Europe countries
-
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం?
రష్యాపై యూఎస్ తయారీ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్ దాడులు. తీవ్రస్థాయిలో మండిపడుతున్న రష్యా. దీన్ని అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణిస్తామని ప్రకటన. అణు దాడితో దీటుగా బదులిచ్చేందుకు వీలుగా రష్యా అణు విధానాన్ని సవరిస్తూ అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం. ‘ఏ క్షణాన్నయినా అణు యుద్ధం ముంచుకు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి’ అంటూ ప్రజలకు యూరప్ దేశాల ‘వార్ గైడ్‌లైన్స్’. సోమవారం ఒక్క రోజే శరవేగంగా జరిగిన తీవ్ర ఆందోళనకర పరిణామాలివి! ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి తెర తీసి సరిగ్గా 1,000 రోజులు పూర్తయిన నాడే చోటుచేసుకున్న ఈ తీవ్ర పరిణామాలు గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే నాల్కలు చాస్తున్న యుద్ధ జ్వాలలు మరింతగా విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న ఆందోళనలు సర్వత్రా తలెత్తుతున్నాయి.అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ విజయంతో ఉక్రెయిన్ యుద్ధానికి తెర పడుతుందని, పశ్చిమాసియా కల్లోలమూ కాస్త అదుపులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇందుకు బీజం పడింది. అమెరికా అందజేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాలో సుదూర లక్ష్యాలపై దాడుల నిమిత్తం వాడేందుకు ఉక్రెయిన్‌కు ఆయన అనుమతివ్వడం ఒక్కసారిగా ఉద్రిక్తతలను రాజేసింది. దీన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఉక్రెయిన్ మంగళవారమే రష్యాపై యూఎస్ దీర్ఘశ్రేణి ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టం (ఏటీఏసీఎంస్) బాలిస్టిక్ క్షిపణులను ఎడాపెడా ప్రయోగించింది. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతమే లక్ష్యంగా దాడులకు దిగింది. ఈ క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి. అలాంటి చర్యలకు దిగితే తీవ్రస్థాయి ప్రతిస్పందన తప్పదని ఇప్పటికే హెచ్చరించిన రష్యా ఈ పరిణామంపై భగ్గుమంది. తమ భూభాగాలపైకి కనీసం ఆరు అమెరికా తయారీ ఏటీఏసీఎంఎస్ క్షిపణులు వచ్చి పడ్డాయని ధ్రువీకరించింది. వాటిలో ఐదింటిని కూల్చేయడంతో పాటు ఆరో దాన్నీ ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా అణు దాడులు! తాజా పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడుతున్నారు. మంగళవారం ఆయన రక్షణ తదితర శాఖల అత్యున్నత స్థాయి అధికారులతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ క్షిపణి దాడులను అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణించాలని నిర్ణయించారు. అందుకు వీలు కలి్పంచేలా దేశ అణు విధానానికి సవరణ కూడా చేశారు! దాని ప్రకారం సంప్రదాయ ఆయుధాలతో రష్యాపై జరిగే దాడికి ఏ అణ్వాయుధ దేశమైనా మద్దతిస్తే దాన్ని ఆ రెండు దేశాల సంయుక్త దాడిగానే పరిగణిస్తారు. సదరు దేశాలపై అణు దాడులకు దిగుతారా అన్నదానిపై సవరణలో స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే రష్యాపై భారీ స్థాయి వైమానిక, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణి దాడులు జరిగితే అణ్వాయుధాలతో బదులిచ్చేందుకు అది వీలు కలి్పస్తుండటం విశేషం! అంతేగాక మిత్ర దేశమైన బెలారస్‌పై దుందుడుకు చర్యలకు దిగినా అణ్వాయుధాలతో బదులు చెప్పేందుకు తాజా సవరణ అనుమతించనుంది! ఉక్రెయిన్‌కు మరింత సాయం చేయకుండా యూరప్ దేశాలను నియంత్రించడంతో పాటు అవసరమైతే దానిపై అణ్వాయుధ ప్రయోగానికి, అమెరికాపై సైనిక చర్యకు కూడా దిగడం పుతిన్ తాజా నిర్ణయాల ఉద్దేశమని భావిస్తున్నారు. అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులతో ఉక్రెయిన్ చేసిన తాజా దాడులకు బదులుగానే అణు విధాన సవరణ జరిగిందా అన్న ప్రశ్నకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ నేరుగా బదులివ్వలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా అణు విధానాన్ని అప్డేట్ చేయాల్సిందిగా పుతిన్ ఆదేశించారంటూ నర్మగర్భంగా స్పందించారు. ఇటీవలి కాలంలో రష్యా అణు విధానానికి పుతిన్ సవరణ చేయడం ఇది రెండోసారి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా సైన్యం కూడా ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొంటుండటం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అమెరికా ఇప్పటికే ప్రకటించింది. దీర్ఘశ్రేణి క్షిపణుల వాడకానికి అనుమతి దాని పర్యవసానమేనంటున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ జ్వాలలు త్వరలో కొరియా ద్వీపకల్పం దాకా విస్తరించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బైడెన్ మతిలేని విధానాలతో ట్రంప్ పగ్గాలు చేపట్టే నాటికే ప్రపంచాన్ని పెనుయుద్ధం ముంగిట నిలిపేలా ఉన్నారని ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్ మండిపడటం తెలిసిందే.నిత్యావసరాలు నిల్వ చేసుకోండితాజా పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కన్పిస్తుండటంతో యూరప్ దేశాలు భీతిల్లుతున్నాయి. అలాంటి పరిస్థితే తలెత్తితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ స్వీడన్, ఫిన్లండ్, నార్వే, డెన్మార్క్ తదితర నాటో సభ్య దేశాలు తమ పౌరులను హెచ్చరించడం విశేషం. ‘‘ఏ క్షణంలోనైనా అణు యుద్ధం ముంచుకు రావచ్చు. సిద్ధంగా ఉండండి’’ అంటూ స్వీడన్ ఏకంగా ఇంటింటికీ కరపత్రాలే పంచుతోంది. ‘సంక్షోభమో, యుద్ధమో వస్తే...’ అనే శీర్షికతో కూడిన 52 లక్షల కరపత్రాలను సోమవారం నుంచి వారం పాటు పంచనుంది! అది నిజానికి 32 పేజీలతో కూడిన డాక్యుమెంట్. ‘‘మనపై ఎవరైనా దాడికి తెగబడితే దేశ స్వాతంత్య్ర పరిరక్షణకు అందరమూ ఒక్కటవుదాం’’ అని అందులో పౌరులకు స్వీడన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. దాంతోపాటు, ‘‘పిల్లల డైపర్లు, బేబీ ఫుడ్, దీర్ఘకాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు, మంచినీరు తదితరాలన్నింటినీ వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’’ అని సూచించింది. అంతేగాక బాంబు దాడులు జరిగితే వాటిబారి నుంచి ఎలా తప్పించుకోవాలి, గాయపడితే రక్తస్రావాన్ని నిరోధించేందుకు, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి, యుద్ధ బీభత్సం చూసి భీతిల్లే చిన్నారులను ఎలా సముదాయించాలి వంటి వివరాలెన్నో పొందుపరిచింది.‘‘పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వీడన్ ఇలాంటి చర్యకు దిగడం ఇది ఐదోసారి. నార్వే కూడా ఇలాంటి ‘యుద్ధ’ జాగ్రత్తలతో ప్రజలకు ఎమర్జెన్సీ పాంప్లెంట్లు పంచుతోంది. ‘పూర్తిస్థాయి యుద్ధంతో పాటు ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే వారం దాకా ఇల్లు కదలకుండా గడిపేందుకు సిద్ధపడండి’ అంటూ అప్రమత్తం చేస్తోంది. డెన్మార్క్ కూడా కనీసం మూడు రోజులకు పైగా సరిపడా సరుకులు, మంచినీరు, ఔషధాలు తదితరాలు నిల్వ ఉంచుకోవాలంటూ తన పౌరులందరికీ ఇప్పటికే ఈ–మెయిళ్లు పంపింది! ఫిన్లండ్ కూడా అదే బాట పట్టింది. ‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండండి. నిత్యావసరాలను వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’ అంటూ తన పౌరులకు ఆన్లైన్ బ్రోషర్లు పంపింది.అపారంగా అణ్వాయుధాలు రష్యా వద్ద వేలాదిగా అణ్వాయుధాలు పోగు పడి ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో అణు వార్హెడ్లున్న దేశం రష్యానే. 1994లో సోవియట్ నుంచి విడిపోయేనాటికి ఉక్రెయిన్ వద్ద కూడా భారీగానే అణ్వాయుధాలుండేవి. ఆ జాబితాలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశంగా ఉక్రెయిన్ ఉండేది. కానీ రష్యాతో ఒప్పందంలో భాగంగా తన అణ్వాయుధాలన్నింటినీ నాశనం చేసింది. కాకపోతే అమెరికాతో పాటు అణు సంపత్తి ఉన్న పలు దేశాలు ఉక్రెయిన్‌కు దన్నుగా ఉన్నాయి.క్షిపణులే మాట్లాడతాయి భారీ క్షిపణి దాడులకు మాకు అనుమతి లభించిందంటూ మీడియా ఏదేదో చెబుతోంది. కానీ దాడులు జరిగేది మాటలతో కాదు. వాటిని ముందుగా చెప్పి చేయరు. ఇక మా తరఫున క్షిపణులే మాట్లాడతాయి. – ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
మైక్రోసాఫ్ట్‌పై గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’!
ప్రపంచంలోనే టాప్ టెక్ దిగ్గజ కంపెనీలుగా పేరున్న మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. యూరప్‌లో క్లౌడ్ సర్వీసులకు సంబంధించి మైక్రోసాఫ్ట్ అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ గూగుల్ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనికి బదులుగా మైక్రోసాఫ్ట్ అదే రీతిలో స్పందించింది. గూగుల్ తమ సంస్థపై ‘షాడో క్యాంపెయిన్’ నడుపుతోందని మైక్రోసాఫ్ట్ ఘాటుగా రిప్లై ఇచ్చింది.యూరప్‌లో మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్ సేవలను విస్తరించాలని భావిస్తోంది. సంస్థ సరైన రీతిలో నిబంధనలు అనుసరించడం లేదంటూ ఇటీవల యూరోపియన్ యూనియన్ రిగ్యులేటర్లకు గూగుల్ యాంటీ ట్రస్ట్ ఫిర్యాదు అందించింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్ లైసెన్స్‌కు సంబంధించి నిబంధనలు అమలు చేయడం లేదని పేర్కొంది. ఇదిలాఉండగా, యూరప్‌లో యూరోపియన్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ల గ్రూప్(సీఐఎస్పీఈ)తో కలిసి గూగుల్ తమ కంపెనీపై ఆరోపణలు చేయిస్తోందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ వ్యవహారంపై సీఐఎస్పీఈతో జులైలోనే చర్చలు జరిపామని చెప్పింది. దీన్నిసైతం అడ్డుకునేందుకు గూగుల్ ప్రయత్నించిందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.ఇదీ చదవండి: బంగారం కొనేవారికి బెస్ట్ ఆఫర్ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ డిప్యూటీ జనరల్ కౌన్సెల్ రిమా అలైలీ తన బ్లాగ్‌లో కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్‌ను అణగదొక్కేందుకు గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’ను అమలు చేస్తుంది. అజూర్‌ను సర్వీసులను కించపరిచేలా కొత్త లాబీయింగ్ గ్రూప్‌ను ప్రారంభించేందుకు గూగుల్ సిద్ధమైంది. ఈ గ్రూప్ వచ్చే వారంలో ఏర్పాటు కాబోతుంది’ అని అన్నారు. -
Russia-Ukraine war: లండన్, పారిస్, రోమ్, బెర్లిన్..!
లండన్: ఒక వైపు రష్యా సేనల ఆక్రమణ పర్వం కొనసాగుతుండటం, మరో వైపు వచ్చే నెలలో అమెరికాలో జరిగే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే మద్దతు దూర మవుతుందనే భయాల నడుమ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూరప్ దేశాల్లో సుడి గాలి పర్యటన చేపట్టారు. 48 గంటల వ్యవధి లోనే లండన్, పారిస్, రోమ్, బెర్లిన్లను చు ట్టేశారు. తన వద్ద ఉన్న ‘విక్టరీ ప్లాన్’పై బ్రిట న్ ప్రధాని స్టార్మర్ సహా ఆయా దేశాధినే తలకు వివరించారు. మిత్ర దేశాల నుంచి అందే దీర్ఘ శ్రేణి క్షిపణులతో రష్యాలోని సు దూరంలో ఉండే మిలటరీ లక్ష్యాలకు నష్టం కలిగించడం.. తద్వారా యుద్ధానికి ముగింపు పలికేలా రష్యాను ఇరుకునపెట్టడం జెలెన్స్కీ ‘విక్టరీ ప్లాన్’లక్ష్యం. అయితే, బ్రిటన్ మాత్రమే తన వద్ద ఉన్న స్టార్మ్ షాడో దీర్ఘ శ్రేణి క్షిపణులను అందజేయడానికి సంసిద్ధత తెలిపింది. అమెరికా, జర్మనీ సహా ఇతర మి త్ర దేశాలు మాత్రం లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ఉక్రెయిన్‌కు ఇవ్వడమంటే రష్యాతో ముఖా ముఖి యుద్ధానికి దిగడమనే అభిప్రాయంతో వెనుకంజ వేస్తున్నాయి. కేవలం ఒకే ఒక్క ఆయుధంతో యుద్ధంలో గెలుపును సొంతం చేసుకోవడం ఇప్పటివరకు జరగలేదని కూడా బ్రిటన్ అధికారులు అంటున్నారు. దీర్ఘ శ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు సమకూర్చడంపై చర్చించామని నాటో చీఫ్ మార్క్ రుట్ వెల్లడించారు. అయితే, అంతిమ నిర్ణయాన్ని ఆయా సభ్యదేశాలకే వదిలివేశామన్నారు. దీంతోపాటు, శనివారం బెర్లిన్‌లో జరగాల్సిన ఉక్రెయిన్ మిత్రదేశాల సమావేశం వాయిదా పడింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వదేశంలో మిల్టన్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఈ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. -
రెండు సార్లు ప్రపంచకప్ గెలిచినా, ఇంగ్లండ్‌కు ఆ కల తీరడం లేదు..!
టీ20 వరల్డ్‌కప్‌ల్లో తమ ఖండానికి (యూరప్) చెందిన జట్లపై విజయం సాధించడం ఢిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు తీరని కలగా మిగిలిపోయింది. ఇంగ్లండ్ ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్ పోటీల్లో సొంత ఖండానికి చెందిన జట్లపై ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోయింది. పొట్టి ప్రపంచకప్‌లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్.. సొంత ఖండానికి చెందిన జట్లైన నెదర్లాండ్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లను ఇప్పటివరకు నాలుగు సందర్భాల్లో ఎదుర్కొంది.ఇందులో మూడింట ఊహించని పరాజయాలు ఎదుర్కోగా.. ఓ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. 2009, 2014 ఎడిషన్లలో నెదర్లాండ్స్ చేతిలో పరాభావాలు ఎదుర్కొన్న ఇంగ్లండ్.. 2022 ఎడిషన్‌లో ఐర్లాండ్ చేతిలో చావుదెబ్బ తింది. తాజాగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ నిన్న సహచర యూరప్ జట్టైన స్కాట్లాండ్తో తలపడింది.ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ప్రపంచకప్‌లో సొంత ఖండానికి చెందిన జట్టుపై గెలవాలన్న ఇంగ్లండ్ కల కలగానే మిగిలిపోయింది. యూరోపియన్ దేశాల్లో టెస్ట్ హోదా కలిగిన ఎకైక దేశమైన ఇంగ్లండ్ సొంత ఖండ జట్లు, క్రికెట్ పసికూనలపై ఇప్పటివరకు ఒక్క విజయం సాధించలేకపోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.కాగా, టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఇంగ్లండ్- స్కాట్లాండ్ మధ్య నిన్న జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్‌కు ముందే వర్షం ప్రారంభం కావడంతో టాస్ ఆలస్యంగా పడింది. టాస్ గెలిచిన స్కాట్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఈ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దయ్యే సమయానికి జార్జ్ మున్సే (41), మైఖేల్ జోన్స్ (45) క్రీజ్‌లో ఉన్నారు. -
Farmers movement: యూరప్‌లోనూ రోడ్డెక్కిన రైతు
సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. భారత్‌లో కాదు, యూరప్‌లో! అవును. రైతుల నిరసనలు, ఆందోళనలతో కొద్ది వారాలుగా యూరప్ దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రెండేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాల్లో అసలే జీవనవ్యయం ఊహించనంతగా పెరిగిపోయింది. దీనికి తోడు గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో కొద్ది నెలలుగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇవి చాలవన్నట్టు సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. పన్నుల భారం మోయలేనంతగా మారింది. ఇలాంటి అనేకానేక సమస్యలు యూరప్ వ్యాప్తంగా రైతులను కుంగదీస్తున్నాయి. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలే సమస్యకు ప్రధాన కారణమంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. ఉక్రెయిన్ను కాపాడే ప్రయత్నంలో తమ ఉసురు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు. పరిష్కారం కోసం ప్రాధేయపడ్డా ఫలితం లేకపోవడంతో పలు దేశాల్లో రైతులు వేలాదిగా ఆందోళన బాట పట్టారు. ఏకంగా వేల కొద్దీ ట్రక్కులు, ట్రాక్టర్లతో రోడ్లెక్కుతున్నారు. పట్టణాలు, రాజధానులను దిగ్బంధిస్తున్నారు. నడిరోడ్లపై టైర్లను, గడ్డిమోపులను కాలబెడుతున్నారు. ప్రభుత్వాల తీరు తమ పొట్ట కొడుతోందంటూ నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కొద్ది వారాలుగా పారిస్, బెర్లిన్ మొదలుకుని ఏ నగరంలో చూసినా, ఏ ఐరోపా దేశంలో చూసినా ఇవే దృశ్యాలు!! ఫిబ్రవరి 1న రైతులు ఏకంగా యూరోపియన్ పార్లమెంటు భవనంపైకి గుడ్లు విసరడం, రాళ్లు రువ్వారు! పలు దేశాల్లో పరిస్థితులు రైతుల అరెస్టుల దాకా వెళ్తున్నాయి... రైతుల సమస్యలు ఇవీ... ► యూరప్ దేశాలన్నింట్లోనూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది గిట్టుబాటు ధర లేమి. ► దీనికి తోడు ఏడాదిగా వారిపై పన్నుల భారం బాగా పెరిగిపోయింది. ఆకాశాన్నంటుతున్న పంట బీమా ప్రీమియాలు దీనికి తోడయ్యాయి. ► విదేశాల నుంచి, ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి చౌకగా దిగుమతవుతున్న ఆహారోత్పత్తులతో వారి ఉత్పత్తులకు గిరాకీ పడిపోతోంది. ► దక్షిణ అమెరికా దేశాల నుంచి చక్కెర, ఆహార ధాన్యాలతో పాటు మాంసం తదితరాల దిగుమతిని మరింతగా పెంచుకునేందుకు ఈయూ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ► అధికారుల అవినీతి, సకాలంలో సాయం చేయడంలో అలసత్వం మరింత సమస్యగా మారుతోంది. ► ఈయూ విధిస్తున్న పర్యావరణ నిబంధనలు మరీ శ్రుతి మించుతున్నాయన్న భావన అన్ని దేశాల రైతుల్లోనూ నెలకొంది. ► పర్యావరణ పరిరక్షణకు ప్రతి రైతూ 4 శాతం సాగు భూమిని నిరీ్ణత కాలం ఖాళీగా వదిలేయాలన్న నిబంధనను యూరప్ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి. ► పైగా పలు దేశాలు ఏటా పంట మారి్పడినీ తప్పనిసరి చేశాయి. రసాయన ఎరువుల వాడకాన్ని 20 శాతం తగ్గించాలంటూ రైతులపై ఒత్తిడి తీవ్రతరమవుతోంది. ► సాగు అవసరాలకు వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీ ఎత్తేయాలన్న నిర్ణయం. దీంతో సాగు వ్యయం విపరీతంగా పెరుగుతోందంటూ చాలా యూరప్ దేశాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా యూరప్‌లో అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులైన జర్మనీ, ఫ్రాన్స్ రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ► పోర్చుగల్ నుంచి చౌకగా వచ్చి పడుతున్న వ్యవసాయోత్పత్తులు తమ పుట్టి ముంచుతున్నాయంటూ స్పెయిన్ రైతులు వాపోతున్నారు. ► నిధుల లేమి కారణంగా ఈయూ సబ్సిడీలు సకాలంలో అందకపోవడం రైతులకు మరింత సమస్యగా మారింది. ఇవీ డిమాండ్లు... ► ఆహారోత్పత్తుల దిగుమతులకు ఈయూ అడ్డుకట్ట వేయాలి. ► ఉక్రెయిన్ ఆహారోత్పత్తులను ప్రధానంగా ఆసియా దేశాలకు మళ్లించేలా చూడాలి. ► ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి పౌల్ట్రీ, గుడ్లు, చక్కెర దిగుమతులను నిలిపేయాలి. ► సాగుపై ప్రభుత్వపరంగా పన్నుల భారాన్ని తగ్గించాలి. ► 4% భూమిని ఖాళీగా వదలాలన్న నిబంధనను ఎత్తేయాలి. ► పలు పర్యావరణ నిబంధనలను వీలైనంతగా సడలించాలి. ► పెట్రోల్, డీజిల్‌పై సాగు సబ్సిడీలను కొనసాగించాలి. ఆందోళనలు ఏయే దేశాల్లో... జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, పోలండ్, స్పెయిన్, రొమేనియా, గ్రీస్, పోర్చుగల్, హంగరీ, స్లొవేకియా, లిథువేనియా, బల్గేరియా – సాక్షి, నేషనల్ డెస్క్ -
Global Warming: భూమిని వేడెక్కిస్తున్న పాపం... పెద్ద దేశాలదే!
గ్లోబల్ వార్మింగ్. కొన్ని దశాబ్దాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య. దీని దెబ్బకు భూగోళపు సగటు ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. అవి ఇంకో అర డిగ్రీ మేరకు పెరిగినా సర్వ వినాశనం జరిగే పరిస్థితి! ప్రాణికోటి మనుగడకే పెను ముప్పు! ఈ ప్రమాదం ఎంతో దూరం కూడా లేదని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించింది. అయినా పరిస్థితిలో పెద్దగా మెరుగుదల లేదు. ముఖ్యంగా గ్లోబల్ వార్మంగ్‌కు ప్రధాన కారణమైన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు ఏటికేడు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అంతర్జాతీయ పర్యావరణ సదస్సుల్లో దీనిపై ఎంతగా ఆందోళన వ్యక్తమవుతున్నా అది మాటలకే పరిమితమవుతోంది. ఉద్గారాలకు ముకుతాడు వేస్తామన్న సంపన్న దేశాల వాగ్దానాలు నీటిమూటలే అవుతున్నాయి. తరచి చూస్తే, గ్రీన్‌హౌస్‌వాయు ఉద్గారాల్లో సింహ భాగం పెద్ద దేశాలదే. మాటలే తప్ప చేతల్లేవు 2022లో ప్రపంచ దేశాలన్నీ కలిపి విడుదల చేసిన గ్రీన్హౌస్ వాయువుల పరిమాణమెంతో తెలుసా? ఏకంగా 5,000 కోట్ల మెట్రిక్ టన్నులు! పర్యావరణ కాలుష్య కారకాల్లో అతి ముఖ్యమైనవి గ్రీన్హౌస్ ఉద్గారాలే. భూగోళాన్ని వేడెక్కించడంలో కూడా వీటిదే ప్రధాన పాత్ర. ఇంతటి ప్రమాదకరమైన సమస్య విషయంలో మన నిర్లిప్త వైఖరికి ఏత ఏడాది గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాల పరిమాణం మరో తాజా ఉదాహరణ మాత్రమే. ఈ పాపంలో సంపన్న దేశాల పాత్రే ఎక్కువ. చైనా విషయమే తీసుకుంటే, గతేడాది ప్రపంచ గ్రీన్హౌస్ ఉద్గారాల్లో ఆ ఒక్క దేశం వాటాయే ఏకంగా 30 శాతం! 2022లో అది 1,440 కోట్ల టన్నుల మేరకు కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేసిన చెత్త రికార్డును మూటగట్టుకుంది. కొన్ని దశాబ్దాలుగా చైనా పారిశ్రామిక వ్యవస్థ ప్రధానంగా బొగ్గుపై ఆధారపడటమే ఇందుకు ప్రధాన కారణం. ఇక 639 కోట్ల టన్నులతో అమెరికా రెండో స్థానంలో ఉంది. 343 కోట్ల టన్నులతో యూరోపియన్ యూనియన్(ఈయూ) నాలుగో స్థానంలో ఉంది. గణాంకాలపరంగా 352 కోట్ల టన్నులతో ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్టు కనిపించినా జనాభాను బట్టి చూస్తే కర్బన ఉద్గారాల పాపంలో మన వాటా నిజానికి చాలా తక్కువ. మన తలసరి వార్షిక కర్బన ఉద్గారాలు కేవలం 2.5 టన్నులు! ప్రపంచ వేదికలపై పెద్ద మాటలు చెప్పే అమెరికాదే ఈ పాపంలో అగ్ర స్థానం! ఒక్కో అమెరికన్ ఏటా సగటున 19 టన్నుల సీఓటూ ఉద్గారాలకు కారకుడవుతున్నాడు. కేవలం 2.5 కోట్ల జనాభా ఉన్న ఆ్రస్టేలియాలో తలసరి కర్బన ఉద్గారాలు 20 టన్నులు, 3.8 కోట్ల జనాభా ఉన్న కెనడాలో 18 టన్నులు, 14 కోట్ల జనాభా ఉన్న రష్యాలో 14 టన్నులు! 20.7 టన్నుల తలసరి ఉద్గారాలతో సౌదీ అరేబియా ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉండటం విశేషం. మొత్తమ్మీద ప్రపంచ కర్బన ఉద్గారాల్లో చైనా, అమెరికా, ఈయూ వాటాయే దాదాపు సగం! వీటిలోనూ చారిత్రకంగా చూసుకుంటే అమెరికా, ఈయూ రెండే ప్రపంచ కాలుష్యానికి ప్రధాన కారకులుగా ఉంటూ వస్తున్నాయి. వేడెక్కుతున్న భూమి భూగోళపు ఉష్ణోగ్రత పారిశ్రామికీకరణకు ముందు నాటితో గత 150 ఏళ్లలో 1.5 డిగ్రీలకు మించి పెరిగిపోయింది! ఇటీవల ఒకానొక దశలో అది 2 డిగ్రీలకు మించి కలవరపరిచింది కూడా. దాన్ని 1.5 డిగ్రీలకు మించకుండా కట్టడి చేయాలన్న పారిస్ ఒప్పందానికి ప్రపంచ దేశాలన్నీ పేరుకు అంగీకరించాయే తప్ప ఆచరణలో చేస్తున్నది పెద్దగా కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచం ఇప్పుడు ఏ క్షణమైనా పేలనున్న మందుపాతర మీద ఉందని ఐక్యరాజ్యసమితి తాజాగా ఆందోళన వెలిబుచి్చంది. కర్బన ఉద్గారాల ప్రవాహం ఇలాగే కొనసాగి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ పోతే ప్రపంచ దేశాలన్నీ ఎలాగోలా ప్రస్తుత పర్యావరణ లక్ష్యాలను చేరుకున్నా భూమి 2 డిగ్రీలను మించి వేడెక్కడం ఖాయమని హెచ్చరించింది. అప్పుడు కనీవినీ ఎరగని ఉత్పాతాలను, ఘోరాలను నిత్యం కళ్లజూడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఇంతటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్‌లో అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కాప్–28 జరుగుతోంది. అందులోనైనా కర్బన ఉద్గారాలకు కళ్లెం వేసి భూగోళాన్ని కాపాడుకునే దిశగా ఏమైనా నిర్ణయాత్మకమైన అడుగులు పడతాయేమో చూడాలి. ఏమిటీ కర్బన ఉద్గారాలు? బొగ్గు, చమురు, గ్యాస్‌ను మండించినప్పుడు అవి వాతావరణంలోకి భారీ పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. అది కొన్ని వందల ఏళ్లపాటు వాతావరణంలోనే ఉండిపోయి భూమిని వేడెక్కిస్తూ ఉంటుంది. ‘‘ఆ లెక్కన భూమికి ముప్పు కేవలం 2022 తాలూకు కర్బన ఉద్గారాలు మాత్రమే కాదు. పారిశ్రామికీకరణ ఊపందుకున్నాక గత 150 ఏళ్లలో విడుదలైన కర్బన ఉద్గారాలన్నీ ఇప్పటికీ భూమిని వేడెక్కిస్తూనే ఉన్నాయి. ఆ లెక్కన ఈ 150 ఏళ్లలో అత్యధిక కర్బన ఉద్గారాలకు కారణమైన అమెరికాదే గ్లోబల్ వార్మింగ్‌లో ప్రధాన పాత్ర అని చెప్పాల్సి ఉంటుంది’’ అని బ్రిటన్‌లోని ఎక్స్టర్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త పియరీ ఫ్రెడ్లింగ్‌స్టెయిన్ కుండబద్దలు కొట్టారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
Europe : వలసల వలలో యూరప్
యూరప్ ను వలసలు చుట్టుముట్టేస్తున్నాయి. ఈ ఖండంలోని చాలా దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. అల్లర్లు,నేరాలు,ఘోరాలు,అశాంతి ఆ దేశాలను అల్లకల్లోలం చేస్తున్నాయి.వీటికి పరిష్కారం లభించకపోగా,మరింత రగిలే ప్రమాదఘంటికలే వినిపిస్తున్నాయి. వలసలు ఏ ఖండానికి,ఏ దేశానికి కొత్తకాదు.ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చినవారితోనూ, సక్రమంగా వలస వచ్చినవారితోనూ సమస్యలు పెరుగుతూనే వున్నాయి.భారతదేశం కూడా అందుకు మినహాయింపు కాదు. వలసలతో అశాంతి ప్రస్తుత అంశం యూరప్ విషయానికి వస్తే, వలసలు ప్రబలి,రోజుకొకరకమైన దుర్వార్త అక్కడి నుంచి వినాల్సివస్తోంది.ఇప్పటికే ఫ్రాన్స్ లో అల్లర్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. నెదర్లాండ్ లో ప్రభుత్వమే కూలిపోయింది.స్వీడన్ లో ఘర్షణలు లేని రోజంటూ లేదు. స్విట్జర్లాండ్ లో అశాంతి రాజ్యమేలుతోంది. బెల్జియం,జర్ననీలో అల్లర్లు,నేరాలుఘోరాలకు అదుపే లేదు.మానవతా దృక్పధంతో శరణు ఇచ్చినందుకు యూరప్ మొత్తం మూల్యం చెల్లించాల్సి వస్తోంది.శరణుకోరి ఆయా దేశాలలో ప్రవేశించినవారి సంఖ్య కోట్లకు చేరుకుంది.వీరంతా మిగిలిన సామాజిక సమస్యలను సృష్టించడమే గాక,రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు.ప్రభుత్వాల మనుగడే ప్రశ్నార్ధకమవుతోంది. శరణార్థుల దారి యూరపే.! యుద్ధాలు, అంతర్యుద్ధాల కారణంతో యుగొస్లావియా, ఉక్రెయిన్,సిరియా,ఆఫ్ఘనిస్థాన్ మొదలైన దేశాలలో బాధపడేవారు యూరప్ దేశాల వైపు వస్తున్నారు. అతి ప్రమాదకరమైన విధానాల్లో సముద్ర ప్రయాణాలు చేస్తూ, కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.ముఖ్యంగా 2015లో వలసలు పెద్దఎత్తున పోటెత్తాయి.ఆ సంవత్సరాన్ని 'వలసల సంవత్సరం'గా అభివర్ణించారు.2007-2011మధ్య కూడా వలసలు పెద్ద సంఖ్యలోనే జరిగాయి.ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం పెరగడం కూడా వలసలపైన కీలక ప్రభావం చూపించింది, ఇంకా చూపిస్తూనే వుంది. లక్షల మంది వలస 2022నాటికి వలస వచ్చిన జనాభా చూస్తే, జర్మనీలో 10.9మిలియన్లు, స్పెయిన్ లో 5.4మిలియన్లు, ఫ్రాన్స్ లో 5.3మిలియన్లు,ఇటలీలో 5మిలియన్లు ఉన్నట్లు సమాచారం. ఒక్క 2022లోనే యూరోపియన్ యూనియన్ లో ఆశ్రమం కోరిన వారి సంఖ్య 6,32,430.అందులో ఆమోదం పొందిన వారి సంఖ్య 3.10 లక్షలు.ఇన్నేళ్ల పాటు వచ్చినవారు,వస్తున్నవారిలో అధికారికంగా కంటే అనధికారికంగా వచ్చిన వారి సంఖ్య అంచనాలకు మించి వుంటుంది. లక్షల్లో వలసవస్తున్న వీరిని కొన్ని దేశాలు అడ్డుకుంటున్నాయి. జర్మనీ వంటికొన్ని దేశాలు మాత్రం ఆదుకుంటున్నాయి. నాటి పాపం నేడు అనుభవిస్తున్నారు పశ్చిమాసియా, దక్షిణాసియా, ఆఫ్రికా నుంచి పెద్దసంఖ్యలో వలసలు జరిగాయి. అరబ్ విప్లవం తర్వాత టునీసియా, లిబియా,ఈజిప్ట్,యెమెన్, అల్జీరియా వంటి దేశాల నుంచి వలసలు వెల్లువెత్తాయి. చట్టవిరుద్ధంగా ప్రవేశించినవారిలో ఎక్కువమంది గ్రీస్ ద్వారా వెళ్లినట్లు తెలుస్తోంది.వలసల ప్రభావం ఆర్ధిక, సామాజిక,రాజకీయ వ్యవస్థలపై పడుతోంది.నివాసం,ఉపాధి కల్పించడం ప్రభుత్వాలకు పెనుసమస్యగా మారింది. వివిధ సమాజాల మధ్య సాంస్కృతిక ప్రయాణం పెద్దసవాల్ విసురుతోంది. ప్రస్తుతం యూరప్ లో ప్రముఖంగా కనిపిస్తున్న ఈ జాఢ్యం మిగిలిన ఖండాలలోనూ రేపోమాపో శృతిమించకపోదు. సున్నితం.. కీలకం భిన్న సంస్కృతులకు, మతాలకు నిలయమై,అనేక దాడులకు ఆలవాలమై,ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా అవతరిస్తున్న భారతదేశం వలసల విషయంలో,ముఖ్యంగా మిగిలిన దేశాల నుంచి అక్రమంగా చొరబడిన వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూరప్ వలసల అంశంపై ప్రపంచ దేశాధినేతలు దృష్టి పెట్టాలి. ఆయా దేశాల అంతర్గత సమస్యలను అరికట్టడంలోనూ, మతోన్మాద ఉగ్రవాదం ప్రబలకుండా చూడడంలోనూ అందరూ కలిసి సాగాలి.యూరప్ అనుభవాలు మిగిలిన ఖండాలకు పెద్దగుణపాఠం కావాలి. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
G20 Summit: ఢిల్లీలో మూడ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ ఆధ్యక్షతన సెప్టెంబర్ 8-10 వరకు జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ ఆతిధ్యమివ్వనున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు ఢిల్లీ ట్రాఫిక్ విభాగం కమీషనర్ ఎస్ఎస్ యాదవ్. ఐరోపా దేశాల తోపాటు 19 ఇతర దేశాలు పాల్గొనే ఈ సదస్సుకు ఈసారి భారతదేశం ఆతిధ్యమివ్వనుంది. ఢిల్లీ వేదికగా భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్ 8-10 వరకు జరిగే ఈ సమావేశాలకు ఆయా దేశాల ప్రతినిధులు హాజరుకానున్న నేపధ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపుల తోపాటు కొన్ని టాఫిక్ ఆంక్షలు కూడా విధించనున్నట్లు తెలిపారు ఢిల్లీ ట్రాఫిక్ కమీషనర్ ఎస్ఎస్ యాదవ్. दिल्ली में लागू होंगे कई नियम G-20 समिट को लेकर ट्रैफिक पुलिस ने बनाया वर्चुअल हेल्पडेस्क मेट्रो में कोई बदलाव या रोक-टोक नहीं होगी 7 सितंबर की रात से कमर्शियल व्हीकल की एंट्री बंद एयरपोर्ट जाने के लिए करें मेट्रो का इस्तेमाल #G20Summit #G20India2023 #DelhiNews pic.twitter.com/oNqgtClm2v — NiwanTimes (@NiwanTimesInd) August 25, 2023 యాదవ్ మాట్లాడుతూ ఈ ఆంక్షలు సెప్టెంబర్ 7 సాయంత్రం మొదలై సెప్టెంబర్ 10 వరకు కొనసాగుతాయని ఢిల్లీ వాస్తవ్యులైతే పర్వాలేదు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారైతే తప్పక తమ హోటల్ బుకింగ్ సమాచారాన్ని చూపించాల్సి ఉంటుందని అన్నారు. రవాణాకు సంబంధించి అంబులెన్స్ లాంటి అత్యవసర వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవు కానీ కార్గో ట్రక్కులను, నగరం బయటే నిలిపివేస్తామని, డీటీసీ సేవలు కూడా అందుబాటులో ఉండవని.. మెట్రో సేవలు మాత్రమే అందుబాటులోనే ఉంటాయని ప్రయాణికులు మెట్రో ద్వారా ప్రయాణించాలని కోరారు. ఈ మూడు రోజులు ప్రజలు రద్దీగా ఉండే మార్కెట్లకు వెళ్లవద్దనీ ఏమి కావాలన్నా ముందే తెచ్చి పెట్టుకోవాలని అన్నారు. STORY | Road travel to IGI Airport will be affected on Sept 8-10 due to G20 summit: Delhi Police READ: https://t.co/rWelcfSqhq (PTI File Photo) #G20Summit #G20India2023 pic.twitter.com/0YuvRjG7pr — Press Trust of India (@PTI_News) August 25, 2023 మథుర రోడ్, బైరాన్ మార్గ్, పురానా ఖిలా రోడ్లలో పూర్తిగా ట్రాఫిక్ నిలిపివేస్తున్నట్లు తెలుపుతూ ఎయిర్‌పోర్టుకు రైల్వే స్టేషన్లకు వెళ్లాల్సిన వారు ముందుగానే వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వర్చువల్ హెల్ప్ డెస్క్ సేవలు కూడా వినియోగించుకోవాలని తెలిపారు. #WATCH | On traffic arrangements in Delhi during G20 summit, Special CP Traffic, SS Yadav says, "...New Delhi Police district has been declared as the controlled zone...Railway services and metro services will be working smoothly. Metro services will be functional throughout… pic.twitter.com/kRrqYUv3wH — ANI (@ANI) August 25, 2023 ఇది కూడా చదవండి: అడ్డుకోవాలని చూశారు.. అయినా పూర్తి చేశాం: నితీష్ కుమార్ -
ప్రభుత్వాన్నే ముంచేసిన.. వలసల వరద..
నెదర్లాండ్స్‌లో నాలుగు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికైన ఏడాదిన్నరకే పేకమేడలా కుప్పకూలింది. యూరప్‌లో చాలా దేశాలు ఎదుర్కొంటున్న వలసల ఉధృతే ఇందుకు ప్రధాన కారణం కావడం అక్కడ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.. నెదర్లాండ్స్‌లోకి వలసలను కట్టడి చేసేందుకు ప్రధాని మార్క్ రుట్టె ప్రతిపాదించిన కఠినతరమైన వలసల విధానం చివరికి ఆయన ప్రభుత్వానికే ఎసరు తెచి్చంది. పాలక సంకీర్ణంలోని మిగతా మూడు భాగస్వామ్య పార్టీలూ ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో రుట్టె రాజీనామా చేశారు. అయితే, భాగస్వాముల మాటకు తలొగ్గి రాజీ పడేకంటే దీర్ఘకాలిక స్వీయ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్న దూరదృష్టి ఆయన నిర్ణయంలో ప్రతిఫలించిందని పరిశీలకులు భావిస్తున్నారు. అంతేగాక యూరప్‌లో వలసల సమస్య నానాటికీ ఎంత తీవ్రతరంగా మారుతోందో, అక్కడి రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేస్తోందో, దీన్ని రైట్ వింగ్ పార్టీలు సొమ్ము చేసుకోకుండా ఆపడం ప్రధాన పార్టీలకు ఎంత కష్టతరంగా పరిణమిస్తోందో ఈ ఉదంతం మరోసారి తేటతెల్లం చేసిందని చెబుతున్నారు. ► యూరప్‌లోని అత్యంత ధనిక దేశాల్లో నెదర్లాండ్స్‌ది నాలుగో స్థానం ► నెదర్లాండ్స్‌లోకి వలసల సంఖ్య గతేడాది ఏకంగా మూడో వంతు పెరిగి 47 వేలు దాటేసింది! దాంతో ప్రధాని రుట్టె కట్టడి చర్యలను ప్రతిపాదించాల్సి వచి్చంది. ► ఈసారి దేశంలోకి శరణార్థుల సంఖ్య ఏకంగా 70 వేలు దాటొచ్చని అంచనా. ► వలసదారుల దెబ్బకు చాలా యూరప్ దేశాల్లో మాదిరిగానే నెదర్లాండ్స్‌లో కూడా ఇళ్ల ధరలు, అద్దెలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ► ఇదేగాక పెరుగుతున్న వలసల వల్ల అనేకానేక సమస్యలతో నెదర్లాండ్స్ సతమతమవుతోంది. ► నవంబర్‌లో జరుగుతాయని భావిస్తున్న ఎన్నికల్లో అన్ని పార్టీలకూ ఇది అది పెద్ద ప్రచారాంశంగా మారినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ► ఇప్పుడిక నెదర్లాండ్స్ రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏమిటీ ప్రతిపాదిత విధానం... ప్రధానంగా, నెదర్లాండ్స్‌లో నివసిస్తున్న వలసదారుల పిల్లలకు వలసదారులుగా గుర్తింపు ఇచ్చేందుకు కనీసం రెండేళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉండాలని ప్రధాని రుట్టె ప్రతిపాదించారు. దీన్ని సంకీర్ణ భాగస్వాములు తీవ్రంగా వ్యతిరేకించారు. యూరప్‌కు పెనుభారంగా వలసలు... ► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితర కారణాలతో యూరప్ దేశాలకు కొన్నేళ్లుగా వలసలు భారీగా పెరుగుతున్నాయి. ► 2015లో సిరియా నుంచి శరణార్థులు వెల్లువెత్తిన నాటి నుంచీ ఈ ధోరణి నానాటికీ పెరుగుతూనే ఉంది. ► కానీ ద్రవ్యోల్బణం తదితరాలతో అసలే ధరాభారం, జీవన వ్యయం నానాటికీ పెరిగిపోతున్న సమయంలో ఈ వలసలు క్రమంగా యూరప్ దేశాలకు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ► దీన్ని అవకాశంగా మలచుకుంటూ పలు యూరప్ దేశాల్లో రైట్ వింగ్ పార్టీలు శరణార్థుల పక్షం వహిస్తుండటంతో యూరప్ రాజకీయాలే కీలకమైన, అనూహ్యమైన మలుపు తిరుగుతున్నాయి. చాలా దేశాల్లో ఇప్పటికే రాజకీయాలను నిర్దేశించే స్థాయికి చేరుకున్నాయి కూడా. ► ఏళ్లుగా పాతుకుపోయిన సంప్రదాయ పార్టీలకు ఈ రైట్ వింగ్ పార్టీల ఎదుగుదల పెను సవాలుగా మారుతోంది. ► జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, హంగరీ మొదలుకుని చిన్నా పెద్దా యూరప్ దేశాలన్నింట్లోనూ ఇదే పరిస్థితి! ► దాంతో రైట్ వింగ్ పార్టీలకు ముకుతాడు వేసేందుకు సంప్రదాయ పార్టీలన్నీ చేతులు కలుపుతున్న కొత్త ధోరణి కూడా కొన్ని దేశాల్లో ఇప్పటికే మొదలైంది. రుట్టె కేంద్రంగా... ► నెదర్లాండ్స్‌లో వలసలపై నెలకొన్న తాజా సంక్షోభం ప్రధాని రు ట్టె సంప్రదాయ వైఖరి కారణంగానే ముదురు పాకాన పడింది. ► 13 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న రుట్టె, దీన్ని కూడా అందివచి్చన అవకాశంగానే మలచుకుని వెంటనే రాజీనామా చేశారు. ► ఇటీవల బలం పుంజుకుంటున్న రైట్‌వింగ్ పార్టీల దూకుడుకు అడ్డుకట్ట వేయడంతో పాటు దేశ ప్రయోజనాలు కాపాడేందుకు అధికారాన్ని కూడా తృణప్రాయంగా వదులుకున్నారన్న ఇమేజీ సాధించి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టే లక్ష్యంతోనే ఆయన రాజీనామా చేసినట్టు కనిపిస్తోంది. ► రైట్ వింగ్ పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టడం ద్వారా రుట్టె తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. ► అంతేగాక రాజీనామా ద్వారా యూరప్ యవనికపై వలసల కట్ట డి కోసం గళమెత్తుతున్న బలమైన నేతగా రుట్టె ఆవిర్భవించారు. ► యూరప్‌లోకి వలసల కట్టడికి సంయుక్త ఈయూ బోర్డర్ ఏజెన్సీ వంటివాటి ఏర్పాటును కూడా కొంతకాలంగా ఆయన ప్రతిపాదిస్తున్నారు. అయితే రాజీనామా ద్వారా దేశ ప్రయోజనాల కంటే స్వీయ రాజకీయ ప్రయోజనాలకే ఆయన పెద్దపీట వేసుకున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి! ‘కేవలం ప్రతిపాదిత వలస విధానంపై విభేదాల వల్ల ఏకంగా పాలక సంకీర్ణమే కుప్పకూలడం నమ్మశక్యం కాని నిజం! ఏదేమైనా రాజీనామా నిర్ణయం ప్రధాని రుట్టె రాజకీయ చతురతకు అద్దం పట్టింది’ – మార్సెల్ హనెగ్రాఫ్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డామ్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్యామిలీతో హాలీడే ట్రిప్ ప్లాన్ చేసిన సూపర్‌స్టార్!
ఇటీవల ఫ్యామిలీతో కలిసి ప్యారిస్, జర్మనీకి హాలిడే ట్రిప్‌కు వెళ్లొచ్చారు మహేశ్‌బాబు. తాజాగా మరో హాలిడే ట్రిప్‌ను ప్లాన్ చేసుకున్నట్లున్నారు. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, సితారలతో కలిసి మహేశ్‌బాబు శుక్రవారం విదేశాలకు పయనమయ్యారు. హ్యాపీగా.. జాలీగా యూరప్ వెళ్లారని తెలిసింది. కాగా ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి మహేశ్‌బాబు మూడోసారి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణను ఈ నెలాఖర్లో ప్లాన్ చేశారట. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడటంతో మహేశ్ హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారని సమాచారం. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
ఈ యుద్ధం ఇంకెన్నాళ్లు?
పొరుగునున్న బలహీన దేశం ఉక్రెయిన్ను లొంగదీసుకునేందుకు రష్యా మొదలెట్టిన దురాక్రమణ యుద్ధం ఏడాదయ్యేసరికి మరింత జటిలంగా మారింది. నిరుడు ఫిబ్రవరి 24న రెండు లక్షలమంది సైన్యాన్ని ఉక్రెయిన్ వైపు నడిపించిన రష్యా ఇప్పుడు ఆ సంఖ్యను అయిదు లక్షలకు పెంచింది. ఏడాదైన సందర్భంగా ఉక్రెయిన్ నైతిక స్థైర్యాన్ని పెంచడానికంటూ ఆ గడ్డపై అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రసంగం, ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడిన తీరు చూస్తే ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. నిజానికి ఇప్పటికే వైరి వర్గాల మోహరింపు మొదలైంది. ఏడాది క్రితం యుద్ధంలో ప్రధాన పాత్రధారులు రష్యా– ఉక్రెయిన్లే. ప్రస్తుతం అమెరికా మద్దతుతో యూరోప్ దేశాలు అందులో పీకల్లోతు కూరుకుపోయాయి. రష్యాకు మారణాయుధాలిస్తే ఖబడ్దార్ అంటూ అమెరికా చేసిన హెచ్చరికకు జవాబన్నట్టు చైనా కమ్యూనిస్టు పార్టీ విదేశాంగ విధాన నిపుణుడు వాంగ్ యీ బుధవారం మాస్కో సందర్శించి రష్యాతో తమ బంధం మరింత దృఢమవుతుందని ప్రకటించారు. పేరుకు చిన్న దేశమే అయినా అమెరికా పుణ్యమా అని ప్రస్తుతం ఉక్రెయిన్ దగ్గర మారణాయుధాలు, యుద్ధ ట్యాంకులు, గురిచూసి లక్ష్యాన్ని ఛేదించే బాంబులు, అత్యాధునిక యుద్ధ సామగ్రి, కోట్లాది డాలర్ల నిధులు పుష్కలంగా ఉన్నాయి. దేశం మరుభూమిగా మారినా రష్యాను చావుదెబ్బ తీయటంలో అవన్నీ ఉక్రెయిన్‌కు తోడ్పడుతున్నాయి. నిజానికి అమెరికా మొదట్లో చాలానే ఆశించింది. రష్యాపై ప్రపంచవ్యాప్తంగా ఏహ్యభావం వస్తుందని, అది ఏకాకవుతుందని భావించింది. కానీ అలాంటి ఛాయలు కనబడటం లేదు. తమ దేశంపై 2001లో వేలాదిమంది మరణానికి కారణమైన సెప్టెంబర్ 11 ఉగ్రదాడి అనంతరం ‘వాళ్లెందుకు మమ్మల్ని ద్వేషిస్తున్నార’ంటూ అల్‌ఖైదా ఉగ్రవాదుల గురించి ప్రశ్నించిన అమెరికా ఇప్పుడు ఆ ప్రశ్నను కాస్త తిరగేసి అడుగుతోంది. ‘వాళ్లనెందుకు ద్వేషించటం లేద’న్నది ఆ ప్రశ్న సారాంశం. ఇక్కడ ‘వాళ్లు’ అంటే రష్యన్లు. నిజమే, అమెరికా ఒత్తిడికి తలొగ్గి అయిష్టంగానైనా ఉక్రెయిన్‌కు మారణాయుధాలు అందజేస్తున్న యూరోప్ దేశాలు రష్యా నుంచి దిగుమతులు మాత్రం ఆపలేదు. తనకు సాగిలపడలేదన్న కక్షతో ఇరాన్‌పై గతంలో తీవ్ర ఆంక్షలు విధించి ఆ దేశాన్ని ఆర్థిక దిగ్బంధం చేసిన అమెరికా ఇప్పుడు రష్యాపై ఆ స్థాయిలో విరుచుకుపడటం లేదు. రష్యా చమురు, సహజ వాయువుల ఎగుమతిలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉండటం మాత్రమే కాదు... నికెల్, అల్యూమినియం, టైటానియం వంటి లోహాలూ, రసాయన వాయువులూ, సెమీ కండక్టర్లూ, గోధు మలూ, ఎరువుల ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉంది. కఠిన ఆంక్షలతో ఇవన్నీ ఆగిపోతాయన్న భయాందోళనలు అమెరికా, యూరోప్ దేశాల్లో ఉన్నాయి. ఇక ముడి చమురును రష్యా చాలా చవగ్గా మనకూ, చైనాకూ విక్రయిస్తోంది. మన దేశం అక్కడినుంచి రోజూ 12 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఏడాదిక్రితంతో పోలిస్తే ఇది 33 రెట్లు ఎక్కువ. ఇలా అనేకానేక కారణాలవల్ల రష్యాపై ప్రపంచ దేశాల్లో ఏహ్యభావం లేదు. పైపెచ్చు ఉక్రెయిన్‌కు అత్యుత్సాహంతో అమెరికా, యూరోప్ దేశాలు మారణాయుధాలు అందిస్తున్న తీరువెనక వారికి వేరే ప్రయోజనాలున్నాయని ప్రపంచం విశ్వసిస్తోంది. అది పాశ్చాత్య దేశాల చేతిలో కీలుబొమ్మ అని రష్యా చేస్తున్న ప్రచారం నిజం కావొచ్చన్న అభిప్రాయం కలుగుతోంది. ఒక సర్వే ప్రకారం భారత్, చైనా, తుర్కియే దేశాల్లో అత్యధికులు రష్యాకు అనుకూలంగానే ఉన్నారని వెల్లడైంది. సోవియెట్ యూనియన్ ఉనికిలో ఉన్నప్పుడు దాన్ని అగ్రరాజ్యంగా, ప్రమాదకరమైన శక్తిగా భావించేవారు. ఇప్పుడు రష్యాపై ఆ ముద్ర లేదు. ప్రచ్ఛన్న యుద్ధ దశ ముగిశాక అమెరికా, రష్యాల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగిన పర్యవసానంగా 2010లో అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందం(స్టార్ట్) కుదిరింది. దాని కాలపరిమితి 2026 ఫిబ్రవరిలో ముగియబోతోంది. కొత్త ఒప్పందంపై మొదలైన చర్చలను నిలిపేస్తున్నట్టు ప్రకటించి పుతిన్ అందరినీ ఆందోళనలో పడేశారు. ఏ పక్షమూ మొదటగా అణ్వాయుధాలు ఉపయోగించకుండా నియంత్రించే ఆ ఒప్పందం ఒక్కటే రెండు దేశాల మధ్యా మిగిలింది. దాన్ని కాస్తా పున రుద్ధరించటానికి చర్యలు తీసుకోకపోతే ప్రపంచ మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఇక రెండు దేశాలూ తమ అణ్వాయుధాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థేమీ మిగలదు. పుతిన్ మరో మాట కూడా అన్నారు. అమెరికా గనుక అణు పరీక్షలు మొదలుపెడితే తాము కూడా సర్వసన్నద్ధంగా ఉన్నామని ప్రకటించారు. యుద్ధం ఆగనంతకాలమూ ఇలా సవాళ్లు, ప్రతి సవాళ్లతో పరిస్థితి నానాటికీ దిగజారుతుంది. యూరోప్ భద్రత ప్రమాదంలో పడుతుంది. యుద్ధాన్ని విరమించి శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోమని మన దేశం ఇరుపక్షాలకూ చెబుతోంది. కానీ మున్ముందు ఇలా మధ్యవర్తిత్వం వహించే అవకాశాలు కూడా ఉండవు. ఇప్పటికే 80 లక్షలమంది ఉక్రెయిన్ పౌరులు కొంపా గోడూ వదిలి వలసపోయారు. వేలాదిమంది మరణించారు. అనేకులు వికలాంగులయ్యారు. అటు రష్యా సైతం భారీగా నష్టపోయింది. బలహీన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు ఈ యుద్ధంతో సంక్షోభంలో పడ్డాయి. అందుకే మతిమాలిన ఈ యుద్ధాన్ని విరమించేలా రష్యాపై ప్రపంచం ఒత్తిడి తేవాలి. ఉక్రెయిన్‌కు సాయం పేరిట పరిస్థితి మరింత విషమించే చర్యలకు స్వస్తి పలకాలని అమెరికాను కోరాలి. యుద్ధంతో అంతిమంగా మిగిలేది విషాదమేనని గుర్తించాలి. -
చైనాలో కోవిడ్ కేసుల విజృంభణ.. జనవరి 21 తర్వాత పరిస్థితేంటో!
చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం ఇతర దేశాలపై ఏ మేరకు ఉంటుంది? ప్రతి దేశాన్ని కలవరపరుస్తున్న సమస్య. ఏ దేశానికి ఆ దేశం దీనిపై చర్చించుకుంటోంది. తగినన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వం, ఆరోగ్యరంగ నిపుణులు దీనిపై అధ్యయనాలు సాగిస్తున్నారు. చైనాలో పరిస్థితి ఏమిటి? ‘జీరో కోవిడ్ పాలసీ’ పేరుతో, గత మూడేళ్లుగా చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. లాక్ డౌన్, కేంద్రీకృత క్వారంటైన్ విధానం అమలు చేస్తోంది. పెద్ద ఎత్తున టెస్టింగ్, కాంట్రాక్టు ట్రేసింగు విధానాలను చేపట్టింది. దీంతో రోజువారీ కార్యకలాపాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. వ్యాపార వాణిజ్య వ్యవహారాలు స్తంభించిపోయాయి. దీనిపైన ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం కావటంతో, డిసెంబరు మొదటి వారం నుంచి నిబంధనలను సడలించింది. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయటం, ఆసుపత్రుల్లో ఐసీయూ సేవలను మెరుగుపరచటం, యాంటీవైరల్ మందులను పెద్ద ఎత్తున నిల్వ చేయటం వంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుండా, నిబంధనలన్నింటిని సడలించటంతో పరిస్థితి అదుపుతప్పింది. ఒక్కసారిగా కోవిడ్ కేసులు పెరిగిపోయాయి. ఆస్పత్రులపైన ఒత్తిడిపెరిగిపోయింది. వైద్యసేవలు అందుబాటులో లేకుండా పోయాయి. ఫార్మశీలు, ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫారాలల్లో మందుల కొరతను ఏర్పడింది. ఫీవర్ హాస్పిటళ్లలో రద్దీ.. యాంటీవైరల్ డ్రగ్ అందుబాటులో లేకుండా పోయింది. స్మశానాలు మృతులతో కిక్కిరిసిపోయాయి. అయినా కేసుల విషయంలోగానీ, మరణాల విషయంలోగానీ, వాస్తవసమాచారాన్ని చైనా బాహ్య ప్రపంచానికి తెలియనివ్వలేదు. కోవిడ్-19కి సంబంధించిన రియల్ టైం సమాచారాన్ని అందించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ అనేక మార్లు విజ్గప్తి చేసింది. ప్రపంచదేశాలు దీనిపై గగ్గోలు చేశాయి. చైనాలో దాదాపు 90 శాతం మంది కోవిడ్ బారిన పడ్డారని అంచనా. అన్ని దేశాల్లో భయాలు చైనాలో జనవరి 21న వచ్చే ‘లూనార్ న్యూఇయర్ హాలిడే’కు ప్రత్యేకత ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా స్వగ్రామాలకు వచ్చి కుటుంబాలను కలుసుకోవటం ఆనవాయితీ. ‘లార్జెస్ట్ యాన్యువల్ మైగ్రేషన్’ గా దీనిని చెబుతారు. బస్సులు, రైళ్లు, విమానాలు ప్రయాణికులతో కిటకిటలాడతాయి. కుటుంబాలతో గడిపిన వీళ్లంతా ఆయా ప్రాంతాలకు తిరిగివచ్చేటప్పుడు వైరస్ ను వెంటతెస్తారన్న ఆందోళన సర్వత్రా వ్యక్త మవుతోంది. అదే జరిగితే చాలా దేశాలు ప్రభావితమయయ్యే అవకాశాలున్నాయి. చైనాకు వచ్చేవారు క్వారంటన్‌లో ఉండవలసిన పనిలేదని కూడా చైనా చెప్పడం ఈ భయాలకు మరో కారణం. ముందు జాగ్రత్త చర్యలు చైనా నుంచి వచ్చే యాత్రికుల విషయంలో అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. భారత్ పాటు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనాడా, జపాన్, దక్షిణ కొరియా, యూకె, అనేక యూరోపియన్ దేశాలు ఇందులో ఉన్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్ కొత్తగా జత కలిశాయి. కోవిడ్ నెగెటివ్ నివేదిక ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తామని చెబుతున్నాయి. మరి యూరప్ మాటేమిటి? పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం యూరోపియన్ రీజయన్ పైన అంతగా ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. యూరోపియన్ రీజియన్ అంటే.. 53 దేశాలు. రష్యాతో పాటు మధ్య ఆసియాలోని దేశాలు అన్నీ ఇందులోకి వస్తాయి. ప్రస్తుత పరిస్థితిపై డబ్ల్యు హెచ్ ఓ యూరోపియన్ డైరక్టర్ హాన్స్ క్లంగ్ మాట్లాడుతూ, ‘‘ ప్రస్తుతానికి యూరోపియన్ దేశాలు ఆందోళన చెందవలసిన పనిలేదు. అలాగని అలసత్వంతో ఉండటానికి వీల్లేదు’’ అని పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు డజను వరకూ దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులపైన ఆంక్షలు విధించటంలో తప్పు లేదని, అది వివక్ష కిందకు రాదని సమర్థించారు. ఆయా దేశాలు నిఘా ప్రయత్నాలను ముమ్మరం చేయాలని, ఆయా వేరియంట్ల సీక్వెన్సింగ్ ను కొనసాగించాలని చెప్పారు. -
వణుకుతున్న ఉద్యోగులు.. ఏడాది చివరికల్లా మాంద్యంలోకి ఆ దేశాలు!
ఊహించిన దానికన్నా ఎక్కువ కాలం అధిక ద్రవ్యోల్బణం కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఈ ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో యూరోపియన్ యూనియన్‌లోని (ఈయూ) చాలా మటుకు దేశాలు మాంద్యంలోకి జారుకోవచ్చని యూరోపియన్ కమిషన్ వెల్లడించింది. ద్రవ్యోల్బణంతో పాటు అధిక వడ్డీ రేట్లు, నెమ్మదిస్తున్న అంతర్జాతీయ వాణిజ్యం తదితర అంశాలు కూడా ఇందుకు కారణం కాగలవని పేర్కొంది. అయితే మాంద్యం ప్రభావం ఎక్కువగా ఉద్యోగులపై ఉండవచ్చని ఇదివరకే నిరూపితం కాగా ప్రస్తుతం పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. దీంతో ఆ దేశాల్లో ఉద్యోగులు భయాందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది (2023) వృద్ధి అంచనాలను 0.3 శాతానికి తగ్గించింది. వాస్తవానికి ఇది 1.4 శాతంగా ఉండవచ్చని జూలైలో అంచనా వేశారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో వృద్ధి ఆశ్చర్యకరంగా పటిష్టంగానే ఉన్నప్పటికీ, మూడో త్రైమాసికంలో ఈయూ ఎకానమీ వేగం తగ్గిందని యూరోపియన్ కమిషన్ తెలిపింది. దీంతో వచ్చే ఏడాదికి అంచనాలు గణనీయంగా బలహీనపడ్డాయని తెలిపింది. యూరప్‌లో అతి పెద్ద ఎకానమీ అయిన జర్మనీ పనితీరు 2023లో అత్యంత దుర్భరంగా ఉండవచ్చని పేర్కొంది. చదవండి: ఏంటి బ్రో, చేరిన 2 రోజులకే నా ఉద్యోగం ఊడింది.. ఓ ఐఐటియన్ బాధ ఇది! -
Russia-Ukraine War: పుతిన్ ‘తప్పు’టడుగులు
ఉక్రెయిన్‌పై దండయాత్ర రష్యా అధ్యక్షుడు పుతిన్ చారిత్రక తప్పిదమా ? ముందు వెనుక ఆలోచించకుండా యుద్ధానికి దిగి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారా? రష్యా సైన్యానికి వరస ఎదురు దెబ్బలు దేనికి సంకేతం ? 200 రోజులు దాటినా ఉక్రెయిన్‌పై పట్టు కోసం ఇంకా ఆపసోపాలు పడటానికి కారణాలేంటి ? ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టి ఏడు నెలలు కావస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఉక్రెయిన్ తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం మరింత పట్టుదలగా ముందుకు సాగుతూ ఉంటే, అపారమైన నష్టాన్ని చవి చూసిన రష్యా ఒకరకమైన గందరగోళంలో ఉంది. ఇటీవల ఖర్కీవ్‌లో ఉక్రెయిన్ సేన చేతిలో రష్యా ఓటమి ఆ దేశానికి గట్టి ఎదురు దెబ్బగా మారింది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నా రష్యా ఇప్పట్లో యుద్ధానికి ముగింపు పలుకుందని భావించలేం. ఉక్రెయిన్‌లో మిలటరీ ఆపరేషన్ కొనసాగుతుందని పుతిన్ ప్రెస్ సెక్రటరీ దిమిత్రి పెస్కోవ్ ఇటీవలే స్పష్టం చేశారు. తూర్పు డోన్బాస్ స్వాధీనమే తమ ముందున్న లక్ష్యమని, దాని సాధనకు తొందరేమీ లేదని తాజాగా షాంఘై సహకార సదస్సు సందర్భంగా పుతిన్ కూడా అన్నారు. యుద్ధం మరిన్ని రోజులు కొనసాగుతుందన్న సంకేతాలు ఇచ్చారు. కానీ యుద్ధంలో రష్యా ఆత్మరక్షణలో పడిపోవడానికి కారణాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఉక్రెయిన్‌కు పశ్చిమదేశాల అండ అమెరికా సహా నాటో దేశాలన్నీ కలసికట్టుగా ఉక్రెయిన్‌కు ఇంతగా అండగా ఉంటాయని పుతిన్ ఊహించలేకపోయారు. యుద్ధం ఎన్నాళ్లు సాగినా సాయం కొనసాగించేందుకు అవి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ అత్యాధునిక ఆయుధాలను ఉపయోగిస్తోంది. హిమార్స్ రాకెట్ వ్యవస్థతోనే ఉక్రెయిన్ సేనలు వందలాది రష్యన్ స్థావరాలను ధ్వంసం చేశారు. హౌటైజర్స్, స్విచ్‌బ్లేడ్ డ్రోన్లు, రాకెట్ లాంచర్లు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ ఆర్మర్ సిస్టమ్స్ ఉక్రెయిన్ దగ్గర ఉన్నాయి. అమెరికా తాజాగా 1500 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం చేస్తానని హామీ ఇచ్చింది. దీంతో రష్యా పరోక్షంగా పశ్చిమ దేశాలతోనే యుద్ధం చేయాల్సి వస్తోంది. ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి ఉక్రెయిన్‌పై దాడులకి దిగితే అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధించినా చమురు, గ్యాస్ కోసం తమపై ఆధారపడతాయని త్వరలోనే ఆంక్షలకి ముగింపు పలుకుతాయని పుతిన్ తప్పుగా అంచనా వేశారు. ఫిబ్రవరి నుంచి రష్యాపై 9,200కిపైగా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. వెయ్యికి పైగా మల్టీ నేషనల్ కంపెనీలు రష్యాను వీడాయి. ఆయుధాల ఉత్పత్తీ మందగించింది. దాంతో ఉత్తర కొరియా నుంచి కూడా ఆయుధాలు కొనుగోలుకు సిద్ధపడాల్సి వచ్చింది! రష్యాను ఆర్థికంగా చమురు, గ్యాస్ ఎగుమతులు మాత్రమే ఆదుకుంటున్నాయి. పుతిన్ మితిమీరిన ఆత్మవిశ్వాసం యుద్ధం చిటికెలో ముగుస్తుందనే భావనతో రంగంలోకి దిగిన పుతిన్‌కు ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోవడం లేదు. యుద్ధాన్ని ముగిస్తే మంచిదన్న భావన రష్యాలో వివిధ వర్గాల్లో పెరుగుతోంది. ఆత్మవిశ్వాసం, అసహనం ఒకే నాణేనికి చెరోవైపు ఉంటాయన్న వాస్తవాన్ని పుతిన్ గ్రహించుకోలేకపోయారని బ్లూమ్‌బర్గ్ కాలమిస్ట్ లియోనిడ్ బెర్షిడ్స్కీ అన్నారు. కదనరంగంలో కిరాయి సైనికులు ఉక్రెయిన్‌లో కిరాయి సైనికుల్ని దింపడం పుతిన్ చేసిన మరో పెద్ద తప్పిదమంటున్నారు. వాగ్నర్ సంస్థతో పాటు పశ్చిమాసియా దేశాలకు చెందిన వారిని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌పై నియమించుకున్నారు. రష్యా ఇలాంటివారిపై ఆధారపడగా, ఉక్రెయిన్ సైనికులు మాత్రం తమ దేశాన్ని కాపాడుకోవాలన్న తపనతో స్వచ్ఛందంగా యుద్ధరంగంలోకి దిగారు. కాంట్రాక్ట్ సైనికులకి తక్కువ జీతాలు ఇస్తూ ఉండడంతో వారు పూర్తి స్థాయిలో పోరాటపటిమను ప్రదర్శించడం లేదు. తమకు పరిచయం లేని భూభాగంలోకి వచ్చి పోరాడుతున్న రష్యా సైనికులు త్వరగా నిస్సత్తువకి లోనవుతూ ఉంటే, సొంతగడ్డపై స్థానికబలంతో పోరాడే ఉక్రెయిన్ సేనలు నిత్యం ఉత్సాహంగా ఉంటున్నాయి. దీంతో రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో ఇప్పటివరకు ఉక్రెయిన్ 2,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి వెనక్కి తీసుకుంది. వ్యూహాత్మక తప్పిదాలు యుద్ధంలో రష్యా పలు వ్యూహాత్మక తప్పిదాలు కూడా చేసింది. ఏప్రిల్‌లో కీవ్, ఉత్తర ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రతిఘటన ధాటికి రష్యా సేనలు వెనుదిరిగాయి. ఆ సమయంలో బలగాలను డోన్బాస్పైకి పంపడం వ్యూహాత్మక తప్పిదమనే అభిప్రాయం వినబడుతోంది. ఇలా చేయడం వల్ల చిత్తశుద్ధితో రష్యా తరఫున పోరాడే సైనికుల్ని త్వరితగతిన దేశం కోల్పోయింది. ప్రస్తుతం కదనరంగంలో ఉన్న రష్యా సైనికుల్లో అంకితభావం కనిపించడం లేదు. ఎంత త్వరగా వెనక్కి వెళ్లి కుటుంబాలతో కలిసి గడుపుతామని వారు ఎదురు చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జనాభా తగ్గినా డేంజరే..
(ఎం. విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): జనాభా పెరగడమే అన్ని సమస్యలకు మూలమని ఇప్పటివరకు అందరిదీ అదే భావన. ఇప్పుడు ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న అంశాల్లో జనాభా తగ్గుదల కూడా చేరింది. ఈ సమస్య అభివృద్ధి చెందిన దేశాల్లోనే ముందుగా వచ్చింది. ఆర్థికంగా, సాంకేతికంగా బలమైన వ్యవస్థలున్న జపాన్‌లాంటి దేశమే ఇప్పుడీ సమస్య ఎదుర్కొంటోంది. ఆసియా ఖండంలో ప్రస్తుతం జపాన్ ఒక్కటే ఈ సమస్యను ఎదుర్కొంటుండగా.. ఐరోపా ఖండంలో చాలా దేశాలను పీడిస్తోంది. జనాభా తగ్గుదల నమోదు కావడమంటే.. దేశ జనాభా సరాసరి వయసు పెరగడం. తద్వారా పనిచేసేవాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా ఆర్థికాభివృద్ధి కుంటుపడటం, ప్రజారోగ్యం మీద ఖర్చు పెరగడంతో పన్నుల భారం పెరుగుతుండటం ఆయా సమాజాల్లో ఇప్పుడు కనిపిస్తోంది. అదే మన దేశంలో ప్రస్తుత సరాసరి వయసు 28.4ఏళ్లు. ఇది ఇప్పుడు మనకు కలిసొచ్చే అంశం. పుడుతున్న ప్రతి వెయ్యి మందిలో మనోళ్లు 171 మంది ప్రపంచంలో ప్రతి నాలుగు నిమిషాలకు దాదాపు వెయ్యి మంది పుడుతున్నారు. వీరిలో అత్యధికంగా 171 మంది మన దేశంలోనే ఊపిరిపోసుకుంటున్నారు. ఆ తర్వాత 102 మందితో చైనా రెండో స్థానంలో.. 56 మందితో మూడో స్థానంలో నైజీరియా ఉన్నాయి. అలాగే, పాకిస్తాన్ 47 మందితో నాల్గో స్థానంలో.. 31 మందితో కాంగో ఐదో స్థానంలో నిలిచింది. ఇలా టాప్–5లో ఆసియా, ఆఫ్రికా దేశాలే ఉన్నాయి. ► ఇక 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉండటం పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే.. ప్రపంచ సరాసరి బర్త్‌రేట్ కంటే కొద్దిగానే ఎక్కువ. మన దేశంలో బర్త్‌రేట్ 17.7 ఉంటే, ప్రపంచ బర్త్‌రేట్ 16.8 ఉంది. ► అదే చైనా ప్రపంచ జనాభాలో నంబర్‌వన్. కానీ, జననాల సంఖ్య మన కంటే తక్కువగా ఉంది. అక్కడ ఇప్పటికే జనాభా పెరుగుదల మందగించింది. ఇదే తీరు కొనసాగితే.. జనాభా పెరుగుదల ఆగిపోవడం ఎంతోదూరంలో లేదని నిపుణుల అంచనా. ► ఇక నైజీరియా కథ వేరు. ఇక్కడ బర్త్‌రేట్ (34.2) ప్రపంచ బర్త్‌రేట్‌కు రెట్టింపుగా ఉంది. పేదరికం ఎక్కువగా ఉండటం, మహిళలు విద్యకు దూరంగా ఉండటమే ఇందుకు కారణం. సంపద పెరిగితే జనాభా పెరుగుదల డౌన్ సంపద పెరిగిన దేశాల్లో బర్త్‌రేట్ తగ్గుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ జనాభా పెరుగుదల వేగం మందగించడం 1960లో మొదలైంది. ఇదే తీరు కొనసాగితే.. 2100 సంవత్సరానికి జనాభా పెరుగుదల ఆగిపోతుందని, ఆ తర్వాత ప్రపంచ జనాభా తగ్గుదల ప్రారంభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనాభా తగ్గుదల మొదలైతే ప్రపంచ జనాభా సరాసరి వయసు పెరగడం మొదలవుతుంది. ఇది జరిగితే సమాజానికి వృద్ధఛాయలు వస్తాయి. చాలా దేశాలు ఇప్పుడీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. 2050 నాటికి ప్రపంచంలో 20 దేశాల జనాభా ప్రమాదకరస్థాయిలో తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా. కానీ, జనాభా తగ్గుదల అంశం మన దేశంలో కనుచూపుమేరలో లేదు. ► యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలతో పోలిస్తే పేద దేశంగా పరిగణించే బల్గేరియాలో జనాభా తగ్గుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇక్కడ గత మూడు దశాబ్దాల్లో జనాభా 20 శాతం తగ్గిపోయింది. మరో 30 ఏళ్లలో 22.5 శాతం తగ్గుతుందని ఐరాస అంచనా. ► ఇక ఉక్రెయిన్లోనూ బర్త్‌రేట్ బాగా తగ్గుతోంది. దేశం నుంచి వలసలూ పెరుగుతున్నాయి. ఫలితంగా వచ్చే 30 ఏళ్లలో దాదాపు 20 శాతం జనాభా తగ్గొచ్చు. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావాన్ని కలిపితే జనాభా మరింత వేగంగా తగ్గొచ్చు. మరోవైపు.. జనాభా తగ్గుతున్న దేశాలన్నీ ఐరోపా ఖండంలో ఉన్నవే. ఆసియాలో ఈ సమస్యలేదు. కానీ, జపాన్ కథ భిన్నంగా ఉంది. 2008లో 12.68 కోట్లు ఉన్న జనాభా ప్రస్తుతం 12 కోట్లకు తగ్గిపోయింది. 2050 నాటికి 10.58 కోట్లకు తగ్గుతుందని అంచనా. జనాభా తగ్గుదల అంటే.. దేశంలో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే. పుట్టుకలు తగ్గుతున్నకొద్దీ.. జనాభా సరాసరి వయసు పెరుగుతుంది. అంటే పనిచేయగలిగే వయస్సున్న జనాభా తగ్గుతారు. 1950లో జపాన్ జనాభా సరాసరి వయసు 22ఏళ్లు. అదే 2020లో 48కు, ఇప్పుడు 49 ఏళ్లకు పెరిగింది. ఈ విషయంలో జపాన్‌ది తొలిస్థానం. ఫెర్టిలిటీ రేట్ (ఒక మహిళ జన్మనిస్తున్న పిల్లల సంఖ్య) ప్రస్తుతం 1.4 ఉంది. ఇది ప్రపంచ సరాసరిలో సగానికంటే తక్కువ. మన దేశానికి ప్రయోజనాలెన్నో.. మన దేశం విషయానికొస్తే.. ఇక్కడ జనాభా పెరుగుతోంది. 140.2 కోట్ల మందితో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17.7 శాతం. దేశంలో ఏటా ఒక శాతం చొప్పున పెరుగుతోంది. త్వరలోనే చైనాను అధిగమిస్తామని నిపుణుల అంచనా. జనాభా పెరుగుదలతో పాటే మన జనాభా సరాసరి వయసూ పెరుగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం.. ► 1970లో దేశ జనాభా సరాసరి వయసు 19.3 ఏళ్లుగా నమోదైంది. ► 2015లో 26.8 ఏళ్లకు.. 2022లో 28.4, 2025లో 30 ఏళ్లు, 2030లో 31.7, 2050లో 38.1 ఏళ్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా. ► గట్టిగా పనిచేయగలిగే వయస్సున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంవల్ల ఆర్థికాభివృద్ధి వేగంగా పెరుగుతోంది. ► వీరికి పని కల్పించడం ప్రభుత్వాల ముందున్న పెద్ద సవాలు. ► ఈ నేపథ్యంలో.. జనాభా తగ్గుదల సమస్య మనకు ఇప్పట్లో లేకపోయినా, శతాబ్దం తర్వాత మనదీ ఐరోపా దేశాల పరిస్థితే అని అంచనా. -
షాకింగ్ రిపోర్ట్..5జీతో క్యాన్సర్ సోకుతుందా?
మనదేశంలో ప్రస్తుతం వినియోగిస్తున్న 4జీ కంటే పదిరెట్ల వేగంతో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రానుంది.ఈ నెట్ వర్క్ వినియోగంతో ఎన్ని లాభాలు ఉన్నాయో..మానవాళికి ముప్పుకూడా అదే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్ స్పెషల్ మొబైల్ అసోసియేషన్(జీఎస్ఎంఏ) నివేదిక ప్రకారం.. 50 యూరప్ దేశాల్లో 34 దేశాల్లో ఈ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మొత్తంలో సగానికి పైగా ఉన్న 173 ప్రాంతాల్లోని (రీజియన్) 92 ప్రాంతాల్లో టెలికం కంపెనీలు 5జీ నెట్ వర్క్‌లను లాంఛ్ చేశారు. ఈ నేపథ్యంలో యూరప్‌లో 5జీ కనెక్టివిటీ కారణంగా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే 5జీ నెట్ వర్క్ వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయనే అంశంపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) పరిశోధనల్ని కొనసాగిస్తుంది. ఆ పరిశోధనల ఫలితాల్ని ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేయనుంది. అదే సమయంలో భారత్‌లో సైతం 5జీ నెట్ వర్క్ వినియోగంలోకి రానుంది. అప్పుడే మనదేశంలో సైతం 5జీతో ఆరోగ్యంపై ప్రమాద అంచనాలకు సంబంధించిన రిపోర్ట్ వెలువరించే అవకాశం ఉండనుంది. 2020 నుంచే డబ్ల్యూహెచ్ఓ 2020నుంచి డబ్ల్యూహెచ్ఓ 5జీ రేడియో ఫ్రీక్వెన్సీ పరిధిని కవర్ చేస్తూ..ఆ ఫ్రీక్వెన్సీల వల్ల తలెత్తే ప్రమాదాల్ని అంచనా వేయడం ప్రారంభించింది. కొత్త సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా విస్తరించినందున, 5జీ ఎక్స్పోజర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను సమీక్షిస్తోంది. క్యాన్సర్, సంతానోత్పత్తి ప్రమాదాలు? 5జీ టెక్నాలజీతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవాళి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే అందోళనలున్నాయి. 2021లో,5జీ వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని యూరోపియన్ పార్లమెంటరీ రీసెర్చ్ సర్వీస్ యొక్క ఫ్యూచర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్యానెల్ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో 450 నుండి 6000 ఎంహెచ్‌జెడ్ ఎలక్ట్రో మోటీవ్ ఫోర్స్‌తో గ్లియోమాస్, ఎకౌస్టిక్ న్యూరోమాలకు సంబంధించి మానవుల్లో క్యాన్సర్ కారకమని నిర్ధారించింది. వీటివల్ల పురుషుల సంతానోత్పత్తి, స్త్రీ సంతానోత్పత్తిపై ప్రభావం చూపనుంది. గర్భం, నవజాత శిశువుల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండవచ్చు అని" ప్యానెల్ తెలిపింది. అప్పటి వరకు 5జీని నిలిపివేయాలి సాంకేతికత అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, ప్రజారోగ్య నిపుణులు, పర్యావరణవేత్తలు 5జీ ప్రమాదాల గురించి ఆయా దేశాల ప్రభుత్వాల్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. "యూరోపియన్ ఏజెన్సీల ద్వారా 5జీ ఎఫెక్ట్‌పై అధ్యయనాలు జరుగుతున్నప్పటికీ, 5జీతో వందశాతం సురక్షితం అని తేలే వరకు ఆ నెట్ వర్క్‌లపై ప్రయగాలు, ప్రచారాల్ని నిలిపివేయాలని అని పర్యావరణ న్యాయవాది ఆకాష్ వశిష్ఠ చెప్పారు. చదవండి👉 5జీ పరుగులు ఒకవైపు.. ‘పాత తరం ఫోన్’ అడుగులు మరొకవైపు: ఏమిటో వింత పరిణామం! -
ఆహార, ఇంధన సంక్షోభం పశ్చిమ దేశాల పుణ్యమే: పుతిన్
మాస్కో: ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతున్న ఆహార, ఇంధన సంక్షోభానికి పశ్చమ దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. తప్పులన్నీ అవి చేసి, ఇప్పుడు నెపాన్ని రష్యాపై మోపుతున్నాయంటూ మండిపడ్డారు. రష్యాపై అవి విధించిన ఆంక్షలు ప్రపంచ మార్కెట్లను మరింతగా కుంగదీయడం ఖాయంమని జోస్యం చెప్పారు. యూరప్ దేశాల మతిలేని విధానాల వల్లే రెండేళ్లుగా ద్రవ్యోల్బణం పెరిగిపోతోందన్నారు. ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులను రష్యా అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘‘ఇదంతా పశ్చిమ దేశాల తప్పుడు ప్రచారమే. ఉక్రెయిన్ తన రేవు పట్టణాల్లోని తీర జలాల నుంచి మందుపాతరలను తొలగించే పక్షంలో అక్కడి నుంచి ఆహార ధాన్యాల రవాణాకు భరోసా కల్పిస్తాం’’ అని పునరుద్ఘాటించారు. -
Russia Ukraine war: ఉక్రెయిన్ శిథిలాల్లో ఆయుధ కంపెనీల... కాసుల పంట
ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో విజేతలెవరు? రష్యా వంటి అత్యంత శక్తివంతమైన దేశం మూడు నెలలుగా యుద్ధం చేస్తున్నా ఉక్రెయిన్ వంటి చిన్న దేశంపై పట్టు చిక్కలేదు. పైగా సైనికంగా, సాయుధ సంపత్తి పరంగా అపార నష్టం చవిచూస్తోంది. అంతర్జాతీయంగా, దౌత్యపరంగా తీవ్ర వ్యతిరేకతనూ మూటగట్టుకుంది. అంతర్జాతీయ సాయంతో రష్యాను ఉక్రెయిన్ ఢీకొడుతున్నా, ఆ దేశం నిండా శిథిల నగరాలే దర్శనమిస్తున్నాయి. మరి ఇంతకూ ఈ యుద్ధంలో గెలుస్తున్నదెవరు? రష్యానా, ఉక్రెయినా? రెండూ కాదు. అమెరికా, పాశ్చాత్య దేశాల ఆయుధ కంపెనీలదే అసలు విజయంగా కన్పిస్తోంది... ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం వల్ల ఆయుధ కంపెనీల పంట పండుతోంది. అమెరికాతో సహా అనేక దేశాలు ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న ఆయుధాలు ఈ కంపెనీల్లో తయారవుతున్నవే. ప్రపంచంలోని అతి పెద్ద ఆయుధ తయారీ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్‌తో పాటు టాప్ సెవెన్ కంపెనీలు అమెరికావే. అమెరికా, యూరప్ల్లోని ఆయుధ కంపెనీలు చాలావరకు ప్రైవేట్ సంస్థలే. ఐదేళ్లుగా పెద్దగా వ్యాపారం సాగక సతమతమవుతున్న ఈ సంస్థలు ఉక్రెయిన్ యుద్ధం పుణ్యామా అని లాభాల బాట పట్టాయి. అమెరికాతో సహా నాటో దేశాలు ఉక్రెయిన్‌కు అందిస్తున్న సాయంలో చాలావరకు ఆయుధాల రూపంలోనే అందుతోంది. విమాన విధ్వంసక స్ట్రింగర్, ట్యాంకు విధ్వంసక జావలిన్ ఆయుధ వ్యవస్థలను తయారు చేస్తున్నది అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్, రేథియాన్లే. యుద్ధం మొదలవగానే మార్చిలో లాక్‌హీడ్ సంస్థ షేరు విలువ ఒక్కసారిగా 16 శాతం పెరిగింది. రేథియాన్ సంస్థ షేరు విలువ 8 శాతం, యూరప్‌లో అతిపెద్ద ఆయుధ కంపెనీ బీఏఈ షేరు విలువ ఏకంగా 26 శాతం పెరిగాయి. అమెరికాకు చెందిన జనరల్ డైనమిక్స్ షేరు 12 శాతం, నార్త్రోప్ గ్రూమన్ షేరు 22 శాతం పెరిగాయి. కాంగ్రెస్ సభ్యులకు కాసుల పంట అమెరికా కాంగ్రెస్ సభ్యుల్లో చాలామందికి ఆయుధ కంపెనీల్లో షేర్లున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం వారికి లాభదాయకంగా మారిందన్నది బిజినెస్ ఇన్సైడర్ పత్రిక కథనం. కనీసం 20 మంది కాంగ్రెస్ సభ్యులకు, లేదా జీవిత భాగస్వాములకు లాక్‌హీడ్ మార్టిన్, రేథియాన్ సంస్థల్లో నేరుగా షేర్లున్నాయి. మరెందరో వాటిలో చాలాకాలంగా పెట్టుబడులు పెట్టారు. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ కొత్తగా షేర్లు కొన్నవారికీ కొదవ లేదు. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు మార్జోరీ టైలర్ గ్రాన్ ఉక్రెయిన్ యుద్ధం మొదలవడానికి రెండు రోజుల ముందు అంటే ఫిబ్రవరి 22న లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. పైగా, ‘యుద్ధం రాజకీయ నాయకులకు మంచి వ్యాపారం’ అంటూ ట్వీట్ కూడా చేశారు! టెనెసీకి చెందిన మరో రిపబ్లికన్ సభ్యురాలు డయానా హార్స్బర్జర్ తన భర్తతో కలిసి రేథియాన్ షేర్లు కొన్నారు. ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం కోసం అధ్యక్షుడు జో బైడెన్ కాంగ్రెస్‌లో ముందు పెట్టిన ప్రతిపాదనలు చకచకా ఆమోదం పొందుతున్నాయి. పైగా అడిగినంత కంటే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. బిలియన్లు గుమ్మరిస్తున్న యూఎస్ ఉక్రెయిన్‌కు బైడెన్ ప్రభుత్వం ఇప్పటి వరకు 4,000 కోట్ల డాలర్లకు పైగా నిధులిచ్చేందుకు సిద్ధమైంది. దాంతో ఉక్రెయిన్ యుద్ధం కోసం గత రెండు నెలల్లోనే అమెరికా మంజూరు చేసిన సాయం ఏకంగా 5,300 కోట్ల డాలర్లను దాటింది. ఇందులో చాలావరకు ఆయుధ రూపంలో అందేదే. గత రెండు దశాబ్దాల్లో అమెరికా ఇచ్చిన అతిపెద్ద విదేశీ సాయం ఇదే! యుద్ధం సాగే కొద్దీ ఉక్రెయిన్‌కు సాయాన్ని ఇంకా పెంచుతానంటూ హామీకూడా ఇచ్చింది. ‘‘ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఆయుధ కంపెనీలు కాసుల పంట పండించుకుంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనూ ఇదే విధంగా జరిగింది’’ అని రిటైర్డ్ మేజర్ జనరల్ జి.డి.భక్తి గత చరిత్రను గుర్తు చేశారు. యూరప్ దేశాలూ... ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో సరిహద్దు పంచుకుంటున్న పలు యూరప్ దేశాలు తమ రక్షణ కేటాయింపులను భారీగా పెంచుకుంటున్నాయి. జర్మనీ రక్షణ కేటాయింపులు జీడీపీలో 1.5 శాతం నుంచి 2 శాతానికి పెరగనున్నాయి. జపాన్ 60 ఏళ్ల తర్వాత తమ జీడీపీలో ఒక శాతానికిపైగా నిధులను రక్షణ అవసరాలకు కేటాయించబోతోంది. అమెరికా రక్షణ నిధులు కూడా వచ్చే ఏడాది ఎన్నడూ లేనంతగా జీడీపీలో 3.5 శాతం నుంచి 5 శాతానికి చేరొచ్చన్నది బ్యాంక్ ఆఫ్ అమెరికా నిపుణుల అంచనా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
2 నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రధాని మోదీ మొట్టమొదటి విదేశీ పర్యటన ఖరారైంది. ఈనెల 2 నుంచి 4వ తేదీ వరకు ప్రధాని జర్మనీ, ఫ్రాన్సు, డెన్మార్క్లను సందర్శించనున్నారని శనివారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో యూరప్ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఏకమైన నేపథ్యంలో జరుగుతున్న ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడు దేశాలకు చెందిన 8 మంది నేతలతో ద్వైపాక్షిక, బహుళపాక్షిక చర్చలు జరుపుతారు. మొదటగా జర్మనీకి, తర్వాత డెన్మార్క్‌కు వెళ్లనున్న ప్రధాని తిరుగు ప్రయాణంలో పారిస్‌లో కొద్దిసేపు ఆగి, అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీ అవుతారు. -
Russia-Ukraine war: యూరప్ ఆర్థికం.. అస్తవ్యస్తం
బ్రసెల్స్: ఉక్రెయిన్–రష్యాల మధ్య ఉద్రిక్తతలతో యూరప్ దేశాలు నానా తంటాలు పడుతున్నాయి. యుద్ధ ప్రభావాలతో ఇంధనాల రేట్లు ఎగిసిన నేపథ్యంలో.. ఉమ్మడి కరెన్సీగా యూరోను ఉపయోగించే 19 దేశాల్లో ధరల పెరుగుదల ఏప్రిల్‌లో మరో రికార్డు స్థాయికి చేరింది. మార్చిలో ద్రవ్యోల్బణం 7.4 శాతంగా ఉండగా.. తాజాగా ఏప్రిల్‌లో ఇది 7.5 శాతానికి చేరింది. దీంతో యూరోజోన్‌లో వరుసగా ఆరో నెలా కొత్త రికార్డు స్థాయి నమోదైనట్లయింది. ఫలితంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి బైటపడే అవకాశాలపై తీవ్ర ప్రభావాలు పడతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. యూరోజోన్ దేశాల్లో 34.3 కోట్ల మంది పైగా ప్రజలు ఉన్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని రికార్డు స్థాయికి ఎగదోసిన అంశాలే ప్రస్తుతం యూరోజోన్‌లో ధరల పెరుగుదలకు కారణమని పరిశీలకులు తెలిపారు. ఇంధన ధరలు 38 శాతం అప్.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో ఇంధన ధరలు 38 శాతం పెరిగాయని యూరోస్టాట్ వెల్లడించింది. యుద్ధ ప్రభావంతో ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఎగుమతి దేశాల్లో ఒకటైన రష్యా నుంచి చమురు, గ్యాస్ సరఫరాల్లో ఆటంకాలు ఏర్పడతాయన్న ఆందోళనల కారణంగా ఈ రెండు ఉత్పత్తుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. చమురు ఎగుమతి దేశాలు, రష్యా సహా వాటి అనుబంధ దేశాలు.. ఉత్పత్తిని పెంచే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుండటంతో సమస్య మరింత జటిలం అవుతోంది. ఇక ముడి సరుకులు, విడిభాగాల సరఫరాలో అవరోధాలు దీన్ని ఇంకా తీవ్రం చేస్తున్నాయి. ప్రజలు, ప్రభుత్వాలకు ద్రవ్యోల్బణం సెగ గట్టిగానే తగులుతోంది. భవిష్యత్తుపై దీనిపై తీవ్ర ఆందోళన నెలకొంది. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. ఇంధన అవసరాల కోసం రష్యా మీద ఆధారపడిన యూరప్ దేశాల పరిస్థితి ప్రస్తుతం ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైంది. ఉక్రెయిన్ మీద దాడికి దిగిన రష్యా మీద రాజకీయ అవసరాల రీత్యా పోటాపోటీగా ఆంక్షలు ప్రకటించక తప్పడం లేదు. కానీ వాటిని పాటించే పరిస్థి తి లేదు. తమ తమ దేశాల్లో హీటింగ్, విద్యు త్, ఇంధన అవసరాల రీత్యా రష్యా నుంచి ఇంధన దిగుమతులను రద్దు చేసుకునే పరిస్థితుల్లో అవి లేవు. ఇలా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొత్తం మీద యూరోజోన్ ఆర్థిక రికవరీకి తీవ్ర విఘాతం కలిగించేదిగా మారిందని ఫిచ్ రేటింగ్స్ ఎకనమిక్స్ టీమ్ డైరెక్టర్ తేజ్ పారిఖ్ అభిప్రాయపడ్డారు. అటు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను పెంచాలని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌పై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. కానీ ధరలను అదుపు చేసేందుకు రేట్లు పెంచితే .. కోవిడ్, ఇంధన కొరత, యుద్ధం వంటి దెబ్బల నుంచి ఎకానమీలు కోలుకోవడానికి విఘాతం కలుగుతుందనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఒమిక్రాన్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు విధించిన ఆంక్షలతో 2021 తొలి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 0.3% నుంచి 0.2%కి మందగించడం వీటికి మరింత ఊతమిస్తున్నాయి. తొలి త్రైమాసికం మధ్యలో మొదలైన యుద్ధ (ఫిబ్రవరి 24) ప్రభావాలు రానున్న నెలల్లో కూడా కనిపిస్తాయని విశ్లేషకులు తెలిపారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్ యుద్ధ ఫలితాలతో రెండో త్రైమాసికంలో యూరోజోన్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మంద గించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం ఎగియడాన్ని చూస్తే జూలైలో ఈసీబీ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించారు. -
యూరప్ దేశాలు ఇకనైనా మేలుకోవాలి: జైశంకర్
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నందుకు భారత్‌ను విమర్శిస్తున్న వారిపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఎదురు దాడికి దిగారు. ఆసియాకు ఎదురవుతున్న సవాళ్లను పశ్చిమ దేశాలు ఇప్పటిదాకా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ‘అఫ్గానిస్తాన్‌తోపాటు పలు ఆసియా దేశాల్లో పరిణామాలు ప్రపంచానికే ప్రమాదకరంగా పరిణమించినా యూరప్ దేశాలు పట్టించుకోలేదు. పైపెచ్చు మరింత వాణిజ్యం చేయాలంటూ మాకు సలహాఇచ్చాయి’ అని మంగళవారం ‘రైజినా డైలాగ్’ కార్యక్రమంలో ఆయన విమర్శించారు. నార్వే, లక్జెమ్‌బర్గ్ విదేశాంగ మంత్రులు, స్వీడన్ మాజీ ప్రధాని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభం యూరప్ దేశాలకు మేలుకొలుపన్నారు. పదేళ్లుగా ఆసియాలో సవ్యమైన పరిస్థితులు లేవన్నారు. ఆసియాలో ప్రతీ దేశ ప్రాదేశిక సార్వభౌమత్వం ప్రమాదంలో పడినప్పటికీ పశ్చిమ దేశాలకు పట్టలేదని, ఇప్పుడు ఉక్రెయిన్ సంక్షోభంతోనైనా వాళ్లు ఈ ఖండంలో సమస్యలపై దృష్టి సారించాలన్నారు. అఫ్గానిస్తాన్ పరిణామాలు, కోవిడ్ మహమ్మారి, అగ్రరాజ్యాల వైరం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఇంధన ధరల్లో పెరుగుదల, ఆహార కొరత ఏర్పడటంతో పాటు అంతర్జాతీయ సిద్ధాంతాలు, విలువలకు విఘాతం కలిగిందన్నారు. ఇది చదవండి: తంజావూరు రథయాత్రలో అపశ్రుతి.. -
చమురు ఉత్పత్తి పెంచి... యూరప్‌ను ఆదుకోండి
దోహా/ఇస్తాంబుల్: ‘‘చమురు ఉత్పత్తిని మరింతగా పెంచండి. ఇంధనం కోసం రష్యాపై ఆధారపడకుండా యూరప్ దేశాలను ఆదుకోండి. వాటి భవితవ్యం మీ చేతుల్లోనే ఉంది’’ అని ఒపెక్ దేశాలకు, ముఖ్యంగా ఖతర్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. ఖతర్‌లో జరుగుతున్న దోహా ఫోరాన్ని ఉద్దేశించి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తమ దేశాన్ని రష్యా సర్వనాశనం చేస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘మా రేవు పట్టణాలను నేలమట్టం చేసింది. దీంతో ఉక్రెయిన్ ఎగుమతులన్నీ నిలిచిపోయాయి. ఇది ప్రపంచమంతటికీ పెద్ద దెబ్బే. మమ్మల్ని లొంగదీయలేక రష్యా అణు బెదిరింపులకు దిగుతోంది. అదే జరిగితే ప్రపంచమంతటికీ పెనుముప్పే’’ అని హెచ్చరించారు. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభానికి చర్చలే పరిష్కారమని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అన్నారు. జెలెన్స్కీతో ఆయన ఫోన్లో మాట్లాడారు. -
జర్మనీతో జట్టు కట్టేలా..!
సాక్షి, అమరావతి: సాంకేతిక విద్యారంగంలో యూరప్ దేశాల్లో.. మరీముఖ్యంగా జర్మనీలోని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఉన్నత విద్యామండలి ద్వారా ఏర్పాట్లు చేయిస్తోంది. ఇప్పటికే జర్మన్ యూనివర్సిటీతో ఉన్నత విద్యామండలి రెండు విడతల రౌండ్‌టేబుల్ సమావేశాలను పూర్తి చేయించింది. ‘ఇండో–యూరో సింక్రనైజేషన్’లో భాగంగా జర్మన్ వర్సిటీ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, ఏపీ ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో ‘జర్మన్–ఏపీ ఫోరమ్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ పేరుతో వర్చువల్‌గా సమావేశాలు నిర్వహించిన ఉన్నత విద్యామండలి అధికారులు జర్మనీ ప్రతినిధులతో వివిధ అంశాలపై వివిధ వర్సిటీల ఉప కులపతులు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ అధికారులు చర్చలు జరిపించింది. తద్వారా జర్మనీలో విద్య, ఉద్యోగ అవకాశాలను మన రాష్ట్ర విద్యార్థులు దక్కించుకునేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఉద్యోగాలు దక్కించుకునేలా.. ‘ప్రీ–మాస్టర్ ఇండియా’ పేరుతో మన దేశంలో జర్మనీ ప్రారంభించనున్న కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఆ దేశంలోని అవకాశాలను దక్కించుకోవడానికి వీలుపడుతుంది. ఇక్కడి విద్యార్థులు బీటెక్ ప్రోగ్రామ్‌లను పూర్తిచేశాక జర్మనీలో మాస్టర్ డిగ్రీని అభ్యసించడంతోపాటు నేరుగా అక్కడి కంపెనీల్లో పని చేసేందుకు వీలు కల్పిస్తారు. దీనిని ఆరు దశల్లో నిర్వహిస్తారు. జర్మనీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు దక్కించుకోవాలంటే మన విద్యార్థులకు మంచి నైపుణ్యాలు, జర్మన్ సంస్కృతి, భాషపై కూడా అవగాహన అవసరం. ఆసక్తి గల విద్యార్థులకు ఆరు దశల కార్యక్రమంలో వీటిని నేర్పిస్తారు. ఇటువంటి అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం డ్యూయెల్ డిగ్రీ కార్యక్రమాలు నిర్వహించనుంది. కాగా, ఉన్నత విద్యామండలి అనుమతితో క్రెడిట్ ఆధారిత కోర్సుల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ (ఏపీఐటీఏ) చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా విద్యార్థులకు మల్టీ స్కిల్లింగ్ మెథడాలజీలో వివిధ నైపుణ్యాలను అలవర్చనున్నారు. కోర్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ ద్వారా విద్యార్థులు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకొనేలా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో ఆన్లైన్ కోర్సులను జర్మనీ వర్సిటీ అమలు చేయనుంది. అంతర్జాతీయంగా ఉద్యోగాల వెల్లువ ఆధునిక సాంకేతిక అంశాల్లో రానున్న కాలంలో 1.1 బిలియన్ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్న నేపథ్యంలో ఆయా అంశాల్లో విద్యార్థులను తీర్చిదిద్దేలా ప్రణాళికలను అమలు చేయనున్నారు. కాలేజీల్లో పాఠ్యాంశాల్లోని నైపుణ్యాలను క్షేత్రస్థాయిలో వాస్తవికంగా విద్యార్థులు అలవర్చుకునేలా ప్రభుత్వం జిల్లాల వారీగా 47 వేలకు పైగా సూక్ష్మ, మధ్య, భారీ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలతో కాలేజీలను అనుసంధానించే కార్యక్రమం చేపట్టింది. ఆయా సంస్థల్లో ఇంటర్న్‌షిప్ అమలు చేయిస్తోంది. ఉపాధి ఆధారిత శిక్షణ కార్యక్రమాలు చేపట్టింది. బ్లెండెడ్ స్కిల్లింగ్ కోర్సులకు శ్రీకారం చుట్టింది. 55వేల మందికి శిక్షణ మరోవైపు ఆధునిక సాంకేతిక అంశాల్లో విద్యార్థులకు క్షేత్రస్థాయి పారిశ్రామిక అనుసంధానం ద్వారా నైపుణ్య శిక్షణ ఇప్పించడానికి ఏపీఐటీఏ ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలకు చెందిన దాదాపు 55 వేల మంది విద్యార్థులు ఏపీఐటీఏలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి వివిధ పారిశ్రామిక, ఐటీ సంస్థల ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అమలు చేయనున్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు జర్మనీ ప్రతినిధుల రౌండ్‌టేబుల్ సమావేశాల్లో చర్చకు వచ్చిన ముఖ్యమైన అంశాల్లో అంతర్జాతీయంగా నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠ్యాంశాల్లో చేపట్టాల్సిన మార్పులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇప్పటికే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, ప్రణాళికలు ఉండేలా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో విద్యార్థులకు వాస్తవిక ప్రయోగాలకు అనువుగా పరిశ్రమ ఆధారిత ప్రాజెక్టులకు రూపకల్పన చేయించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, రోబోటిక్స్, ఆటోమేషన్ తదితర ఆధునిక సాంకేతిక అంశాల్లో విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్డీసీ) ద్వారా పెద్దఎత్తున శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయించింది. ఇవి నిరంతరం కొనసాగేలా ప్రతి డివిజన్లో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలతోపాటు ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పుతోంది. 2,400 మందికి స్కిల్ డెవలప్మెంటు కార్పొరేషన్ ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయించింది. విద్యార్థులకు ఫలితాల ఆధారిత అభ్యాసం (అవుట్‌కమ్ బేస్డ్ లెర్నింగ్) ద్వారా బీటెక్ రెండో ఏడాది నుంచే ప్రభుత్వం క్రెడిట్లతో కూడిన నైపుణ్య కోర్సులను కూడా ఏర్పాటు చేయించింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్‌తో పాటు ఇతర కోర్సుల్లోనూ ప్రభుత్వం ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయించింది. -
యుద్ధం, కోవిడ్–19పై మార్కెట్ దృష్టి
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ అంశాలపై అధికంగా ఆధారపడనున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా మరోసారి ఆటుపోట్లను చవిచూడవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే అధిక శాతం సానుకూలంగా ట్రేడయ్యే అవకాశమున్నట్లు అత్యధికులు అంచనా వేశారు. దేశీయంగా చెప్పుకోదగ్గ అంశాలు లేకపోవడం దీనికి కారణంకాగా.. రష్యా– ఉక్రెయిన్ మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న యుద్ధం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోపక్క ఇటీవల చైనాలో తలెత్తిన కోవిడ్–19 కొత్త వేరియంట్ కొన్ని యూరోపియన్ దేశాలకూ విస్తరించనున్న అంచనాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేయవచ్చని తెలియజేశారు. ఈ నెల 14న ప్రారంభమైన బడ్డెట్ రెండో దశ చర్చలకూ ప్రాధన్యమున్నట్లు తెలియజేశారు. ఎఫ్‌పీఐల ఎఫెక్ట్ గత కొద్ది రోజులుగా అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపనున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈ వారం మార్కెట్లు ర్యాలీ బాటలో సాగవచ్చని చెబుతున్నారు. దేశీయంగా ప్రధాన అంశాలు కొరవడిన నేపథ్యంలో ప్రపంచ సంకేతాలే మార్కెట్లను నడిపించవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, చైనాలో కరోనా పరిస్థితులు, చమురు ధరల కదలికలు వంటివి కీలకమని వ్యాఖ్యానించారు. యుద్ధ పరిస్థితులు ముదరడం, కోవిడ్–19 సవాళ్లు పెరగడం వంటి అంశాలు సెంటిమెంటును దెబ్బతీయవచ్చని తెలియజేశారు. చమురు కీలకం రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కొద్ది రోజులుగా ముడిచమురు ధరలు మండుతున్నాయి. బ్రెంట్, నైమెక్స్ చమురు ధరలు 110 డాలర్ల స్థాయికి చేరాయి. ఈ నెల మొదటి వారంలో 130 డాలర్లను అధిగమించి 2008 తదుపరి గరిష్టాలను తాకిన సంగతి తెలిసిందే. దీనికితోడు డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతోంది. 75.5–76 స్థాయిలో కదులుతోంది. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లను దేశీ ఇండెక్సులు అనుసరించవచ్చని శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యెషా షా పేర్కొన్నారు. దేశీ ఆర్థిక పరిస్థితులను చమురు ధరలు ప్రభావితం చేయగలవని, దీంతో వీటి కదలికలను ఇన్వెస్టర్లు సునిశితంగా పరిశీలించే వీలున్నదని వివరించారు. భారత్ భేష్ వర్థమాన మార్కెట్లతో పోలిస్తే దేశీ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉన్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. ఇప్పటికే కనిష్ట స్థాయిల నుంచి పటిష్ట ర్యాలీ చేశాయని, దీంతో ఎఫ్‌పీఐలు తిరిగి కొనుగోళ్లవైపు దృష్టిపెట్టే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇది మార్కెట్లు మరింత పురోగమించేందుకు దారిచూపవచ్చని విశ్లేషించారు. అంతేకాకుండా మార్కెట్లు ఇప్పటికే యుద్ధ భయాలను డిస్కౌంట్ చేశాయన్నారు.. కాగా.. సమీపకాలంలో దేశీ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగవచ్చన్నది కొటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ ఈక్విటీ హెడ్ హేమంత్ అంచనా. గత వారం స్పీడ్ గత శుకవ్రారం(18న) హోలీ సందర్భంగా సెలవుకావడంతో 17తో ముగిసిన వారంలో దేశీ స్టాక్ మార్కెట్లు 4 శాతం జంప్‌చేశాయి. సెన్సెక్స్ 2,314 పాయింట్లు దూసుకెళ్లి 57,864 వద్ద ముగిసింది. నిఫ్టీ 657 పాయింట్లు జంప్‌చేసి 17,287 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ సైతం 2 శాతంపైగా ఎగశాయి. -
జాగ్రత్త.. కరోనా మళ్లీ విజృంభిస్తోంది!
ఒమిక్రాన్ వేరియెంట్ ఉధృతి తర్వాత Covid-19 కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో మరో వేవ్ ఉండబోదంటూ వైద్య నిపుణులు సైతం ఉపశమనం ఇచ్చే వార్త చెప్పారు. మరి వేరియెంట్.. అదీ ప్రమాదకరమైంది పుట్టుకొస్తే తప్పా భయాందోళనలు అక్కర్లేదంటూ ప్రకటనలు చేశారు. ఈ తరుణంలో అటు అమెరికాలో, ఇటు చైనాలో, ఇంకోపక్క యూరప్ దేశాల్లోనూ కరోనా కేసులు పెరిగిపోతున్న ట్రెండ్ కనిపిస్తోంది. కొవిడ్-19 ట్రెండ్స్‌ను మానిటర్ చేస్తున్న వేస్ట్‌వాటర్ నెట్వర్క్ నివేదికల ప్రకారం.. అమెరికాలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ మధ్య కరోనా కేసుల ఈ పెరుగుదల స్పష్టంగా కనిపించింది. కిందటి నెల ఇదే టైంలో ఈ కేసుల సంఖ్య తక్కువగా నమోదు అయ్యాయి. కారణాలు.. స్కూల్స్ రీ ఓపెనింగ్, ఆఫీసులకు తిరిగి వెళ్తుండడం, మాస్క్ నిబంధనల సడలింపు కారణాల అయి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు వేడిమి పరిస్థితులతో జనాలు బయటే ఎక్కువగా తిరుగుతున్నారు. ఈ తరుణంలో.. వైరస్ విజృంభిస్తోందని అంచనా వేస్తున్నారు. బ్లూమరాంగ్ డేటా రివ్యూ ప్రకారం.. 530 మురుగు నీటి పర్యవేక్షణ ప్రాంతాల నుంచి శాంపిల్స్ సేకరణ ద్వారా ఒక నిర్ధారణకు వచ్చారు. ఇందులో మార్చి 1-10వ తేదీల మధ్య 59శాతం కేసులు తగ్గుముఖం పట్టగా, 5 శాతం కేసులు స్థిరంగా ఉన్నాయి. అయితే 36 శాతం కేసులు పెరిగినట్లు చూపించాయి. ఈ సర్వేలో ఎంత మేర కేసులు పెరుగుతున్నాయనేది చెప్పకపోయినా.. మురుగు నీటి sewer water లో వైరస్ జాడ గుర్తించినట్లు తెలిపారు. న్యూయార్క్‌తో సహా పలు ప్రాంతాల్లో కేసులు విపరీతంగా పెరిగినట్లు నివేదికలు చెప్తున్నాయి. ‘‘ఈ ప్రస్తుత ట్రెండ్ మునుముందు కూడా కొనసాగుతుందా? పెరుగుదల ఇలాగే ఉంటుందా? అనే దానిపై నిర్ధారణకు రావడం తొందరపాటు చర్యే అవుతుందని, స్థానిక ఆరోగ్య ప్రతినిధులను పర్యవేక్షణకు ఆదేశించినట్లు.. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సీడీసీ ప్రతినిధి కిర్బీ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. యూరోపియన్ దేశాల్లోనూ ఇలాంటి పెరుగుదలే కనిపిస్తోంది. జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా.. ఇతర ఐరోపా దేశాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. గత రెండు వారాల్లో కేసులు పెరిగిపోతున్నట్లు ఆయా దేశాల కరోనా గణాంకాలు చెప్తున్నాయి. అక్కడా యూఎస్ తరహా వాతావరణం, ఉక్రెయిన్ యుద్ధ హడావుడి నేపథ్యంలో వలసల కారణాలతో కేసులు పెరిగిపోతుండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో ప్రపంచం ఉలిక్కి పడింది. కరోనా మొదలైనప్పటికీ ఆ దేశంలో హయ్యెస్ట్ కేసులు సోమవారం నమోదు కావడం విశేషం. ఏకంగా 5,280 కేసులు నమోదు అయ్యాయి అక్కడ. ఈ నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెంచిన డ్రాగన్ సర్కార్.. కఠిన లాక్‌డౌన్‌తో కట్టడికి ప్రత్నిస్తోంది. హాంకాంగ్‌లోనూ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. భారత్‌లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. వరుసగా రెండోరోజు 3 వేలకు దిగువకు కేసులు నమోదైయ్యాయి. కానీ, మరణాల సంఖ్య మాత్రం వందకు చేరువైంది. కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బులిటెన్ మంగళవారం రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 7 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2 వేల 568 మందికి వైరస్ ఉందని తేలింది. మొత్తం కేసుల సంఖ్య 4.29 కోట్లకు చేరింది. తాజాగా కరోనా మహమ్మారి కారణంగా 97 మంది మృతి చెందారు. ఇందులో ఒక్క కేరళ నుంచే 78 మరణాలు నమోదయ్యాయి. గత కొంతకాలంగా కరోనా కేసులు తగ్గుతున్నా.. మరణాల సంఖ్యలో మాత్రం తేడా కనిపిస్తోంది.