వైద్య కారణాల రీత్యా ఎప్పటికీ కోలుకోలేని అచేతన స్థితికి చేరుకుని, మరణం తప్ప మరో దారిలేని రోగులకు ‘కారుణ్య మరణం’ ప్రసాదించే నిబంధనలు దేశంలోనే తొలిసారి కర్ణాటకలో అమల్లో కొచ్చాయి. వాస్తవానికి కేరళ, గోవా, మహారాష్ట్రలు ఇప్పటికే ఇందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే కర్ణాటక మరో అడుగు ముందుకేసి సవివరమైన న్యాయ నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ విషయంలో 2018లోనూ, 2023లోనూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. ప్రభుత్వాలు తగిన చట్టాలు చేసేవరకూ ఇవి అమల్లో వుంటాయని ప్రకటించింది.
ప్రపంచంలో ఇప్పటికే చాలా దేశాలు ఇందుకు సంబంధించిన చట్టాలు తీసుకొచ్చాయి. సమస్య చాలా జటిలమైనది. మంచానికి పరిమితమైపోయిన రోగులు లోలోపల ఎంత నరకం చవి చూస్తున్నారో బయటి ప్రపంచానికి తెలియదు. నిత్యం సేవలందించే వైద్య సిబ్బందికి, నిరంతరం కనిపెట్టుకుని వుండే కుటుంబ సభ్యులకు సైతం ఆ రోగుల అంతరంగం, వారు పడుతున్న యాతనలు అర్థంకావు. వ్యాధి నయమయ్యే అవకాశం ఎంతమాత్రం లేదని, వైద్య ఉపకరణాల సాయంతో కోమాలో మంచంపై వెళ్లదీయటం తప్ప మరో మార్గం లేదని తెలిశాక వారిని ఆ స్థితి లోనే ఉంచటం సరికాదన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి.
అందుకు విరుద్ధంగా ప్రాణం పోసే శక్తిలేని మనిషికి ప్రాణం తీసే హక్కు ఎక్కడిదన్న వాదనలూ ఉన్నాయి. ఒక మానవ మృగం సాగించిన లైంగిక హింస పర్యవసానంగా కోమాలోకి వెళ్లి ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ఆసుపత్రి బెడ్‌పై దాదాపు 42 ఏళ్లపాటు జీవచ్ఛవంలా బతికి 2015లో కన్నుమూసిన అరుణా రామచంద్ర శాన్‌బాగ్ కేసు ఉదంతంలో తొలిసారి ఈ కారుణ్య మరణం అంశం చర్చ కొచ్చింది.
ఆమె దశాబ్దాల తరబడి జీవచ్ఛవంలా రోజులు వెళ్లదీయటం చూడలేకపోతున్నానని,ఇంకా ఎన్నాళ్లపాటు ఆమె ఇలా కొనసాగాల్సి వస్తుందో వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారని జర్న లిస్టు పింకీ విరానీ సుప్రీంకోర్టు ముందు 2009లో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ప్రశాంత మరణా నికి అవసరమైన ఆదేశాలివ్వాలని విరానీ విన్నవించుకున్నారు. కానీ ఆమె శాన్‌బాగ్ కుటుంబ సభ్యు రాలు కాకపోవటంతో సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
ఇలాంటి స్థితికి చేరుకున్న రోగుల కారుణ్య మరణానికి చట్టబద్ధతను కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించింది. అయితే ఆ తీర్పు అరుణకు ‘పునర్జన్మ’నిచ్చిందంటూ ఆమెకు సేవలు చేస్తున్న నర్సులంతా మిఠాయిలు పంచుకుని పండుగ చేసుకున్నారు. రిటైరవుతున్నవారి స్థానంలో వచ్చే కొత్త నర్సులు సైతం ఆమెను కంటికి రెప్పలా చూసుకునేవారు. కారుణ్య మరణంపైనే కామన్ కాజ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 2018లో తొలిసారి మార్గదర్శకాలు రూపొందించింది. ఆ మార్గదర్శకాలను మరింత సరళం చేస్తూ 2023లో మరో తీర్పునిచ్చింది. హుందాగా జీవించటం మాత్రమే కాదు... హుందాగా మరణించటం కూడా రాజ్యాంగంలోని 21వ అధికరణం పరిధిలోకి వస్తుందని చెప్పింది.
అయితే కారుణ్య మరణం కేసుల్లో ఇమిడివుండే జటిల సమస్యలేమిటో, వాటిని స్వప్రయోజన పరులు ఎలా ఉపయోగించుకునే ప్రమాదమున్నదో న్యాయమూర్తులు గుర్తించే వుంటారు. అందుకే ఆ మార్గదర్శకాలు అత్యంత జాగ్రత్తగా రూపొందించారు. తిరిగి కోలుకునే అవకాశం లేదని, కేవలం వైద్య సాయంతో జీవచ్ఛవాల్లా బతుకీడ్చక తప్పదని గుర్తించిన రోగులకు ఇది వర్తిస్తుందని ధర్మా సనం తెలిపింది. అలాగే చికిత్స తీసుకునేముందే రోగి ఆ ప్రక్రియలో ఎదురుకాగల ప్రమాదాన్ని గుర్తించి, ఆ పరిస్థితి ఏర్పడిన పక్షంలో వైద్యాన్ని నిలిపేయటానికి అంగీకారం తెలిపే ముందస్తు ఆదేశం(ఏఎండీ)పై సంతకం చేసి ఇవ్వొచ్చు.
దాన్ని ‘లివింగ్ విల్’గా పరిగణించాల్సి వుంటుంది. ఒకవేళ అది రోగి ఇవ్వలేని పక్షంలో వైద్యానికి ముందు ఆయన తరఫున కుటుంబంలోని పెద్ద ఎవరైనా ఏఎండీని అందజేయొచ్చు. దాని ఆధారంగా రోగికి అమర్చే ఆక్సిజన్ మాస్క్, వెంటిలేటర్, ఇతరేతర ఉపకరణాల వంటి ప్రాణావసర వ్యవస్థల్ని తొలగిస్తారు. అయితే ఈ ప్రక్రియ సవ్యంగా సాగడానికీ, ఎలాంటి లొసుగులకూ ఆస్కారం లేకుండా ఉండటానికీ ప్రతి ఆసుపత్రిలోనూ ముగ్గు రేసి సీనియర్ డాక్టర్లతో రెండు బోర్డులు ఏర్పాటుచేయాలి.
ప్రాథమిక స్థాయి బోర్డు తన అభిప్రాయం చెప్పాక, సెకండరీ బోర్డు మరోసారి పరిశీలించాలి. జిల్లా వైద్యాధికారి ఈ నిర్ణయ ప్రక్రియలో పాలుపంచుకోవాలి. దీన్ని ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పరిశీలించాలి. ఆమోదించిన పక్షంలో ఆ సంగతిని హైకోర్టు రిజిస్ట్రార్‌కి తెలపాలి. ఇలాంటి అంశాల్లో కుటుంబ సభ్యుల మధ్యే ఏకాభిప్రాయం కుదరక పోవచ్చు. అందుకే విడివిడిగా అందరితో మాట్లాడటం, వారిఅంగీకారం విషయంలో ఇమిడి వున్న సమస్యలేమిటో చెప్పటం ఎంతో అవసరం.
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ప్రక్రియ దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. డబ్బు కోసం, ఆస్తుల కోసం ఆరాటపడుతూ ఎంతకైనా తెగించే లోకంలో స్వపరభేదాలుండవు. ఇది గాక వైద్యానికి తడిసి మోపెడవుతుందన్న భయంవల్ల లేదా త్వరగా ‘వదుల్చుకోవాలన్న’ తొందర వల్ల వైద్యులను పక్కదోవ పట్టించే ప్రబుద్ధులుంటారు.
కనుక ఈ సమస్య చుట్టూ అల్లుకుని వుండే చట్టపరమైన అంశాలు సరే... నైతిక, సామాజిక, ఆర్థిక అంశాలను సైతం తరచి చూడక తప్పదు. సమాజ పోకడలు ఎలా వుంటున్నాయో గమనించుకోక తప్పదు. ‘హుందాగా మరణించటం’ హక్కే కావొచ్చు... కానీ అది ‘మరణించటానికి గల హక్కు’గా పరిణమించకూడదు. ఈ ‘హక్కు’ నిస్సహాయ రోగుల పాలిట శాపంగా మారకూడదు.
Comments
Please login to add a commentAdd a comment