క్రమబదీ్ధకరణ వంటి చర్యలను తీసుకోడానికి ప్రభుత్వాన్ని ఈ సవరణ అనుమతిస్తుంది. భారత్ సముద్రగర్భంలో ఖనిజాల అన్వేషణలో అడుగుపెట్టినప్పుడు, దాని పారిశ్రామిక–గ్రీన్ ఎనర్జీ రంగాలను పెంపొందించడమే కాకుండా కీలకమైన ఖనిజాలలో గ్లోబల్ లీడర్‌గా తన స్థానాన్ని పొందడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. -
అమెరికా మార్కెట్‌పై ఏపీ దృష్టి
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యధిక బెరైటీస్ ఖనిజ నిల్వలు ఉన్న ఏపీ మంగంపేట బెరైటీస్ ప్రాజెక్ట్ ద్వారా అమెరికా మార్కెట్లో తన వాటాను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా తొలి అడుగు వేసింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీ ఎండీసీ) ఎండీ వీజీ వెంకటరెడ్డి ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు అమెరికాలో పర్యటించి పలు ఒప్పందాలు చేసుకున్నారు. టెక్సాస్ రాష్ట్రంలోని హౌస్టన్‌లో పలు సంస్థలతో భేటీ అయ్యారు. ఆయా కంపెనీలకు ఆంధ్రప్రదేశ్‌లోని మంగంపేట ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి చేస్తున్న బెరైటీస్‌పై అవగాహన కల్పించారు. దీంతో 3 కంపెనీలు రానున్న మూడేళ్లలో సుమారు రూ.750 కోట్ల విలువైన 16 లక్షల టన్నుల బెరైటీస్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాయి. అమెరికన్ మార్కెట్లో ఎక్కువగా సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ బెరైటీస్‌కు డిమాండ్ ఉంది. మంగంపేట ప్రాజెక్ట్‌లో ఇప్పటికే దాదాపు 70 లక్షల టన్నుల వరకు నిల్వలు ఉన్నాయి. వీటిని తక్షణం అమెరికన్ మార్కెట్లో విక్రయించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. చరిత్రలో తొలిసారి అమెరికాకు చెందిన మూడు కంపెనీలతో బెరైటీస్ విక్రయాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీ ఎండీసీ ఎండీ వెంకటరెడ్డి తెలిపారు. ఏపీ ఎండీసీ చరిత్రలోనే తొలిసారి అమెరికాలోని ఇంధన సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుని మార్కెటింగ్ రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన చెప్పారు. మరో రూ.250 కోట్ల విలువైన బెరైటీస్ కొనుగోలుకు ఎంవోయూలు కుదిరే అవకాశం ఉందన్నారు. వివిధ దేశాల నుంచి ఎగుమతి అవుతున్న బెరైటీస్‌తో పోలిస్తే మంగంపేట నుంచి అందించే ఖనిజం నాణ్యత, ధరల్లో వ్యత్యాసం, పారదర్శకమైన ఎగుమతి విధానంపై పలు అమెరికన్ కంపెనీలు ఆసక్తి చూపించాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మరికొన్ని కంపెనీలు కూడా బెరైటీస్ కోసం సంప్రదింపులకు సిద్ధమయ్యాయని వెల్లడించారు. మంగంపేట ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి చేసే బెరైటీస్‌లో లో–గ్రేడ్ ఖనిజాన్ని అమెరికా మార్కెట్లో విక్రయించడం, క్రమంగా అక్కడ మార్కెట్‌ను విస్తరించుకోవడం వల్ల ఏపీ ఎండీసీకి మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్నారు. నేరుగా అమెరికన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఏపీ ఎండీసీ ప్రతిష్ట పెరుగుతుందన్నారు. -
280 గనులు వేలానికి..
• రూ.10 లక్షల కోట్ల ఖనిజ నిక్షేపాలు • వచ్చే ఆర్థిక సంవత్సరంలో వేలం ప్రక్రియ న్యూఢిల్లీ: పెద్ద ఎత్తున గనుల వేలానికి కేంద్ర సర్కారు సమాయత్తం అవుతోంది. రూ.10 లక్షల కోట్ల విలువజేసే ఖనిజ నిక్షేపాలతో ఉన్న 280 గనులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో వేలం వేసేందుకు ప్రణాళిక సిద్ధమైందని కేంద్ర గనుల శాఖ సెక్రటరీ బల్వీందర్‌కుమార్ బుధవారం ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. మరో 83 గనులు వివాదంలో ఉన్నాయని, కోర్టుల తీర్పులకు అనుగుణంగా వాటి వేలం ఆధారపడి ఉంటుందన్నారు. రూ.94,000 కోట్ల ఖనిజ నిల్వలు ఉన్న 21 గనుల లీజులను ఇప్పటి వరకు వేలం వేసినట్టు తెలిపారు. గనుల తనిఖీకి, టోపోగ్రఫీ మ్యాప్‌ల రూపకల్పనకు డ్రోన్ టెక్నాలజీ వినియోగం ఈ నెలలోనే ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రస్తుతం మనుషుల సాయంతో టోపోగ్రఫీ మ్యాపుల రూపకల్పనకు రోజుల సమయం తీసుకుంటుండగా, డ్రోన్ల వినియోగంతో ఆ పనిని గంటల్లోనే పూర్తి చేసేయవచ్చన్నారు. ఎంత మొత్తం ఖనిజాల తవ్వకం జరిగిందీ గంటలోనే తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వం వేలానికి తీసుకురానున్న గనులు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉండగా, వీటిలో ఐరన్‌ఓర్, బాక్సైట్, సున్నపురాయి కలిగినవీ ఉన్నాయి.