సైనికంగా సూపర్ పవరైన రష్యా చోటా దేశమైన ఉక్రెయిన్‌పై ఉన్నట్టుండి విరుచుకుపడి నేటికి రెండేళ్లు. ఉక్రెయిన్ ‘సంపూర్ణంగా నిస్సైనికీకరణే’ లక్ష్యంగా 2022 ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేపట్టిన ఈ దుందుడుకు చర్య ప్రపంచ దేశాలన్నింటినీ నిత్యం ఏదోలా ప్రభావితం చేస్తూనే వస్తోంది.
రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం రెండేళ్లు దాటినా కొనసాగుతూనే ఉందంటే ఉక్రెయిన్ కనబరచిన తిరుగులేని తెగువే ప్రధాన కారణం. కానీ కొన్నాళ్లుగా ఉక్రెయిన్ క్రమంగా చతికిలపడుతుండగా రష్యా దూకుడు పెంచుతోంది. అయినా లొంగేందుకు ఉక్రెయిన్ ససేమిరా అంటోంది. పైగా ఆక్రమిత భూభాగాల నుంచి వైదొలగి, తమకు కలగజేసిన అపార నష్టానికి రష్యా భారీగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఇప్పుడప్పట్లో ముగిసే సూచనలు కని్పంచడం లేదు...
యుద్ధం తొలినాళ్లలో రష్యా దూకుడు ప్రదర్శించింది. రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపం దాకా దూసుకెళ్లాయి. యూరప్‌లోనే అతి పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రాన్ని ఆక్రమించడంతో యావత్ యూరప్ ఖండం భద్రతాపరమైన ఆందోళనలతో ఉలిక్కిపడింది. కానీ ఆ జోరుకు నెల రోజుల్లోనే బ్రేకులు పడ్డాయి. ఉక్రెయిన్ దళాలు ముప్పేట దాడులతో రష్యా సైన్యాన్ని దిగ్బంధించాయి. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల దన్నుతో పైచేయి సాధిస్తూ వచ్చాయి.
వాటి తీవ్ర ఆంక్షలతో రష్యా అతలాకుతలమైంది. కానీ సెప్టెంబర్ నాటికి జపోరిజియాతో పాటు కీలకమైన డొనెట్స్‌క్, లుహాన్స్‌క్, ఖెర్సన్ ప్రాంతాలను స్వా«దీనం చేసుకున్నట్టు ప్రకటించింది. రష్యాకు చెందిన భారీ యుద్ధ నౌకలతో పాటు క్రిమియాతో రష్యాను కలిపే కీలక బ్రిడ్జిని పేల్చేయడం వంటి చర్యలతో ఉక్రెయిన్ అప్పుడప్పుడూ పైచేయి సాధిస్తూ వచి్చంది. 2023 మేలో ఏకంగా మాస్కోలో పుతిన్ అధికార నివాసమైన క్రెమ్లిన్‌పై రెండు ఉక్రెయిన్ డ్రోన్లు దూసుకెళ్లి కలవరం రేపాయి.
తర్వాత నుంచీ ఉక్రెయిన్ దూకుడు నెమ్మదించసాగింది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడి దెబ్బకు తొలుత అపార నష్టం చవిచూసిన రష్యా సైన్యం తానూ అదే బాట పట్టింది. కొంతకాలంగా ఇరు బలగాలూ డ్రోన్లపైనే ప్రధానంగా ఆధారపడుతున్నాయి! విదేశాల నుంచి భారీగా అందుతున్న వాటికి అదనంగా 2023లోనే ఉక్రెయిన్ ఏకంగా 3 లక్షల డ్రోన్లను తయారు చేసుకుంది! వాటిని 2024లో 10 లక్షలకు పెంచజూస్తోంది. వీటికి చిన్న తరహా మిసైళ్లు తోడవుతున్నాయి.
ఇప్పుడేంటి...!
రష్యా తాజాగా ఉక్రెయిన్‌లోని అది్వవ్‌కా నగరాన్ని ఆక్రమించింది. ఆ క్రమంలో అతి భారీగా ఆయుధ సామగ్రిని కోల్పోయింది. కాకపోతే కొన్నాళ్లుగా విపరీతంగా వచి్చపడుతున్న చమురు అమ్మకాల లాభాలతో రెట్టించిన ఉత్సాహంతో యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. పైగా లక్షలాదిగా అదనపు సైనికులను సిద్ధం చేసుకుంటోంది.
ఇవన్నీ ఉక్రెయిన్‌కు భారీ హెచ్చరిక సంకేతాలే. స్వీయ సాయుధ సామగ్రి నిండుకుంటుండటమే గాక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అమెరికా, పాశ్చాత్య దేశాల నుంచి సాయమూ బాగా తగ్గింది. ఏదేమైనా రష్యా గెలిచేదాకానో, పుతిన్ అధికారంలో ఉన్నంత వరకో యుద్ధం కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ పోరులో ఉక్రెయిన్ మాత్రం ఇప్పటికే బహుశా ఇంకెప్పటికీ కోలుకోలేనంతగా దెబ్బ తిన్నది.
అపార నష్టం...
► యుద్ధంలో మరణించిన, క్షతగాత్రులైన రష్యా, ఉక్రెయిన్ సైనికుల సంఖ్య ఏకంగా 5 లక్షలు దాటినట్టు అంచనా.
► 12,000 మందికి పైగా అమాయక ఉక్రేనియ న్లు యుద్ధానికి బలయ్యారు. 20,000 పై చిలుకు మంది క్షతగాత్రులయ్యారు.
► కోటి మంది దాకా ఉక్రేనియన్లు నిర్వాసితులయ్యారు. వీరిలో 60 లక్షలకు పైగా విదేశాలకు వలసబాట పట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతి పెద్ద వలసగా నిలిచింది.
► అమెరికా, పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు ఇప్పటికే బిలియన్ల కొద్దీ ఆర్థిక సాయం, అంతకు మించి అత్యాధునిక ఆయుధ సాయం చేస్తూ వస్తున్నాయి.
► ఐఎంఎఫ్ కూడా 15.6 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందజేసింది. యుద్ధంలో ఉన్న ఓ దేశానికి ఆర్థిక సాయం ఐఎంఎఫ్ చరిత్రలోనే తొలిసారి.
► రెండేళ్ల యుద్ధంలో 20 శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని మాత్రమే రష్యా ఆక్రమించగలిగింది. అందులోనూ సగం తిరిగి తమ వశమైనట్టు ఉక్రెయిన్ చెబుతోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment