అగ్రరాజ్యం కొత్త యుద్ధానికి తెర తీసింది. అయితే, ఇది ఆయుధాలతో కూడిన యుద్ధం కాదు... ఆర్థికపరమైన యుద్ధం. అధ్యక్షుడు ట్రంప్ తన అత్యవసర అధికారాలను ఉపయోగిస్తూ... కెనడా, మెక్సికోల నుంచి దిగుమతులపై 25 శాతం మేర, అలాగే చైనా నుంచి దిగుమతులపై ఇప్పటికే ఉన్న భారానికి అదనంగా మరో 10 శాతం మేర సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కెనడా నుంచి దిగుమతి చేసుకొనే చమురు, సహజ వాయువుపై మాత్రం 10 శాతం వడ్డింపుతో సరి పెట్టారు. ఇది అమెరికాకూ, దాని అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలు మూడింటికీ మధ్య వాణిజ్య యుద్ధాల శకానికి శ్రీకారం చుట్టింది. చైనాను పక్కనబెట్టినా, సాక్షాత్తూ పొరుగుదేశాలపైనే ట్రంప్ ఇలా ఆర్థికంగా కత్తి దూయడం విడ్డూరమే.
అదేమంటే... పెరుగుతున్న నేరాలనూ, డ్రగ్స్ సరఫరానూ అడ్డుకోవడానికే ఈ చర్య అంటూ సమర్థించుకోవడం మరీ విచిత్రం. ఈ సంచలనాత్మక చర్యకు ప్రతిచర్యగా మెక్సికో సైతం ఎదురు సుంకాలు వేయగా, త్వరలో జాతీయ ఎన్నికలున్న కెనడా కూడా అమెరికాకు దీటుగా 25 శాతం సుంకాల వడ్డింపుతో ఎదురుదాడికి దిగింది. అమెరికా తప్పుడు విధానాలపై ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు వేయనున్నట్టు చైనా ప్రకటించింది. కడపటి వార్తలు అందుతున్న సమయానికి అమెరికా – మెక్సికోల మధ్య మాత్రం సయోధ్య కుదురుతోందనీ, ఆ దేశంపై సుంకాలను అమెరికా నెల రోజులు వాయిదా వేసిందనీ సమాచారం. ఆ మాట ఏమైనా, విశ్వవేదికపై ట్రంప్ ఆరంభించిన వాణిజ్య పోరు రసకందాయంలో పడింది.
ఇప్పటికే పరాయి దేశాలకు 36 లక్షల కోట్ల డాలర్ల మేర అప్పులున్న అగ్రరాజ్యం వాటి నుంచి బయటపడేందుకు సుంకాలు పెంచినట్టనిపిస్తున్నా, ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు స్వయంకృత గాయమే. పెరిగిన సుంకాలతో అమెరికాకు సరఫరా తగ్గి, సరుకుల ధరలు పెరిగి, సామాన్యులపై భారం పడుతుంది. ఈ సుంకాల వల్ల ఈ ఏడాది అమెరికాలో ద్రవ్యోల్బణం ఇప్పు డున్న 2.9 శాతం నుంచి మరో అర శాతం దాకా పెరుగుతుందట. ఇక, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 1.5 శాతం మేర పడిపోతుందని విశ్లేషణ.
సగటు అమెరికన్ కుటుంబంపై ఏటా వెయ్యి నుంచి 1200 డాలర్ల మేర భారం పడుతుందని లెక్క. మొత్తం మీద అక్రమ వలసలు, ఫెంటానిల్ తరహా మందుల లాంటి ప్రధాన సమస్యలపై ట్రంప్ దృష్టి పెట్టడం బానే ఉన్నా, దిగుమతి సుంకాలు పెంచడమనే తప్పుడు విధానం వల్ల అమెరికన్లకే నష్టమనే భావన ఉంది. సరుకుల ధరలు తగ్గిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన ట్రంప్ తీరా అందుకు వ్యతిరిక్తంగా వ్యవహరిస్తున్నా రని ప్రతిపక్ష డెమోక్రాట్లు ధ్వజమెత్తుతున్నారు. గత ట్రంప్ హయాంలోని చైనాతో వాణిజ్య యుద్ధాన్నే తమ పాలనలో కొనసాగించిన డెమోక్రాట్లు ఇప్పుడు భిన్న వైఖరి తీసుకుంటారేమో చూడాలి.
ప్రధాన ఆర్థిక వ్యవస్థలపై ఇంతగా సుంకాల విధింపు ఆలోచనను దశాబ్దం క్రితం చేస్తే దాన్ని వెర్రిమొర్రి ఆలోచనగా చూసేవారు. కానీ, ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఆ పనే చేసింది. మెక్సికో, కెనడా, చైనాలతో ఇది ఆగుతుందా, లేక రానున్న రోజుల్లో యూరోపియన్ యూనియన్, భారత్ సహా ఇతర దేశాలపైనా ట్రంప్ ఈ అస్త్రం ప్రయోగిస్తారేమో చూడాలి. నిజానికి, వలసలను ఆపి, అధిక దిగుమతులకు ముకుతాడు వేయాలంటే, తగినంత సమయం వెచ్చించి, విధానపరమైన అంశాలపై లోతుగా దృష్టి పెట్టాలి.
వలసజీవుల్ని పెద్దయెత్తున వెనక్కి పంపడంతో అమెరికాలో చౌకగా దొరికే శ్రామికులు తగ్గి, వేతనాలు పెరిగి, ద్రవ్యోల్బణం హెచ్చుతుంది. కానీ, ఎవరు చెప్పినా ఒక పట్టాన వినే ఘటం కాని ట్రంప్ సమస్త వాణిజ్య, ఆర్థికేతర సమస్యలకూ ఈ సుంకాల విధింపే సర్వరోగ నివారిణి అని భావిస్తున్నారు. చమురు మొదలు సరుకుల దాకా ఏవీ పొరుగుదేశాల నుంచి అమెరికాకు అక్కర్లేదని హూంకరిస్తున్నారు కానీ, దిగుమతులేవీ చేసుకోకుండా, సమస్తం స్వదేశంలోనే సిద్ధం చేసుకొని, ఎవరితోనూ ఏ వాణిజ్య సంబంధాలూ అవసరం లేని బంధిత ఆర్థిక వ్యవస్థగా అమెరికాను తీర్చిదిద్దడం సాధ్యమేనా? దేశాల ద్వారాలన్నీ తెరుచుకొని, ప్రపంచమొక కుగ్రామంగా మారిన వర్తమాన కాలంలో ఈ రకమైన విధానంతో మనగలగడం అగ్రరాజ్యానికైనా సరే కుదురుతుందా?
ట్రంప్ తాజా చర్యతో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి, గందరగోళం నెలకొన్నాయి. ప్రపంచమంతటా దీని ప్రకంపనలూ తప్పవు. భారత్ అనేక విడిభాగాల కోసం దిగుమతులపై ఆధారపడినందున మన వస్తూత్పత్తి రంగం పైన, అలాగే డాలర్ బలపడి, విదేశీ మదుపరులు విక్రయాల్ని కొనసాగించడంతో మార్కెట్ పైన ప్రభావం కనిపించనుంది. అలాగే, అమెరికా భారీ సుంకాల బారిన పడ్డ ఆర్థిక వ్యవస్థలు ఇక తమ వస్తువుల్ని ఇతర దేశాల్లో కుమ్మరించాలి గనక భారత పరిశ్రమలకు బెత్తం చూపే ప్రమాదం ఉంది.
కాబట్టి, ఇప్పటికైతే సుంకాల విధింపు జాబితాలో మన పేరు లేకున్నా భారత్ తగిన జాగరూకతతో వ్యవహరించాలి. ఈ నెలలోనే అమెరికాలో పర్యటించ నున్న భారత ప్రధాని ఇరుదేశాల బలమైన బంధాన్ని మనకు సానుకూలంగా మలుచుకోవాలి. అయితే, ఒకటి మాత్రం నిజం. కోర్టులు బరిలోకి దిగి, ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధమని తీర్మానిస్తే తప్ప... ప్రజాభిమతంతో గద్దెనెక్కిన ట్రంప్ ఆలోచనలకూ, అనుసరించే విధానాలకూ అడ్డులేదు. కనుక ట్రంప్ మార్కు వ్యవహారశైలికి ఇవాళ్టికి ఇవాళ బ్రేకులు పడవు. అదేసమయంలో దిగుమతి సుంకాల వల్ల అమెరికా సంపద్వంతమై, బలోపేతమవుతుందన్న ఆయన ఆలోచన మాత్రం ఆచరణలో వాస్తవరూపు దాల్చడమూ కష్టమే!
అగ్రరాజ్యపు వాణిజ్య యుద్ధం
Published Tue, Feb 4 2025 1:45 AM | Last Updated on Tue, Feb 4 2025 5:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment