ఐఏఎస్‌లది ఆధిపత్య ధోరణి | Supreme Court says IAS officers show supremacy over IPS, IFS | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌లది ఆధిపత్య ధోరణి

Published Thu, Mar 6 2025 6:07 AM | Last Updated on Thu, Mar 6 2025 6:07 AM

Supreme Court says IAS officers show supremacy over IPS, IFS

ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లపై పెత్తనం చలాయించాలని చూస్తారు

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌ ఆగ్రహం

సాక్షి, న్యూఢిల్లీ: ఐఏఎస్‌ అధికారులు ఎప్పుడూ ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు. అందుకే ఐఏఎస్‌ల మాట మేం ఎందుకు వినాలనే అసహనం, అసంతృప్తి ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల్లో గూడుకట్టుకుపోయిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఒక కేసును జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. అటవీ అధికారులు తమ ఆదేశాలను పాటించాలని ఐఏఎస్‌ అధికారులు కోరడంపై ధర్మాసనం విస్త్రృతంగా చర్చించింది. 

ఇండియన్‌ అడ్మిస్ట్రేటివ్‌ సర్వీసెస్, ఇండియన్‌ పోలీస్‌ సర్వీసెస్, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ అధికారుల మధ్య జరుగుతున్న ఈర‡్ష్య యుద్దాన్ని ప్రస్తావిస్తూ జస్టిస్‌ గవాయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్‌లకు ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లకు మధ్య బేదాభిప్రాయాలు లేవని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చేసిన వాదనను జడ్జి తప్పుబట్టారు. ‘‘నేను ప్రభుత్వ న్యాయవాదిగా మూడేళ్లు పనిచేశా. న్యాయమూర్తిగా 22 ఏళ్లుగా సేవలందిస్తున్నా. ఇన్నేళ్లలో నేను గమనించింది ఏంటంటే ఐఏఎస్‌లు ఎçప్పుడూ ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తుంటారు. ఈ వివాదం అన్ని రాష్ట్రాల్లో ఉంది. అందరూ ఒకే అఖిల భారత సర్వీస్‌లకు సంబంధించిన ఉన్నతాధికారులమే అయినప్పుడు ఐఎఎస్‌ల మాటే ఎందుకు వినాలి? అనే అసంతృప్తి ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లలో ఉంది. ఈ విధానం మారాలి. ఈ విషయంలో అందర్నీ సమానంగా చూడాలని భావన ఐఏఎస్‌లలో కల్పించండి’’ అని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు జస్టిస్‌ గవాయ్‌ సూచించారు. అధికారుల మధ్య ఉన్న అంతర్గత వివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని కేంద్రం తరఫున తుషార్‌ కోర్టుకు తెలిపారు. జడ్జీలు కేసు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదావేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement