
యూరప్ దేశాల మల్లగుల్లాలు
లండన్‌లో అధినేతల అత్యవసర భేటీ
మూడంచెల వ్యూహం: స్టార్మర్
ఉక్రెయిన్‌కు మరింత ఆర్థిక సాయం
అవసరమైతే సైనిక దన్ను కూడా!
యూరప్ భద్రతపై నేతల ఆందోళనలు
లండన్: అధినేతలు డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ వాగ్యుద్ధంతో అమెరికా, ఉక్రెయిన్ సంబంధాలు అకస్మాత్తుగా దెబ్బతిన్న వైనం యూరప్‌ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వాటిని తిరిగి చక్కదిద్దే మార్గాల కోసం అవి మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు యూరప్ దేశాధినేతలు ఆదివారం లండన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందుకు బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ చొరవ తీసుకున్నారు.
‘సురక్షిత యూరప్ కోసం’ పేరిట జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చంతా అమెరికా, ఉక్రెయిన్ సంబంధాల చుట్టే తిరిగినట్టు సమాచారం. ఉక్రెయిన్‌కు మరిన్ని నిధులు అందించాలని నేతలు నిర్ణయానికి వచ్చారు. అవసరమైతే యూరప్ దేశాలన్నీ తమ సైన్యాన్ని కూడా ఉక్రెయిన్‌కు పంపేందుకు సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ కీలక భేటీలో జెలెన్‌స్కీతో పాటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా పాల్గొన్నారు.
తరానికోసారే!
యూరప్ భద్రత కోసం ఖండంలోని దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరముందని స్టార్మర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇలాంటి అవసరం, అవకాశం తరానికి ఒక్కసారి మాత్రమే వస్తాయని అన్నారు. ‘‘రష్యా బారి నుంచి ఉక్రెయిన్‌కు శాశ్వత రక్షణ కల్పించాలి. యూరప్‌లోని ప్రతి దేశం భద్రతకూ ఇది చాలా కీలకం’’ అని చెప్పారు. ‘‘ఇందుకు మూడంచెల మార్గముంది. ఉక్రెయిన్‌ను సాయుధంగా పటిష్టపరచాలి. దాని భద్రతకు యూరప్ మొత్తం పూచీగా ఉండాలి.
ఇక ఉక్రెయిన్‌తో కుదిరే ఒప్పందాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ మళ్లీ తుంగలో తొక్కకుండా చూసే బాధ్యతను అమెరికా తీసుకోవాలి’’ అని ప్రతిపాదించారు. అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో స్టార్మర్ విడిగా భేటీ అయ్యారు. అందులో జెలెన్‌స్కీ కూడా పాల్గొన్నారు. రష్యా, ఉక్రెయిన్ కాల్పుల విరమణకు నిర్దిష్ట కార్యారణ ప్రణాళిక రూపొందించి అమెరికా ముందుంచాలని వారు నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రయత్నంలో మిగతా యూరప్ దేశాలన్నింటినీ కలుపుకుని వెళ్తామని చెప్పారు. అంతకుముందు ఉక్రెయిన్‌కు 3.1 బిలియన్ డాలర్ల రుణం అందించేందుకు బ్రిటన్ అంగీకరించింది.
ట్రంప్‌తోనూ మాట్లాడా: స్టార్మర్ శిఖరాగ్రం అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. వీలైనంత త్వర లో మరోసారి సమావేశమై అన్ని అంశాలపైనా లోతుగా చర్చించుకోవాలని నిర్ణయించినట్టు స్టార్మర్ వెల్లడించారు. అమెరికా నమ్మదగ్గ భాగస్వామి కాదన్న విమర్శలను తోసిపుచ్చారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం యూరప్ భద్రతకు చాలా కీలకమని పునరుద్ఘాటించారు. ఈ విషయమై ట్రంప్‌తో శనివారం రాత్రి ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడినట్టు వివరించారు. ‘‘యూరప్ ఒకరకంగా నాలుగు రోడ్ల కూడలిలో నిలిచింది. కనుక ప్రతి అడుగూ ఆచితూచి వేయాల్సిన సమయమిది. పరిస్థితులన్నీ పూర్తిగా అదుపు తప్పేందుకు ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం చాలు’’ అని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment