
‘సివిల్ సర్వీసు అధికారికి ఎంత తెలుసనేది కాదు... ఆ అధికారి ఎంత జాగ్రత్తగా విధి నిర్వహణ చేస్తారన్నదే అసలైన పరీక్ష’ అన్నారు ప్రథమ భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ. అఖిల భారత సర్వీసుల రూపశిల్పి, దేశ తొలి ఉపప్రధాని సర్దార్ పటేల్ సైతం ఈ అధికారుల గురించి చెప్పిన మాటలు వారి బాధ్యతను గుర్తుచేస్తాయి. సివిల్ సర్వీసులకు ఎంపికైనవారు స్వతంత్రంగా, నిజా యితీగా, నిర్భీతితో వ్యవహరించగలిగితేనే పటిష్టమైన దేశ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అభిలషించారు. కానీ ఇప్పటికీ ఆచరణలో సమస్యలు తప్పడం లేదు.
ఈమధ్య తమ ముందు కొచ్చిన ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఐఏఎస్‌ల తీరుపై కటువుగా వ్యాఖ్యానించింది. ఐఏఎస్‌లు తరచు తాము ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులకన్నా అధికులమని భావిస్తారనీ, అది సరికాదనీ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిలతో కూడిన ధర్మా సనం తెలిపింది. సివిల్ సర్వీసుల రూపకర్తలు ఇలాంటి అంతరాలను చూడలేదు. విధి నిర్వహణకు సంబంధించినంత వరకూ ఈ సర్వీసుల్లోని వారు దేశాభివృద్ధినీ, భద్రతనూ కాంక్షించి అందుకు అనువైన నిర్ణయాలు తీసుకుంటూ తమ విధులు నిర్వర్తించాలని కోరుకుంది. స్వభావరీత్యా విధి నిర్వహణ భిన్నంగా ఉండొచ్చు. ఇందులో ఎక్కువ, తక్కువ అనే సమస్యే రాకూడదు.
సాధారణంగా సివిల్ సర్వీస్ వైపు వచ్చే యువతీయువకులకు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపైనా, వాటివల్ల కలుగుతున్న అనర్థాలపైనా ఆగ్రహం ఉంటుంది. వాటి పరిష్కారం తమవల్ల సాధ్యమేనన్న విశ్వాసం ఉంటుంది. సంపాదనే ప్రధానమనుకుంటే ఏ బహుళజాతిసంస్థకో మేనేజర్‌గా లేదా సీఈవోగా వెళ్లవచ్చు. సివిల్ సర్వీసుల్లోకన్నా అత్యధిక జీతం, ఇతర సదు పాయాలూ, ఆస్తుల సంపాదన ఉంటాయి. పైగా అక్కడ అధిక శ్రమ, పని ఒత్తిడి ఉండవు. కానీ సివిల్ సర్వీస్‌లు అలా కాదు.
ప్రభుత్వంలో ఎక్కడో కిందిస్థాయి అధికారి తీసుకునే పొరపాటు నిర్ణయం ఆ ప్రాంతంలోనో, ఆ జిల్లాలోనో, కొన్ని సందర్భాల్లో రాష్ట్రంలోనో కల్లోలానికి దారి తీయొచ్చు. ప్రభుత్వ పథకాల అమలులో చోటుచేసుకునే చిన్న లోపం కూడా సాధారణ పౌరులను కలవరపరిచి వారు ప్రాణం తీసుకునే ప్రమాదం కూడా ఉండొచ్చు. లేదా అధికారిపై దౌర్జన్యానికి దిగొచ్చు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవటం, అనుకోని సమస్య ఎదురైతే సమయస్ఫూర్తితో వ్యవహరించటం తప్పనిసరి. అలాగని ఈ అంతరాలు లేవని కాదు.
ప్రాధాన్యత క్రమంలో ఐఏఎస్‌లు మొదటి స్థానంలో ఉంటారు. ఆ తర్వాత ఐపీఎస్‌లు వస్తారు. ఇది పాలనా సౌలభ్యం కోసం చేసిన ఏర్పాటు. స్వల్ప వ్యత్యాసంతో ఇద్దరి ప్రారంభ వేతనాలూ... ఆరోగ్యం, ఆవాసం, సెలవులు, ఇతర సదుపాయాలూ ఒకేలావుంటాయి. మొదటి మూడు నాలుగు నెలలు ఉమ్మడిగా శిక్షణనిచ్చినా బాధ్యతలరీత్యా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లకు వేర్వేరుచోట్ల ప్రత్యేక శిక్షణనిస్తారు. ఒక జిల్లాకో, ఒక ప్రాంతానికో బాధ్యత వహించే ఐఏఎస్ అధికారి అక్కడి పాలనా వ్యవస్థను పటిష్టపరచటానికి నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుంది.
ఎవరిని ఏ స్థానంలో పనిచేయించాలో, అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా అక్కడి ప్రజల అభ్యున్నతికి ఏమేం చేయవచ్చునో అధ్యయనం చేయటం, దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవటం కూడా ఐఏఎస్ అధికారుల బాధ్యత. ఐఏఎస్‌లకు భిన్న శాఖల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఐపీఎస్‌లకుశాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. దానికి అనుగుణంగా వారికి ప్రత్యేక శిక్షణ అవసరమవుతుంది. అలాగే ఐఎఫ్‌ఎస్‌లు అడవుల పరిరక్షణలో, భద్రతలో, వాటి నిర్వహణలో అవగాహన పెంచుకుంటారు. పర్యావరణం, వాతావరణ మార్పులు, సహజ వనరుల సంరక్షణ వారి ప్రధానాంశాలు.
అందరి అంతిమ ధ్యేయమూ మెరుగైన పాలనా వ్యవస్థను ప్రజల అందుబాటులోకి తీసుకు రావటమే అయినప్పుడు ఎవరికీ ఆధిక్యతా భావన ఉండకూడదు. అటువంటి మనస్తత్వం పాలనపై దుష్ప్రభావం కలిగిస్తుంది. ప్రభుత్వ తీరుతెన్నులపై విమర్శలకు తావిస్తుంది. కానీ దురదృష్టమేమంటే, ధర్మాసనం చెప్పినట్టు చాలాచోట్ల ఇలాంటి పోకడలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కర్ణాటకలో ఐఏఎస్, ఐపీఎస్ బాధ్యతల్లోవున్న ఇద్దరు మహిళా అధికారులు సామాజిక మాధ్యమాల్లో ఎలా దూషించుకున్నారో ఎవరూ మరిచిపోరు. అప్పట్లో ప్రధాని కార్యాలయం ఆనాటి ముఖ్యమంత్రిని వివరణ కోరింది.
సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తరాఖండ్‌లో అడవుల సంరక్షణ, అభివృద్ధి అవసరాలు సమతౌల్యం చేయటానికి ఉద్దేశించిన నిధులు దుర్వినియోగం కావటానికి సంబంధించి దాఖలైన కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులిద్దరి మధ్య తలెత్తిన వివాదం ప్రస్తావనకొచ్చినప్పుడు న్యాయమూర్తులు ఐఏఎస్‌ల తీరును నిశితంగా విమర్శించారు. ఒకచోట పనిచేయాల్సి వచ్చినప్పుడు వివాదాలు తలెత్తటం అసాధారణమేమీ కాదు. కానీ వ్యక్తిగత స్థాయికి వివాదాల్ని దిగజార్చటంవల్ల వ్యవస్థ దెబ్బతింటుంది.
చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలుంటున్నాయి. వీటికి ఎక్కడో ఒకచోట బ్రేక్ పడాలి. తాత్కాలిక సర్దుబాట్లుకాక మరోసారి సమస్య తలెత్తకుండా ఏం చేయవచ్చునో ఆలోచించాలి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పరిచిన అధి కార యంత్రాంగం కాస్తా అంతర్గత కలహాల్లో మునిగితే వ్యవస్థ నష్టపోతుంది. అంకితభావంతో, కర్తవ్యనిష్టతో పనిచేసిన ఎస్.ఆర్. శంకరన్, బి.డి. శర్మవంటివారు ఇవాళ్టికీ చిరస్మరణీయులు. అధికారులకు వారు ఆదర్శం కావాలి. అప్పుడు అహంభావానికి తావుండదు.