
జెలెన్‌స్కీకి ట్రంప్ అల్టిమేటం
మాతో ఒప్పందానికి రావాల్సిందే
లేదంటే పూర్తిగా తప్పుకుంటాం
మీకు మరో అవకాశమే లేదు
ప్రపంచయుద్ధం వైపు నెడుతున్నారు
రష్యాతో రాజీకి రావాల్సిందే
జెలెన్‌స్కీకి అధ్యక్షుని స్పష్టీకరణ
ఉద్రిక్తంగా సాగిన అధ్యక్షుల భేటీ
మీడియా ముందే అరుపులు
అధ్యక్ష స్థాయి భేటీలో ఎన్నడూ కనీవినీ ఎరగని దృశ్యాలు
సంయుక్త మీడియా భేటీ రద్దు
వైట్‌హౌస్ వీడి వెళ్లిపోవచ్చు
జెలెన్‌స్కీని ఉద్దేశించి ట్రంప్
వాషింగ్టన్: ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ. అటు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. దేశాధినేతలం అన్న విషయం కూడా మర్చిపోయి మీడియా సాక్షిగా వాగ్వాదానికి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఒకరినొకరు దుయ్యబట్టుకున్నారు. అచ్చం వీధి బాగోతాన్ని తలపించేలా పాత విషయాలన్నీ తిరగదోడుతూ, పరస్పరం దెప్పిపొడుచుకుంటూ రెచ్చిపోయారు.
అంతర్జాతీయ స్థాయిలో ఎన్నడూ కనీవినీ ఎరగని ఈ దృశ్యాలకు వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసు వేదికైంది. ఉక్రెయిన్‌లోని అపార ఖనిజ నిక్షేపాల్లో అమెరికాకు 50 శాతం వాటా ఇవ్వాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేయడం, బదులుగా రష్యా నుంచి తమ దేశానికి కచి్చతమైన రక్షణ హామీలు కావాలని జెలెన్‌స్కీ కోరడం తెలిసిందే. వాటిపై స్పష్టమైన ఒప్పందాల నిమిత్తం అగ్ర రాజ్యం చేరిన ఆయన శుక్రవారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు.
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులు పాల్గొన్న ఈ భేటీకి మీడియాను అనుమతించడమే గాక ప్రత్యక్ష ప్రసారం కూడా చేయడం విశేషం. భేటీ చాలాసేపటిదాకా ప్రశాంతంగానే సాగినా చివర్లో పూర్తిగా అదుపు తప్పింది. నేతలిద్దరి మాటల యుద్ధంతో రచ్చ రచ్చగా మారింది. చివరికి ఎటూ తేలకుండానే ముగిసింది. భేటీ అనంతరం జరగాల్సిన ట్రంప్, జెలెన్‌స్కీ సంయుక్త మీడియా భేటీ కూడా రద్దయింది! అంతేగాక, ‘జెలెన్‌స్కీ వైట్‌హౌస్ వీడి వెళ్లిపోవచ్చు’ అంటూ మీడియా సమక్షంలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. శాంతి ఒప్పందానికి సిద్ధపడితేనే తిరిగి తమతో చర్చలకు రావాలని సూచించారు. దాంతో ఎన్నో ఆశల నడుమ జెలెన్‌స్కీ చేపట్టిన అమెరికా యాత్ర ఆశించిన ఫలితం రాబట్టకపోగా వికటించిన్నట్టు కనిపిస్తోంది.
అలా మొదలైంది...
రష్యా–ఉక్రెయిన్ వివాదం విషయమై దశాబ్ద కాలంగా అమెరికా వ్యవహరిస్తున్న తీరును ఆక్షేపిస్తున్నట్టుగా జెలెన్‌స్కీ మాట్లాడటంతో పరిస్థితి వేడెక్కింది. అమెరికా మీడియా అంతా చూస్తుండగా అంత అమర్యాదకరంగా మాట్లాడటం సరికాదంటూ వాన్స్ జోక్యం చేసుకున్నా ఆయన వెనక్కు తగ్గలేదు. తమతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ రష్యా 2014 నుంచీ తుంగలో తొక్కుతూ వస్తున్నా అమెరికా సరైన రీతిలో జోక్యం చేసుకోలేదంటూ ఆక్షేపించారు.
అధ్యక్షులు బరాక్ ఒబామా, ట్రంప్, బైడెన్ ఎవరూ తమకు చేయాల్సినంతగా సాయం చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఖనిజ ఒప్పందానికి ప్రతిగా ఉక్రెయిన్ రక్షణకు అమెరికా స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ క్రమంలో, ‘‘యుద్ధంలో అంతులేని నష్టాన్ని చవిచూడాల్సి వస్తే ఎలా ఉంటుందో అమెరికాకు తెలియదు. బహుశా మున్ముందు తెలిసొస్తుందేమో!’’ అన్న జెలెన్‌స్కీ వ్యాఖ్యలతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. ట్రంప్ ఒక్కసారిగా తీవ్ర అసహనానికి లోనయ్యారు. జెలెన్‌స్కీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘‘అలాంటి పరిస్థితి మాకెప్పుడూ రాదు. ఎప్పటికీ తిరుగులేని శక్తిగానే ఉంటాం’’ అంటూ ఆగ్రహంగా బదులిచ్చారు. ‘‘ఉక్రెయిన్‌కు ఇన్నేళ్లుగా అన్నివిధాలా ఆదుకుంటూ వస్తున్నాం. ఈ యుద్ధంలో ఇప్పటికే 350 బిలియన్ డాలర్ల మేర సాయుధ, ఆర్థిక సాయం అందించాం. లేదంటే రష్యాతో యుద్ధం కొనసాగించడం మీ తరమయ్యేదే కాదు. పోరు రెండే వారాల్లో ముగిసిపోయేది’’ అంటూ దుయ్యబట్టారు. అయినా జెలెన్‌స్కీకి మాత్రం కనీస కృతజ్ఞత కూడా లేదంటూ విరుచుకుపడ్డారు. మీడియా ముందే తనతో గొడవకు దిగుతూ అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు. ‘‘అమెరికా దన్ను లేనిదే మీరెందుకూ కొరగారు! మాకు షరతులు విధించే, మమ్మల్ని డిమాండ్ చేసే పరిస్థితిలో అసలే లేరు. అది గుర్తుంచుకోండి’’ అంటూ వేలు చూపిస్తూ మరీ జెలెన్‌స్కీని కటువుగా హెచ్చరించారు.
‘‘మీరు లక్షలాది ప్రాణాలను పణంగా పెడుతున్నారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని తెచ్చిపెట్టేలా ప్రమాదకర జూదం ఆడుతున్నారు’’ అంటూ జెలెన్‌స్కీని ఆక్షేపించారు. మధ్యలో పదేపదే ఆయన భుజంపై కొట్టి మరీ ఆగ్రహం వెలిగక్కారు. రష్యాతో ఏ విషయంలోనూ రాజీ పడేదే లేదన్న జెలెన్‌స్కీ వ్యాఖ్యలను కూడా ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ‘‘పుతిన్ ఒక ఉగ్రవాది. యుద్ధాల్లోనూ నిబంధనలుంటాయి. వాటన్నింటినీ కాలరాసిన పుతిన్ వంటి హంతకునితో ఎలాంటి రాజీ ఉండబోదు’’ అని జెలెన్‌స్కీ అన్నారు.
అలా కుదరదని, యుద్ధానికి తెర దించాలంటే రష్యాతో చాలా విషయాల్లో రాజీ పడాల్సిందేనని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ‘‘ఇలాగైతే మాతో వ్యాపారం కష్టమే. అమెరికాతో ఖనిజ వనరుల ఒప్పందానికి అంగీకరిస్తారా, సరేసరి. లేదంటే మీకూ మాకూ రాంరాం’’ అంటూ తేల్చిపడేశారు. వాగ్వాదం పొడవునా నేతలిరువురూ పదేపదే వాగ్బాణాలు విసురుకున్నారు. కనీసం ఇప్పటికైనా అమెరికా చేస్తున్న దానికి కృతజ్ఞతలు చెప్పండంటూ వాన్స్ కల్పించుకోగా ట్రంప్ వారించారు. ‘‘పర్లేదు. ఈ డ్రామా నాకూ సరదాగానే ఉంది. జరుగుతున్నదేమిటో అమెరికా ప్రజలందరూ చూడాలి’’ అన్నారు.
సాయానికి హామీ ఇవ్వలేం: ట్రంప్ జెలెన్‌స్కీతో భేటీకి ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో సహజ వనరుల ఒప్పందంపై ఆయన, తాను కాసేపట్లో సంతకాలు చేస్తామని ప్రకటించారు. యుద్ధం వీలైనంత త్వరగా ముగియాలన్నదే తన ఉద్దేశమన్నారు. అయితే, ‘‘ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సాయం కొనసాగుతుంది. కాకపోతే ఈ విషయంలో మానుంచి మరీ ఎక్కువగా ఆశించకూడదు’’ అని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కృతనిశ్చయంతో ఉన్నారంటూ మరోసారి ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment