దయ్యాల వేద పఠనం! | Sakshi Editorial On Yellow media spreading false propaganda against Jagan | Sakshi
Sakshi News home page

దయ్యాల వేద పఠనం!

Published Sun, Mar 9 2025 4:01 AM | Last Updated on Sun, Mar 9 2025 10:03 AM

Sakshi Editorial On Yellow media spreading false propaganda against Jagan

జనతంత్రం

తెర వెనుక కత్తుల కోలాటమాడుతున్నవారు తెరముందుకొచ్చి శాంతి కపోతాలను వదులుతున్నారు. రోత చేష్టల రంగమార్తాండులు శ్రీరంగనీతులు బోధిస్తున్నారు. అదిగో దొంగ ఇదిగోదొంగ అంటూ గజదొంగలే అరుస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో కంచె చేను మేస్తున్నది. పోలీసు వ్యవస్థను ప్రతిపక్షంపైకి పాలకులు ఉసిగొల్పుతున్నారు. ఇదే కదా, అసలు సిసలైన వ్యవస్థీకృత నేరం. అత్యున్నత స్థాయి పోలీసు అధికారి మంత్రి వర్గం ముందు హాజరై ఓ గొప్ప వాగ్దానం చేశాడని వార్తలు వెలువడ్డాయి. ప్రతిపక్షాన్నీ, దాని అభిమానులనూ వేటాడే పనిలో మరింత వేగం  పెంచుతారట. దీన్నేమంటాము? నేరమే అధికారమై కొలువు దీరడం కాదా? నేరమే అధికారమై కొరడా ఝుళిపించడం కాదా?

నేరమే అధికారమై ప్రజల్నే నేరస్థుల్ని చేస్తుంటే నోరుండీ ఊరక కూర్చున్న ప్రతి ఒక్కడూ నేరస్థుడేనంటారు విప్లవకవి వరవరరావు. ఈరోజు వేటాడుతున్నది ప్రతిపక్షాన్నే కావచ్చు. రక్తం రుచి మరిగిన పులికి పరిమితులూ, షరతులూ వర్తి స్తాయా? ఉపవాస దీక్షలేమైనా అడ్డొస్తాయా? పౌరహక్కులను పాదాల కింద తొక్కేయడానికి అలవాటుపడ్డ పోలీస్‌ రాజ్యం కూడా అంతే! ఈ రోజున వాడు తడుతున్నది నీ ఇంటి తలుపును కాకపోవచ్చు. నేడు కాకపోతే రేపు లేదా మరునాడు... నువ్వు నీ హక్కుల్ని గురించి ప్రశ్నించిన రోజున నీ ఇంటి ముంగిట కూడా ఆ బూట్ల చప్పుడు వినిపిస్తుంది.

నేరమే అధికారమై ప్రశ్నిస్తున్న ప్రతివాడి మీద నేరస్థుడనే ముద్ర వేసే ధోరణిని ఆదిలోనే ప్రతిఘటించకపోతే ప్రజా స్వామ్య మనుగడకే ప్రమాదమేర్పడుతుంది. అధికారంలోకి రావడానికి అసత్యాలకూ, అభూత కల్పనలకూ ఒడిగట్టారు గనుక ప్రభుత్వపక్ష స్వభావాన్ని నేరపూరితమైనదిగా భావించ వలసి వస్తున్నది. అసత్యాలూ, అభూత కల్పనలన్నీ ఒక్కొ క్కటిగా రుజువౌతూ వస్తున్నాయి గనుక నేరమే అధికారం రూపు దాల్చిందని అనుకోవలసి వస్తున్నది. 

గతకాలపు జగన్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందనీ, 14 లక్షల కోట్ల అప్పు చేశారనీ కూటమి పక్షం ఊరూవాడా ఏకంచేసి ప్రచారం చేసింది. మొన్ననే రాష్ట్ర శాసనసభలో సాక్షాత్తూ ఆర్థికమంత్రి పాత ప్రచారానికి విరుద్ధమైన ప్రకటన చేశారు. జగన్‌ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 3 లక్షల 39 వేల కోట్లేనని తేల్చారు. ఎంత గుండెలు తీసిన బంట్లు వీరు? ఈ ఒక్క ఉదాహరణ చాలదా, ప్రభుత్వ నేరపూరిత స్వభావాన్ని నిర్ధారణ చేయడానికి?

అప్పుల ప్రస్తావన మచ్చుకు మాత్రమే. ఇటువంటి బేషరమ్‌ ప్రచారాలు చాలా చేసింది కూటమి. సామాన్య ప్రజల ఆశల మీద, ఆకాంక్షల మీద కూటమి జూదమాడింది. వారి కలల అలల మీద ఆటలాడింది. ఏమార్చడానికి ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను డస్ట్‌బిన్‌లోకి గిరాటేసింది. కుర్చీ మీద కూర్చొని నవమాసాలు గడిచిపోయాయి. హామీల డెలివరీ ఆనవాళ్లే లేవు. ఉండకపోవచ్చు కూడా. 

బడ్జెట్‌లో కొన్ని హామీలకు మాత్రమే అరకొర కేటాయింపులు చూపారు. మిగతా వాటి ఊసే లేదు. నిరుద్యోగులకు నెలకు 3 వేల భృతి ఇస్తామన్నారు. మోసం చేశారు. ఆడబిడ్డలకు నెలకు పదిహేను వేలిస్తామన్నారు. మోసం చేశారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏటా 15 వేలిస్తా మన్నారు. దానికి ఒక ఏడాది ఎగనామం పెట్టి, ఈసారి బడ్జెట్‌లో అవసరమైన సొమ్ములో సగం మాత్రమే కేటాయించారు.

ఇంతవరకూ ఒక్క పైసా కూడా లబ్ధిదారులకు చేరలేదు.రైతుకు ఏటా 20 వేల ఆర్థిక సాయమన్నారు. రైతన్న ఎదురు చూస్తూనే ఉన్నాడు.సాయం సంగతి దేవుడెరుగు. పండించిన పంటకు గిట్టు బాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. జగన్‌ హయాంలో ఇరవై నుంచి ఇరవై ఏడు వేల దాకా పలికిన క్వింటాల్‌ మిర్చి ధర ఇప్పుడు ఆరేడు నుంచి పదివేల దాకా పడిపోయింది. 

పెట్టుబడి ఖర్చులు కూడా రైతులకు రాలేదు. అన్ని పంటల కథలూ దాదాపు ఇంతే! కాల్వల కింద వేసుకున్న వరి పైర్లు కూడా నీటి తడులు లేక ఎండిపోతున్న వైనాన్ని ఐదేళ్ల తర్వాత ఇప్పుడే చూస్తున్నాము. మహిళలకు ఉచిత బస్సు ఇంకా డిపో దాటి రోడ్డెక్కలేదు. అప్పుడే దానిమీద మాట మార్చడం మొదలైంది. ఉచిత బస్సును ఒక్క జిల్లాకే పరిమితం చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు.

ఈ రకంగా హామీల ఎగవేతతోపాటు పాలనా వైఫల్యాలతో ఆదిలోనే అప్రతిష్ఠ మూటగట్టుకున్న కూటమి సర్కార్‌ విమర్శ కుల నోళ్లు మూయించి, అసత్యాలను ప్రచారంలో పెట్టి పబ్బం గడుపుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీపై దాడిని కేంద్రీకరించి, భారత న్యాయసంహితలోని 111వ సెక్షన్‌ను ఈ దాడికి ఆయుధంగా వాడటం మొదలుపెట్టారు. సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేసే వారిపై ఈ సెక్షన్‌ వాడకూడదని ఏపీ హైకోర్టు చెప్పినా కూడా కూటమి సర్కార్‌ చెవికెక్కించుకోలేదు. కిడ్నాపులు, దోపిడీలు, భూకబ్జాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఆర్థిక నేరాలు వగైరా ముఠాలుగా ఏర్పడి చేసే నేరాలు (వ్యవస్థీకృత నేరాలు) ఈ సెక్షన్‌ పరిధిలోకి వస్తాయి.

సోషల్‌ మీడియాలో చేసే విమర్శలను ఈ పరిధిలోకి తెచ్చి రాష్ట్ర సర్కార్‌ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రత్యర్థుల పట్ల కక్షపూరిత వైఖరి కారణంగానే సర్కార్‌ ఈ కుట్రకు తెరతీసిందనుకోవాలి. సోషల్‌ మీడియాలో చేసే విమర్శల వెనుక ఎవరిదో ప్రోద్బలం ఉన్నదనీ, ఇదంతా వ్యవస్థీకృతంగా జరుతున్నదనీ ఓ స్క్రీన్‌ప్లేను తయారుచేసి, దానికి అనుగుణంగా కీలక వ్యక్తులను అరెస్ట్‌ చేయాలనీ, తద్వారా ఆ పార్టీని బలహీన పరచాలనే పన్నాగం స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇందు కోసం వేలాదిమంది కార్యకర్తలు, అభిమానుల మీద కేసులు పెట్టాలనీ, వేధించాలనీ జిలాల్ల వారీగా టార్గెట్లు పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇటీవల పోలీసు ఉన్నతాధికారి నిర్వహించిన ఒక సమీక్షా సమావేశంలో కూడా ఈ టార్గెట్‌లను చేరుకునేలా సహకరించాలనే ఆదేశాలిచ్చినట్టు వచ్చిన వార్తలు నిజమైతే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. గత ప్రభుత్వ హయాంలో కూటమి అగ్రనాయకులంతా బరితెగించి మాట్లాడిన బూతుల ఆడియోలు, చెప్పులు చూపెట్టిన వీడియోలు కోకొల్లలు. వీరికి భిన్నంగా వైసీపీ అధినేత ఏనాడూ ఏ ఒక్క అసభ్యకర వ్యాఖ్యానం చేయలేదు. అయినా సరే, వీరి బూతులకు బదు లిచ్చిన నేతలపై అక్రమ కేసులకు తెగబడుతున్నారు.

మొన్నటి మంత్రివర్గ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత ఒక పోలీస్‌ ఉన్నతాధికారి హాజరై ఒక వింత సందేశాన్ని వినిపించినట్టు యెల్లో మీడియా టాప్‌ న్యూస్‌గా ప్రచారంచేసింది. బహుశా కూటమి పెద్దల తాజా కుట్రలో భాగంగానే ఈ వింత కథను ప్రచారంలోకి తెచ్చి ఉంటారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇటీవల చనిపోయిన రంగన్న అనే వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మన్‌ మరణం అనుమానాస్పదమేనని ఆ ఉన్నతాధికారి మంత్రులకు ఉపదేశించారట! అనారోగ్యంతో ఉన్న తన భర్తను పోలీసులు వేధించారనీ, అందువల్లనే అయన చనిపోయాడనీ రంగన్న భార్య మీడియాతో మాట్లాడిన మాట లను వారెందుకు పరిశీలనలోకి తీసుకోలేదో తెలియదు మరి!

అంతటితో ఆగలేదు. ఈమధ్యకాలంలో చనిపోయిన వ్యక్తులను వివేకానంద హత్య కేసుకు లింకు చేస్తూ అవన్నీ అనుమానాస్పద మరణాలేనని చెప్పడానికి పూనుకోవడం, మోకాలుకు, బోడిగుండుకు ముడిపెట్టినట్టు కథలు అల్లడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన అభిషేక్‌ రెడ్డి మరణంపై కూడా అనుమానాలున్నాయట! జగన్‌ కుటుంబ సభ్యుల ప్రేమాభిమా నాలు చూరగొన్న డ్రైవర్‌ నారాయణ కేన్సర్‌ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కొంతకాలం క్రితం చనిపోయాడు. 

అందులో కూడా అనుమానం ఉన్నదట! నీచమైన కుట్రలకు పరాకాష్ట డాక్టర్‌ గంగిరెడ్డి పేరును కూడా ఇందులోకి లాగడం. డాక్టర్‌గంగిరెడ్డి భారతమ్మ తండ్రి. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. ఆయన మరణం కూడా అనుమానమేనట! పోలీస్‌ అధికారి ఏం చెప్పాడో తెలియదుగానీ ‘ఈనాడు’ మాత్రం అరపేజీ ఫిక్షన్‌ రాసి పారేసింది.

తాము చెప్పదలుచుకున్న కథలో ఆవగింజంత నిజమైనా ఉండాలన్న నియమం వారికేమాత్రం లేదు. చెప్పింది ప్రచారం చేసిపెట్టడానికి మోచేతి కింద వందిమాగధ మీడియా సిద్ధంగా ఉన్నది. చేతిలో అధికారం ఉన్నది. వ్యవస్థల మెడలకు బిగించిన ఇనుప గొలుసులు తమ చేతిలోనే ఉన్నాయి. ఉసిగొలిపితే చాలు. కేసులు పెట్టడం ఎంత పని? ఇప్పుడిదే కూటమి సర్కార్‌ సింగిల్‌ పాయింట్‌ ఎజెండా! 

దయ్యాలు వేదాలు వల్లించినట్టు,తోడేళ్లు – గుంటనక్కలూ శాకాహార ప్రతిజ్ఞలు చేసినట్టు ఈ పెద్దలంతా సభలు పెట్టుకొని ఒకరినొకరు పొగుడుకుంటూ, ప్రజా సంక్షేమం గురించి, ప్రజాస్వామ్యం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడటం కంటే ఎబ్బెట్టు దృశ్యాలు ఇంకేముంటాయి? అటువంటి ఎబ్బెట్టు దృశ్యాన్ని ఈమధ్యనే విశాఖతీరంలో చూడవలసి వచ్చింది.

తెలంగాణ పునరాలోచన?
తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ ఏర్పాటై సరిగ్గా పదిహేను మాసాలైంది. అరవై మాసాల (ఐదేళ్ల) పాలన కోసం ప్రజలు ఎన్నుకున్నారనుకుంటే అందులో పావు భాగం ప్రయాణం పూర్తయిందన్నమాట. నిజానికి ఈపాటికే ప్రభుత్వం పూర్తిగా కుదురుకొని దాని ఎజెండాను పరుగెత్తించే క్రమంలో ఉండాలి. కానీ, ఎందుకనో ఇప్పటికీ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య, ప్రభు త్వంలోని మంత్రుల మధ్య, మంత్రులకు అధికారులకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ గనుక ఇటువంటివన్నీ షరా మామూలేనని ఆ పార్టీ నేతలు సమర్థించుకోవచ్చు గాక. కానీ, ఈ వాదనను అంగీకరించడానికి జనం సిద్ధంగా లేరు.

శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆర్భాటంగా పోటీ చేసి, ముఖ్యమంత్రితో సహా యంత్రాంగమంతా రంగంలోకి దిగి కూడా ఓటమి పాలైంది. అది కూడా బీజేపీ చేతిలో! రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పునాది, కార్యకర్తల బలం, నాయకత్వ ఇమేజ్‌ ఉన్న బీఆర్‌ఎస్‌ చేతిలో ఓడిపోయి ఉంటే కనీసం గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ప్రధాన శత్రువు, ఉత్తరాది పార్టీగా తాము విమర్శించే బీజేపీ చేతిలోభంగపడటం కచ్చితంగా కాంగ్రెస్‌ సర్కార్‌కు ఇబ్బందికరమైన విషయమే. బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేయకుండా బీజేపీకి సహకరించిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తున్నది.

అయితే ఈ ఆరోపణకు సరైన ఆధారం కనిపించడం లేదు. బీఆర్‌ఎస్‌ గనుక లోపాయకారిగానైనా బీజేపీకి పూర్తిగా సహకరించి ఉంటే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు అంత భారీస్థాయిలో ఓట్లు పడేవి కావు. బీసీ నినాదం వల్లనే హరికృష్ణ పెద్దసంఖ్యలో ఓట్లు సంపాదించారనే వాదన కూడా ఉన్నది. కానీ తెలంగాణ బీసీ సమూహాల్లో సామాజిక విధేయత కన్నా రాజకీయ విధేయతే ఎక్కువ. బీఆర్‌ఎస్‌కు విధేయంగా ఉండే ఓటర్లలో బీసీలే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కనుక బీఆర్‌ఎస్‌ ఓట్లు పెద్దసంఖ్యలో హరికృష్ణకు బదిలీ అయుండవచ్చనే అభిప్రాయం ఉన్నది.

కేవలం వ్యక్తిగత సంబంధాల మీద ఆధారపడి పెద్దగా ఆర్థిక దన్ను లేకుండానే బీజేపీ, కాంగ్రెస్‌లకు హరికృష్ణ గట్టి పోటీ ఇవ్వగలిగినప్పుడు, బీఆర్‌ఎస్‌ రంగంలో ఉన్నట్లయితే గెలిచేది కాదా అనే చర్చ కూడా మొదలైంది. పోటీ చేయకపోవడానికి బీఆర్‌ఎస్‌కు ఉన్న కారణాలేమిటో అధికారికంగా తెలియదు. పార్టీ గుర్తుపై ఎన్నికై అధికార పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి ఆ స్థానాల్లో ఉపఎన్నికలు రావాలని బీఆర్‌ఎస్‌ బలంగా కోరుకుంటున్నది. అందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌ సహకారం అవసరమని కూడా ఆ పార్టీ భావిస్తుండవచ్చు. అందుకోసమే కౌన్సిల్‌ బరికి బీఆర్‌ఎస్‌ దూరం జరిగిందనే అభిప్రాయం కూడా ఉన్నది.

తెలంగాణలో తమ పార్టీ బాగా బలపడిందని బీజేపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. నిజంగానే అర్బన్, సెమీ ఆర్బన్‌ ప్రాంతాల్లో కొంత హిందూత్వ ప్రభావం ఆ పార్టీకి ఉపకరిస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ యువతలో వీరహిందూత్వ ప్రచారం బాగానే పనిచేస్తున్నది. బంజారా, ఇతర గిరిజన తెగల్లో ప్రాబల్యం సంపాదించడానికి కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నది. ఈ పరిణామాలు సహజంగానే బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు కలవరం కలిగిస్తాయి.

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒక చిన్న లిట్మస్‌ టెస్ట్‌ అందుబాటులో ఉన్నది. పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెచప్పుడు వింటే చాలు. అనర్హత విషయంలో సుప్రీంకోర్టు పట్టుదలగా ఉండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారట. కాంగ్రెస్‌ టిక్కెట్‌పై ఉపఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదని ఫిరాయింపుదారులు బలంగా నమ్ము తున్నారు. కొందరు బహిరంగంగా తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. గోడ దూకినవారు మళ్లీ గోడెక్కి కూర్చుంటు న్నారు. మరికొందరు అంతర్గతంగా మథనపడుతున్నారు.అంతే తేడా!

ప్రయాణంలో పాతిక శాతం కూడా పూర్తికాక ముందే కాంగ్రెస్‌ పార్టీ ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టు కనిపిస్తున్నది. ధిక్కార స్వరాలు వినిపించడం మొదలైంది. ఈ పరిస్థితి రావడా నికి ప్రభుత్వంలో సమన్వయ లోపం, అనుభవ రాహిత్యం కూడా ప్రధాన కారణాలే! రైతులకు రెండు లక్షల రుణమాఫీకింద 20 వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం రైతాంగపు సానుభూతిని మాత్రం సంపాదించలేకపోయింది. 

రెండు లక్షల మీద ఐదువేలో పదివేలో వడ్డీ మిగిలిపోయిన వారికెవరికీ రుణమాఫీ జరగలేదు. సాంకేతిక కారణాల వల్ల 30 శాతంమందికి మాఫీ జరగలేదు. దానికితోడు రైతుబంధు నిలిచి పోవడం, గతంతో పోలిస్తే గిట్టుబాటు ధరలు దక్కకపోవడం, వేసంగి పంటకు నీళ్లివ్వలేకపోవడం, ఎప్పుడో మరిచిపోయిన కరెంటు కోతలు, మోటార్లు కాలిపోవడాలు మళ్లీ ప్రత్యక్షం కావ డంతో రైతాంగంలో వ్యతిరేకత పెరుగుతున్నది.

ఆర్థిక మందగమనం అనే పరిణామం దేశవ్యాప్తంగా ఉన్నదే కావచ్చు. కానీ తెలంగాణలో స్వయంగా ప్రభుత్వమే పూనుకొని హైడ్రా అనే అసందర్భ శరభ నాట్యం చేయడం రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని కుదేలు చేసింది. ఇది రాష్ట్రమంతటా డబ్బు చలా మణిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. దానికితోడు కేసీఆర్‌ హయాంలో రైతుబంధు, దళిత బంధు వగైరా స్కీముల ద్వారా ఏటా జనం చేతుల్లోకి చేరిన వేలకోట్ల రూపాయలు ఆగి పోయాయి.

అవసరాలకు భూమిని అమ్ముకోవాలన్నా, కొనే నా«థుడు దొరక్క రైతులు అవస్థలు పడ్డారు. ఆరోగ్యశ్రీ నిధులు సకాలానికి అందక, ఫీజు రియింబర్స్‌మెంట్‌ అమలు జరగక, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లు అందక వివిధ వర్గాల ప్రజలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజా దర్బార్‌ మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలి పోయింది. 

గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడానికి ఇటువంటి కారణాలేమీ లేవు. కేవలం నాయకత్వ అహంకారపూరిత ధోరణి ప్రజలకు దూరం చేసింది. నిరుద్యోగ యువత సమస్య లను విని వారిని సాంత్వన పరచడంలో చూపిన నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. దసరా సెలవుల్లో ఇళ్లకు చేరుకున్న ఈ యువత తల్లిదండ్రులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడంలో కృతకృత్యులయ్యారు. ప్రతిష్ఠాత్మకంగా భావించిన పథకాలు కొన్ని గురితప్పాయి. కొందరు ఎమ్మెల్యేల అహంకారం, అవినీతి కూడా జనంలో ఏహ్యభావం ఏర్పడ్డానికి కారణమై ఆ పార్టీకి నష్టం చేకూర్చాయి. అంతే తప్ప విస్తార జనబాహుళ్యం బీఆర్‌ఎస్‌ హయాంలో ఇక్కట్లపాలైన దాఖలాలు లేవు.

చేసిన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేకపోగా కొన్ని సంక్షోభాలను పిలిచి మరీ అక్కున చేర్చుకుంటున్న కాంగ్రెస్‌ సర్కార్‌ పనితీరు మారకుంటే చేదు అనుభవాలను చవిచూడక తప్పక పోవచ్చు. ఈ వేసవి కష్టాలను, మంచినీటి కటకటను ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కోబోతున్నదో చూడవలసి ఉన్నది. మరో పక్కన గత కేసీఆర్‌ పాలనే ఈ పాలనకంటే బాగున్నదని బలపడుతున్న ప్రజాభిప్రాయాన్ని ఎలా మార్చగలరో కూడా చూడాలి. ఈ వేసవి పరీక్షలో గనుక కాగ్రెస్‌ ఫెయిలయితే వచ్చే రజతోత్సవ సభలో కేసీఆర్‌ పాంచజన్యం పూరించడం ఖాయం!



వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement