ఈ యుద్ధం ఇంకెన్నాళ్లు? | Sakshi Editorial On Russia Ukraine war | Sakshi
Sakshi News home page

ఈ యుద్ధం ఇంకెన్నాళ్లు?

Published Fri, Feb 24 2023 1:00 AM | Last Updated on Fri, Feb 24 2023 1:00 AM

Sakshi Editorial On Russia Ukraine war

పొరుగునున్న బలహీన దేశం ఉక్రెయిన్‌ను లొంగదీసుకునేందుకు రష్యా మొదలెట్టిన దురాక్రమణ యుద్ధం ఏడాదయ్యేసరికి మరింత జటిలంగా మారింది. నిరుడు ఫిబ్రవరి 24న రెండు లక్షలమంది సైన్యాన్ని ఉక్రెయిన్‌ వైపు నడిపించిన రష్యా ఇప్పుడు ఆ సంఖ్యను అయిదు లక్షలకు పెంచింది. ఏడాదైన సందర్భంగా ఉక్రెయిన్‌ నైతిక స్థైర్యాన్ని పెంచడానికంటూ ఆ గడ్డపై అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన ప్రసంగం, ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మాట్లాడిన తీరు చూస్తే ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుందన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

నిజానికి ఇప్పటికే వైరి వర్గాల మోహరింపు మొదలైంది. ఏడాది క్రితం యుద్ధంలో ప్రధాన పాత్రధారులు రష్యా– ఉక్రెయిన్‌లే. ప్రస్తుతం అమెరికా మద్దతుతో యూరోప్‌ దేశాలు అందులో పీకల్లోతు కూరుకుపోయాయి. రష్యాకు మారణాయుధాలిస్తే ఖబడ్దార్‌ అంటూ అమెరికా చేసిన హెచ్చరికకు జవాబన్నట్టు చైనా కమ్యూనిస్టు పార్టీ విదేశాంగ విధాన నిపుణుడు వాంగ్‌ యీ బుధవారం మాస్కో సందర్శించి రష్యాతో తమ బంధం మరింత దృఢమవుతుందని ప్రకటించారు.

పేరుకు చిన్న దేశమే అయినా అమెరికా పుణ్యమా అని ప్రస్తుతం ఉక్రెయిన్‌ దగ్గర మారణాయుధాలు, యుద్ధ ట్యాంకులు, గురిచూసి లక్ష్యాన్ని ఛేదించే బాంబులు, అత్యాధునిక యుద్ధ సామగ్రి, కోట్లాది డాలర్ల నిధులు పుష్కలంగా ఉన్నాయి. దేశం మరుభూమిగా మారినా రష్యాను చావుదెబ్బ తీయటంలో అవన్నీ ఉక్రెయిన్‌కు తోడ్పడుతున్నాయి.

నిజానికి అమెరికా మొదట్లో చాలానే ఆశించింది. రష్యాపై ప్రపంచవ్యాప్తంగా ఏహ్యభావం వస్తుందని, అది ఏకాకవుతుందని భావించింది. కానీ అలాంటి ఛాయలు కనబడటం లేదు. తమ దేశంపై 2001లో వేలాదిమంది మరణానికి కారణమైన సెప్టెంబర్‌ 11 ఉగ్రదాడి అనంతరం ‘వాళ్లెందుకు మమ్మల్ని ద్వేషిస్తున్నార’ంటూ అల్‌ఖైదా ఉగ్రవాదుల గురించి ప్రశ్నించిన అమెరికా ఇప్పుడు ఆ ప్రశ్నను కాస్త తిరగేసి అడుగుతోంది. ‘వాళ్లనెందుకు ద్వేషించటం లేద’న్నది ఆ ప్రశ్న సారాంశం.

ఇక్కడ ‘వాళ్లు’ అంటే రష్యన్లు. నిజమే, అమెరికా ఒత్తిడికి తలొగ్గి అయిష్టంగానైనా ఉక్రెయిన్‌కు మారణాయుధాలు అందజేస్తున్న యూరోప్‌ దేశాలు రష్యా నుంచి దిగుమతులు మాత్రం ఆపలేదు. తనకు సాగిలపడలేదన్న కక్షతో ఇరాన్‌పై గతంలో తీవ్ర ఆంక్షలు విధించి ఆ దేశాన్ని ఆర్థిక దిగ్బంధం చేసిన అమెరికా ఇప్పుడు రష్యాపై ఆ స్థాయిలో విరుచుకుపడటం లేదు.

రష్యా చమురు, సహజ వాయువుల ఎగుమతిలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉండటం మాత్రమే కాదు... నికెల్, అల్యూమినియం, టైటానియం వంటి లోహాలూ, రసాయన వాయువులూ, సెమీ కండక్టర్లూ, గోధు మలూ, ఎరువుల ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉంది. కఠిన ఆంక్షలతో ఇవన్నీ ఆగిపోతాయన్న భయాందోళనలు అమెరికా, యూరోప్‌ దేశాల్లో ఉన్నాయి. ఇక ముడి చమురును రష్యా చాలా చవగ్గా మనకూ, చైనాకూ విక్రయిస్తోంది.

మన దేశం అక్కడినుంచి రోజూ 12 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఏడాదిక్రితంతో పోలిస్తే ఇది 33 రెట్లు ఎక్కువ. ఇలా అనేకానేక కారణాలవల్ల రష్యాపై ప్రపంచ దేశాల్లో ఏహ్యభావం లేదు. పైపెచ్చు ఉక్రెయిన్‌కు అత్యుత్సాహంతో అమెరికా, యూరోప్‌ దేశాలు మారణాయుధాలు అందిస్తున్న తీరువెనక వారికి వేరే ప్రయోజనాలున్నాయని ప్రపంచం విశ్వసిస్తోంది.

అది పాశ్చాత్య దేశాల చేతిలో కీలుబొమ్మ అని రష్యా చేస్తున్న ప్రచారం నిజం కావొచ్చన్న అభిప్రాయం కలుగుతోంది. ఒక సర్వే ప్రకారం భారత్, చైనా, తుర్కియే దేశాల్లో అత్యధికులు రష్యాకు అనుకూలంగానే ఉన్నారని వెల్లడైంది. సోవియెట్‌ యూనియన్‌ ఉనికిలో ఉన్నప్పుడు దాన్ని అగ్రరాజ్యంగా, ప్రమాదకరమైన శక్తిగా భావించేవారు. ఇప్పుడు రష్యాపై ఆ ముద్ర లేదు.

ప్రచ్ఛన్న యుద్ధ దశ ముగిశాక అమెరికా, రష్యాల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగిన పర్యవసానంగా 2010లో అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందం(స్టార్ట్‌) కుదిరింది. దాని కాలపరిమితి 2026 ఫిబ్రవరిలో ముగియబోతోంది. కొత్త ఒప్పందంపై మొదలైన చర్చలను నిలిపేస్తున్నట్టు ప్రకటించి పుతిన్‌ అందరినీ ఆందోళనలో పడేశారు. ఏ పక్షమూ మొదటగా అణ్వాయుధాలు ఉపయోగించకుండా నియంత్రించే ఆ ఒప్పందం ఒక్కటే రెండు దేశాల మధ్యా మిగిలింది.

దాన్ని కాస్తా పున రుద్ధరించటానికి చర్యలు తీసుకోకపోతే ప్రపంచ మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఇక రెండు దేశాలూ తమ అణ్వాయుధాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థేమీ మిగలదు. పుతిన్‌ మరో మాట కూడా అన్నారు. అమెరికా గనుక అణు పరీక్షలు మొదలుపెడితే తాము కూడా సర్వసన్నద్ధంగా ఉన్నామని ప్రకటించారు. యుద్ధం ఆగనంతకాలమూ ఇలా సవాళ్లు, ప్రతి సవాళ్లతో పరిస్థితి నానాటికీ దిగజారుతుంది.

యూరోప్‌ భద్రత ప్రమాదంలో పడుతుంది. యుద్ధాన్ని విరమించి శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోమని మన దేశం ఇరుపక్షాలకూ చెబుతోంది. కానీ మున్ముందు ఇలా మధ్యవర్తిత్వం వహించే అవకాశాలు కూడా ఉండవు. ఇప్పటికే 80 లక్షలమంది ఉక్రెయిన్‌ పౌరులు కొంపా గోడూ వదిలి వలసపోయారు. వేలాదిమంది మరణించారు. అనేకులు వికలాంగులయ్యారు.

అటు రష్యా సైతం భారీగా నష్టపోయింది. బలహీన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు ఈ యుద్ధంతో సంక్షోభంలో పడ్డాయి. అందుకే మతిమాలిన ఈ యుద్ధాన్ని విరమించేలా రష్యాపై ప్రపంచం ఒత్తిడి తేవాలి. ఉక్రెయిన్‌కు సాయం పేరిట పరిస్థితి మరింత విషమించే చర్యలకు స్వస్తి పలకాలని అమెరికాను కోరాలి. యుద్ధంతో అంతిమంగా మిగిలేది విషాదమేనని గుర్తించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement