
కళ్లముందు ప్రమాదకర సంకేతాలు కనబడుతున్నా అమెరికాను గుడ్డిగా అనుసరిస్తూ పోవటం అలవాటు చేసుకున్న యూరప్‌కి డోనాల్డ్ ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక వరస షాక్‌లు తప్పడం లేదు. గతవారం జర్మనీలో జరిగిన మ్యూనిక్ భద్రతా సదస్సుకొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ‘వాక్ స్వాతంత్య్రానికీ, ప్రజాస్వామ్యానికీ మీవల్లే ముప్పు ముంచుకొస్తున్నద’ని యూరప్ దేశాలపై విరుచుకుపడ్డారు.
దాన్నుంచి తేరుకోకముందే ఆ దేశాల ప్రమేయం లేకుండా ఉక్రెయిన్ యుద్ధం నిలుపుదలపై రష్యాతో సౌదీ అరేబియాలోని రియాద్‌లో అమెరికా భేటీ అయింది. యూరప్ వరకూ ఎందుకు... రష్యాతో రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో శిథిలావస్థకు చేరిన ఉక్రె యిన్‌నే ఆ చర్చలకు ఆహ్వానించలేదు.
యుద్ధం ఆపడానికి అవకాశాలున్నాయా, ఆ విషయంలో తొలి అడుగువేయటం అసలు సాధ్యమేనా అనే అంశాలను నిర్ధారించుకోవటానికే రియాద్ సమా వేశం జరిగిందని అమెరికా విదేశాంగశాఖ సంజాయిషీ ఇస్తున్నా దాని వ్యవహారశైలి యూరప్ దేశా లకు మింగుడు పడటం లేదు. ఆ విషయంలో నిజంగా చిత్తశుద్ధి వుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడటానికి ముందు ట్రంప్ యూరప్ దేశాల అధినేతలను సంప్రదించేవారు.
దాదాపు ఎనభైయ్యేళ్లుగా యూరప్ దేశాలన్నీ అమెరికా అడుగుజాడల్లో నడిచాయి. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సైన్యాన్ని మట్టికరిపించిన సోవియెట్ సేనలు తూర్పు యూరప్ దేశాల తర్వాత తమవైపే చొచ్చుకొస్తాయని, తాము బలికావటం ఖాయమని పశ్చిమ యూరప్ దేశాలు వణికిపోయాయి. నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ దీన్ని చక్కగా వినియోగించుకుని ఉత్తర అమెరికా ఖండంలో తన పొరుగు దేశమైన కెనడాను కలుపుకొని పశ్చిమ యూరప్ దేశాలతో జత కట్టి పటిష్ఠమైన సైనిక కూటమి నాటోకు అంకురార్పణ చేశారు.
అమెరికా–సోవియెట్‌ల మధ్య సాగే పోటీలో యూరప్ దేశాలు అవసరం లేకున్నా తలదూర్చాయి. ఆర్థికవ్యవస్థలు అనుమతించక పోయినా తమ తమ జీడీపీల్లో రెండు శాతం నాటో కోసం వ్యయం చేశాయి. యూరప్ భూభాగంలో అణ్వాయుధాల మోహరింపు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, మారణాయుధాలు జోరందుకున్నాయి.
యూరప్ దేశాలకు ఆనాటి సోవియెట్ నుంచి లేదా ప్రస్తుత రష్యా నుంచి ఎన్నడూ ముప్పు కలగలేదుగానీ... నాటోవల్ల లిబియా, సిరియా, అఫ్గానిస్తాన్, సూడాన్, సోమాలియా తది తర దేశాలు అస్థిరత్వంలోకి జారుకుని ఉగ్రవాదం వేళ్లూనుకుంది. సిరియావంటి దేశాల్లో ప్రభుత్వా లను కూలదోసేందుకు విచ్చలవిడిగా ఆయుధాలందించటంవల్ల ఐసిస్ అనే భయంకర ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది.
ఉక్రెయిన్ దురాక్రమణకు రష్యాను రెచ్చగొట్టింది కూడా యూరప్ దేశాలే. 2013లో అమెరికా ప్రోద్బలంతో ఉక్రెయిన్‌తో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకోవటంతోపాటు ఐఎంఎఫ్ రుణం పొందేందుకు సహకరించింది ఈయూ దేశాల కూటమే.
అయితే ఐఎంఎఫ్ కఠిన షరతులను తిరస్కరించి రష్యా ఇచ్చే 1,500 కోట్ల డాలర్ల రుణం తీసుకోవటానికి అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ నిర్ణయించటంతో దేశంలో ప్రజా ఉద్యమం పేరిట తిరుగుబాటుకు అంకు రార్పణచేసి అస్థిరపరచటంలో అమెరికా, ఈయూల పాత్ర వుంది.
ఈ పరిణామాలే పుతిన్‌ను క్రిమియా ఆక్రమణకు పురిగొల్పాయి. ఎన్నికల్లో చట్టబద్ధంగా గెలిచిన యనుకోవిచ్‌ను ఈ వంక చూపి 2019లో కూలదోసి, సినీ నటుడు జెలెన్‌స్కీని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టడం, పర్యవసానంగా మూడేళ్లక్రితం పుతిన్ ఉక్రెయిన్‌పై దండెత్తటం వర్తమాన చరిత్ర.
యుద్ధంపై తమ ప్రమేయం లేని చర్చల్ని గుర్తించబోనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. యూరప్ దేశాలకు కనీసం ఆ మాత్రం ధైర్యం కూడా లేదు. తాజా పరిణామాల నేప థ్యంలో ఏం చేయాలో చర్చించటానికి ఫ్రాన్స్ చొరవతో సోమవారం పారిస్‌లో జరిగిన అత్యవసర భేటీకి అరడజను దేశాలు హాజరయ్యాయి. అవి కూడా కింకర్తవ్య విచికిత్సలో పడ్డాయి.
ఉక్రెయిన్‌కు శాంతి సేనలను పంపటానికి తాను సిద్ధమని ప్రకటించిన బ్రిటన్... ఆ వెంటనే ‘అమెరికా అందుకు అనుమతిస్తేనే’ అని ముక్తాయించింది. ఈలోగా జర్మనీ, పోలాండ్, స్పెయిన్‌లు దాన్ని అసందర్భ ప్రతిపాదనగా కొట్టిపారేశాయి. అమెరికా తాజా వైఖరితో యూరప్ స్వీయరక్షణ కోసం సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిపాదనపై సైతం అనుకూల స్వరాలు వినబడటంలేదు.
ట్రంప్ ఆగమనం తర్వాత అమెరికాతో యూరప్ దేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్న అభిప్రాయం అందరిలో ఏర్పడింది. దీనికితోడు ట్రంప్ అనుచరగణం యూరప్‌లో తీవ్ర మితవాద పక్షాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయం వివిధ దేశాధినేతలకు ఉంది.
ట్రంప్ వైఖరి ఎలా వుంటుందన్న అంశంలో ఆయన తొలి ఏలుబడిలో యూరప్ దేశాలకు తగి నంత అవగాహన వచ్చింది. కానీ దశాబ్దాల తరబడి అమెరికా అనుసరిస్తున్న విధానాలను రెండో దఫాలో మెరుపువేగంతో ఆయన తిరగరాస్తారని ఆ దేశాలు ఊహించలేదు. ఈసారి ట్రంప్ వెనకున్న ఎలాన్ మస్క్, స్టీవ్ బానన్, మార్కో రుబియో తదితరులతోపాటు సమర్థుడైన దూతగా పేరున్న విట్‌కాఫ్‌లే అందుకు కారణం కావొచ్చు.
పర్యవసానంగా ట్రంప్ రంగప్రవేశం చేసి నెల తిరగకుండానే యూరప్ దేశాలకు ప్రపంచం తలకిందులైన భావన కలిగింది. స్వతంత్రంగా ఎదగటానికి ప్రయత్నించక కీలుబొమ్మల్లా వ్యవహరించిన ఆ దేశాలు ఇప్పటికైనా వివేకం తెచ్చుకోవాలి. సొంత ఆలోచనతో, స్వీయప్రయోజనాల కోసం పనిచేయటం నేర్చుకోవాలి. రోజులు ఎప్పుడూ ఒకేలా వుండవని గ్రహించాలి.
Comments
Please login to add a commentAdd a comment