పాట్నా: బీహార్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన పూర్తయినట్లు తెలిపారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ప్రస్తుతం ఈ డేటా సంకలనం జరుగుతోందని అతి త్వరలోనే ఈ సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతూ కులగణన సమాజంలో అన్ని వర్గాలకు ప్రయోజనకరమని అన్నారు.
శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన కులగణన అన్ని కులాల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని దీని వలన ఎంతోకాలంగా నష్టపోయిన వారితో పాటు సమాజంలో ఆయా వర్గాల వారికి కూడా మేలు చేస్తుందని అన్నారు. పూర్తి డేటా వచ్చిన తర్వాత ఏయే అంశాల్లో మెరుగవ్వాల్సి ఉందో స్పష్టంగా తెలుస్తుందని మిగిలిన రాష్ట్రాల్లో కూడా కులగణన జరిపితే బాగుంటుందని అన్నారు.
కొంతమంది ఈ కులగణనను వ్యతిరేకిస్తున్నారు కానీ అఖిలపక్షాల అభిప్రాలు సేకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వ్యతిరేకించే వారి అభిప్రాయం గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఈ సర్వే ద్వారా సాంఘిక, ఆర్ధిక అసమానతలకు గురైన వారికందరికీ సంక్షేమ పథకాలు అందించి మెరుగైన సేవ చేయడానికి వీలుంటుందని తెలిపారు. మొదటి నుంచి కులాల ప్రాతిపదికన సంక్షేమం అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని అందులో భాగంగానే కులగణన చేశామని అన్నారు.
కులగణన కోసం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు అనుమతి కోరడంపై స్పందిస్తూ.. సుప్రీం కోర్టు ప్రజలకు ప్రయోజనకరమైన అంశాలను నిలిపివేయమని ఎప్పుడూ చెప్పదు. ఇక పాట్నా హైకోర్టు అయితే ఇదే అంశంపై నమోదైన అనేక పిల్‌లను కొట్టి పారేసిందని గుర్తు చేశారు. మరి 2021లోనే పూర్తి కావాల్సిన కులగణన జాప్యం విషయమై కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా కేంద్రం ఈ కులగణన కార్యక్రమంలో జోక్యానికి అనుమతి కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఇందులో ఉన్న చట్టపరమైన సమస్యలు తెలుపుతూ తదుపరి వాయిదా తేదీ ఆగస్టు 28లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది. కానీ ఈలోపే ఈ సర్వే పూర్తి కావడం విశేషం.
ఇది కూడా చదవండి: మా పార్టీ చీలిపోలేదు: శరద్ పవార్
Comments
Please login to add a commentAdd a comment