
నిబద్ధత, సచ్ఛీలత, నిబంధనలపట్ల సంపూర్ణ అవగాహన కలిగినవారి సారథ్యంలో చట్టసభలుంటే అలాంటిచోట ఆరోగ్యవంతమైన చర్చలు జరుగుతాయి. ప్రజాస్వామ్యానికి ఆ సభ తలమానికమవు తుంది. కానీ అధికార పక్షానికి వంతపాడేవారు, వారి ఇష్టారాజ్యానికి పక్కతాళం వేసేవారు అధ్యక్ష స్థానాల్లో కూర్చుంటున్నారు. తాము ఎవరికీ జవాబుదారీ కాదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అలాంటి బాపతు నేతలకు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు.
తనను బిహార్ శాసనమండలి నుంచి బహిష్కరించటాన్ని సవాలుచేస్తూ ఆర్జేడీ సభ్యుడు సునీల్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అంగీకరిస్తూ ఆయన్ను తక్షణం సభలోకి అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సభ్యుల అనుచిత ప్రవర్తనకు తగిన శిక్ష ఉండాలితప్ప మితిమీరకూడదని తేల్చిచెప్పింది. నిరుడు మార్చిలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనూ, ఆ తర్వాత ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంలోనూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సునీల్ కుమార్ సింగ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్నది అభియోగం.
పాము కుబుసం విడిచినట్టు తరచు రాజకీయ అభిప్రాయాలు మార్చుకోవటం నితీశ్‌కు అలవాటని, ఇప్పటికి తొమ్మిదిసార్లు ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యేగా ప్రజలనుంచి ఎన్నిక కాలేదని సునీల్‌కుమార్ సింగ్ విమర్శించారు. అధికారమే పరమావధిగా ఒకసారి యూపీఏ, మరోసారి ఎన్డీయే కూటములతో చెలిమి చేయటాన్ని ఎద్దేవా చేస్తూ ఆయన్ను ‘పాల్తూరామ్’ అని హేళన చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి నివేదించారు. సునీల్ తప్పు చేశారని ఎథిక్స్ కమిటీ నిర్ధారించి సభా బహిష్కారానికి సిఫార్సుచేసింది. శాసనమండలి దీన్ని ఆమోదించి ఆయన్ను బహిష్కరిస్తూ తీర్మానించింది.
మన రాజ్యాంగం కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య అధికారాల విభజన చేసింది. చట్టసభలకు ప్రత్యేక హక్కులుంటాయని, వాటి కార్యకలాపాల్లో లేదా నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదని సభాధ్యక్షులు భావిస్తుంటారు. ముఖ్యంగా ఫిరాయింపులపై వచ్చే ఫిర్యాదుల్ని ఎటూ తేల్చకుండా వదిలేస్తూ తమను ప్రశ్నించరాదంటున్నారు. చిన్న చిన్న కారణాలకు కూడా విపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయటం, బహిష్కరణ వేటు వేయటం వంటివి రివాజయ్యాయి.
కేవలం పాలకపక్ష ప్రయోజనాలను నెరవేర్చటం కోసమే స్పీకర్లు ఇలా ఇష్టాను సారం ప్రవర్తిస్తున్నారు. నిజమే... రాజ్యాంగంలోని 212(1) అధికరణ ప్రకారం చట్టసభల కార్యకలా పాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణతో ఆ కార్యకలాపాల చెల్లుబాటును న్యాయ స్థానాల్లో సవాలు చేయటానికి వీల్లేదు. నిర్వహణ సంబంధమైన అంశాల్లో న్యాయస్థానాల జోక్యంనుంచి చట్టసభలకు ఇది రక్షణనిస్తుంది. అయితే ఆ కార్యకలాపాల్లో భాగంగా తీసుకునే నిర్ణయాల్లో రాజ్యాంగ విరుద్ధత కనబడినప్పుడు వాటిని సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందన్నది నిపుణుల వాదన.
తాజా కేసులో జరిగింది ఇదే. సునీల్ కుమార్ సింగ్ పిటిషన్‌కు అసలు విచార ణార్హత లేదని, 212(1) అధికరణ న్యాయవ్యవస్థ జోక్యాన్నుంచి తమకు రక్షణనిస్తున్నదని శాసన మండలి తరఫు న్యాయవాది వాదించారు. సర్వోన్నత న్యాయస్థానం దీన్ని అంగీకరించలేదు. చట్ట సభల కార్యకలాపాలు వేరు, అందులో తీసుకునే నిర్ణయాలు వేరు అని స్పష్టం చేసింది. చట్టసభల నిర్ణయాలు వ్యక్తుల ప్రాథమిక హక్కుల్ని ప్రభావితం చేసినప్పుడు వాటిని సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందని తెలిపింది.
అంతేకాదు... సునీల్‌కుమార్ సింగ్‌ను బహిష్కరిస్తూ తీసు కున్న ఎథిక్స్ కమిటీ నిర్ణయం పాలనాపరమైన చర్యే తప్ప శాసనవ్యవస్థ కార్యకలాపంగా పరిగణించలేమని తేల్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన చట్టసభ నియంత పోకడలు పోకూడదు. మెజారిటీ ఉందన్న సాకుతో విపక్ష సభ్యుల గొంతు నొక్కడానికీ, వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించటానికీ ప్రయత్నించకూడదు. ఆ పరిస్థితులు తలెత్తితే న్యాయస్థానాలుమౌనంగా ఊరుకోబోవని తాజా తీర్పు తేటతెల్లం చేసింది.
చట్టసభ కార్యకలాపాలు సాఫీగా సాగటానికి అనువైన నిబంధనలు రూపొందించుకొనేందుకు రాజ్యాంగంలోని 208వ అధికరణ అధికారమిస్తోంది. సభ క్రమశిక్షణగా నడవటానికి ఎలాంటి నిబంధనలుండాలో, వాటిని ఉల్లంఘించినప్పుడు ఏయే చర్యలు తీసుకోవాలో ఈ నిబంధనలు నిర్దే శిస్తాయి. అయితే నిబంధనల అమలు పర్యవేక్షణకు ఏర్పడిన కమిటీలు తీసుకునే నిర్ణయాలు పాలనాసంబంధ పరిధిలోకి వస్తాయని గుర్తించటం తప్పనిసరని తాజా తీర్పు చెబుతోంది.
ఆ నిర్ణయాలకు మెజారిటీ ఆమోదం ఉందా లేదా అనే అంశంతో దీనికి సంబంధం లేదు. ఒక చర్యకు ప్రతిగా తీసుకునే ఏ నిర్ణయమైనా హేతుబద్ధతకూ, తార్కికతకూ లోబడివుండటం అవసరం. పిచ్చు కపై బ్రహ్మాస్త్రం తరహాలో అధికారం ఉంది కదా అని ఏమైనా చేస్తామంటే ప్రజాస్వామ్యంలో చెల్లదు.
చట్టసభలు ఇష్టానుసారం వ్యవహరించే రోజులు పోయాయి. సభానిర్వహణ సవ్యంగా జర గటం, క్రమశిక్షణ కట్టుతప్పకుండా చూడటం అవసరమే. కానీ అందుకోసం అమలుచేసే చర్యలు అతిగా ఉండకూడదు. సభ్యులు పరిధి మీరారని భావించినప్పుడు అభిశంసించడం, మందలించడం, నిర్దిష్ట కాలానికి సభనుంచి సస్పెండ్ చేయడంవంటి అవకాశాలున్నాయి.
కానీ విచక్షణ మరిచి నేరుగా బహిష్కరణ వేటు వేయటం అతిగా వ్యవహరించటమే అవుతుంది. ఎథిక్స్ కమిటీల నిర్ణ యాలు పాలనానిర్వహణ కిందికే వస్తాయని, వాటిపై న్యాయసమీక్ష తప్పదని సుప్రీంకోర్టు నిర్ణయించటం హర్షించదగ్గది. నియంతృత్వ పోకడలు పోయే పాలకపక్షాలకు ఈ తీర్పు చెంపపెట్టు.
Comments
Please login to add a commentAdd a comment