కీవ్: ఉక్రెయిన్ లొంగిపోతుందని ఎవరైనా భావిస్తే అది పొరపాటే అవుతుందని దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. అలాంటివారికి ఉక్రెయిన్ గురించి ఏమీ తెలియదని అన్నారు. జెలెన్‌స్కీ మాట్లాడిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఉక్రెయిన్ విడిచి పొరుగుదేశం పోలండ్‌కు వెళ్లిపోయినట్లు రష్యా అధికారులతోపాటు మీడియా వెల్లడించింది. పోలండ్‌లో తలదాచుకుంటున్నట్లు తెలిపింది. అయితే, ఈ ప్రచారాన్ని ఉక్రెయిన్ పార్లమెంట్ తిప్పికొట్టింది. జెలెన్‌స్కీ పోలండ్‌కు వెళ్లలేదని, ప్రస్తుతం తమ రాజధాని కీవ్‌లోనే ఉన్నారని స్పష్టం చేసింది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలయ్యాక జెలెన్‌స్కీ భద్రతపై యూరప్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని హెచ్చరించాయి. ఉక్రెయిన్‌పై గతవారం రష్యా దాడులు ప్రారంభమయ్యాక అధ్యక్షుడు జెలెన్‌స్కీపై మూడుసార్లు హత్యాయత్నం జరిగినట్లు ‘ద టైమ్స్’ పత్రిక వెల్లడించింది. హత్యాయత్నాల గురించి ఉక్రెయిన్ అధికారులకు సకాలంలో ఉప్పందడంతో జెలెన్‌స్కీ ప్రాణాలతో బయటపడ్డారని తెలియజేసింది.
జెలెన్‌స్కీని భౌతికంగా అంతం చేయడానికి వాగ్నర్ గ్రూప్, చెచెన్ తిరుగుబాటుదారులతో కూడిన రెండు ముఠాలను ప్రత్యర్థులు రంగంలోకి దించారు. ఈ ముఠాలు ఉక్రెయిన్‌కు చేరుకున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(ఎఫ్‌ఎస్‌బీ)లోని కొందరు సిబ్బంది ఈ హంతక ముఠాల సంగతిని ఉక్రెయిన్‌కు చేరవేశారు. అప్రమత్తమైన ఉక్రెయిన్ అధికారులు ఆ రెండు ముఠాలను మట్టుబెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment